రామాయణాన్ని మరో కోణంలో దర్శింపజేసే ‘రామకథాసుధ’ సంకలనం

0
1

[సంచిక ద్వారా త్వరలో ప్రచురితమవబోతున్న ‘రామకథాసుధ’ కథా సంకలనానికి సంపాదకులు అందించిన ముందుమాట ఇది]

బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితో గుణాః।
వనినే వక్ష్యామ్యహం బుద్ధ్వా తై మక్త్యుః శ్రవా యతాం నరః॥
(వాల్మీకి రామాయణం, బాలకాండ, ఒకటవ అధ్యాయం, 7వ శ్లోకం)

నానాపురాణ నిగమాగమ సంపతం యద్రామాయషే నీ గదితం క్యాబిదనప్పుతోపి।
స్వాన్తః సుఖాయ తులసీ రఘునాథ గాథభాషా నిబంధమతిమంజుల మాతనోతి॥
(తులసీ రామాయణం, బాలకాండ 7)

ఆడినయట్టు లాడకయ యా రఘురాముని సద్గుణావళుల్
మూడయినట్టి కాముల బుట్టినయట్టి మహాకవీశ్వరుల్
పాడినవైన జాలవు ప్రనిమధువాకృతి తర్హితాళికిన్
గోడి సుదర్శనంబు రిపుకుంజర కుంభవి నిట్య క్రియన్
(రామాయణ కల్పవృక్షము, సుందరకాండము, 148)

[dropcap]మి[/dropcap]త్రుడు ఎన్.కె.బాబు సంపాదత్వం వహించి, ప్రచురించిన ‘నాకు నచ్చిన నా కథ’, నాలుగవ భాగంలో, ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన కథ ‘సీతారాముడొచ్చాడోయ్’, ‘రామకథాసుధ’ సంకలనం రూపొందించేదుకు ప్రేరణ (ఈ కథ అనివార్య కారణాల వల్ల ఈ సంకలనంలో లేదు.).

సమకాలీన తెలుగు సాహిత్యంలో ‘రామదూషణ’, రామాయణ కువిమర్శ’ – పేరు సంపాదించటానికి, అవార్డులు పొందటానికి రహదారులుగా మారేయి. తమ దృష్టి దోషాలను, బలహీనతలను, జగద్రక్షక సిద్ధాంతాలుగా నమ్మించి, ప్రామాణికత సాధించేందుకు పనిగట్టుకుని కొందరు అడ్డదారిని రహదారిగా మలచుకోవటంతో, ఉత్తమ సాహిత్యంగా పరిగణనకు గురి కావాలన్నా, ఉత్తమ రచయితగా మన్ననలందుకోవాలన్నా, ప్రధాన సాహిత్యస్రవంతిలో భాగం కావాలన్నా ఇలాంటి విచ్ఛిన్నకర, విద్వేషపూరిత, నీచతా  పరిపూర్ణమయిన  అనౌచిత్య రచనలు చేయటం తప్పనిసరి అయింది. అందుకే యండమూరి వీరేంద్రనాథ్ కథ చదివితే ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. తెలుగు సాహిత్యంలో రాముడిని, రామాయణాన్ని అర్థం చేసుకొని, ఔన్నత్యాన్ని అవగాహన చేసుకుని చేసిన  ఔచితీపూర్ణమైన రచనలు వచ్చాయన్న ఆలోచన సంభ్రమాశ్చర్యాలను కలిగించింది. దాంతో ఇలా రాముడిని, రామాయణాన్ని సక్రమమైన రీతిలో ప్రదర్శించిన తెలుగుకథలను సంకలనం చేస్తే, తెలుగు పాఠకులకు రాముడిని, రామాయణాన్ని మరో కోణంలో కూడా దర్శించే వీలునిచ్చినట్లవుతుందన్న ఆలోచన వచ్చింది.

