రామం భజే శ్యామలం

2
2

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతోంది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

అ‘శోక’ రాముడు

[dropcap]మ[/dropcap]రోసారి రామాయణం.. అదే రాముడు, అదే సీత, అదే రావణుడు.. సేమ్ స్టోరీ.. రిపీట్.. ఇప్పుడు కొత్తగా చర్చించేదేమున్నది? రామాయణం మీద ఎన్ని చర్చలు జరుగలేదు?

రాముడి మీద ఎన్ని కుట్రలు జరుగలేదు? రామాయణాన్ని రచించని కాలమేమున్నది? అదే సమయంలో రాముడిని నిందించడానికి, రామాయణంలో లేని లొసుగులను వెతకడానికి చేయని సందర్భమేమున్నది? రాముడిని మర్యాదా పురుషోత్తముడని పూజించని భారతీయుల ఇల్లేది? రామకోటి రాయని భక్తుడేడి? అదే సందర్భంలో రామాయణాన్ని, రాముడిని అభాసుపాలుచేయడానికి పూనుకోని అరస, విరస, కురస, వామపక్ష, హేతువాద, స్వయం ప్రకటిత మేధావులేరి? చిత్రమేమంటే.. ఈ దేశంలో మంచికైనా చెడ్డకైనా… భక్తుడైనా, కాకపోయినా, ఈ దేశాన్ని ప్రేమించినా.. ప్రేమించకున్నా.. ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం తారకరాముడి పేరును జపించకుండా ఉండరు. ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన నరేంద్రమోదీ నుంచి.. అసదుద్దీన్ ఒవైసీ దాకా రామజపం చేయకుండా క్షణం కూడా ఉండలేరు. కమ్యూనిస్టులు… కమ్యూనలిస్టులు, సెక్యులరిస్టులు, సక్యులరిస్టులు (కుహనా)… కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా… ద్వారక నుంచి కామాఖ్య  దాకా, రామాయణం గురించి మాట్లాడుకోని వారు కానీ… ప్రాంతం ఎక్కడైనా ఉన్నదా? కొందరు రాముడి భక్తులైతే… మరి కొందరు రాముడి గురించి తెలిసినా రాముడి అస్తిత్వాన్ని ఈ దేశంలో నామరూపాలు చేయడానికి తెగ ప్రయత్నం చేసినవారు. ఇప్పటికీ చేస్తున్నవారు. ఈ దేశంలో రాముడిపైన దాడి చేసినంతగా మరే చారిత్రక పురుషుడిపైనా దాడి జరిగి ఉండలేదేమో.

రాముడిపైనే ఎందుకీ దాడి? పదుల సంవత్సరాలుగా నాలో నన్ను తొలుస్తున్న ప్రశ్న. దీనికి జవాబుకోసం అన్వేషణ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉన్నది. ఓ పక్క మరలనిదేల రామాయణంబన్నచో నీ ప్రపంచకమెల్ల మెల్లవేళల తినుచున్న యన్నమే తినుచున్నదిన్నాళ్లు… తనదైన రుచి బ్రదుకులు తనవిగాన… చేసిన సంసారమే చేయుచున్నదిన్నాళ్లు తనదైన అనుభూతి తనదిగాన… అంటూ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షం రాశారు. మరోపక్క విషవృక్షాలూ రచించినవాళ్లూ ఉన్నారు. భక్తులు ఎలాగూ రామాయణాన్ని అద్భుతమని కొలుస్తున్నారు. రాముడిని దేవుడిని చేశారు. మరి సోకాల్డ్ స్వయం ప్రకటిత మేధావులు  రామాయణ విధ్వంసాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఏ వేదాలో.. ఉపనిషత్తులో.. ప్రబంధాలో.. లేక భారత, భాగవతాల జోలికి పెద్దగా ఎందుకు వెళ్లడం లేదు? రాముడే ఎందుకు? అదే సమయంలో రాముడి పైనా, రామాయణంపైనా పెద్ద ఎత్తున దాడి జరుగుతున్న కొద్దీ.. రాముడి పైన భక్తి మరింతగా ఎందుకు పెరుగుతున్నది?

