రామం భజే శ్యామలం-19

2
2

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]మీ[/dropcap]కు తెలుసా? గౌతమబుద్ధుడి తాతముత్తాతలు ఎవరో తెలుసా? బుద్ధుడికి, శ్రీరామచంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటి? మనం ప్రస్తుతం చరిత్రగా చదువుకొంటున్న బుద్ధుడు జీవించి ఉన్న కాలం వాస్తవమైన కాలమేనా? దీన్ని నిర్ధారించిన చరిత్రకారులు సాధికారికంగా చెప్పిన కాలమేనా ఇది? మనం స్వతంత్ర భారతదేశంలో గొప్ప తత్త్వవేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా గౌతమబుద్ధుడు శిఖరసమానుడు. సమస్త ఆసియాదేశాల్లో బౌద్ధం ప్రాచుర్యం పొందిన మతం. కానీ.. మనం ఈశ్వర స్వరూపుడిగా కొలిచే బుద్ధుడి కాల నిర్ణయం సాధికారికంగా జరిగింది కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బౌద్ధాన్ని అదే పనిగా దశాబ్దంపాటు ప్రమోట్ చేసిన ప్రభుత్వం కూడా దీనిపై కచ్చితమైన చారిత్రక పరిశోధన చేయించాలన్న ఆలోచన చేయలేదు. కొందరు యురోపియన్ చరిత్రకారులు, మరికొందరు భారతీయ చరిత్రకారులు చేసిన పరిశోధనలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందుకంటే అప్పటికే మన ప్రాచీన చరిత్ర చాలా ముందుకు జరిగింది. బుద్ధుడి కాలం కూడా అదేవిధంగా ముందుకు జరిగింది. దీనికి.. ఆస్థాన చరిత్రకారులు.. గ్రీకు చరిత్రకారుల గణాంకాలను ప్రాతిపదికగా చేసుకొని బుద్ధుడు క్రీస్తు పూర్వం 5 నుంచి 4 శతాబ్దాల మధ్య జీవించి ఉండవచ్చని అంచనావేశారు. గ్రీకు చరిత్రకారులు ప్రధానంగా గ్జాండ్రమెస్, శాండ్రకట్టస్, శాండ్రోసిప్టస్‌లుగా ముగ్గురు మగధరాజులను ప్రస్తావించారు. మగధరాజు శాండ్రకట్టస్ అలెగ్జాండర్ సమకాలికుడని చెప్పడంతో యురోపియన్ చరిత్రకారులు ఆ పేరును బట్టి చరిత్ర నిర్మాణం చేశారు. ప్రముఖ పరిశోధక రచయిత ఈజే రాప్సన్ తన కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇండియాలోని ఏన్షియంట్ ఇండియా చాప్టర్ (పేజీలు 469,70)లో గ్రీకులో గ్జాండ్రమెస్, సంస్కృతంలో చంద్రమాస్ అని నిర్వచించారు. ఈ గ్రంథం 1922లో వచ్చింది. శాండ్రకట్టస్ అలెగ్జాండర్ సమకాలికుడని గ్రీకుచరిత్రకారులు చెప్పారు. యురోపియన్ చరిత్రకారులు ఈ శాండ్రకట్టస్‌ను మౌర్య చంద్రగుప్తుడిగా పొరబడ్డారు. భారతదేశంపై దండెత్తి వచ్చిన అలెగ్జాండర్, మౌర్య చంద్రగుప్తుడు ఒకేకాలానికి చెందిన వారని నిర్ధారించారు.

