రామం భజే శ్యామలం-48

0
2

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]ఆ[/dropcap] మధ్య ఓ సినిమా వచ్చింది. దాని పేరు వినయ విధేయ రామ. ఈ సినిమాలో హీరో అన్న ఎక్కడో బీహార్‌లో శత్రుమూకల చేతిలో చావుదెబ్బలు తింటుంటాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతుంటుంది. సెల్‌ఫోన్ సిగ్నల్ అందదు. ఆ అన్నగారు ఒక పక్క దెబ్బలు తింటూనే.. సిగ్నల్ కోసం ఫోన్ పట్టుకొని పరిగెడుతుంటాడు. కొన్ని అడుగులు వెళ్లిన తర్వాత సిగ్నల్ దొరుకుతుంది. వెంటనే తమ్ముడైన హీరోకు ఫోన్ కలుస్తుంది. ‘తమ్ముడూ.. నన్ను రక్షించు’ అని అన్నగారు కేక పెడతారు. ఆ సమయంలో సదరు తమ్ముడు ఫ్యామిలీని తీసుకొని పశ్చిమాన ఉన్న ద్వారక టూర్‌లో ఉన్నాడు. అన్నగారి ఆవేదన ఫోన్‌లో విన్న సదరు తమ్ముడు.. వెంటనే అద్దాలు బద్దలు చేసుకొని రోడ్డుమీద పరిగెత్తుతూ.. రైల్ ఓవర్ బ్రిడ్జిపైకి చేరుకొని.. ఆ బ్రిడ్జిపైనుంచి రైలుపైకి దూకేస్తాడు. అప్పటికి అతని చొక్కా చిరిగిపోయి ఆరు ప్యాకుల శరీరం బయటపడుతుంది. అతను అలాగే రైలుపై నిలుచొని బీహార్ దాకా ప్రయాణంచేసి.. అన్నగారి జాడ తెలుసుకుని.. శత్రువులను దునుమాడి విజయం సాధిస్తాడు. మనం సినిమాల్లో ఇలాంటి అతిశయోక్తులు.. అత్యుక్తులు చాలానే చూస్తాం. మనవాళ్లు దేన్నైనా ఏమారుస్తారనడానికి ఇదొక బలమైన ఉదాహరణ. ఇదెందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే.. దేన్నైనా ఎగ్జాజరేట్‌చేసి చెప్పటంలో, చూపించడంలో మనవాళ్లను మించిన వాళ్లులేరు. ఇంతెందుకు మన పౌరాణిక సినిమాలు ఒకసారి చూడండి.. హిందీ చానళ్లలో వచ్చే పౌరాణిక సీరియళ్లను ఒక్కసారి గమనించండి. రాముడు రావణ కుంభకర్ణాదులతో బీభత్సమైన యుద్ధం చేస్తుంటాడు. ఎన్టీరామారావు కావచ్చు.. శోభన్‌బాబు కావచ్చు.. అరుణ్‌గోవిల్ కావచ్చు.. రాముడికి ఒక్క దెబ్బ కూడా తాకదు. రక్తపుచుక్క నేల రాలదు. శత్రువులు మాత్రం కకావికలమవుతుంటారు. శత్రువర్గంలో విధ్వంసం జరుగుతుంటుంది. రాముడి వర్గంలో ఏ ఒక్కరికీ ఏమీ కాదు. చివరకు సింపుల్‌గా ఒక బాణం వేసి రావణుడిని చంపేస్తాడు. అప్పటికే రెడీగా పూలు పట్టుకొని ఆకాశంలో ఉన్న దేవతలు చప్పట్లు కొట్టి పూల వర్షం కురిపిస్తారు. కథ సుఖాంతమవుతుంది. ఆశ్చర్యమేస్తుంది.

ఇది నమ్మశక్యంగా ఉంటుందా? అంటే రాముడు దేవుడు కదా అంటారు. కానీ, అప్పటిదాకా రావణుడు గొప్ప పరాక్రమవంతుడు, ముల్లోకాలను జయించినవాడు, అన్న కుబేరుడిని జయించినవాడు, ఏకంగా కైలాస పర్వతాన్నే ఎత్తినవాడు అని కీర్తిగాంచిన రావణుడు.. రాముడికి ఒక్క చిన్న గాయమైనా చేయలేపోయాడా? సినిమాలంటే అత్యుక్తులుంటాయి. కానీ, మహామహులు రామాయణాన్ని ఆధారం చేసుకొని నిర్మించిన నాటకాలు, కథలు, కావ్యాల్లో కూడా ఇదే ధోరణి కనిపించడం ఆశ్చర్యమేస్తుంది. ఈ రకమైన స్క్రీన్‌ప్లేలు రామాయణాన్ని చరిత్ర కాదనడానికి.. నేను మనిషిని, మనిషి ధర్మమే నాదని అంతగా చెప్పిన రాముడి మాటను కూడా కాదని దివ్యత్వాన్ని ఆపాదించి.. రామాయణాన్ని ఒక మిథ్యగా మార్చడానికి బాగా పనికొచ్చాయి.