వీళ్ల వాదన ప్రకారమే ఆలోచిస్తే ఆడదాని మాటకు తలొగ్గి చేతికొచ్చిన రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్లినవాడు, భార్యను, తమ్ముళ్లను అష్టకష్టాల పాయేసినవాడు, ఫ్రెండ్ కోసం చెట్టుచాటునుంచి అతని అన్నను చంపినవాడు,  కావాలని కల్పించిన దళితుడన్న ముద్రకు గురయిన శంబూకుడని  చంపినవాడు దేవుడెట్లా అయ్యాడు? ఇన్ని వేల సంవత్సరాలుగా భారతీయ సమాజంలో మమేకమై.. విడదీయరాని బంధమై ఎలా నిలిచి ఉన్నాడు?

రామాయణం చరిత్ర కాకపోయి ఉంటే.. కేవలం కావ్యమే అయితే.. రాముడు ఒక పాత్రే అయితే.. దానికి సార్వకాలీనత ఎలా సాధ్యపడింది? అందుకే రామాయణం ఏమిటి? రాముడు ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు ఒక్కటే. రామాయణం అంటే భారతదేశం. భారతదేశం అంటే రామాయణం. రామాయణమంటే భారతీయ జీవన దృక్పథం. రామాయణమంటే మూర్తీభవించిన భారతీయ ధర్మం. రామాయణమంటే భారతీయుల మూలపురుషుడి చరిత్ర. రామాయణమంటే వేదం. రామాయణమే వేదం. వేదమే రామాయణం.

రెండు శతాబ్దాలు ఈ దేశాన్ని పాలించిన బ్రిటిష్ ప్రభువులు ఈ ధర్మాన్నే, ఈ సంస్కృతినే ధ్వంసం చేయాలనుకున్నారు. వాళ్ల వల్ల కాలేదు. ఈ దేశాన్ని వాళ్లు వదిలి వెళ్లిన తర్వాత వారి వారసులుగా నెహ్రూ అండ్ కో ఈ విధ్వంస రచనను మరింత అతి తెలివితో ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే… 550 సంస్థానాలకు పైగా ముక్కలుగా ఉన్న దేశం. భిన్న నాగరికతలు, భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు, భిన్న మతాలు, భిన్న ఆచారాలు, భిన్న కులాలతో అత్యంత సంక్లిష్టమైన ఈ దేశాన్ని అంతర్లీనంగా… ఏకసూత్రంతో ఏకత్రితం చేసింది రామాయణమే, సీతారాములే. అందుకే… ఈ దేశంలో బ్రిటిష్ వాడి వల్ల సాధ్యం కాని విభజించి పాలించడానికి నెహ్రూ అండ్ కో చాలా తెలివిగా పూనుకొన్నది. అందుకోసమే భారతీయ ధర్మానికి సంబంధించి మూలచ్ఛేదన చేసే ప్రయత్నం ఆదినుంచే ఆరంభమయింది. వీళ్ళ ఆలోచన ప్రకారం  రామాయణం పుక్కిటి కథ అని ప్రచారం చేయాలి.  సమాజం  మెదడులోకి అది ఎక్కకపోతే రాముడి వ్యక్తిత్వాన్ని హననం చేయాలి. ఇంకా కాదంటే అసలు రామాయణం భారతదేశంలో పుట్టిందే కాదని చెప్పాలి. సీత మహిళ కాబట్టి ఆమెను తాకేందుకు సాహసం చేయలేదు (రావణుడే అంతటి దుస్సాహసానికి ఒడిగట్టలేదు. అప్టర్ ఆల్ వీళ్లు ఎంత?). కానీ రాముడి చరిత్రను మసకబార్చాలి. రామాయణంలో రాముడు అనుసరించి ఆదర్శంగా నిలవడానికి కారణమై… తరతరాలుగా ఈ దేశంలో నెలకొని ఉన్న ధర్మాన్ని, జీవన విధానాన్ని ధ్వంసం చేయాలి. ఇందుకోసం నమ్మకాలను మూఢనమ్మకాలుగా ప్రచారం చేయాలి. ఈ దేశంలో మహర్షులు, మునులు (వెనకటి కాలంలో ఇంటెలెక్చువల్స్ను  మహర్షులు, మునులు అనేవారు) రచించిన అనేక విషయాలను హేతువు లేనివిగా కొట్టిపారేయాలి. ఇక్కడ జీవితమే లేదని… మనవి అరువు తెచ్చుకున్న బతుకులని పదే పదే చెప్పి నమ్మించాలి. ఇందుకు ఈ దేశంలో ముస్లింలు, బిట్రిష్ వాళ్లు కూడా చేయని కుట్రకు స్వతంత్ర భారత తొలి ప్రభుత్వం నాంది పలికింది.

