Site icon Sanchika

రామం భజే శ్యామలం-44

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]సు[/dropcap]గ్రీవుడు తూర్పు, దక్షిణ, పడమర వైపు వానర సేనను పంపించిన తర్వాత.. ఉత్తరంవైపు శతబలుడిని సేనానాయకుడిగా ఎంపికచేసి దాదాపు లక్షమంది వానరులను అప్పగించి వెళ్లమన్నాడు. ఇక్కడ ఉత్తరం వైపు.. ఏయే ప్రాంతాలు.. దేశాలు, పర్వతాలు, వనాలు, తోటలు, మనుషులు ఎలా ఉంటారో సవివరంగా వర్ణిస్తూ వచ్చాడు. సుగ్రీవుడు విశ్వాన్ని వర్ణించిన తీరుకు రామచంద్రుడే ఆశ్చర్యపోయాడట. ముందుగా ఉత్తరం వైపు ప్రపంచాన్ని సుగ్రీవుడు వివరించిన తీరును ఒకసారి చూద్దాం. కిష్కింధకాండలోని 43వ సర్గలోని సుగ్రీవుడు శతబలుడితో మాట్లాడిన వివరాలు యథాతథంగా…

ఓ! శతబలా పరాక్రమవంతుడా! మీరు హిమవత్పర్వతము శిరోభూషణముగా గల ఉత్తరపు దిక్కుకు వెళ్లి అక్కడ అంతటను కీర్తిమంతురాలైన సీతను వెదుకుడు. కార్యములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడా! ఈ కార్యము సాధించి రామునకు ప్రియము చేసినచో మేము ఋణ విముక్తులమై కృతార్థులము కాగలము. బుద్ధి పరాక్రమముల సంపద గల మీరు ఈ వనదుర్గములలోను, నదులలోను, పర్వత మధ్యములలోను అన్వేషించుడు. అక్కడ మ్లేచ్ఛ-పులింద-శూరసేన-ప్రస్థల-భరత-కురు-మద్రక-కాంబోజ – యవన-శక-బాహ్లిక-ఋషిక-పౌరవ టంకణ-చీన-పరమచీన-నీహార-వరద దేశములలో బాగుగా వెదకి హిమవత్పర్వతమునందు కూడ సీతకై అన్వేషించుడు. లోధ్ర-పద్మక వృక్షముల సముదాయముల యందు, దేవదారువనము నందు అన్ని ప్రదేశములలోను రావణునికొరకు, సీతకొరకు వెదకుడు. పిమ్మట దేవతలు, గంధర్వులు నివసించు సోమాశ్రమమునకు వెళ్లి అక్కడినుండి విశాలమైన చరియలు గల కాలపర్వతమునకు వెళ్లుడు. ఆ నీలపర్వతమునకు సంబంధించిన శిలాసముదాయములపైన, పెద్ద పర్వత భాగముల పైన, గుహలలోను మహాభాగ్యవంతురాలు, దోషములు లేనిది అయిన సీతను వెదకుడు. పర్వత శ్రేష్ఠమైన బంగారముతో నిండిన ఆ కాల పర్వతమును దాటి సుదర్శన పర్వతమునకు వెళ్లుడు. ఆ సుదర్శనము తరువాత పక్షులకు నివాసమైన దేవసఖ మను పర్వతమున్నది. అనేక వృక్షములచేత అలంకరింపబడిన ఆ పర్వతమునందు అనేక విధములైన పక్షులు ఉండును. ఆ పర్వతముపైన వనములందు, లోయలలోను, గుహలలోను, అన్ని స్థలములయందు రావణునికొరకు, సీతకొరకు వెదకుడు. ఆ దేవ సఖపర్వతము దాటిన తరువాత, అంతటా వంద యోజనముల వైశాల్యము గల