రామం భజే శ్యామలం-30

1
2

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]భా[/dropcap]రతదేశ చరిత్ర ప్రాచీనమైందని ఎలా అంగీకరించాలి? వేల ఏండ్లనాటి చరిత్ర అంటూ మైకుల ముందు పోచికోలు మాటలు మాట్లాడితే సరిపోతుందా? హేతువాదం అన్నది ఒకటున్నది కదా.. అంటే హేతువు లేకుండా.. కండ్లముందు చూపించకుండా దేన్నీ నమ్మేది లేదు. చైనాలోనో.. రష్యాలోనో.. దక్షిణ అమెరికాలో అయితే ఓకే.. భారతదేశంలో మాత్రం ఆధారాలు చూపించాల్సిందే. దక్షిణ అమెరికాలో పెరు అని ఒక ఊరున్నది. ఇక్కడ బోలెడు రాళ్లు కనిపిస్తుంటాయి. ఈ రాళ్లలో ఒక రాయికి దేవుడి ఇల్లు అని పేరు. ఆడమ్, ఈవ్‌లు ఇక్కడే పుట్టారట. దేవుడిచ్చిన యాపిల్ ఇక్కడే తిన్నారట. సృష్టి ఇక్కడే మొదలైందిట. సరే.. వాళ్ల విశ్వాసం వాళ్లది. మనం ప్రశ్నించాల్సిన పనిలేదు. దీనికి హేతువు ఏమిటి అంటే చెప్పడం కష్టం. మన దేశంలోని హేతువాదులకు వీటి గురించి మాట్లాడే ధైర్యం ఉండదు. మనదేశం విషయానికి వచ్చేసరికి మాత్రం క్రీస్తు పుట్టేసరికి మనదేశంలో అసలు జనమే లేరన్న స్థాయిలో ఉపన్యాసాలు దంచేస్తారు. నిజంగా మన చరిత్ర ప్రాచీనమైంది కాదా? ఇదే విషయమై ఇప్పటివరకు ఎన్నో పరిశోధనలు జరిగాయి. భారత పురావస్తు పరిశోధన సంస్థ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) తవ్వకాల్లో కూడా చాలా చాలా బయటపడ్డాయి. ఈ సర్వేల సారాంశం ఏమిటి? మన మూలాలు ఏమిటి? మన నాగరికత ఎన్నేండ్ల క్రితం నాటివి..? ఈ వివరాలు ఈ దేశంలో ఈ తరానికి ఏమీ తెలియవు. అసలు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నది ఒకటున్నదని కానీ.. దాని పని ఇది అని కానీ.. అది చేసిన పరిశోధనలు.. తవ్వకాలు.. ఫలితాలు ఏమిటన్న విషయం కానీ.. ఎవరికైనా తెలుసా? ఎంతసేపూ యురోపియన్ చరిత్రకారులు.. మనదేశంలో వారి గుత్తేదారులు చెప్పిందే చెప్పి.. రాసిందే రాసి.. చివరకు తమ దేశం గురించి తాము తెలుసుకోవాల్సిన అవసరమే లేదన్నట్టుగా ద్వేషం పుట్టించారు. చదువుకోవడం అంటే.. అమెరికాకో.. యూరోప్‌కో పోవడానికే తప్ప దిక్కులేని బతుకులైనాయి.

ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతర పరిశోధనలను నిశితంగా పరిశీలిస్తే.. మన దేశానికి సంబంధించిన వేర్లు ఎంత లోతుల్లో ఉన్నయో అర్థమవుతుంది. అసేతుహిమాచలం ఏ విధంగా ఒకేవిధమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయో.. అర్థమవుతుంది. అన్ని భాషలు, అన్ని సమాజాలు, వెరసి సబ్బండ వర్ణాలు ఒకే మౌలిక సూత్రంపై ఆధారపడి జీవించాయో అర్థమవుతుంది. మన దేశ ప్రాచీన చరిత్ర, నాగరికత, జనజీవనానికి సంబంధించిన ఆర్కియలాజికల్ ఆధారాలను సమీక్షిస్తే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. సుమారు నలభై వేల సంవత్సరాల క్రితం కాలానికి సంబంధించిన ఆధారాలు భారతదేశంలోని చాలా చాలా ప్రాంతాల్లో లభ్యమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని జ్వాలాపురం రాక్‌షెల్టర్‌లో దాదాపు 35 వేల సంవత్సరాలకు పూర్వంనాటి పురావస్తువులు దొరికాయి. మధ్యప్రదేశ్ భోజ్‌పూర్‌లోని బింబెట్కాలో కూడా 35 వేల సంవత్సరాల క్రితం నాటి రాతిపైన గీసిన చిత్రాలు (పెయింటింగ్స్) దొరికాయి. ఇక్కడ గుర్రంపై రౌతు వెళ్తున్న చిత్రాన్ని కూడా చూడవచ్చు. ఇదేరకమైన గుర్రాలపైన రౌతు వెళ్లే చిత్రాలు హరప్పాలో సైతం కొల్లలుగా ఉన్నాయి. అయితే బింబెట్కాలో ఉన్న గుర్రంపై రౌతుకు.. హరప్పాకు పోలిక కనిపించదు. కానీ, కేరళలోని ఎడక్కల్ గుహల్లో తొమ్మిదివేల సంవత్సరాలనాటి చేతి రాతలు, బొమ్మలు కనిపిస్తాయి. ఇందులోకూడా గుర్రం, రౌతు చిత్రాలు.. కూజా పట్టుకొన్న వ్యక్తి బొమ్మ ఉంటుంది. ఈ సంకేత చిత్రం హరప్పాలో కూడా కనిపిస్తుంది. ఈ రెండు కూడా అచ్చు ఒకేలా ఉంటాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే కేరళ ఎడక్కల్ ప్రాంతానికి, హరప్పాకు మధ్య సాంస్కృతిక సంబంధం ఏదైనా ఉన్నదేమోననిపిస్తుంది. రెండు వేర్వేరు కాలాలకు చెందినవి కావచ్చు. కానీ జీవన సంబంధం ఒకేరకంగా ఉన్నట్టు అర్థమవుతుంది. హర్యానాలోని భిర్రానా, రాఖీగఢ్ ప్రాంతాల్లో పదివేల సంవత్సరాలనాటి పురావస్తువులు అనేకం లభించాయి. ఆంధ్రప్రదేశ్ కేతవరంలో 8 వేల సంవత్సరాలనాటి వస్తువులు లభించాయి. తెలంగాణలోని రామచంద్రాపురంలో 12 వేల సంవత్సరాలనాటి పురావస్తువులు లభించాయి. వీటన్నింటి గురించిన పూర్తి వివరాలతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2008లో ఒక పరిశోధనా పత్రాన్ని కూడా విడుదలచేసింది. ప్రస్తుతకాలం నుంచి 2750 సంవత్సరాల వెనక్కి వెళ్లితే.. అక్కడినుంచి 9550 ఏండ్ల వెనుక కాలం వరకు చాలా చాలా పురావస్తువులు లభించాయి. వీటన్నింటి గురించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గదుల్లో మళ్లీ భూస్థాపితం చేసే ప్రయత్నమే జరిగిందే తప్ప వర్తమానంలో ప్రజలకు చేరలేదు.

