రామం భజే శ్యామలం-37

2
2

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]ఉ[/dropcap]త్తర రామాయణం అనే సృష్టించబడిన కాండలో శంబూకుడి వధ గురించిన కథనం చాలా సంక్లిష్టంగా సాగుతుంది. మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వ హననానికి కావాల్సినంత కుట్రచేసిన కథ ఈ శంబూక వధ. ఈ కథలో రామాయణంలో అంతకుముందు ఎక్కడా కనిపించని సామాజిక ధర్మాలపై లోతైన చర్చ జరుగుతుంది. వర్ణాశ్రమ ధర్మం, యుగ ధర్మం గురించిన చర్చ విస్తృతంగా జరుగుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల గురించిన చర్చ జరుగుతుంది. ఏయే జాతివారు తపస్సు చేయాలి. ఎవరు చేయకూడదన్న నియమాలపైనా చర్చ జరుగుతుంది. కృతయుగంలో బ్రాహ్మణులు, త్రేతాయుగంలో క్షత్రియులు, ద్వాపరంలో వైశ్యులు, కలియుగంలో శూద్రులు తపస్సు చేయవచ్చని ధర్మం చెప్పిందిట. రాముడు కూడా శంబూకుడిని ప్రశ్నించినప్పుడు నేను శూద్రజాతిలో పుట్టినవాడినని చెప్తాడు. ఈ కథనం అంతా నాకు చాలా చాలా సందేహాలను కలిగించింది. పెద్దలైన ఇవాల్టి పండితులు కూడా ఈ కథనాన్ని ఏదోవిధంగా రాముడిని సమర్థించడానికి.. శంబూకుడికి మోక్షం వచ్చిందనో.. మరేదో జరిగిందనో చెప్పి విశ్లేషణలు చేస్తారే తప్ప అందులోని హేతుబద్ధత అర్థం కాదు.

వర్ణాశ్రమాలను గురించి మనుస్మృతిలో మనువు రాశాడని మన చరిత్రకారులు, హేతువాదులు అంటుంటారు. మనువాదులు అన్న మాట కూడా ఈ మనుస్మృతి వల్లనే పుట్టింది కదా.. మరి ఇదే వర్ణాశ్రమ ధర్మం రామాయణ కాలం నుంచి ఉన్నదా? ఉంటే శంబూకవధ కథనంలో కనిపించిన ‘జాతి’ (రేస్) అన్న పదం అప్పటినుంచి అమలులో ఉన్నదా? ఉంటే జాతులవారీగా ధర్మ నిర్ణయం, అమలు జరగాలి కదా.. మరి రామాయణం తొలి ఆరుకాండల్లో ఈ ప్రస్తావన ఎందుకు కనిపించలేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు (కులాలు అని అనలేదు) చక్కగా ఆనందంగా ఉన్నాయని యుద్ధకాండ ఫలశ్రుతిలో పేర్కొన్నారు. అంతకుమించి మిగతా ఆరుకాండల్లో ఏ విధంగానూ ఇంత లోతుగా వర్ణాశ్రమాల వర్ణన గానీ. ధర్మ నిర్ణయాలు కానీ జరుగలేదు. ఒక్కసారి యుద్ధకాండలోని ఫలశ్రుతి చదవండి.

‘రాముడు రాజ్యమును పాలించిన కాలములో స్త్రీలు వైధవ్య దుఃఖమును పొందలేదు. క్రూర జంతువుల వలన భయముకానీ, వ్యాధుల వలన భయము కానీ లేకుండెను. లోకములో దొంగలు లేకుండిరి. ఎవ్వనికి కూడా ఏ అనర్థము కలుగలేదు. పిల్లలకు పెద్దవాళ్లు ప్రేతకార్యము చేయు అవసరమెన్నడూ ఎక్కడా కలుగలేదు. అంతా ఆనందమయముగానే ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముడినే చూచుచూ, అనగా రాముడి మనసుకు బాధకలుగును అనే అభిప్రాయముతో లేదా.. రాముడెక్కడ చూచునో అన్న భయముతో ప్రజలు ఒకరినొకరు హింసించుకొనలేదు. రాముడు రాజ్యము చేయుచున్న కాలములో ప్రజలు వేలకొలది సంవత్సరములు, వేలకొలది పుత్రులతో రోగములు కానీ, దుఃఖముకానీ లేనివారై యుండిరి.

