[సంచిక ప్రచురించిన ‘రామకథాసుధ’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి జె. శ్యామల.]
[dropcap]‘రా[/dropcap]మకథాసుధ’ కథల సంకలనం ఆలోచనే సరికొత్తది. సాధారణ అంశాల మీద వచ్చిన కథా సంకలనాలు అనేకం ఉన్నాయి. కానీ ఒక ఇతిహాసం ఆధారంగా కథల సంకలన రూపకల్పన ఇదే ప్రథమేమో! ఇదే దీని తొలి ప్రత్యేకతగా భావించవచ్చు. ఇక పుస్తకంలోకి చూపు ప్రసరిస్తే..
‘రామకథాసుధ’ కథల సంకలనంలో మొత్తం 28 కథలున్నాయి. వీటిని రెండు విభాగాలుగా అందించారు. మొదటి విభాగం ‘రామాయణ ఆధారిత కథలు’ కాగా, రెండవ విభాగం ‘సామాజిక రామాయణం’. మొదటి విభాగంలో తొలి కథ యల్లాప్రగడ సంధ్య రచించిన ‘శ్రీరామ చింతన’. పాఠకుని మనసు ఆధ్యాత్మికావరణంలోకి తీసుకెళ్లే కథ. వశిష్ఠుడి ద్వారా తత్త్వ, వివేక జ్ఞానం పొందాడు రాముడు. పైకి మనిషిగా సుఖ దుఖాలు అనుభవించినా, స్వస్వరూపజ్ఞానంతో అంతరంగంలో అన్నింటికీ అతీతంగా నిశ్చలంగా నిలిచాడు.
ముళ్ళపూడి వెంకటరమణ విరచిత ‘సీతా కళ్యాణం’ విలక్షణం, కడు రమణీయం. చుండూరు జనార్దన గుప్త రాసిన ‘సీత పాదాభివందనం’ లో చిలిపి ఊహా కల్పన మనోజ్ఞంగా ఉండి, పాఠకుడి పెదవులపై దరహాసం చిందిస్తుంది. సింగరాజు నాగలక్ష్మి కథ ‘ఊర్మిళ’. అన్నావదినల వెంట లక్ష్మణుడు అడవులకు వెళితే అంతకాలమూ నిద్రలోనే గడిపిన ఊర్మిళ వృత్తాంతం బాగా ప్రాచుర్యం పొందిందే. అయితే ఈ కథలో ఊర్మిళ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక ‘మాండవి’ కథ.. అసలు ఊర్మిళ పాత్రకు ఉన్నంత ప్రాచుర్యం మాండవికి లేకపోయినా, రచయిత్రి ఎమ్. లక్ష్మీదేవి చేసిన కల్పనతో పాఠకులకు మాండవి అంటే ప్రత్యేక ఆరాధనాభావం కలిగి తీరుతుంది. ముఖ్యంగా భరతుడు, తనను అపార్థం చేసుకొని, దుర్భాషలాడినా, అతడిని అనుసరిస్తూ, సేవలందిస్తూ, కన్నీళ్ళతో గడిపింది. తనను నిర్లక్ష్యం చేశాడన్న మచ్చ భరతుడికి రాకూడదని, రామాయణంలో తన పేరు తప్ప, మిగిలిన వివరం ఉండకూడదని సరస్వతీ దేవిని, మాండవి వరం కోరుకున్నట్లుగా చెప్పడం మరింత ఔచితీమంతంగా ఉంది.
స్థల ప్రభావం మనిషి బుద్ధిపై ఉంటుందని తెలిపే.. పాఠకుని పెదవులపై చిరునవ్వులు పూయించే చిన్న కథ ఎల్లోరా లిఖించిన ‘లక్ష్మణ గడ్డ’.
భక్త శబరి, రాముడికి ఎంగిలి పళ్లు తినిపించిన ఉదంతం అందరికీ తెలిసిందే అయితే ‘రేగుపళ్ల రుచి’ కథలో రచయిత నారాయణ శర్మ, సుగ్రీవుడి విందును వర్ణించి, లక్ష్మణుడు, అన్నతో విందు గొప్పగా ఉంది కదా అంటే, అందుకు రాముడు శబరి ఇచ్చిన రేగుపళ్లు ఇంకా బాగున్నాయని బదులిచ్చాడని చెప్పడం భక్తి రుచిని మరింత హైలైట్ చేసింది.
భ్రాతృ ప్రేమ కథలో సంపాతి, జటాయువుల వృత్తాంతాన్ని గోనుగుంట మురళీకృష్ణ ఎంతో అందంగా మలిచారు. ముఖ్యంగా భూమి పైన ఏడు మార్గాల వివరణ బాగుంది.