దీంతో భారతీయ చరిత్ర కాల చక్రం మొత్తం అస్తవ్యస్తమైంది. బుద్ధుడు ఈ నేలమీద నడయాడిన సమయం కూడా మారిపోయింది. దీన్నే మనం ఇవాళ్టికీ పాఠ్యపుస్తకాల్లో, వికీ పీడియాల్లో చదువుకొంటున్నాం. దాన్నే చరిత్ర చేసేశాం. నిజానికి మౌర్యచంద్రగుప్తుడే అలెగ్జాండర్ సమకాలికుడని గ్రీకు చరిత్రకారులు ఎక్కడా చెప్పలేదు. యురోపియన్ చరిత్రకారులే.. తప్పుగా అర్థం చేసుకోవడంతో మన చరిత్ర పూర్తిగా మారిపోయింది. శాండ్రకట్టస్‌ను మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్తుడిగా చెప్పడం సరికాదు. అతను గుప్తుల వంశానికి చెందిన చంద్రగుప్తుడు. గ్జాండ్రమెస్ లేదా చంద్ర శ్రీ అనేవాడు మగధను ఏలిన ఆంధ్ర వంశానికి చెందిన చివరి రాజు. గుప్తుల రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడు ఇతని మంత్రి. ఇతని కుమారుడు సముద్రగుప్తుడు మగధ సైన్యంలో మరో జనరల్‌గా ఉన్నారు. ఎందుకంటే అలెగ్జాండర్ భారత్‌పైకి దండెత్తి వచ్చినప్పుడు మగధ సైన్యం గురించి విచారిస్తాడు. అప్పుడు ‘గ్జాండ్రమెస్ దగ్గర 20 సాయుధ బలగాలు, రెండు లక్షల పదాతి దళం, రెండువేల రథాలు, నాలుగువేల ఏనుగులు ఉన్నాయి’ అని గూఢచారులు చెప్తారు.

గ్జాండ్రమస్ అంటే ఆంధ్ర వంశానికి చెందిన చివరి మగధరాజైన చంద్రశ్రీయే. ఆ తరువాత మగధను పరిపాలించిన గుప్త వంశస్తులు తమను తాము ఆంధ్ర భృత్యులుగా చెప్పుకొన్నారు. గుప్త వంశస్థాపకుడైన చంద్రగుప్తుడు (ఇతను మౌర్య చంద్రగుప్తుడు కాదు) చంద్రశ్రీ మంత్రిగా, జనరల్‌గా పనిచేశాడు. చంద్రశ్రీ తరువాత వారసుడు మైనర్ కావడంతో.. గార్డియన్‌గా ప్రకటించుకొన్న చంద్రగుప్తుడు, కొద్దికాలం తరువాత మైనర్‌ను హతమార్చి.. తనను తాను మగధ చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు. అతని నుంచి గుప్తవంశం మొదలైంది. చంద్రగుప్తుడు తన వారసత్వాన్ని న్యాయంగా పెద్ద భార్య కుమారుడైన సముద్రగుప్తుడికి అప్పగించకుండా చిన్నభార్య కొడుక్కు సంక్రమింపజేయాలని ప్రయత్నించడంతో.. సముద్రగుప్తుడు.. నేపాల్ రాజు (అతని తల్లిగారి తండ్రి) సహాయంతో తిరుగుబాటుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో అలెగ్జాండర్ భారత్‌పై దాడిచేశాడు. ఈ తరుణంలో అలెగ్జాండర్ దృష్టికి చంద్రశ్రీ, చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడి గురించి తెలిసింది. ఈ పేర్లనే గ్రీకు చరిత్రకారులు అలెగ్జాండర్ ది గ్రేట్ చరిత్రలో ప్రస్తావించారు. వాస్తవంగా సరిగ్గా గుర్తించాల్సిన పేర్లు ఇవి కాగా, మన చరిత్రకారులు, యూరప్ చరిత్రకారులు మాత్రం మహాపద్మనంద లేదా ధన నంద, మౌర్య వంశానికి చెందిన చంద్రగుప్తుడు అతని కొడుకు బిందుసారుడిగా పొరబడ్డారు.