ప్రజలు ఎక్కడ చూచినా రాముడు రాముడు రాముడు అని ఎల్లప్పుడూ రాముడిని గూర్చిన కథలు చెప్పుకొనిరి. రాముడు రాజ్యమును పాలించు కాలములో జగత్తు అంతా రామమయము అయిపోయెను. అప్పుడు వృక్షములు ఎట్టి వ్రణములు అనగా క్రిమి కీటకాదుల వలన గాయములు లేక నిత్యము పుష్ప ఫలములతో నిండియుండెను. మేఘము తగిన కాలమునందు వర్షించుచుండెను. వాయువు స్పర్శ పుష్కలముగా నుండెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు దురాశలేక తమ తమ పనులచే తృప్తి చెందుచూ తమ తమ కర్తవ్యములు చేసికొనుచుండిరి. రాముడు రాజ్యము పాలించుచుండగా ప్రజలు ధర్మ తత్పరులై అసత్యమనేది లేక నివసించుచుండిరి. ప్రజలందరూ ఉత్తమ లక్షణ సంపన్నులే. అందరూ ధర్మమునందు ఆసక్తి కలవారే. రాముడు ఈ విధముగా పదకొండు వేల సంవత్సరములు రాజ్యముచేసెను.’

ఈ ఫలశ్రుతిలో ఎక్కడా జాతి ప్రస్తావన లేదు. ధర్మ ప్రస్తావన తప్ప. ఇక్కడ జాతి ప్రకారమే ధర్మం నిర్ణయం జరిగితే.. ఈ జాతి అనే నిర్మాణం ఎలా జరిగింది? పుట్టుకతోనే కులం, జాతి అన్న వాటిపై 19 శతాబ్దం దాకా నిర్ణయం జరిగినట్టు మనకు ఎక్కడా ఏ కోశానా కనిపించదు. కులం అన్న మాట బ్రిటిష్‌వాడు వచ్చి వృత్తులను కులాలుగా, ముక్కులను జాతులుగా డిసైడ్ చేసేదాకా రానేలేదు. శంబూకుడి వధకు ముందు రాముడి దర్బారుకు బ్రాహ్మణుడు వచ్చి మాట్లాడిన సందర్భంలో రాముడి రాజ్యంలో ధర్మచ్యుతి జరిగిందని, అందువల్ల గ్రామాల్లో పట్టణాల్లో అకాల మరణాలు సంభవిస్తున్నాయని అంటాడు. అంటే చాలా చాలా మరణాలు జరిగినాయని కదా అర్థం! ఈయనొక్కడే రాజదర్బారుకు వచ్చాడు. అంటే యుద్ధకాండ ఫలశ్రుతిలో చెప్పినవన్నీ తప్పులని భావించాలా? పిల్లలకు పెద్దలు ప్రేతకర్మలు చేసే పరిస్థితి తలెత్తనే లేదని కదా ఫలశ్రుతి ఘోషించింది. మరి రాజుగారి దోషం వల్లనే మరణాలు జరుగుతున్నాయని బ్రాహ్మణుడు చెప్పింది ప్రక్షిప్తం కాకపోతే యుద్ధకాండ ఫలశ్రుతి మొత్తం తప్పేనని భావించాలా? ఈ రెండింటి మధ్య అంతరాన్ని పెద్దలైన పండితులు విప్పిచెప్పాలి.

