Site icon Sanchika

రామం భజే శ్యామలం-31

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]భా[/dropcap]రతదేశానికి జ్ఞానమనేది ఎక్కడినుంచి వచ్చింది?

గ్రీకు, బాబిలోనియన్ జ్ఞానం మనదేశంలోకి ప్రవహించిందని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? విజ్ఞానం అన్నది మనదేశం నుంచి బయటకు వెళ్లిందా? లేక మనదేశంలోకి ఇతర ప్రాంతాలనుంచి వచ్చిందా? దీనికి సమాధానం అన్వేషించే ప్రయత్నం కూడా జరుగలేదు.

మీకు కల్చర్ లేదు.. తిండి తినడం కూడా మేమే నేర్పించాం అని రకరకాలుగా మాట్లాడారు. మనం దాన్నే నమ్ముతూ వచ్చాం. ఇప్పటికీ నమ్ముతున్నాం. ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత గ్రీకుదని.. సదరు గ్రీకు, బాబిలోనియన్ నుంచి జ్ఞానం మన దేశానికి వచ్చేసిందని గుడ్డిగా వాదించేవారు.. దానికి హేతువు ఏమిటో ఒక్కముక్కకూడా చెప్పరు.

నిజానికి భారత్ నుంచి పశ్చిమం వైపు నాలెడ్జి ప్రవహించింది. ఎందుకంటే భారతదేశంలోని సమాజం స్వతహాగా పరిశోధన లక్షణం కలిగినది. స్వతస్సిద్ధంగా సంపదను సృష్టించుకున్న మన మేధావులు విశ్వశ్రేయస్సు కోసం విజ్ఞాన పరిశోధనలో ఎంతో కృషిచేశారు. ఈ విజ్ఞాన సంపదే అనేక మార్గాల్లో బయటి ప్రపంచానికి చేరింది. ప్రధానంగా వ్యాపారమార్గాలు ఇందుకు ప్రధాన దారులయాయి. వివిధ దేశాలతో భారత వ్యాపారులు వాణిజ్య కార్యకలాపాలతోపాటు సాగించిన రాకపోకల క్రమంలో విజ్ఞానం కూడా బదిలీ అవుతూ వచ్చింది. ప్రఖ్యాత ట్రేడ్ రూట్ అయిన సిల్క్ రూట్ మన విజ్ఞానం బదిలీకి ఒక మార్గంగా ఉపయోగపడింది. భారతదేశానికి చెందిన ప్రాచీన వైద్యశాస్త్రాల్లో ఒకటైన బోవర్ మాన్యుస్క్రిప్ట్ కష్గర్ ప్రాంతంలో 18వ శతాబ్దం తొలినాళ్లలో లభించింది. ఈ కష్గర్ ప్రాంతం చైనాలోని జింగ్‌జియాంగ్ ప్రాంతంలో ఉన్నది. ఈ బోవర్ మాన్యుస్క్రిప్ట్‌లో ప్రధానంగా చెప్పుకోదగింది బేలసంహిత. ఇది పునర్వసు ఆత్రేయ చరకసంహితలోని కీలకమైన భాగం. అంటే మన ఇండిక్ నాలెడ్జి.. అంటే భారతీయ విజ్ఞానం. ఇది ట్రేడ్ రూట్‌లో చైనా, మధ్యధరా సముద్రం, యూరప్‌లకు బదిలీ అవుతూ వెళ్లింది.

మరో మార్గాన్ని కనుక పరిశీలిస్తే.. ఒకటో శతాబ్దంలో భారతదేశ పశ్చిమ తీరం.. తూర్పు తీరంలోని ఓడరేవులన్నింటి నుంచి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, అటునుంచి మైదాన ప్రాంతాలకు వ్యాపార మార్గంలో విజ్ఞాన ప్రవాహం కొనసాగింది.

మూడో మార్గాన్ని గనుక గమనిస్తే మెసడోనియన్ రాజు అలెగ్జాండర్ బారతదేశ సరిహద్దులకు వచ్చి వెళ్లిన తర్వాత.. ఇండో గ్రీకు రాజ్యాల మధ్య ఒకవిధమైన సంబంధాలు నెలకొన్నాయి. ఇవి కూడా భారతదేశం నుంచి విజ్ఞానం వ్యాప్తి చెందడానికి కారణమైంది.

