రామం భజే శ్యామలం-29

0
2

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]భా[/dropcap]రతదేశానికి సంబంధించి మనకు మనవాళ్లు రెండువందల ఏండ్లుగా చెప్పని చరిత్ర చాలా ఉన్నది. దాన్నంతా మరుగున పడేసి యురోపియన్లు రుద్దిన తప్పుడు చరిత్రనే ఇప్పటికీ చెప్పుకొంటున్నాం. గమ్మత్తేమిటంటే.. తాము రాసింది తప్పని నెత్తీనోరూ బాదుకొని చెప్పినోళ్ల మాటలను కూడా పట్టించుకోవడంలేదు. నువ్వు చెప్పింది తప్పుకాదు.. రైటేనని మనమే బల్లగుద్దిచెప్తున్నాం. మా దగ్గర ఏమీ లేదు. ప్రపంచంలోనికి వేరే ప్రాంతంనుంచి పెద్ద ఎత్తున వలసలు జరిగాయి.. ఈ దేశాన్ని.. ఇక్కడి ప్రజలకు తినడం.. బట్ట కట్టడం, నాగరికతను నేర్పారు. అని మనల్ని మనమే తరతరాలుగా వంచించుకొంటున్నాం. వీటన్నింటికీ మూలం ఒకే ఒక్కటి ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం.

ఈ ఒక్క సిద్ధాంతం ఈ దేశ చరిత్రను దారుణంగా విధ్వంసం చేసింది. మనల్ని మనం కాకుండా చేసింది. పరాయివాళ్లను చేసింది. మనలో మనకు విభేదాలను కల్పించింది. ఉత్తర, దక్షిణ భారతీయులగా విడగొట్టింది. రెండు జాతులుగా మార్చింది. సమస్తమైన అవకరాలకు ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అన్నది పునాదిగా మారింది. ఈ సిద్ధాంతం తప్పని రాసినవాళ్లే చెప్పినా వినే దశను మనం ఎన్నడో దాటిపోయాం. నిజంగా ఈ వాదన వెనుక వాస్తవం ఉన్నదా? లేదా? అన్న అంశం శాస్త్రీయంగా నిరూపణ అయితే తప్ప భారత అస్తిత్వం మూలాన్వేషణ ఒక రుజుమార్గం పట్టదు. ఇందుకోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ప్రజల అస్తిత్వం ఏమిటన్నదానిపై విసృ్తతంగా పరిశోధనలు జరిగాయి. జన్యుపరంగా జరిగిన పరిశోధనలు.. మన మూలాలకు సంబంధించిన అనేక అంశాలపై లోతైన చర్చకు దారిచూపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల అంటే గత రెండు దశాబ్దాల్లో జరిగిన కొన్ని పరిశోధనల వివరాలను ఈ వ్యాసంలో ఒకసారి చర్చిద్దాం.