సీతాన్వేషణ చేసి, శుభవార్తను, సీత గురుతుగా చూడామణిని తెచ్చిన హనుమను, ఆత్మీయ కౌగిలితో రాముడు సంభావించడం.. సి.హెచ్. బృందావనరావు రాసిన హృద్యమైన కథ ‘కౌగిలి’.
మద్దుల లక్ష్మీ నారాయణ గుప్త రాసిన ‘విభీషణుని భక్తి’ కథ సంఖ్య పదికి బదులు ఇరవై ఎనిమిది అని తప్పు పడింది. విభీషణుని రామభక్తి ఎంతటిదో తెలిపే చక్కటి, చిక్కటి చిన్న కథ ఇది.
బలభద్రపాత్రుని రమణి రచన ‘లోహజంగుడు’ చదివిన పాఠకుడు నవ్వితీరాల్సిందే. నవ్విస్తూనే, నారాయణ మంత్ర, రామ జప మంత్ర మహత్తును విశదీకరించడం ఈ కథ ప్రత్యేకత.
లంకలో ఉన్న సీత కృంగిపోకుండా, ధైర్య స్తైర్యాలతో ఉండడమే గాక, తనకు కావలిగా ఉన్న త్రిజటకు జీవిత సత్యాలను బోధించినట్లు చిత్రించారు భమిడిపాటి గౌరీశంకర్, తమ ‘సీత చెప్పిన సత్యం’ కథలో.
‘ప్రేమాగ్ని పరీక్ష’ కథలో కస్తూరి మురళీ కృష్ణ, సీత, రాముడి అంతరంగాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే అగ్ని ప్రవేశం చేసిందంటూ, రాముడి కోణం ఏమిటో చక్కగా ఆవిష్కరించి.. జన సామాన్య అపోహలకు తెరదించారు.
పట్టాభిషేకం అనంతరం, రావణ వధ వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి, నారదుడి సూచన మేరకు రాముడు, శ్రీపర్వతానికి వెళ్లి శివదర్శనం చేసుకున్న ఉదంతాన్ని, ‘కరుణించవా.. శివా!’ కథలో చక్కగా ఆవిష్కరించారు శ్రీనివాస దీక్షితులు.
పద్నాలుగేళ్ల అరణ్యవాసం అనంతరం అయోధ్యకు విచ్చేసిన శ్రీరామునికి, భరతుడు రాజ్య పాలనాధికారాన్ని అప్పగించిన వృత్తాంతాన్ని ‘న్యాసము’ కథలో మనోజ్ఞంగా వర్ణించారు కుంతి. శింగంపల్లి అప్పారావు రాసిన ‘రామరాజ్యం’ కథ ఎంతో వైవిధ్యంగా ఉంది. భరతుడు శిస్తు వసూలు విషయంలో మితిమీరిన ఉదారతను చూపడంతో, రైతులు అదేపనిగా సాకులు చెప్పి శిస్తులే కట్టరు. ఫలితం.. ఖజానా ఖాళీ. రాముడు విషయాన్ని గ్రహించి, యుక్తితో పరిస్థితిని సరిదిద్ది, ఖజానా నిండేలా చేస్తాడు. రాముడి రాజకీయ కౌశలాన్ని తెలిపే కథ ఇది.
పరశురాం విరచిత ‘హనుమంతుని స్వప్నము’ కథలో తన తదనంతరం పితృ దేవతలకు పిండోదకాల సమర్పణ కోసం, సీతమ్మ సలహాపై పెళ్లి చేసుకోవాలనుకుంటాడు హనుమ. ఆ పెళ్లి ప్రయత్నాలు ఆసక్తికరంగా, హాస్య పూరితంగా సాగుతాయి. చివరకు హనుమ పెళ్లి ప్రయత్నం మానుకుని, తన హృదయం, సీతారాములకే అంకితమని చెప్పడంతో హనుమకు, సీత ‘అమరత్వం’ వరంగా ఇస్తుంది. ఆ రకంగా హనుమ సమస్య పరిష్కారమైంది.
జె.శ్యామల రాసిన ‘ఘటన’ కథ పద్మ పురాణంలో చిలుకల వృత్తాంతం ఆధారంగా అల్లిన ఊహాజనిత కథ. సీతపై అపవాదు వేసిన చాకలికి విధి ఏం ప్రసాదించిందన్నది ఇందులో ఆవిష్కరించడం జరిగింది.
డా. లత రచించిన ‘రామాయణంలో రజని’ కథలో రాముడు సీతను అడవులకు పంపడం కాకుండా, పరిస్థితులలో వచ్చిన మార్పు దృష్ట్యా సీత తనంత తానే వనవాసానికి వెళ్తుంది. ఇందులోని కల్పనా చాతుర్యం ప్రశంసనీయం.