మానవ సమాజం ఎప్పుడూ ఏకవర్ణమయం కాదు. సప్తవర్ణ సమ్మిశ్రితం. ఒకే విషయంపై పలు భిన్నమైన ఆలోచనలుంటాయి. పరస్పర విరుద్ధమైన దృక్కులు వుంటాయి. ఈ పలు విభిన్నమైన ఆలోచనలు, దృక్కోణాలు పరిశీలించి వాటిల్లోంచి తమకు నచ్చిన ఆలోచనను ఎన్నుకునే వీలు సామాన్య ప్రజలకుండటమే ప్రజాస్వామం. అంతేకానీ, అందరికీ ఒకేరకమైన దృక్కోణం వుండాలని, అందరం ఒకేరకంగా అలోచించాలని, తమ ఆలోచనను సమర్థించని వారు శత్రువులని భావించి, ఇతర ఆలోచనలన్నిటినీ అణచివేయాలని ప్రయత్నించటం అమానవీయం. రాక్షసత్వం. అలాంటి రాక్షసత్వం ఉక్కుపాదం క్రింద నలుగుతూ ఒకే దృక్కోణం, ఒకే అలోచనలు ప్రదర్శిస్తేనే రచయితగా మనగలిగే తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని ఆలోచన విధానాన్ని ప్రదర్శించే కథల సంకలనం ‘రామకథాసుధ’.

‘రామకథాసుధ’ సంకలనం రూపొందించాలన్న ఆలోచన రాగానే ఈ విషయం ప్రకటిస్తూ రచయితల నుంచి కథలను ఆహ్వానించాం. అందిన కథలను అందినట్టుగా సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమయ్యాయి.

ఎప్పటిలాగే, కథల సంకలనం రూపొందించే ముందే ఎలాంటి కథలను సంకలనంలో ప్రచురణకు ఎంచుకోవాలో ప్రామాణికాలను ఏర్పాటు చేసుకున్నాము. కథలు ప్రధానంగా రాముడు, రామాయణంతో పాటు భారతీయ ధర్మం, సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవాభిమానాన్ని కలిగి వుండాలి. కథలలో కల్పనలు వాల్మీకి రామాయణానికి భిన్నంగా వున్నా మౌలికంగా వాల్మీకి ప్రదర్శించిన వ్యక్తిత్వాలకు సంస్కారాలకు భిన్నంగా వుండకూడదు. వాల్మీకి వర్ణించిన గుణగణాలకు విరుద్ధంగా వుండకూడదు. ఇది మౌలికంగా పాటించాల్సిన నియమం. ఒక రచయిత సృజించిన పాత్రను ఆధారం చేసుకుని కాల్పనిక రచన చేసేప్పుడు మూలరచయిత సృజనను దెబ్బతీసే రీతిలో, విరుద్ధమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటం అనౌచిత్యము, అన్యాయము మాత్రమే కాదు అత్యంత నీచం కూడా. అలాంటి రచనలకు ఈ సంకలనంలో స్థానం వుండదని నిశ్చయించుకున్నాము.

వాల్మీకి రామయణం ప్రామాణికంగా తీసుకున్నా, తరవాత పలుకాలాలలో సృజించిన రామాయణాలలోని గాథలనేకం సామాజిక జీవితంలో విడదీయరాని భాగాలయి పోయాయి. రాతిని నాతిగా చేయటం, లక్ష్మణరేఖ వంటి అనేక కల్పనలు నిత్యజీవితంలో మార్గదర్శనం చేయగల రీతిలో కలసిపోయాయి. కాబట్టి వాల్మీకి రామాయణంలో లేకున్నా ఔచితవంతమైన కల్పనల కథలను కూడా పరిగణనలోకి తీసుకున్నాము. అయితే, ఒకే అంశం ఆధారంగా పలు కథలు వున్న సందర్భంలో అన్నిటిలోకీ వాల్మీకి రామాయణ స్ఫూర్తికి దగ్గరగా వున్న కథలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిశ్చయించాము. ఈ రకంగా ప్రామాణికాలను ఏర్పాటు చేసుకున్న తరువాత కథలను పరిశీలించి మొత్తం 28 కథలను ప్రచురణకు ఎంపిక చేశాము.

ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాం. ఈ సంకలనంలో ఎంపిక అయిన కథలే రామాయణం ఆధారంగా వచ్చిన ఉత్తమ కథలుగా భావించటం పొరపాటు. ఎంపికయిన ఈ 28 కథలకన్నా ఉత్తమమయిన కథలను మేము ఏర్పాటు చేసుకున్న ప్రామాణికాలలో ఒదగనందు వల్ల పక్కన పెట్టాము. అంతే తప్ప, ఎంపిక కాని కథలు తక్కువ స్థాయివని ఎవరైనా భావిస్తే అది వారి అపోహ తప్ప మరేమీ కాదు.

సంకలనంలోకి కథలను ఎంపిక చేస్తున్న సందర్భంలో రామాయణంలోని కొన్ని సంఘటనలే అనేక కథలకు కేంద్రబిందువులయ్యాయన్నది గమనించాలి. రామాయణంలోని పలు సంఘటలను తెలుగు కథలు స్పృశించనే లేదు. అందుకే తెలుగు కథకులు విస్మరించిన కొన్ని అంశాలను స్పృశించిన ఇతర భాషల కథలను తెలుగు అనువాదాలను మూడో సంకలనంలో ప్రచురణకు ఎంపిక చేశాం. అలా ఎంపికయిన 28 కథలను రామాయణ పాత్రల ఆధారిత కథలుగా, రామాయణం భారతీయ సమాజంపై చూపుతున్న ప్రభావాన్ని సామాన్యపాత్రల ద్వారా ప్రదర్శించే కథలను సామాజిక రామాయణ కథలుగా, రెండు విభాగాలుగా వర్గీకరించాం.

ఈ రెండు విభాగాలలో కూడా కథలను ఒక పద్ధతి ప్రకారం పొందుపరచాము. రామాయణ కథ జరిగిన క్రమంలోనే కథలను అమర్చాము. రాముడికి యవ్వనంలో కలిగిన సందేహాన్ని ప్రదర్శించిన ‘శ్రీరాముని చింతన’తో ‘రామయణ ఆధారిత కథలు’ ఆరంభమవుతాయి. సంధ్యా యల్లాప్రగడ రచయిత్రి. ‘యోగవాశిష్ఠం’ ప్రసక్తి రామాయణంలో లేదు. కానీ యోగవాశిష్ఠం వాల్మీకి విరచితమేనని నమ్ముతున్నారు. రాముడిని పన్నేండేళ్ళ వయసులో ‘నేనెవరను’ అన్న సందేహం వస్తే దానికి వశిష్ఠుడు ఇచ్చిన సమాధానం ‘యోగవాశిష్ఠం’ అంటారు. దీని ఆధారంగా అల్లిన కథ ఇది. అంటే, ప్రధానంగా వాల్మీకి రామాయణంలో లేకున్నా, రాముడు తన జీవనయాత్రను ఆనందంగా సంతృప్తికరంగా గడిపేందుకు దోహదం చేసిన కారణాన్ని ప్రదర్శించిన కథ ఇది. ఆధ్యాత్మికపరమైన విషయాలలో ఔచిత్యాన్ని పాటిస్తూ రచించిన కథ ఇది.

‘శ్రీరాముని చింతన’ కథ అవుతూనే ముళ్ళపూడి వెంకటరమణ రచించిన ప్రసిద్ధి పొందిన ‘సీతాకళ్యాణం’ కథ వుంది. సీతారామకళ్యాణాన్ని వర్ణిస్తూ తెలుగు కథకులు విజృంభించి విస్తృతంగా రాశారు. కానీ ముళ్ళపూడి వెంకటరమణ కథ ఈ అంశం ఆధారంగా వచ్చిన కథలన్నిటిలోకీ, రచనా శైలి వల్ల, భావసున్నితత్వం వల్ల, భాషా లాలిత్యం వల్ల, పదప్రయోగాల వల్ల, అందంగా పొందుపరచిన ఆధ్యాత్మికపుటాలోచనల వల్ల, అక్షరాలతో సృజించిన దృశ్యకావ్యం అవటం వల్ల, ముఖ్యంగా, సీతాకళ్యాణ ఘటన భారతీయ సామాజిక జీవనంలో విడదీయరాని భాగమయిన విధానాన్ని అతి సున్నితంగా, అంతర్లీనంగా ప్రదర్శించిన కథ అవటం వల్ల అగ్రతాంబూలాన్ని అందుకుంటుంది.