నిజంగా రాముడు రావణుణ్ణి అలాగే సంహరించాడా? రామాయణంలో మాయలు.. మర్మాలు.. ఏవైనా ఉన్నాయా? అంటే ఎక్కడా ఒక్కటంటే ఒక్కటి మచ్చుకు కూడా కనిపించదు. రామాయణం ఒరిజినల్.. అంటే వాల్మీకి రాసిన  రామాయణం మాత్రమే.. చదువుతుంటే ఆశ్చర్యమేస్తుంది. మనం ఇంతకాలం విన్నవి, కన్నవాటిలో నూటికి 90 శాతం అందులో కనిపించవు. అన్నింటిలో కనిపించే సారూప్యత మూలకథ మాత్రమే. తరువాత ఒక్కొక్కరు ఒక్కో సన్నివేశాన్ని యాడ్ చేసుకుంటూ పోయారు.. వాల్మీకి రామాయణంలో సీతా స్వయంవరం, పరుశురాముడి రాక, రావణ సభ, అందులో చర్చలు.. సీతారాముల దాంపత్యం.. ఇలా ఒకటేమిటి.. వాస్తవ రామాయణాన్ని చదువుకుంటూపోతే.. ఒక్కో సన్నివేశం మనకు ఆసక్తిని, ఉద్విగ్నతను, ఉత్కంఠను.. కలుగజేస్తుంది. కానీ ఎవరికి తోచినట్టు వాళ్లు రామాయణంలోని సన్నివేశాలను మార్చేయడంతో.. అసలు రామాయణం పూర్తిగా అంటే.. పూర్తిగా మరుగున పడిపోయింది.

రామాయణం అంటే వాల్మీకే ప్రామాణికం. వాల్మీకి రాసినదే రాముడి చరిత్ర. ఈ ప్రపంచంలో రామాయణాలు కొన్ని వేల మంది ఇన్ని వేల సంవత్సరాలలో రాసి ఉండవచ్చు. కానీ సీతారాముల కథ, కథనం వాల్మీకిని మించి ఎవరూ రాయలేదు. రాయలేరు కూడా. రాముడి విజయగాథ అంత గొప్పగా చెప్పినవారు ఇంతవరకు లేరు. దశావతారాలలో ఒకడిగా, దేవుడిగా రాముడి దైవత్వాన్ని కొంతసేపు పక్కనపెట్టి.. కేవలం మనిషిగా మాత్రమే రాముడిని చూసినప్పుడు.. ఆతడు పుట్టినప్పటినుంచి.. విద్యలు నేర్చి.. ఆయుధాలు సంపాదించి.. వాటిని ఎట్లా వాడాలో తెలుసుకొని.. ఒక్కొక్కటి కూడగట్టుకొంటూ.. రావణుడి దాకా వెళ్లి.. సంహరించిన తీరు మనం ఇవాళ చూసే ఒక థ్రిల్లర్ వార్‌కు ఎంతమాత్రం తక్కువ కాదు. దశావతారాలను మనం ఒక్కసారి గమనిస్తే.. రాముడికి ముందరి అవతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామనావతారాలన్నీ కూడా నిమిషాల్లో అవతరించి ముగిసిపోయినవే. రాముడు మనిషిగా పుట్టి.. మనిషిగా సంపూర్ణ జీవితాన్ని అనుభవించినవాడు. మనమంతా తల్లి కడుపునుంచి పుట్టి.. ఎలా ఎదుగుతామో అలాగే ఎదిగినవాడు. రావణుడు తపస్సుచేసి నరులు, వానరుల వల్ల నాకు భయం లేదు. ఇతరుల వల్ల మరణం రాకుండా చూడు సామీ అంటూ వరాల్ని తెచ్చుకున్నాడని కదా మనం కథలు చెప్పుకొనేది.. అలా రావణుణ్ణి చంపాలనుకుంటే.. సింపుల్‌గా ఓ ఇద్దరు ముగ్గురు వానరులను వెంటేసుకుని మనిషిరూపంలో విష్ణువు నేరుగా లంకలోనే అవతరించి చంపేయవచ్చుకదా! కానీ.. మిగతా అవతారాల మాదిరిగా ఇక్కడ జరుగలేదు. రాముడు అంతా అనుకున్నట్టు సింపుల్‌గా చంపలేదు. ఇద్దరు సమవుజ్జీల మధ్య భీకరమైన పోరాటం జరిగిన తరువాతే విజయం సాధించాడు. ఇందుకు ఆయనకు చిన్నప్పటినుంచే సాధన అవసరమైంది. ఆయుధాల సమీకరణ అవసరమైంది. రకరకాల యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సి వచ్చింది. రావణుడికి సంబంధించిన ఒక్కో వ్యవస్థను ఎలిమినేట్ చేసుకొంటూ వెళ్లాల్సి వచ్చింది.

