[box type=’note’ fontsize=’16’] తెలంగాణ మలితరం కథకులు – కథనరీతులు శీర్షికన ప్రముఖ కథకులు, అనువాదకులు డి. రామలింగం గురించి వివరిస్తున్నారు కె.పి. అశోక్‌కుమార్. [/box]
కథకుడిగా, కవిగా, జీవిత చరిత్రకారుడిగా, నాటక రచయితగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా, సాహిత్య చరిత్రకారుడిగా, అనువాదకుడిగా, తెలంగాణ రచయితల సంఘం (1951) కార్యదర్శిగా డి. రామలింగం తెలుగు సాహిత్యానికి చిరపరిచితులే. వీరు ఖమ్మం జిల్లా మధిర తాలూకా బనిగండ్లపాడు గ్రామంలో 8 జూన్ 1924న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. చురుకైన విద్యార్థిగా ఒక వైపు రచనలు చేస్తూ, మరో వైపు జాతీయోద్యమం పట్ల ఆకర్షింపబడి, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విముక్తి పోరాటంలోకి దూకారు. స్టేట్ కాంగ్రెస్ వారి తెలుగు వారపత్రిక ‘సారథి’కి సహసంపాదకుడిగా పనిచేశారు. ఆ రోజుల్లో సారథి పత్రికను నిజాం ప్రభుత్వం నిషేధించింది. రామలింగం పధ్నాలుగు నెలలు అజ్ఞాతంగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం ‘గోలకొండ’ పత్రికలో పనిచేశారు. ఆ తరువాత సమాచార శాఖలో అనువాదకుడిగా చేరారు. ఈయన ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే హైదరాబాద్ సంస్థానం యూనియన్‍లో చేరింది. అప్పుడే హైదరాబాద్ సమాచార శాఖ, ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖగా రూపాంతరం చెందింది. మరోవైపు తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత కేంద్రప్రభుత్వ శాఖలోకి మారారు. ఫలితంగా తెలుగునేలకు దూరమయ్యారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్)లో కొంత కాలం, మద్రాసులో డిప్యూటీ సెన్సార్ ఆఫీసరుగా కొంతకాలం పనిచేశారు. చివరకు అక్కడ నుంచే పదవీ విరమణ చేశారు.
సమీక్షకులుగా, అనువాదకులుగా, జీవిత చరిత్రల రచయితగా డి. రామలింగం తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. జీవిత చరిత్రల విషయానికొస్తే ఆయనది ఒక ప్రత్యేకమైన స్థానం. బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, శొంఠి రామమూర్తి, దామోదరం సంజీవయ్య మొదలైన తెలుగు ప్రముఖుల జీవితచరిత్రలను ఆయన తెలుగు పాఠకలోకానికి అందించి, తద్వారా ఒక స్ఫూర్తిని కలిగించారు. జీవిత చరిత్రలు రాయడంలో ఆయనకు ఎంత పేరు వచ్చిందంటే – తమ తాలూకు మనుషుల జీవితచరిత్రలు రాస్తే ఎక్కువ మొత్తంలో పారితోషికమిస్తామని కొంతమంది పెద్దవాళ్ళు ఆయన చుట్టూ తిరిగితే, “వ్యక్తుల పరిచయాలు లేకుండా, వారు చేసిన కృషి ఏమిటో తెలియకుండా, పారితోషికం కోసం జీవిత చరిత్రలు రాయడానికి పూనుకోను” అని నిర్మొహమాటంగా తోసిపుచ్చేవారు. జీవిత చరిత్రలయినా, సాహితీ వ్యాసాలైనా ఆయన పరిశోధనాత్మకంగా, తులనాత్మకంగా రాసేవారు. బుచ్చిబాబు, గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు లాంటి కథకులపై రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలతో పాటు సాహిత్యప్రక్రియలపై రాసిన వ్యాసాలు కూడా విలువైనవే. తెలుగులోనే కాక, ఇంగ్లీషులో కూడా చాలా వ్యాసాలు రాశారు. ఇండియన్ లిటరేచర్ జర్నల్‌లో తెలుగు సాహితీ ధోరణుల గురించి, తెలుగు రచయితల గురించి విరివిగా రాశారు. హిందీ, ఉరుదూ, బెంగాలీ భాషలు కూడా ఆయనకు బాగా వచ్చేవి. ప్రొఫెసర్ ఆర్నాల్డ్ టాయిన్‍బీ, కె.సి.డే ల పుస్తకాలు తెలుగు చేశారు. వీరు కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా మండలి సభ్యునిగా అయిదేళ్ళు పనిచేశారు. “ఒక తరం తెలుగు కథ”కు రాసిన ముప్ఫై పేజీల ముందుమాట కథకులు, సాహితీప్రియులు భద్రపరుచుకోవల్సినంత విలువైనది. నేషనల్ బుక్ ట్రస్ట్‌కు ‘మీర్జా గాలీబ్’ను తెలుగు చేశారు. చివరి దశలో సర్వేపల్లి గోపాల్ గారి బృహత్ గ్రంథం అనువదించారు. వీరు బాల సాహిత్యంపై కూడా కొంత కృషి చేశారు. వీరి రచన ‘విశ్వకవి’ 1960-70 మధ్యకాలంలో ఏడో తరగతి విద్యార్థులకు ఉపవాచకంగా వుండేది. ఇవన్నీ కాక సృజనాత్మక సాహిత్యంలో విశేషంగా కృషి చేశారు. కథానికలు, స్కెచ్‌లు, రేడియో నాటికలు రాశారు. “కాగితపు పడవలు” అనే వీరి కథాసంపుటిని దేశి ప్రచురణాలయం 1964లో ప్రచురించింది. తిరిగి అదే పుస్తకాన్ని నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు 2016లో “డి. రామలింగం కథలు” పేరిట ప్రచురించారు.
డి. రామలింగం గారి కథలు ప్రేమ-మోహం చుట్టూ, వాటిని అల్లుకుని ఉన్న ఆరాటం, ఆందోళన, చిత్రభ్రమలను తెలియజేస్తాయి. అలాగే మధ్యతరగతి జీవితాలను, వారి మసస్తత్వాలను కూడా వివరిస్తాయి. యవ్వనంలో యువతీయువకుల్లో పొడచూపే శృంగార భావనలు, చిలిపి ఊహలు వాళ్ళను కలల లోకం విహరింపజేస్తాయి. ఆ దిశగా ముందడుగు వేయాలనుకున్నా – సంప్రదాయాలు, కట్టుబాట్లు వెనక్కు లాగుతుంటాయి. అలా ద్వైదీభావనలో కొట్టుమిట్టాడే ఒక యువతి అంతరంగాన్ని అత్యంత సహజంగా తీర్చిదిద్దిన కథ “జాగృతి”. ఏ బాదరబందీ లేకుండా జీవితాన్ని జల్సాగా గడుపుదామనుకునే ఒక యూనివర్సిటీ విద్యార్థి మనోభావాలను “కాగితపు పడవలు” కథ తెలియజేస్తుంది. యుక్తవయస్సులో ఆ విద్యార్థి మదిలో మెదిలే ప్రణయ భావనలు, లైంగిక స్వైరకల్పనలను ఆ కథలో ఆసక్తిగా చిత్రించగలిగారు. ఆకర్షించాలనీ, ఆకర్షింపబడాలనే మనస్తత్వం యువతీయువకుల్లో ఎంత సజీవంగా చోటు చేసుకుంటుందో – దాని విపరిమాణాలు ఎలా వుంటాయో ఆ కథలో వివరించిన విధానం బాగుంది.
వేసవి సెలవలకు ముందు జరిగిన కాలేజ్ డే సందర్భంగా విడిపోతున్న మిత్రులతో కోలాహలం వుంటే, ఇందిర తన క్లాస్‌మేట్ ప్రసాద్‌ను తమ ఊరికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఆ ఊరిని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రసాద్‌కు ఆ ఊరి వాతావరణం, అక్కడి మనుషులు, ఇందిర కుటుంబీకులు చూపిన ప్రేమాదారాలు ఆకట్టుకుంటాయి. మర్నాడే వెళ్ళిపోతానన్న ప్రసాద్‌కు, అర్ధరాత్రి ఇందిర ఏడుపు వినిపిస్తుంది. ఆమె తన వియోగం భరించలేక ఏడుస్తున్నదనీ, తన ప్రేమను ఇంకా బాహటంగా వెల్లడించలేకపోతున్నదనీ ప్రసాద్ గ్రహిస్తాడు. ఏకాకిగా వున్న ఆ కుటుంబానికి తన అవసరం ఉన్నదని గ్రహించిన ప్రసాద్, ఇందిరను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ప్రతి మనిషికి మనసిచ్చి పుచ్చుకునే ఆత్మీయుడొక్క వ్యక్తి వుంటే చాలని ఇరువురు గమనించడంతో వారి “గమ్యస్థానం” సుఖాంతమవుతుంది. “భార్యోపహతుడు” కథలో పుట్టింటికి వెళ్ళిన భార్యను మరచిపోలేక, ఆమె జ్ఞాపకాలతో రామం సతమతమవుతాడు. జగమంతా మాయ అనీ, భార్య, కాపురం, పిల్లలు అన్నీ భ్రమలని బోధించే సుబ్బారావులాంటి వారే అందులోంచి బయటపడలేకపోతున్నాడని గ్రహించిన రామం, వెంటనే వచ్చేయమని భార్యకు టెలిగ్రామ్ ఇవ్వడంతో కథ ముగుస్తుంది. ఈ రెండు కథలు దాంపత్య బంధాన్ని, ఇరువురికి పరస్పరం గల ప్రేమానురాగాలను తెలియజేస్తాయి.
ఢిల్లీ లాంటి మహా నగరంలో, రెండతస్తుల పైన షెడ్ల మాదిరిగా ఉండే ఇరుకు గదులనే “బర్సాతీ” అని పిలుస్తారు. భార్య లేకుండా ఒక్కడే ‘బర్సాతీ’లో దిగిన రచయితను ఎదురుగా గదిలో వుండే యువతి పదే పదే చూస్తుండటం, ఆకర్షించాలని ప్రయత్నించడం కనిపిస్తుంది. రచయిత కూడా ఆమె చర్యల పట్ల ఆసక్తి చూపించడంతో, ఒకసారి ఆమె ధైర్యం చేసి తన గదిలోకి పిలుస్తుంది. రచయిత అక్కడ ఆమెను తీరిగ్గా చూసిన తర్వాత ఆమె ఎవరో తెలిసిపోతుంది. ‘మన నాగరిక సమాజంలో ఇలాంటి సగం వాడిన పువ్వులెన్నో’ అని విచారిస్తాడు. ఈ సభ్య సమాజంలో పరువుగా బ్రతకాలంటే, నలుగురి చేత మంచివాడనిపించుకోవాలంటే, తన మనో దౌర్బల్యాన్ని అణచుకోవాలని గుర్తించిన రచయిత, నిర్దాక్షిణ్యంగా ఆమెను తిరస్కరించి వెళ్ళిపోతాడు. ఇంకో కథలో కాబోయే అక్క మొగుడిగా పరిచయమైన వ్యక్తి పట్ల కలిగిన ఆకర్షణ ప్రేమగా, వ్యామోహంగా మారిపోతుంది. ఒక రాత్రి అతని పొందు కోరి వచ్చి, తిరస్కరింపబడి అవమానాన్ని, వేదనని మరచిపోలేక బ్రతుకంతా నిర్లిప్తంగా గడిపి కన్నుమూసిన రాజ్యంకు “ప్రాప్తం లేదు” అని సరిపెట్టుకోవాల్సిందే. వన్ సైడ్ ప్రేమ కానీ, మోహం కానీ తిరస్కరణకే గురువుతుందని ఇందులోని స్త్రీలు చివరకు గానీ తెలుసుకోలేకపోతారు. ఇందులోని మగవాళ్ళు కూడా సమాజంలో తమ స్థానాన్ని గుర్తెరింగి, మంచితనం – పవిత్రత మాటున వాళ్ళని తిరస్కరిస్తారు. అప్పటి సామాజిక విలువలు అలా ఉండేవి.
అద్దెలకిచ్చే రెండో వాటాలోకి విజయలక్ష్మీ వాళ్ళు కాపురానికి వచ్చిన మొదటిరోజే, మహాలక్ష్మమ్మగారు అదోలా అయిపోతుంది. ఎంతైనా ఇల్లు గలావిడ. తన ఇంటి ఆవరణలో తన రాజ్యమే ఏకఛత్రాధిపత్యంగా కొనసాగాలని అనుకునే మనిషి. మొదటి వాటాలో కాపురం వుంటున్న సరళా వాళ్ళు సౌమ్యులనే చెప్పాలి. మహాలక్ష్మమ్మగారికి ఏ మాత్రం మనసు నొప్పకుండా సరిపెట్టుకుపోతున్నారు. కాని విజయలక్ష్మి ఆ ఆవరణలోకి కాపురానికి వచ్చిన తర్వాత అక్కడ నెలకొని వున్న శాంతిభద్రతలకు భంగం కలుగుతుంది. క్రమంగా ఆ ఆవరణ వాతావరణమే మారిపోతుంది. పూర్వం నిశ్శబ్దంగా ఉండేది, ఇప్పుడు పగలంతా కోలాహలమే. ఆరు నెలల్లో విజయలక్ష్మి, సరళల కుటుంబాలు సన్నిహితమవుతాయి. వీళ్ళ స్నేహం చూసి మహాలక్ష్మమ్మగారు తన ఆధిపత్యం బలహీనమైపోతున్నట్టుగా భావిస్తుంది. ఆ రెండు కుటుంబాలు ఎవరి దారిన వారుంటే తన పెత్తనానికి ఆ ఆవరణలో ఎదురుండేది కాదు. అందుకని చాలా తెలివిగా మహాలక్ష్మమ్మగారు ఆ రెండు కుటుంబాల మధ్య అనుమానపు బీజం నాటి, వారి ‘రాగబంధాన్ని భంగపరిచి’ తన అక్కసు తీర్చుకుంటుంది. “అత్తా-అల్లుడు” కథలో సుందరమ్మ పిసినిగొట్టు మనిషి. పిల్లికి బిచ్చం వెయ్యదని ఆమెను గురించి ఆ వీధివాళ్లంతా చెప్పుకుంటారు. ఎంత సేపు తనకి డబ్బు కూడబెట్టాలనే ప్రయత్నమే కాని మర్యాద సంగతి, లోకులు ఏమనుకుంటున్నారు అన్న మాటా ఆలోచించదు. దూరప్రాంతంలో వుండి కాంట్రాక్టు పనులు చేస్తున్న సుందరమ్మ భర్త ప్రతి నెల బాగానే డబ్బులు పంపిస్తుంటాడు. అయినప్పటికీ సుందరమ్మ అందులోంచి బొటాబొటీగా ఖర్చు పెడుతూ, మిగిలిన డబ్బు దాచిపెడుతూ సంతోషపడేది. విశాఖ నుండి మేనల్లుడు వస్తే ఖర్చు పెరుగుతుందని ఆమెకు భయం. వాడి అలవాట్లు దుబారా ఖర్చుతో కొంచెం బాధ. వాడ్ని వెళ్ళగొట్టడానికి చేసిన ప్రయత్నాలు వికటించి, మరింత డబ్బు ఖర్చు చేయాల్సిరావడం ఆమె కొక గుణపాఠం నేర్పిస్తాయి. పెద్ద వయసులో తాము, తమ పిల్లలు, తమ కుటుంబాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే స్త్రీలు ఎంత సంకుచితంగా ప్రవర్తిస్తారో, డబ్బు పట్ల – మనుషుల పట్ల ఎంత కట్టుదిట్టంగా వుంటారో ఈ రెండు కథలు తెలియజేస్తాయి.
చదువు సంధ్యలు అబ్బక, కులవృత్తి పట్ల ఆసక్తి చూపించక, ఊరంతా బలాదూరుగా తిరిగే చాకలి రాముడు ఆకతాయిగా పేరు తెచ్చుకుంటాడు. పెళ్ళి చేస్తేనయినా బాగుపడతాడేమోనని, పిల్లనివ్వమని మేనత్తని అడిగితే, రాముడు అప్రయోజకుడని ఆమె ఛీ కొడుతుంది. అవమానంతో ఊరిడిచి వెళ్ళిపోతాడు రాముడు. అక్కడి నుంచి మిలిటరీలో చేరి ప్రయోజకుడిగా మారి ఇంటికి తిరిగి వచ్చిన రాముడికి, మేనత్త సంతోషంగా కూతురునిచ్చి పెళ్ళిచేస్తుంది. ఆగస్టు పదిహేనున పెళ్ళి చేయమని చెప్పి, జెండా ముందు తన దేశభక్తిని ప్రదర్శించిన “సిపాయి రాముడ్ని” చూసి ఊరివాళ్ళు కూడా సంతోషిస్తారు. పని లేని మంగలి ఏమో కాని, పని రాని మంగలి మాత్రం షేవింగ్ పేరిట కష్టమర్లను ఎంత హడలెత్తించాడో తెలుసుకోవాలంటే “కబుర్లలో కత్తిగాట్లు” చదవాల్సిందే. మంచి హాస్యభరితంగా ఈ కథను తీర్చిదిద్దారు. మొదటి కథని దేశభక్తి, ఆదర్శవాదంతో నడిపిస్తే, రెండవ కథను హాస్యధోరణిలో మలచి ఆకట్టుకున్నారు.
డి. రామలింగం గారి కథలు ప్రేమ-మోహం చుట్టూ, వాటిని అల్లుకుని ఉన్న ఆరాటం, ఆందోళన, చిత్రభ్రమలను తెలియజేస్తాయి. అలాగే మధ్యతరగతి జీవితాలను, వారి మసస్తత్వాలను కూడా వివరిస్తాయి. ఏ కథ రాసినా, ఆ కథల్లోని మనస్తత్వ చిత్రణలకు ఇచ్చిన ప్రాధాన్యత, సహజత్వమూ పాఠకులకు అచ్చెరువు కలిగిస్తుంది. తెలంగాణ కథకుడైనప్పటికీ రామలింగం గారి కథల్లో ఎక్కడా తెలంగాణా నేటివిటీ కనిపించదు. బహుశా కాంగ్రెసు పార్టీ మనిషి కావడం, వారి జీవనశైలి వేరు కావడం కారణాలు కావచ్చు. ఈ కథల్లో కనిపించే అంతర సాక్ష్యాలను బట్టి చూస్తే, ఈ కథలు ఆంధ్ర ప్రదేశ్ అవతరణ తర్వాతే అనగా 1960వ దశకంలో రాసినవి అయి ఉండవచ్చని భావించడానికి ఆస్కారముంది. మొత్తానికి పది కథలతోనే ఆయన సంకలనాన్ని సరిపెట్టారు. కాని వెతికితే ఇంకో అరడజను కథలయినా దొరుకుతాయని ఘంటాపథంగా చెప్పగలను. మధ్యతరగతి జీవితాలు, పాత్రల చిత్రణ, మనస్తత్వ విశ్లేషణలను బట్టి వీరి కథలపై – వీరెంతగానో అభిమానించే బుచ్చిబాబు, గోపీచంద్‌ల ప్రభావం ఎంతగా ఉందో గుర్తించవచ్చు.
నిరంతర సాహితీ పిపాసి అయిన డి. రామలింగం చనిపోయేంతవరకూ, ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉండేవారు. భార్య చనిపోవడం, అనారోగ్యం, కుటుంబ సభ్యుల అనాదరణ వల్ల క్రుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది 1993 జనవరి 3 న ఆయన హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనాథ శవంలా ఆయన భౌతికకాయాన్ని మార్చురీలో ఉంచి, కొన్ని రోజుల తర్వాత 1993 జనవరి 13 న అంత్యక్రియలు జరిపించారు. అంతకు ముందు రోజే అలిశెట్టి ప్రభాకర చనిపోగా, ఆయన అంత్యక్రియలకు జంటనగరాలలోని సాహితీ ప్రియులు శ్మశానానికి వచ్చారు. ఆ పక్కనే మార్చురీ నుండి వచ్చిన రామలింగం గారి భౌతికకాయం వుంది. కాని ఆ విషయం అక్కడ ఉన్న సాహితీ మిత్రులకు తెలియలేదు. ఎంత విషాదం? ఒక ఉన్నత శ్రేణి రచయిత జీవితం ఒక విషాదగాథలా ముగియడం? పత్రికలు కూడా పట్టించుకోలేదు. ఆ బాధతోనే దేవరాజు మహారాజు ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకుడికి ఒక లేఖ రాశారు. అప్పుడు వాకాటి పాండురంగారావు గారు ఆ పత్రిక సంపాదకుడిగా వున్నారు. వారు దాన్ని లేఖల శీర్షికలో కాకుండా “నివాళి” శీర్షికతో చిన్న వ్యాసంగా ప్రముఖంగా ప్రచురించారు. దూరప్రాంతాలలో ఉన్న ఎంతో మంది సాహిత్యాభిమానులకు అదే సమాచారాన్ని చేరవేసింది. ఒక క్రమశిక్షణతో రచనలు చేసిన డి. రామలింగం, ఊహించని రీతిలో అకస్మాత్తుగా జీవితాన్ని ముగించుకోవడం చూసి తెలుగు సాహితీ ప్రపంచం విస్తుపోయింది. ఇప్పటికీ ఆ దిగ్భ్రాంతి, దిగ్భ్రాంతిగానే ఉండిపోయింది.