[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
అభారతీయం
వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును.. అని స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. ఆయన ఉద్దేశం ఏమైనప్పటికీ.. ఈ దేశాన్ని అభారతీయం చేయడానికి జవహర్‌లాల్ నెహ్రూ, ఆయన అనుచరగణం.. మార్క్సిస్టులు ఒక్కొక్కరు ఒక్కో పడగై కాటేయబూనారు. నెహ్రూ అండ్‌కో అనుసరించిన సెక్యులరిజాన్ని చాలామంది ఓటుబ్యాంకు రాజకీయాల కోసమో.. అధికారం నిలబెట్టుకోవడం కోసమో అనుసరించిన రాజకీయమని భావించారు. మైనార్టీ (ముఖ్యంగా ముస్లింలు) సంతుష్టీకరణ అనేది కేవలం రాజకీయ అవసరాలకు మాత్రమే జరుగుతున్న ఎత్తుగడగా భావించారే తప్ప నెహ్రూ ప్రభుత్వం విధానాల మౌలిక లక్ష్యం ఏమిటన్నది ఎవరూ ప్రయత్నించలేదు. ఆ దిశగా ఆలోచించనూ లేదు. జవహర్‌లాల్ నెహ్రూ పకడ్బందీగా సోషలిస్టు, సెక్యులరిస్టు సిద్ధాంతాలను అమలు చేసుకుంటూ వచ్చారు. ఓటుబ్యాంకు అనేది పైకి కనిపించే ముసుగుమాత్రమే. అసలు లక్ష్యం మాత్రం అభారతీయమే. ఒక పక్క భారతీయతలో ఉన్నవన్నీ మూఢ విశ్వాసాలని పదే పదే చెప్పటం.. ఇంకోపక్క భవిష్యత్ తరాలను ఈ దేశానికి, దేశీయతకు వ్యతిరేకంగా మార్చటం. ఈ రెండే వారి టార్గెట్లు. ఇందుకు వారికి ప్రధాన ఉపకరణంగా మారింది భాష, విద్యావ్యవస్థ.
ఒక తరాన్ని అభారతీయులుగా మార్చాలంటే వారి మూలాలకు వారిని దూరం చేయాలి. ఇందుకు మొదటి పని ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలను ఏకత్రితం చేసిన సంస్కృతంను నామరూపాలు లేకుండా చేయడం. సంస్కృతాన్ని మృతభాషగా చేయాలి. మాతృభాషలుగా విలసిల్లుతున్న ప్రాంతీయ భాషలను దూరంచేయాలి. ఇంగ్లీష్‌ను సంపూర్ణంగా భారత్ అంతటా రుద్దాలి. ఇది మెకాలే సూత్రం. ఆ మెకాలేకు వారసత్వం పుణికిపుచ్చుకున్న వీర విధేయ పాలకులు మనవారు. ఇక్కడ సంస్కృతం చేసిన ద్రోహం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. కానీ భారతీయులను తమ ధర్మం నుంచి, మతం నుంచి దూరం చేయాలంటే.. ప్రధాన అడ్డంకిగా ఉన్నది సంస్కృతమే. 1836లో మెకాలే తన తండ్రికి ఒక ఉత్తరం రాశాడు.
అందులో ఆయన ప్రధానంగా చెప్పిందేమిటో చదవండి. ‘Our English schools are flourishing wonderfully. The effect of this education on the hindoos is prodigious. No hindu who was received an English education ever remains sincerely attached to his religion.’ ఇది మెకాలే లక్ష్యం. బ్రిటిష్ వాడు చేయదలచుకున్న విధ్వంస రచనకు ప్రధాన అడ్డంకి ఈ సంస్కృతమే. ఎందుకంటే.. భారతీయ సాహిత్యం, విజ్ఞానం అంతా సంస్కృతంతో కూడుకొని ఉన్నదే. ఆసేతు హిమాచలాన్ని అఖండంగా ఉంచింది ఈ సంస్కృతమే. దీని నుంచి కనుక భారతీయులను వేరుచేయగలిగితే తాము అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సంస్కృతం చదవనప్పుడు, నేర్చుకోనప్పుడు ఆ భాషాసాహిత్యం గురించిన పరిచయమే ఉండదు. పరిచయం లేనప్పుడు భారతీయ విజ్ఞానం గురించి భారతీయులకే అవగాహన ఉండదు. అప్పుడు వీళ్లు ఏది చెప్తే అదే వేదం.. అదే విజ్ఞానం. అదే సాహిత్యం, అదే చరిత్ర, అదే సంస్కృతి. అదే నాగరికత. ఆర్యులు ఇతర దేశాల నుంచి వచ్చినవాళ్లు అని చెప్పవచ్చు. అసలు మీకు చరిత్రే లేదని చెప్పవచ్చు. రాముడు ఈ దేశపువాడు కాదని అనవచ్చు. లేదా.. రాముడు దుర్మార్గుడు.. దుష్టుడు.. రావణుడు గొప్పవాడు అని