నాకు మరో సందేహం కలిగింది. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం పుట్టుకతో జాతిని కులాన్ని నిర్దేశించి వాటికి కొన్ని నియమాలను ఏర్పాటుచేసి వాటిని ప్రజలపై రామాయణ కాలంలోనే రుద్దారా? అదే శంబూకుడి వధకు కారణమైందా? దీనిపై మరింత లోతుగా విశ్లేషించాలి. రామాయణకాలంలో అంటే త్రేతాయుగంలో గౌతమ స్మృతి అమలులో ఉన్నది. ఈ స్మృతి 28 అధ్యాయాలలో విస్తరించి ఉన్నది. మనకు లభిస్తున్న గ్రంథంలో దాదాపు వెయ్యి పేజీలు ఉన్నాయి. ఇందులో తపస్సు ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు.. ఏ కులం వారు చేయాలి.. ఎవరు చేయకూడదు లాంటి నియమం నాకైతే కనిపించలేదు. నేను పొరపాటైతే పెద్దలెవరైనా చెప్తే సవరించుకొంటా. శూద్రుడు తపస్సు చేయడం ధర్మ విరుద్ధమే అయితే.. ఇక్ష్వాకువంశానికి కులగురువైన వశిష్ఠుడి కులమేమిటన్న ప్రశ్న ఉద్భవించాలి కదా. ఆయననేమో బ్రహ్మర్షి అని అంటున్నాం కదా.. ఈ వశిష్ఠుడు ఊర్వశి కుమారుడని కదా పెద్దలు చెప్పేమాట. ఈ ఊర్వశి దేవవేశ్య కదా.. ఈమె కులమేమిటి? ఈమె కుమారుడైన వశిష్ఠుడి కులమేమిటి? వశిష్ఠుడు తపస్సు చేసే కదా బ్రహ్మర్షి అయింది? ఇతను త్రేతాయుగం వాడే అయితే బ్రాహ్మణుడా? క్షత్రియుడా? ఇతడు తపస్సు చేస్తే ధర్మచ్యుతి అయినట్టా కాదా? తపస్సు చేయవచ్చా? మరి రాముడు పుట్టినప్పటినుంచి ఈ వశిష్ఠుడి దగ్గరే కదా చదువుకున్నది? ఇక్కడ వశిష్ఠుడి తపస్సుకు రాని అడ్డంకి.. ఉత్తర రామాయణంలో శంబూకుడికి మాత్రం ఎందుకు వచ్చింది? ఆ కథ కల్పితం కాకపోతే! ఉత్తరరామాయణం ప్రక్షిప్తం కాకపోతే..!

మరో సందేహం. రాముడికి శతానందుడు విశ్వామిత్రుడి కథ చెప్తాడు. ఈ విశ్వామిత్రుడు కృతయుగం నాటివాడని ఋగ్వేదం చెప్తున్నది. హరిశ్చంద్రుడి కాలం నుంచి ఉన్నవాడు. కృతయుగం వాడే అయితే.. ఉత్తరరామాయణంలోని శంబూకవధ సందర్భంలో చర్చించిన ప్రకారం క్షత్రియుడు కృతయుగంలో తపస్సు చేయవచ్చా. అర్హత ఉన్నదా? ఆ విశ్వామిత్రుడే కదా.. రామలక్ష్మణులకు అస్త్రాలను ఇచ్చింది. తాటక సంహారంతో రాక్షస వధను ప్రారంభింపజేసింది? ఉత్తర రామాయణం ప్రక్షిప్తం కాకపోతే విశ్వామిత్రుడు ధర్మచ్యుతికి పాల్పడ్డట్టేనా?

ఇంకొక సందేహం. పద్నాలుగేండ్ల అరణ్యవాసానికి బయలుదేరిన సీతారామలక్ష్మణులను నది దాటించడానికి పడవ కట్టినవాడు గుహుడు. ఈ గుహుడిని రాముడు మిత్రుడుగా.. గుహుడు రాముడిని మిత్రుడిగా స్వీకరించారు. ఒకరికొకరు ఎంతో గొప్పగా ప్రేమకలిగి ఉన్నారు. గుహుడి ఇంట నేలపై గడ్డిపరుపులపైన సీతారాములకు నిద్రపోవడానికి పాన్పు ఏర్పాటుచేసిన గుహుడు లక్ష్మణుల మధ్య జరిగిన సంభాషణ ఇది. ‘మాకు ఈ లోకములో రాముడికంటే ఇష్టుడు మరెవ్వరూ లేరు. సత్యముపై ఒట్టుపెట్టి నిజముగా చెప్పుచున్నాను. ఈ రాముడి అనుగ్రహముచే లోకములో గొప్ప కీర్తిని, అధిక ధర్మమును అర్థమును పొందవలెనని మాత్రమే కోరుచున్నాను. నా బంధువులు ధనుస్సు ధరించి నిద్రపోవుచున్న నా ప్రియ మిత్రుడైన రాముని, సీతను కూడా అందరినుండియు రక్షించెదము. ఎల్లప్పుడు ఈ అరణ్యములో సంచరించుచున్న నాకు ఇక్కడ తెలియనిది ఏదీ లేదు. గొప్ప చతురంగబలము, వచ్చినను మేము ఎదిరింపగలము. అప్పుడు లక్ష్మణుడు గుహుడితో ఇట్లనెను.. ‘గుహుడా నువ్వు ఏ దోషము లేనివాడివి. ధర్మమునందు మాత్రమే శ్రద్ధ గలవాడివి. నువ్వు రక్షించుచుండగా ఇక్కడ మాకేమియూ భయములేదు. సీతారాములు ఈ విధముగా నేలపై పరుండియుండగా నాకు నిద్ర యెట్లు వచ్చును. జీవితము ఎట్లు నిలుచును. సుఖములు ఎట్లు కలుగును? సమస్తమైన దేవాసురులు కూడా యుద్ధమునందు ఎవ్వనిని ఎదురింపజాలరో అట్టి రాముడు సీతతో కూడా తృణములపై ఎట్లు సుఖముగా పరుండియున్నాడో చూడుము?’ ఈ గుహుడు రాముడిని రక్షించడం ఏమిటి? చతురంగబలాలను ఎదిరించగల శక్తిసామర్థ్యాలు ఇతనికి ఎక్కడివి? ఇతను ధర్మము నందు మాత్రమే శ్రద్ధ గలవాడు అని లక్ష్మణుడు అన్నాడు. ఇది ఏ లాంటి ధర్మము. ఉత్తరరామాయణంలోని శంబూకుడి వధ వృత్తాంతంలో జరిగిన వర్ణాశ్రమాల చర్చలో శూద్రులు ఇతర జాతులవారికి సేవలుచేయాలని చెప్పినట్టు కనిపిస్తుంది. ఈ గుహుడిని వాల్మీకి నిషాదుడని పేర్కొన్నాడు. ఈ నిషాదుడంటే ఏ జాతి? శూద్రుడేనా? ఇప్పటివరకు నేను విన్న కథల ప్రకారమే అయితే శూద్రుడనే భావించాలి. ఈ నిషాదుడు శూద్రుడు అని చెప్పబడిన జాతికి చెందినవాడే అయితే సేవాధర్మము తప్ప మరొకటి ఉండరాదు కదా.. చతురంగబలాలను ఎదిరించగల యోధుడిగా అస్త్రశస్త్రాలను అభ్యసించవచ్చా? పైగా సేవలు చేయాల్సిన చక్రవర్తిని మిత్రుడని చెప్పడమేమిటి? శూద్రులను రాముడు మిత్రులుగా సన్నిహితులుగా చూసినప్పుడు.. విష్ణుపదం చేరడానికి తపస్సు చేసుకొంటున్న శంబూకుడిని మాత్రం ఎందుకు వధిస్తాడు? ఈ నిషాదుడు దశరథుడి ఆహ్వానంపై అయోధ్యకు కూడా వస్తాడు బాలకాండలో. కోసల రాజులకు ఇంత ప్రీతిపాత్రంగా ఉన్న ట్రైబల్స్ ఉత్తరకాండలోకి వచ్చేసరికి ఎందుకు మారిపోయారు?

