రామం భజే శ్యామలం-18

1
2

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]భా[/dropcap]రతదేశ చరిత్రకు సంబంధించిన కాలనిర్ణయాన్ని ఏ విధంగా చేశారు. దేన్ని ప్రామాణికంగా కొలమానం చేసుకొన్నారు. దేన్ని కాదనుకొన్నారు. మన చరిత్రకు సంబంధించి.. ముఖ్యంగా ప్రాచీన చరిత్రకు సంబంధించి, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలోని చారిత్రక అంశాలను నిర్ధారించడానికి కొలమానాలేమిటి? సింధు నాగరికత నుంచి ఐదు వందల ఏండ్ల క్రితం వరకు లభించిన శిలాశాసనాల్లో కానీ, ఇతర రాత ప్రతుల్లో కానీ ఏ ప్రాతిపదికన నిర్ధారణ జరిగింది. ఇప్పుడు మన చరిత్ర ప్రాచీనతను నిస్సిగ్గుగా తిరస్కరించిన సందర్భంలోకానీ, ఆధునిక చరిత్రను నిర్ధారించడంలో కానీ మన సోకాల్డ్ చరిత్రకారులు వినియోగించిన కొలమానం ఒకటే. ఆస్ట్రాలజీ. ఈ రోజు వరకు మనకు లభించిన శిలాశాసనాల్లో కానీ, సాహిత్యంలో కానీ సూర్యమాన, చాంద్రమానాల్లో గ్రహగతుల ఆధారంగా వర్ష, మాస, తిథి, వార నక్షత్రాల ప్రకారం రాసిన రాతల ప్రకారమే మనకు ఆయా కాలాల చరిత్ర అవగతమవుతున్నదే తప్ప మరోదారి లేదు. మనదేశంలో కేంబ్రిడ్జిలు, ఆక్స్‌ఫర్డ్‌లు, సెయింట్ జేవియర్లు, సెయింట్ మేరీలు, జేఎన్‌యూ, ఏఎంయూ వంటి ‘ఎలీట్’ సంస్థల నుంచి పుట్టుకొచ్చిన మేధావులు పలికేంతవరకు, రాయడం మొదలుపెట్టేంతవరకు మన పండితులకు కానీ, సంస్థానాధీశులకు కానీ, క్రీస్తుకు పూర్వం.. క్రీస్తు తరువాత అన్న లెక్కలు తెలియవు. మన వాళ్లకు తెలిసిందల్లా ‘అష్టావింశత్ మహాయుగే (28వ మహాయుగం) కలియుగే, ప్రథమపాదే,  జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే…. శరద్రుతౌ, శార్వరి నామ సంవత్సరే.. దక్షిణాయనే, కార్తీకమాసే, దశమ్యాం తిథౌ: ఇందువాసరే..’ అంటూ రాసుకొంటారు. ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు తప్పనిసరిగా ఇవే మాటలను చదువుకొంటుంటారు. దీన్ని మనవాళ్లు సంకల్పం అన్నారు. దీంతోపాటే ప్రవర కూడా చెప్తారు. సంకల్పం, ప్రవర అన్నవి మంత్రాలు ఎంతమాత్రం కావు. ఇవి మన చరిత్ర. మన చరిత్రకు మూలాధారం ఇవే.

… ‘అష్టావింశత్ మహాయుగే.. మనం 28వ మహాయుగంలోని కలియుగంలో, తొలిపాదంలో ప్రపంచంలోని (జంబూద్వీపం) భారత ఖండంలో.. ఫలానా ఋతువు, ఫలానా సంవత్సరం.. ఫలానా అయనం.. ఫలానా మాసం.. ఫలానా రోజున.. ఫలానా చోటున.. ఫలానా సమయంలో ఫలానా.. తాత ముత్తాతల వంశస్తుడనైన నేను.. ఫలానా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాను’ అని చెప్పడమే ఈ సంకల్పమైనా.. ప్రవర అయినా.. సామాన్యుడి నుంచి చక్రవర్తి దాకా దీన్ని పరంపరగా అనుసరిస్తూ వచ్చారు. శాసనాల్లోనూ.. సాహిత్యాల్లోనూ కవులు, శిల్పులు రాసినవి ఈ మాసాలే.. ఈ తిథులే.. ఈ రోజులే కదా. ఇంతకంటే చరిత్రను స్పష్టంగా చెప్పడం ఈ భూప్రపంచంలో మనవారికి తప్ప ఎవరికి సాధ్యమవుతుంది? అస్పష్టంగా.. ఇలాగే జరిగి ఉండవచ్చు.. ఉండి ఉండవచ్చు.. అని రాసుకోవాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు. ఆధునిక శాసనాల్లో రాసిన తిథివార నక్షత్రాల ప్రకారం మనకు ఆయా శాసన కాలనిర్ణయం విస్పష్టంగా తేల్చవచ్చు. అలాగే మన సాహిత్యంలోనూ..

