Site icon Sanchika

రామం భజే శ్యామలం-12

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి

తిక్కన్న శిల్పపు దెనుగుతోట

యెఱ్ఱన్న సర్వమార్గేచ్ఛావిధాతృండు

పోతన్న తెలుగుల పుణ్యపేటి

శ్రీనాథుడు రసప్రసిద్ధధారాధుని

కృష్ణరాయడనన్యకృతి పబ్రంధ

పెద్దన్న వడపోత పెట్టి నిక్షురసంబు

రామకృష్ణుండు సురారామగజము

ఒకడు నాచనసోమన్న యుక్కివుండు

చెఱిపి పదిసార్లు తిరుగవ్రాసినను యొక్క

వోని యీ యాంధ్ర కవిలోకమూర్ధమణుల

మద్గురుస్థానములుగ నమస్కరించి

రామాయణ కల్పవృక్షంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన పూర్వ కవుల స్మృతిపద్యమిది. ఒక ఇతిహాసానికి సంబంధించిన రచన చేస్తున్నప్పుడే రచయిత.. తన పూర్వకవులు చూపించిన మార్గాన్ని.. దర్శనాన్ని గుర్తుచేసుకొని.. ప్రేరణ పొంది రచన ప్రారంభించిన సన్నివేశం. నన్నయ్యనుంచి తిక్కన్న నుంచి కూడా ఈ దేశంలో ఇది ఒక అవిచ్ఛిన్న సంప్రదాయంగా వస్తున్నది. గతం అన్నది మన చరిత్ర. భవిష్యత్తులోకి మనం వెళ్లడానికి వర్తమానంలో ఉత్ప్రేరకంగా ఉపయోగపడేది ఈ గతం. ఈ గతాన్నే మరిచి.. చరిత్రను మరుగున పడవేసి.. అంతకు ముందున్న వాఙ్మయాన్ని అంతా నిర్ద్వంద్వంగా తిరస్కరించి.. ఇక్కడి బృహన్నిర్మాణాలను పక్కనపెట్టి, శాసనాలను మట్టిదిబ్బల్లో పారవేసి.. ఎవడో బయటిదేశంవాడు ఏదో చెప్తే, ఏదేదో రాసేస్తే, ఇదే నీ చరిత్ర అంటే.. దాన్ని మనం పాఠాలు చేసుకొని.. మనం బానిసలం.. మనకు చరిత్ర లేదు. సంస్కృతి లేదు. మనకు తిండి తినడం కూడా ఎవడో వచ్చి నేర్పాడు.. అని వల్లెవేసుకుంటూ బతుకుతున్న జాతి ఏదైనా ఉన్నదా అంటే.. ఇవాళ భారతజాతే.. సోకాల్డ్ హిస్టారియన్లు భారత జాతి అన్న పదాన్ని కూడా అంగీకరించరు. ఎందుకంటే.. అలా అంగీకరించాల్సి వస్తే.. అంతకుముందున్నవన్నింటినీ అంగీకరించాల్సి వస్తుంది. అలా అంగీకరిస్తే.. తుర్కిజాలు, క్రీస్తిజాలు, మార్క్సిజాలు అన్నీ కొట్టుకుపాతాయి. కాబట్టి ఈ సారస్వతాన్ని.. ఈ ఆనవాళ్లని కాలగర్భంలో ఎవరికీ అందనంత లోతుల్లోకి పాతరపెట్టాలి. ఈ పనిని బ్రిటిష్ వాడు మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్వతంత్ర భారతంలో తొలి ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా కొనసాగించింది. ఒక స్వతంత్రజాతిగా భారతదేశం 1947 ఆగస్టు 15న అవతరించిన క్షణం నుంచి ఆ స్వతంత్రతను కోల్పోయింది. భారత్ అనే మాటకు ఒక జాతి అనే భావనను నిర్వచించకుండా.. ఒక మతానికి సంబంధించిన పదంగా మార్చివేయడంతోనే కుట్ర మొదలైంది. జాతీయత అన్న భావన ఈ దేశ చరిత్ర, సంస్కృతుల నుంచి ఉద్భవించిందే తప్ప మరొకటికాదు. జాతీయ వాదమంటే ఈ దేశానికి, సమాజానికి, సంస్కృతికి, చరిత్రకు సంబంధించిన అంశమే కానీ, మతంతో ముడిపడిన అంశం కాదన్న అవగాహనారాహిత్యం.. జాతి వ్యతిరేక శక్తులు పెచ్చరిల్లడానికి దోహదపడింది.