ఈ విధంగా తప్పుగా గుర్తించడం వల్ల మన చరిత్ర ఏకంగా 12 శతాబ్దాలు ముందుకు జరిగింది. భారతదేశంపై అలెగ్జాండర్ దాడి క్రీస్తుపూర్వం 326 లో జరిగింది. గుప్త వంశానికి చెందిన చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 327 నుంచి క్రీస్తుపూర్వం 320 వరకు పాలించాడు. కాబట్టి అలెగ్జాండర్ దాడి సమయంలో మగధ రాజు మౌర్య చంద్రగుప్తుడు ఎంతమాత్రం కాదు.

మహాభారత కాలాన్ని ప్రామాణికంగా తీసుకొంటే.. భారత యుద్ధం తరువాతి నుంచి మన రాజుల వంశ చరిత్రలు స్పష్టంగా తెలుస్తాయి. వాళ్ల వంశ చరిత్రలను అన్వేషిస్తూపోతే మహాభారత యుద్ధం నాటి వరకు కచ్చితంగా గుర్తించవచ్చు. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగింది. అప్పటి నుంచి రాజుల పరిపాలన కాలాన్ని లెక్కించుకొంటూ వస్తే గుప్త వంశానికి చెందిన చంద్రగుప్తుడి కాలం క్రీస్తుపూర్వం 326 గా నిర్ధారణ అవుతుంది. హిందూ, బౌద్ధ, జైన ధర్మాలకు సంబంధించిన అన్ని గ్రంథాల్లో, సాహిత్యంలో పేర్కొన్న అన్ని ఘటనలు, సందర్భాలు కూడా ఈ సంవత్సరంతో కచ్చితంగా సరిపోలుతున్నాయి.

భారతీయ చరిత్రను గణించడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మినహా మరో ఆధారం మనకు లభించదు. మహాభారత యుద్ధం (క్రీ.పూ.3138) ముగిసిన తరువాత పదోరోజున ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది. అప్పటినుంచి యుధిష్టర శకం మొదలైంది. ధర్మరాజు 36 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాడు. 37వ సంవత్సరంలో యుధిష్టరశకం ముగిసింది. శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగింది. అదేక్షణం.. అంటే మేషరాశిలో ఏడు గ్రహాలు కలిసిన సందర్భం నుంచి కలియుగం మొదలైంది. అదే సంవత్సరంలో ధర్మరాజు తన మనవడు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి.. సోదరులు, భార్య ద్రౌపదితో కలిసి తీర్థయాత్రకు బయలుదేరాడు. ఈ యాత్ర 25 సంవత్సరాలు సాగింది. 26వ ఏట (కలి26) నిర్యాణం చెందాడు.

భారతీయ ఖగోళశాస్త్ర గణాంకాలు ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైనవిగా ఉన్నాయని ఫ్రెంచి ఆస్ట్రొనామస్ బెయిలీ పేర్కొన్నాడు. ముఖ్యంగా క్రీస్తుపూర్వం 3102 సంవత్సరం, ఫిబ్రవరి 20, మధ్యాహ్నం 2 గంటల 27 నిమిషాల 30 సెకండ్లకు కలియుగం ప్రారంభమైంది. ఆ సమయంలో ఏడు గ్రహాలు మేషరాశిలో ఉన్నాయి. యుధిష్ఠరుడు (ధర్మరాజు) చనిపోయింది క్రీస్తుపూర్వం 3076లో. అప్పటినుంచి మరో శకం మొదలైంది. దీన్ని సప్తర్షి శకం లేదా లౌకిక శకం అని పిలిచారు. ఈ రోజుకు కూడా కాశ్మీర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఈ సప్తర్షి శకాన్ని పాటిస్తున్నారు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ భూలర్ కలియుగం ప్రారంభం, సప్తర్షి శకాన్ని స్పష్టమైన గణాంకాలతో నిరూపించాడు.