ఇక సామాజిక రామాయణం విభాగంలో ‘వందే దశరథాత్మజం’ కథలో ఆవుల వెంకట రమణ పిల్లలకు, నానమ్మ చేత రామాయణ కథ చెప్పించడం స్ఫూర్తిదాయకంగా ఉంది.
పానుగంటి లక్ష్మీ నరసింహం గారి ‘ఒక కథ’, మల్లాది రామకృష్ణశాస్త్రి గారి ‘ఔనౌను’ కథలు ఈ సంకలనంలో ఉండడం పాఠకుల మహద్భాగ్యం. ‘వారాది రాముడు’ మరో విశిష్టమైన కథ. ఈ కథలో నంద్యాల సుధామణి కథనం ఓ చిత్రాన్ని చూస్తున్న అనుభూతినిస్తుంది. ఆ పల్లె, పాత్రలు, వాతావరణం, దైనందిన జీవితం, అప్పటి ఆచార వ్యవహారాలు, ప్రసవం ప్రాణగండంగా మారిన ఓ స్త్రీ క్షేమం కాంక్షించి కుల మతాలకతీతంగా ఊరంతా ఒక్కటిగా.. వారధిగా నిలిచి, పవిత్ర కార్యంగా నిర్వహించడం.. వారాది రాముడి జననం.. అద్భుతః.
పి. వి. ప్రభాకర మూర్తి రచించిన ‘రామ మాడ’ కథలో పైడితల్లి రామ భక్తి శబరిని మరిపిస్తుంది. ఆ భక్తిరస గంగలో మునిగి ప్రతి పాఠకుడు తన్మయుడవ వలసిందే. ‘రామ లీల’ మరో మంచి కథ. టెంపోరావ్ రాసిన ఈ కథలో ఇంట్లోని దేవుడి హుండీ పగలగొట్టి డబ్బులు పట్టుకెళ్లిన కొడుకు పరీక్ష తప్పితే, కొడుకు కుండపెంకులు, కొబ్బరి చిప్ప పెంకులతో నింపిన హుండీని, ఆ విషయమేమీ తెలియని తండ్రి గుళ్లో సమర్పిస్తే, ఆయనకు ముప్ఫై లక్షల లాటరీ తగులుతుంది. భగవంతుడికి కావలసింది భక్తి, ప్రేమ తప్ప, ధనం కాదని తండ్రి పాత్ర ద్వారా తెలియజేశారు రచయిత.
‘యతో ధర్మ స్తతో జయ’ పాణ్యం దత్త శర్మ రాసిన వైవిధ్య భరిత కథ. బాల్యంలో రామాయణ ప్రవచనాన్ని విన్న లఖియా ధర్మాచరణను అవగతం చేసుకుంటాడు. ధర్మబద్ధంగా నడుచుకుంటాదు. చివరకు ఎస్.టి. రిజర్వేషన్‌తో వచ్చిన ప్రమోషన్‌ను, అధర్మంగా భావించి త్యజిస్తాడు. భరతుడిలా, అన్నను ఆరాధిస్తాడు, ఆదరిస్తాడు.
‘రాముడు కట్టిన వంతెన’ ఆలోచనలు రేకెత్తించే చక్కని కథ. చిన వీరభద్రుడు ఉత్తమ పురుషలో రాసిన ఈ కథలో చివరగా.. మనుషులకు దూరంగా జరుగుతూ రాముణ్ణి తెలుసుకోవాలనుకునే వాళ్ల కన్నా, మనుషులకు దగ్గర కావడానికి అవసరమైతే తనని వదులుకోవడానికి సిద్ధపడే వాళ్లకు రాముడు సన్నిహితుడనిపించింది.. అన్న వాక్యం ఎంతో విలువైంది.
విలక్షణమైన మరో కథ వేదాంతం శ్రీపతిశర్మ రాసిన ‘రామ కథాసుధ’. కథ పేరు ఈ సంకలనానికే మకుటంగా నిలిచింది అంటేనే ఈ కథ విశిష్టత అర్థం చేసుకోవచ్చు. రామాపురంలోని రామాలయంలో భజన జరిగినప్పుడల్లా ఓ కొత్త వ్యక్తి వచ్చి భజనలో పాల్గొని, ఎవరికీ దొరకకకుండా పోవడం గురించిన నేపథ్య కథనం అద్భుతం.
పుస్తకం చదివాక పాఠకుడికి ‘రామకథాసుధ’ ఎంత తీయనిది అనిపించడం, ‘ఏదీ మరియొక సారీ’ అనుకుని మళ్లీ, మళ్లీ చదవడం తథ్యం.
***
రామకథాసుధ (కథల సంకలనం)
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్, కొల్లూరి సోమశంకర్
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 215
వెల: 175 రూపాయలు
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు, 33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్, చుట్టుగుంట,
విజయవాడ -520002
0866-2436643. 9849992890
ఆన్‍లైన్‌లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha