రామం భజే శ్యామలం – పుస్తకావిష్కరణ సభ – నివేదిక

0
2

[dropcap]శ్రీ [/dropcap]కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రామం భజే శ్యామలం’ – పుస్తకావిష్కరణ సభ ది.23 అక్టోబరు 2022 నాడు నారపల్లి లోని స్వాధ్యాయ లైబ్రరీ హాల్‍లో జరిగింది.

శ్రీ కస్తూరి మురళీకృష్ణ వక్తలను, సభికులను ఆహ్వానించి స్వాగతం పలికారు. ఈ సమయంలో ఈ పుస్తకం వెలువడడం ఎంత ఆవశ్యకమో క్లుప్తంగా వివరించారు. పుస్తకం నేపథ్యాన్ని వివరించారు

అనంతరం ప్రొఫెసర్ శ్రీమతి సిహెచ్ సుశీలమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించి, ప్రతులను అతిథులకు అందజేశారు.

శ్రీమతి సుశీలమ్మ ప్రసంగిస్తూ ఈ పుస్తకం అద్భుతమైనదని అన్నారు. గతంలో తాను రామాయణం ఎన్నోసార్లు చదివానని, కొన్ని సందేహాలు వెంటాడేవనీ, అప్పట్లో వాటినెలా తీర్చుకోవాలో తెలియలేదనీ, ఈ పుస్తకం ద్వారా ఆ సంశయాలు తొలగిపోయాయని అన్నారు. నేడు రాముడిపై, రామాయణంపై అనేక కుట్రలు జరుగుతున్నాయనీ; సీతా పరిత్యాగం, శంబూక వధ అనే అంశాల ఆధారంగా రామాయణాన్ని తెగడుతున్నారని అన్నారు. అయితే ఉత్తర రామాయణాన్ని వాల్మీకి రాయలేదనీ, తర్వాత ఎవరో రాసి చేర్చినట్టు అనిపిస్తుందని అన్నారు. ఈ పుస్తకంలో మూడు అంశాలు తనని ప్రధానంగా ఆకట్టుకున్నాయని అన్నారు. అవి (1) రాజ్యాలుగా అయోధ్య, కిష్కింధ, లంకల వివరణ (2) అప్పటి ప్రపంచ భౌగోళిక వివరాలు (3) నాటి లంకే నేటి శ్రీలంక అని నిరూపించడం. అయోధ్యది పటిష్టమైన రాచరికమైనా ప్రజాస్వామిక పంథాలో పాలన జరిగిందనీ, కిష్కింధలో అరాచక వ్యవస్థ అనీ, లంకలో నిరంకుశత్వమని తెలిపారు. జనబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న అనేక కథనాలు వాల్మీకి రామాయణంలో లేవని అన్నారు. శబరి రాముడికి ఎంగిలి పళ్లు తినిపించడం – మొల్ల రామాయణంలో ఉందని, భావోద్వేగాలతో కూడిన కథ కావున జనామోదం పొందిందని అన్నారు. అలాగే గుహుడు రాముడి కాళ్ళు కడగడం కథ కూడా మొల్ల రామాయణంలోదేనని తెలిపారు. మాయలేడి ఉదంతం సందర్భంగా లక్షణుడు గీత గీసి, అది దాటి సీతను రావద్దని చెప్పడం కూడా కల్పితమేనని చెప్పారు. సీతా స్వయంవరం కూడా కల్పనయే అని, అసలు జనకుడు స్వయంవరం ఏర్పాటు చేయలేదని తెలిపారు. సినిమాలలో చూపినట్టుగా వాల్మీకి రామాయణంలో లేదని అన్నారు. వాల్మీకి రామాయణానికి, ఉత్తర రామాయణానికి శైలిలో చాలా తేడా ఉందని, దానితో ఉత్తర రామాయణం వాల్మీకి విరచితం కాదని గ్రహించవచ్చని తెలిపారు. మరియొక ఉదాహరణగా దూతని చంపే సందర్భాలలో రావణుడిని విభిన్నమైన ప్రవర్తనను ప్రస్తావించారు. పైగా ఉత్తర రామాయణంలో స్వయంగా వాల్మీకి మహర్షే ఒక పాత్రగా ఉండడం కూడా సంశయాలు రేకెత్తిస్తుందని అన్నారు. పైగా ఒకసారి ఫలశ్రుతి చెప్పాకా, ఉత్తరకాండ మొదలవడం కూడా ఆలోచించవలసిన విషయం అని చెప్పారు. రామాయణంలో కులప్రసక్తి లేదని, రాముడిని కించపరుస్తూ మాట్లాడడం తగదని అన్నారు. ఇది నేటి యువతరానికి అవసరమైన పుస్తకమని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ స్థాయిలో పాఠ్యపుస్తకంగా ఉంచదగ్గ రచన అని తెలిపారు.

శ్రీ పాణ్యం దత్తశర్మ మాట్లాడుతూ – రచయిత రాసిన 55 వ్యాసాలని consolidate చేసి చూస్తే తనకు ప్రధానంగా 20 అంశాలు తోచాయని చెబుతూ, వాటిని సంక్షిప్తంగా వివరించారు. రామాయణం కావ్యం మాత్రమే కాదు నిస్సందేహంగా చరిత్ర అని అన్నారు. ఈ రచనలో Suspension of Reader’s Disbelief అద్భుతంగా కుదిరిందని అన్నారు. కొన్ని శతాబ్దాల పాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, చారిత్రక విధ్వంసం ఎలా జరిగిందో ఈ పుస్తకం తేటతెల్లం చేస్తుందని అన్నారు. మెకాలే విద్యావిధానంలోని లోపాలను ప్రస్తావించారు. దేశంలో చరిత్ర ఏ విధంగా వక్రీకరణకు గురైందో ఈ పుస్తకంలో బాగా వివరించారని అన్నారు. రామాయణంలో కాలనిర్ణయం చేసి వివిధ ఘట్టాలకు తేదీలను వెల్లడించడం విశేషమని అన్నారు. ఉత్తరకాండ వాల్మీకి రచించినది కాదని, తరువాత జోడించబడినదని అనేందుకు తగిన ఆధారాలను రచయిత చూపారని అన్నారు. శ్రీరాముని ప్రత్యామ్నాయంగా అశోకుడిని తీసుకువచ్చిన వైనాన్ని అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పారన్నారు. వాట్సప్ పరిశోధకులకు రచయిత వేసిన చెణుకులను ప్రస్తావించారు. రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్న సుగ్రీవుడి అట్లాస్ సమగ్రమూ, సత్యమూ, విపులమూ అని అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు తమ రచనలో సీతారామతత్వాన్ని అద్భుతంగా వర్ణించారని అన్నారు. రాముని గురించి నిందలు, అపోహలు, అపార్థాలు, వక్రీకరణలు ఈ పుస్తకం చదివాకా సమసిపోతాయని అన్నారు. చివర్లో ఈలపాట రఘురామయ్య గారు పాడిన కీర్తనని ఆలపించి తన ప్రసంగాన్ని ముగించారు.

శ్రీ కస్తూరి రాకా సుధాకరరావు మాట్లాడుతూ ఈ పుస్తకం చాలా ముఖ్యమైనదని అన్నారు. తన దృష్టిలో రాముడూ, భారతదేశం వేరు కాదని, రాముడు భారతీయ ఆత్మ అని అన్నారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా రాముడిని తమ వాడనుకుంటారని అన్నారు. ఉదాహరణగా ‘సఖినేటిపల్లి’ అనే ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో అక్కడి వారు చెప్పుకునే కథను చెప్పారు. రాముడిని తర్కిస్తే, దేశపు నేపథ్యం అర్థం అవుతుందని అన్నారు. హిందువులే కాకుండా ఎందరో మహ్మదీయ కవులు కూడా రాముని కీర్తించారని అన్నారు. ఇక్బాల్, రహీంఖానిఖాన్ ఇందుకు ఉదాహరణలని చెప్తూ, వారు రచించిన కొన్ని కవితలను ఉటంకించారు. రాముల వారి కథ దేశాన్ని కలుపుతుందని రామ్ మనోహర్ లోహియా వ్యాఖ్యానించారని చెప్పారు. రామాయాణం దేశాన్ని ఉత్తర దక్షిణాలుగా ఏకత్రితం చేస్తే, మహాభారం తూర్పు పడమరలను కలుపుతుందని అన్నారు. దేశ చరిత్ర కూడా అనేక విధాలుగా వక్రీకరణకి గురయిందని తెలిపారు. ఉదాహరణలుగా ఆర్.సి. మజుందర్, తారాచంద్ గార్ల  చరిత్ర పుస్తకాలను ప్రస్తావించారు. దేశం స్వాతంత్య్రం కోసం పాటుపడిన ఎందరినీ విస్మరించి కొందరినే చరిత్రలో ప్రధానంగా ప్రస్తావించారని అన్నారు. ఉదాహరణగా రంగో బాపూజీ ఇంగ్లండ్ వెళ్ళి వాళ్ళ పార్లమెంటులో భారత స్వాతంత్ర్యం గురించి ప్రసగించడం మరుగున పడిపోయిందని తెలిపారు. ఒక అవసరమైన సందర్భంలో వచ్చిన పుస్తకం ఇదని అన్నారు. దేశాన్ని విడగొట్టే చరిత్ర ప్రమాదకరమని అన్నారు. ఈ సందర్భంగా కాళోజీ కవిత వినిపించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, 108 దివ్యదేశాలు, అమ్మవారి 52 శక్తిపీఠాలు భారతీయులని ఏకం చేస్తాయని అన్నారు. చరిత్రను ప్రమాణపూర్వకంగా చెప్పాలంటే శ్రీ కోట వెంకటాచలం గారు గుర్తొస్తారని అన్నారు. ఇది గొప్ప పుస్తకమని, ఆంగ్లంలోకి కూడా అనువాదం అవ్వాలని అభిలషించారు. ఈ పుస్తకంపై విస్తృతమైన చర్చలు జరగాలని, వీలైనంత ఎక్కువమందితో చదివించాలని అభిప్రాయపడ్డారు.

అనంతరం రచయిత శ్రీ కోవెల సంతోష్ కుమార్ తన స్పందనను తెలియజేశారు. ఈ పుస్తకం రాయడానికి గల నేపథ్యాన్ని వివరించారు. సోషల్ మీడియాలో రాముడిపై వచ్చిన కవిత తనని బాగా డిస్ట్రర్బ్ చేసిందని, దానికి స్పందనగా వచ్చిన ఆలోచనల్లోంచే  ఈ పుస్తకం రూపుదిద్దుకుందని తెలిపారు. రాముడిని, దేశాన్ని వేరు వేరు అనడం అసాధ్యమని అన్నారు. ఆసేతుహిమాచలాన్ని నడిపించేది రాముడు ఒక్కడేనని అన్నారు. రాముడిని దూరం చేస్తే, దేశాన్ని సులువుగా విడదీయవచ్చని విచ్ఛిన్నకారులు భావిస్తున్నారని అన్నారు. ఈ పుస్తకంపై లోతుగా విశ్లేషణలు జరిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

అనంతరం శ్రీ కస్తూరి మురళీకృష్ణ కార్యక్రమాన్ని సమీక్షించి, 30 అక్టోబరు 2022న రవీంద్రభారతిలో దత్తశర్మ గారి ‘దత్త కథాలహరి’ ఆవిష్కరణ ఉంటుందని, అందరూ హాజరు అవ్వాలని కోరి సభను ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here