చుండూరు జనార్థనగుప్త రచించిన ‘సీత పాదాభివందనం’ పూర్తిగా కల్పిత కథ. ఏ రామయణంలోనూ లేదు. కానీ ఈ కథ మూలకథలోని పాత్రల వ్యక్తిత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా సృజనాత్మకంగా కాల్పినిక కథ రచించిటానికి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. ఎవరి వ్యక్తిత్వాలకు భంగం కలగకుండా, వ్యక్తిత్వాలను ఉద్దీపితం చేస్తూ చేసిన చమత్కారభరిత కల్పన ఇది. భర్తకు పాదాభివందనం చేయ నిరాకరించేందుకు సీత చెప్పిన కారణం పెదవులపై చిరునవ్వును నిలుపుతుంది. సింగరాజు నాగలక్ష్మి కథ ‘ఊర్మిళ’, ఎమ్. లక్ష్మీదేవి కథ ‘మాండవి’ రెండూ కల్పనలే. అయినా రామయణంలో అంతగా ప్రస్తావనకు రాక ప్రధాన పాత్రల నీడలలో ఒదిగిన రెండు ప్రధానమైన మహిళపాత్రల వ్యక్తిత్వాలను అత్యుత్తమరీతిలో ఔచితీవంతంగా ప్రదర్శించిన కథలు. ‘ఎల్లోరా’ రచించిన ‘లక్ష్మణగడ్డ’ కథ కూడా కల్పిత కథనే. ఆలోచనలపై వ్యక్తిత్వంపై స్థల ప్రభావాన్ని చూపేందుకు భారతీయ సమాజం ఏ రకంగా రామాయణాన్ని ఆధారం చేసుకుని తమ సృజనాత్మకతను నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుందో చూపుతుందీ చిన్న కథ. ప్రసిద్ధి పొందిన ‘శబరి’ కథను సరళంగా చెప్పే కథ నారాయణశర్మ అనువదించిన ‘రేగుపళ్ళ రుచి’ కథ. రామాయణంలో పొందుపరచి వున్న భ్రాతృప్రేమను, మానవ సంబంధాలను అత్యుత్వమ నిదర్శనాలలో ఒకటయిన సంపతి, జటాయువుల సోదరప్రేమను ప్రదర్శిస్తుంది గోనుగుంట మురళీకృష్ణ రచించిన కథ ‘భ్రాతృప్రేమ’. సి. హెచ్. బృందావనరావు కథ ‘కౌగిలి’ సుందరకాండ కథను అతి సుందరంగా ప్రదర్శిస్తుంది. మద్దుల లక్ష్మీనారాయణ గుప్త కథ ‘విభీషణుని భక్తి’ పూర్తిగా కాల్పనిక కథ. ఈ కథ ఏ రకంగా ‘రామభక్తి’ భావన కథల రూపంలో భారతీయ సమాజంలో విస్తరించిందో అత్యంత సుందరంగా ప్రదర్శిస్తుంది. బలభద్రపాత్రుని రమణి రచించిన ‘లోహజంగుడు’ రామాయణంలో ఉన్న గాథకు కథారూపం. అంతగా ప్రాచుర్యానికి రాని విశిష్టమైన గాథ లోహజంగుడిది. భమిడిపాటి గౌరీశంకర్ రచించిన ‘సీత చెప్పిన సత్యం’, చక్కని కథ. రాక్షసులను చంపి సీతను వెంటబెట్టుకుని రాగల శక్తి వుండి కూడా కేవలం సీత వార్తను హనుమ మోసుకుని రావటం వెనుక వున్న సత్యాన్ని ప్రదర్శిస్తుందీ కథ. రామ రావణ యుద్ధం తరువాత జరిగిన సీత అగ్నిప్రవేశం గాథ ప్రదర్శించే సీతారాముల అనిర్వచనీయమైన ప్రేమను ప్రదర్శిస్తుంది కస్తూరి మురళీకృష్ణ కథ ‘ప్రేమాగ్ని పరీక్ష’. ఈ సంఘటన ఆధారంగా రాముడిపై, రామాయణంపై బురద చల్లే వారందరికీ సమాధానం ఈ కథ. శ్రీనివాస దీక్షితులు రచించిన ‘కరణించవా! శివా’ అందమైన కాల్పనిక కథ. శివకేశవుల నడుమ అభేద ప్రతిపత్తిని ప్రదర్శిస్తూ సమాజంలో నెలకొని వున్న అపోహలను తొలగించి వైషమ్యాలను నిర్మూలించాలనే సదుద్దేశం ప్రదర్శిస్తుందీ కథ. యుద్ధం తరువాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగివచ్చి రాజ్యం స్వీకరించటం ప్రదర్శిస్తుంది ‘కుంతి’ రచించిన ‘న్యాసము’ కథ. శింగంపల్లి అప్పారావు రచించిన ‘రామరాజ్యం’ కథ, రాముడి పాలన ఏ రకంగా రామరాజ్యం అయిందో కాల్పనిక కథ ద్వారా ప్రదర్శిస్తుంది. మానవుల స్వభావంలో నీరు పల్లమెరిగినట్టు చెడు వైపే ప్రసరిస్తుంటే రాజు ఆ ప్రవాహాన్ని సన్మార్గంలోకి ప్రవేశపెట్టటం ద్వారా రామరాజ్యం నెలకొల్పటం చూపుతుందీ కథ. పరశురాం కథ ‘హనుమంతుని స్వప్నం’ ఔచిత్యాన్ని పాటిస్తూ ప్రచారంలో వున్న గాథకు కథారూపం. వాల్మీకి రామాయణం రామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. అయితే చాకలివాడి మాటను పట్టుకుని రాముడు సీతాపరిత్యాగం చేయటం ప్రచారంలో వున్న కథ. ఆ కథకు భారతీయ ధార్మిక సిద్ధాంతం ఆధారంగా తార్కిక వివరణను ఇచ్చే కథ జె. శ్యామల రచించిన ‘ఘటన’. రామాయణం పాత్రల వ్యక్తిత్వాలను కించపరచకుండా తర్కబద్ధంగా కాల్పనిక రచనను సృజించటానికి ఈ కథ చక్కని ఉదాహరణ. డా॥ లత రచించిన ‘రామాయణంలో రజని’ కథ, గర్భవతి అయిన సీతపై అపవాదు అసూయ ఆధారంగా ఏ రకంగా ప్రచారానికి వచ్చిందో ఊహాత్మకమైన పాత్ర ద్వారా ఔచితీవంతంగా చెప్తుంది. ఏమో, నిజంగా ఇలాగే జరిగిందేమో అనిపిస్తుందీ కథ చదివితే.