“These facts are sufficient to prove that P.Dayaram’s statement regarding the beginning of the Saptarshi Era is not an invention of his own, but based on the general tradition of the country, Ido not doubt for a moment that the calculation which throws the beginning of the Saptarshi Era•back to 3076 B.C., is worth no more than that which fixes the beginning of the Kali Yuga in SHH B.C. But it seems to me certain; that it is much older than Kalhana’s time because his equation 24=1070 agrees with it. (i.e.4224 Loukika Era=1070 Salivahana Era)”

“It may there for be safely used for reducing with exactness the Saptarshi year, months, and days mentioned in his work to years of the Christian Era. The results which will be thus obtain will always closely agree with those gained by General Cunningham, who did use the right key,” (Pages 264-268 of Indian Antiqueiry Vol.Vl).

దీంతో కలియుగం క్రీ.పూ.3102, సప్తర్షి శకం 3076, కలియుగానికి 36 ఏండ్ల ముందు మహాభారత యుద్ధం జరిగిందని స్పష్టమవుతున్నది. ఈ మూడు శకాలు మనదేశంలో చాలా ప్రాచీనమైనవి. చాలా ఏండ్ల పాటు అనుసరించినవే. వీటి ఆధారంగా చాలా ప్రాంతాల్లో పంచాంగాలు తయారుచేసేవారు. కానీ యూరోపియన్ చరిత్రకారులు మన దేశానికి ఒక ప్రామాణికమైన కాలపరిణామ శకం లేదంటూ.. అలెగ్జాండర్ దాడి చేసిన సమయం నుంచే లెక్కలు వేసుకొంటూ వచ్చారు. గ్రీకు చరిత్రకారులు చెప్పిన శాండ్రకాట్టస్‌ను మౌర్య చంద్రగుప్తుడని భావించారు. వాస్తవానికి అలెగ్జాండర్ సమకాలికులు మగధను పాలించిన ఆంధ్ర వంశానికి చెందిన చంద్రశ్రీ, గుప్తవంశానికి చెందిన చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు కాగా మౌర్య చంద్రగుప్తుడే అలెగ్జాండర్ సమకాలికుడంటూ.. అతడి కాలాన్ని 1200 సంవత్సరాలు ముందుకు తీసుకొని వచ్చి క్రీస్తు పూర్వం 322 లో తెచ్చిపెట్టారు. దీన్ని ఆధారంగా చేసుకొనే మనవాళ్లు మిగతా చరిత్రనంతా నిర్మించుకొంటూ వచ్చారు. దీనివల్ల గౌతమబుద్ధుడి కాలం కూడా యురోపియన్ చరిత్రకారుల పుణ్యమా అని వక్రీకరణ జరిగింది.

మహాభారత యుద్ధం జరిగిన అనంతరం నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన రాజుల పరిపాలన కాలాన్ని గణించుకొంటూ వస్తే ఇక్ష్వాకు వంశానికి చెందిన శుద్ధోధనుడు కాలం వస్తుంది. ఈ శుద్ధోధనుడే గౌతమబుద్ధుడి తండ్రి. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138 ఇక్ష్వాకు వంశానికి చెందిన బృహద్బల కుమారుడు బృహద్‌క్షణ పట్టాభిషేకం యుద్ధం జరిగిన సంవత్సరంలోనే జరిగింది. ఆ తరువాత 30 మంది రాజుల కాలం (సుమిత్ర అనే రాజుతో ముగుస్తుంది) క్రీస్తు పూర్వం 1504తో ముగుస్తుంది. మగధ నంద వంశానికి చెందిన మహాపద్మనందుడి పట్టాభిషేకం క్రీస్తుపూర్వం 1634లో జరిగింది.

