[‘రామకథాసుధ’ కథాసంకలనాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]రా[/dropcap]మాయణాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆ మహాకావ్యం మానవ జీవితానికి ఎలా ప్రేరణగా నిలిచిందో, ఎలా స్ఫూర్తిదాయకమయిందో, కథల రూపంలో రాసి పంపాలని సంచిక యాజమాన్యం ప్రకటించినప్పుడు, రచయితలు, రచయిత్రులు తమ కలాలకు పదును పెట్టుకొని, శ్రీరామచంద్ర ప్రభువును మనసులో నిలుపుకుని చక్కని కథలు వ్రాశారు. ఆ సంకలనానికి ‘రామకథాసుధ’ అన్న పేరు అన్వర్థ నామధేయమే.
“ఆత్మానం మానుషం మన్యే రామం దశరాత్మజం” అని స్పష్టం చేశాడు శ్రీరామచంద్ర ప్రభువు. “నన్ను నేను దశరథుని కుమారుడైన మానవుడిగానే భావిస్తున్నాను” అన్నాడు. ఆయన దేవుడిగా ఉండి ఉంటే ఇంత ప్రభావం మన మీద ఉండేది కాదు. మహిమలుగా నిలిచిపోయేవి. ఆయన మనలాంటి మనిషిగా ఉంటూనే, రూపుదాల్చిన ధర్మముగా, మనకు దిశానిర్దేశం చేశాడు. ఆయనతో పాటు ఆయన తమ్ముళ్ళు, భార్య, స్నేహితులు, సేవకులు, చివరకు శత్రువులు కుడా మానవత్వానికి ప్రతీకలుగా నిలిచారు. మనిషి ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విచికిత్సను రామాయణం అద్భుతంగా ఫలప్రదం చేసింది. కానీ ఈ సంకలనంలో కొందరు కథకులు, ఈ human element ను ignore చేసి, ఆయన దైవత్వానికే పెద్ద పీట వేసినట్లుగా నాకు అనిపించింది. కొందరు దీనినే హైలైట్ చేసి, సమాజం మీద రామాయణం ప్రభావాన్ని చూపడంలో కృతకృత్యులైనారు.
డిటెక్టివ్ నవలలు రాసి పేరు తెచ్చుకున్న ఒక రచయిత, తన కథలో “దైవానికి కావలసింది ధనం కాదు, భక్తి, ప్రేమ” అన్న సత్యాన్ని ఆవిష్కరించారు. కొడుకు హుండీలోని డబ్బులను దొంగిలించి, దాంట్లో కుండ పెంకులు, కొబ్బరి పెంకులు నింపి రామునికి అర్పించినా, ఆయనకు కోపం రాలేదు. ముప్ఫై లక్షలు లాటరీలో వచ్చేలా చేశాడు తండ్రికి. హుండీలో డబ్బు మార్చి, పెంకులు పెట్టిన కొడుకు పరీక్షలో ఫెయిలయ్యేలా చేశాడు. భగవంతుడయితే రాగద్వేషాలుండవు. మనిషి కాబట్టే ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చాడు.
Obscurity ని పండించే ఒక రచయిత, శ్రీరామతత్వాన్ని ఎలా దర్శించాలో చక్కగా వివరించారు. ఆంజనేయ స్వామి, రామయ్య హోటల్‍లో ఆ తత్వబోధ చేస్తారు. రామకథ కేసరిలా తీయనిది, దాని రంగు సాత్వికం, ఎప్పుడూ కొత్తగానే ఉంటుందని చెబుతాడు. ఆయనే హనుమంతుడని రచయిత వాచ్యంగా చెప్పడు. ‘రామకథ’ను ఒక స్త్రీ శక్తిగా ఆవిష్కరించిన ఈ కథ గొప్పది.