ఇది రామాయణ ఆధారిత పాత్రల ఆధారంగా రచించిన కథల విభాగం. కథలు గమనిస్తే అనేక కథలు వాల్మీకి రామాయణంలోనివి కాకున్నా, జనజీవితంలో ప్రచారంలో వున్న గాథల ఆధారంగా సృజించిన కథలు. ప్రతి కథలో భక్తి కనిపిస్తుంది. అవగాహన కనిపిస్తుంది. ఆలోచన కనిపిస్తుంది. సమాజానికి మంచి మార్పుని చూపి, మంచి ఆలోచనలనిచ్చి సక్రమ దిశలో మార్గనిర్దేశనం చేయాలన్న తపన కనిపిస్తుంది. ముఖ్యంగా, ప్రజలలో నైతిక విలువలు పెంచి మానవ సంబంధాలకు అగ్రపీఠం వేసి, సమాజంలో ధార్మిక స్నేహ సౌభ్రాతృత్వ భావనలను ఉద్దీపితం చేసేందుకు రామాయణం, రామాయణం ఆధారంగా ప్రచారంలో వున్న గాథలను ప్రేరణగా స్వీకరించి సృజనాత్మక రచయితలు తమ సృజనశక్తిని వినియోగించారని ఈ కథలు నిరూపిస్తాయి.

‘సామాజిక రామయణం’ విభాగంలోని గాథలు ఏ రకంగా సామాజిక జనజీవితంలో రామాయణం భాగమై, నైతిక విలువలకు, ధార్మిక భావనలకు, ఉత్తమ ప్రవర్తనకు రామాయణం ఆధారమయిందో ప్రదర్శిస్తాయి.

