Site icon Sanchika

రామం భజే శ్యామలం-10

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]అ[/dropcap]యోధ్యలో దశరథుడు ఒక క్యాబినెట్‌ను వ్యవస్థీకరించాడు. మన ప్రజాస్వామ్యంలో మాదిరిగానే ఆయనకూ ఓ మంత్రి మండలి ఉన్నది. సెలెక్టివ్‌గా ఓ ఎనిమిది మందిని మంత్రులుగా నియమించుకొన్నాడు. వారి కింద కార్యనిర్వాహక వ్యవస్థ ఒకటి ఉన్నది. ఈ వ్యవస్థలో పనిచేసేవారు ఈ మంత్రులు చెప్పిన పనులు అమలుచేస్తుంటారు. గౌరవ సలహాదారులు (త్రేతాయుగంలో వారిని పురోహితులని అనేవారు) ఇద్దరు ఉన్నారు. వీళ్ల పేర్లను ఇంతకుముందు వ్యాసంలోనే ప్రస్తావించుకొన్నాం. ఇక్కడ మనం ప్రధానంగా చర్చిస్తున్నదేమంటే.. ఈ మంత్రులను ఎట్లా ఎంపికచేసుకున్నాడు దశరథుడు? ఒక్కొక్కరిని ఎంచుకోవడానికి చాలా చాలా కసరత్తే చేశాడు. ప్రతి ఒక్కరిపైనా లోతుగా ఎంక్వైరీ చేయించాడు. దశరథుడికేమో.. ఎంచుకొన్న మంత్రులంతా మిస్టర్ పర్‌ఫెక్ట్‌ల్లాగా ఉండాలి. ఆ విధంగానే ఆయన తన మంత్రులను నియమించుకొన్నాడు. నిజానికి దశరథుడు స్వయంగా మహావీరుడు, తెలివిగలవాడు. కానీ, ప్రజాస్వామ్యయుతంగా పాలించడమే అతనికి ఇష్టం. తాను కావాలనుకుంటే నిరంకుశంగా వ్యవహరించవచ్చు. తనను అడిగేవాడే ఉండడు. కానీ, దశరథుడు మాత్రం సర్వజనామోదంతోనే పరిపాలన సాగించాడు. తన పరిపాలనకు ఏ చిన్న మచ్చ రాకుండా జాగ్రత్తపడ్డాడు. తాను ఎంపిక చేసుకున్న మంత్రుల్లో ముందుగా ఆయన చూసిన అర్హత ఏమిటంటే.. లంచాలు తీసుకోకపోడం వంటి దోషము లేనివాడు. దీని తరువాత వ్యవహార శుద్ధి, అనుక్షణం రాజకార్యాల్లో అప్రమత్తంగా ఉండేవాళ్లు. ఇలాంటి వారినే దశరథుడు ఎంపిక చేసుకొన్నాడు. ఈ మంత్రులు అన్ని విద్యల్లో ఆరితేరినవారై ఉన్నారు. అవసరమైతే యుద్ధం కూడా చేయగల సమర్థులు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు పనులు చేయరు. ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం కలిగినవాళ్లు. శాస్త్రజ్ఞానం కలవాళ్లు.. అన్నింటికీ మించి సహనం కలిగినవారు. డబ్బుకోసం అబద్ధాలు ఆడేవారు కారు. కోపం, కామం వంటి వాటికోసం దుష్కార్యాలు చేసేవాళ్లు ఎంతమాత్రం కారు.

ఈ మంత్రులపై రాజు ఎప్పటికప్పుడు నిఘా ఉంచేవాడు. వాళ్లకు ఎవరెవరు స్నేహితులున్నారో.. వాళ్ల గురించి కూడా తెలుసుకున్న తరువాతే మంత్రి పదవి ఇచ్చాడు. అవసరమైతే తమ కొడుకులు తప్పుచేసినా ఈ మంత్రులు ఉపేక్షించకుండా శిక్షిస్తారు. రాజుగారి ట్రెజరీ నింపడం, సైన్యాన్ని బలోపేతం చేయడం వంటి పనులను చేస్తారు. దేశంలోని ప్రజలకు ఆపద కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొంటారు. మంత్రులందరి మధ్యన ఐకమత్యమన్నది ప్రధానంగా ఉండేలా దశరథుడు జాగ్రత్త పడ్డాడు. వీళ్లల్లో ఏ ఒక్కరు కూడా మరొకరిపై ఈర్ష్యాద్వేషాలతో ఉండేవారు కారు. ఒకరి కుర్చీ కిందకు మరొకరు నీళ్లు తేవడానికి ప్రయత్నించేవారు అంతకంటే కారు. రాజ్యానికి, రాజుకు ద్రోహం చేసేవారిని క్షణమైనా ఉపేక్షించకుండా హతమార్చేవారు. నిరంతరం రాజ్యానికి మేలుచేయడం పైనే ఆసక్తి కలిగిన సమర్థులైన మంత్రులు వీరు.

అయోధ్య కాండలోనే భరతుడు రాముడి దగ్గరకు వచ్చినప్పుడు రాముడు మంత్రులు, అధికారుల గురించి అడుగుతాడు. ‘నీ దగ్గర ఉన్న మంత్రులు అధికారులు పరిశుద్ధమైన నడవడిక కలవారు.. మంచి గుణాలు కలిగిన వారే కదా.. అలాంటి వారినే నియమించుకున్నావు కదా.. వారి సామర్థ్యానికి తగిన పనులు అప్పగిస్తున్నావు కదా’ అని.

మన దేశంలో ఒకటి రెండు రాజ్య వ్యవస్థలు మినహా దాదాపు అన్ని రాజ్యవ్యవస్థల్లో కూడా రాజుకు అపరిమిత అధికారాలున్నప్పటికీ.. ప్రజాస్వామ్యయుతంగానే పరిపాలన సాగింది. యూరప్ వంటి దేశాల్లో కనిపించే అసాధారణ నియంతృత్వం.. అమానవీయమైన అరాచకం మన దేశంలోని రాజ్యవ్యవస్థల్లో పెద్దగా కనిపించదు. మంత్రులు ఉంటారు. వారికి అధికారాలుంటాయి. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు.. అవి ఏక వ్యక్తి రూపంలోనో.. కొందరు వ్యక్తుల సమాహారంగానో వ్యవస్థీకృతమై ఉంటాయి. వారు రాజ్యానికి, రాజుకు పరమ విధేయులుగా ఉంటారు. ఆ రాజ్యంలోని విధులను, బాధ్యతలను గీత దాటకుండా పాటిస్తారు.

మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత పరిపాలకుడి మొట్టమొదటి విధేయుడు, చెలికాడే పరమ లంచగొండి అయ్యాడు. మనకు అప్పుడే స్వాతంత్య్రం వచ్చింది. రాజ్యాంగం రాసుకోనైనా లేదు. రాజ్యాంగ సభ సమావేశాలు.. చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగంలో ఏమేం రాసుకోవాలో.. ఏ యే అంశానికి సంబంధించి ఏయే నిబంధనలు రూపొందించుకోవాలో.. పౌరులకు హక్కులు ఏ రకంగా ఉండాలో.. రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? అధికారులు ఏ విధంగా వ్యవహరించాలి.. వివిధ రకాల నేరాలకు శిక్షలు ఏమేమి వేయాలో ఏమీ ఖరారు కాలేదు. రాజ్యాంగ సభ సభ్యులు దేశంలో తిరుగుతున్నారు.. పార్లమెంట్‌లో సమావేశమై చర్చలు చేస్తున్నారు. అప్పటికి స్వాతంత్య్రం వచ్చి బహుశా నాలుగైదు నెలలైందేమో. స్వాతంత్య్రం తాలూకు భావోద్వేగాలు ప్రజల్లో ఇంకా చల్లారలేదు. జాతీయోద్యమంలో పాల్గొని జైళ్లపాలైన నాయకులే పాలకులైతే.. తమ కష్టాలు పూర్తిగా తెలిసినవారే తమ నేతలైతే.. తమ రాతలు బాగుపడతాయన్న భావనలో జనం ఉన్నారు. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనకు ప్రశాంతత లేకుండా పోయింది. శరణార్థుల ఊచకోతతో బ్రిటన్ రాణి రక్తసిక్తమైన స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. ఇదే సందు చేసుకొని పాకిస్తాన్ దొంగదాడికి తెగబడింది. ఈ పరిస్థితిలో పాలకులపై ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఏ విధంగా వ్యవహరించాలి. పాకిస్తాన్‌ను సమర్థంగా తిప్పికొట్టడానికి నిజాయితీతో, చిత్తశుద్ధితో రేయింబవళ్లు శ్రమించి విజయం సాధించి ఉంటే.. ప్రజల్లో విశ్వసనీయత పెరిగి ఉండేది. కానీ.. నెహ్రూ అంతేవాసి వీకే కృష్ణమీనన్ మన సైన్యపు ప్రయోజనాలను తాకట్టుపెట్టి దేశంలోనే తొలి లంచావతారంగా ఆవిర్భవించాడు. ఈ మహానుభావుడు అప్పుడు బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నాడు. స్వతంత్రభారతంలో నెహ్రూ తర్వాత నంబర్ టూగా వ్యవహరించారు. నెహ్రూ మీనన్ ఇద్దరూ సంపన్న న్యాయవాదుల కుటుంబాల నుంచి వచ్చినవారే. పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో మన సైన్యానికి దాదాపు నాలుగువేల జీపుల కొరత ఏర్పడింది. వెయ్యి జీపులను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. మిగతా మూడువేల జీపుల కొనుగోలు కోసం రక్షణశాఖ కార్యదర్శి, సైనిక దళాల అధిపతి, ఆర్థిక సలహాదారు బృందం యునైటెడ్ కింగ్‌డమ్‌కు బయలుదేరి వెళ్లింది. కానీ అవసరమైన జీపులను మాత్రం తెచ్చుకోలేకపోయింది. 1948 జూన్‌లో ఆర్థిక సలహాదారు ఏకే చందా.. మూడు వందల పౌండ్లకు ఒక జీపు చొప్పున 1500 మరమ్మతు చేసిన జీపులను కొనడానికి అనువైనవిగా గుర్తించగలిగాడు. మూడేండ్లపాటు విడిభాగాలు కచ్చితంగా అందుబాటులో ఉండేలా రెండువేల జీపులను కొనడానికి అనుమతి లభించింది ఈ జీపుల సరఫరాను అగ్రిమెంట్ కుదిరిన ఆరో వారం నుంచి ప్రారంభించి ఐదు నెలల వ్యవధిలో పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ లావాదేవీలకు సంబంధించిన సందేశాలు చందా ద్వారా మొదట జరిగినప్పటికీ.. తరువాత మొత్తం వ్యవహారాన్ని వీకే కృష్ణమీనన్ తానుగా చక్కబెట్టాడు. ఎలాంటి ప్రొటోకాల్ పాటించకుండా.. పద్ధతిని అనుసరించకుండా ఈ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకొన్నాడు. యాంటీ మిస్టంట్స్ అనే కంపెనీ (దీని మూలధన పెట్టుబడి కేవలం 605 పౌండ్లు.. 1948 నాటి కరెన్సీ కన్వర్షన్ ప్రకారం రూ.8022.00) కి ఈ రెండు వేల జీపుల కాంట్రాక్ట్‌ను అప్పగించాడు. ఇందుకోసం 80 లక్షల రూపాయల ఒప్పందం సదరు కంపెనీతో జరిగింది. వాస్తవానికి కృష్ణమీనన్‌కు ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉండాల్సిన పనిలేదు. భారత్ నుంచి ప్రత్యేక బృందం వచ్చిందంటే.. ఆ బృందం అవసరమైన లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది ఈయన కేవలం వారికి అవసరమైన సహకారాన్ని మాత్రమే అందించాలి. కానీ కృష్ణమీనన్ అన్నీ తానే అయి వ్యవహరించి.. అన్ని నియమాలను, పద్ధతులను పక్కనపెట్టి ఈ ఒప్పందం చేసుకున్నాడు. ఇట్లా ఎందుకు చేశావయ్యా అని అడిగితే.. సదరు కంపెనీ వాళ్లు మనకు చాలా తొందరగా జీపులను సరఫరా చేస్తారని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈయన పెట్టిన ఖర్చుకు అమెరికా నుంచి సెకండ్‌హ్యాండ్ కాకుండా కొత్త జీపులే మనకు వచ్చేవి.

ఇంతేనా.. ఈ ఒప్పందానికి సంబంధించిన నగదు చెల్లింపు నిబంధనలను కూడా ప్రపంచంలో ఏ దేశమూ చేయని విధంగా చేసుకొన్నాడు. ప్రి షిప్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ సర్టిఫికెట్ (జీపుల కండిషన్‌ను సరఫరాకు ముందు పరిశీలించడం).. అది కూడా 20 శాతం మాత్రం పరిశీలించి ఇస్తే.. ఏకంగా 65 శాతం పేమెంట్ చెల్లించేలా ఒప్పందం జరిగింది. అంటే ఒక్క జీపు కూడా భారత్‌కు చేరకముందే 65 శాతం డబ్బు చెల్లిస్తారన్నమాట. ప్రభుత్వం ఎక్కువకాలం వేచిచూసే పరిస్థితిలో లేదు. ఆగమేఘాల మీద ప్రీ ఇన్‌స్పెక్షన్ సర్టిఫికెట్, దాంతోపాటు 65 శాతం సొమ్మును సదరు కంపెనీకి ముట్టజెప్పారు. డబ్బులు చెల్లిస్తే తప్ప యాంటీ మిస్టంట్స్ కంపెనీ వాళ్లు జీపులను సరఫరా చేయజాలరని కృష్ణమీనన్ ప్రభుత్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాడు. కృష్ణమీనన్ ఆదేశాల మేరకు జీపుల నాణ్యతను పరీక్షించే అధికారులు మారిపోయారు. వాళ్లు జీపులను పరిశీలించకముందే 172000 పౌండ్లను భారత ప్రభుత్వం చెల్లించింది. ఆ తర్వాత పర్యవేక్షణ క్లాజ్‌ను కూడా మార్చేశారు. మొదట 20 శాతం జీపులను పరిశీలించాలని ఉన్న నిబంధనను నామమాత్రంగా పదిశాతం పరిశీలిస్తే చాలని మార్చేశారు. ఒప్పందం ప్రకారం 23 ఆగస్టు 1948న తొలి సరఫరా ప్రారంభమై 1948 డిసెంబర్ చివరినాటికి భారత్‌కు చేరుకోవాలి. 1948 డిసెంబర్ ఆరో తేదీన.. 1300 జీపులు భారత్‌కు బయలుదేరాయని.. దారిలో ఉన్నాయని వీకే కృష్ణమీనన్ భారత ప్రభుత్వానికి తెలియజేశాడు. కానీ 1949 మార్చిలో 155 జీపులు మాత్రం మద్రాసు ఓడరేవుకు చేరుకున్నాయి. అప్పటికి పాకిస్తాన్‌తో నెహ్రూ గారు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని రెండు నెలలు దాటిపోయింది. మూడేండ్లపాటు జీపులకు స్పేర్ పార్ట్స్ ఇవ్వాల్సిన కంపెనీ కేవలం పదిశాతం మాత్రమే ఇచ్చింది. గమ్మత్తేమిటంటే ఈ 155 జీపుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పనికొచ్చేది లేకపోవడం. ఈ జీపులను సైన్యం తిరస్కరించింది.

ఈ మధ్య కాలంలోనే కృష్ణమీనన్ లండన్‌కే చెందిన ఎస్‌సీకే ఏజెన్సీస్‌కు 1007 జీపుల కాంట్రాక్ట్ (ఒక్కొక్కటి 458 పౌండ్లు) పైన సంతకం చేశాడు. మొదట నెలకు 68 జీపులను సరఫరా చేయాలని ఒప్పందం చేసుకొన్న మీనన్ తరువాత దాన్ని 68 నుంచి 12 కు తగ్గించాడు. దీంతో ఆరు నెలలకు మనకు చేరేవి 72 మాత్రమే. చివరకు సదరు కంపెనీ కేవలం 49 జీపులను మాత్రమే సరఫరాచేసి చేతులెత్తేసింది. కంపెనీకి డబ్బులు మాత్రం ముట్టాయి.

కశ్మీర్ సంక్షోభం సమయంలోనే కృష్ణమీనన్ మరో కాంట్రాక్ట్‌పైన సంతకం చేశారు. ఈసారి రైఫిళ్ల సరఫరా కోసం. జేసీజే నాట్ అనే కంపెనీ నుంచి రైఫిళ్లను కొనడానికి 19,44,000 పౌండ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకొన్నాడు. కాంట్రాక్ట్ కుదుర్చుకొన్న పది రోజుల్లో రైఫిళ్ల సరఫరా ప్రారంభమై 120 రోజుల్లో పూర్తి కావాల్సి ఉన్నది. కానీ, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వారం రోజులకు ఈ రైఫిళ్ల ఒప్పందం రద్దయిపోయింది. ఎందుకంటే.. సదరు కంపెనీ ఒక్క రైఫిల్‌ను కూడా సరఫరా చేయలేదు కాబట్టి. ఈ మీనన్ ఇంతటితో తన వ్యాపారాన్ని ఆపలేదు. మరో రెండు కాంట్రాక్టులపైనా సంతకం చేశాడు. ఒకటేమో 25 మిషెల్ బాంబర్ల కోసం.. మరొకటి సాయుధ వాహనాల కోసం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈహెచ్ పాటర్ అనే క్యారెక్టర్. కృష్ణమీనన్ ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల్లోని నాలుగింటిలోనూ ఈ క్యారెక్టర్ ప్రతినిధిగా వ్యవహరించాడు. పాటర్‌తో కృష్ణమీనన్ చేసిన చివరి డీల్ ఏమిటంటే నాలుగు లక్షల పౌండ్ల విలువైన స్టీల్ ప్లేట్ల కొనుగోలు. ఇందులో లాభమే 1, 02, 000 పౌండ్లు.

దీనిపై దేశీయంగా పెద్ద గొడవ కావడంతో నెహ్రూ ప్రభుత్వం తట్టుకోలేక అనంతశయనం అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ పూర్తి సమాచారాన్ని సేకరించి ఒక నివేదిక రూపొందించి 1951 ఏప్రిల్ 9వ తేదీన నెహ్రూకు సమర్పించింది. ఈ నివేదికను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించి స్కాం జరిగినట్లు ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇద్దరు హైకోర్టు జడ్జిలతో పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరింది. 1954 డిసెంబర్ 18న తన నిర్ణయాన్ని పునః పరిశీలించాల్సిందిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీని నెహ్రూ ప్రభుత్వం అర్థించింది. పీఏసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో 30 సెప్టెంబర్ 1955న అప్పటి కేంద్ర మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ కృష్ణమీనన్ కేసును క్లోజ్ చేస్తున్నట్లు అర్ధంతరంగా ప్రకటించారు. తర్వాత ఓ నాలుగు నెలలు నెహ్రూ సైలెంట్‌గా ఉన్నారు. 1956 ఫిబ్రవరి 3న కృష్ణమీనన్ ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేని కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఏడాది తిరక్కుండానే ఆయన అద్భుతమైన పనితీరు రికార్డును గమనించి రక్షణ శాఖకు మంత్రిని చేశారు. ఏ సైన్యానికైతే అవసరమైన జీపులు, బాంబర్లు, స్టీల్‌ప్లేట్లు, సాయుధ వాహనాల కోసం వ్యాపారం చేశారో.. ఆ సైన్యానికి సంబంధించిన మంత్రిత్వ శాఖనే బహుమానంగా ఇచ్చారు. ఈయన గారి నేతృత్వంలోనే 1962లో మనం చైనాపై యుద్ధాన్ని ఓడిపోయాం.

ఇంతకీ ఈ కృష్ణమీనన్ నెహ్రూ తర్వాత అంతటి బలమైన శక్తిగా ఎలా ఎదిగాడు? ఎవరూ ప్రశ్నించలేని, పార్లమెంటరీ వ్యవస్థ కూడా ఏమీ చేయలేని అన్నింటికీ అతీతమైన వ్యక్తిగా ఎలా మారాడు? కారణం మరేమీ లేదు. బుర్రలు పెద్దగా బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. జవహర్‌లాల్ నెహ్రూగారి గారాలపట్టి ఇందిరాగాంధీ లండన్‌లో ఉన్నప్పుడు ఆమెకు ఈ కృష్ణమీనన్ గార్డియన్‌గా వ్యవహరించి అన్ని విషయాలను చక్కబెట్టారు. అంతేకాదు.. సదరు ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌గాంధీ డిగ్రీ చదువుకోవడం కోసం అయిదారేండ్లపాటు లండన్‌లో ఉన్నప్పుడు ఆయనకు కూడా ఈ కృష్ణమీననే గార్డియన్‌గా వ్యవహరించారు. ఈ కృష్ణమీనన్ గారి కాంస్య విగ్రహం ఇవాళ ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్ పక్కనే ఉన్నది. ఈ మీనన్ గారి విగ్రహం నిటారుగా నిలబడి.. ఎదురుగా ఉన్న ‘సేనా భవన్’నే తదేకంగా చూస్తూ ఉంటుంది. ఆ తరువాత నెహ్రూ గారి క్యాబినెట్‌లోనే హరిదాస్ ముంద్రా స్కాండల్ వంటివి వరుసగా జరిగాయి ఇవేవీ ఆయనకు పట్టలేదు. పైగా ఈ రకమైన కేసులను ఆయన సీరియస్‌గా తీసుకోలేదు కూడా. అయితే ఈ ముంద్రా స్కాండల్‌ను బయటపెట్టినవాడు ఫిరోజ్ గాంధీ. సొంత అల్లుడే పార్లమెంట్‌లో ప్రశ్నించడంతో ఆర్థిక మంత్రిగా ఉన్న టీటీ కృష్ణమాచారి చేత బలవంతంగా రాజీనామా చేయించాడు నెహ్రూ.

కోసల రాజ్యంలో మంత్రిగా ఉండటానికి మొదటి అర్హత లంచం తీసుకోకపోవటం. ధర్మానికి కట్టుబడకపోతే.. నేరం చేస్తే కొడుకునైనా సరే ఉపేక్షించకుండా శిక్షించే నైతిక విలువలు ఉన్న వ్యక్తిత్వం ఉండటం. దేశంలోని ప్రతి రాజ్య వ్యవస్థలోనూ అవినీతిని క్షమించరాని అతి పెద్ద నేరంగా పరిగణించారు. కఠినమైన శిక్షలు విధించారు. కొన్ని సందర్భాల్లో దేశ బహిష్కారం కూడా చేశారు. అలాంటి వారు తాము తప్పు చేయలేదని భావిస్తే తిరిగి తమను తాము నిర్దోషులుగా నిరూపించుకోవలసిందే తప్ప రాజ్యం బాధ్యత ఏమీ ఉండదు. దాదాపు అన్ని దేశాల్లోనూ కొద్ది మార్పులతో ఇదే రకమైన వ్యవస్థలు కొనసాగాయి. కానీ, దేశంలో మొదటి ప్రభుత్వంలోనే అదీ ఏర్పడిన నెలల కాలంలోనే విచ్చలవిడిగా ఒక వ్యక్తి తప్పులు చేస్తూ పోతే.. ఆ తప్పులకు సదరు వ్యక్తిని శిక్షించాల్సిన ప్రధానమంత్రి.. ఆ పని చేయకుండా.. నేరాన్ని అడ్డుకోకుండా.. నేరం చేసిన వ్యక్తిపై కనీసం దర్యాప్తు అనబడే విచారణ కూడా కొనసాగకుండా అర్ధంతరంగా కేసును మూసివేసి.. ఏకంగా ఏ విభాగానికి ద్రోహం చేశాడో ఆ విభాగపు మంత్రిత్వ బాధ్యతలను అప్పగించడం ఎంతటి ఏరకంగానూ సమర్ధనీయంకాదు.

వాస్తవానికి కృష్ణమీనన్ వ్యవహారం రాజ్యాంగ రూపకల్పనకు ముందే జరిగింది. రాజ్యాంగ రూపకర్తలు దీన్నొక అవకాశంగా తీసుకోవాల్సి ఉండింది. అవినీతి వ్యవహారాలను నిరోధించడానికి కఠినాతి కఠినమైన నిబంధనలను పొందుపరచాల్సిన బాధ్యత వారిపై కచ్చితంగా ఉన్నది. కానీ వారెవరూ ఆ దిశగా ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ప్రజాప్రాతినిథ్య చట్టమన్నదాన్ని ఒకటి పెట్టారు. అందులోనూ ఏమున్నది.. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేవారికి వయసెంత ఉండాలి.. భారత పౌరుడా కాదా? ఇట్లాంటి బయోడేటా నిబంధనలు పెట్టారే తప్ప.. అత్యున్నత శాసన వ్యవస్థలో భాగస్వామ్యం పంచుకోవడానికి ప్రజల ప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు ఏ చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలన్న నిబంధనలను పొందుపరచలేకపోయారు. అవినీతికి సంబంధించి చిన్న ఆరోపణ వచ్చినా.. అతను శాసనవ్యవస్థలో కూర్చోడానికి అర్హుడు కాదన్న చట్టం రాజ్యాంగ నిర్మాతలు చేయలేకపోయారు. మనదేశంలో రాజకీయ అవినీతి చేసినవాడు.. పార్లమెంట్‌లో కూర్చొని సుద్దులు చెప్తాడు. అదేమంటే.. ఆరోపణలు వచ్చాయే కానీ.. నిరూపణ కాలేదు కదా అంటారు. అవి నిరూపణ కావు. కోర్టులు తేల్చవు. నేరం రుజువయ్యేంతవరకూ నిందితుడు నేరస్థుడు కాదన్న ఓ   లాజిక్‌ను పట్టుకొని తాము సుద్దపూసలమని చెప్పుకొని తిరుగుతుంటారు. ఓ నాయకుడు లక్షలు లక్షలు లంచమిస్తూ ప్రత్యక్షంగా దొరికిపోతాడు. ఓ అధికారి కోట్లు కోట్లు ఇండ్లల్లో దాచుకొని దొరికిపోతాడు. వారిద్దరూ తాము నేరం చేయలేదనే చెప్తారు. ఆ నాయకుడు మళ్లీ ఎన్నికల్లో నిలబడి శాసన వ్యవస్థలో అడుగుపెడతాడు. ఈ అధికారి మరో పోస్టులోనో తిరిగి అదే పోస్టులోనో.. కొన్నాళ్ల విశ్రాంతి అనంతరం చేరుతాడు. అసలు.. అవినీతికి సంబంధించి నిందపడిన వెంటనే సహజంగానే అనర్హత వేటు పడేలా చట్టం ఉంటే.. నిర్దోషిత్వం నిరూపించుకొనే బాధ్యత నిందితుడిపైనే ఉంటే.. వ్యవస్థ గాడిలో నడిచేది కాదా? తమపై ఎలాంటి నిందరాకుండా ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించేవారు కాదా? రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆరోపణలు చేయడానికి సాహసించలేని నిజాయితీతో వ్యవహరించే నాయకత్వ నిర్మాణం ఈ దేశంలో జరుగకపోవడానికి నాటి పాలకులు, రాజ్యాంగ నిర్మాతలు కారణం కాదా?

కేవలం తన బిడ్డ, అల్లుడి ఆలనాపాలనా చూసుకొన్నందుకు ప్రతిఫలంగా జవహర్‌లాల్ నెహ్రూ.. అన్ని విలువలకూ వలువలిప్పేసి.. బరితెగించి కృష్ణమీనన్‌ను అందలమెక్కించి.. ఈ భారతదేశంలో ఒక బలమైన అవినీతి, అరాచక రాజ్యవ్యవస్థ నిర్మాణానికి చెక్కుచెదరని పునాది వేశాడు. ఇప్పుడది ఆదిశేషువై ఈ దేశాన్ని ఆవరించి కాటేస్తున్నది. యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రధానమంత్రే.. పరాయిదేశపు అధికారి (మౌంట్‌బాటన్) భార్య చేత సిగరెట్ వెలిగింపజేసుకొంటూ ఫొటోలకు పోజులిస్తే అది ఎలాంటి ఆదర్శం? అలాంటివాడు ఆధునిక భారత నిర్మాత ఎలా అయ్యాడు?

‘మనుజుడను నేను.. మనుజ ధర్మంబు నాది.. ఇల అధర్మంబు ఛాయ సహించను’ అని రాముడు స్పష్టంగా తన ధర్మాన్ని చెప్పాడు. అధర్మం నీడను కూడా సహించనన్నాడు. అందుకే ఆయన తరతరాలకు ఆదర్శమయ్యాడు. దేవుడయ్యాడు. మనం మాత్రం ఎక్కడున్నామో.. ఎవరికి వారు నిర్వచించుకోవాలి.

Exit mobile version