రామం భజే శ్యామలం-47

0
3

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]చ[/dropcap]రిత్ర గురించి మనకు చెప్పేటప్పుడు మన పంతుళ్లు చాలామంది రాజుల గురించి చెప్పేవారు. అశోకుడు ఎట్లా ఉండేవాడు, చంద్రగుప్తుడు ఎట్లా ఉండేవాడు.. అతని మంత్రి చాణక్యుడు ఏం చేశాడు, మొఘలులు ఎంత గొప్పవారు.. వాళ్లు ఏమేం చేశారు.. ఆనాటి రాజులు.. రాజ్యవ్యవస్థల గురించి చెప్పుకుంటూ వచ్చారు. రామాయణాన్ని గురించి కూడా చెప్పారు. కానీ.. రామాయణమంటే ఒక నీతి పుస్తకం.. ఓ కొడుకు కొడుకుగా, అన్నగా, భర్తగా ఎట్లా ఉన్నాడో.. ఎట్లా ఉండాలో ధర్మ సూక్ష్మాలను వివరించారు. అట్లా కాదంటే భార్యాభర్తలు.. ఏదో ఇబ్బంది పడి అడవికి వస్తే.. భార్యను ఒకడు కిడ్నాప్ చేస్తే.. వెతుక్కుంటూ వెళ్లి.. ఆ కిడ్నాప్ చేసినవాణ్ణి పట్టుకొని చంపేసి.. భార్యను తెచ్చేసుకోవడం.. ఇట్లా చెప్పారు. రామాయణం అంటే ఇదేనా? ఇంతకు మించి ఏమీ లేదా? మనకు పాఠాలను తయారుచేసినవాళ్లు కానీ, వాటిని చెప్పినోళ్లు కానీ, సినిమాలు తీసినోళ్లు కానీ చెప్పింది అదే.. చేసిందీ అదే. ఇప్పటివరకు మనం రామాయణం అంటే మనకు తెలిసింది.. తెలియజేసింది కూడా ఇంతే. రామాయణంలోని రాజనీతి గురించి కానీ, కూటనీతిని గురించి కానీ, పరిపాలనా వ్యవస్థల గురించి కానీ, రణతంత్రం గురించి కానీ, నిర్మాణాల గురించి కానీ, నైపుణ్యాల గురించి కానీ, తిరుగుబాట్లను గురించి కానీ.. ఏ ఒక్కరూ చర్చించిన పాపాన పోలేదు. రాముడిని సింపుల్‌గా దేవుడిగా పూజించడం మొదలుపెట్టి.. రామాయణంలోని చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాలన్నింటినీ పక్కన పెట్టేశారు. దాన్ని ఒక మిథ్యగా, కేవల కావ్యంగా మార్చేశారు. ఆ తరువాత రామాయణాన్ని గురించి వేలు లక్షల మంది రాసి ఉంటారు. కానీ అందరూ కూడా నూటికి నూరుశాతం రామభక్తి పారవశ్యంలో.. ఆ కోణంలోనే రామాయణాన్ని దర్శించారు తప్ప క్రిటికల్‌గా అన్ని అంశాలను లోతుగా పట్టించుకొన్నట్టు కనిపించదు. స్వతంత్ర భారత దేశంలో పరిపాలకులు పూర్తిగా అశోకుడి మాయలో పడిపోయారే తప్ప అసలైన రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం ప్రేరణగా తీసుకోవాల్సిన భారతీయమైన రాజకీయ వ్యవస్థలను పూర్తిగా ఉపేక్షించారు. ఇవాళ మనం ఫ్రాటెర్నిటీ ఆఫ్ మ్యాన్‌కైండ్ (సకల మానవ సౌభ్రాతృత్వం లేదా వసుధైక కుటుంబం), విశ్వ పౌరసత్వం, ఆత్మగౌరవం, సామాజిక స్పృహ, మానవతావాదం, జాతీయవాదం.. ఇలాంటి పదాలను రోజూ వల్లె వేస్తుంటాం. చూస్తే, పలికితే ఇవన్నీ అతి ఉత్తమ పదాలే. ఎవరికీ ఏ అభ్యంతరం ఉండక్కరలేదు. కానీ వీటిలో ఏ ఒక్కదాన్నైనా మన పాలనావ్యవస్థలు పాటిస్తున్నాయా అంటే.. ముఖం ప్రశ్నార్థకం కావాల్సిందే. వీటన్నింటినీ ఉన్నతంగా అమలుచేసేలా మన రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు రూపొందాయా అంటే కూడా జవాబు దొరకదు.

రామాయణంలో మనకు మూడు రకాల రాజ్య వ్యవస్థలు కనిపిస్తాయి. గత వందేండ్లుగా మనం నెత్తిన పెట్టుకొన్న మొఘలులు, అశోకుడు వంటి రాజ్యాలకంటే ఎంతో ఉత్తమమైన వ్యవస్థలు అవి. మొదటిది అయోధ్య, (దీని గురించి గతంలో ఒక సారి దేశం లోని ప్రాచీన రాజ్య వ్యవస్థల గురించి రాసినప్పుడు చర్చించటం జరిగింది. ఇప్పుడు రామాయణం లోనే మూడు రకాల వ్యవస్థల గురించి చెప్పాల్సి ఉన్నందున మళ్లీ చర్చించాల్సి వస్తున్నది.) రెండవది కిష్కింధ, మూడవది లంక. ఈ మూడు రాజ్య వ్యవస్థలు మూడు విభిన్నమైన దృక్పథాలున్నవి. వీటిలో ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరిస్తే.. రెండవది ఆటవిక వ్యవస్థ, మూడవది నియంతృత్వ విధానం.