ఆవుల వెంకటరమణ కథ ‘వందేదశరథాత్మజం’ ఏ రకంగా రామాయణ గాథలు తరతరాలుగా బాలబాలికలకు పెద్దల ద్వారా అందుతోందో ప్రదర్శించే కథ. పానుగంటి లక్ష్మీనరసింహం ‘ఒక కథ’, ‘మల్లాది రామకృష్ణశర్మ’ ‘ఔనను’, టెంపోరావు కథ ‘రామలీల’ ఏ రకంగా రామగాథ జనులకు నీతివంతమయిన ధార్మిక జీవితం గడపటంలో తోడ్పడ్డాయో, ఎంతగా నిత్యజీవితంలో రామాయణం భాగమైపోయిందో నిరూపించే కథలు. పి.వి.ప్రభాకరమూర్తి కథ ‘రామమాడ’ ‘శబరి’ కథకు ఆధునిక సామాజిక రూపం. పాణ్యం దత్తశర్మ రచించిన ‘యతోధర్మస్తతోజయః’ కథ రామాయణం ఆధారంగా ఆధునిక సామాజిక సమస్యకు పరిష్కారం ఒక కోణంలో చూపిస్తుంది. చినవీరభద్రుడు రచించిన ‘రాముడు కట్టిన వంతెన’ ఆధునిక సమాజం ఎలా రామాయణాన్ని అర్థం చేసుకుంటుందో, ఎలా రామాయణాన్ని అర్థం చేసుకోవాలో అతి చక్కగా ప్రదర్శిస్తుంది. తనని తాను కోల్పోయిన వాడే రాముని పొందుతాడని తీర్మానిస్తూ, కలసిన వారందరినీ కలుపుకుపోతూ హృదయాల నడుమ వంతెన నిర్మించినవాడు రాముడని అంటాడు రచయిత ఈ కథలో. అలా, హృదయాల నడుమ వంతెనలు నిర్మిస్తూ, అందరినీ కలుపుపోయే రాముడి ఆధారంగా సమాజంలో విద్వేషాగ్నులు చెలరేగటం ఆధునిక సమాజం రాముడిని అర్థం చేసుకోలేదని నిరూపిస్తుంది. అతి చక్కటి కథ ఇది. పలు విభిన్నమైన కోణాల్లో, స్థాయిల్లో విశ్లేషించాల్సిన కథ ఇది.

వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘రామకథా సుధ’, ఈ సంకలనం తయరీ లక్ష్యాన్ని అత్యంత ప్రతిభావంతంగా, ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తుంది. కథనం, కథలో ప్రతీకలను వాడుకున్న విధానం, ఆ ప్రవేశికలలో ఒదిగిన ఆధ్యాత్మికపుటంచులు, ధార్మిక భావాలు ఈ కథను తెలుగు కథాసాహిత్యంలో ఇటీవలి కాలంలో వచ్చిన అతి అరుదైన కథగా నిలుపుతాయి. ఈ సంకలనం తయారీ సృజనాత్మక రచయితలుగా, భారతీయులుగా మా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న సంతృప్తి నిచ్చిన సంకలనం.

సంకలనం తయారీలో తమ తోడ్పాటునందించిన వారందరికీ బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా, ఈ సంకలనంలో కథల ప్రచురణకు సహృదయంతో అనుమతినిచ్చిన కథకులకు, వారి వారసులకు శతకోటి వందనాలు. డీటీపీ చేసిన దీప్తిలీనాకు, ముఖచిత్రంతో సహా కవర్‌ను రూపొందించిన  ఫాంట్ చక్రవర్తి పురుశోత్ కుమార్‌కు, అందంగా పుస్తకాన్ని రూపొందించిన ఆనంద్‌కు ధన్యవాదాలు.  అన్నీ తానే అయి సహాయ సహకారాలందించిన  సాహితీ  (ఎమెస్కో) లక్ష్మిగారికి,  బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ సంకలనం ఆలోచన వచ్చినప్పటి నుంచీ, పుస్తక రూపకల్పనలో సంపూర్ణ స్వేచ్ఛనిచ్చిన సంచిక సంపాదకవర్గానికీ, ముఖ్యంగా, లంకా నాగరాజు, కనక బైరాజు, భాను గౌడలకు బహు కృతజ్ఞతలు.