చెప్పవచ్చు. ఆర్యద్రావిడ ఉద్యమాలు తేవచ్చు. పాములు, తేళ్లను పూజించే అనాగరికులుగా భారతీయులను చెప్పవచ్చు. ముస్లిం రాజులు చాలా గొప్పవాళ్లు.. మతసామరస్యం కలిగినవాళ్లని.. భారతీయ రాజులే.. అధికార లాలసురని, స్త్రీ లోలురని.. చెప్పవచ్చు. ఇంతకాలం మీరు బతుకనే లేదు.. మేము వచ్చి బతకడం ఎట్లాగో నేర్పించామనీ చెప్పవచ్చు. ఇట్లా ఎంత చెప్పినా అడిగేవాడుండడు. ఎందుకంటే.. అడగాలన్నా అసలు సాహిత్యం సంస్కృతంలో ఉన్నది కాబట్టి దాని గురించి తెలిసిన వాడుండడు కాబట్టి ప్రశ్నించే వాడుండడు. పైగా మ్యాక్సుముల్లరో..మరొకడెవడో వేదాలను ఆంగ్లంలోకి తర్జుమాచేసి మీరనుకునే వేదాల్లో ఇవిగో ఇవే ఉన్నవి అంటూ చెప్తే ఆ.. పాశ్చాత్య పండితుడు చెప్పాడు.. అదే కరెక్టు అని మనం నిర్ధారించుకొని వాటినే చదివి.. అవే నిజమని నమ్మి.. వేదాలు చెత్త.. పనికిమాలినవని తిడుతూ.. వేదాల్లో అన్నీ ఉన్నాయిష అంటూ సెటైర్లు వేసుకుంటూ.. అమెరికా వాణ్ణో, ఇంగ్లిష్ వాణ్ణో, రష్యా వాణ్ణో నెత్తిన పెట్టుకొని మీరు చెప్పండి మేము పాటిస్తామని పాశ్చాత్య సంస్కృతిని నెత్తినెట్టుకొని గడిపేయవచ్చు. ఆంగ్లేయుల కాలంలో సదరు మెకాలే మహాశయుడు వేసిన ఈ విధ్వంస విత్తనం స్వాతంత్య్రం వచ్చేనాటికి మహావట వృక్షమై దేశమంతటా విస్తరించింది. దాని నుంచి వేనవేల మెకాలేలు పుట్టుకొచ్చారు.
మెకాలే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలని ఉన్నది. 1835లో బెంగాల్ గవర్నర్‌గా జనరల్ బెంటిక్ ఉన్నారు. తన ప్రెసిడెన్సీలో స్కూళ్లు.. బోధనా పద్ధతుల అధ్యయనం కోసం విలియం ఆడమ్ అనే ఓ మేధావిని పంపించాడు. సదరు ఆడమ్ బెంగాల్ ప్రెసిడెన్సీలోని పల్లె పల్లెకూ తిరిగాడు. ఒకరోజు బుర్ద్వాన్ అనే జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఈ ఆడమ్‌కు రఘునందన్ గోస్వామి అనే ఆయన కనిపించాడు. పరిచయాలైన తర్వాత ఆ గోస్వామి ఒక రచయిత అని తెలిసింది. అయ్యా మీరు రాసిన రచనలు ఏమిటని ఆడమ్ ప్రశ్నించాడు. దానికి ఆ గోస్వామి తన పుస్తకాల పేర్లు ఈ రకంగా చెప్పాడు. 1. రోగార్ణవ తరంగిణి (a compilation from various medical works on the treatment of disease in 6000 slokas) 2. అరిష్ట నిరూపణ (a description of the various signs or symptoms of approaching death in 400 slokas), 3, ఛందోమంజరి, 4. ఔనాడిక కోశం (a metrical dictionary of works comprising the unadi post fixes in two parts 300 slokas), 5. శాంతిశతక భాష్యం, 6. సదాచార నిర్ణయం, 7. ధాతు దీపం ( a metrical explanation of sanscrit roots in 500 slokas), 8. శరీర వివృత్తి (a treatise of the progress of gestation and on the seats in the human body), 9. లేఖా దర్పణం, 10. ద్వైత సిద్ధాంత దీపిక, 11. హరిహర స్త్రోత్రం, 12. శివ స్మరద స్తోత్రం, 13, యమక వినోదం, 14. భావానుప్రాస, 15. రాధాకృష్ణ స్త్రోత్రం, 16. సన్యాస శతని, 17. యమ షట్పది వ్యాఖ్యానం, 18. స్తవ కదంబం, 19. గోవింద రూపామృతం, 20. కృష్ణకేళీ సుధాకరం (400 శ్లోకాలు), 21. గోవింద మెదయం (800 శ్లోకాలు), 22. భక్తమాల (5 వేల శ్లోకాలు), 23. భక్త లీలామృతం, 24. పరకీయ మాత ఖండన, 25 దేశిక నిర్ణయం, 26 సూత్రాధ్యాయ భాష్యం. 27, కృష్ణ విలాపం, 28, రామరసాయనం (30000 శ్లోకాలు, 1778 పేజీలు), 29. పత్ర ప్రకాశం, 30 గోవింద చరిత్ర.
ఒక్కసారి ఆలోచించండి. బెంగాల్‌లోని ఒక జిల్లా బుర్ద్వాన్ (బ్రిటిష్‌వాడు నోరు తిరక్క పెట్టిన పేరు. ఇప్పుడు చక్కగా బర్ధమాన్ అని పేరు మార్చుకొన్నారు) జిల్లాలోని పెద్దగా ప్రసిద్ధి చెందని మహానుభావుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి రచించిన గ్రంథాల జాబితా ఇది.
ఈయన రామరసాయనం ఒక్కటే ముప్ఫై వేల శ్లోకాలున్నది. పైగా వైద్యం, వ్యాకరణం, పురాణం ఒకటేమిటి పలు రంగాల్లో ఒకే ఒక్క రచయిత ఇంతటి ప్రజ్ఞను ప్రదర్శించడం. బర్ధమాన్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెలోనే ఇంతటి అపారమైన శాస్త్ర, సాహిత్య విజ్ఞానాలు వెలువడి ఉంటే.. భారతదేశంలోని మూలమూలనా.. ఎంతమంది ప్రజ్ఞాశాలురు.. మరెంత సాహిత్యాన్ని వెలువరించి ఉంటారో ఊహించడానికైనా సాధ్యమవుతుందా? ఒక్క రఘునందన్ గోస్వామే కాదు.. కాళిదాస సార్వభౌమ, గురుచరణ పంచానన, ఈశ్వర చంద్ర న్యాయరత్న, కృష్ణమోహన విద్యారత్న లాంటి రచయితలు అనేకులు ఆడమ్‌కు తారసపడ్డారు. ఈ సాహిత్యాన్నంతా చెత్తగా మెకాలే పేర్కొన్నాడు. ఇదంతా తమ లైబ్రరీలో ఒక షెల్ఫ్ లోని పుస్తకాల్లోని విజ్ఞానానికి కూడా కొరగావని అన్నాడు. ఈ దూషణ, తిరస్కారాలు స్వాతంత్య్రానంతరం కూడా యథేచ్ఛగా కొనసాగాయి. ఇదంతా మెకాలే తన విద్యావిధానం గురించి మినిట్స్ సమర్పించడానికి కొద్దిరోజుల ముందు జరిగింది. ఆడమ్ రాసిన నివేదిక చాలా పెద్దది. ఇందులో అతను ఆనాటి దేశీయమైన విద్యావ్యవస్థ గురించి పేర్కొన్న అంశాలు చూస్తే విస్తుపోవాల్సి ఉంటుంది. ఆనాడు ఒక్క కలకత్తాలోనే 96 స్కూళ్లు ఉన్నాయి. 1080 మంది స్కాలర్లు విద్యాబోధన చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో పద్యాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాకరణం నేర్చుకుంటారు. రాజనీతి శాస్త్రాన్ని (పాలిటిక్స్) నేర్చుకుంటారు. న్యాయసూత్రాలను (లా) నేర్చుకుంటారు. ఆచార్యులు ఫైన్ ఆర్స్ట్ చెప్తారు. సామాజిక, ఖగోళ శాస్త్రాలను కూడా బోధిస్తారు. కనీసం వెయ్యి నుంచి రెండు వేల మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో ఆనాడు చదువుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఇలాంటి స్కూళ్లు బెంగాల్‌లోని ప్రతి గ్రామానా కనిపించాయి. ఈ విద్యా వ్యవస్థను మెకాలే నాశనం చేశాడు. కనీసం స్వాతంత్య్రం వచ్చిన తరువాతైనా మన భాషలో, మనకు అవసరమైన నైపుణ్య విద్యను అందించడానికి నెహ్రూ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఒక్కటీ లేదు. మనదైన విజ్ఞానానికి మనల్ని దూరం చేయడానికి ఇంగ్లిష్‌వాడు వందేండ్లకు పైగా ఏం చేశాడో.. నెహ్రూ అండ్ కో దాన్నే కొనసాగించి.. లక్ష్యం పరిపూర్ణం చేసింది.