2003లో శాస్త్రవేత్త స్టీఫెన్ ఓపెన్‌హైమర్ మనుషుల ఐడెంటిటీని గురించిన జన్యుపరమైన పరిశోధన పత్రమొకదాన్ని ప్రచురించారు. ఈయన దాదాపు 1,50,000 సంవత్సరాల క్రితం నుంచి మనుషుల ఉనికి (హోమో సైపియన్స్).. వలసలు.. ఇతర అంశాలపై ఫోకస్‌చేశారు. ముఖ్యంగా మనుషుల వలసల చరిత్రను కనుక్కోవడానికి ప్రయత్నించారు. వీరిలో ఒక గ్రూపు ప్రజలు 85 వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశాల నుంచి తూర్పు సముద్రతీరం వైపు వలసలు వెళ్లారు. వీరు భారతదేశం దక్షిణం వైపు ముక్కోణంలో ఉన్న సముద్రతీరం వెంబడి పయనించారు. క్రమంగా సుమత్రా.. తైవాన్ దాకా వీరి వలసలు సాగాయి. ఈ డాక్యుమెంట్ ప్రకారం భారతదేశంలో కానీ.. తూర్పున ఉన్న పలుదేశాల్లో ఉన్న ఆఫ్రికనేతరుల మూలాలు.. ఈ ఆఫ్రికన్లనుంచే వచ్చాయి. ఈ వలసలు ఒక్కసారిగా జరిగినవి కావు.. కొన్ని వేల ఏండ్ల తరబడి సాగినవి. తరాలు తరాలు మారుతూ వచ్చాయి. ఈ వలసలు కాల పరిణామ క్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమాజాల సృష్టికి కారణమయ్యాయి. కానీ విచిత్రమేమిటంటే వీరు పశ్చిమ ప్రపంచం వైపు వెళ్లలేదు. ఇదే సమయంలో యూరప్ నుంచి ఇరాన్ మీదుగా చగాయ్ హిల్స్ వరకు మరో జాతి జీవులు ఉండేవారు. వీరిని నియాందర్‌తల్స్ అన్నారు. వీరు కూడా సముద్రతీరం వెంబడి వలసలు పోయినవారే. అదే సమయంలో విస్తారమైన భారతదేశంలోనూ ప్రజల ఉనికి ఉన్నట్టు స్టీఫెన్ డాక్యుమెంట్ పేర్కొంటున్నది. ఇందుకు బలమైన సాక్ష్యాన్ని కూడా ఇతను చూపించాడు. 75 వేల ఏండ్లక్రితం సుమత్రాలో ఒక భారీ అగ్నిపర్వతం బద్దలైంది. దీన్ని ‘మౌంట్ టోబా ఈవెంట్’ అని పిలుస్తారు. దీని నుంచి వచ్చిన బూడిద.. భారత్, పాకిస్థాన్‌లను దాదాపు ఐదు మీటర్ల ఎత్తుమేరకు కప్పేసింది. చాలావరకు మనుషుల హననానికి ఈ అగ్ని పర్వతం కారణమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని జ్వాలాపురంలో ఆ మధ్య జరిపిన పురావస్తు తవ్వకాల్లో మౌంట్ టోబా ఈవెంట్‌కు సంబంధించిన బూడిద పొర బయటపడింది. దాని కింద మనుషుల అవశేషాలను కూడా కనుగొన్నారు. మౌంట్ టోబా ఈవెంట్‌కు ముందే.. భారతదేశంలో మనుషులు ఉన్నారనడానికి ఇది సాక్ష్యంగా స్టీఫెన్ నిరూపించారు. కొరిశెట్ట రవి అనే పరిశోధకుడు ఈ మౌంట్ టోబా ఈవెంట్‌పై లోతైన రీసర్చ్ చేశారు. అగ్నిపర్వతం బద్దలైన పరిణామ క్రమంలో వచ్చిన ఐస్‌ఏజ్ 65 వేల ఏండ్ల క్రితం ముగిసింది. ఐస్‌ఏజ్ ముగిసిన సమయంలోనే నియాందర్‌తల్స్ అంతమయ్యారు. వీరి అంతానికి కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియదు. స్టీఫెన్ డాక్యుమెంట్ కూడా దీన్ని స్పష్టంగా కనుక్కోలేకపోయింది. ఆ తర్వాత యూరప్‌కు తూర్పువైపు నుంచి వలసలు జరిగాయి. ముఖ్యంగా సింధ్, గుజరాత్ ప్రాంతాలనుంచి బయలుదేరిన ప్రజలు ఇస్తాన్‌బుల్ దగ్గర ఉన్న బాస్ఫరస్ మీదుగా యూరప్‌లోకి ప్రవేశించారు. వీళ్లే ఆ తర్వాత యురోపియన్లుగా మారారు. తర్వాత 40 వేల ఏండ్ల క్రితం.. భారత్, సుమేరియా, తూర్పు భారత ప్రాంతాలు.. సైబేరియా వంటి కొన్ని ప్రాంతాల్లోని కొందరు ప్రజలు పశ్చిమం వైపు సుదీర్ఘ ప్రయాణం చేశారు. వీరు ఉత్తర దక్షిణ అమెరికాలకు వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. ఇది దాదాపు 40 వేల ఏండ్ల క్రితం జరిగింది. తరువాతి కాలంలో వీరు నేటివ్ అమెరికన్లుగా మారారు. ఇది స్టీఫెన్ ఓపెన్‌సైమర్.. మెటర్నల్ మైటోకాండ్రియల్ డీఎన్‌ఏ పై చేసిన పరిశోధన సారాంశం.

2013లో హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సంస్థ సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఒక డాక్యుమెంట్‌ను అమెరికాకు చెందిన ఓ జర్నల్‌లో హ్యూమన్ జనటిక్స్‌పై ఒక డాక్యుమెంట్‌ను విడుదలచేసింది. ప్రియా మూర్జాని, ప్రొఫెసర్ కుమారస్వామి తంగరాజ్ అనే ఇద్దరు సీనియర్ సీసీఎంబీ శాస్త్రవేత్తలు భారతదేశవ్యాప్తంగా వేలమంది ప్రజల డీఎన్‌ఏ శాంపిల్స్ తీసుకొని పరిశోధన చేశారు. ఎక్స్, వై క్రోమోజోములు కాకుండా డీఎన్‌ఏ శాంపిల్స్‌ను సేకరించారు. ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయులకు సంబంధించిన మూలాలు ఏమిటి? వాళ్ల పూర్వీకులు.. వీళ్ల పూర్వీకులు ఎవరు? వాళ్ల మధ్య ఉన్న సంబంధాలు ఏమిటి? అన్న అంశంపై పరిశోధన చేశారు. వీరి పరిశోధన అత్యంత ఆసక్తికరమైన అంశం వెలుగుచూస్తున్నది. వీరి పరిశోధన ప్రకారం.. ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయుల పూర్వీకులు సుమారు 60 వేల ఏండ్ల క్రితం ఉన్నట్టుగా నిరూపణ అవుతున్నది. అంతేకాకుండా ఇద్దరి పూర్వీకులు ఒకరేనని కూడా వీరు నిరూపించారు. ఈ పరిశోధన స్టీఫెన్ ఓపెన్‌హైమర్ పరిశోధనను పూర్తిగా బలపరుస్తున్నది. భారతదేశంలో వీరంతా వేల ఏండ్లపాటు పక్కపక్కనే నివసించారని స్టీఫెన్ డాక్యుమెంట్ స్పష్టంగానే చెప్తున్నది. దాదాపు 2000 బీసీఈ వరకూ కూడా వీరు ఒక్కదగ్గరే నివసించారు. ఆ సమయంలో వీరి మధ్య సజాతి వివాహాలు పెద్ద ఎత్తున జరిగాయి. కొన్ని తరాల పాటు వారి మధ్య కలగలిసిపోయే ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగింది.

యురోపియన్ల వాదన ప్రకారం క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో మధ్య ఆసియా నుంచి వలస వచ్చారని యురోపియన్ చరిత్రకారులు.. ఆ తర్వాత వారిని ఇమిటేట్ చేసిన చరిత్రకారులు ఇంతకాలంగా ప్రచారంచేస్తున్నారు కదా.. అదే నిజం అయి ఉంటే.. వారి జన్యువుల ముద్ర ఈ దేశంలో ఏ మూలనైనా లభించి ఉండాలి కదా.. ఈ సిద్ధాంతం వెనుక నిజానిజాలను కనుగొనడానికి సీసీఎంబీ శాస్త్రవేత్తలు చాలా శ్రమించారు. ముందుగా క్రీస్తుపూర్వం 2వేల సంవత్సరాల క్రితం మానవ జన్యువుల గురించి అన్వేషించారు. ఆ తరువాత క్రీస్తుపూర్వం 3 వేలు, నాలుగువేలు, ఆరువేలు.. ఇలా అన్వేషణ కొనసాగుతూ పోయింది. ఒక్క ఆధారం కూడా లభించలేదు. కనీసం 12,500 సంవత్సరాల వరకు వెళ్లాల్సి వచ్చింది. ఉత్తర భారతీయుల పూర్వీకులకు, వెస్ట్ యురేషియా గ్రూపుల మధ్య సంబంధం ఉన్నట్టు జన్యుపరంగా చిన్న ఆధారం కూడా దొరకలేదు.

2012లో నేషనల్ జెనోగాఫ్రిక్ కన్సార్టియమ్‌కు చెందిన ప్రొఫెసర్ రామస్వామి పిచ్చప్పన్ ఒక పరిశోధన పత్రం సమర్పించారు. ఈయన తమిళనాడులోని వేర్వేరు కులాలు, సమాజాలు, జాతులకు సంబంధించిన 1680 మంది మూలాలపై పరిశోధన చేశారు. వీరిమధ్య సామాజిక సంబంధాలపై అన్వేషించారు. ఆయా వృత్తులను చేసే కుటుంబాల మధ్య సజాతి వివాహాలు (ఎండోగామీ) దాదాపు ఆరువేల ఏండ్ల నుంచి ఉన్నట్టుగా నిరూపితమైందని ఆయన డాక్యుమెంట్ చెప్తున్నది. ఆర్యులు క్రీస్తుపూర్వం 15 వందల ఏండ్ల క్రితం వచ్చి ఇక్కడ ద్రవిడులపై వేదమతాన్ని, నాగరికతను, సంస్కృతాన్ని ఇంపోజ్‌ చేశారని కదా చెప్తున్నారు. కానీ.. ప్రాచీన తమిళభాషలోనే పలు సంస్కృత పదాలు సమ్మిళితమై కనిపిస్తున్నాయే.. కురి, ఆది, కష్టం, రక్ష.. ఇలా ఎన్నెన్నో సిమిలర్ పదాలు మనకు ఈ రెండు భాషల్లో కనిపిస్తున్నాయి. మరి ప్రొఫెసర్ రామస్వామి పిచ్చప్పన్ డాక్యుమెంట్ ప్రకారం తమిళుల జన్యు మూలాలు ఆరువేల ఏండ్ల క్రితం నాటివైతే.. తమిళం ప్రాచీనరూపం కూడా అదే కాలానికి చెంది ఉండాలి కదా.. మరి దాంతోపాటే సంస్కృతం ఉనికి కూడా అంతే ప్రాచీనానికి వెళ్లిపోవాలి కదా.. అలాంటప్పుడు ఆర్యులు అనేవారు.. క్రీస్తుపూర్వం 1500 కాకుండా ఇంకా ముందే భారతదేశానికి దండెత్తారా? చరిత్రకారులు చెప్పాలి..

ఇక్కడ రంగుకు సంబంధించిన చర్చ కూడా జరుగుతూ ఉన్నది. వీళ్లు నల్లగా ఉన్నారు.. వాళ్లు తెల్లగా ఉన్నారు.. అలాంటప్పుడు రెండు జాతులు కాకుండా ఒకే జాతి ఎలా అవుతుందన్న ప్రశ్నా ఎదురవుతుంది. దీనికి సంబంధించి 2013లో ఒక పరిశోధనాపత్రం విడుదల అయింది. ఎస్‌ఎల్‌సీ24ఏ5 అనే పలుచని చర్మానికి సంబంధించిన జీన్.. దక్షిణాసియా, యురోపియన్లలో కామన్‌గా కనపడుతుందట. మనిషిలోని 15 క్రోమోజోముల్లో ఈ చర్మపు రంగు పరిణామం (మెలానిన్) కనిపిస్తుంది. వీరిలో ఈ రకమైన ఉత్పరివర్తనం దాదాపు ముప్ఫై వేల ఏండ్ల క్రితమే సంభవించిందట. ప్రాచీన వలసల కాలంలోనే ఈ మ్యుటేషన్ జరిగినట్టు తెలుస్తున్నదని ఈ డాక్యుమెంట్ చెప్తున్నది. ఉత్తర భారతీయులతోపాటు, దక్షిణ భారతీయుల్లోనూ ఈ పరివర్తనం జరిగింది. ఎక్కువమంది యురోపియన్లలోనూ ఇదే రకమైన ఉత్పరివర్తనం జరిగిందని ఈ డాక్యుమెంట్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నది. 2013లో విడుదలైన ఈ డాక్యుమెంట్‌లో మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. సిరియాలో రోమన్ కాలానికి సంబంధించిన ఒక అస్తిపంజరం లభించింది. ఈ అస్తిపంజరాన్ని విశ్లేషించి చూసినప్పుడు ఇది ఉత్తర భారతీయ జనాభాకు సంబంధించిన జీన్స్ ఉన్నట్టు తేలింది. అయితే.. సరస్వతీ నది అంతర్ధానం కావడం వల్ల ఈ తీరంలో ఉన్న జనాభా రోమ్ వైపు తరలివెళ్లిందని ప్రఖ్యాత అమెరికన్ ఇండియన్ సైంటిస్ట్ ప్రొఫెసర్ సుభాష్ కక్ చెప్తున్నారు.