ఇక ఇంచుమించు ఒక నవలికగా రూపొందిన మరో పెద్ద కథలో, రచయిత్రి తమ ప్రాంతపు సాంప్రదాయాలు, పదబంధాలు, జీవన విధానాన్ని ఎక్కువగా చిత్రీకరించి, అసలు ‘కీ ఫాక్టర్’ ను belittle చేశారనిపించింది. ‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అన్న సూక్తి ప్రకారమేమో, ఆమె హిందూ ధర్మం లోని ఆన్ని తంతులనూ కథలో ప్రయోగించారు. మనం పైన అనుకున్నట్లు, ‘మహిమ’కు ప్రాధాన్యత ఇచ్చారు. కాని సమిష్టిగా అన్ని కులాల, మతాలను ఆ నమ్మకంలో ఇమిడ్చి రామాయణాన్ని, రామనామాన్ని యూనివర్సలైజ్ చేశారు. కొంత ‘ఉటోపియా’ ఇందులో కనిపిస్తుంది.
పానుగంటి, మల్లాది వారి లాంటి కథలు ఈ సంకలనంలో చోటు చేసుకోవడం సంకలనకర్తల ఉత్తమాభిరుచిని సూచిస్తుంది. ‘పురాణమిత్యేవ న సాధుసర్వమ్’ అన్నాడు కవికుల గురువు కాళిదాసు. ‘పాతదైనంత మాత్రన మంచిదీ కాదు’; అట్లే ‘న చాపి కావ్యం నవమిత్యవద్యం’. ‘కొత్తదని దేనినీ తక్కువగా చూడకూడదు’. దీని ప్రకారం సంకలనకర్తలు వ్యవహరించారని తెలుస్తూన్నది. పానుగంటి వారి కథ సంకలనకర్తల నియమాలకు అనుగుణంగా ఉంది. సుబ్బరాజుగారు లాంటివారు నవాబు గారిని కూడా రామభక్తుని కావించగలుగుదురు. రాముడు లేని చోటు అసలు లేదని ఆయన తేల్చివేసినారు.
మల్లాది వారి కథ కూడా రామతత్త్వాన్ని మానవతా కోణంలో ఆవిష్కరించింది. నిష్కళంకుడు, సచ్చీలుడు గోపన్న. సంపదల కోసం తపించే ఆయన భార్య. గోపన్న వెదుక్కుంటూ, పరివర్తనతో, పూర్వాశ్రమంలోని తమ దుర్వర్తనను దిద్దుకొని వచ్చిన ఒక మగ, ఒక ఆడ. గోపన్న భార్య వారిచ్చిన సంపద తీసుకుంటుంది. గోపన్న మాత్రం మాయమవుతాడు. “అర్థం అయింది ప్రభూ!” అని నవ్వి వెళ్లిపోతాడు. ఆ యిల్లాలికి తత్త్వం బోధపడి “అర్థం అయింది ప్రభూ! అనుగ్రహించు” అంటూ రాముని ముందే కూర్చుని, రామనామాన్ని జపిస్తూ, భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ‘నిధి చాల సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా?’ అన్న త్యాగరాజ కీర్తన సారాన్ని కథగా మలిచారు మల్లాది వారు. అర్థం కావడమే పరమార్థం!
ఈ సంకలన హారంలో నాయకమణి మొదటి కథ ‘శ్రీరాముని చింతన’. ‘శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః’ అన్న నామాన్ని ఆవిష్కరించింది. జ్ఞానం, అజ్ఞానం, అహంకారం, నిర్మోహత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి లాంటి లోతైన ఆధ్యాత్మిక భావనలను విశదీకరించింది. Random readers కు అర్థం కాదు ఈ కథ. రాముడు మానవుడిగా ఉంటూ, చిదాకాసం, చిదాభాసం, సృష్టిక్రియాశీలత్వం, నిర్వ్యాపారం, పురుష ప్రయత్నం లాంటి గహనమైన అంశాలను అవగాహన చేసుకుని, తనలోని బ్రహ్మతత్త్వాన్ని సాక్షాత్కరించుకోగలిగాడు. స్వస్వరూప జ్ఞానం పొందాడు. దీనిని కథ అనడం కంటే తత్త్వదీపిక అనడం సమంజసం. రచయిత్రి ధన్యురాలు. చదివేవారూ ధన్యులే!