రామాయణంలోనే మరొక సన్నివేశం. శబరి. మతంగ మహర్షి శిష్యురాలు. ఈమె తన గురువులకు సేవలు చేస్తూ.. అరణ్యంలో ఉంటున్నది. ఈ సన్యాసిని గురించి కబంధుడు రామచంద్రుడికి చెప్పాడు. ఆమె ఆశ్రమానికి వెళ్లాలని సూచిస్తాడు. ఆయన చెప్పిన మేరకు సీతారామ లక్ష్మణులు ఆమె ఆశ్రమానికి వెళ్లారు. ఆమెను దర్శించుకోవడానికి వెళ్లారు. ఆమెను దర్శించుకొన్న తర్వాత ఆమెతో ఇలా అన్నాడు. ‘ఓ తాపసురాలా, నీ తపస్సుకు విఘ్నములేవీ కలుగుటలేదు కదా.. నీ తపస్సు వృద్ధి పొందుతున్నది కదా.. నీవు క్రోధమును నిగ్రహించుకొన్నావు కదా.. ఆహారము విషయమునందు కూడా నిగ్రహము అలవర్చుకొన్నావు కదా. చాంద్రాయనాది నియమములన్నీ పూర్తిగా చేసుకొంటివా? నీ మనస్సుకు సుఖము లభించినదా? నీవు చేసిన గురువుల సేవ సఫలమైనదా?’ అని. ఇక్కడ.. శబరి ఎంగిలి పండ్లను రాముడికి ఇచ్చినట్టు వాల్మీకి రాయలేదు. ఎన్టీరామారావు సినిమాల్లో.. పిట్టకథల్లో, వీధి బాగోతాల్లో ఈ కథను సృష్టించారు. ఇది వేరే సంగతి లెండి. ఇంతకీ శబరిది ఏమి కులం? ఆమె అడవిలో ఒక ట్రైబల్ జాతి మహిళ అయినట్టయితే.. తపస్సు చేయవచ్చా. ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి జాతి.. మరొకటి లింగభేదం.. ట్రైబల్ జాతికి చెందినవారు తపస్సు చేయవచ్చా? అందునా ఒక మహిళ తపస్సు చేయవచ్చా? ఇది ధర్మ విరుద్ధం అయితే రాముడు ఎలా అంగీకరించాడు. అప్పటికే తాటకను చంపినవాడు.. శబరి తపస్సు చేయడం ద్వారా ధర్మవిరుద్ధంగా వ్యవహరించిందని రాముడు ఎందుకు భావించలేదు? ఎందుకు శిక్షించలేదు? పైగా నీ తపస్సు ఫలించిందా? ఎంత చక్కగా చేస్తున్నావంటూ ఆమెను కొనియాడాడు కదా? నిమ్న జాతులవారు తపస్సు చేయవద్దని రామాయణకాలంలోని ధర్మం చెప్పినట్టయితే.. ఉత్తరరామాయణం ప్రక్షిప్తం కాకపోయి ఉంటే, శంబూకుడికి ఒక న్యాయం, శబరికి ఒక న్యాయం ఉండకూడదు కదా? శబరి తపస్సు చేయడాన్ని అంగీకరించిన రాముడు.. శంబూకుడి తపస్సును ఎందుకు ధర్మచ్యుతిగా భావించాడు.. అది నకిలీ కథ కాకపోతే!?

ఇక హనుమంతుడు.. ఈయనదే కులం? వానరజాతి చాతుర్వర్ణాలలో ఏ వర్ణం కిందకు వస్తుంది? ఈయన మహా తపస్సంపన్నుడు కదా.. సాక్షాత్తూ సూర్యుడి దగ్గరకు వెళ్లి సమస్త విద్యలను అభ్యసించినవాడు. చతుర్వేదములు అధ్యయనం చేసినవాడు. ఇదిగో కిష్కింధకాండలోని ఈ సన్నివేశం చూడండి. పంపానదీ తీరాన అడవిలో శబరి ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత రామలక్ష్మణులు ఋష్యమూకం వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన సుగ్రీవుడు ముందుగా భయపడిపోయి.. ఆనుపానులు కనుక్కొని రావాలని హనుమంతుడిని పంపించాడు. ఆంజనేయుడు రామలక్ష్మణుల దగ్గరకు వెళ్లి వారి వివరాలను అడిగాడు. అప్పుడు రాముడు అన్న మాటలే ఒక్కసారి చదవండి. ‘లక్ష్మణా! సుగ్రీవుడి మంత్రి అయిన ఈ వానరుడు మాటలు తెలిసినవాడు. స్నేహము కలవాడు. శత్రువులను నశింపజేయువాడు. అట్టి ఈతనితో మధురమైన మాటలతో మాటలాడుము. ఋగ్వేదమును చదవనివాడు, యజుర్వేదమును చదవనివాడు, సామవేదమును చదవనివాడు, ఈ విధముగా మాటలాడజాలడు. నిశ్చయముగా ఇతడు వ్యాకరణమును అంతా అనేక పర్యాయములు విని(చదివి) యున్నాడు. అందుచేతనే ఇన్ని మాటలు మాటలాడినా ఒక్క అపశబ్దము కూడా ఉచ్చరించలేదు.’ ఈ వానరులను ఏ జాతిగా పరిగణించాలి. జంతువులా? లేక శూద్రులా, లేక వైశ్యులా? లేక క్షత్రియులా? లేక బ్రాహ్మణులా? వీరికి వేదం చదివేందుకు పర్మిషన్లు ఉన్నాయా? సూర్యుడు ఆంజనేయుడి జాతిని తెలుసుకొనే పాఠాలు చెప్పాడా?

ఇక్కడ మరోమాట చెప్పుకోవాలి. భరతుడు అరణ్యంలో ఉన్న రాముడి దగ్గరకు వెళ్లి వెనక్కి రావాలని అడగడానికి వెళ్లినప్పుడు రాముడు ఆయనకు రాజధర్మాన్ని గురించి బోధించాడు. ఇది కూడా వాల్మీకి రామాయణంలోనిదే. అరణ్యకాండలోనిదే. ‘నీవు అధికమైన సామర్థ్యము గల సేవకులను, ఉత్తమ కార్యములు చేయుటకు, సామాన్యమైన సామర్థ్యము కలవారిని సామాన్యమైన పనులు చేయుటకు, చాలా తక్కువ సామర్థ్యము కలవారికి అధమమైన కార్యములు చేయుటకు నియోగించినావు కదా… రహస్యమైన పరీక్షలకు నిలిచినవారు పితృ పితామహ క్రమమున వచ్చినవారు పరిశుద్ధమైన నడవడిక కలవారు, శ్రేష్ఠులు ఐన అమాత్యులను శ్రేష్ఠమైన పనులు చేయుటకు వినియోగించుచున్నావు కదా’ అని అడిగాడు. ఇక్కడ సామర్థ్యము అంటే స్కిల్, మెరిట్ అన్న మాటలే ఉన్నాయి తప్ప జాతులవారీగా చర్చ జరుగలేదు. అంటే రాముడి రాజ్యంలో కులాలు, జాతులవారీగా భేదాలు లేనట్టే కదా.. మరి అలాంటప్పుడు శంబూకుడు కేవలం తపస్సు చేస్తున్నాడు అన్న ఒకే ఒక్క కారణంచేత రామచంద్రుడు అతడిని చంపాడంటే ఎలా నమ్మాలి? దీనికి హేతుబద్ధత ఏమిటి? ఇప్పటిదాకా ప్రస్తావించిన అంశాలన్నీ కూడా రామాయణం తొలి ఆరు కాండల్లో వాల్మీకి రాసినవే. ఈ మొత్తం ఆరు కాండల్లోఎక్కడ కూడా లేని జాతుల ప్రస్తావన, కులాల ప్రస్తావన.. వర్ణాశ్రమ ధర్మాల ప్రస్తావన .. వివక్ష… కేవలం ఉత్తరకాండలో మాత్రమే ఉన్నది. మూల కథకు ఎలాంటి సంబంధం లేకుండా ఒక పిచ్చికథను సృష్టించి వాల్మీకికి ఆపాదించి అదే.. పదే పదే ప్రచారంచేస్తూ వచ్చారు. రామో విగ్రహవాన్ ధర్మః అని మారీచుడే అన్నాడు. అంతటి మహా పురుషోత్తముడు ఇంతటి అకార్యానికి పాల్పడ్డట్టుగా చిత్రీకరించి రాముడి వ్యక్తిత్వాన్ని చిన్నచేసి చూపించే ఒక మహాకుట్ర ఈ దేశంలో జరిగింది. విషాదమేమంటే.. మహామహా పండితులు సైతం ఉత్తరకాండను ఏదో విధంగా సమర్థిస్తూ.. ప్రవచనాలు చెప్తుండటం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here