రామం భజే శ్యామలం-43

1
3

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]సు[/dropcap]గ్రీవుడు రామాయణంలో చూపించిన  ప్రపంచ అట్లస్‌లో తూర్పు, దక్షిణాలను కొంతమేర విశ్లేషించుకొన్నాం. ఇప్పుడు పశ్చిమం వైపు వెళ్దాం. తూర్పున ఆండిస్, దక్షిణాన అంటార్కిటికా దాకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో విశ్లేషించిన సుగ్రీవుడు పశ్చిమాన ఆల్ప్స్ వరకు వివరించుకొంటూ వెళ్లాడు. వాలి భార్య తార తండ్రి సుశేణుడు పశ్చిమంవైపు వానరసేనకు నాయకత్వం వహించాడు. అర్చిష్మంతుడు, అర్చిమాల్యులు వంటి మహాబలశాలురైన, గరుత్మంతునితో సమానమైన వానరులను సుశేణుడి వెంట పంపిచాడు. ఈ పశ్చిమానికి సైతం రిఫరెన్స్ పాయింట్‌గా మధ్య భారతాన్నే సుగ్రీవుడు ఎంచుకొన్నాడు. కిష్కింధ కాండలోని ఈ 42 వ సర్గను ఒకసారి చదవండి..

‘ఓ! వానర శ్రేష్ఠులారా! మీరు రెండు లక్షల వానరులతో కలసి వెళ్లి, సీతకొరకు వెదకుడు. సుషేణుడు మీకు నాయకుడుగా ఉండును. సౌరాష్ట్ర-బాహ్లిక -చంద్ర చిత్ర దేశములను, విశాలములు, సుందరములు అయిన గ్రామములను, విశాలములైన నగరములను, పున్నాగ వనమును, వకుళ వృక్షములతోను, ఉద్దాలక వృక్షములతోను నిండిన మధ్య దేశమును, కేతక వనమును వెదకుడు. చల్లని మంగళకరమైన జలముతో పశ్చిమ దిశగా ప్రవహించు నదులను, మునుల ఆశ్రమములను, అరణ్యములలోని పర్వతములను, అక్కడ ఉన్న మరు భూములను, చాల ఎత్తుగా చల్లగా ఉన్న శిలలను, పర్వత సముదాయముచే ఆవృతమై ఉన్న ప్రవేశించుటకు కష్టమైన పశ్చిమ దిక్కును వెదకి తిములతోను, మొసళ్లతోను నిండియున్న పశ్చిమ సముద్రమునకు వెళ్లుడు. పిమ్మట మీరు మొగలి తోపులలోను, తమాల వనములలోను, కొబ్బరి తోటలలోను విహరింపుడు. అక్కడ సముద్ర తీరమునందున్న పర్వతముల యందు, వనములయందు, రమ్యమైన మురచీపత్తన- జటాపుర- అవంతీ – అంగలేపా పురములలోను, అలక్షిత వనములలోను, అక్కడ విశాలములైన రాష్ట్రములలోను, పట్టణములలోను సీతను, రావణుని స్థానమును వెదకుడు.’

సుగ్రీవుడు తూర్పు, దక్షిణం వైపు చెప్పిన ప్రాంతాల్లో ఎక్కువగా సముద్రమే ఉన్నది. సముద్రం మధ్యలో ఉన్న ద్వీపాలను గురించి ఎక్కువగా వర్ణించాడు. పశ్చిమంవైపు చెప్పిన ప్రాంతాల్లో సముద్రభాగం ఉన్నప్పటికీ.. అది చాలా తక్కువ. ఎక్కువ భాగం పర్వతాలు, మైదాన ప్రాంతాలు, ఎడారులు, నగరాలు కనిపిస్తాయి. మధ్యభారతంలో సౌరాష్ట్ర  నుంచి పశ్చిమ దిక్కుకు వానరసేనను పంపించాడు సుగ్రీవుడు. ఈ సౌరాష్ట్ర ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్నది. అక్కడి నుంచి  చంద్రచిత్ర దేశం ప్రస్తుతం రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నది. ఆ తర్వాత ఆఫ్గనిస్తాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌ను బాహ్లిక దేశంగా చరిత్రకారులు నిర్ధారించారు. ఈ బాహ్లిక రాజులు తరువాతి తరాల వారు.. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడారు. సుగ్రీవుడు ఆయా దేశాలు, ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో చెప్తూనే.. అక్కడక్కడ ఉండే పూవులు, తోటలు, వివిధ జాతుల జంతువులు.. చెట్లు ఇలా అనేకమైన అంశాల గురించి అద్భుతంగా వర్ణిస్తూ పోయాడు. మరచీపత్తన, జటాపుర, అవంతి, అంగలేప పురాలు.. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్‌ల మీదుగా పాకిస్థాన్ వరకు ఉన్నాయి. ఎడారి ప్రాంతాలను మరుభూములుగా పేర్కొన్నాడు. ఈ ఎడారి ప్రాంతాలు రాజస్థాన్, పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. సుగ్రీవుడు మరికొన్ని అంశాల గురించి సవివరంగా చెప్పుకొంటూ వచ్చాడు.. చదవండి..