ఇక్ష్వాకు వంశంలో బుద్ధుడు గౌతమబుద్ధుడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఇందుకోసం ఇక్ష్వాకు వంశవృక్షాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. వైవస్వత మనువు ఏడుగురు మనువుల్లో ఒకడు. ఇతనికి పది మంది సంతానం. వీరిలో మొదటివాడు ఇక్ష్వాకుడు. ఇతను 28వ మహాయుగంలోని కృతయుగం చివరలో రాజ్యం పాలించాడు. ఆ తరువాత ఇతని వారసుల పేర్లను వరుసగా గమనిస్తే… 1. ఇక్ష్వాకు, 2. వికుక్షి, 3.కకుత్‌స్థ 4.ప్రితు,5.దృశాదస్య, 6.ఆంధ్ర, 7.యువనస్వ, 8.శ్రావస్థి, 9. బృహదస్వ, 10. కువలయస్వ, 11. దృఢస్వ, 12. హరియస్వ, 13. నికుంభ, 14. సంహతస్వ, 15, కృషస్వ, 16. ప్రసేనజిత్, 17. యువనస్వ, 18. మాంధాత, 19. అంబరీష, 20. సంభూతి, 21. అనరణ్య, 22. హరియస్వ, 23. సుమతి, 24.త్రిధన్వ, 25.త్రయారుణి, 26. సత్యవ్రత, 27.హరిశ్చంద్ర, 28. లోహిత, 29.హరిత, 30.చంచు, 31. వినయ, 32.రురుక, 33.బాహు, 34. సగర, 35.అసమంజస, 36.అంశుమంత, 37.దిలీప, 38. భగీరథ, 39. శ్రుత, 40. నభాగ, 41. అంబరీష, 42. ఆయుతయు, 43.ఋతుపర్ణ, 44. సర్వకామ, 45. సుధామ, 46. సౌదాస, 47. అస్మాక, 48. ములక, 49. శథారస, 50. ఇడాబిడ, 51.కృషకర్మ, 52.దిలీప, 53. దీర్ఘబాహు, 54. రఘు, 55. అజ, 56. దశరథ, 57. శ్రీరామ (లక్ష్మణ, భరత, శతృఘ్న), (శతృఘ్నుడు లవణాసురుని చంపి మధురను ఏలాడు. ఇతని కొడుకులు సుబాహు, శూరసేనులు వారసులుగా కొనసాగారు. లక్ష్మణుడి కుమారులు అంగద, చంద్రకేతులు హిమాలయ ప్రాంతాలను ఏలారు. వీరికి అంగదపురం, చంద్రచక్రపురం రాజధానులుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను ఇప్పుడు నేపాల్ అని పిలుస్తున్నారు. భరతుడి కుమారులు తక్ష, పుష్కర గాంధార రాజ్యాన్ని పాలించారు. తక్షకు తక్షశిల, పుష్కరకు పుష్కరవసి రాజధానులుగా ఉన్నాయి. రాముడి కొడుకులు లవకుశులు కోసలకు రాజులయ్యారు. దక్షిణ కోసలను కుశుడు, ఉత్తర కోసలను లవుడు పాలించారు.) కుశుడి వంశం రాజుల పరంపర – 58. కుశ, 59. అతిథి, 60, నిషధ, 61. నల, 62.నభ, 63.పుండరీక, 64.క్షేమధన్వ, 65.దేవానిక, 66.అహినగుణ, 67.పర్యాత్ర, 68. దలరాజ, 69, బాలరాజ, 70, ఉలూక, 71. వజ్రనాభ, 72. శంఖణ, 73.ఉశితస్వ, 74.విశ్వసహ, 75.హిరణ్యనాభ, 76, పుష్పక్ష, 77, ధృవసంధి, 78, సుదర్శన, 79.అగ్నివర్ణ, 80, శీఘ్రనామక, 81. మరు, 82. ప్రభు. 83. సుసంధి, 84. సహస్వంథ, 85, విశృత, 86, బృహద్బల (బ్రహ్మాండ పురాణం, ఉపోద్ఘాత పాదం, 4వ అధ్యాయం.)

