Site icon Sanchika

రామం భజే శ్యామలం-36

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]రా[/dropcap]మో విగ్రహవాన్ ధర్మః. ధర్మానికి మూర్తిమంతుడైన మానవుడు శ్రీరామ చంద్రుడని సీతాపహరణానికి ముందు మారీచుడు రావణుడితో అన్నమాట ఇది. ధర్మానికి రాముడు ఏ విధంగా కట్టుబడి ఉన్నాడనడానికి మారీచుడి మాటలే తార్కాణం. అంతటి మర్యాదాపురుషోత్తముడైన రాముడిని దుర్మార్గుడిగా, ధర్మచ్యుతికి పాల్పడిన వాడిగా ఒక సామాన్యుడిని, నిమ్న జాతివాడిని అన్యాయంగా హతమార్చాడని ఉత్తర రామాయణంలో ఒక కథ మనకు కనిపిస్తుంది. ఒక బ్రాహ్మణుడు అకాల మరణం చెందిన తన కుమారుడి మృతదేహాన్ని వెంటబెట్టుకొని రాజుగారైన రాముడి కొలువుకు వస్తాడు. ‘‘రామా నీవు రాజుగా ఉన్న రాజ్యంలో నా కొడుకు అకాల మరణం చెందాడు. ఇందుకు కారణం నీ రాజ్యములో ధర్మ విరుద్ధమైన కార్యములు జరుగుతున్నవి. అందువల్లనే ఇలాంటి దుష్పరిణామం ఏర్పడింది. ధర్మ విరుద్ధులను దండించి నా కుమారుడిని పునర్జీవితుడిని చేయండి. ఈ రాజ్యములో పిల్లల మరణానికి హేతువైన రాముడు రాజుగా వచ్చిన తర్వాత ఈ దేశము నాథుడు లేనిదైనది. శాస్త్ర విరుద్ధమైన రీతిలో పాలించబడ్డ ప్రజలు రాజు చేసిన దోషాలకు ఆపదలు చెందుతారు. రాజు చరిత్ర మంచిది కాకపోతే జనులు అకాల మరణం చెందుతారు. నా కొడుకు అకాలంలో చనిపోవటం రాజదోషమే. రాజదోషము వల్లనే గ్రామాలలో, పురములలో బాలలు మరణించుచున్నారు. ఇట్టి ఘోరము నేను పూర్వము ఎన్నడూ చూడలేదు. తప్పక రాముడి పాపమేదో ఉండి ఉండును’’ అని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు. తన రాజ్యంలో అకాల మరణం సంభవించటం.. అదీ ఒక బ్రహ్మణుడి కుమారుడు చనిపోవడం రాముడిని ఆశ్చర్యానికి గురి చేసింది. నా రాజ్యంలో ధర్మచ్యుతికి పాల్పడిన వారు ఎవరు అని అక్కడ కొలువులో ఉన్న మహర్షులను అడిగాడు. అప్పుడు వారు ఈ భూమ్మీద ప్రస్తుత యుగధర్మం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశ్యులే తపస్సు చేయడానికి అర్హులు. శూద్రులు తపస్సు చేయడానికి అనర్హులు. అలాంటి శూద్రుడొకరు నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాడు. అది ధర్మ విరుద్ధమని ఈ కొలువులో ఉన్న ఋషులు, మునులు, సిద్ధులు అనేవారంతా అన్నారు. దాంతో రాముడు వెంటనే పుష్పకాన్ని పిలిచి బయలుదేరాడు. అతను దక్షిణాపథంవైపు బయలుదేరి.. అక్కడ శైవల పర్వతం దగ్గర తలకిందులుగా వేలాడి తపస్సు చేస్తున్న శంబూకుడనే శూద్రుడిని చూశాడు. అతడిని నువ్వెవరివని అడిగితే.. దైవత్వం కోసం నేను తపస్సు చేస్తున్నాను.. నేను శూద్రజాతికి చెందినవాణ్ణి అని చెప్తాడు. వెంటనే రాముడు కత్తి తీసి అతడి శిరస్సును ఖండించాడు. రాముడు చంపడంతోనే అతనికి దివ్యత్వం వచ్చేసింది. ఉత్తమలోకాలకు వెళ్లిపోయాడు.

ఇదీ ఉత్తర రామాయణంలో రాముడు శంబూకుడు అనే వ్యక్తిని హతమార్చాడని చెప్పిన కథ. ఈ కథ ఉత్తరకాండలోని మూడు సర్గల్లో కొనసాగుతుంది. ఈ కథ ఆసాంతం చదివితే రాముడు అనే వ్యక్తి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడా? శంబూకుడు మాట్లాడుతుండగానే.. కత్తి తీసి శిరస్సును ఖండించాడట రాముడు. ఇంత దారుణానికి రాముడు ఒడిగట్టడమేమిటి? ఒక నిమ్నజాతికి చెందిన వ్యక్తి తపస్సు చేసినంత మాత్రాన ధర్మాన్ని ఉల్లంఘించినట్టు ఎలా అవుతుంది? పైగా హతమార్చిన తీరు కూడా ఎంత ఘోరంగా ఉంటుందంటే.. అతను మాట్లాడుతుండగానే శిరస్సు ఖండించాడట. దానికి దేవతలు పూలవర్షం కురిపించారట. ఏమిటీ దారుణం.. పైగా చనిపోయిన అతనికి దివ్యత్వం లభించిందిట. రాముడి వ్యక్తిత్వం ఇంత దుర్మార్గమా? ఆశ్చర్యమేస్తుంది.

ఈ దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి రాముడిని, రామాయణాన్ని కించపరచడానికి, రాముడు చాలా దుర్మార్గుడని నిరూపించడానికి హేతువాదులు, సెక్యులరిస్టులు, మత విశ్లేషకులు, వామపక్షవాదులు, భారతదేశం తప్ప మిగతా ప్రపంచాన్నంతా పొగిడేవారు.. ప్రధానంగా ఉదహరించే కథనమిది. ఇలాంటి రాముడిని భారతదేశం ఇంతకాలంగా ఎందుకు నెత్తినపెట్టుకొని మోస్తున్నది. ఇలాంటి రాముడి గుడికోసం ఎందుకింతగా పరితపించింది. శతాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నది ఇలాంటి రాముడి మందిరం కోసమా? మన ప్రజలు ఇంత మూఢులా?  ఆశ్చర్యమేస్తుంది. విస్మయం కలుగుతుంది.

ఉత్తరకాండలో శంబూకుడి వధను పరిశీలిస్తే ఏ విధంగా చూసినా మిగతా రామాయణంలోని పాత్రల వ్యక్తిత్వానికి రాముడి పాత్రతో సహా.. ఉత్తరకాండలోని ఈ కథనంలోని ఉన్న వక్తులకు అసలు పొంతనే ఉండదు. దీన్ని మరింత లోతుగా విశ్లేషించిన కొద్దీ.. ఆశ్చర్యకరమైన అంశాలు అవగాహనకు వస్తుంటాయి. మొదటి ఆరుకాండల్లో ఎక్కడా కనిపించని శ్రీరామచంద్రుడి ఈ విపరీతమైన లక్షణం ఉత్తరకాండలో మాత్రమే ఎక్కడినుంచి వచ్చింది? అన్ని వర్ణాలవారు సంతోషంగా ఉన్నారన్న యుద్ధకాండలోని ఫలశ్రుతిలోని మాట మినహా మొదటి ఆరుకాండల్లో ఎక్కడా చర్చించని వర్ణాశ్రమ ధర్మం గురించి.. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర  ధర్మాలను గురించి శంబూక వధ సందర్భంలో మాత్రమే ఎందుకు విస్తృతంగా చర్చించారు? మొదటి ఆరుకాండల్లో రాముడి వ్యక్తిత్వంలో ఎక్కడా కనిపించని వైరుధ్యం ఇక్కడ మాత్రమే ఎందుకు కనిపించింది? మొదటి ఆరుకాండల్లో రాముడి వ్యక్తిత్వాన్ని అనంతంగా అద్భుతంగా విశ్లేషించిన వాల్మీకి ఉత్తర కాండలో రాముడి చేత ధర్మ విరుద్ధమైన పని ఎందుకు చేయించాడు? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండలో సందర్భం వచ్చిన ప్రతిసారీ రాముడి వ్యక్తిత్వం అడుగడుగునా ప్రస్ఫుటమవుతూ వచ్చింది. అలాంటి రాముడు ఒక తాపసిని అకారణంగా చంపడమేమిటి? కులం పేరుతోనో.. జాతి పేరుతోనో ఒక వ్యక్తిని చంపే సన్నివేశాలు అంతకుముందు ఎక్కడా కనిపించవు. అసలు జాతి అన్న ప్రస్తావనే తొలి ఆరు కాండల్లో మచ్చుకు కూడా కనిపించదు. అలాంటి చరిత్రలో ఇలాంటి సన్నివేశాన్ని ఏ విధంగా ఊహించుకోగలం. రాముడి భక్తులు గుడ్డిగా వాదించవచ్చు. రాముడి చేతిలో చనిపోవడానికే శంబూకుడు తపస్సు చేశాడని విచిత్రమైన వాదన తేవచ్చు. అలాంటప్పుడు రుషులు, మునులు మోక్షం కోసమే తపస్సు చేసేటట్టయితే.. రాముడి చేతిలో చనిపోతే చాలు మోక్షమే వచ్చినట్టయితే.. రాముడి ప్యాలెస్ ముందు క్యూ కట్టేవారు కదా.. మాకు మోక్షం ప్రసాదించాలని వేడుకొనేవారు కదా. సింపుల్‌గా అయిపోయేది.. ఎందుకింత కష్టం? ఇదంతా నిజమేనా? శంబూకుడి వధ కథకు హేతుబద్ధత ఏమిటి? ఎందుకు రాముడికి.. రచయిత వాల్మీకికి ఆపాదించారు? రాముడు ఎవరు? మరింత లోతుగా వచ్చేవారం చర్చిద్దాం.

Exit mobile version