‘సింధు సాగరముల సంగమ స్థానమునందు నూరు శిఖరములు గల మహావృక్షములతో నిండిన సోమగిరి అను ఒక పెద్ద పర్వత మున్నది. అక్కడ రమ్యములైన చరియల మీద రెక్కలతో ఎగురు సింహములుండును. అవి తిములను, మత్స్యములను, గజములను పట్టి తమ గూళ్లకు చేర్చుచుండును. నలువైపుల నీటితో నిండిన ఈ విశాల ప్రదేశములో ఉన్న సింహముల నివాస స్థానముల దగ్గర పర్వత శిఖరములందు నివసించునవి, ఉరుముల వంటి ఘీంకారములు గలవి, తృప్తి చెంది గర్వించి ఉన్నవి అయిన ఏనుగులు సంచరించుచుండును. కామరూపులైన వానరులు ఆకాశమును స్పృశించుచున్న చిత్రమైన వృక్షములు గల దాని బంగారు శిఖరమును అంతను శీఘ్రముగా వెదకవలెను. మీరు అచటికి వెళ్లి సముద్రములో ఉన్న పారియాత్ర పర్వతము యొక్క నూరు యోజనముల బంగారు అగ్రభాగమును చూడగలరు. అది మిరిమిట్లు గొల్పుచు చూచుటకు కష్టముగా నుండును. ఆ పారియాత్ర పర్వత శిఖరమునందు, అగ్నితో సమానులు, భయంకరులు, స్వేచ్ఛారూపము గలవారు, తపశ్శాలులు అయిన ఇరువదినాలుగు కోట్ల గంధర్వులు నివసించుచున్నారు. నలుమూలల వ్యాపించి ఉన్న అగ్నిజ్వాలలతో సమానులైన వారి దగ్గరకు భయంకరమైన పరాక్రమము గలవారైనను మీరు ఎవ్వరూ వెళ్లకూడదు. వానరులెవ్వరు ఆ ప్రదేశమునందు ఏ ఫలములను గ్రహించకూడదు. మహా బలవంతులైన ఆ వీరులు ఎదిరింప శక్యము గానివారు. భయంకరమైన పరాక్రమము గలవారు. అక్కడ ఉన్న ఫలములను రక్షించుచుందురు. అక్కడ మీరు ప్రయత్నపూర్వకముగా సీతను వెదకవలెను. వానరులుగా ప్రవర్తించువారికి అక్కడ గంధర్వులనుండి ఏమాత్రము భయము లేదు. అక్కడ వైఢూర్యమణివంటి కాంతి గల వజ్రము ఆకారములో నున్న నూరు యోజనముల ఎత్తు గల, వజ్రమను, శోభాయుక్తమైన మహాపర్వత మున్నది. అది అనేక విధములైన వృక్షములతోను, లతలతోను నిండి ఉండును. దాని గుహలను ప్రయత్నపూర్వకముగా అన్వేషించవలెను. సముద్రము నాల్గవ వంతు భాగములో చక్రవంత మను పర్వతమున్నది. దానిమీద విశ్వకర్మ వేయి అంచులు గల చక్రమును నిర్మించెను. అక్కడ శ్రీమహావిష్ణువు ఆ చక్రమును రక్షించుచున్న హయగ్రీవుడు అను దానవుని చంపి వానినుండి చక్రమును, పంచజనుని చంపి వానినుండి శంఖమును గ్రహించెను. అక్కడ అందమైన చరియలయందు, విశాలములైన గుహలయందు, అన్ని ప్రదేశములయందు, రావణుణ్ణి, సీతను వెదకుడు. చాల లోతైన సముద్రములో అరువదినాలుగు యోజనముల దూరము వ్యాపించి బంగారు శిఖరములు గల వరాహమను పర్వతమున్నది. అక్కడ ప్రాగ్జ్యోతిషమను బంగారు పట్టణ మున్నది. ఆ పట్టణములో నరకుడను దుష్టబుద్ధి గల దానవుడు నివసించుచున్నాడు. అక్కడ అందమైన చరియలయందు, విశాలములైన గుహలయందు, అన్ని ప్రదేశములయందు రావణుని, సీతను