కానీ, మన భారతీయ చరిత్రకారులు తమకు అనుకూలమైన చోట వీటిని వాడుకొన్నారు. మొఘలులకు సంబంధించి అరబ్ క్యాలెండర్‌ను ప్రామాణికంగా తీసుకొన్నారు. ఇంగ్లీషోడి విషయం చెప్పనే అక్కర్లేదు. బుద్ధుడు, గుప్తులు, అశోకుడి గురించి మనవాళ్లు చేసిన గొప్ప పరిశోధనలు ఏవీలేవు. పాశ్చాత్య విద్వాంసులకు మన క్యాలెండర్‌ను అర్థం చేసుకోవడం చేతకాక.. అలా జరిగి ఉండవచ్చు అంటే.. దాన్నే తిరగమోత వేసి తిప్పి తిప్పి రాసి తమ పేర్లు పెట్టుకొన్నారే తప్ప.. వీరు స్వయంగా శాసనాలను, సాహిత్యాన్ని తీరిగ్గా కూర్చొని ఎన్‌కోడ్, డీకోడ్ చేసింది ఏమీ లేదు. వాస్తవంగా  కొద్దో గొప్పో కృషి చేసినవాళ్లు వెలుగులోకి రాకుండాపోయారు లెండి. ఈ చరిత్రకారులు రాసిన ఏ ఘటనకూ లాజిక్ లేదు. సంపూర్ణమైన ఆధారాలున్న మన చరిత్రకు దిక్కులేదు. ఇదీ ఈ దేశం పరిస్థితి. ఇందుకు ఉదాహరణ రామాయణమే.

రామాయణాన్ని చరిత్ర అనడానికి ఏ విధమైన ఆధారాలు లేవని.. అదంతా కల్పిత కథేనని రాజాస్థాన చరిత్రకారులు చెప్పుకుంటూ వచ్చారు. కానీ, వాల్మీకి రామాయణంలోని ప్రతి సన్నివేశాన్ని తేదీల వారీగా వివరించారు. ఖగోళశాస్త్ర ఆధారంగా గ్రహాలు.. నక్షత్రాల ఆధారంగా తేదీలను విస్పష్టంగా నిర్ధారించారు. రాళ్లు.. కార్బన్ డేటింగ్ వంటి విధానాలు ఉజ్జాయింపుగా ఆయా కాలాలను అంచనా వేస్తాయేమో తప్ప కచ్చితమైన తేదీల నిర్ధారణ దుస్సాధ్యం. భూమికి అనుగుణంగా చంద్రుడి గమనాన్ని అనుసరించి.. ఆయా గ్రహాల గతులను అనుసరించి మాసాలు, రోజులు, సమయాలను నిర్ధారించే క్యాలెండర్ మనకు చాంద్రమానంగా.. (ప్రస్తుతం మనం పాటిస్తున్న గ్రిగెరియన్ క్యాలెండర్‌కు భిన్నమైంది) భారతీయులు అనుసరిస్తూ వస్తున్నారు. దీన్ని బట్టే రామాయణ, భారతేతిహాసాల కాలనిర్ణయాన్ని మనవాళ్లు కచ్చితమైన తేదీలతో నిర్ధారించారు. పుష్కర్ భట్నాగర్, పీవీ వర్తక్, కోట వెంకటాచలం, కోయిల్ కందాడ అణ్ణన్ కుమార వెంకటసుందరాచార్య స్వామి.. ఇలా ఎందరో వీటిపై విస్తృత పరిశోధన చేశారు. వీరి పరిశోధనల సారాంశం ప్రకారం  రామాయణ కాలనిర్ణయం స్పష్టమైంది.