ప్రాచీనకాలంనుంచి ఒక్కో సందర్భాన్ని గురించి సవివరంగా విశ్లేషించినప్పుడు దాదాపు ఐదువేల సంవత్సరాలుగా మన దగ్గరినుంచి విజ్ఞానం బయటి ప్రపంచానికి విస్తరిస్తూనే ఉన్నదని ఈ డాటా పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది. అంతా ఇక్కడి నుంచి తరలి వెళ్లిందే తప్ప ఇక్కడికి వచ్చి చేరింది ఏమీ లేదు.

  1. పైథాగ్రస్ కు ముందు (2000 బీసీఈ నుంచి 500 బీసీఈ)
  2. ఫైథాగ్రస్ (500 బీసీఈ)
  3. అలెగ్జాండర్ తర్వాత (326 బీసీఈ)
  4. చైనా, ఆగ్నేయాసియాలకు బౌద్ధ, హిందూ విజ్ఞానం బదిలీ
  5. అబ్బాసిద్ సామ్రాజ్యం (700 సీఈ)
  6. ఢిల్లీ సుల్తానులు (1000 సీఈ1400 సీఈ)
  7. మొఘల్ కాలం.. (1500 సీఈ1700 సీఈ)
  8. బ్రిటిష్ కాలం.. (1700 సీఈ నుంచి ఇప్పటివరకు)

భారతీయ విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలను లోతుగా పరిశీలించుకుంటూ పోతే.. ఇక్కడి శాస్త్రాలను, గ్రంథాలను ఏ విధంగా ఇతర ప్రాంతాలవారు సమీకరించుకొని.. తస్కరించుకొనిపోయి.. సేకరించుకొని పోయి.. తమ తమ భాషల్లోకి అనువదించుకొన్నారో అర్థమవుతుంది. విచిత్రమేమంటే.. ఇదే నాలెడ్జి తిరిగి తిరిగి రంగులు మార్చుకొని మన దగ్గరకే చేరింది.

క్రీస్తుపూర్వం 1300 బీసీలోని ప్రపంచ పటాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆఫ్రికాలోని సాధారణ ప్రజలు, వేటగాళ్లు, సంచార ప్రజలు కానీ.. సైబీరియా, రష్యా, ఐరోపా, ఇరాన్, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలన్నింటిలోనూ భారతీయ (ఇండిక్) నాగరికత కనిపిస్తుంది. అంటే భారతీయ నాగరికత అని అర్థం. చైనాలో మాత్రమే మనకు చియాంగ్ నాగరికత కనిపిస్తుంది. గ్రీసులో, సుమేరియాలో కొంతవరకు మాత్రమే గ్రీకు నాగరికత కనిపిస్తుంది. ప్రస్తుతం టర్కీ ఉన్న చోట హిటైట్స్ అనే జాతి ప్రజలు ఉన్నారు. వీరిని వాస్తవంగా హట్టీ ప్రజలు అని పిలుస్తారు. వీరికి పురుషోత్తమ అన్న నగరం ఉన్నది. ఇక్కడ పూర్తిగా భారతీయ విజ్ఞానం, నాగరికత వెల్లివిరిశాయి. మరొక ముఖ్యమైన విషయమేమంటే.. ఈజిప్టు పరిసర ప్రాంతాల్లో మిట్టానీలు ఉండేవారు. వీరు సంస్కృత భాష మాట్లాడే ప్రజలు. వీరు వేదకాలం నాటి దేవుళ్లను పూజించారు. ఇంద్రుడు, వరుణుడు, అశ్విని దేవతలను పూజించారు. మామీద దాడిచేయవద్దని ఆ దేవుళ్లతో ఒప్పందాలు చేసుకొనేవారట. ఇదే రకమైన కథనం మనకు బాల కృష్ణుడి లీలల్లో గోవర్ధన పర్వతం ఎత్తే సీన్లో గోచరమవుతుంది. మస్కట్ సమీపంలో దిల్‌మూన్ అన్న ప్రాంతంలో కస్సైట్లు, బాబిలోనియన్లు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ సింధులోయ నాగరికతకు సంబంధించిన అనేక ముద్రలు, లోథాల్ మనకు కనిపిస్తాయి. ఈ ప్రాంతాలన్నింటిలోనూ చాలా ప్రబలంగా మనకు భారతీయ నాగరికత ఆనవాళ్లు స్పష్టంగానే కనిపిస్తాయి. ఇందుకోసం వేరే పురావస్తు శిథిలాలను అన్వేషించాల్సిన పనిలేదు. చాలా చాలా ప్రాచీనకాలంనుంచే మన విజ్ఞానం బయటి ప్రాంతాలకు వ్యాప్తి చెందిందనడానికి అక్కడి నాగరికత ఆనవాళ్లే తార్కాణం. ముఖ్యంగా మధ్య, పశ్చిమ, దక్షిణ భారతాల నుంచి మన ఆయుర్వేద వైద్యం ఇతర ప్రాంతాలను తరలివెళ్లి.. అక్కడ అనేక విధాలుగా రూపాంతరం చెందింది. యూరోప్ వైద్యానికి మూలమైంది. సరస్వతి నది ఎండిపోవడం.. వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవించడంతో భారత్ నుంచి పశ్చిమదేశాల వైపు వలసలు పెద్ద ఎత్తున జరిగింది. తద్వారా మన విజ్ఞానం కూడా ప్రపంచమంతటా విస్తరించింది.

ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. పైథాగ్రస్ (570 బీసీ 495 బీసీ).. ఈయన గురించి బహుశా తెలియని వారుండరనుకుంటా.. ప్రాచీన గణిత శాస్త్రవేత్త. జ్యామెట్రీ, అంకగణితంలో ఆయన ప్రసిద్ధుడు. ఈయన భారతదేశానికి వెళ్లి భారతీయ విజ్ఞానాన్ని నేర్చుకున్నాడని పలువురు చెప్తారు. ఇవేవీ మనవాళ్లు చెప్తున్న మాటలేం కావు. పశ్చిమ దేశాలకు చెందిన మేధావులు చెప్పిన మాటలే ఇవి. అల్బర్ట్ బర్క్ (1901), ఏఎన్ మార్లో (1954), జీఆర్‌ఎస్ మీడ్ (1901) లాంటి వారు పైథాగ్రస్ భారత పర్యటన గురించి వివరంగా చర్చించారు. పైథాగ్రస్ దక్షిణ భారతదేశంలోని కాంచీపురం వెళ్లి అధ్యయనం చేశాడని అల్బర్ట్ బర్క్ రాశారు. గ్రీకు ఫిలాసఫీలో హిందూయిజం, బుద్ధిజం వంటి ఆనవాళ్లు వచ్చాయంటే ఫైథాగ్రస్ వంటివారి వల్లేనని వీరు చెప్పారు. ఈ కాంచీపురం పల్లవుల రాజధాని అని మనందరికీ తెలిసిన విషయమే. దురదృష్టవశాత్తూ కంచి చరిత్రను మనం పల్లవుల నాటినుంచే చదువుకుంటున్నాం. కానీ అది చాలా చాలా ప్రాచీన నగరం. పైథాగ్రస్ ఇక్కడికి వచ్చి లోతైన అద్యయనం చేశాడు. పైథాగ్రస్ భారతదేశం నుంచి గ్రీసుకు తిరిగి వెళ్లిన తర్వాత పూర్తి శాకాహారిగా మారిపోయాడట. పండ్లు, గింజలు, మొక్కజొన్న వంటివి మాత్రమే తినేవాడట. అతని వాలకం చూసి అంతా పిచ్చివాడని భావించారట. ఇతను మాంసం తినడంలేదేమిటని ముక్కున వేలేసుకున్నారు. ఒకరికొకరు చెవులు కొరుక్కున్నారు. మాంసం తినకపోవడం అక్కడివారికి ఆశ్చర్యంగా అనిపించింది. పైథాగ్రస్ గ్రీసులో గురుకులం తరహా విద్యాసంస్థను స్థాపించాడు. గురుకులంలో మధ్యన ఆయన బోధకుడుగా అంటే టీచర్‌గా ఉంటే.. ఇన్నర్ సర్కిల్‌లో కొందరు విద్యార్థులు.. అవుటర్ సర్కిల్‌లో మరికొందరు విద్యార్థులు చుట్టూ కూర్చొని చదువుకొనేవారు. కొన్ని పరీక్షలు అయిన తరువాత అవుటర్ సర్కిల్‌లో విద్యార్థులు ఇన్నర్ సర్కిల్‌లోకి వచ్చేవారు. ఈ గురుకుల విద్యావిధానాన్ని పైథాగ్రస్ తరువాత సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటివారు యథాతథంగా అనుసరించారు. పైథాగ్రస్ పునర్జన్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మాడు. ఆత్మ ఒకచోటినుంచి మరొకచోటికి అంటే ఒక శరీరం నుంచి మరో శరీరానికి బదిలీ అవుతుందన్న ట్రాన్స్‌మైగ్రేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. రాయల్ ఏషియాటిక్ సొసైటీలో ఈ ట్రాన్స్‌మైగ్రేషన్ సిద్ధాంతంపై ప్రత్యేక పరిశోధన డాక్యుమెంట్‌ను మనం చూడవచ్చు. పైథాగ్రస్ చేసిన పరిశోధనల్లో, ఆలోచనల్లో భారతీయ విజ్ఞాన ఆలోచనలకు సంబంధించిన బలమైన మూలాలు మనకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.

నిజానికి పైథాగ్రస్‌కంటే చాలా ముందునుంచే.. మనకు గ్రీకు కథలు.. భారతీయ పురాణ కథల మధ్యన సారూప్యత కనిపిస్తుంది. చాలా పురాతనమైన సంబంధాన్ని సూచిస్తుంది. మైసేనియన్ కాలానికి వెళ్తే.. మిట్టానీల (సాంస్కృతిక సమాజం)తో గ్రీకులకు బలమైన సంబంధం ఉన్న కాలమది. హిటైట్లు, మిట్టానీల నుంచి జ్ఞాన ప్రసారం జరిగిన సమయమది.

భారతదేశం నుంచి విజ్ఞాన ప్రసారానికి సంబంధించి నేను మరో విషయాన్ని కూడా ఇక్కడ పంచుకోదలచుకొన్నాను. డెమొక్రటీస్.. క్రీస్తుకు పూర్వం 460-370 మధ్య కాలంలో అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆటమ్ అన్న మాటను పేర్కొన్నాడు. గ్రీకు పదం ఆటోమస్ నుంచి ఆటమ్ అన్న పేరును ఖాయం చేశాడు. కానీ డెమొక్రాటిస్‌కు దాదాపు రెండు శతాబ్దాలకు ముందు క్రీస్తుకు పూర్వం 600 బీసీలో భారతీయ శాస్త్రవేత్త కణాదుడు ప్రతి పదార్థము కూడా సూక్ష్మ, సూక్ష్మాతి సూక్ష్మమైన కణాల కలయికతో ఏర్పడినదేనని ప్రతిపాదించాడు. తన వైశేషిక తత్త్వ చింతన ద్వారా కణాదుడు ఈ భౌతిక శాస్త్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మధ్యప్రదేశ్ రాష్ర్టంలోని అలహాబాద్ జిల్లా ప్రభాస గ్రామంలో జన్మించిన కణాదుడు చిన్నతనాన బియ్యం గింజలను ఏరుకొని తినేవాడట. చిన్న చిన్న రేణువులమీద పరిశోధనకు అది ఆలోచనాత్మకమైంది. కార్యకారణ సంబంధ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించింది ఈయనే. పది గ్రంథాల సంపుటంగా వైశేషిక సూత్రాలను ఆయన ప్రతిపాదించాడు. విశ్వంలో అణువు అన్నది ఒకటి ఉంటుందని మొట్టమొదట ప్రతిపాదించింది కణాదుడే. ఆత్మ అన్నది అన్ని పదార్థాలలో విస్తరించిందని పేర్కొన్నాడు. అనుభవం, పదార్థం, నాణ్యత, కార్యాచరణత, సాధారణత, ప్రత్యేకత, స్వాభావికతతోపాటు శూన్యంలోనూ ఆత్మ ఉన్నదన్నాడు. భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి విద్య, అవిద్య మౌలిక లక్షణాలను అర్థం చేసుకోవాలని చెప్పాడు. అవిద్య కూడా విద్యేనని ఆయన పేర్కొన్నాడు. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడని పిలువబడే డెమొక్రాటిస్ ఇథియోపియా, ఆసియా, భారతదేశాల్లో పర్యటించి.. అనేక పరిశోధనల అనంతరం తన అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వేదాంత జ్ఞానాన్ని లోతుగా అధ్యయనంచేసి సహజ తత్త్వశాస్త్రం గురించి రాశాడు. భూమి ఒక గోళమని.. అణువులతో తయారైన విశ్వం పెద్ద ప్రపంచాన్ని తయారుచేస్తుందని, సృష్టి అంతా క్షీణించిన అణువులతో తయారైందని.. ఇలా వేదాంతజ్ఞానాన్ని డెమొక్రటీస్ తనపరిశోధనల్లో అంతర్లీనంగా పొందుపరిచాడు.

అలెగ్జాండర్ తరువాతి కాలాన్ని గనుక మనం అధ్యయనం చేస్తే.. పర్షియా, మెసెపొటొమియా లోని ఖగోళశాస్త్రాలను అనువాదం చేసే పనిని అరిస్టాటిల్‌కు అలెగ్జాండర్ అప్పగించాడు. అలెగ్జాండర్ పట్టుకుపోయిన ఈ గ్రంథాలు, అనువదింపబడిన గ్రంథాలు.. అలెగ్జాండ్రియా లైబ్రరీలో ఉంచారు. ఇండిక్ నాలెడ్జిని పశ్చిమ దేశాలకు అందించడానికి ఏర్పాటుచేసిన లైబ్రరీ ఇది. ఈ నాలెడ్జి హిపార్కస్‌కు అధ్యయనం చేయడానికి ఉపయోగపడింది. ఇదే కోవలో మన వాళ్లు ప్రతిపాదించిన మరి కొన్ని అంశాలను చూద్దాం.

  1. సూర్య సిద్ధాంతంలో స్పష్టంగా వివరంగా కార్డ్ టేబుల్ ప్రతిపాదన ఉన్నది.
  2. ఆర్యభట్ట 3.5 సెగ్మెంట్స్‌లో ‘జియా, కొజియా’ పేరుతో సైన్ టేబుల్‌ను ప్రతిపాదించాడు. ఇదే తరువాతికాలంలో సైన్, కోసైన్ అయ్యాయి.
  3. పింగళుడు(400 బీసీ) తన ఛందశ్శాస్త్రంలో కాంబినోట్రానిక్స్, బైనామిల్స్ గురించి చర్చించాడు.
  4. వృద్ధగర్గ (500 బీసీ) ఈక్వినాక్స్ గురించి ప్రతిపాదించాడు. 1డిగ్రీని వంద ఏండ్లుగా భావించి ఈక్వినాక్స్ రేట్ ను 36 వేల సంవత్సరాలుగా ప్రతిపాదించాడు.
  5. జైనులు, సంస్కృత, వేదాంత స్కాలర్ల ద్వారా అపారమైన విజ్ఞానం అరిస్టాటిల్, అలెగ్జాండ్రియా లైబ్రరీ ద్వారా బదిలీ అయింది. దీన్ని హిపార్కస్ అందుకున్నాడు. అతను 190 బీసీ నాటి వాడు. ఇతను కూడా 7.5 సెగ్మెంట్స్‌లో కార్డ్ టేబుల్‌ను ప్రతిపాదించాడు. ఇతను కూడా వృద్ధిగర్గ ప్రతిపాదించిన ఇక్వినాక్స్ రేట్‌ను యథాతథంగా ప్రతిపాదించాడు. హిపార్కస్ చేసిన ఎన్యుమరేటివ్ కాంబినోట్రిక్స్ ప్రతిపాదన చేశాడు. దీన్ని చాలాకాలం క్రితమే పింగళుడు ప్రతిపాదించాడు. ట్రిగొనామెట్రీని హిపార్కస్ నుంచి ఆర్యభట్ట నేర్చుకున్నాడని పాశ్చాత్యులు చెప్తారు. ఇంతకంటే విడ్డూరం ఇంకోటి ఉండదు.

టాలెమీ అన్నది.. ఆర్యభట్ట పరిశోధనలకు మరో ప్రధాన వనరు. రాబర్ట్‌న్యూటన్ రాసిన ది ఆరిజిన్స్ ఆఫ్ టాలెమీలో ఇందులోని ప్రతి అంశం కూడా వక్రీకరణ జరిగిందని పేర్కొన్నాడు. ఇందులోని ట్రిగొనామెట్రీ ప్రతిపాదనలన్నీ కూడా ఈజిప్టులోని ఎరాతోథెన్స్ అనేవాడు ప్రతిపాదించినవని న్యూటన్ అన్నాడు. నిజమే.. ఈ ఎరాటోస్థీన్స్ అనేవాడు.. అలెగ్జాండ్రియా లైబ్రరీలో లైబ్రేరియన్‌గా పనిచేశాడు. ఇతనికి చాలా ఖాళీ సమయం దొరకడంతో భారతదేశంనుంచి అక్కడికి వచ్చిన మాన్యుస్క్రిప్టులు అన్నీ చదవడానికి సమయం దొరికింది. వీటిద్వారానే భూమి ఎంత కోణంలో భ్రమణం తిరుగుతుంది.. భూమికి, సూర్యుడికి ఉన్న దూరం.. భూమి చుట్టుకొలత, సూర్యుడి చుట్టుకొలత వంటివన్నీ ఈ లైబ్రేరియన్ కనుక్కొన్నాడు. ఇవే అంశాలను యాజ్ఞవల్క్యుడు 3000 బీసీలోనే కనుక్కొని రాశాడు కూడా. యాజ్ఞవల్క్యుడి మాన్యుస్క్రిప్టు కూడా ఈ లైబ్రరీలో ఉన్నది. దీన్నిబట్టి పాశ్చాత్యుల ‘కనుగొనడాల’ వెనుక ఏం జరిగిందో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఈ లైబ్రరీని జూలియస్‌ సీజర్ 40 బీసీలో ధ్వంసంచేశాడు. 348 సీఈలో పోప్ వచ్చి.. యూరప్ క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత మరోసారి ధ్వంసం చేశారు. 690 సీఈలో ముస్లింలు ధ్వంసం చేశారు. ఈ లైబ్రరీ.. తూర్పు నుంచి పశ్చిమానికి నాలెడ్జి టాన్స్రిమిషన్‌కు ప్రధాన మార్గంగా పనిచేసింది.

700 సీఈ నుంచి 1000 సీఈ వరకు అబ్సాసిడ్ సామ్రాజ్యం కొనసాగిన కాలం. సింధ్‌నుంచి ఆఫ్రికా, స్పెయిన్ దాకా విస్తరించిన సామ్రాజ్యమిది. ఇక్కడ బ్రహ్మగుప్తుడి బ్రహ్మసూత్రాలను, ఖాందకాద్యక సూత్రాలను అల్‌ఫజారీ అనువాదం చేశాడు. సింధ్ నుంచి బాగ్దాద్ దాకా ఉన్న పండితులంతా వాటిని కొనుక్కొని అధ్యయనంచేశారు. వీటిని సింద్‌హింద్, అరాకన్ అని పిలిచేవారు. మంకా లేదా అనే కంకా (పేరులో స్పష్టత లేదు) అనే ఒక భారతీయ ఫిజిషియన్ (అల్ రషీద్ ఆస్థానంలో ఉండేవాడు).. శుశ్రుత సంహితను పర్షియాలోకి అనువాదం చేశాడు. ఇతను చేసిన ఈ పర్షియా అనువాదాలే ఐరోపా వైద్యానికిక పునాదిగా మారాయి. అబిద్ అల్లాన ఇబ్‌న అలీ (9 సీఈ) అనే రచయిత చరక సంహితను అరబిక్, పర్షియన్ భాషల్లోకి అనువాదం చేసి బాగ్దాద్ నుంచి స్పెయిన్ వరకు వాటిని విస్తృతంగా వ్యాప్తిచెందించాడు.

అల్ కింది (801 సీఈ) అనే రచయిత భారత, గ్రీకు రచనలను పెద్ద ఎత్తున అనువాదంచేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. 1000 సీఈ నుంచి 1700 సీఈ మధ్య కాలంలో గణితం, మెడిసిన్, ఖగోళశాస్త్రం, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, మతం, కళలకు సంబంధించిన విజ్ఞానమంతా ఇతర దేశాలకు అనువాదాల ద్వారా పెద్ద ఎత్తున బదిలీ అయింది. బాగ్దాద్ సుల్తాన్ దగ్గరకు అల్ బిరోనీ అనే పండితుడు వచ్చి.. తనను తాను స్కాలర్‌గా పరిచయం చేసుకొని గజ్నీ ద్వారా భారత్‌కు వచ్చే ఏర్పాటుచేసుకున్నాడు. ఈ పండితుడిని వెంటబెట్టుకొని వెళ్తే.. ఇతను హిందుస్థాన్‌లోని పుస్తకాలన్నింటినీ కాపీ చేసుకొని వస్తాడని గజ్నీకి చెప్పి అల్‌బిరోనీని పంపించాడు. ఇతను భారత్‌కు వచ్చి.. భారత, గ్రీకు రచనలపై తులనాత్మక అధ్యయనంచేశాడు. ఇతను కితాబ్ తారిక్ అల్ హింద్ అనే ఒక రచన చేశాడు. ఇందులో రామాయణ, భారత, పంచతంత్రాలను అనువదించాడు. సుల్తాన్ ఫిరుజ్ ఇట్న్ తుగ్లక్ నాగర్‌కోట్‌ను ధ్వంసంచేసినప్పుడు.. అక్కడి లైబ్రరీని స్వాధీనం చేసుకొని అందులోని 1300 గ్రంథాలను పర్షియాలోకి అనువదించాడు.