శూన్యప్రదేశముండును. అక్కడ పర్వతములు గాని, నదులుగాని, వృక్షములు గాని, ఏ ప్రాణులు గాని ఉండవు. భయంకరమై, రోమాంచమును కల్గించు ఆ శూన్య ప్రదేశమును దాటి వెళ్లి తెల్లని పర్వతమును చూడగానే మీకు ఆనందము కలుగును. అక్కడ విశ్వకర్మ నిర్మించిన రమ్యమైన కుబేరుని భవనమున్నది. తెల్లని మేఘము వలె ఎత్తుగా ఉండు ఆ భవనము బంగారముచే అలంకరించబడినది. అక్కడ అధికమైన పద్మములు, కలువలు గల ఒక విశాలమైన పద్మసరస్సు ఉన్నది. హంసలతోను, కారండవ పక్షులతోను నిండిన ఆ సరస్సును అప్సర స్త్రీలు సేవించుచుందురు. ఆ భవనములో విశ్రవణుని కుమారుడు సర్వ లోకములచే నమస్కరింపబడువాడు, యక్షుల రాజు, శ్రీమంతుడు అయిన కుబేరుడు యక్షులతో సంతోషముగా నివసించుచుండును. ఆ కైలాసము దగ్గర ఉన్న చంద్రుని వంటి కాంతి గల పర్వతముల మీద, గుహలలోను, అన్ని ప్రదేశములలోను కూడ సీతను, రావణుని వెదకుడు. మీరు క్రౌంచ పర్వతమును చేరి ప్రవేశించుటకు చాల కష్టమైన దాని రంధ్రములోనికి చాల జాగరూకతతో ప్రవేశించవలెను. అది ప్రవేశింప శక్యము గానిది అని అందరు చెప్పుదురు. సూర్యునితో సమానమైన కాంతి గలవారు, దేవతాస్వరూపులు, మహాత్ములు అయిన మహర్షులు, దేవతలు ప్రార్థింపగా ఆ కైలాస పర్వతము మీద నివసించుచున్నారు. క్రౌంచ పర్వతమునకు సంబంధించిన పెద్ద శిఖరమును, ఇతరమైన గుహలను, చరియలను, శిఖరములను, రంధ్రములను, మధ్య ప్రదేశమును పూర్తిగ అన్వేషించవలెను. క్రౌంచ పర్వతమునకు సంబంధించి మానస మను కోరికను తీర్చు ఒక పర్వతమున్నది. దానిపై వృక్షములుండవు. పక్షులు నివసించుచుండును. ప్రాణులు, దేవతలు, రాక్షసులు కూడ అక్కడికి వెళ్లజాలరు. ఆ క్రౌంచ పర్వతమునకు సంబంధించిన చరియలను, ప్రాంత భూములను, చిన్న పర్వతములను మీరందరు వెదకవలెను. క్రౌంచ పర్వతమును దాటిన తరువాత మైనాక పర్వతము వచ్చును. ఆ మైనాక పర్వతము మీద మయుడనే దానవుడు స్వయముగా నిర్మించుకొని భవనమున్నది. అక్కడక్కడ కింపురుష స్త్రీల నివాసములున్నవి. ఆ మైనాకము చరియలను, సమీప భూములను, గుహలను వెదకవలెను. ఆ ప్రదేశమును దాటిన పిమ్మట సిద్ధులు నివసించు ఆశ్రమము వచ్చును. దానియందు సిద్ధులు, వైఖానసులు, వాలఖిల్యులు నివసించుచుందురు. మీరు తపస్సుచేత పాపములన్నీ నశించిన సిద్దులకు నమస్కరించి సీత వృత్తాంతము గూర్చి వారిని సవినయముగా ప్రశ్నించుడు. అక్కడ వైఖానసులకు సంబంధించిన సరస్సు ఉన్నది. బంగారు పద్మములతో నిండిన ఆ సరస్సులో లేత సూర్యుని వంటి కాంతి గల సుందరములైన హంసలు సంచరించుచుండును. కుబేరుని వాహనమైన సార్వభౌమము అను పేరు గల గజము ఆడ ఏనుగులతో కలిసి నిత్యము ఆ ప్రదేశమునకు వచ్చుచుండును. ఆ సరస్సు దాటిన తర్వాత చంద్ర సూర్యులు గాని, నక్షత్ర గణములు గాని, మేఘములు గాని లేని, ఎట్టి ధ్వనులు వినబడని ఆకాశము మాత్రము ఉండును. దేవతలతో సమానులై సహజమైన కాంతి గల అక్కడ విశ్రమించుచున్న తపస్సిద్దులచేత ఆ ప్రదేశము సూర్య కిరణముల చేత వలె ప్రకాశింప చేయబడుచుండును. ఆ ప్రదేశమును దాటిన తరువాత శైలోద అను నది వచ్చును. దాని రెండు తీరములయందు కీచకములు అను వెదుళ్లు ఉండును. అవి సిద్ధులను నది ఆవలి ఒడ్డునకు తీసుకొని వెళ్లి వెనుకకు తీసుకొని వచ్చుచుండును. అక్కడ పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తర కురు దేశమున్నది. అక్కడ బంగారు పద్మములు గల పద్మలతలు వ్యాపించిన ఉదకములతో నీల వైడూర్యముల వంటి ఆకులతో నిండి బంగారు వికారమైన ఎఱ్ఱని కలువల చేత అలంకరింపబడిన వేల కొలది నదులు ఉండును. ఆ ప్రదేశమునందు అంతటా చాల విలువైన మణులు, రత్నములు, బంగారువర్ణము కింజల్కములు గల చిత్రములైన నల్ల కలువల వనములు, సాటి లేని ముత్యములు వ్యాపించి ఉండును. ఇక్కడ నదుల ఇసుక తిన్నెలు బంగారము కలిసి యుండును. అనేక రత్నములతో నిండి చిత్ర వర్ణములై అగ్నితో సమానమైన కాంతి గల బంగారు పర్వతములు ఈ నదుల లోనికి చొచ్చుకొని ఉండును. అక్కడ ఉన్న వృక్షములు నిత్యము పుష్పఫలములతో నిండి ఉండును. పక్షులు వాటిపై నివసించుచుండును. దివ్యములైన గంధరస స్పర్శలు గల ఆ వృక్షములు అన్ని కోరికలను ఇచ్చును. కొన్ని వృక్షములు అనేక ఆకారములు గల వస్త్రములను ఫలించును. కొన్ని వృక్షములు ముత్యములతోను వైడూర్య మాణిక్యములతోను, విచిత్రములైన, స్త్రీలకు, పురుషులకు కూడ అనురూపమైన, అన్ని ఋతువులయందు సుఖముగా సేవింపదగిన అలంకారములను, కొన్ని వృక్షములు అమూల్యములైన మణులతో విచిత్రములైన వస్తువులను ఫలించుచుండును. ఇక్కడ మరి కొన్ని వృక్షములు చిత్రములైన ఆస్తరణములు గల శయనములను, మనస్సును ఆకర్షించు పుష్పమాలలను ఫలించును. కొన్ని వృక్షములు, చాల విలువ గల పానములను, అనేక విధములైన భక్ష్యములను, రూప యౌవనములతో ప్రకాశించు సద్గుణవతులైన స్త్రీలను ఇచ్చును. కాంతితో ప్రకాశించుచున్న