సాధారణంగా మనకు ఒక రెండు వేలేండ్ల వరకు వరకు చారిత్రక నిర్మాణాలు కొంతమేరకు కనిపించవచ్చు. అంతకుముందు మరో వెయ్యి రెండువేల ఏండ్ల వరకు శిథిలాలు కనిపిస్తాయి. ఇంకాస్త వెనక్కి వెళ్తే.. సముద్ర గర్భంలోనో.. భూపొరల్లోనో.. కొన్ని ఆనవాళ్లు కనిపించవచ్చు. కానీ తొమ్మిది పదివేల ఏండ్ల నాడు జరిగిన చరిత్రకు శిథిలాలు దొరుకుతాయని ఎలా అనుకోగలం? ఏవీ దొరకలేదు కాబట్టి ఏమీ జరుగలేదని అనుకొంటే అది మూర్ఖత్వం కాకుండా ఉంటుందా? రామాయణం అంత ప్రాచీనమైన చరిత్ర కావడం వల్లనే దానికి సంబంధించిన ఆనవాళ్లు లభించి ఉండకపోవచ్చు. కానీ.. చారిత్రకంగా.. వారసత్వంగా.. పరంపరగా రాముడి చరిత్ర జనం నాలుకలపై నర్తిస్తూ సార్వకాలీనమైంది. శాశ్వతమైంది.

తైత్తిరీయ బ్రాహ్మణం క్రీస్తుపూర్వం 4600 బీసీ నాటిది. ఈ విషయాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త పీవీ వర్తక్ నిరూపించారు. ఇందులో వాల్మీకి మహాకవి ప్రస్తావన ఉన్నది. అంటే.. వాల్మీకి 4,600కు ముందు ఉన్నవాడు అన్నది స్పష్టం. రామాయణం ఉనికి అంతకుముందు చాలా ఏండ్లకు పూర్వమైనది. రామాయణకాలంలో భాద్రపదంలో వర్షాకాలం ప్రారంభమైనట్టుగా.. ఆశ్వియుజ పూర్ణిమ నుంచి వేసవికాలం మొదలైనట్టుగా.. వైశాఖంలో శిశిర ఋతువు ఉన్నట్టుగా అయోధ్య, కిష్కింధ, యుద్ధకాండల్లో పలు సందర్భాల్లో మనకు తెలుస్తుంది. అంటే అశ్వినిలో సూర్యుడు ఉన్నప్పడు వైశాఖమాసంలో చలికాలం వచ్చిందని పీవీ వర్తక్ చెప్తారు. ప్రస్తుతం మనకు చలికాలం మూల నక్షత్రంతో మొదలవుతుంది. ఒక నక్షత్రం తన పొజిషన్ మారడానికి 960 సంవత్సరాలు పడుతుంది. రామాయణ కాలంలో అశ్వినిలో చలికాలం వచ్చింది. ఇప్పటికి పది నక్షత్రాల కాలం గడిచిపోయిందన్నమాట. అంటే అశ్విని నుంచి మూల వరకు పది నక్షత్రాలు మారడానికి 9,600 సంవత్సరాలు పట్టింది. అంటే సుమారు క్రీస్తుపూర్వం 7,600 అన్నమాట. అంటే రామాయణం జరిగిన సంవత్సరం క్రీస్తుపూర్వం 7600 సంవత్సరం. ఇప్పుడు బాలకాండలో వాల్మీకి చెప్పిన ఖగోళ శాస్త్ర అంశాలను పరిశీలిద్దాం. ‘యజ్ఞము ముగిసిన తరువాత ఆరు రుతువులు గడిచినవి. అనగా దాదాపు ఒక సంవత్సరం చాలావరకు పూర్తియైనది. తరువాత వచ్చిన పండ్రెండవ మాసమగు చైత్రమాసంలో పునర్వసు నక్షత్రయుక్త నవమి తిథియందు ఐదు గ్రహములు తమ తమ ఉచ్ఛ స్థానములందు ఉండగా .. అనగా సూర్య, కుజ, గురు, శుక్ర, శని తమ ఉచ్ఛ స్థానములగు మేష, మకర, కర్కాటక, మీన, తులా రాసులందుండగా.. గురుడు చంద్రునితో కలిసి ఉన్న కర్కాటక లగ్నమునందు కౌసల్య.. సకల జగన్నాథుడును సర్వలోక నమస్కృతుడును, సర్వ లక్షణ సంపన్నుడును, విష్ణువు యొక్క అంశయైన వాడును, మహాభాగ్యవంతుడును, ఇక్ష్వాకు వంశవర్ధనుడును అగు రాముని పుత్రునిగా కనెను. నిర్మల బుద్ధి గల భరతుడు పుష్యమీ నక్షత్రమునందు, మీన లగ్నమున పుట్టెను. మరునాడు లక్ష్మణశతృఘ్నులు అశ్లేషా నక్షత్రమునందు కర్కాటక లగ్నములో మధ్యాహ్న సమయంలో జన్మించారు. ఈ లెక్కల ప్రకారం మేషరాశిలో సూర్యుడు పది డిగ్రీలలో ఉన్నాడు. మకరంలో అంగారకుడు 28 డిగ్రీలలో, గురువు కర్కాటకంలో ఐదు డిగ్రీలలో.. శుక్రుడు మీనరాశిలో 27 డిగ్రీలలో, శని తులారాశిలో 20 డిగ్రీలలో ఉన్నారు. వీటి ఆధారంగా లెక్కించుకొంటూ వెళ్తే.. క్రీస్తుకు పూర్వం 7323 డిసెంబర్ 4న లెక్కలన్నీ సరిపోలుతున్నది. రాముడి జననకాలం డిసెంబర్ 4, క్రీ.పూ.7323 అని నిర్ధారణ అయింది. క్రీస్తుకు పూర్వం 7323 డిసెంబర్ నాలుగున మర్యాదాపురుషోత్తముడు పుట్టాడు. ఆరోజు సోమవారం. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య సమయంలో రాముడు జన్మించాడు. ఆ కాలానికి ఇంకా క్రీస్తు శకం పారంభం కాలేదు. క్రీస్తు శకం ప్రారంభమైన తరువాత ఈరోజు నుంచి వెనక్కి లెక్కించుకుంటూ పోతే..  చైత్రమాసం దాదాపుగా డిసెంబర్ ప్రాంతంలో వచ్చింది.. అంటే ఇవాళ్టి పాశ్చాత్య క్యాలెండర్ జనవరితో ఎలా మొదలవుతున్నదో.. దాదాపు అదే సమయంలో మన నూతన సంవత్సరమూ మొదలయ్యేదనమాట… గత 9600 సంవత్సరాలలో రాశుల కదలికలు.. అధిక మాసాలతో కలిపి.. ఈ చైత్రమాసం దాదాపు నాలుగు నెలలు ముందుకు జరిగిందని అర్థమవుతున్నది.

రాముడి జన్మసమయం నిర్థారణ కావటంతో.. రామాయణంలోని మిగతా సంఘటనల కాలంపై మరింత స్పష్టత వచ్చింది. రాముడు తొలిసారి ప్రవాసానికి విశ్వామిత్రుడితో వెళ్లిన సమయంలో మూడు గ్రహాలు చంద్రుడి చుట్టూ తిరుగుతూ పాలపుంతను ప్రకాశవంతం చేశాయట.. పురాతత్వ శాఖ పరిశోధనల్లో అయోధ్య నుంచి లంక వరకు బయటపడిన రామాయణ కాలపు ఆనవాళ్లు కూడా ఈ గణాంకాలను బలపరుస్తున్నాయి. రాముడి జన్మసమయం తెలియటంతో పాటు ఆయన ప్రవాస సమయంలో గ్రహరాశుల సమీకరణలు ఆస్ట్రో సైంటిస్టులకు అదనపు ఇన్‌పుట్‌ను ఇచ్చింది. దీని ప్రకారం రాముడి జీవితాన్ని సంపూర్ణంగా విశ్లేషించే అవకాశం లభించింది. శ్రీరాముడు సీతాదేవిని తన పదిహేడో ఏట వివాహం చేసుకున్నాడు. మిథిలా నగరంలో క్రీస్తుపూర్వం 7307 ఏప్రిల్ ఏడో తేదీన సీతమ్మను శివధనుస్సును విరిచిన రామచంద్రుడు వివాహం చేసుకున్నాడు.