బృహద్బలుడు మహాభారతయుద్ధంలో అభిమన్యుడి చేతిలో చనిపోయాడు. అతని కొడుకు బృహద్‌క్షణ అ తరువాత రాజు అయ్యాడు. ఇక్కడి నుంచి తిరిగి ఇక్ష్వాకు వంశ రాజుల పేర్లను పరిశీలిద్దాం.

1. బృహద్‌క్షణ, 2.ఉర్యక్ష, 3, వాస్తవ్యూహ, 4. ప్రతివ్యోమ, 5. దివాకర, 6. సహదేవ, 7.బృహదస్వ, 8.భానురథ, 9.ప్రతితస్య, 10. సుప్రతీక, 11.మరుదేవ, 12. సునక్షత్ర, 13. కిన్నర, 14. అనాథరక్ష, 15. సుప్రణ, 16. అమిత్రజిత్, 17. బృహద్భుజ, 18. ధర్మి, 19. కృతంజయ, 20. రణంజయ, 21. సంజయ, 22. శాక్య, 23. శుద్ధోధన, 24. సిద్ధార్థ (గౌతమబుద్ధ), 25. రాహుల (సిద్ధార్థుని కొడుకు), 26. ప్రసేనజిత్తు, 27. కాహుద్రక, 28. కుందక, 29. సురథ, 30. సుమిత్ర. ఇక్ష్వాకునా మయం వంశ: సుమిత్రాంతో గమిశ్యతి. ఇక్ష్వాకు వంశం సుమిత్ర రాజుతో అంతమైంది. అంటే మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138 నుంచి క్రీస్తుపూర్వం 1634 వరకు ఈ వంశం కొనసాగింది.

బుద్ధుడు.. మగధకు 31, 32, 33వ రాజులైన క్షేమజిత్, బింబిసార, అజాత శత్రులకు సమకాలికుడు. అజాతశత్రు పట్టాభిషేకం సమయానికి బుద్ధుడి వయసు 72 ఏండ్లని బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. ప్రాచీన గ్రంథాల ప్రకారం అజాతశత్రు పట్టాభిషేకం క్రీస్తుపూర్వం 1814లో జరిగింది.

“When ajatasatru came to the throne of Magadha gotama (Buddha) was seventy two years old. But his genius still shone bright and clear” (The Heritage of India series. ‘Gotama Buddha’ p.70. by Kenneth T.Saunders, Edition 1922)

“Buddha Left the body in 1807 bc., at ‘Kusinara” owing to dysentery resultant upan an undigestable food offered to him by a devotee at the town ‘pava’ The Buddhistic works also say that Buddha lived for 80 years Gotama was now seventy nine years old. He continued his ministry of preaching and teaching, revisiting his favouritic Haunts” (ibid, p.76)

బుద్ధుడు క్రీస్తుపూర్వం 1807 లో పావాలో ఉన్న కుశినారలో శరీరాన్ని విడిచిపెట్టాడు. జీర్ణము కాని ఆహారం స్వీకరించడం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్య వల్ల బుద్ధుడు నిర్యాణం చెందాడు. ఆయన 80 సంవత్సరాలు జీవించినట్టుగా బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి.

ఇక్ష్వాకు వంశానికి చెందిన కోసల రాజ్యం కాలపరిణామంలో చిన్న చిన్న రాజ్యాలుగా విడివడింది. దీనివల్ల చాలా రాజులు, రాజధానులు వచ్చారు. వీటిలో దేనికీ అయోధ్య రాజధానిగా లేదు. వీటిలో కొన్ని చిన్నచిన్న వంశాలు నెలకొన్నాయి. పావ మల్ల క్షత్రియ, కుశినారమల్ల క్షత్రియ, వైదేహ, వజ్య, వైశాలి లిచ్ఛవి క్షత్రియులు (గోత్రనామం వశిష్ట), శాక్య, శాక్య లిచ్ఛవి తదితర వంశాలు గౌతమ గోత్రనామం కలిగినవారు. థిరభుక్త, కోలియ క్షత్రియులు వైగ్రపాద గోత్రం కలిగినవారు. బుద్ధుడు ఈ శాక్య క్షత్రియుడు.