రాముడు జన్మించినది మొదలుగా అతని బాల్యము ఎలా కొనసాగిందో వాల్మీకి బాలకాండ 18వ సర్గలో పది శ్లోకాల్లో ముగించేశాడు. వేదాధ్యయనము, ధనుర్విద్య, అన్నదమ్ముల మధ్య అనుబంధం.. ఉపనయనాది సంస్కారాలు అన్నీ కూడా ఈ శ్లోకాలలో ముగిసిపోతాయి. విశ్వామిత్రుడి రాకతో రామలక్ష్మణుల పరాక్రమం, వ్యక్తిత్వం అభివ్యక్తమవుతుంది. ఇక్కడినుంచి ఒక్కో సందర్భంలో ఒక్కో ఋషి రాముడిని ప్రేరణతో ముందుకు తీసుకెళ్తుంటారు. జనస్థానాల్లో ఉన్న ప్రజలందరూ రావణుడు.. అతడి సైన్యంతో బాధలు పడుతున్నవారే. అతడిని అంతమొందించడం కోసం మహావీరుడి కోసం వారు సాగించిన అన్వేషణ రాముడి రూపంలో పూర్తయింది. ఈ దిశగా రాముడి ప్రస్థానం విశ్వామిత్రుడితో మొదలైంది.

విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి తాను ఓ యజ్ఞం చేస్తున్నానని.. దాన్ని రక్షించడానికి రాముడిని పంపించాలని దశరథుడిని అడిగితే.. అతను ససేమిరా అన్నాడు. ఈ ఋషికి కోపం వచ్చింది. దాంతో వసిష్టుడు జోక్యం చేసుకొని.. ఏం పర్లేదు.. నీ కొడుకును ఆయనతో పంపించు.. ఆయన దగ్గర బోలెడు ఆయుధాలున్నాయి. దక్షుడి కూతుళ్లు జయ, సుప్రభలు పుట్టించిన వంద అస్త్రాలు ఇతని దగ్గర ఉన్నాయి.. అవన్నీ నీ కొడుకుకు ఇస్తాడు.. పంపించు అన్నాడు. దీంతో దశరథుడు ఓకే అని పంపిస్తాడు. ఇక్కడ మనకు కామన్‌గా వచ్చే ప్రశ్నేంటి? అన్ని వెపన్స్ దగ్గరుంచుకొని.. మళ్లీ రాముడి దగ్గరకు వచ్చుడేమిటి? తనే ఆ ఆయుధాలతో రాక్షసులను చంపేయొచ్చు కదా.. కానీ.. విశ్వామిత్రుడి టార్గెట్ అది కానే కాదు. రాముడిని భావి యుద్ధానికి ప్రిపేర్ చేయడం.. అంతకు మించి రావణుడికి రాముడి ఉనికిని తెలియజెప్పటం.. ఇదే టార్గెట్. అందుకే రాముడిని వెంటపెట్టుకొని వెళ్లాడు. ముందుగా ఆకలి దప్పులను ఎక్కువకాలం నియంత్రణలో ఉంచుకోనేలా బల, అతిబల అన్న విద్యలను నేర్పాడు. విద్య అంటే నాలెడ్జి. టెక్నిక్.. ఇంకేవైనా.. విద్యలో భాగమే. ఆ తరువాత తన దగ్గరున్న ఆయుధాలన్నింటినీ అప్పజెప్పాడు. వాటిని ఎట్లా వినియోగించాలి.. ఎట్లా ఉపసంహరించుకోవాలి.. అన్నింటినీ నేర్పించాడు. చక్రం, ఇంద్రాస్త్రం, శూలం, బ్రహ్మశిరోస్త్రం, బ్రహ్మాస్త్రం, మోదకి, శిఖరి అన్న గదలు, ధర్మ, కాల, వారుణ పాశాలు, ఆగ్నేయ, వారుణాస్త్రాలు, రాక్షసులు వాడే కంకాళ,కపాల, కంకణాలనే ముసలములు, నందనమనే ఖడ్గం, గంధర్వ, మానవాస్త్రాలు.. ఇలా ఒకటేమిటి.. వందకు పైగా ఆయుధాలను రాముడికి ఇచ్చాడు. దీంతో రాముడికి పెద్ద ఎత్తున ఆయుధ సమీకరణ జరిగినట్టయింది. ఆ తరువాత సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు చేసే యజ్ఞానికి విఘాతం కలిగిస్తున్న మారీచ సుబాహులలో సుబాహుని మట్టుపెట్టి.. మారీచుడిని దూరంగా సముద్రంలో పడవేస్తాడు. మారీచుడు రావణుడి మనిషి. తనను ఎదిరించగల మానవ వీరుడు రాముడు వచ్చాడన్న మొట్టమొదటి సంకేతం రావణుడికి చేరినట్టయింది. ఆ తరువాత రాముడిని మిథిలకు తీసుకొనివెళ్లి అక్కడ శివధనుస్సును ఎక్కుపెట్టించి.. అతడి పరాక్రమాన్ని విశ్వామిత్రుడు మరింత ఎలివేట్ చేశాడు. ఆ తరువాత పరుశురాముడు విష్ణు ధనస్సును ఇచ్చి వెళ్లాడు.

వనవాసం ప్రారంభం అయిన తరువాత సీతారామ లక్ష్మణులు ముందుగా వెళ్లింది గంగాతీరం ఆవల భరద్వాజ ఆశ్రమానికి. అక్కడ భరద్వాజుడు.. వారిని ఆశ్రమంలో ఉంచుకొని.. రాజ్యాన్ని విడిచిపెట్టిన బాధను పోగొట్టి.. ఉత్తేజితులను చేశాడు. చిత్రకూటంపై ఉండాలని ఆయనే సూచించాడు. ఇట్లా లంక దాకా రాముడి ప్రయాణానికి ఈ ఋషులు వాహకులుగా వ్యవహరిస్తూ వచ్చారు. చిత్రకూటంలో పర్ణశాలను నిర్మించుకొని కొంతకాలం గడిచిన తర్వాత మళ్లీ అక్కడి ఋషుల కారణంగానే రాముడు ముందుకు కదలాల్సి వచ్చింది. రాముడిని చూచి భయపడినట్లు వ్యవహరించడం.. సందేహాస్పదంగా చూస్తుండటంతో రాముడు అక్కడ ఆశ్రమ అధిపతిని కారణమడిగాడు. ఆయన రాముడితో నువ్వు వచ్చినప్పటినుంచి రాక్షసులు మా మునులను హింసిస్తున్నారు. వాళ్లు నిన్ను కూడా వదిలిపెట్టరు. మేము ఈ ఆశ్రమాన్ని వదిలివెళ్తున్నాం. నువ్వు కూడా మాతో వస్తే రా.. అని వెళ్లిపోయారు. రాముడు ఒకరకంగా ఆందోళన చెంది.. అక్కడి నుంచి వేరే చోటికి మకాం మార్చడానికి బయలుదేరాడు. మధ్యలో అత్రి, అనసూయ ఆశ్రమం కనిపించింది. అక్కడ ఋషి దంపతులను దర్శించుకొన్నాడు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అనసూయాదేవి సీతాదేవికి పుష్పమాలలు, బట్టలు, అలంకారాలు, అంగరాగం, మైపూత (క్రీం) వంటి వాటిని బహుమానంగా ఇచ్చింది. ఆ క్రీం శరీరానికి రాసుకుంటే.. శరీరం ఎప్పటికీ మడతలు పడదంట. బహుశా ఇప్పుడు మనం చెప్పుకొనే కాస్మొటిక్స్ లాంటిదేమో ఇది కూడా. ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడే.. అక్కడి మునులు ఆ అడవిలో ఉండే రాక్షసుల గురించిన సమాచారాన్ని రాముడికి చేరవేశారు. వాళ్లు ఎంత భయంకరులో వివరించి చెప్పారు. వాళ్ల విషయంలో ఏమరపాటు తగదని, వాళ్ల కంటపడకుండా తప్పించుకొని వెళ్లడానికి సురక్షితమైన దారిని కూడా మునులు చూపించారు. సీతారామ లక్ష్మణులు వాళ్లు చూపిన దారిలోనే ప్రయాణం సాగించారు.

ఇక్కడినుంచి రాముడికి రాక్షసులను నిలువరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. మొదట విరాధుడనే రాక్షసుడు.. రామలక్ష్మణులను ఎత్తుకొని వెళ్లాడు. వాడిని రాముడు చంపి తిరిగి వచ్చాడు. ఆ తరువాత శరభంగముని ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను దర్శించుకొన్న రాముడికి మార్గం చూపించాడు. అక్కడ మునులంతా వచ్చి రాక్షసుల నుంచి తమను కాపాడాలని రాముడిని వేడుకొంటారు. రాముడు వారికి అభయమిస్తాడు. ఆ తరువాత సుతీక్ష్ణ మహర్షి దగ్గరకు వెళ్లి దర్శించుకొన్న తరువాత ఆయన రాముడిని రాక్షస సంహారం వైపు మరింత ప్రేరేపిస్తాడు. ఆ తరువాత సీత ‘ఏమయ్యా.. రామయ్యా.. మనం అడవికి వచ్చింది దేనికి? నువ్వు చేస్తున్న పనేమిటి? అహింసా వ్రతం చేయాల్సిన వాడివి.. ఇక్కడ రాక్షసులందరినీ చంపుతానని హామీలిస్తే నేనేం కావాలి. నీ క్షేమం నాకు ముఖ్యం కాదా? నాకు ఆందోళనగా ఉన్నది.’ అని అన్నదట. ఒక సాధారణ భార్య భర్త గురించి పడే ఆందోళనే ఇది. ఇక్కడ మనకు దైవత్వం ఎక్కడ కనిపిస్తున్నది? సాధారణ మనుషుల్లాగానే సీతారాముల జీవితమూ సాగిందనడానికి ఈ సన్నివేశం ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఆమెను ఎలాగోలా రాముడు అనునయిస్తాడు. ఆ తరువాత అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ అగస్త్యుడు రాముడికి ధనుస్సు, ఖడ్గం, అక్షయ తూణీరాలను బహుమానంగా ఇస్తాడు. ఇదే అగస్త్యుడు రామరావణ యుద్ధ సమయంలో రణక్షేత్రానికి వచ్చి ఆదిత్య హృదయం చెప్పి పోతాడు. తరువాత సీతారామ లక్ష్మణులు పంచవటిలో పర్ణశాల కట్టుకొంటారు. అక్కడ ఉండగానే రావణుడి సోదరులైన ఖరదూషణులు రామలక్ష్మణులపై యుద్ధానికి తెగబడతారు. జనస్థానంలో రావణుడి గవర్నర్లుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరితోపాటు 14 వేల మంది రాక్షసులను చంపడంతో రాముడు నేరుగా రావణుడితో తలపడినట్లయింది. మరోపక్క రావణుడి చెల్లెలు శూర్ఫణక వచ్చి రాముడిని కోరుకోవడం, ఆమెను అంద వికారిని చేయాలంటూ రాముడి ఆదేశాల మేరకు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పంపడంతో.. యుద్ధం అనివార్యమైపోయింది. శూర్పణక వెళ్లి రావణుడిని సీతను కిడ్నాప్ చేయడానికి ప్రేరేపించడం.. అతను మారీచుడి సహాయంతో సీతను అపహరించుకొనిపోవడం చకచకా జరిగిపోయాయి. రాముడి గురించి అప్పటికే రావణుడు విని ఉన్నాడు. కానీ.. అతను వుమనైజర్ కావడంతో తొందరగా శూర్ఫణక బుట్టలో పడిపోయాడు.

ఇక్కడినుంచి రామరావణుల వ్యూహాత్మక ఎత్తుగడలు మనకు కనిపిస్తాయి. సుగ్రీవుడిని కలవడానికి ముందే.. సీతను రావణుడు ఎటువైపు ఎత్తుకెళ్లాడో రాముడికి ప్రాథమిక సమాచారం ఉన్నది. రావణుడిని అడ్డగించిన జటాయువు సీతను ఎటువైపు ఎత్తుకెళ్లాడో వివరాలు చెప్పాడు. రావణుడి ధనుస్సును, బాణాన్ని, రథాన్ని విరిచేసి, సారథిని కూడా జటాయువు చంపాడు. రాముడికి విధేయుడైన ఒక్కడివల్లనే ఇంత సాధ్యమైందంటే.. ఇక మిగతావారి శక్తిసామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సుగ్రీవుడిని కలిశాక అతడి సైన్యంలో ఎవరెవరు ఏపాటి సామర్థ్యమున్నవారో ఒక అంచనాకు వచ్చాడు రాముడు. దక్షిణంవైపు వెళ్లినవారిలో హనుమంతుడు ఉన్నాడు. ఇతడు సీత జాడను తెలుసుకోవడాన్ని మించి పెద్దపని చేశాడు. దీంతో రాముడి గెలుపు ఖాయమైంది. హనుమంతుడు లంకకు వెళ్లి సీతను కనిపెట్టిన అనంతరం విధ్వంసకాండ చేశాడు. రావణుడి వ్యూహాత్మక యుద్ధ స్థావరాన్ని ధ్వంసంచేశాడు. త్రికూటంపైన వైమానిక దాడుల కోసం ఏర్పాటుచేసుకొన్న విమానాశ్రయాన్ని కాల్చివేశాడు. సైన్యంలోని లంక రక్షకదళంలో ఒక భాగాన్ని అంతంచేశాడు. ఇండ్లను కాల్చేశాడు. లోపల ఉన్న సంపదను బూడిదచేశాడు. రావణుడి చిన్నకొడుకు అక్షయ కుమారుడిని హతమార్చాడు. అన్నింటికీ మించి అప్పటిదాకా ఎంతో సురక్షితమైనదిగా అక్కడి ప్రజలు భావిస్తున్న లంకలో ఒక్కసారిగా ఇన్‌సెక్యూరిటీని సృష్టించాడు. ప్రజల్లో భయాన్ని సృష్టించాడు. రాక్షసుల్లో ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీశాడు.

రాముడు వానర సైన్యంతో సముద్రతీరానికి చేరడంతోనే రావణుడికి సమాచారం అందింది. శార్దూలుడు, శుకుడు అనే ఇద్దరిని సముద్రం అవతలకు పంపించి రాముడి సేనపై ఒక అంచనాకు వచ్చాడు. శుకసారణులనే ఇద్దరిని కోవర్టులుగా రాముడి సైన్యంలోకి రావణుడు చొరబరుస్తాడు. కానీ విభీషణుడు వాళ్లను గుర్తించి పట్టుకొంటాడు. విభీషణుడిని తన శిబిరంలో చేర్చుకోవడం ద్వారా శత్రువు బలాబలాలు తెలుసుకొని ముందుకు పోవడం రాముడికి చాలా తేలిక అయింది.

రాముడు ప్రధానంగా వానరులు, గోలాంగూలాలు, భల్లూకులతో కూడిన మూడు ప్రధాన సైనిక దళాలతో లంకపై దాడికి పూనుకున్నాడు. వారధి దాటి లంక చేరుకున్న రాముడు సువేల పర్వతంపైనుంచి లంకను గమనించాడు. అదే సమయంలో రావణుడు దుర్భిణితో రాముడిని, అతడి సైన్యాన్ని ఆసాంతం పరిశీలించి ఒక అంచనాకు వచ్చాడు. రాముడి సైన్యాన్ని గురించి శుకసారణులు రావణుడికి వివరించారు. రాముడి సైన్యంలోని ఒక్కో వీరుడి ఊరుపేరుతో సహా వారి కెపాసిటీలను సవివరంగా చెప్పుకుంటూ వచ్చారు. సుగ్రీవుడు, సుషేణుడు, అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, కుముదుడు, శరభుడు, రంభుడు, పనసుడు, క్రథుడు, గవయుడు, శతబలి, కేసరి, గజుడు, గవాక్షుడు, మైందద్వివిదులు, ప్రమాథి, ధూమ్రుడు ఇలా దాదాపు 18 మంది సేనానాయకులు రాముడి సైన్యాన్ని పటిష్ఠంగా నడిపించారు. రాముడు తన సైన్యాన్ని గరుడ వ్యూహంలో మోహరించి ముందుకు నడిపించాడు. అటు రావణుడు.. ప్రహస్తుడు, ఇంద్రజిత్తు, నికుంభుడు, విరూపాక్షుడు, మకరాక్షుడు, మెదరుడు, అతికాయుడు, వజ్రద్రంష్టుడు, అకంపనుడు, మహా పార్శ్వుడు వంటి ఎదిరింపశక్యం కాని వీరులుండగా.. తానూ, కుంభకర్ణుడు యుద్ధభూమికి వెళ్లాల్సిన అవసరమే రాదని గట్టిగా నమ్మాడు. అయినా.. ఏమరుపాటుగా లేడు. రాముడి సైన్యంలో చీలికకు చేయాల్సినన్ని ప్రయత్నాలు చేశాడు. సుగ్రీవుడి దగ్గరకు శుకుడిని పంపించి.. నేను రాముడి భార్యను తీసుకొస్తే.. నీకేం సంబంధం.. నువ్వూ.. నేను భాయీ భాయీ.. నువ్వు ఈ రాముడిని వదిలి హాయిగా కిష్కింధకు వెళ్లిపో.. ఏమన్న ఉంటే చూసుకుందాం అన్నట్టుగా సందేశాన్ని పంపిస్తాడు. కానీ.. ఆ రాయబారం ఫెయిలయింది. వానరులు శుకుడిపై దాడిచేసి నానా హంగామా చేస్తే.. రాముడు అతణ్ణి విడిపించి తిరిగి పంపిస్తాడు.

యుద్ధం మొదలైంది. వానరసేన ముప్పేటదాడికి పూనుకుంది. రావణ సైన్యాన్ని ఒక్కో వానరవీరుడు మట్టుబెట్టాడు. రావణ సేన.. వానరులకు కకావికలం చేసింది. రావణుడి కుమారులను అంగదుడు, హనుమంతుడు, ఇతర వానరవీరులు హతమార్చారు. ప్రహస్తుడిని నీలుడు చంపేశాడు. ఇక ఇంద్రజిత్తును చంపడానికి రామలక్ష్మణులు చాలా కష్టపడాల్సి వచ్చింది. రామలక్ష్మణులపై ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి మూర్ఛపోయేలా చేశాడు. గరుత్మంతుడు వచ్చి వాళ్లను విడిపించాల్సి వచ్చింది. ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుడిని బతికించడానికి హనుమంతుడు సంజీవని మూలికను తేవాల్సి వచ్చింది. తరువాత నికుంభిళకు వెళ్లి ఇంద్రజిత్తుతో ఘోరంగా యుద్ధంచేసి అతడిని వధించాడు.

ఆ తరువాత సీన్‌లోకి కుంభకర్ణుడు వచ్చాడు. కుంభకర్ణుడి రాకతో రాముడి సైన్యం బేజారైపోయింది. వేలాది వానరులను కుంభకర్ణుడు చంపాడు. సేనానాయకులైన శరభుడు, గంధమాదనుడు, ఋషభుడు, గవాక్షుడు అందరిని తీవ్రంగా గాయపరచి నేలకు కొట్టాడు. కుంభకర్ణుడి దెబ్బకు అంగదుడు మూర్ఛపోయాడు. చివరకు స్వయంగా సుగ్రీవుడు కుంభకర్ణుడితో యుద్ధంచేశాడు. అతడిపైకి కుంభకర్ణుడు శూలం విసిరితే.. దాన్ని హనుమంతుడు అడ్డుకొన్నాడు. దాంతో ఒక పెద్ద పర్వతంలోని ఒకభాగాన్ని పెకిలించి సుగ్రీవుడిపైకి విసరడంతో అతడు మూర్ఛపోయాడు. వెంటనే అతడిని అపహరించుకొని లంకకు తీసుకెళ్లాడు. సుగ్రీవుడిని చంపితే.. రాముడితో సహా సైన్యమంతా నశిస్తుందని కుంభకర్ణుడు ఫీల్ అయ్యాడు. కానీ లంకలోకి ప్రవేశించేసరికి స్పృహలోకి వచ్చిన సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులు, ముక్కు కొరికి బీభత్సం చేశాడు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని నేలకేసి కొట్టాడు. సుగ్రీవుడు అక్కడినుంచి తప్పించుకొని ఆకాశంలోకి ఎగిరి.. రాముడి దగ్గరకు వచ్చి చేరాడు. చివరకు కుంభకర్ణుడిని చంపడానికి రాముడే రంగంలోకి దిగాడు. ఇద్దరిమధ్య సంవాదం జరిగింది. ‘నేను విరాధుడినో, ఖరుడినో, మారీచుడినో కాదు.. కుంభకర్ణుడిని.. నా మీద నీ పరాక్రమం చూపు’మన్నాడు. రాముడు ప్రయోగించిన బాణాలు అతడిని ఏమీ చేయలేకపోయాయి. వాలిని చంపడానికి వాడిన బాణం కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. కుంభకర్ణుడు చెట్టును పెకిలించి రాముడిపై విసిరాడు. రాముడు వాయవ్యాస్త్రం చేత కుంభకర్ణుడి చేతిని నరికేశాడు. ఆ తరువాత ఐంద్రాస్త్రం చేత రెండోచేతిని నరికేశాడు. అనంతరం ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని ప్రయోగించి అతడి శిరస్సును ఖండించాడు. విశ్వామిత్రుడి దగ్గర పొందిన ఆయుధాలు రాముడికి ఇక్కడ ఉపయోగపడ్డాయి.

ఇక రామరావణ యుద్ధం మరీ భీకరంగా సాగింది. మొదట సుగ్రీవుడు రావణుడితో ద్వంద్వ యుద్ధానికి తలపడి తట్టుకోలేక మూర్ఛపోయాడు. రావణుడి పిడికిలి దెబ్బకు హనుమంతుడు కంపించిపోయాడు. రావణుడు విసిరిన శక్తి అనే ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. వాళ్లిద్దరి మధ్య జరిగిన యుద్ధ వర్ణన ఇది. ‘రాముడు రావణుని మీదా, రావణుడు రాముని మీదా పరస్పరము వాడియైన బాణముల వర్షము వర్షించిరి. బాణముల వేగముచేత ఒకరికొకరు దూరమగుచు, పరస్పరము పరాజితులు కాని, ఆ రామరావణులు చిత్రముగా, కుడి, ఎడమ వైపు మండలభ్రమణములు (గుండ్రంగా తిరుగుతూ యుద్ధం చేయడం) చేసిరి. భయంకరులు, యమునితోను, మృత్యు దేవతతోను సమానులు అయిన వారిద్దరూ ఒక్కసారిగా బాణములను విడుచుచు యుద్ధము చేయుచుండగా ప్రాణులు భయపడినవి…… ఇద్దరూ గొప్ప ధనుస్సులు కలవారే, ఇద్దరూ యుద్ధమునందు నేర్పు గలవారే. ఇద్దరూ అస్త్రవేత్తలలో ప్రధానులే….. రావణుడు రాముడి లలాటము మీద (నుదురు) వరుసగా కొన్ని నారాచ బాణములను నాటెను. భయంకరమై ధనుస్సు నుండి వెలువడిన, నల్ల కలువల దళముల వంటి కాంతిగల ఆ నారాచబాణమాలను రాముడు శిరస్సుతో ధరించెను. రాముడు కోపించి రౌద్రంతో బాణములను ప్రయోగించెను. అభేద్యమైన రావణుడి కవచము మీద పడిన బాణములు అతనికి వ్యథను కలిగించలేదు. అగ్నితో సమానుడైన రాముడు పావకాస్త్రమును ప్రయోగించెను. భయంకరములైన రావణుడి బాణములు రాముడి అస్త్రముచేత కొట్టబడినై ఆకాశమునందే నశించి వేలకొలది ముక్కలుగా అయిపోయినవి…’

ఇంకా చదవండి.. ‘రావణుడు ప్రయోగించిన శక్తి భయపడని లక్ష్మణుని వక్షస్థలములో దిగిపోయెను. ఆ శక్తిచేత వక్షస్థలము భేదింపబడగా లక్ష్మణుడు నేలపై పడెను. బలవంతుడైన రాముడు కోపించి భయంకరమైన శక్తిని రెండు చేతులతో పట్టి పైకి లాగివైచెను. రాముడు ఆ శక్తిని పైకి లాగుచుండగా బలశాలియైన రావణుడు అతని అన్ని అవయవములయందు, మర్మస్థానములను భేదించు శరములను ప్రయోగించెను. …… రావణుడి గుఱ్రములను రాముడు కొట్టెను. రాముడి గుఱ్ఱములను రావణుడు కొట్టెను. ఈ విధముగా వారిద్దరూ ఒకరు చేసిన దానిని మరొకరు అనుకరించి చేయుచూ కోపముతో గొప్ప యుద్ధము చేసిరి.’

చివరకు సారథి మాతలి గుర్తుచేయగా బ్రహ్మాస్త్రము ప్రయోగించి రావణుడిని హతమార్చాడు. రావణుడిని చంపిన అనంతరం రాముడు జయనినాదం చేశాడు. ఒక చేత్తో ధనుస్సును, మరో చేత్తో బాణాణ్ని పట్టి తిప్పుతూ రక్తంతో ఎరుపెక్కిన శరీరంతో నిలుచున్నాడు. ఇద్దరు సమస్కంధుల మధ్య భీకరమైన పోరాటం జరిగిన తీరు ఇది. రాముడు గెలిచిన తీరు ఇది. ఇదంతా మాయా మర్మంతో జరిగిన పోరాటం కాదు. యుద్ధంలో ఆయన శరీరం గాయపడింది.. నువ్వానేనా అన్న స్థాయిలో యుద్ధం చేశాకే రాముడు గెలిచాడు. అందుకే ఆయన లోకనాయకుడయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here