మొహంజొదారో తవ్వకాల్లో దొరికిన పలు ముద్రల్లో రెండింటి గురించి (420, 430 నంబర్ ముద్రలు).. ప్రొఫెసర్ అభయంకర్ 1993లో ఒక బులెటిన్ విడుదలచేశారు. ఈ రెండు ముద్రలు భారతీయ ఆస్ట్రొనామికల్ ఎన్‌కోడింగ్‌ను సూచిస్తున్నాయి. అంటే జ్యోతిష విజ్ఞానానికి సంకేతాలుగా కనిపించాయి. 430 ముద్రపై నాలుగు బొమ్మలున్నాయి. ఇవి.. ఒకటి శివుడు, రెండోవైపు పశుపతి.. మిగతా రెండు వైపులు వేర్వేరు గుర్తులు ఉన్నాయి. ఇవి ఆయనాంతం, విషువత్తులను సూచించే సంకేతాలు అయి ఉండవచ్చని అభయంకర్ అభిప్రాయపడ్డారు. జ్యోతిషంలో నాలుగు కార్డినల్ స్థానాలుంటాయి. వీటిలో రెండు ఆయనాంతాలు, రెండు విషువత్తులు ఉంటాయి. వీటి గురించి తర్వాత వ్యాసంలో కొంత వివరంగా చర్చించుకోవచ్చు. కాబట్టి.. ఈ జంతువులు, ఇతర బొమ్మలు ఆ కాలంనాటికి నక్షత్రరాశులు కావచ్చు. 430 ముద్ర క్రీస్తు పూర్వం మూడువేల సంవత్సరాల నాటి సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. 420 ముద్రను గమనిస్తే దీనిపై ఏడు బొమ్మలు కనిపిస్తాయి. ఈ బొమ్మలు 3102 బీసీ.. అంటే కలియుగం ప్రారంభమైన సంవత్సరం. ఆనాటి గ్రహాల అమరికను ఈ ముద్ర సూచిస్తుంది. ఈ రెండు ముద్రలు.. వేద కాలం నుంచి హరప్పా దాకా నాగరికత కొనసాగింపును స్పష్టంగానే సూచిస్తున్నాయి.

మార్చి 2003లో చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి ఒక డాక్యుమెంట్ విడుదలైంది. ఇందులోని వివరాల ప్రకారం ఈ ఇన్‌స్టిట్యూట్ చెందిన శాస్త్రవేత్తలు.. సోనార్ టెక్నాలజీ సహాయంతో భారతదేశ పశ్చిమతీరంలో సముద్రం అడుగు భాగాన్ని మ్యాప్ చేయడం కోసం బయలుదేరారు. సముద్రమట్టం నుంచి 40 మీటర్ల లోతులలో వారు 9 కిలోమీటర్ల పొడవున ఒక నగరానికి చెందిన గోడ కనిపించింది. దీంతోపాటు చాలా చాలా పురావస్తువులు లభించాయి. దీంతోపాటు వీరికి ఒక చెక్కముక్క దొరికింది. ఈ చెక్కముక్కను హైదరాబాద్‌లోని నేషనల్ జియో ఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు, జర్మనీ హానోవర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు పరిశోధన కోసం పంపించారు. ఈ రెండు సంస్థలు ఈ ముక్కను పరిశీలించి కార్బన్ డేటింగ్ చేశారు. ఇది క్రీస్తుపూర్వం 8500 నుంచి, 9300 సంవత్సరాల మధ్య కాలం నాటిదిగా తేల్చాయి.