అయోధ్యలో రాజు దశరథుడు. ఇతను సర్వాధికారి. సమస్త విషయములపై సర్వ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగల అసమాన అధికారాలున్న పాలకుడు. అతని నిర్ణయానికి తిరుగులేదు. కానీ, ఇతను తానుగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదు. ఎనిమిది మందితో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. మరో ఇద్దరిని ప్రధాన సలహాదారులుగా నియమించుకొన్నాడు. ఏ నిర్ణయమైనా వాళ్లందరితో కలిసి చర్చించిన తరువాతే ప్రజలముందు పెట్టేవాడు. ఆ ప్రజలు లేదా ప్రజా ప్రతినిధులు అంగీకారం తెలిపిన తరువాతే నిర్ణయం అమలులోకి వచ్చేది. దశరథుడి కొలువులో ఉన్న ఎనిమిది మంది మంత్రులు.. ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థ సాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. ఇక ఇద్దరు ప్రధాన సలహాదారులు వసిష్ఠుడు, వామదేవుడు. వీళ్లు కాకుండా కొందరు సహాయ మంత్రులను కూడా దశరథుడు నియమించుకొన్నాడు. ఈ రాజ్య వ్యవస్థను గమనిస్తే ఒక రకంగా మన పార్లమెంటరీ వ్యవస్థను ప్రతిఫలిస్తుంది. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థే ఇది. కాకపోతే మన దగ్గర రాష్ట్రపతి, ప్రధానమంత్రి వేరువేరుగా ఉన్నారు. బ్రిటన్‌లోనూ.. రాణి, ప్రధానమంత్రి వేరువేరుగా ఉంటారు. ప్రధానమంత్రి సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తాడు. అతని నిర్ణయాలను రాష్ర్టపతి ఆమోదిస్తాడు. ప్రధానమంత్రి పరిధిలో కీలక నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ ఉంటుంది. సహాయ మంత్రులూ ఉంటారు. ఆ తరువాత రాజసభ మాదిరిగా చర్చించడానికి పార్లమెంటూ ఉన్నది.

ఒక విధంగా చూస్తే అయోధ్యలోని రాజ్య వ్యవస్థ నిర్మాణం కొద్ది మార్పుతో.. ఇప్పుడున్న పార్లమెంట్ వ్యవస్థ మాదిరిగానే కనిపిస్తుంది. కాకపోతే అయోధ్యలో ప్రధానమంత్రి అన్నవాడు లేడు. ప్రస్తుతం మన దేశంలో రాష్ట్రపతి పదవి గౌరవప్రదమైన పోస్టు. అయోధ్యలో రాజు, ప్రధానమంత్రి ఒక్కరే. అతనికి సర్వాధికారాలు ఉంటాయి. ఈ రాజు తన మంత్రులను ఎంచుకోవడానికి చాలా చాలా కసరత్తు చేస్తాడు. అతని దగ్గర మంత్రిస్థానం సంపాదించాలంటే అనేక పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. దశరథుడి మంత్రులకు ఉన్న ప్రధాన లక్షణాల్లో మొట్ట మొదటిది లంచం తీసుకోకపోవడం. పాలనావ్యవహారాలు ఏవిధంగా చేయాలో చాలా బాగా తెలిసినవారు. బాగా డబ్బులున్నవారు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అన్నట్టుగా అన్ని రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు. డబ్బు కోసం కక్కుర్తి పడే లక్షణం ఉన్నవారు ఎంతమాత్రం కాదు. వీళ్లను ఎంపిక చేసుకొన్నప్పుడు రాజు.. వీళ్ల బంధువులు, మిత్రులు ఎట్లాంటివారు? ఏం చేస్తారు? ఎలాంటి స్వీయ ప్రయోజనాలున్నాయన్నటువంటి అంశాలపై లోతుగా గూఢచారులతో పరీక్షించాడు. ఆ తరువాతే వీళ్లను ఎంపిక చేసుకొన్నాడు. కేవలం రాజ్యం, దాని క్షేమం తప్ప మరే కాంక్ష లేనివారిని ఏరికోరి ఎంపిక చేసుకొన్నాడు.

మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. అక్టోబర్‌లో పాకిస్థాన్ యుద్దానికి తెగబడింది. నాటి ప్రధానమంత్రిగారి ప్రాణ స్నేహితుడు జీపుల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డాడు. ఆయన క్యాబినెట్‌లోని మరో మంత్రి అవినీతి వ్యవహారాల్లో చిక్కుకుపోయాడు. అప్పటికి స్వతంత్రభారతం పుట్టి నెలలు కూడా కాలేదు. పాలు తాగుతున్న పసికందు నోటినుంచి పాలు లాక్కునే తొలి ప్రయత్నం జరిగింది. అప్పటికింకా రాజ్యాంగం రాసుకోవడానికి ఏర్పాటైన సభ తొలి సమావేశం కూడా జరుగలేదు. ఆ లోపే నెహ్రూ మంత్రివర్గంపై అవినీతి చెద పొడచూపింది. ఆ తరువాత రెండేండ్లకు కానీ రాజ్యాంగం అమలులోకి రాలేదు కదా.. మొదట్లోనే అవినీతి పురుగులు ఢిల్లీ సౌత్, నార్త్ బ్లాకుల్లో యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు వాటిని అంతం చేయడానికి రాజ్యాంగంలో కఠినంగా నిబంధనలు ఏర్పాటుచేయాల్సి ఉండింది కాదా? మంత్రులు, ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు అవినీతికి పాల్పడితే.. వారిని కఠినంగా శిక్షించడానికి చర్యలను ప్రతిపాదించాల్సిన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేసినట్టు? రాముడి మాట పక్కన పెడదాం.. దశరథుడు తన మంత్రుల తొలి అర్హత లంచం తీసుకోకపోవడం అని చెప్పి అమలుచేశాడే. ఇది మనవారికి ఏ మాత్రం ప్రేరణ కాలేకపోయిందా? మన క్యాబినెట్లలో మంత్రులంటే.. ఫండింగ్‌చేసేవాడు, కాంట్రాక్టరు, వ్యాపారి, పోల్ మేనేజిమెంట్ చేసేవాడు, కులాలు, మతాల దామాషాల ప్రకారం ఎంపికయ్యేవారు.. ఇంతే తప్ప సామర్థ్యం, రాజనీతి తెలియడం, పాలనావ్యవహారాలపై పట్టు ఉండటం, అన్ని వర్గాలకు సమానమైన న్యాయం చేయాలన్న ఆలోచన ఉండటం.. ఇవేవీ అవసరం లేదు.

ఇంత పక్కాగా ఒక్కొక్కరిని పరీక్షించి ఎంపిక చేసుకొన్నాడు కాబట్టే.. వారిపై విశ్వాసంతో ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను (మన మంత్రుల లాగే) అప్పగించాడు. వీళ్లలో ఏ ఒక్కరూ రాజద్రోహం చేసేవారు కాదు. తిరుగుబాటు చేయరు. తమకు అప్పగించిన బాధ్యతలను తుచ తప్పకుండా నిర్వర్తించేవారే తప్ప విప్లవం సృష్టించేవారు కాదు. అందువల్లే వారికి సంపూర్ణ అధికారాలను అప్పగించాడు రాజు. అశ్వమేథయాగం చేసినప్పుడు అనేకమంది రాజులను అయోధ్యకు ఆహ్వానిస్తే.. ఆ రాజులందరికీ అతిథి మర్యాదలు చేస్తూనే.. వారిపై పూర్తి నిఘా ఉంచారు. వసిష్ఠుడు, సుమంత్రుడు.. వారి కదలికలను అనుక్షణం గమనించేందుకు వీలుగా ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలను మోహరించారు. ఇప్పుడు వివిధ వర్గాలు ఏర్పాటుచేసుకొనే సభలు, సమావేశాల్లో మఫ్టీల్లో స్పెషల్ బ్రాంచి పోలీసులు వచ్చి సమాచారాన్ని సేకరించినట్టే.. నాడు అయోధ్యలో కాలుమోపిన ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇలాంటి మంత్రులు ఉండటం వల్లనే రాజు నిశ్చింతగా అశ్వమేథం చేయగలిగాడు.

ఒక చిన్న సన్నివేశం చెప్పాలి.. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలని అనుకొన్నాడు. వాస్తవంగా ఆనాటి రూల్‌బుక్ ప్రకారం పెద్ద కొడుక్కు అధికార మార్పిడి చేయడం సాధారణమే. దశరథుడు నిర్ణయం తీసుకొంటే అడిగేవారు లేరు. ఆపేవారూ లేరు. కానీ.. రాముడు రాజు కావాలంటే.. అతనికి ఉన్న అర్హతలను ఒక్కొక్కటిగా బేరీజు వేసుకొన్నాడు. అతనికి ఉన్న వ్యవహార దక్షత ఏమిటి? పరాక్రమం ఏమిటి? ప్రజల్లో అతని పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటి? రాజనీతిజ్ఞత ఏమిటి? పరిపాలనా దక్షత ఏపాటిది? అని అన్ని లెక్కలు వేసుకొన్నాడు. దశరథుడి లెక్కల ప్రకారం రాముడికి ఉన్న అర్హతలు చాంతాడంత తేలినవి.

1.ప్రశాంత చిత్తం కలవాడు. 2. మృదువుగా మాట్లాడేవాడు. 3. ఎవరైనా పరుషంగా మాట్లాడితే జవాబివ్వడు. 4. బుద్ధిశాలి. 5. పరాక్రమవంతుడు. 6. గర్వం లేనివాడు. 7. పెద్దలను గౌరవించేవాడు. 8. ప్రజలను ఆదరించేవాడు. 9. దయాళువు. 10. అనారోగ్యం లేనివాడు. 11. వాక్చాతుర్యం కలవాడు. 12. దృఢమైన, అందమైన శరీరం కలవాడు. 13. ఏ కాలంలో ఏ పని చేయాలో చాలా బాగా తెలిసినవాడు. 14. దైన్యం లేనివాడు. 15. లోక వ్యవహారం తెలిసినవాడు. 16. ధర్మార్థ కామాల లోతుపాతులు ఎరిగినవాడు. 17. లోపలున్న భావాలను ముఖంపై పైకి తెలియనీయకుండా ఉండగలిగినవాడు. 18. చపలత్వం లేనివాడు. 19. దుష్టులను ఎలా కంట్రోల్ చేయాలో బాగా తెలిసినవాడు. 20. ధర్మార్థముల విషయంలో చాలా జాగ్రత్త పడుతూనే భోగాలను అనుభవించడం తెలిసినవాడు. 21. డబ్బును ఎట్లా ఖర్చు చేయాలో బాగా తెలిసినవాడు. 22. లలితకళల్లో ప్రవేశమున్నవాడు. 23. సైన్యానికి సారథ్యం వహించి ముందుకు నడిపించడంలో సమర్థుడు. 24. శత్రువులను ఉపేక్షించకుండా నిశ్చయంగా హతమార్చగలిగినవాడు. 25. ఎప్పటికీ ప్రజల అభివృద్ధిని కోరేవాడు.

ఇట్లా చెప్పుకుంటూ పోతే.. వీటికి అంతూ పొంతూ ఉండదు. తండ్రి కొడుకును రాజు చేయాలనుకుంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. జస్ట్ సింపుల్‌గా తీసుకొచ్చి సింహాసనంపై కూర్చోపెడితే చాలు. కానీ.. దశరథుడు అట్లా చేయలేదు. అయోధ్యలో ఉన్నది రాజరిక వ్యవస్థే అయినా.. రాజు కావాల్సిన వాడు తన కొడుకే అయినా.. ఆ కొడుకుపై అమితమైన ప్రేమ ఉన్నా.. పరిపాలన చేయాల్సిన వాడికి రాజు అయ్యే అర్హత ఉన్నదా? లేదా? అని అన్ని కోణాలలో తరచి తరచి చూశాడు. లెక్కలేసుకొన్నాడు. తనకు పూర్తి నమ్మకం కలిగిన తరువాతే ఒక డెసిషన్‌కు వచ్చాడు. నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా వెంటనే రాముడిని రాజుగా ప్రకటించలేదు. ముందుగా మంత్రులకు తన ఆలోచనను చెప్పాడు. తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. వారి ఆమోదాన్ని తీసుకొన్నాడు. ఆ తరువాత తన సామ్రాజ్యంలోని సామంత రాజులను పిలిచాడు. నగరాల్లో ఉండే అధికారులను, గ్రామాల్లో ఉండే అధికారులను పిలిపించాడు. నగర, గ్రామ ప్రముఖులను పిలిపించాడు. జానపదులను పిలిపించాడు. వాళ్లందరినీ పిలిచి రాజసభను నిర్వహించాడు. అందరూ ప్రొటోకాల్ పాటిస్తూ.. రాజాభిముఖులై కూర్చొన్నారు. వారందరి ముందు రాజు.. తన ప్రతిపాదనను ఉంచాడు. ఆ ప్రతిపాదనలోని బాగోగులను వివరించాడు. రాముడు రాజు అయితే.. ఏ విధంగా పాలించగలడో.. అతని సామర్థ్యం ఏపాటిదో సవిస్తరంగా చెప్పుకుంటూ వచ్చాడు. అంతా చెప్పిన తరువాత ఏమన్నాడో చదవండి. ‘నేనీ విషయమును గూర్చి బాగుగా ఆలోచించియే చెప్పుచున్నాను. ఇది మంచి ప్రయోజనమును సమకూర్చును అని మీకు కూడా తోచినచో అనుమతించి నేనెట్లు చేయవలెనో చెప్పుడు. నా కోరిక ఈ విధముగా ఉన్నది. అయినను మరొక హితకరమైన మార్గమున్నదా అని ఆలోచింపుడు. పక్షపాతము లేని మధ్యస్థులు చేసిన ఆలోచన విశిష్టముగా నుండి తరచి తరచి చేసినదగుటచే ఎక్కువ అభ్యుదయమును కలిగించును కదా’ అని అన్నాడు. నిజానికి తాను నిర్ణయం తీసుకొంటే కాదనేవారే లేరు. కానీ దశరథుడు తన వారసుడి ఎంపిక కోసం యావత్ దేశం ఆమోదాన్ని తీసుకొన్నాడు. రాజుగారు కదా.. అంతా గుడ్డిగా ఓకే అన్నారా అంటే అదీ లేదు. అందరికీ రాముడిపైన మంచి అభిప్రాయం ఉండటం వల్లనే రాముడి ఎంపిక జరిగింది. దశరథుడు రాముడి పేరు ప్రతిపాదించగానే అందరూ ఆ ప్రతిపాదన బాగున్నది.. బాగున్నది.. అని అన్నారు. వెంటనే దశరథుడికి అనుమానం వచ్చింది. ఆయన వెంటనే అడిగాడు.. ‘నాకు ఎదురుచెప్పజాలక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా? నేను ధర్మబద్ధంగానే పరిపాలిస్తున్నాను కదా.. మరి రాముడు రాజు కావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే నా పరిపాలన బాగా లేదా? ’ అని ప్రశ్నించాడు. కానీ.. అక్కడున్న జనసమూహం, ప్రతినిధులు, అధికారులు, సామంతులు అంతా కూడా తాము బాగా ఆలోచించి, చర్చించుకొన్న తరువాతే మీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని చెప్పారు. ఆ తరువాత భరతుడు రాజైన తరువాత కూడా అడవిలో ఉన్న రాముడి దగ్గరకు వెళ్లినప్పుడు రాముడు భరతుడికి రాజ్యవ్యవస్థ ఏ విధంగా ఉండాలో సవివరంగా విశదీకరిస్తాడు.

భావి రాజును ఎంపిక చేయడానికి, మంత్రిమండలిని ఏర్పాటుచేయడానికి అయోధ్యలో ఇంతగా కసరత్తు జరిగింది. ఇవాళ తొలి ప్రధానమంత్రి ఎంపిక.. తరువాత ఆయన కూతురు, ఆమె కొడుకు, అనంతరం కోడలు.. తరువాత మనుమడు.. ఏ ప్రాతిపదికన, ఏ అర్హతలను అనుసరించి అధికారాన్ని చేపడుతున్నారో అర్థం కాదు. అంతే కాదు.. దేశంలోని ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఒక విధంగా కుటుంబ రాజరిక పార్టీలే కదా.. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్న వ్యవస్థను అసలైన ప్రజాస్వామ్యమని పిలువాలా? రాజరిక వ్యవస్థలని పిలువాలా? ఆనాటి అయోధ్యలోని రాజరిక వ్యవస్థను ప్రజాస్వామిక వ్యవస్థ అని పిలువాలా? వద్దా? ఏది నిజమైన ప్రజాస్వామ్యం?

రామాయణంలో కనిపించే మరో రాజ్యం కిష్కింధ. ఇది అటవీప్రాంతాన్ని ఏలిన వానరరాజులది. రెండు కొండల నడుమ ఉన్న ఒక నగరంగా కిష్కింధను వాల్మీకి వర్ణించాడు. కిష్కింధ అటవీప్రాంతంలోని వానరులైన జంతు సామ్రాజ్యంగానే వాల్మీకి పేర్కొన్నాడు. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్యస్థంగా ఉన్న రాజ్యవ్యవస్థ. ఇక్కడ వాలి రాజు. తన అధికారమే తనకు పరమావధి. వావివరుసలు, మానవసంబంధాలకు అతీతమైనవాడు. ఈ వ్యవస్థలో మంత్రులు, మంత్రి మండళ్లు.. ఇటువంటి ఏర్పాట్లు ఏవీ లేవు. సమస్త అధికారాలు, నిర్ణయాలు కూడా రాజువే. ఎవరిమాటా వినేది లేదు. ఎవరినీ లెక్కచేసేది అసలే లేదు. తాను ఒకటి అనుకుంటే.. గుడ్డిగా దానికే కట్టుబడి ఉండటం.. రాజుగారికి ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే తప్ప ప్రేమగా విధేయులుగా ఉండే ప్రసక్తిలేదు. ఆధిపత్యం.. అవకాశవాదానికి కిష్కింధ ఒక ఉదాహరణ. దుందుభి జరిగిన యుద్ధంలో వాలి చనిపోయాడనుకొన్న సుగ్రీవుడు తనను తాను రాజ్యాభిషిక్తుడిని చేసుకొన్నాడు. ఆ తరువాత దుందుభిని చంపి వచ్చిన వాలి.. అధికారం కోసమే తన తమ్ముడు తాను యుద్ధం చేస్తున్న గుహకు కొండరాయిని అడ్డం పెట్టుకొని వచ్చాడనుకొన్నాడు. తమ్ముడు తన అధికారాన్ని లాక్కున్నాడని.. అతడిని చంపడానికి ప్రయత్నించాడు.

అతడుపోయి ఎక్కడో ఋష్యమూకంపై తలదాచుకొని అవకాశం కోసం కాచుకున్నాడు. తరువాత మంచి, చెడు, వావి వరుసలేవీ పట్టించుకోకుండా తమ్ముడి భార్య రుమను చెరబట్టాడు. అతని చర్యలకు అడ్డు చెప్పేవారే లేకపోయారు. ఋష్యమూకంపై తలదాచుకొన్న సుగ్రీవుడు అదనుకోసం ఎదురుచూశాడు. రామలక్ష్మణులు రాగానే.. వారితో తెలివిగా స్నేహం చేసి వాగ్దానం తీసుకొని.. వాలిని చంపించాడు. సరిగ్గా ఇదే సమయంలో వాలి భార్య తార వర్గం.. తార దగ్గరకు చేరి తక్షణం అంగదుడిని రాజును చేయాలని రెచ్చగొడుతుంది. కానీ, తార పరిస్థితులను గమనించి తానే వెనక్కు తగ్గుతుంది. అటు వాలి చనిపోతూ.. అంగదుడిని దగ్గరకు పిలిచి.. సుగ్రీవుడి పట్ల విధేయుడిగా ఉండాలని హితవు చెప్తాడు. ఎందుకంటే సుగ్రీవుడు మంచివాడని చెప్పటం కాదు… సుగ్రీవుడి పట్ల మంచిగా లేకుంటే చంపడానికి కూడా వెనుకాడడని చెప్తాడు. ఎవరిమీదా ఎక్కువ ద్వేషం కానీ, ఎక్కువ ప్రేమ కానీ ఉండవద్దని చెప్తాడు. రాముడి సలహామేరకు సుగ్రీవుడు అంగదుడిని యువరాజునుచేస్తాడు. ఇందులో అంగదుడిపైన ప్రేమ కంటే కూడా వానరసేనలో తిరుగుబాట్లతో తన సింహాసనానికి ముప్పు వాటిల్ల వద్దన్న కూటనీతే కనిపిస్తుంది. స్నేహధర్మాన్ని రాముడు పాటించాడు కానీ.. సుగ్రీవుడు విస్మరించాడు. హనుమంతుడు వచ్చి ముందుకు తోస్తే కానీ, లక్ష్మణుడు వచ్చి ఆగ్రహించిన తర్వాత కానీ కదలలేదు.

సీతాన్వేషణ చేయడానికి నాలుగు దిక్కులకు వానరసేనను నాలుగు విభాగాలుగా చేసి పంపించినప్పుడు.. దక్షిణం వైపు వెళ్లే సైన్యానికి అంగదుడిని నాయకుడిని చేశాడు. అది అంగదుడిపై నమ్మకంతో కానే కాదు. సుగ్రీవుడు అంగదుడిని ఏ సమయంలోనూ నమ్మలేదు. అతడి టీంలోనే తనకు అత్యంత విధేయుడైన హనుమంతుడిని పంపించాడు. ఎందుకంటే.. అంగదుడు సుగ్రీవుడిపై తన తండ్రిని చంపించాడనే కోపంతోనే ఉన్నాడు. కాబట్టి ఏ క్షణాన ఏ రకమైన చర్యకైనా పాల్పడవచ్చని భావించాడు. నిజంగా సుగ్రీవుడు అనుకున్నట్టుగానే జరిగింది. దక్షిణానికి బయలుదేరిన వానరసైన్యం స్వయంప్రభ గుహలోకి ప్రవేశించి.. అక్కడ పండ్లు, పలహారాలు, విందులు.. వినోదాలతో కాలం వెల్లబుచ్చింది. వానరులు అక్కడ మాంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూడ్ లో ఉండగానే సుగ్రీవుడు విధించిన నెలరోజుల గడువు ముగిసిపోయింది. దీంతో అంగదుడు తన వ్యూహానికి పదునుపెట్టాడు. హనుమంతుడు, జాంబవంతుడు వంటి వారిని వదిలి మిగతా వానరసైన్యాన్ని తనవైపు తిప్పుకున్నాడు. సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిపోయింది కాబట్టి.. కిష్కింధకు తిరిగి వెళ్లినా.. హతమార్చడం ఖాయమని భయపెట్టాడు. అందరం ఈ స్వయంప్రభ గుహలోనే ఉండిపోదాం అంటాడు. అక్కడే రాజ్యం ఏర్పాటుకు ప్రయత్నిస్తాడు. కాస్త బలం పుంజుకున్న తరువాత కిష్కింధకు వెళ్దామని వానరులను ఒప్పిస్తాడు. కానీ, సుగ్రీవుడికి విధేయుడైన హనుమంతుడు అంగదుడి తిరుగుబాటు ప్రయత్నాలను తిప్పికొడతాడు. అంగదుడి వద్ద ఉన్న సైన్యాన్ని భేదోపాయంతో విడదీశాడు. ఆ తరువాత అంగదుడిని తీవ్రంగా భయపెడతాడు. కిష్కింధ కాండలోని 54 వ సర్గలోని హనుమంతుడి మాటలను చదవండి.. ‘ఓ అంగదుడా.. నీవు యుద్ధములో తండ్రి కంటే సమర్థుడవు. తండ్రి వలె ఈ వానర రాజ్యమును దృఢముగా ధరించుటకు కూడా సమర్థుడవు. సందేహం లేదు. కానీ, ఈ వానరులందరు చపలచిత్తులు. పుత్రులకు, భార్యలకు దూరంగా ఉన్న వీరు నీ యాజ్ఞకు లొంగి ఉండరు. నేను నీకు ప్రత్యక్షంగానే చెప్తున్నా. ఈ జాంబవంతుడు, నీలుడు, గొప్ప వానరుడైన సుత్రుడు నీతో కలిసి ఉండరు. నేను కూడా నీ పక్షమున ఉండను. మమ్ములనెవరిని నీవు సామదానాది గుణములచేత, దండముచేత సుగ్రీవుని నుండి దూరము చేయజాలవు’ అని భయపెట్టి.. తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు.

ఈ సన్నివేశాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే.. అడవిలో బలహీనమైన జంతువుపై బలవంతమైన జంతువు ఆధిపత్యం చేసినట్టుగా తోస్తుంది. ఇక్కడ ఆధిపత్యమే ప్రధానం ఇందుకోసం ఏదైనా చేస్తాడు. అన్నదమ్ములు లేరు.. భార్యాపుత్రులు లేరు. అధికారమే పరమావధి. తాను చెప్పిన మాట వినకపోతే నిర్దాక్షిణ్యంగా హతమారుస్తారు. ఇదీ కిష్కింధలో రాజ్య పాలన జరిగిన తీరు.

లంక

ఇక రావణుడి లంక. ఇది నియంత రాజ్యం. రాజే సర్వస్వం. రాజే దైవం. రాజే వేదం. అత్యంత పటిష్ఠమైన నగరం. బలవత్తరమైన సైనిక వ్యవస్థ ఉన్న రాజ్యమది. పరిఘలు, శక్తులు, ఋష్టులు (ఒకరకమైన ఆయుధం) పట్టిశములు వంటి అనేక ఆయుధాలతో నిండిన సైన్యం రావణుడి దగ్గర ఉన్నది. కానీ రావణుడు చేసే నిర్ణయమే అంతిమం. ఇది పూర్తిగా అరాచక వ్యవస్థ. ఇక్కడ మంత్రులుంటారు. అధికారులు ఉంటారు. కానీ ఎవరికీ ఎటువంటి అధికారం ఉండదు. రాజు ఏమి చెప్తే అదే శాసనంగా గుడ్డిగా అనుసరిస్తూ వెళ్లవలసి ఉంటుంది. రాజు సలహాలు అడుగుతాడు. కానీ.. రాజు మనసులో ఏమున్నదో తెలుసుకొని దానినే తన సలహాగా చెప్పవలసి ఉంటుంది. అందుకు విరుద్ధంగా మాట్లాడితే.. అంతే సంగతులు. ఒకటి రెండు సన్నివేశాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. లక్ష్మణుడితో అవమానం పాలై లంకకు చేరిన తర్వాత శూర్ఫణక రావణుడితో సీతను గురించి రెచ్చగొట్టి చెప్తుంది. అప్పటికే దండకారణ్యంలో తన గవర్నర్లు ఖరదూషణాదులను హతమార్చిన రాముడికంటే.. రావణుడు సీతమీదనే దృష్టి కేంద్రీకరించాడు. మారీచుడిని పిలిపించి రాముడి దృష్టిని మరల్చమన్నాడు. అప్పుడే రాముడి గురించి మారీచుడు అన్ని విషయాలు చెప్తాడు. విశ్వామిత్రుడి యాగరక్షణ సమయంలో తాను దెబ్బ తిన్న సంగతిని గుర్తుచేస్తాడు. తాను చేయబోయే పని తప్పని వారించే ప్రయత్నంచేస్తాడు. కానీ, రావణుడు అతని మాట వినలేదు. ఆజ్ఞాపించాడు. నీ చేతిలో చావడం కంటే.. రాముడి చేతిలో చావడం మేలని చెప్పి మరీ వెళ్లాడు మారీచుడు. అంతా అయిపోయింది. సీత జాడను కనిపెట్టిన హనుమంతుడు లంకను ఆగమాగంచేసి వెళ్లాడు. రావణుడి చిన్న కొడుకును చంపి మరీ వెళ్లాడు. రాముడు ససైన్యంగా సముద్రానికి అవతలివైపునకు చేరుకొన్న తరువాత కానీ మంత్రులతో చర్చించాలన్న బుద్ధి కలుగలేదు. రాముడు వచ్చేశాడు.. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండంటూ మొదటి సమావేశంలో అడిగాడు. రావణుడి గురించి తెలిసిన అధికారులు మంత్రులు, సేనాధిపతులంతా.. రామలక్ష్మణులను చంపేస్తామని.. నీవు నిశ్చింతగా ఉండాలని ఒకరిపై ఒకరు పోటీలు పడి మరీ చెప్పుకొచ్చారు. అదంతా రావణుడికి వీనుల విందుగానే సాగింది. ఎప్పుడైతే తమ్ముడు విభీషణుడు లేచి సీతను అప్పగించాలంటూ.. నీతివాక్యాలు చెప్పటం మొదలుపెట్టగానే సభను చాలించి రావణుడు ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లవారి రావణుడి ఇంటికి వెళ్లి మరీ చెప్పాడు విభీషణుడు.. రావణుడికి కోపం వచ్చి.. తిట్టి పంపించాడు. ఆ తరువాత మళ్లీ మీటింగ్ పెట్టాడు. ఇందులో మళ్లీ అందరినీ తమ ఆలోచన చెప్పాలని కోరాడు. చెప్తూనే ఒక మెలిక పెట్టాడు. ‘సీతను ఇవ్వకుండగా ఎట్లు ఉండగలమో, రామలక్ష్మణులను ఎట్లు చంపగలమో బాగుగా ఆలోచించి చెప్పుడు’ అని అన్నాడు. అంటే ఏం చెప్పాలో కూడా.. తానే చెప్పాడు. సభలో ఉన్నవారికి వేరే ఆప్షన్ లేనే లేదు. యుద్ధం చేయడం, రామలక్ష్మణులను చంపాలని సూచించడం తప్ప. రావణుడు కోరుకున్నది.. సభలో ఉన్నవారితో చెప్పించుకొన్నాడు. కుంభకర్ణుడు మాత్రం రావణుడిపై అసంతృప్తి వ్యక్తంచేశాడు. సీతను ఎత్తుకొని రావడానికి ముందు మాతో ఎందుకు సంప్రదించలేదు.. ఇప్పుడు పీకల మీదకు వచ్చిన తరువాత అడుగుతున్నావని అగ్రహం వ్యక్తంచేశాడు. అయితే.. కుంభకర్ణుడు రావణుడిపైన డిపెండెంట్. అతను ఎక్కువకాలం నిద్రపోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో అతని బాగోగులు చూసుకోవాల్సింది రావణుడే. అందువల్లే కుంభకర్ణుడు శత్రువులను చంపుతానని రావణుడికి మాటిచ్చాడు. విభీషణుడు మళ్లీ నీతులు చెప్పబోతే వెళ్లగొట్టాడు. మిగతావారెవరూ మాట మాట్లాడలేదు. ఫలితం రావణుడి సేనానాయకులు, సేనావాహిని నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోయింది. కుంభకర్ణ, ఇంద్రజిత్తులు మాత్రమే కొద్దో గొప్పో పోరాడి.. కొంతసేపు యుద్ధరంగంలో నిలబడ్డారు తప్ప గెలవలేకపోయారు. చివరకు రావణుడు కూడా నేలకొరగాల్సి వచ్చింది. ఒక పాలకుడి వ్యక్తిగత కోరిక.. ఆ రాజ్య సంరక్షణ, భద్రతలను మించిపోయింది. ఫలితం రాజ్యనాశమే. అరాజకమంటే ఇదే. ఇక్కడ రాజుకు ప్రజలు ముఖ్యం కాలేదు. పరిపాలన ముఖ్యం కాలేదు. వారి సుఖదుఃఖాలు ముఖ్యం కానేలేదు. ఒక స్త్రీపై తన కోరిక మాత్రమే ముఖ్యమైంది. ఆ కోరిక అన్నింటినీ దిగమింగింది. చివరకు రాజ్యాన్నే మింగేసింది.

పబ్లిక్ లైఫ్‌లోకి ప్రవేశించాలనుకున్న రాముడు.. వ్యక్తిగత ప్రేమానురాగాలను పణంగా పెట్టి.. కేవలం పరాయి ఇంట ఉన్నదన్న ఒకే ఒక్క కారణంతో సీతమ్మను నిప్పులమీద నడిపించాడు. ఆమె రాముడిని నిందించింది. ఏమిటయ్యా ఇదేనా నామీద నీకున్న నమ్మకం అని ప్రశ్నించింది. కానీ రాముడు నడవాల్సిందేనన్నాడు. ఇక్కడ ప్రజాజీవితంలో ఉన్న పాలకుడికి ప్రజలు, పరిపాలనే ప్రాధాన్యమైంది తప్ప వ్యక్తిగత జీవితం కాలేదు. మరోవైపు ఆల్రెడీ పబ్లిక్ లైఫ్‌లో ఉన్న రావణుడు వ్యక్తిగతమైన రాగద్వేషాల కోసం, కామం తీర్చుకోవడం కోసం రాజ్యాన్ని పణంగా పెట్టాడు. తను నాశనమయ్యాడు. రాజ్యాన్ని నాశనం చేశాడు. ఈ ఇద్దరు పాలకులలో కనిపించే ప్రధాన వ్యత్యాసమిది. మనకు రాజనీతిని బోధించే మేధావులకు ఇంతకంటే గొప్ప కంపారిటివ్ పొలిటికల్ సిస్టవ్‌‌సు ఎక్కడ దొరుకుతాయో అర్థం కాదు.

విచిత్రమేమిటంటే.. ఈ రాజ్య వ్యవస్థలేవీ మనకు చర్చించడానికి కానీ, విశ్లేషించడానికి కానీ పనికిరాలేదు. అధికారంలోకి రావడానికి కుటుంబ సభ్యులందరినీ చంపేసి.. వేలమంది అజీవికులను నిర్దాక్షిణ్యంగా హతమార్చిన అశోకుడు మాత్రం ఆదర్శమయ్యాడు. లక్షమంది కళింగులను చంపి.. చావుదగ్గరకొచ్చి.. మంచంమీద ఉన్నప్పుడు భార్యను కూడా చంపించిన సోకాల్డ్ అశోకుడు గొప్ప రాజుగా కీర్తిప్రతిష్ఠలు పొందాడు. ఇప్పుడు మనదగ్గర అమల్లో ఉన్న రాజ్యవ్యవస్థకు ఆదర్శపురుషుడయ్యాడు. ఈ అశోకుడి కంటే.. మించి అరాచకాలకు పాల్పడ్డ మొఘలుల చరిత్ర మనకు రోల్‌మోడల్ అవుతుంది. పెండ్లైన 19 ఏండ్లలో 14 సార్లు భార్యకు కడుపుచేసి.. ఆమె చావుకు కారణమై.. ఒకచోట పాతిపెట్టిన శవాన్ని ఆర్నెల్ల తరువాత తవ్వితీసి.. ఇంకోచోటికి తెచ్చి మార్బుల్ రాళ్ల కింద మళ్లీ పాతిపెడితే.. వాడిని అమర ప్రేమికుడన్నారు. దాన్ని ప్రేమమందిరమన్నారు. ఇతని కొడుకు మరింత దుర్మార్గుడు. అన్నను చంపి.. కోటగుమ్మానికి తలను వేలాడదీసి.. కుటుంబసభ్యులను రాళ్లతో కొట్టి చంపించి.. తండ్రిని జైల్లో పడేసి.. చిత్రహింసలు పెడితే.. వాడు గొప్పవాడైపోయి.. వాణ్ణి జయించిన ఛత్రపతి శివాజీ చరిత్ర పనికిరాకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here