1947 జూలై 22.. భారతదేశం స్వతంత్రం కావడానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నది. స్వాతంత్ర్యానికి సంబంధించిన మార్గదర్శకాలు… ఇతరేతర అంశాలపై దేశంలోని అత్యున్నత రాజకీయ నేతలు రోజువారీగా చర్చలు జరుపుతున్న సందర్భంలో… సరిగ్గా జూలై 22న భారత త్రివర్ణ పతాకంలోనుంచి గాంధీ చర్కా మాయమైపోయింది. ఆ స్థానంలో బౌద్ధుల సింబల్ అయిన అశోకచక్రం వచ్చి చేరింది. అప్పటికే కాంగ్రెస్ పైన… జాతీయోద్యమంపైన… గాంధీ ఇన్సూయెన్స్ బాగా తగ్గిపోయింది. నెహ్రూ డామినేషన్ సహజంగానే పెరిగిపోయింది. రాజకీయ వ్యవస్థపై పూర్తి పట్టు సాధించిన తర్వాత నెహ్రూ చాలా తెలివిగా వ్యవహరించారు.  ఆయన ఆలోచన ఏమిటంటే మెజార్టీగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కనిపించవద్దు… కానీ… హిందూ మూలాల విధ్వంసానికి పూనుకోవాలి. హిందూ ఐకాన్లను క్రమంగా తెరమరుగుచేయాలి. అలా అని ముస్లింలు, క్రైస్తవులను నెత్తిన పెట్టుకున్నట్లు ఎవరికీ అనిపించకూడదు… కనిపించకూడదు. అంతటి రాజనీతి ఆయనకు మాత్రమే సాధ్యపడింది. ఎన్నికల ప్రసంగాల్లో… మైకుల తుప్పు వదలగొడుతూ… రామరాజ్యం తెస్తామంటూ పెద్ద పెట్టున బొబ్బలు పెట్టే నేతలకు భారతజాతి ఐకాన్‌గా రాముడిని, రామాయణాన్ని ఉంచాలన్న ఇంగితం లేకుండా పోయింది. దాన్ని ఒక మతపరమైన గ్రంథంగా చూశారు. మెల్లిగా రామాయణాన్ని పుక్కిటి పురాణంగా మార్చారు. రాముడిని ఒక మిథ్ చేశారు. రామాయణాది ఇతిహాసాలను, ఇతర చరిత్రలను, చారిత్రక పురుషులను కనుమరుగుచేయడానికి నెహ్రూ అండ్ కో ముందున్న ఒకే ఒక అవకాశం బుద్ధుడు. బౌద్ధాన్ని ప్రమోట్ చేస్తే హిందువుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాదు. అసలు అనుమానమే రాదు. ఎందుకంటే బుద్ధుడిని దశావతారాల్లో ఒకడిగా హిందువులు అబార్మ్ చేసుకొన్నారు. కాబట్టి నెహ్రూ ఆయన గణాలు.. సింపుల్‌గా బౌద్ధాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించాయి. ఒక పథకం ప్రకారం బౌద్ధాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాయి . పనిలోపనిగా గాంధీ ఫిలాసఫీని కూడా ప్రజల మనసుల్లోంచి తుడిచేయడానికి పన్నాగం రచించారు. ఇందుకు నెహ్రూ వేసిన తొలి అడుగు త్రివర్ణ పతాకంలోనుంచి గాంధీ చర్కాను తొలగించడం. 1947 జూలై 22 న నెహ్రూ నాయకత్వంలో మహామహులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకొన్నారు. అప్పటికి ఇంకా గాంధీ జీవించే ఉన్నారు. చర్కా స్థానంలోకి ముందుగా చెప్పినట్టు అశోకుడి ధర్మచక్రం వచ్చి చేరింది. ఎవరైనా వ్యతిరేకిస్తారేమోనన్న అనుమానంతో బుద్ధుడి ప్రవచనాలను గాంధీ ప్రవచనాలతో పోల్చి చెప్పడం ప్రారంభించారు. బుద్ధుడు, గాంధీ ఇద్దరూ ఈ దేశానికి జాతిపితలని కూడా కొన్నాళ్లపాటు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ ఫిలాసఫీ భారత జాతీయ యవనికపై నుంచి తొలగిపోయింది. గ్రామ స్వరాజ్య సిద్ధాంతానికి తిలోదకాలిచ్చినట్టు ఈ చర్యతో స్పష్టమైన సంకేతాన్నే నెహ్రూ ఇచ్చారు. అప్పటిదాకా మర్యాదా పురుషోత్తముడిగా, ఆదర్శ పాలకుడిగా… యావత్ భారత జాతి సమ్యక్ స్ఫూర్తికి ఏకతామూర్తిగా ఉన్న శ్రీరామచంద్రుడిని నెహ్రూ అండ్ కో కన్వీనియంట్ గానే మరిచిపోయారు. పక్కన పెట్టారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నుంచి మహాత్మాగాంధీ వరకు జాతీయోద్యమ సారథులకు ప్రేరణగా నిలిచిన రామచంద్రుడు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఐకాన్ కాకుండా పోయాడు. భారతీయమైన ఫిలాసఫీకి మూలమైన రామాయణం ఈ పాలకులకు కనపడకుండాపోయింది.