వివాహం చేసుకున్న ఏడాదిన్నర కాలానికే రాముడు 14 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాముడి తండ్రి దశరథుడి జన్మనక్షత్రమైన రేవతి చుట్టూ రవి, అంగారకుడు, రాహువు తదితర నక్షత్రాలు తిరుగుతున్న సమయం అది. రాజుకు మారకాన్ని సూచించే దశ అది. అదే సమయంలో పుష్యమి నక్షత్రం వెనుకనున్న పునర్వసుతో కూడి చంద్రుడు ఉన్నాడని అది రాముడికి శుభ సంకేతాన్ని ఇస్తున్నదని, ఆ ముహూర్తాన్ని  రాముడి పట్టాభిషేక ముహూర్తంగా దశరథుడు నిర్ణయించాడు. అయోధ్యకాండ రెండో సర్గలోని 18వ శ్లోకంలో ఈ విషయం ఉంది. కానీ, అది రాజు మరణానికి దారి తీసింది. శత్రువైన రావణ వధ కోసం రాముడు 14 ఏండ్ల వనవాసానికి బయలుదేరాల్సి వచ్చింది. క్రీస్తుపూర్వం 7,306వ సంవత్సరం నవంబర్ 29న రాముడు సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్లాడు.

రాముడు పంచవటిలో ఉన్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. వనవాసం మరో ఏడాదికి పూర్తవుతుందనగా సీతాపహరణం జరిగింది. 7,293వ సంవత్సరం ఆగస్టు 7న రావణుడు సీతను అపహరించుకొని వెళ్లాడు. ఆరోజు అమావాస్య. ఆ సమయంలో ఖగోళంలో అంగారకుడు మధ్యలో ఉన్నాడు. ఒకవైపు బుధుడు, శుక్రుడు, మరోవైపు రవి, శని ఉన్నారని రామాయణం చెప్తున్నది. ఆరోజు సూర్యగ్రహణం కూడా వచ్చింది.

ఆ తరువాత సీతను వెతుక్కొంటూ బయలుదేరిన రామలక్ష్మణులను కలిసిన హనుమంతుడు సీత జాడను తెలుసుకోవటానికి 7,292 సెప్టెంబర్ 1వ తేదీన లంకలో ప్రవేశించాడు. సెప్టెంబర్ 2 సీతాదేవిని దర్శించుకున్నాడు.. అదే రోజు రాత్రి లంకాదహనం జరిగింది.

సీతాదేవి జాడ తెలుసుకున్న తరువాత ఇరవై రోజుల్లో ఆయన తిరిగి కిష్కింధకు చేరుకున్నాడు. హనుమంతుడు రోజుకు ముప్ఫై మైళ్లు ప్రయాణించాడట. ఆంజనేయుడు సీత జాడ చెప్పిన వెంటనే రాముడు యుద్ధ సన్నాహాలు చేశాడు..

మాఘ శుద్ధ పాఢ్యమి అంటే 7,292 అక్టోబర్ 2న రామసైన్యం లంకకు బయలు దేరింది. కిష్కింధ అంటే నేటి హంపి, హోస్పేట నుంచి లంకకు సుమారు ఆరువందల మైళ్ల దూరం ఉంటుంది. అంటే అంటే సుమారు 965 కిలోమీటర్లు. రోజుకు సుమారు ఇరవై మైళ్ల చొప్పున ఫాల్గుణ శుద్ధ చతుర్దశి అంటే 7292 అక్టోబర్ 31న లంకలో వానరసైన్యం ప్రవేశించింది. అంతకు ముందు అక్టోబర్ 26 నుంచి 30 మధ్య రోజుల్లో  రామసేన సముద్రంపై అసాధారణమైన వారధిని నిర్మించింది.

రామరావణ యుద్ధం మొదలైంది 7,292 నవంబర్ 3 న యుద్ధం ప్రారంభమైన అయిదో రోజున అంటే నవంబర్ 7న రావణ సోదరుడు కుంభకర్ణుని రాముడు హతమార్చాడు.. క్రీస్తుపూర్వం 7,292 నవంబర్ 15న రావణ వధ జరిగింది.