గంధర్వ కిన్నర-సిద్ధ-నాగ-విద్యాధరులు అక్కడ స్త్రీలతో కూడి ఎల్లప్పుడు విహరించుచుందురు. అక్కడ ఉన్నవారందరు పుణ్యాత్ములు. రతియందు ఆసక్తి కలవారు. కామార్థములందు ప్రీతి కలవారై స్త్రీలతో కలిసి నివసించుచుందురు. అక్కడ అధికమైన నవ్వుల ధ్వనులతో కలిసి సకల భూతములకు మనోహరమైన గీతవాద్యముల ధ్వని ఎల్లపుడు వినబడుచుండును. అక్కడ సంతోషించనివాడు కాని, చెడ్డవారికి ఇష్టుడు గాని ఎవ్వడూ ఉండడు. అక్కడ మనోహరమైన గుణములు రోజు రోజుకు వృద్ధి పొందుచుండును. ఆ పర్వతమును దాటిన పిమ్మట ఉత్తర సముద్రము వచ్చును. దాని మధ్యయందు సోమగిరి అను గొప్ప బంగారు పర్వత ముండును. ఇంద్ర లోకములోను, బ్రహ్మ లోకములోను ఉన్న దేవతలు ఆకాశములో నిలచి ఆ పర్వతరాజు సౌందర్యమును చూచుచుందురు. ఆ ప్రదేశములో సూర్యుడు లేకపోయినను సూర్యుడు ప్రకాశించుచున్నాడా అన్నట్లు అది సూర్యుని కాంతి వంటి కాంతితో కూడినదై పర్వతము కాంతిచేత ప్రకాశించుచున్నది. అక్కడ ప్రపంచ స్వరూపుడు, పదకొండు మూర్తులు కలవాడు అయిన భగవంతుడైన శివుడు, బ్రహ్మర్షులతో కూడిన దేవతాప్రభువైన బ్రహ్మదేవుడును నివసించుచుందురు. మీరు కురు దేశమునకు ఉత్తరముగా ఎట్టి పరిస్థితిలోను వెళ్లకూడదు. ఇతర ప్రాణులు కూడ అచటికి వెళ్లజాలరు. ఈ సోమగిరికి దేవతలు కూడ వెళ్లజాలరు. మీరు దానిని చూచి వెంటనే తిరిగి రండు.’

ఇదీ సుగ్రీవుడు ఉత్తరం వైపు ప్రపంచాన్ని విశ్లేషించిన వైనం. దీన్ని లోతుగా విశ్లేషిస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. మొదట వేర్వేరు రాజులు, రాజవంశాలు, రాజుల గురించి చెప్పుకొచ్చారు. వీరిలో మ్లేచ్ఛుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. పశ్చిమోత్తరం నుంచి భారతదేశంలోకి వలస వచ్చినవారు.. ఇతర దేశస్థులను మ్లేచ్ఛులుగా పిలిచేవారు. ఉత్తర భారతదేశానికి ఆవల ఆఫ్గనిస్తాన్ తరువాతి ప్రాంతాలనుంచి వీరు వచ్చారు. ముఖ్యంగా సింధు నదీతీరం, బలూచిస్తాన్ నుంచి వీరు ఇక్కడికి వచ్చారు. వీళ్లు ప్రధానంగా పాళి, ప్రాకృత భాషలు మాట్లాడేవారు. ఇండో ఆర్యన్ లాంగ్వేజి కుటుంబంలో ఒకటి. ఆ తరువాత సింధి, కాశ్మీరీ భాషలను కూడా మాట్లాడారు. కాలక్రమంలో భారతీయేతరులను, యురోపియన్లను మ్లేచ్ఛులను పిలవడం మొదలైంది. అందుకే సుగ్రీవుడు ఉత్తరం వైపు వానరసేన ప్రయాణంలో ముందుగా మ్లేచ్ఛులు తారసపడతారని అన్నాడు.

ఉత్తరం వైపు వానరసేన కూడా మధ్యభారతం నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇక్కడ సుగ్రీవుడు చెప్పిన ప్రాంతాల్లో పులింద రాజ్యం.. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ప్రాంతం. దానినుంచి పైకి ఉత్తరం వైపు ప్రయాణించిన తరువాత శూరసేన రాజ్యం వస్తుంది. ఇది ఇప్పటి ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని బ్రజ్ ప్రాంతంలో ఉన్నది. ఆ తర్వాత పక్కపక్కనే ప్రస్థల, భరత, కురు రాజ్యాలు ఉన్నాయి. కురు రాజ్యం ఇప్పుడున్న హర్యానాలోని చండీగఢ్‌కు సమీపంలో కొద్దిగా కిందివైపు ఉంటుంది. ఆ తరువాత ప్రస్థల రాజ్యం ఉంటుందని సుగ్రీవుడు వానరసేనకు చెప్పుకొచ్చాడు. ఈ ప్రస్థల రాజ్యం ఇప్పటి పంజాబ్ రాష్ర్టంలోని జలంధర్ నగరం. అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న భారతదేశ సరిహద్దులు దాటాల్సి ఉంటుంది. ఉత్తరం వైపు వెళ్లడం అంటే.. సగం ఐరోపా.. అటు పూర్తిగా హిమాలయాలను కవర్ చేసుకొంటూ ఆర్కిటిక్ దాకా వానరసేన వెళ్లివచ్చింది. ఆ తరువాత సుగ్రీవుడు పేర్కొన్న రాజ్యాలు.. మద్రక, కాంబోజ, యవన, శక, బాహ్లిక, రిషిక, పౌరవ.. ఈ రాజ్యాలు భారతదేశానికి పశ్చిమోత్తరం నుంచి ఉత్తరం వైపు విస్తరించి ఉన్నాయి. ముందుగా పౌరవ రాజ్యం జీలం, సింధు నదుల మధ్య వ్యాపించి ఉన్నది. ఇదే ప్రాంతాన్ని పురుషోత్తముడు అలెగ్జాండర్ దండయాత్రకాలంలో పరిపాలించాడు. అలెగ్జాండర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎదుర్కొని తరిమికొట్టిన చక్రవర్తి పురుషోత్తముడు. మన చరిత్రకారులు అలెగ్జాండర్‌ను ది గ్రేట్ అని చెప్తారు కానీ.. పురుషోత్తముడి గురించి మాత్రం మాటమాత్రంగానైనా ప్రస్తావించరు. తరువాత కాంబోజ రాజ్యం తూర్పు ఆఫ్గనిస్తాన్‌లో హింద్‌కుశ్ శ్రేణులను ఆనుకొని కాంబోజ రాజ్యం ఉన్నది. కాంబోజకు పైన పర్షియా (ఇరాన్) దేశమే రామాయణ కాలంనాటి యవన దేశం. యవనదేశాన్ని ఆనుకొని ఉన్న రాజ్యం శక. ఇది ప్రస్తుత తుర్కెమినిస్తాన్.. ఇరాన్ సరిహద్దు ప్రాంతం. కాంబోజ రాజ్యానికి ఉత్తరం వైపు ప్రస్తుత చైనా పశ్చిమ ప్రాంతంలో ఋషిక రాజ్యం ఉన్నది. ప్రస్తుతం బాక్ట్రియా దేశమే.. ఒకనాటి బాహ్లిక రాజ్యం. ఒక టంకణ రాజ్యం నేటి టాంజానియాగా చరిత్రకారులు గుర్తించారు. చైనా ప్రాంతాన్ని చీన, పరమ చీన రాజ్యాలుగా సుగ్రీవుడు వర్ణించాడు.

ఈ రాజ్యాల తర్వాత ఉత్తర కురు రాజ్యాన్ని గురించి చెప్పుకొచ్చాడు. ఈ ఉత్తర కురు రాజ్యం జంబూద్వీపానికి (భారతదేశానికి) 24 వేల యోజనాల దూరంలో ఉన్నదని సుగ్రీవుడు చెప్పాడు. ఉత్తరాన శూన్య ప్రదేశం దాటిన తర్వాత అంటే.. చైనా తర్వాత రష్యా ప్రాంతం ఒకనాడు పెద్దగా జనాభా ఉన్న ప్రాంతం కాదు. అతి మంచు ప్రదేశం కాబట్టి ఇక్కడ జీవజాలం తక్కువగా ఉన్నదని సుగ్రీవుడన్నాడు. దీని తర్వాత ఉత్తర కురు రాజ్యమున్నది. ప్రస్తుతం కిర్గిస్తాన్ ఉన్న ప్రాంతాన్ని ఉత్తర కురు రాజ్యంగా వర్ణించాడు. కల్హణుడి రాజ తరంగిణిలో లలితాదిత్య ముక్తపాదుడి కాలంలో ఉత్తర కాశ్మీర్‌కు అవతల ఉన్న రాజ్యాల గురించి వర్ణించాడు. ‘కాంబోజ, తుశాల భౌత్త, వాలకంబుధి, ఉత్తరకురు, స్త్రీరాజ్య’ అని మరికొన్ని రాజ్యాల గురించి చెప్పుకొచ్చాడు. ఉత్తర కురు తర్వాత ఉన్న స్త్రీరాజ్యం గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉన్నప్పటికీ దీనికి సంబంధించిన వివరణ ఉన్నట్టు లేదు. మహాభారతం ప్రకారం నీల పర్వతానికి దక్షిణాన, మేరువుకు ఉత్తరాన ఉత్తర కురు రాజ్యమున్నదని పేర్కొన్నారు. ఇప్పుడున్న కిర్గిస్తాన్ ప్రాంతాన్ని కురురాజ్యంగా భారతీయ చరిత్రకారులు నిర్ధారించారు. ఉత్తర ప్రపంచానికి చివరి రాజ్యంగా దీన్ని పేర్కొన్నారు. ఉత్తర కురు రాజ్యం అత్యంత విశాలమైంది. దేవతలు, గంధర్వ, కిన్నర, కింపురుష, అప్సర స్త్రీలు నివసిస్తారని చెప్పాడు. ఈ ఉత్తర కురు రాజ్యం గురించి బౌద్ధ మత గ్రంథం అభిధమ్మ లో కూడా ప్రస్తావించారు. అభిధమ్మలోని 416 వ శ్లోకంలో గౌతమ బుద్ధుడు భూమిమీద నాలుగు నెలలకు సమానమైన కాలం ఉత్తర కురు అనే ఉత్తర ద్వీపంలో ఉండి వచ్చాడని.. అక్కడ దేవతలు ఉంటారని పేర్కొన్నారు.

Karakorum
Kingdom of Khotan
Alakapuri
altai-neela
Flight Over Himalayas
hengduan mountains
karkonosze mountain
krounch
krounch 1
kunlun mountains
lhotse
shishapangma
sudarshan

 

ఈ రాజ్యాలతోపాటు సుగ్రీవుడు అనేక పర్వతాలు, నదుల గురించీ వర్ణించాడు. పర్వతాలలో దేవసఖ, కాల, నీల, సుదర్శన, కైలాస, క్రౌంచ, మైనాక, సోమగిరి, మేరు వంటి పర్వతాలను గురించి విస్తారంగా చెప్పాడు. వీటిలో దేవసఖ పర్వతం నేపాల్‌లో ఉన్నది. ఉత్తరాన కైలాస పర్వతం గురించి అద్భుతంగా వర్ణిస్తాడు. దీని పరిసర ప్రాంతాల్లో జీవరాసులు జీవించజాలవని.. వివరిస్తాడు. కైలాసం దగ్గర ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అందువల్లే ఇక్కడ సాధారణ జనజీవనం అన్నది అసంభవం. కైలాసంతోపాటు 8వేల మీటర్ల ఎత్తున్న పర్వతాలు హిమాలయన్ రేంజ్‌లో 14 ఉన్నాయి. ఇవి మహాదేవుడి రూపంగా ఉన్న కైలాస పర్వతానికి మెడలో ఒక మణిహారంగా విస్తరించి ఉన్నాయి. కైలాసానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో శీషపంగ్మ పర్వతం ఉన్నది. దీన్నే చరిత్రకారులు దేవసఖ పర్వతంగా కూడా పిలిచారు. కైలాసానికి ఉత్తర దిక్కున కుబేరుడి అలకాపురి ఉన్నదని సుగ్రీవుడు చెప్పాడు. ఇది కైలాసానికి చాలా దగ్గరగా ఉంటుంది. జైనులు, బౌద్ధులు దీన్ని యక్షుల స్థావరంగా పిలుచుకుంటారు. టిబెటన్లకు ఇది పిలుచుకుంటారు. కైలాస పర్వతానికి 177 కిలోమీటర్ల దూరంలో అలకాపురి గ్లేసియర్స్ ఉన్నాయి. గంగోత్రి గ్లేసియర్స్ దాటిన తర్వాత సుదర్శన పర్వతం కనిపిస్తుంది. ఇది సముద్రమట్టానికి 6507 మీటర్ల ఎత్తు ఉంటుంది. కైలాసానికి మరికొంతదూరంలోనే క్రౌంచ పర్వతం ఉన్నది. ఇది పెద్ద పెద్ద గుహలతో దుర్గమంగా ఉంటుంది. అడవి జంతువులకు ఆలవాలమైన ప్రాంతమిది. మానస పర్వతం నేపాల్‌లో ఉన్నది. దీన్ని ఇప్పుడు మనసలు అని పిలుస్తున్నారు. ఇక్కడినుంచి కిర్గిస్తాన్ వరకు కారాకోరం పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నాయి. ఇందులో కజకిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఆల్టాయ్ పర్వతం నీల పర్వతంగా రామాయణ కాలంలో ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ఉన్న పామిర్స్ పర్వత శ్రేణులను మేరు పర్వతంగా పిలిచారు. కారాకోరం శ్రేణుల్లోనే ఖోతాన్ రాజ్యమున్నట్టు తెలుస్తున్నది. ఖోతాన్‌లోని ప్రసిద్ధ ఖోతాన్ నదినే శైలోద నదిగా సుగ్రీవుడు వర్ణించాడు. సుగ్రీవుడు ఆ తర్వాత సోమగిరి గురించి చెప్పుకొచ్చాడు. అది బంగారు వర్ణంలో ఉంటుందని పేర్కొన్నాడు. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నది. ఇక్కడికి ఎవరూ పోలేరు. అది సాధ్యం కాదు. ప్రస్తుతం దీని పేరు కార్కనోస్జ్. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో అతి పెద్ద పర్వతం. ఎప్పుడూ బంగారు వర్ణంలో మిలమిలలాడుతూ ఉంటుంది.

సుగ్రీవుడు అట్లస్ సంపూర్ణ స్వరూపమిది. ఇందులో అన్నింటినీ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. సాధ్యమైనన్నింటిని సుగ్రీవుడు చెప్పిన వివరాలను బట్టి.. దూరాలను బట్టి.. భారతీయ ప్రాచీన చరిత్రకారులు చెప్పిన వివరాలను బట్టి పొందుపరచడం జరిగింది. సుగ్రీవుడు ప్రపంచాన్ని గురించి చెప్పిన ఇన్ని వివరాలు చెప్తుంటే మనం ఎలా ఇంప్రెస్ అయ్యామో.. రాముడు కూడా అలాగే ఇంప్రెస్ అయ్యాడు. వాలితో ఘర్షణ అనంతరం తాను అతడిబారి నుంచి తప్పించుకోవడానికి ప్రపంచమంతా చుట్టి వచ్చానని చెప్పుకొచ్చాడు. వేల ఏండ్లనాటి ప్రపంచం ఆనవాళ్ల గురించి ఇంత సవిస్తరంగా ఉన్న అంశాలపై పరిశోధనలను చేసి యావత్ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యతను మన చరిత్రకారులు మాత్రం మరచిపోయారు. ఇది దుర్మార్గం కాక మరేమిటి?

Exit mobile version