కాశ్మీర్ రాజు జైనులాబిదీన్ పర్షియానుంచి సంస్కృతంలోకి పలు గ్రంథాలను అనువదింప చేశాడు. ఇతని పాలన కాలంలో సంస్కృతమ్నుంచి పెర్షియన్‌కూ, పెర్షియన్నుంచి సంస్కృతంకూ విస్తృతంగా అనువాదాలు జరిగేయి. ఈయన తన సైన్స్యాన్ని ఆధునికీకరణం చేసేందుకు నలుమూలలనుంచీ విజ్ఞానశాస్త్ర గ్రంథాలను సేకరించి పరిశోధనలు జరిపింపించాడు. ఇతని హయాంలో తొలిసారిగా పిరంగీ మ్రోగింది.. మొఘల్ రాజు అక్బర్ కూడా ఇదే పని చేయించాడు. మొట్టమొదటిసారి ఈ రెండు సందర్భాల్లో బయటి ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానం మన దగ్గరకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక్కటే మనకు బయటినుంచి నాలెడ్జి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఔరంగజేబ్ తమ్ముడు దారా సిఖో ఉపనిషత్తులను పర్షియాలోకి అనువదించి తొలిసారి యురోపియన్లకు ఉపనిషత్తుల పరిచయంచేశాడు. ప్లేటో తర్వాత ఉపనిషత్తులు యూరోపియన్లకు తెలిసింది దారా వల్లనే. స్పెయిన్‌లోని టొలీడోలో ఒక మోనిస్ట్రీ ఉండేది. దీని పని అంతా అరబిక్, పర్షియా గ్రంథాలను లాటిన్‌లోకి మార్చడమే. 1114 నుంచి 1187 నుంచి మాథమెటిక్స్, ఆస్ట్రొనామీ, మెడిసిన్‌కు సంబంధించిన 87 గ్రంథాలను లాటిన్‌లోకి మార్చాయి. ఇటలీకి చెందిన కాన్‌స్టంటైన్ అనే వాడు కూడా అరబిక్‌లోకి అనువాదమైన గ్రంథాలను లాటిన్‌లోకి అనువదించాడు. ఈ విధంగా ఇండిక్ నాలెడ్జి గ్రీకు దేశానికి బదిలీ అయింది. క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత పోప్ ఆధిపత్యంలో ఈ విజ్ఞానాన్నంతా నామరూపాలు లేకుండా ధ్వంసంచేశారు. ఇస్లామిక్, అరబిక్ దేశాల్లో కొంతవరకు మిగిలిపోయింది. మన దగ్గరనుంచి తరలివెళ్లిన ఈ గ్రంథాలన్నింటిని కూడా లాటిన్‌లోకి అనువాదంచేసి యురోపియన్ల మెదళ్లలోకి ఇంజెక్ట్ చేశారు. బ్రిటిష్ వారి కాలంలో మూడువందల ఏండ్లపాటు పెద్ద ఎత్తున యూరోప్ యాత్రికులు మన దగ్గరకు వచ్చేవారు. తద్వారా ఇక్కడి విజ్ఞానమంతా యూరప్‌కు వ్యాప్తి జరిగింది. ఇప్పుడు అదే విజ్ఞానం తెల్ల రంగు పూసుకొని.. మేకోవర్ చేసుకొని తిరిగి మనదేశానికి వస్తున్నది. కానీ.. ఇదంతా ఎక్కడినుంచి వెళ్లింది.. ఎలా వచ్చిందనేది గ్రహించే స్థితిలో మనం లేము. వాళ్లు కనుక్కొని చెప్తున్నారన్న చిత్త భ్రమలోనే మనం ఉన్నాం. ఉంటున్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం మనదేశానికి మరే ముంటుంది?

***

Image Courtesy: Internet, Swadhayaya Resource Centre,

Exit mobile version