జాతీయ వాదం అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఇప్పటివరకూ ఎవరూ చర్చించని అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి ఉన్నది. ప్రపంచంలో సామ్రాజ్యవాదులున్నారు.. కమ్యూనిస్టులు ఉన్నారు. ఫిడెల్ క్యాస్ట్రో, నెల్సన్ మండేలా, మావో, లెనిన్, స్టాలిన్.. యాసర్ ఆరాఫత్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు. వీళ్లంతా కమ్యూనిస్టులే. కానీ.. ఇక్కడ ఒక తేడా ఉన్నది. వీళ్లు ముందుగా జాతీయవాదులు. తమ దేశానికి సంబంధించిన వ్యతిరేక భావాలను ప్రతిఘటించినవారు. తమ దేశంలో.. తమ దేశానికి, తమ సమాజానికి అనుకూలమైన సామ్యవాద సాధనకోసం పరితపించినవారు. వీళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. అది నియంతృత్వం కావచ్చు.. అనార్కిజం కావచ్చు.. ఊచకోతలకు కూడా పాల్పడ్డవారున్నారు. మండేలా వంటివారు అహింసామార్గంలో 27 ఏండ్లు జైల్లో ఉండి ఉద్యమించారు. వీళ్లలో ప్రతి ఒక్కరు కూడా తమ దేశం, జాతి విమోచనం కోసం ముందుగా శ్రమించిన తర్వాతే.. ప్రపంచం గురించిన ఆలోచన చేశారు. ప్రపంచమంతటా కమ్యూనిజం తేవాలంటూ వాళ్ళు మాట్లాడి ఉండవచ్చు. తమ అనుభవాలను గుదిగుచ్చి పుస్తకాలు వెయ్యొచ్చు. కానీ తరచి చూసినప్పుడు వీళ్లందరిదీ వారి వారి దేశాల, సమాజాల సంస్కృతి, చరిత్ర మూలాల్లోంచి పుట్టుకొచ్చిన జాతీయ సామ్యవాదమే. ఒక్క మనదేశంలోనే ఇందుకు భిన్నమైన మార్గం కనిపిస్తుంది. మనదేశంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లలో నెహ్రూ సోవియట్ కమ్యూనిస్టు అయితే, నేతాజీ జాతీయవాద కమ్యూనిస్టు. జాతి ప్రయోజనాలే ప్రధానంగా ఆయన కాంగ్రెస్‌లో ఉన్నా, తర్వాత ఆయుధం చేపట్టినా, మిలటరీ ఆపరేషన్‌కు సిద్ధపడ్డా.. జాతి యావత్తూ ఆయన్ను సొంతం చేసుకొన్నది. వీరుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది.

స్వాతంత్య్రానంతరం ఈ జాతీయవాదం మన కమ్యూనిస్టులకు లేకుండా పోయింది. గాండ్రించు రష్యా, గర్జించు రష్యా.. అన్నారే తప్ప గాండ్రించు భారత్.. గర్జించు భారత్ అనడానికి వీళ్ల కలాలు నోళ్లు పనిచేయలేదు. హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య అనంతరం స్వతంత్ర కమ్యూనిస్టు దేశంగా హైదరాబాద్‌ను సాధించడం కోసం మన దేశంలో ఒక వర్గం రష్యా వెళ్లి స్టాలిన్‌ను కలిస్తే.. ఆయన వాళ్లతో ఇలా అన్నాడట.. ‘మా దేశంలో మాకు ప్రజలు సహకరించారు. సమాజం మమ్మల్ని సొంతంచేసుకొన్నది. సైన్యం మా పక్షాన నిలిచింది. మీ దేశంలో ఆ పరిస్థితులు లేదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలే తప్ప మరేమీ చేయలేరు. మీకు సాధ్యం కాదు’ అని చెప్పి తిరుగుటపాలో పంపించాడట. ఇది తెలుగువాళ్ల కమ్యూనిస్టు రికార్డుల్లో ఉన్న ముచ్చటే. మన తెలుగువారి విషయానికే వస్తే.. చైనా యుద్ధం చేసినప్పుడు శ్రీశ్రీ వంటివాళ్లు మౌనముద్ర వహించారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే.. జాతీయ భావనలు వ్యక్తంచేసే కమ్యూనిస్టులందరినీ ఆ పార్టీ.. తిరస్కరించింది. పక్కనపెట్టింది. మరపునకు తెచ్చింది. అందుకే తమ అస్తిత్వం కోసం శ్రీశ్రీ లాంటివారు మౌనంగా ఉన్నారు. జాతీయవాదం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ నాలుగు ముక్కలు రాయాల్సి వచ్చింది. ఈ చరిత్ర చెప్పుకుంటూ పోతే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది.

ఈ సందర్భంలో మరో సంఘటన స్మరించుకోవాల్సివుంటుంది. రమేష్ చంద్ర మజుందార్ అంటే ఎవరికీ తెలియక పోవచ్చు కానీ ఆర్ సీ మజుందార్ అనగానే గుర్తుపడతారు. ఈయన ఎడిట్ చేయగా భారతీయ విద్యాభవన్ ప్రచురించిన భారత దేశ చరిత్ర సంస్కృతి పుస్తకాలు ఈనాటికీ ప్రామాణిక పుస్తకాలే. 1948లో భారత ప్రభుత్వం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను రాసేందుకు విద్యా శాఖా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఎడిటర్లను నియమించింది. ప్రొఫెసర్ మజుందార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. కానీ, స్వతంత్ర్య పోరాటం కాంగ్రెస్ పార్టీ తో ఆరంభమయిందని రాయాలని ప్రభుత్వం, 1857 పోరాటం మూలమని, బెంగాల్ విభజన ప్రేరణ అనీ మజుందార్ ల నడుమ భేదాభిప్రాయాలు పొడచూపాయి. కాంగ్రెస్ కు తప్ప మరెవరికీ ప్రాధాన్యం ఇవ్వకూడదన్నది అప్రకటిత నియమం. ఈ నియమానికి మజుందార్ ఒప్పుకోకపోవటంతో 1955లో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఒక సంవత్సరం తరువాత ప్రాజెక్ట్ ఒకే వ్యక్తి డాక్టర్ తారాచంద్ కు అప్పచెప్పారు. ఆయన ప్రభుత్వం దృష్టిని చరిత్రగా ప్రచురించారు. దాంతో తన రీసెర్చ్ ఫలితాలను హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం మూవ్మెంట్ అని మూడు వాల్యూముల్లో ప్రచురించారు మజుందార్. తన పుస్తకానికి ముందుమాటలో మజుందార్ కుండ బ్రద్దలు కొట్టారు. తన రీసెర్చ్ ని తిరస్కరించింది బోర్డ్ కాదని, ప్రభుత్వమనీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వైపు వేలుచూపించాడు. చరిత్ర రచనలో ప్రభుత్వం జోక్యాన్ని తీవ్రంగా నిరసించాడు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే స్వాతంత్ర్యానంతరం మన చరిత్ర నిర్మాణం అంతా కమ్యూనిస్టు దృక్పథంతోనే, ప్రభుత్వ జోక్యంతో దేశాన్ని పాలిస్తున్న పార్టీకి అనుకూలంగానే జరిగింది తప్ప భారతదేశం అన్న భావనతో జరుగలేదు.శాస్త్రీయత అంటే మార్క్సిజం అన్న పదానికి ప్రత్యామ్నాయంగా నిర్వచించారు.

ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ), నేషనల్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్టీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఈపీఏ), నేషనల్ కౌన్సిల్ ఫర్ హిస్టరీ రీసర్చ్ (ఐసీహెచ్‌ఆర్).. వంటి ఉన్నతస్థాయి సంస్థలు భారత చరిత్ర, విద్య, సంస్కృతికి పట్టుగొమ్మలుగా ఉండాల్సినవి. కానీ, కామ్రేడ్ నెహ్రూ సారథ్యంలో ఈ సంస్థలన్నింటిలో ఈ దేశానికి సంబంధించిన మూలాల తిరస్కృతులు, ఈ దేశ అస్తిత్వ వ్యతిరేకులు, పాశ్చాత్య, సామ్రాజ్య, సామ్యవాద సిద్ధాంతకర్తలు యాభై ఏండ్లపాటు పీఠం వేసుకొని కూర్చొని.. తమ చిత్తం వచ్చినట్లు ఈ దేశ చరిత్రను రాసిపారేశారు. వీరిలో ఎక్కువమంది స్వతంత్రంగా ఆలోచించడానికి భయపడేవారు, అధికార భావాలకు కిమ్మనకుండా తలొగ్గే బలహీనురు, వలసపాలకుల మేధను తమదిగా చేసుకొని తమ నడకను, నడతను మార్చుకొన్నవారే. నట్వర్‌ఝా, డేవిడ్ ఫ్రాలే, ఆర్‌సీ మజుందార్, శ్రీకాంత్ తలగేరి, సీతారామ్ గోయెల్ వంటివారు స్వతంత్రంగా ఆలోచించినా, ప్రభుత్వపరంగా వారికి లభించిన ఆదరం నిండు సున్న. వీళ్లను చరిత్రకారులనడం కంటే.. కూడా.. పొలిటికల్ డిపెండెంట్స్ అనడం సబబేమో. వీరికే పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు, విభూషణ్‌లు కూడా వస్తాయి. మహామహా మేధావులుగా చెలామణి అవుతారు కూడా.

నేను చరిత్రకారుణ్ణి కాను. కానీ, నాకున్న పరిజ్ఞానం మేరకు ఏ దేశమైనా తమ దేశ విజయాలను ప్రచారం చేసుకోవడానికి, తమ జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి చారిత్రక ఘటనలను వాస్తవాలతోపాటు అత్యుక్తులు, అతిశయోక్తులు జోడించి చెప్పుకోవచ్చు. కానీ, మనదేశంలో మాత్రమే.. ఇందుకు భిన్నంగా మారింది. మనకు కింద ఉన్న శ్రీలంక కూడా రావణుడి లంక తమదేనని ఢంకా బజాయించి చెప్పుకుంటోంది. గత పాతిక సంవత్సరాల కాలంలో రావణ లంక తమదేనని చూపడానికి అనేక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించి.. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసింది. చరిత్ర పుస్తకాలు రచించింది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేసుకుంటున్నది. మనం మాత్రం మన చరిత్రను సంపూర్ణంగా తిరస్కరిస్తాం. కండ్లముందు కనిపించేవాటిని కూడా మిథ్య అనే రకాలు మన చరిత్రకారులు. శాస్త్రీయత అలియాస్ మార్క్సిజం ప్రమాణాల ప్రకారం ఉన్నవాటినే చరిత్ర అంగీకరిస్తారు. లేకపోతే అన్నీ పుక్కిటి పురాణాలు.. మూఢ నమ్మకాలు.. మతోన్మాదాలు.

ఫలితం ఏమైందంటే.. అసలైన శాస్త్రీయ మార్గాలను అనుసరించి రాయాల్సిన చరిత్రను సైద్ధాంతిక ప్రాతిపదికన కొత్తగా లిఖించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత ఘనమైన వారసత్వ సంపద ఉండి కూడా మన విద్యార్థులు మన దేశ చరిత్రపైనే సిగ్గుపడేలా తయారయ్యారు. ఇది పొరపాటు వల్ల జరిగింది ఎంతమాత్రం కాదు. మెకాలే తయారుచేసిన మెకాలేయిట్లు వాడి మేధస్సుతో ఆలోచించి సృష్టించిన విధ్వంసరచన ఇది.

భారతదేశ చరిత్ర పునర్మూల్యాంకనం గురించి జరిగిన ప్రయత్నాల్లో మొదటిది 1910లో జరిగింది. అప్పటివరకు బ్రిటిష్ వలసవాద ధోరణి, పాశ్చాత్య దృక్పథంతో కొనసాగుతూ వస్తున్న చరిత్ర రచనకు కౌంటర్‌గా భారత సంశోధక ఇతిహాస మండలి (బీఎస్‌ఐఎం) ఏర్పడింది. ఈ సంస్థను పుణె నగరంలో ఆనాటి ప్రముఖుల్లో ఒకరైన విశ్వనాథ్ కాశీనాథ్ రాజ్‌వాడె, మరో ప్రముఖుడు కేసీ మెహండలె సహకారంతో స్థాపించారు. అప్పటికి గాంధీ, నెహ్రూల ప్రాబల్యం పూర్తిస్థాయిలో జాతీయోద్యమానికి అంటుకున్నట్టులేదు. 1917లో ఆర్జీ భండార్కర్.. భండార్కర్ ఓరియంటల్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. 1919లో మొట్టమొదటి ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ పుణెలో భండార్కర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించింది. ఈ సదస్సు ముఖ్యంగా ప్రాచీన భారత చరిత్ర.. నిర్మాణంపై లోతుగా చర్చించింది. దీనిపై కార్యాచరణ ఆ తరువాత ఒక రూపంలోకి రాలేదు. 1935లో పుణెలోని పరుశురాంభావ్ కళాశాలలో బీఎస్‌ఐఎం మొదటి హిస్టరీ కాంగ్రెస్‌ను నిర్వహించింది. ఈ సదస్సుకు 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. చరిత్రకారుడు షాఫాత్ అహ్మద్ ఖాన్ హిస్టరీ కాంగ్రెస్ లక్ష్యాలను వివరించారు. శాస్త్రీయ పద్ధతిలో చరిత్రను రాసుకోవడం ఎలా అన్నదానిపై ఈ సదస్సు చర్చించింది. పక్షపాతం లేకుండా చరిత్రను రాయాలో చర్చించారు.

ఈ చర్చలు చర్చలుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత చరిత్రకారుడు మహమ్మద్ హబీబ్, ఆ తర్వాత నూరుల్ హసన్, రోమిలాథాపర్, ఇర్ఫాన్ హబీబ్ (మహమ్మద్ హబీబ్ కొడుకు) వీళ్లంతా దశాబ్దాల తరబడి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను, ఐసీహెచ్‌ఆర్‌ను ఏలుకున్నారు. ఈ మహమ్మద్ హబీబ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. వేలాది భారతీయుల దారుణాతి దారుణమైన ఊచకోతలకు కారణమైన ముస్లిం రాజుల అరాచకాన్ని చరిత్రనుంచి పూర్తిగా వైట్‌వాష్ చేసిన తొలి చరిత్రకారుడు. ఆ తరువాత వచ్చిన మార్క్సిస్ట్ లేదా వామపక్ష వాద పాంఫ్లెటర్లంతా మహమ్మద్ హబీబ్ చెప్పింది చెప్పినట్టుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ మహమ్మద్ హబీబ్ భార్య సొహైలా త్యాబ్జీ (బద్రుద్దీన్ త్యాబ్జీ మనవరాలు) ఓరియంటల్ నేషనల్ కాంగ్రెస్‌కు తొలి ముస్లిం అధ్యక్షురాలుగా వ్యవహరించారు. ఆక్స్‌ఫర్డ్ విద్యార్థి అయిన హబీబ్, కరడుగట్టిన ఇస్లాం మతతత్త్వవాది మౌలానా మహ్మద్ అలీ ప్రభావంలో పడిపోయాడు. ఈ అలీ ఎవరో కాదు.. ఖిలాఫత్ ఉద్యమ రూపకర్త. జిహాద్ పేరుతో మలబార్ హిందువుల ఊచకోతకు కారకుడు, ప్రేరకుడు అయినవాడు. వాస్తవంగా ఈ మహమ్మద్ హబీబ్ చరిత్ర మనకు 1926 నుంచి ప్రముఖంగా కనిపిస్తుంది. ఇతను యూపీ లెజిస్లేటివ్‌కౌన్సిల్‌కు సభ్యుడిగా స్వరాజ్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. (స్వరాజ్ పార్టీ అసలు పేరు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ) ఈ పార్టీని 1923 జనవరి 1న మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్‌దాస్ కలిసి ప్రారంభించారు. దీని తరఫునే మహమ్మద్ హబీబ్ యూపీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు. తద్వారా మహమ్మద్ హబీబ్ మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్‌లాల్ నెహ్రూతో స్నేహం బలపడింది. ఈ స్నేహం ఎంతగా మారిందంటే.. హబీబ్ ఏం చేసినా చెల్లుబాటైపోయింది. మహమ్మద్ హబీబ్ ఈ దేశ చరిత్రలో ముస్లిం రాజుల దాడులను.. అనంతరం బ్రిటిష్ చొరబాటును భారతీయుల వైఫల్యం వల్ల మాత్రమే జరిగినవని.. దాడి చేసినవారి తప్పిదం ఏదీ లేదని చెప్పటం ప్రారంభించాడు.

ఘజనీ నుంచి ఔరంగజేబ్ వరకు సెక్యులరిస్టులని నిరూపించడానికి చరిత్రనే సమూలంగా వక్రీకరించాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉంటూ భారతదేశంలో ముస్లింల కాలంనాటి నాణాలు, ఫర్మానాలు, పరిపాలనకు సంబంధించిన డాక్యుమెంట్లు, మౌఖిక ఉత్తర్వులు.. ఇలా ముస్లిం రాజులకు సంబంధించిన అనేకానేక చారిత్రక అంశాలకు స్వవ్యాఖ్యానాలు చేశాడు. ఆ కాలం నాటి దాడులు, దోపిడీలు, మారణకాండలు, ఊచకోతలు, అత్యాచారాలు, మతమార్పిళ్లు.. ఇలాంటివాటన్నింటికీ సరికొత్త భాష్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. ముస్లిం రాజులు సెక్యులర్ రాజులుగా అభివర్ణించాడు. అసలు వారికి మతోన్మాదం అంటే ఏమిటో తెలియనేలేదని చెప్పుకుంటూ వచ్చాడు. మహమ్మద్ హబీబ్ చేసిన కొన్ని సూత్రీకరణలు ఇవి..

  1. భారతదేశంలో ఇస్లాం చొరబడలేదు.
  2. భారతదేశంపై దండెత్తివచ్చిన రాజులపై ఇస్లాం ప్రభావం ఎంతమాత్రం లేదు.
  3. భారతదేశంలో ఇస్లాంలోకి బలవంతంగా హిందువులను మార్చారన్న వాదన పూర్తిగా అబద్ధం.
  4. ఎందుకంటే భారత్‌లోని ‘కింది కులాల’ వారు బ్రాహ్మణుల అణచివేతనుంచి తప్పించుకోవడానికి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన ఇస్లాంను స్వచ్ఛందంగా, ఆనందంగా స్వీకరించారు.
  5. భారతదేశంలో నిజమైన సామాజిక సమానత్వాన్ని ఇస్లాం ప్రవేశపెట్టింది. ఇస్లాం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛను ప్రసాదించిన ఒక శక్తి. అందువల్లనే లక్షల మంది హిందువులు ముస్లిం రాజుల కోసం రాజభవనాలను నిర్మించారు. లక్షలాది మసీదులను నిర్మించారు.
  6. ఔరంగజేబు సామ్రాజ్యం ఆర్థిక సంక్షోభం వల్ల కూలిపోయిందే తప్ప హిందువుల పారిశ్రామిక వ్యవస్థలపై అణచివేత అన్నది కారణం కాదు. అది అబద్ధం.

1940 నాటికి కరుడుగట్టిన ఇస్లామిస్ట్‌గా ఉన్న హబీబ్.. మావో జెడాంగ్ ప్రభావంతో వీర కమ్యూనిస్టుగా కూడా మారిపోయాడు. అక్కడినుంచి తన రచనలకు ఇస్లాం, కమ్యూనిస్టు కలగలసిన రంగు పులమడం ప్రారంభమైంది. అప్పటికే జవహర్‌లాల్ నెహ్రూ గారు మహమ్మద్ హబీబ్ స్నేహంలో తలమునకలై ఉన్నారు. హబీబ్ తన థర్డ్ రేట్ హిస్టరీ పాండిత్యాన్ని నెహ్రూ ముందు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. 1932 జూన్1 న నెహ్రూ తన పదిహేనేండ్ల కూతురు ఇందిరాగాంధీకి రాసిన ఈ లేఖ ఒక మచ్చు తునక.

Mahmud of Ghazni…was hardly a religious man… He was a Mohammedan, of course, but that was by the way. Above everything he was soldier, and a brilliant soldier. He came to India to conquer and loot, as soldiers unfortunately do, and he would have done so to whatever religion he might have belonged.

జవహర్‌లాల్ నెహ్రూ రాసిన ఫాంటసీ రచన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ముస్లిం కాలానికి సంబంధించి చరిత్ర మొత్తం కూడా మహమ్మద్ హబీబ్ ప్రభావంతో రాసిందే. ఈ విషయాన్ని ఆ తర్వాత మహమ్మద్ హబీబ్ స్వయంగా చెప్పుకున్నాడు కూడా. ప్రఖ్యాత చరిత్రకారుడు సీతారాం గోయెల్ 1959లో అలీగఢ్ వెళ్లి హబీబ్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని స్పష్టంగానే చెప్పాడు.

I was told by (Mohammed Habib) with considerable pride that Nehru had learnt the history of medieval India “at his feet.” I have yet to meet a more arrogant man whose manners were uglier than his syphilitic face. He was an ardent admirer of Stalin’s Russia and Mao’s China. He lost his temper and asked me to “go away” when I told him that I did not accept Lenin’s theory of the state.

ఈ దేశంలో చొరబడ్డ మొదటి ముస్లిం చొరబాటుదారు ఘనీ గురించి హబీబ్ వ్యాఖ్యానం చూడండి.

  1. It was impossible that the Indian temples should not sooner or later tempt someone strong and unscrupulous enough for the impious deed. Nor was it expected that a man of Mahmud’s character would allow the tolerance which Islam inculcates to restrain him from taking possession of the gold…when the Indians themselves had simplified his work by concentrating the wealth of the country at a few places.
  2. Face to face with the social and economic provisions of the Shariat and the Hindu Smritis, as political alternatives, the Indian city-worker preferred the Shariat.
  3. (The Ghorian conquest)…was not a conquest properly so-called. This was a turn-over of public opinion—a sudden turn-over, no doubt, but still one that was long overdue.
  4. The so-called Ghorian conquest of India was really a revolution of city labour led by Ghorian Turks.
  5. Indian city labour, both Hindus and Muslims helped to establish the new (Muslim) regime and it also maintained it, through all revolutions and revolts for over 500 years.

ఈ మహమ్మద్ హబీబ్ 1947 డిసెంబర్‌లో బాంబేలో జరిగిన హిస్టరీ కాంగ్రెస్ లో మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల చరిత్రను శత్రుభావంతో కాకుండా సానుకూల దృక్పథంతో రాయాలని పేర్కొన్నాడు. బ్రిటిష్ వాళ్లు ఇండియాను ఆక్రమించుకున్నారంటే అందుకు కారణం భారతీయులే కానీ, ఆంగ్లేయుల తప్పేం లేదని కూడా స్పష్టంగానే చెప్పాడు.

The history of the British period can now be written, and it is to be hoped that it will be written without enmity or resentment— that all defects of Indian character and Indian institutions, which made the foreign rule possible, will be frankly confessed and every element of value that we have received from the British will be gratefully recognised. The material for it in this country, though not complete, is both extensive and unexplored.

ఇది మహమ్మద్ హబీబ్ స్వతంత్ర భారతదేశంలో చరిత్ర నిర్మాణానికి వేసిన పునాది. ఆ తర్వాత ఆయన కొడుకు భారత చరిత్ర పరిశోధన మండలిని ఆక్రమించుకొన్నాడు. వీళ్ల గురించి ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌శౌరి తన ‘ఎమినెంట్ హిస్టారియన్స్’ అన్న గ్రంథంలో సవివరంగానే చెప్పుకొచ్చారు. చరిత్ర మూల్యాంకనం అన్నది మేధారంగం. దీనిపై ఒక వర్గం ఏండ్లతరబడి గుత్తాధిపత్యం వహిస్తూ.. మొఘలులకు ముందున్న చరిత్రకు దాదాపు ప్రాధాన్యమే లేకుండా చేశారు. హిందువులు నోరుమూసుకొని ఉండటానికి బౌద్ధం అవసరమొచ్చింది కాబట్టి గుప్తుల కాలాన్ని మాత్రం బతకనిచ్చారు. ఇందులోనూ విధ్వంసక చక్రవర్తి అశోకుడు వీరికి అత్యంత ప్రేమాస్పదుడయ్యారు. ఇందులో మహమ్మద్ హబీబ్ కొడుకు ఇర్ఫాన్ హబీబ్ అండ్‌ కో ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోయింది. చరిత్ర పరిశోధనలకోసం ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ అడ్డగోలుగా దిగమింగేయడమే పనిగా పెట్టుకొన్నారు. భారతదేశంలో అత్యంత దిగజారిన.. పాలకులచేత ఇగ్నోర్ చేయబడిన అనైతిక స్కాం ఏదైనా ఉన్నదంటే.. అది ఐసీహెచ్‌ఆర్‌లో జరిగినవనే చెప్పాలి. ఇది నేను చెప్తున్నదేం కాదు. అరుణ్‌శౌరి స్వయంగా వెల్లడించిన సంచలనాత్మక నిజాలు..

అందులో శౌరి పేర్కొన్న రెండు ఘటనలు చూడండి. భారత దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను స్వీకరించిన ఇర్ఫాన్ హబీబ్ గారి గొప్పతనం ఏమిటో ఒక అవగాహన కలుగుతుంది. 1975లో పరమాత్మ శరణ్ అనే ఓ పెర్షియన్ స్కాలర్ ‘తారిఖ్ ఇ అక్బర్’ అని 16 వ శతాబ్దానికి చెందిన పెర్షియా గ్రంథానికి తాను చేసిన అనువాదాన్ని ప్రచురించడానికి ఐసీహెచ్‌ఆర్ సహకారాన్ని కోరుతూ సమర్పించాడు. ఈ గ్రంథం మహమ్మద్ ఆరిఫ్ కాందహారీ అనే ఆయన రాశాడు. అక్బర్ తొలిదశ పాలన కాలపు రికార్డు ఇది.

ఐసీహెచ్‌ఆర్‌లో ఈ గ్రంథం తప్పిపోయింది. అప్పుడంటే కంపూటర్లు, జిరాక్సు కాపీలు తీసుకొనే ఫెసిలిటీలు లేకపాయె. ఐసీహెచ్‌ఆర్‌లో ఈ పరిశోధకుడు ఎన్నిసార్లు అడిగినా.. సమర్పించడం జరిగింది. కనపడటంలేదు అంటూ సమాధానం వచ్చింది. చివరకు తన రచనను చూసుకోకుండానే పరమాత్మ శరణ్ పరమపదించారు. సీన్ కట్ చేస్తే.. 1993లో ఐసీహెచ్‌ఆర్ డిప్యూటీ డైరెక్టర్ తన్సీమ్ అహ్మద్ పేరుతో ఇదే పుస్తకం యథాతథంగా (ఆయన సొంత డాక్టరల్ వర్క్‌గా) అచ్చయింది. దీనికి రచయితను కొనియాడుతూ ఇర్ఫాన్ హబీబ్ ముందుమాట రాశారు.

What it (Tarikh-i-Akbari) needed was a full-scale English translation. This has been provided by Dr Tasneem Ahmad in a very competent manner, aiming at faithful accuracy and at a critical assessment of the information here received by comparing it with that offered by other sources…[it is a] notable contribution to the national celebration of the 450th anniversary of Akbar’s birth. I feel confident that it would reinforce the interest in Akbar’s age widespread among those who have a care for the long process of the creation of a composite culture and a unity that together constitute what is India.

ఈ గ్రంథానికి తన్సీమ్ అహ్మద్‌కు పీహెచ్‌డీ వచ్చింది. రెండో ఘటన మరొకటి ఉన్నది. ఇది నేరుగా ఇర్ఫాన్ హబీబ్‌కు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అంశం. 1972లో ఐసీహెచ్‌ఆర్‌ను స్థాపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిధులతో ప్రతిష్ఠాత్మకంగా ‘టువర్డ్స్ ఫ్రీడమ్’ అన్న ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం 9 వాల్యూమ్‌లలో గ్రంథస్థం చేయాలని లక్ష్యం పెట్టుకొన్నది. ఐసీహెచ్‌ఆర్ చరిత్రలో ఈ రోజుకు కూడా పూర్తికాని ప్రాజెక్టు ఏదైనా ఉన్నదా అంటే ఇదేనని చెప్పాలి. దీనిపై ఎన్ని కోట్లు ఖర్చయ్యాయో.. కానీ.. ఒక్కటంటే ఒక్క వాల్యూమ్ కూడా బయటకు రాలేదు. ఈ ప్రాజెక్టులో బిపిన్ చంద్ర, ఇర్ఫాన్ హబీబ్, కేఎం శ్రీమాలి, ప్రొఫెసర్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఇర్ఫాన్ హబీబ్, శ్రీమాలి ఒక్కటంటే ఒక్క మాన్యుస్క్రిప్ట్ సమర్పించలేదు. చివరకు అన్ని వైపులనుంచి విమర్శలు రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు హబీబ్ ప్రకటించి గప్‌చుప్ అయ్యాడు. 2015జూలై 16 న వచ్చిన ఒక న్యూస్ రిపోర్ట్ చదవండి.

Have you ever heard of any government spending almost 40 lakh on a book? Or a book project going on for 43 years, and counting, with crores of rupees spent on it? All this and more has been happening at the Indian Council of Historical Research (ICHR), an autonomous academic body funded by the government of India. It spends liberally to produce books in the name of ‘Special Research Projects’. And these special research projects, which should be wrapped up within a few years for only a few lakhs of rupees, drag on for decades and bleed taxpayers of crores. Among the defaulting historians are the late Bipan Chandra, Irfan Habib and KM Shrimali. Prof Chandra, a formidable scholar of modern Indian history, is the sole reason why the ‘Towards Freedom’ project, which started in 1972, is still continuing. The ICHR’s oldest, costliest and the most controversial project continues to bleed the public exchequer. It provoked Arun Shourie to write “Eminent Historians” in 1998, and he accused ICHR of spending 1.70 crore on the project. As for [Irfan] Habib and Shrimali, they have not submitted a single manuscript for the ‘Dictionary of Social, Economic and Administrative Terms in Indian/South Asian Inscriptions’ project, which was started in 1989… This project has so far soaked up more than 42 lakh.

Shrimali has not produced a single volume to date. All he has to show for all these years is a few thousand computerised cards compiled by hired assistants who get paid by ICHR Habib’s record is worse. If the annual reports are to be believed, he has been promising to submit his manuscript since 2006-07 When Mail Today enquired about the stage of Prof Habib’s work, the ICHR informed that “Habib saab has excused himself from this project”.

ఇక్కడితో ఆగిందా అంటే అదీ లేదు. జనరల్‌గా ఒక ప్రాజెక్టు చేపడితే దానికి ఒక కాలపరిమితి ఉంటుంది. రెండేండ్లో, అయిదేండ్లో దాని పరిశోధన స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. కానీ, ఇర్ఫాన్ హబీబ్ సాహెబ్ గారు చేపట్టిన ప్రాజెక్టులు ఏవీ కూడా ఎప్పటికీ పూర్తికావు. లక్షలు లక్షలు మాత్రం ఖర్చవుతూంటాయి. 198788లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాంగ్రెస్ రాస్తానని ఐసీహెచ్‌ఆర్‌లో ప్రాజెక్టును ఓకే చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు కాలపరిమితి ఒక సంవత్సరం. దానికి కేటాయించిన నిధులు అక్షరాలా 75 లక్షలు. 1998లో అరుణ్‌శౌరి ఐసీహెచ్‌ఆర్‌ను ఈ ప్రాజెక్టు గురించి అడిగారు. అప్పటికి దాదాపు 27 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇర్ఫాన్ సాహెబ్‌కు 57,500 రూపాయలు ముట్టాయి. మరో 17,500 ముట్టలేదు. ఎందుకంటే ఆయన ఒక్క అక్షరం కూడా రాయలేదు. ఒక్క పేజీ కూడా ఐసీహెచ్‌ఆర్‌కు సమర్పించలేదు. మిగిలిన సొమ్ము వస్తే ఏమి.. రాకుంటే ఏమి అనుకున్నారేమో.. అరుణ్‌శౌరి అడిగిన ప్రశ్నకు ఐసీహెచ్‌ఆర్ నుంచి వచ్చిన సమాధానం ఏమిటంటే ‘formal manuscript in this regard is yet to be received” అని.

మన చరిత్ర నిర్ధారక పెద్దలు, తాము నిజాన్ని చూదరు, వేరేవారు చూపిస్తే ఒప్పుకోరు. చెప్పనివ్వరు. ఆర్ కే కోచార్ తన పుస్తకంలో సరస్వతినది ప్రవాహ మార్గాన్ని నిరూపించి ప్రచురించగానే ఇర్ఫాన్ హబీబ్ ఇమాజినింగ్ సరస్వతి రివర్ అని ఒక వ్యాసం రాశాడు. దాన్లో సరస్వతి అనే నది లేనేలేదని అది ఋషుల ఊహ మాత్రమే అని తేల్చేశాడు. అంతేకాదు, సరస్వతి నది ప్రవాహానికి సంబంధించిన ఋజువులు మైకెల్ డానొనో అనే ఆయన హబీబ్ కు సమర్పిస్తే ఆయన వాటిని చూసేందుకే నిరాకరించాడట. ఈ విషయం మైకెల్ డానినో తన పుస్తకం The Lost River, on the trail of Saraswati లో రాశాడు. అమ్మ పెట్టదు, అడుక్కు తిన నివ్వదు.ఇదీ మన చరిత్ర నిర్ధారకుల నిర్వాకం.వీళ్లంతా భారతీయ చరిత్రకారులుగా ప్రపంచవ్యాప్తంగా కీర్తికిరీటాలు పెట్టుకుంటారు. ప్రభుత్వాలు సన్మానాలు, సత్కారాలు, బిరుదులతో అందలమెక్కిస్తుంది. ఈ చరిత్రకారుల బృందం భారతదేశ చరిత్రకు చెప్పే భాష్యం తూర్పుదేశాల కంటితో చూసేవే తప్ప స్వయంగా ఆలోచించినది కానే కాదు. చరిత్రను కొలవడానికి పాశ్చాత్యులు తమ ప్రాంతాల్లో వినియోగించే ప్రమాణాలు మనకు పనికిరావు. వాటన్నింటి చరిత్ర అంతా తిప్పి తిప్పి చెప్పినా వెయ్యి రెండువేల సంవత్సరాలకు మించి ఉండదు. మన చరిత్రను కొలవడానికి ప్రత్యేక కొలమానాలు కావాలి. ప్రత్యేక పరిశోధనాదృష్టి ఉండాలి.

ఉదాహరణకు భారత్‌పై ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని, ఆర్యజాతి అన్న భావనను ప్రతిపాదించింది యురోపియన్. ఎక్కడో దూరంగా ఉన్న దేశానికి సంబంధించిన చరిత్ర, సంస్కృతి, నాగరికతల గురించి యురోపియన్లకు ఎక్కడలేని ఆసక్తి ఎందుకు కలిగింది? ఇదేమీ సాధారణంగా కలిగేది కాదు. ఈ కోణంలో ముందుగా పరిశోధన జరిగి ఉండాల్సింది కదా.. హరప్పా, సుమేరియన్, అక్కాడియా, ఈజిప్టు సామ్రాజ్యాలు దాపు ఒకే కాలంలో కూలిపోయాయి. 2200-1900 మధ్య 300 సంవత్సరాల కాలంలో

ఏజియన్ నుంచి భారత్ వరకు ఏర్పడిన క్షామం వల్ల కూలిపోయినట్టు యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టాలోని డీ ప్రీతిపాల్ అందించిన సమాచారం ప్రొఫెసర్ ఎన్‌ఎస్ రాజారాం వెలుగులోకి తెచ్చారు. భారతీయ, అమెరికన్, ఫ్రెంచ్ అన్వేషకులు భారత పాకిస్థాన్‌లలో పరిశోధించి చెప్తున్నాకూడా.. రోమిలా థాపర్ లాంటివారు ఆర్య సంచారజాతి వ్యాపారులే ఈ వినాశనానికి కారణమని వాదిస్తుంటే.. దీని వెనుక కుట్రకోణం లేదని ఎలా అనుకోవాలి.

మన చరిత్రకారులు చిత్తశుద్ధితో మన చరిత్రను పునర్మూల్యాంకనం చేయ సంకల్పిస్తే వేద ఖగోళశాస్త్రం సహాయపడి ఉండేది. మన చరిత్రను అధ్యయనం చేయడానికి ప్రధానమైన ఉపకరణం ఇది. రామాయణం నుంచి ఇప్పటి వరకూ కూడా సాధికారికమైన భారతదేశ చరిత్ర నిర్మాణానికి ప్రాథమిక పరికరంగా వేద ఖగోళం.. పనికొచ్చేది. వాల్మీకి వ్యాసాదులు, వరాహమిహిరుడు, కాళిదాసాదుల నుంచి అనేకమంది రచనల్లో నిక్షిప్తమైన చరిత్ర అంతా దీని ఆధారంగానే సాగిందనేది వాస్తవం. దీని గురించి తర్వాతి వ్యాసాల్లో చర్చించుకుందాం.

***

Resources

  1. Presidential Address by Professor Mohammad Habib at the Indian History Congress, Bombay, December 1947 (the title of the original was The Present and The Past, Our Approach to History)
  2. Arun Shourie: Eminent Historians: Their Technology, Their Line, Their Fraud, 1998
  3. Dr N.S. Rajaram: ICHR: Are they ’eminent historians’ or ordinary criminals in scholars’ robes? FOLKS Mag, June 2012
  4. Utpal Kumar: ICHR turns white elephant with its projects guzzling up crores-Mail Today, 17 July 2015
Exit mobile version