జాతీయోద్యమానికి ఒక మంత్రంగా పనిచేసిన వందేమాతరం గీతానికి స్వతంత్ర దేశంలో దిక్కులేకుండాపోయింది. ఆ స్థానంలోకి జనగణమన వచ్చిచేరింది.

జాతీయ జెండాలోకి ధర్మచక్రం వచ్చిన సరిగ్గా సంవత్సరం తర్వాత.. అదే అశోకుడి నాలుగు సింహాలు.. భారతదేశ అధికారిక రాజముద్రగా మారిపోయింది. జీవితమంతా అత్యంత అసాధారణ రీతిలో రాజ్య విస్తరణ కాంక్షతో భయంకరమైన హింసకు పాల్పడి.. చివరికి శ్మశానంగా మారిన రణభూమిలో బౌద్ధం తీసుకున్న అశోకుడు ఏ విధంగా ఆదర్శప్రాయుడయ్యాడో అర్థం కాదు. చివరకు పిల్లల పాఠాల్లోకి కూడా ‘అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించెను’ అని బోధనలు కూడా జరిగాయి. అంతేకాని.. భూమిమీద మానవమాత్రుడిగా అవతరించినది మొదలు ‘ రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నట్టు   ధర్మానికి మూర్తీభవించిన శ్రీరాముడు మాత్రం వీరికి పనికిరాలేదు. ఇక అక్కడి నుంచి పద్ధతి ప్రకారం బౌద్ధ ధర్మాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. 1947 నుంచి 1956 వరకు దశాబ్దానికి ఏడాది తక్కువ కాలం మేర బౌద్ధం నెహ్రూ నెత్తినెక్కి కూర్చున్నది. ఇక చూసుకొండి.. బహిరంగ ప్రదేశాలకు బౌద్ధ నామాలు వచ్చిచేరాయి. గౌతమ హాల్, లుంబినీ లేన్, కనిష్క హౌస్, బుద్ధ పార్క్. ఇట్లా కోకొల్లలు. ఇక్కడితో ఆగలేదు. దేశంలో బౌద్ధ ధర్మానికి సంబంధించిన అన్ని ప్రదేశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. బోయ్ గయ, శ్రావణి, సాంచి, లుంబిని, నలంద వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యాసంస్థల స్థాపన, బౌద్ధారామాల పునర్జీవానికి అదేపనిగా పూనుకొన్నది. అంతేకాదు.. 46 వాల్యూమ్‌ల పాలి త్రిపీటక (బుద్ధుడి మాటలు) సంపూర్ణ సంపుటాన్ని దేవనాగరి లిపిలో ప్రచురించింది.  1956 నాటికి కేంద్ర సమాచార ప్రసారశాఖ బుద్ధుడి పై ఏకంగా పూర్తిస్థాయి సినిమాను నిర్మించింది. దీనికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు కూడా వచ్చింది. 1954లో దేశవ్యాప్తంగా ఏడాదిపాటు బుద్ధ ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. సదస్సులు, ప్రదర్శనలు, సంబురాలు నిర్వహించారు. బుద్ధుడి 2,500 సంవత్సరాల జయంతి ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా నిర్వహించారు. నెహ్రూ విదేశాంగ విధానానికి బుద్ధిజం ఒక ఉపకరణంగా మారింది. ఈ దేశానికి బుద్ధిజం మాత్రమే అవసరమన్నంతగా ప్రభుత్వం దాన్ని ప్రమోట్ చేసింది. నెహ్రూ పొలిటికల్ సక్సెస్.. బలంతో ఇతర నేతలు ఆయన వెంటే నడిచారు. బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేద్కర్ వంటివారు దేశమంతా తిరిగి బుద్ధిజాన్ని ప్రమోట్ చేశారు. దేశానికి మొదటి రాష్ట్రపతిగా వ్యవహరించిన రాజేంద్రప్రసాద్ వివాదాస్పద మహాబోధి టెంపుల్ చైర్మన్‌గా వ్యవహరించారు. రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బుద్ధుడి బోధనలపై పుస్తకాలు రాశారు. స్వాతంత్ర్యం వచ్చిన మూడేండ్ల తరువాత ధమ్మపాద బౌద్ధ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువాదంచేశారు. 1949లో కలకత్తాకు బుద్ధుడి శిష్యులైన సారిపుత్ర , మొగ్గల్లానల అస్థికలను  తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సభజరిగింది. ఈ సభకు నెహ్రూ కూడా హాజరయ్యారు. ఈ సభకు హాజరైన బౌద్ధ సన్యాసులంతా పసుపు, ఎరుపు దుస్తులు ధరించారు.  అస్థికలశాన్ని తకపై పెట్టుకుని నెహ్రూ వేదికపైకి వస్తుంటే.. ఆయనపై పసుపు గులాబీ రేకుల వర్షం కురిపించారు. నెహ్రూ కూడా పసుపు గులాబీ పువ్వును ఆరోజు తన చొక్కాపై ధరించారు. ఆరోజు అందరి ప్రసంగాలు ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారంచేసింది. దాదాపు దశాబ్దం పాటు రాజకీయంగా నెహ్రూ ఎదిగిన కొద్దీ.. ఆయనతోపాటే బౌద్ధం దేశమంతటా విస్తరిస్తూపోయింది. తనకు మత విశ్వాసం లేదని మైకుల ముందు చెప్తూనే బౌద్ధమతం మాత్రం తనను చిన్నప్పటినుంచే ప్రభావితం చేసిందని బయోగ్రఫీలో రాసుకొన్నారు. నెహ్రూ ఈ తొలి పోకడ వామపక్షవాదులకు, హేతువాదులకు, సెక్యులరిస్టులకు… సోకాల్డ్ మేధావులకు హిందూ ధర్మం పైనా, హిందూ గ్రంథాలపైనా విశృంఖలంగా దాడులు చేయడానికి అవకాశాలు కల్పించింది. ఇంకేం.. అప్పటినుంచి ఇప్పటివరకు అదే పనిగా పడుతూనేవున్నారు . ముఖ్యంగా రాముడిని, రామాయణం పైన దాడులు తీవ్రమయ్యాయి. రాముడిని విలన్‌గా చేస్తే.. రామాయణాన్ని దుర్మార్గమైన గ్రంథంగా రుజువు చేయగలిగితే.. ఈ దేశాన్ని  ఒక సంస్కృతిగా ముడివేసిన సూత్రం తెగిపోతుంది.

అందుకే రాముడిని విలన్ చేయడం కోసం బుద్ధుడి కంటే కూడా అశోకుడు హీరో అయ్యాడు. హిందూ ధర్మాన్ని తొక్కివేయడానికి బౌద్ధాన్ని, బుద్ధుడిని అడ్డగోలుగా వాడుకొంటున్నారు.  నెహ్రూ అనుసరించిన ఈ కూటనీతిని సమర్థించే వర్గం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. దీనికి తమదైన రీతిలో వ్యాఖానాలు చేసేవాళ్లకు కొదువ ఉండదు. అలాంటి వారికి ఈ కుట్ర గురించి ఏం చెప్పగలం.. ధర్మం శరణం గచ్ఛామి.. ఆ ధర్మమే మూర్తిమంతమై సమస్త దేశాన్ని ఆవరించిన శ్రీరామచంద్రుని.. రామం భజే శ్యామలం అని కొలవడం తప్ప.

                                                                                                                                                  (ఇంకావుంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here