2015లో మరో మూడు పరిశోధనా పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి ఆర్యుల దండయాత్రను సపోర్ట్ చేసేందుకు ఉద్దేశించినవి. ఈ పత్రాల ఆధారంగా ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం కరెక్టేనని భారత్‌కు చెందిన టోనీ జోసఫ్ రాశాడు. ఈ పత్రాలు మూడు కూడా ఆర్1ఏ జీన్ ను ఆధారంచేసుకొని చేసిన పరిశోధన ఫలితాలు. ఆర్1ఏ అనేది వై క్రోమోజోమ్‌లో ఉంటుంది. ఈ ఆర్1ఏ జీన్ దాదాపు 25 వేల ఏండ్ల క్రితం నాటి జెనెటిక్ రికార్డులో కనిపించింది. పీటర్ అండర్‌హిల్ అనే శాస్త్రవేత్త 2014లో 126 మంది నుంచి 16 వేల డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరించి పరిశోధనచేశాడు. దీని ప్రకారం ఆర్‌వన్‌ఏ మ్యుటేషన్ ఇరాన్‌లోని ఓ ప్రాంతంలో పాతికవేల ఏండ్ల క్రితం కనిపించిందని నిర్ధారణకు వచ్చారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాతం గురించి మనం మాట్లాడేటట్లయితే.. పాతికవేల ఏండ్లనాటి ఉత్పరివర్తనాన్ని ఎలా అప్లై చేస్తాం. వాళ్లు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో వచ్చారని కదా చరిత్రకారులు చెప్తున్న విషయం. మనం లెక్కించాల్సింది క్రీస్తుపూర్వం 2000 నుంచి 1500 మధ్య కాలంలో కొత్త ఉత్పరివర్తనం జరిగిందా అన్న అంశాన్ని పరిశీలించాలి. ఆర్యులు వచ్చిన తరువాతే.. ఇక్కడ నూతన సమాజాలు, నాగరికత.. భాష, సంస్కృతి అన్నవన్ని పుట్టుకొచ్చినవి అని భావించినప్పుడు కచ్చితంగా అప్పుడే మనుషుల మధ్య జన్యుపరమైన మ్యుటేషన్ జరిగి ఉండాలి కదా.. దాన్ని నిర్ధారించలేనప్పుడు పీటర్ అండర్‌హిల్ పత్రాలు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ఏ ప్రాతిపదికన సమర్థిస్తాయన్న ప్రశ్న తలెత్తడంతో పీటర్ అండర్‌హిల్ బృందం ఆర్1ఏ జీన్‌లోని సబ్ క్లేడ్‌లు జెడ్282, జెడ్93లను విశ్లేషించారు. ఈ రెండు కూడా క్రీస్తుపూర్వం ఆరువేల ఏండ్ల క్రితం ఉన్నట్టు కనిపించాయి. కివిసీడ్, మస్కారెన్హాస్, మిరాటెల్ అనే ఈ బృందంలోని సైంటిస్టులు వీటిపై ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. మస్కారెన్హాస్ దక్షిణాసియాలో, మధ్య ఆసియా రెండింటిలోనూ జెడ్282, జెడ్93 జన్యువులు కనిపించాయని అంటే.. మరొకరు పశ్చిమాసియాలో జెడ్ 93 కనిపించిందని పేర్కొన్నారు. కొందరేమో ఆర్1ఏ దక్షిణాసియాలో కనిపించిందని.. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు.

ఈ జన్యు అధ్యయనాలన్నీ ఒక ప్రత్యేక పద్ధతిలో కొనసాగుతాయి. ఇందులో ఫీల్డ్ వర్క్ అత్యంత ప్రధానమైంది. ముందుగా వివిధ రకాల వ్యక్తుల దగ్గరినుంచి శాంపిల్స్ సేకరిస్తారు. ముఖ్యంగా లాలాజలాన్ని సేకరిస్తారు. దాన్ని శుభ్రపరుస్తారు. దాన్నుంచి సీక్వెన్సింగ్ చేయడం ద్వారా డాటాను తెలుసుకొంటారు. ఆ డాటా నుంచి మ్యాథమెటికల్ అనాలిసిస్ చేస్తారు. అనంతరం క్లస్టరింగ్ జరుగుతుంది. ఆ తరువాత ఎస్‌క్యూపీ విధానం ద్వారా అన్ని రకాల గణాంకాలను కనుగొంటారు. ఈ గణాంకాల ఆధారంగా జన్యు ఉత్పరివర్తనాల కాలాన్ని అంచనావేస్తారు.

ఈ శాస్త్రీయ పరిశోధనలన్నీ వందేండ్లుగా కొనసాగుతున్నాయే కానీ.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నింటి పరిశోధనలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే భారతదేశంలోకి ఏ యుగంలోనూ.. ఏ దశలోనూ వలసలు వచ్చినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. భారతదేశంలోకి జన్యు ప్రవాహం జరిగినట్టు తేలలేదు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన జన్యు ఉత్పరివర్తనాలు భారత్‌లో జరిగినట్టు ఎలాంటి నిర్ధారణ జరుగలేదు. పైగా మన దేశంనుంచే ఐరోపా, యూరప్‌ల వరకు జన్యు ఉత్పరివర్తనాలు జరిగినట్టు ఆధారాలు లభించాయి. ఇంత స్పష్టంగా మనకు శాస్త్రీయపరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్యుల జన్యువు.. ద్రావిడుల జన్యువు వేరుగా లేవు. వీరి మధ్య సామాజిక అనుబంధం స్పష్టంగా కనిపిస్తున్నది. అందువల్ల కంక్లూషన్ ఏమింటే.. ఆర్యులు, ద్రావిడులు వేరు కాదు.. అందరం ఒక్కటే.

***

kumaraswamy thangaraj
migration of people
Raj Vedam

Image Courtesy: Internet, Swadhyaya Resource Centre,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here