శాక్యముని మహాభారత యుద్ధం తరువాత పరంపరలో 22వ రాజు పశ్చిమ కోసలకు రాజుగా ఉన్నాడు. దీనికి కపిలవస్తు రాజధానిగా ఉన్నది. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్నది. శుద్ధోధనుడు శాక్యుడి కొడుకు. ఇతని భార్యలు మాయ, ప్రజాపతి. మాయకు పుట్టినవాడే గౌతమ బుద్ధుడు. జనరల్ కన్నింగమ్, మిస్టర్ కార్లియల్ కపిలవస్తు నగరాన్ని కనుగొన్నారు. నేపాల్‌లోని బస్తీజిల్లాలో కపిలవస్తు ఉన్నది. ఫైజాబాద్‌కు (ప్రస్తుతం అయోధ్య ఉన్న జిల్లా) ఈశాన్యంలో 25 మైళ్ల దూరంలో.. నేపాల్‌లోని బస్తీ పట్టణానికి వాయవ్యంలో 12 మైళ్ల దూరంలో ఉన్నది. వారణాసికి 120 మైళ్ల దూరంలో ఉన్నది.

మహాభారత యుద్ధం అనంతరం కొనసాగిన ఇక్ష్వాకు వంశంలో శుద్ధోధనుడు 23వ రాజు. అతని కొడుకు సిద్ధార్థుడు రాజరిక జీవితాన్ని వదిలేసి 29వ ఏట జ్ఞానం కోసం అన్వేషిస్తూ బయలుదేరాడు. ఆరేండ్ల తరువాత ఆయనకు జ్ఞానం ఉదయించింది. అతని కొడుకు రాహుల 25వ రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. ఆ తరువాత మరో అయిదుగురు రాజులు ఇక్ష్వాకు వంశాన్ని పాలించారు. మహాభారత యుద్ధం తరువాత ఇక్ష్వాకు రాజులు 1504 సంవత్సరాలు పరిపాలించారు.

రాజు సంఖ్యఇక్ష్వాకు వంశరాజులురాజు సంఖ్యసమకాలీన మగధ రాజులుపాలనకాలం (క్రీ.పూ.)
20రణంజయ28శిశునాగ1994-1954
21సంజయ29కాకవర్ణ1951-1918
22శాక్య30క్షేమ ధర్మ1918-1892
23శుద్ధోధన31క్షేమజిత్1892-1852
24సిద్ధార్థ (పుట్టుక)  1887
 బుద్ధుడిగా మారిన సంవత్సరం  1852
 బుద్ధుడు తన ధర్మాలను చెప్పిన సంవత్సరాలు32బింబిసార1852-1814
33అజాతశత్రు1814-1787
బుద్ధుడి జననం1887 బీసీ
బుద్ధుడి రాజ్యం వదిలేసిన సంవత్సరం1858 బీసీ
జ్ఞానం కోసం అన్వేషించిన సంవత్సరాలు1858-1852 బీసీ
జ్ఞానం పంచిన కాలం1852-1807 బీసీ
జీవించిన కాలం1887-1807 బీసీ (80 సంవత్సరాలు)

మహాభారత కాలం నుంచి రాజుల పరిపాలన కాలాన్ని కచ్చితంగా లెక్కించుకొంటూ వస్తే గౌతమబుద్ధుడి దగ్గరకు వచ్చేసరికి క్రీస్తుపూర్వం 19వ శతాబ్దం అవుతున్నది. పాశ్చాత్య చరిత్రకారులు మాత్రం బుద్ధుడి కాలాన్ని క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దం అని నిర్ధారించారు. దీనివల్ల మన చరిత్ర మొత్తం తప్పుగా రికార్డు అయింది. దీన్ని సరిచేసే ప్రయత్నం ఎంతమాత్రం జరుగలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here