విభీషణ పట్టాభిషేకం తరువాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చింది క్రీస్తుపూర్వం 7,292 నవంబర్ 19కి రాముడి 14 ఏండ్ల వనవాస కాలం ముగిసింది. అదే రోజు అక్కడి నుంచి అయోధ్యకు డిసెంబర్ 6 ఆయన చేరుకున్నారు. విచిత్రమేమంటే ఆ రోజు కూడా చైత్ర శుక్ల నవమి కావటం. రాముడి జన్మపట్టికలో జ్యోతిష్యశాస్త్ర వివరణలు పరిశోధకులకు రామాయణ కాలాన్ని నిర్ణయించటంలో బాగా తోడ్పడ్డాయి.

రాముడు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషేకం చేసుకొనే నాటికి ఆయన వయస్సు 39 సంవత్సరాలు. రాముడి కాలనిర్ణయాన్ని, రామాయణ చరిత్రను సుమారు భారత దేశంలోని 195 ప్రదేశాలు విస్పష్టంగా నిరూపిస్తున్నాయి. అయోధ్యలో, పంచవటిలో, హంపిలో, లంకలో దొరికిన ఆనవాళ్లు.. వాటిపై చేసిన పరిశోధనలు ఈ కాలనిర్ణయంతో సరిపోలుతున్నాయి.

రామాయణానికి సంబంధించిన ప్రధాన సన్నివేశాల కాలనిర్ణయ వివరాలు..

రామజననం4 డిసెంబర్, 7323 బీసీ
సీతారాముల వివాహం7 ఏప్రిల్, 7307 బీసీ
వనవాసం29 నవంబర్, 7306 బీసీ
హనుమంతుడి లంకా ప్రవేశం1 సెప్టెంబర్, 7292 బీసీ
హనుమంతుడు సీతను కలిసినరోజు2 సెప్టెంబర్, 7292 బీసీ
సేతు నిర్మాణం26-30 అక్టోబర్, 7292 బీసీ
యుద్ధ ప్రారంభం3 నవంబర్, 7292 బీసీ
కుంభకర్ణ వధ7 నవంబర్, 7292 బీసీ
రావణ వధ15 నవంబర్, 7292 బీసీ
అయోధ్యకు రాముడి చేరిక6 డిసెంబర్, 7292 బీసీ

రామాయణం ఇతిహాసమా, చరిత్రా అన్న మీమాంసకు తెరదించే ప్రయత్నాలు ఆస్ట్రో సైంటిస్టులు చాలాకాలంగా చేస్తూనే ఉన్నారు.. ఇటు పురాతత్త్వవేత్తలు, సాహిత్య, చారిత్రకులు వేల సంఖ్యలో రామాయణ మూలాలను అన్వేషించారు.. దాని ఫలితమే.. రాముడి జన్మకాల నిర్ణయం. రామాయణ కాలావధి నిర్ధారణ. ఇంత నిర్దిష్టంగా రామాయణ కాల నిర్ణయం చేపట్టిన తర్వాత కూడా దాన్ని తిరస్కరించడం వెనుక ఈ కాలపు చరిత్రకారుల కుట్ర బయటపడుతూనే ఉన్నది. భారతీయ ఖగోళశాస్త్రం తప్పయితే దాన్ని సోకాల్డ్ ఎలీట్ మేధావులు నిరూపించాలి. లేకుంటే భారత చరిత్రను మనదైన దృష్టికోణంలో సంపూర్ణంగా తిరగరాయాలి.

ఆధారాలు..
• వాల్మీకి.. శ్రీమద్రామాయణం
• పుల్లెల శ్రీరామచంద్రుడు.. వాల్మీకి రామాయణం
• పీవీ వర్తక్.. వాస్తవ్ రామాయణ్
• పుష్కర్ భట్నాగర్.. డేటింగ్ ఆఫ్ రామాయణ
• కోట వెంకటాచలం.. ది ప్లాట్ ఆఫ్ ఇండియన్ క్రొనాలజీ
• కోయిల్ కందాడై అణ్ణన్ కుమార వేంకట సుందరాచార్యస్వామి.. శ్రీరామ కాల నిర్ణయబోధిని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here