ఇందుకు పండితులైన జవహర్‌లాల్ నెహ్రూగారు మొట్టమొదట చేసిన పని రాజభాషగా ఇంగ్లీష్‌ను కొనసాగించడం. పాలనావ్యవహారాలు ఆంగ్లంలో కొనసాగటంతో సహజంగానే ఇంగ్లీషు అవసరం కూడా సామాన్యుడికి కొనసాగుతుంది. బ్రిటిష్‌వాడు వెళ్లిపోవడంతోనే ఇంగ్లిష్ కూడా వెళ్లిపోయి, తమ తమ భాషలకు పూర్వవైభవం వస్తుందని ఆనాటి భారతీయులు అనుకుని ఉండవచ్చు.. కానీ నెహ్రూ ఆ పనిచేయలేదు. ఇంగ్లిష్ భాషను 1965 దాకా రాజభాషగా కొనసాగించాలని నెహ్రూ సర్కారు పార్లమెంట్‌లో తీర్మానం చేసింది. ఆ తరువాత కూడా నెమ్మదిగా.. అందరి ఆమోదంతో.. హిందీని అధికార భాష చేద్దామని తీర్మానంలో పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంటే ఏ ఒకటి రెండేండ్లంటే భాషా వినియోగంలో సాదకబాధకాలుంటాయి కాబట్టి ఇంగ్లిష్‌ను కొనసాగించడంలో అర్థం ఉండవచ్చు. కానీ నెహ్రూ మహాశయుడు ఏకంగా 18 సంవత్సరాలు ఇంగ్లిష్ కొనసాగుతుందని తీర్మానించాడు. కనీసం ఆ తరువాతైనా ఇంగ్లిష్ రద్దవుతుందని చెప్పాడా అంటే అదీ లేదు. 1965 తరువాత నెమ్మదిగా, అందరి ఆమోదంతో.. అని మెలికపెట్టాడు. ఈ ‘అందరి ఆమోదం (కన్సెన్సస్)’ అన్నది ఎంత గొప్ప పదమో స్వతంత్రభారతంలో మనకు తెలియనిది కాదు. ఒక సమస్యను ఎప్పటికీ పరిష్కారం కాకుండా చేయడానికి, ఒక బిల్లును ఎప్పటికీ చట్టం చేయకుండా ఉండటానికి ఈ ‘అందరి ఆమోదం’ అన్న పదం భేషుగ్గా ఉపయోగపడుతుంది. కశ్మీర్ సమస్య, మహిళా రిజర్వేషన్ బిల్లు.. లాంటివి చెప్పుకుంటే కోకొల్లలు. నెహ్రూ అన్న పద్ధెనిమిదేండ్లు కాస్తా.. 75 ఏండ్లవుతున్నది. పరిపాలనలో పేరుకు హిందీ ఉన్నా.. ఇంగ్లిష్ మాత్రం పోనే లేదు. చదువులో ఇంగ్లిష్ మాత్రమే మిగిలింది. సంస్కృ తం నామమాత్రమైపోయింది. దేశంలోని ఏ ఒక్క రాష్ర్టంలోనూ ఇప్పటికీ అధికార భాషగా ప్రాంతీయ భాషలు మనలేకపోతున్నాయి.
మెకాలే లక్ష్యాన్ని బ్రిటిష్‌వారి దత్తపుత్రులు సంపూర్ణంగా నెరవేర్చారు. ఫలితంగానే నిరక్షరాస్యత పెరిగిపోయింది. నైపుణ్యం గల మానవ వనరులను ఇవాళ్టికీ అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. పాశ్చాత్యదేశాల్లో చీప్ లేబర్‌గా భారతీయులు బతకాల్సిన దుస్థితిలో ఇప్పటికీ ఈ దేశం కొట్టుమిట్టాడుతున్నదినెహ్రూ కొట్టిన ఈ దెబ్బతో స్వదేశంలో, స్వపరిపాలనలో కూడా మెకాలే లక్ష్యసాధనే కొనసాగింది. ఇంగ్లిష్ ఆధిపత్యం కొనసాగింపుతో భారతీయ విజ్ఞానం, సాహిత్యం, సమస్త సారస్వత సంపద పూర్తిగా బుట్టదాఖలైంది. మెకాలే కోరుకున్నట్టే మనవాళ్లు మన విజ్ఞానాన్ని ఏవగించుకోవడం మొదలుపెట్టారు.
References:
- Reports-On-The-State-Of-Education-In-Bengal1835- by William Adom
- The works of Lord Macaulay, Speeches, Poems, Miscellaneous Writings
- Vedic Aryans and the Origins of Civilisation by David Frawley, S. Rajaram
- Deciphered Indus Script by Asko Parpola
References Courtesy:
Swadhyaya Resource Centre and Internet