వెదకుడు. బంగారు గుహామధ్య ప్రదేశములు గల ఆ వరాహ పర్వతమును దాటిన పిమ్మట జలపాతములతోను, సెలయేళ్లతోను నిండిన సర్వ సౌవర్ణమను పర్వతమున్నది. గజములు, వరాహములు, సింహములు, పెద్దపులులు ఆ పర్వతమునకు అభిముఖముగా నలువైపులా నిలిచి ప్రతిధ్వనిచేత గర్వించినవై ఎల్లప్పుడు గర్జించుచుండును. అక్కడ మేఘమను పర్వతమున్నది. దానిపైననే ఆకుపచ్చని గుఱ్ఱములు గలవాడు, శ్రీమంతుడు, పాకాసురుని సంహరించినవాడు, అయిన మహేంద్రునకు దేవతలు రాజ్యాభిషేకము చేసిరి. మీరు మహేంద్రుడు పాలించుచున్న ఆ మేఘపర్వతము దాటి అరువదివేల బంగారు పర్వతములకు వెళ్లుడు. అన్ని వైపుల ఆ పర్వతములు బాలసూర్యుని వంటి కాంతితో ప్రకాశించుచుండును. బాగుగా పుష్పించిన బంగారు వృక్షములతో శోభించుచుండును. ఆ పర్వతముల మధ్య పర్వతరాజైన మేరు పర్వతమను ఉత్తమమైన పర్వత మున్నది. పూర్వము సూర్యుడు ప్రసన్నుడై ఆ పర్వతమునకు వరమును ఇచ్చెను. సూర్యుడు మేరు పర్వతముతో ఇట్లు చెప్పెను. ‘నీ మీద ఉన్న ప్రతి వస్తువు నా అనుగ్రహము వలన రాత్రింబవళ్లు బంగారు వర్ణము గలది అగును. నీ పై నివసించు దేవ గంధర్వ దానవుల వర్ణము ఎఱ్ఱగాను, బంగారము వర్ణము వలెను ఉండును’. విశ్వేదేవతలు, అష్ట వస్తువులు, సప్త మరుత్తులు, ఇతర దేవతలు, పశ్చిమ సంధ్యాసమయమునందు ఉత్తమ పర్వతమైన ఆ మేరువును చేరి సూర్యుని సేవింతురు. సూర్యుడు వారిచేత పూజింపబడి సకల ప్రాణులకు కనబడకుండునట్లు అస్తాద్రికి వెళ్లును. సూర్యుడు ఆ మేరువు నుండి పదివేల యోజనముల దూరములో ఉన్న ఆ అస్తాద్రిని అర్ధ ముహూర్త కాలములో శీఘ్రముగా చేరును. విశ్వకర్మ దాని శిఖరము మీద సూర్యుని వలె ప్రకాశించుచున్న దివ్యమైన మహాభవనమును నిర్మించెను. అది ప్రాసాదముల సముదాయములతో నిండి యుండును. అనేక విధములైన పక్షులతో నిండిన విచిత్రములైన వృక్షములతో ప్రకాశించుచున్న ఆ దివ్య భవనము పాశము హస్తమునందు గల మహాత్ముడైన వరుణుని నివాసము. ఆ మేరు అస్తాద్రుల మధ్య పది తలలు గల పెద్ద బంగారు తాటిచెట్టు ఉన్నది. దాని చుట్టూ ఉన్న వేదిక చిత్రముగా నుండును. మీరు ఆ అన్ని దుర్గములలోను, సరస్సులలోను, నదులలోను, ఆ యా స్థలములలో రావణుని కోసము, సీతకోసము వెదకుడు. ఆ ప్రాంతమునందు ధర్మమును తెలిసినవాడు, తపస్సుచేత పవిత్రమైనవాడు, బ్రహ్మదేవునితో సమానుడు అయిన మేరుసావర్ణి నివసించుచున్నాడు. మీరు సూర్యునితో సమానుడైన ఆ మేరుసావర్ణి మహర్షికి సాష్టాంగ ప్రణామము చేసి సీతను గూర్చిన వార్తను ప్రశ్నించుడు. సూర్యుడు పగటి భాగమునందు ఇంతవరకు ఉన్న ప్రదేశమునందు ప్రాణులకు చీకటి లేకుండునట్లు చేసి అస్తాద్రిని చేరును’.

ఇంత వివరంగా భౌగోళిక స్వరూపం నుంచి సుగ్రీవుడు వర్ణించినట్టుగా మనకు మరెక్కడా కనిపించదు. పశ్చిమంవైపు సాగిన అనేకానేక పర్వతాల గురించి సుగ్రీవుడు చెప్పాడు. సోమగిరి, పరియాత్ర, వజ్ర, చక్రవంతం, వరాహ, మేఘ, మేరు, అస్తాద్రి వంటి పర్వతాలను గురించి విపులంగా వర్ణించాడు. అవి ఎంతెంత దూరంలో ఉన్నాయో చెప్పుకొంటూ వచ్చాడు.

వీటిలో సుగ్రీవుడు మొదట చెప్పింది సోమగిరి. ఇది సింధు నదీ తీర ప్రాంతంలో ఉన్నదని పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని సింధు నది తీరంలో లక్కీ పర్వత శ్రేణులు ఉన్నాయి.  దాదాపు 80 కిలోమీటర్ల పొడవైన పర్వత శ్రేణులివి. కిర్థార్ పర్వతాలతో అనుసంధానమై సెహ్వాన్ మీదుగా విస్తరించి పశ్చిమాన సాగరంలో కలిసిపోతుంది. ఇది దాదాపు 1500 నుంచి 2000 అడుగుల ఎత్తు ఉంటుంది. 80 కిలోమీటర్ల పొడవున అనేక స్థాయిల్లో ఈ పర్వత శ్రేణులకు వందకుపైగానే శిఖరాలున్నాయి. దీన్ని ఆనుకొని దట్టమైన అడవి, క్రూరమృగాలు సంచరించే ప్రాంతం ఉన్నది. రామాయణ కాలంలో పేర్కొన్న సోమగిరి ఇదే. దీనిపైన పశుపతినాధుడితోపాటు దాదాపు 270 ఆలయాలు ఉన్నట్టు తెలుస్తున్నది.

ఆ తర్వాత సుగ్రీవుడు ప్రస్తావించిన పర్వతప్రాంతం పరియాత్ర. ఇది పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్‌ల మధ్యన దక్షిణం నుంచి పశ్చిమం వైపు విస్తరించిన హింద్‌కుశ్ పర్వత శ్రేణి. ఇదే రామాయణ కాలంనాటి పరియాత్ర. ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్, బలోచిస్తాన్ వరకు విస్తరించి ఉన్నది. ఇందులో ఒక పర్వత ప్రాంతాన్ని  సులేమాన్ పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ పర్వత శ్రేణుల ప్రాంతంలో అత్యంత దుర్గమమైన స్థావరాలున్నాయి. వేలాది గిరిజన జాతులు ఇక్కడ నివసిస్తాయి. వీరి ఆచారాలు, సంప్రదాయాలు కూడా చాలా టిపికల్‌గా ఉంటాయి. అత్యంత సంక్లిష్టంగా ఉండే పర్వత శ్రేణుల్లోని గిరిజన జాతుల ప్రజలు గెరిల్లా తరహా  యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగినవారు. ఇతర దేశాల్లో మాదిరిగా ఇక్కడ సింపుల్‌గా వైమానిక దాడులద్వారా, ఆకాశం నుంచి బాంబులు వేసి శత్రువులను హతమార్చడం తేలికైన పనికాదు. సహజంగా ఉండే బంకర్లున్నాయి. గత దశాబ్దంన్నర కాలంలో ఆఫ్గనిస్తాన్‌లో లాడెన్ ముఠాను పట్టుకోవడానికి అమెరికా ముప్పుతిప్పలు పడిన సంగతి మనకు తెలిసిందే. అందుకే..అక్కడి ప్రజల జోలికి పోకుండా సీతను వెతకాలని సుగ్రీవుడు వానరసేనకు చెప్పాడు.

భారత్ నుంచి పాకిస్తాన్ తర్వాత ఇరాన్.. యూరప్ ఈ విధంగా వానరసేన పశ్చిమయాత్ర కొనసాగింది.

ఆ తర్వాత ఆయన దృష్టికి వచ్చిన పర్వతాలు వజ్ర, చక్రవంత, వరాహ పర్వతాలు. ఈ వజ్ర పర్వతం ఇరాన్‌లో ఉన్నది. ఇరాన్ నుంచి టర్కీ దాకా విస్తరించిన జాగ్రోస్ పర్వత శ్రేణులే నాటి వజ్ర పర్వతం. ఈ పర్వత శ్రేణి ప్రధానంగా లైమ్ స్టోన్‌తో నిర్మాణమైనది. ఈ పర్వతం అత్యంత కఠినమైన రాయిని కలిగి ఉంటుంది. పేల్‌జాయిక్, మెస్జాయిక్, ట్రాసిక్.. క్రెటాసియక్, పేల్‌జీన్, నియోజీన్ తదితర రాతి పొరలు ఈ పర్వత శ్రేణుల్లో ఉంటాయి. ఇవి అత్యంత కఠినాతి కఠినమైన రాతి శ్రేణులు. ఈ పర్వత శిఖరం వజ్రపు మొనలా తేలి ఉంటుంది. ఈ పర్వత రాతిని తొలచడం సామాన్యమైన విషయమేం కాదు.

ఈ పర్వత శ్రేణిని దాటి ముందుకు వెళ్లిన తర్వాత కాస్పియన్ సముద్రంలో నాలుగో వంతు భాగం ఉండిపోయిన కాకసస్ పర్వత శ్రేణి కనిపిస్తుంది. ఇది అత్యంత వేడిగల ప్రదేశం. ఈ పర్వత శ్రేణులు ఒక్కో పీక్ ఒక్కో రూపంలో కనిపిస్తుంది. అందుకే దీన్ని చక్రవంత పర్వతం అన్నారు. ఒక శిఖరం ఉపరితలం వెయ్యి అంచుల చక్రం రూపంలో సర్కిల్‌గా కనిపిస్తుంది. మరో శిఖరం  ఆకాశానికి పొడుచుకొని ఉంటుంది. ఈ పర్వతశ్రేణుల్లోనే అగ్నిపర్వతం ఉన్నది. ఈ పర్వతం బద్దలైన ఆనవాళ్లు ఈ పర్వత శ్రేణుల ఉపరితలంపై బూడిదగా కనిపిస్తుంది.

ఆ తర్వాత మనకు  రామాయణంలో ప్రధానంగా కనిపించేది వరాహ పర్వతం. ఇది ప్రస్తుత టర్కీలో ఉన్నది. ఇక్కడి టారస్ పర్వతాన్నే రామాయణకాలం నాటి వరాహ పర్వతంగా చెప్తున్నారు. సముద్రమట్టానికి దాదాపు 3800 మీటర్ల ఎత్తున ఈ పర్వత శిఖరం ఉన్నది. ఇది అత్యంత వేడిగల ప్రాంతం. దక్షిణ టర్కీ నుంచి యురేసియా వరకు విస్తరించి ఉన్నది. ప్రఖ్యాత టైగ్రస్ నది ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నది.

వరాహ పర్వత శ్రేణులను దాటిన తర్వాత.. నరకుడనే రాక్షసుడు పరిపాలించే ప్రాగ్య్జోతిషపురమనే నగరం ఇక్కడే ఉన్నదని సుగ్రీవుడి లెక్కల ప్రకారం అర్థమవుతున్నది. నీలేశ్ ఓక్ అనే చరిత్రకారుడు భగదత్తుడి పేరుపైనే బాగ్దాద్ అనే మాట వచ్చి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. మనకు ప్రాగ్య్జోతిషపురమనే మాట భారతంలో వినిపిస్తుంది. నరకాసురుని శ్రీకృష్ణుడు హతమార్చాడు. (సత్యభామా సహితుడై) ఆ తరువాత అతని కుమారుడు భగదత్తుడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన పోరాడాడు. ఈ నరకుడి రాజధాని ప్రస్తుతం కామాఖ్య శక్తిపీఠం ఉన్న అస్సాం ప్రాంతం అని భావిస్తూ వస్తున్నాం. ఇప్పుడు రామాయణకాలంలో పశ్చిమం వైపు వెళ్లిన వానరసేనకు నరకుడి రాజ్యం గురించిన ఆనవాళ్లను సుగ్రీవుడు చెప్పాడు. ఈ రెండూ ఒకటా వేర్వేరా అన్నది పండితులెవరైనా తేలిస్తే బాగుంటుంది.ఈ పురంలో అందమైన సెలయేళ్లు.. కొండ చరియలు.. అనేకానేక సుందర వనాలు ఉన్నాయని సుగ్రీవుడు పేర్కొన్నాడు.

అనంతరం మనకు సుగ్రీవుడు చూపించిన మరో పర్వతం మేఘవంతం. మేఘాలు ఈ పర్వత శిఖరంకంటే కిందినుంచి పయనిస్తుంటాయి. ఇది స్లొవేకియాలో మొదలై.. రొమేనియా మీదుగా దాదాపు వెయ్యి మైళ్ల మేర విస్తారంగా విస్తరించి ఉన్న ప్రాంతం. ఈ పర్వత శ్రేణులు సూర్యుడి కిరణాలు సోకినప్పుడు బంగారు వర్ణంలో ఎంతో అందంగా కనిపిస్తాయి. అందుకే సుగ్రీవుడు వీటిని బంగారు పర్వతాలు అన్నాడు. 64 వేల పర్వతాలు ఉన్నట్టు చెప్పాడు. ఈ శ్రేణుల్లో ఎన్ని పర్వతాలు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ప్రధానంగా 30 పెద్ద శిఖరాలు కనిపిస్తున్నాయి. ఈ పర్వతాల సానువుల్లో దాదాపు 30 నగరాల్లో నాగరికత విలసిల్లుతున్నది. ఈ పర్వతాలను ఇప్పుడు కార్పథియన్ పర్వత శ్రేణులుగా పిలుస్తున్నారు.

ఆ తర్వాత ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేది మేరు పర్వతం. ఇది ప్రస్తుతం టాంజానియన్ పర్వతంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఉత్తర టాంజానియాలో ప్రారంభమై.. దక్షిణ అమెరికా దక్షిణాన ముగుస్తున్నది. ఇది దాదాపు 14 వేల అడుగుల ఎత్తుగల మహా పర్వతం. ఇందులో అగ్ని పర్వత భాగం కూడా ఉన్నది. నిరంతరం భగభగమని మండుతూ ఉంటుంది. సూర్యుడి అనుగ్రహం పొందిన పర్వతంగా సుగ్రీవుడు దీన్ని అభివర్ణించాడు. ముఖ్యంగా దీని నిర్మాణాన్ని ఆయన వివరించుకొంటూ వచ్చాడు. ఇది రాత్రింబవళ్లు ఎర్రగా, బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంటుంది అన్నాడు. ఇందులోని అగ్ని జ్వాలల వల్లనే ఇది ఆ విధంగా ప్రకాశిస్తుంటుంది. దీనిని ప్రస్తుతం స్ట్రాటో వాల్కెనో అని పిలుస్తారు.

దీని తర్వాత సుగ్రీవుడు చెప్పినది.. చివరిది అస్తాద్రి. మేరువునుంచి ముహూర్తకాలంలో సూర్యుడు అస్తాద్రికి చేరి అస్తమిస్తాడట. తూర్పున ఉదయగిరి గురించి చెప్పిన సుగ్రీవుడు.. పశ్చిమాన అస్తాద్రిని వివరించాడు. అస్తాద్రి అంటే ఆల్ప్స్.. యూరప్ లో పశ్చిమం నుంచి తూర్పు వరకు విస్తరించిన పర్వతశ్రేణి ఆల్ప్స్. దీని పరిధిలో ఎనిమిది యూరప్ దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, మొనాకో, ఆస్ట్రియా, లైటెన్సిటియన్, జర్మనీ, స్లొవేనియా. ఉదయగిరిపై ఉదయించిన సూర్యుడు ఈ అస్తాద్రిపై (ఆల్ప్స్) దగ్గర అస్తమిస్తాడు అని సుగ్రీవుడు వర్ణించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here