ఇతర నాగరికతలనుంచి భారతీయ నాగరికతను వేరుచేసి నిలిపే అంశం సాహిత్యం. భారతీయ ధర్మానికి ఆధారం సాహిత్యం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ఇలా భారతీయ నాగరికత సర్వం సాహిత్యం వేదికగా ఎదిగింది. ఎప్పుడెప్పుడు ధర్మం గతి మార్చాల్సి వచ్చినా ఆ పని సాహిత్యం చేసింది. సమకాలీన సమాజంలోని సందేహాలు, భయాలనన్నింటికీ సమాధానాలు అన్వేషిస్తూ ఏ తరానికి ఆ తరం పురాణగాథలను పునః సృజించుకుంటూ, ముందుకు సాగే ఏకైక వ్యవస్థ భారతీయ సామాజిక వ్యవస్థ. ఈ వ్యవస్థను శిరస్సు నుంచి పాదాలవరకూ ఏకత్రితం చేస్తూ నిలిపింది రామాయణం, కలిపింది శ్రీరామచంద్రుడు. అలాంటి రామాయణంపై, రాముడిపై వేయి అభాండాలు వేసి, అనౌచిత్య దూషణలు చేస్తూ, సమాజాన్ని పట్టి వుంచిన సున్నితమైన దారాన్ని తెగగోయాలన్న ప్రయత్నానికి సాహిత్యం ఆధారం కావటం శోచనీయం. అలాంటి ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు కూడా సాహిత్యమే శరణ్యం. ఈ ప్రయత్నాలకు విశ్వనాథ వారి ‘పురాణ వైరగ్రంథమాల’ నిదర్శనం. సంచిక వెబ్ పత్రిక ద్వారా సమకాలీన సమాజంలో సాహిత్యపరంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ ప్రయత్నాలలో భాగమే కోవెల సంతోష్‍కుమార్ రచించిన ‘రామం భజే శ్యామలం’. ఆ ప్రయత్నంలో మరో పార్శ్వం మేము రూపొందించిన ‘రామకథాసుధ’ కథల సంకలనం.

ఈ సంకలనంలోని కథల ద్వారా విపరీతంగా సాగుతున్న దుష్ప్రచారాల లోని దౌష్ట్యాన్ని ఏ ఒక్కటిని అర్థం చేసుకొని రామాయణం, శ్రీ రామభద్రుల ఔన్నత్యాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన కలిగినా మా ఈ ప్రయత్నం సఫలమైనట్టే. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే ఒక విశ్వం. ఒక శక్తి. ఒక్కరిలో మార్పు వచ్చినా ఆ మార్పు సమాజంలో మార్పుకు కారణం కావచ్చు. ఆ ఆశతో ‘రామకథాసుధ’ సంకలనాన్ని సమర్పిస్తున్నాం. ఈ సంకలనాన్ని చదివి, ఆదరించి, ఇంకొంతమందితో చదివించే బాధ్యత సమాజానిదే. ఈ సంకలనంలో ఏవైనా లోపాలున్నా, పొరపాట్లు, అచ్చుతప్పులు వున్నా దానికి బాధ్యత మాదే. వాటిని తెలియబరిస్తే ద్వితీయ ముద్రణలో సరిదిద్దుకుంటాం. నంద్యాల సుధామణి రచించిన ‘వారధి రాముడు’ కథలోలా, సమస్త సమాజం అన్ని భేదభావాలు, హెచ్చునీచాలు విస్మరించి ఒకటై చేయి కలిపి వ్యక్తుల హృదయాల నడుమ వంతెనలు నిర్మించే రోజు త్వరలో వస్తుందన్న ఆశతో ‘రామకథాసుధ’ కథల సంకలనం మీ ముందుంచుతున్నాం.

 

కస్తూరి మురళీకృష్ణ

కోడీహళ్లి మురళీమోహన్

కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here