భారతదేశ పురాతత్త్వ పరిశోధనకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఒకటి ఉన్నది. మన పురావస్తు శాస్త్రవేత్తలు మదురై ప్రాంతంలో తవ్వకాలు జరుపాలని భావించారు. అక్కడ భూమి చాలా విలువైంది కావడంతో ఆగిపోయారు. కానీ.. మదురైకి సరఫరా అయిన అనేకానేక వస్తువులు, ఆభరణాలు, ఇతర అంశాలు రావడానికి మార్గం ఎక్కడ ఉన్నది అన్న అంశంపై పరిశోధన చేశారు. మదురైకి సమీపంలోని కిజాది అన్న ప్రాంతం మదురైకి ప్రధాన వ్యాపార రవాణామార్గంగా కనుగొన్నారు. ఇక్కడ చాలా తవ్వకాలు జరిపి అనేక పురావస్తువులను కనుగొన్నారు. ఈ కిజాదీ ప్రాంతంలో దాదాపు 4.5 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపారు. మొదట వీరు రెండు మీటర్ల లోతు తవ్వి అక్కడ దొరికిన వస్తువులను కార్బన్ డేటింగ్‌కోసం అమెరికాలోని ఫ్లోరిడాకు పంపిస్తే ఆ వస్తువులు క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల నాటివని తెలిసింది. ఇది యురోపియన్ చరిత్రకారులు చెప్పే కథనానికి సరిగ్గా సరిపోతుంది. ఆ తర్వాత 2017లో మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు ఇదే రెండు మీటర్ల లోతులో దొరికిన వస్తువులకు స్వయంగా కార్బన్ డేటింగ్ చేశారు. దీని ఫలితం ప్రకారం ఇవి 2200 సంవత్సరాల క్రితంవని తేలింది. అంటే ఫ్లోరిడా ఫలితాలు తప్పని నిర్ధారణ అయింది. ఇక్కడినుంచి ఒక్కో మీటర్‌కు 1100 సంవత్సరాల లైనర్స్ స్కేలింగ్ చేసుకొంటూ వెళ్తే 4.5 మీటర్ల కింద లభించిన పురావస్తువులు ప్రస్తుతానికి దాదాపు 5వేల సంవత్సరాలకు పూర్వమైనవని తేలింది. అంటే.. కిజాదీలో దొరికిన పురావస్తువులు సుమారు మూడువేల బీసీఈ నుంచి, 500 బీసీఈ మధ్యకాలం నాటి వస్తువులన్నమాట. ఇక్కడ మనకు అర్ధం కానిదేమంటే.. ఆర్కియలాజికల్ సర్వేఆఫ్ ఇండియా కిజాదీ తవ్వకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎందుకు దాచిపెట్టింది. మొదటి రెండు మీటర్ల వరకు జరిపిన తవ్వకాల గురించి మాత్రమే వెల్లడించి మిగతా విషయాలను ఎందుకు బహిర్గత పరచలేదు. ఈ పరిణామం ఏఎస్‌ఐ నిజాయితీని శంకించాల్సిన పరిస్థితిని కల్పించింది. అక్టోబర్ 2017లో కిజాదీ సైట్‌ను స్వాధీనంచేసుకుంది. అక్కడ ఉన్న ఏఎస్‌ఐ సిబ్బందిని అందరినీ.. అటెండర్‌తో సహా బదిలీ చేయించింది. ఈ పరిణామాలన్నింటి వెనుక పెద్ద కుట్రే దాగి ఉన్నది. కిజాదీలో 3వేల ఏండ్లనాటి సామాజిక జీవన ఆనవాళ్లు ఉన్నట్టు బయటపడితే.. క్రీస్తుపూర్వం 1500 లో ఆర్యులు భారతదేశంపై దండయాత్రచేసి ద్రావిడులను అణచివేశారన్న కథనం తప్పని అంగీకరించాల్సి వస్తుంది. అప్పటికే తమిళనాట పెద్దఎత్తున ద్రావిడ ఉద్యమం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ పురాతత్వ పరిశోధన వివరాలు బయటపడితే.. ఉద్యమ ఉనికికే ముప్పు వస్తుంది. అందువల్ల వాటి వివరాలన్నింటినీ బయటకు రాకుండా తొక్కిపెట్టారు.

పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అన్న ఒక పోర్ట్ సెయిలర్స్ డాక్యుమెంట్ ఉన్నది. ఇందులో రోమన్ సామ్రాజ్యంతో సముద్ర వర్తకం జరిపిన ఓడరేవుల వివరాలు అన్నీ ఉన్నాయి. ఇందులో తమిళనాడులోని అరికమేడు రేవు గురించిన ప్రస్తావన ఉన్నది. రోమన్ వ్యాపారులు అరికమేడుతో ముస్లిన్, గాజుపూసలతో వ్యాపారం చేశారు. పుదుచ్చేరి ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఉంచబడ్డ ప్రాంతం అరికమేడు. మీరెవరైనా పుదుచ్చేరి వెళ్లి అరికమేడు గురించి అడిగితే మిమ్మల్ని వెర్రివాళ్లలాగా చూస్తారు. ఇక్కడికి రవాణా మార్గాలు లేవు. మోర్టిమర్ వీలర్ అనే అతను అరికమేడులో తవ్వకాలు జరిపాడు. ఇతనికి అగస్టస్ సీజర్‌కు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి. ఇతను 100 బీసీ నుంచి 100 ఏడీ వరకు అక్కడి తవ్వకాల్లో దొరికిన వస్తువులకు కాలాన్ని నిర్ధారించాడు.

విమలా బేగ్లే.. 19891992 వరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త. ఈమె అరికమేడు కాలాన్ని 200 బీసీ నుంచి 700 సీఈ వరకు కాలనిర్ణయం చేశారు. ఇండో పసిఫిక్ దేశాలన్నింటిలోనూ.. అంటే.. జపాన్, కొరియా, చైనా, బాలి, ఇండోనేషియా వంటి వాటిలో ప్రాచీన గాజుపూసలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి గురించి మీరు గూగుల్ చేస్తే వందలాది పేపర్లు లభిస్తాయి. ఈ దేశాలన్నింటిలోని గాజుపూసల్లో అరికమేడు ఫ్యాక్టరీలకు సంబంధించిన రసాయనాల ఆనవాళ్లు స్పష్టంగా లభిస్తాయి. సిలికాలో వినియోగించే ఖనిజాల్లో కూడా అరికమేడుకు సంబంధించిన రసాయనిక గుర్తులు కనుగొన్నట్టు విమలాబేగ్లే చెప్తారు. ఆయా దేశాల్లో లభించిన రసాయనాలను పరిశీలిస్తే అవీ చాలా పురాతనమైనవని తేలింది. విమలాబేగ్లే తన డైరీలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంనాటి ఒక కళాకృతిని కనుగొన్నట్టు రాశారు. ఆ తర్వాత తవ్వకాలు జరపడానికి ముందుకు సాగలేదని డైరీలో పేర్కొన్నారు. ఎందుకంటే.. పెద్ద నీటి గుంత బయటపడిందని.. పంప్ పెట్టి ఎంత నీటిని తోడినా నీరు తరగకపోవడంతో తవ్వకాలను నిలిపివేసినట్టు చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ముందుకు వెళ్లలేకపోయామంటూ.. ఏఎస్‌ఐ ఈ తవ్వకాలన్నింటినీ తిరిగి మట్టితో కప్పేసి.. కొబ్బరిచెట్లు పెంచింది. ఈ కొబ్బరితోట కింద అవశేషాలు ఉన్నాయి.

ఈ విధంగా దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు జరిపినా వేల సంవత్సరాలనాటి అవశేషాలు బయటపడ్డాయి. చాలాచోట్ల నివాస స్థలాలు బయల్పడ్డాయి. దురదృష్టవశాత్తూ.. పురాణాలను చరిత్రగా కాక.. కేవలం కథలుగా చెప్పడం వల్ల.. పురాణాలన్నీ పుక్కిటి కథలుగా మారిపోయాయి. మనం ఎంతసేపూ హరప్పా నాగరికత 5700 సంవత్సరాలనాడు ఉండేదని, 3700 సంవత్సరాలనాడు అంతమైపోయిందని, ఇక్కడ అన్నీ ఖాళీ భూములు ఉంటే.. యూరప్, మధ్య ఆసియా నుంచి జనాలు వచ్చి దేశాన్ని ఉద్ధరించారని పిల్లలకు పాఠాలు బోధిస్తుంటాం.

మన డీఎన్‌ఏలో గుణాత్మకమైన నాగరిక సమాజపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉత్తర భారతానికి వెళ్లండి.. పశ్చిమభారతానికి వెళ్లండి.. దక్షిణ భారతానికి వెళ్లండి.. తూర్పు భారతానికి వెళ్లండి. ఎక్కడ చూసినా అతి ప్రాచీనతకు సంబంధించిన సాక్ష్యాలు స్పష్టంగానే లభించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించిన పురావస్తువులు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మన నాగరికతను సూచిస్తున్నాయి. ఆఫ్రికనేతరుల పూర్వికులంతా భారతీయుల జీన్స్ నుంచి పుట్టినవారే. అప్పుడు భారతదేశం అన్న కాన్సెప్ట్ లేదు కాబట్టి.. (దీనికి సంబంధించిన చర్చ ఇంతకుముందు వ్యాసంలో జరిగింది) ఇంతకుముందు చెప్పుకున్నట్టు మధ్య ఆసియా నుంచి ప్రజలు మన దేశానికి వలస వచ్చినట్టు ఎలాంటి జన్యుపరమైన సాక్ష్యాధారాలు దొరకలేదు. కానీ.. తమిళనాడులో జీన్స్‌లో మార్పు జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కాబట్టి ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం పూర్తిగా కుట్రపూరితమన్నది స్పష్టం. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని తేలినప్పుడు సింధు నాగరికత ఎలా అంతమైంది? 2014 ‘నేచర్’ సంస్థ నుంచి విడుదలైన ఒక డాక్యుమెంట్‌లో దాదాపు 200 సంవత్సరాలపాటు కరువు రావడం వల్ల సింధునాగరికత అంతమైందని అందులో పేర్కొన్నారు. ఏండ్ల తరబడి ఎండిపోతూ వచ్చిన సరస్వతి నది కూడా సింధునాగరికత అంతానికి కారణమని సుభాష్ కక్ చెప్పారు. ప్రస్తుతానికి 3900 సంవత్సరంలో సరస్వతి నది ఎండిపోవడం ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై మనం మరింత లోతుగా అన్వేషిస్తే ప్రపంచంలో ఇలాంటి నాగరికత అంతమైన సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. వందేండ్ల కరువు కారణంగా మెసపటోమియా నాగరికత ధ్వంసం అయింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇంత స్పష్టంగా మన చరిత్ర తేలిపోయినా.. దొంగలు.. దోపిడిదారుల వారసులు రాసిన చరిత్రను ఇంకా ఎన్ని తరాలకు బోధిస్తారు?

చరిత్రను నాశనం చేశారు. సంస్కృతిని, నాగరికతను నాశనంచేశారు. కులాన్ని, మతాన్ని సృష్టించారు. మన దేశంలో కరువుకు, దారిద్య్రానికి కారణం ఈ కులమతాలు, అగ్రవర్ణ, నిమ్నవర్ణ భేదాలే అన్నారు. ఆర్యులు దండయాత్ర చేసి ఇక్కడున్న ద్రావిడులందరినీ దారుణంగా అణచివేయడం వల్లనే దేశంలో పేదరికం, దారిద్య్రం తాండవిస్తున్నదని ప్రచారంచేస్తూ వచ్చారు. వస్తున్నారుకూడా. హంగస్ మాడిసన్.. ఒక చారిత్రక ఆర్థిక వేత్త. ఇతను 1 సీఈ నుంచి 2003 వరకు భారతదేశ ఆర్థిక పరిస్థితిపై లోతైన పరిశోధనచేశాడు. ఈతని పరిశోధన ప్రకారం భారతదేశ జీడీపీ.. ప్రపంచ జీడీపీతో పోలిస్తే ఒకప్పుడు 33 శాతం ఉండేది. ఆ తర్వాత చైనా 25 శాతం, పశ్చిమ యూరప్ దేశాలది 15 శాతం ఉండేది. దేశంలోకి ముస్లింల చొరబాటు, దోపిడీ, విధ్వంసంతో అద్భుతంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ నాశనమవుతూ వచ్చింది. బ్రిటిష్ వాళ్లు వచ్చేసరికి ఇన్‌ఫ్లేషన్ కూడా వచ్చేసింది. భారతీయుల ఆర్థిక పరిస్థితి ఒక పక్క పతనమవుతుంటే.. పశ్చిమ యూరప్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది. అమెరికా పరిస్థితి కూడా బాగయింది. మన దేశంలో సంపద అంతా తరలిపోవడం వల్ల పశ్చిమ యూరప్ సంపత్తి పెరిగింది. మనకు పేదరికం వచ్చిపడింది. అమెరికాకు చెందిన విల్ డురాంట్ అనే మరో ఆర్థిక వేత్త దీన్ని మరింత లోతుగా విశ్లేషించాడు. ఇతను భారతదేశానికి 1930లో వచ్చాడు. మన దేశంలో బ్రిటిష్‌వారు చేసిన దారుణాలను స్వయంగా చూశాడు. ఎంతో బాధతో ‘ది కేస్ ఫర్ ఇండియా’ అనే పుస్తకం రాశాడు. మీకు కావాలంటే ఈ పుస్తకం గూగుల్‌లో ఫ్రీగా దొరుకుతుంది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాబర్ట్ క్లైవ్ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి తక్కువ ధరకు వస్తువులు, ఆయుధాలు అమ్మాలని భారతీయులపై ఒత్తిడి తెచ్చేవాడు. బ్రిటిష్‌వాళ్లు భారతీయులపై వాళ్ల పౌరులకంటే రెండు రెట్లు ఎక్కువ పన్నులు వసూలుచేశారు. స్కాట్‌లాండ్ వంటి దేశంతో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ పన్నులు వసూలుచేశారు. బ్రిటిష్ వాళ్ల పాలనాయంత్రాంగానికి, మనదేశంలోని పాలనా నిర్వహణకు.. మనమీదే పన్నులు వసూలు చేశారు. వాళ్లు చేసిన ఫ్రెంచి యుద్ధం ఖర్చులు కూడా మనమీదే వెళ్లదీశారు. రెండు ప్రపంచ యుద్ధాలకు జరిగిన ఖర్చును కూడా మన దేశం నుంచే వసూలుచేశారు. 1792లో మన దేశం పేరుమీద చేసిన అప్పులు 35 మిలియన్ డాలర్లు.. వీటి భారం మనమీదే వేశారు. 1860 నాటికి మన దేశంమీద అప్పులు 500 మిలియన్ డాలర్లు అయ్యాయి. 1929లో విలియమ్ డొరాంట్ ఈ దేశం విడిచి వెళ్లే సమయానికి ఈ అప్పు 3.5 బిలియన్ డాలర్లు అయింది. దాని తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ లెక్కన చూసుకొంటే.. బ్రిటిష్‌వాడు వెళ్లిపోయేనాటికి రెండింతలో.. మూడింతలో అయి ఉండవచ్చు. హంగస్ మాడిసన్, విలియమ్ డొరాంట్ పుస్తకాలను చదివితే.. గత మూడు వందల ఏండ్లలో మన దేశ ఆర్థిక పతనం ఎంత దారుణంగా జరిగింది.. పేదరికం, దారిద్య్రం ఎంత ఘోరంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి.. ఈ చరిత్ర అంతా ఎవరిది? ఈ నాగరికత అంతా ఎవరిది? ఈ సంపద అంతా ఎవరిది? ఇవాళ మనకు మనం కాని స్థితిలో ఉండటానికి బాధ్యత ఎవరిది?

***

Image Courtesy: Internet, Swadhayaya Resource Centre,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here