“మనుషులకు దూరంగా జరుగుతూ రాముడిని తెలుసుకోవాలనుకోవడం అవివేకమని, మనుషులకు దగ్గర కావడానికి అవసరమైతే తనను వదులుకోవడానికి సిద్ధపడేవారికి రాముడెక్కువ సన్నిహితుడనిపించే” భావనను ఒక రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు. రామాయణ నాటకం కంటే పవర్ రేంజర్స్ నాటకం ద్వారానే మనుషులకు దగ్గరవ్వాలని పిల్లవాడు నిశ్చయించుకుంటాడు. “అసలు రామునికి తనవాడు, పరాయివాడు అంటూ ఎవరయినా ఉన్నారా?” అన్న రచయిత ప్రశ్న గొప్పది.
ఇక ‘ప్రేమాగ్ని పరీక్ష’ అనే కథ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాముడు సీతను అనుమానించలేదు. ఆమె సూర్యరశ్మి లాంటిదని, తాను కంటిచూపు సరిగా లేనివాడినని ఆయన అనటం self-belittlement కాదు, సీత వ్యక్తిత్వాన్ని గ్లోరిఫై చేయడం. ఈ విషయాన్ని సీతతో ఊర్మిళకు చెప్పించడం లోనే art and craft ఉంది. తాను సరిగ్గా judge చేయలేని ప్రజలకు ప్రతినిధి. ప్రజల దోషాలు పాలకులవి. సీతమ్మవారిని చూడడానికి ప్రజలు ఎగబడడానికి కారణం కేవలం కుతూహలం, చులకనభావనే అని కుండబద్దలు కొట్టింది అమ్మవారు. “ప్రజల దోషాన్ని తనపై ఆపాదించుకొని రాముడు ప్రజల మనసులను శుభ్రపరిచాడు” అన్న రచయిత మాటలు ప్రభువు వ్యక్తిత్వాన్ని హిమాలయాల అంత ఎత్తున నిలబెడతాయి. రాముడు సీతను అనుమానించి(నట్లు) మాట్లాడకుండా ఉండి ఉంటే సామాన్యుడు అలా మాట్లాడి ఉండేవాడు. ఒక రకంగా ఇది ఒక strategy కూడా. విభిన్నమైన కోణం ఇది!
‘యద్భావం తద్భవతి’ అన్నట్లు, రచయితలు, రచయిత్రులు, రాముడిని, రామాయణాన్ని తమ దృక్కోణంలో ఆవిష్కరించుకుంటూ వెళ్లారు. రామాయణ కథలతో గుదిగ్రుచ్చిన పగడాల దండ ఈ సంకలనం. అన్ని పగడాలూ నాణ్యమైనవే. ఏ కథలోను, సంకలనకర్తలు హెచ్చరించినట్లుగా, మౌలికంగా వాల్మీకి ప్రదర్శించిన వ్యక్తిత్వాలకు, సంస్కారాలకు భిన్నంగా లేవు. ఆయన వర్ణించిన గుణగణాలకు విరుద్ధంగా లేవు. భారతీయ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాభిమానాలనే ఈ కథలన్నీ వ్యక్తం చేశాయి. పైపెచ్చు విరుద్ధంగా ఉండకూడదని అన్న అంశాలను మరింత మెరుగుపరిచాయి. సుసంపన్నం చేశాయి. గ్రంథ విస్తర భీతితో అన్ని కథలనూ సమీక్షించలేకపోతున్నాను. కానీ సంకలన వ్యంజనం చక్కగా పచనమై, రుచికరంగా, సువాసనా భరితంగా ప్రకాశిస్తూన్నది.
‘రామచంద్రేణ భూయతే’
***
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్, కొల్లూరి సోమ శంకర్
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 215
వెల: 175/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha