[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
[dropcap]రా[/dropcap]మాయణంలోని వాస్తవ విషయాలన్నీ మరుగున పడేసి.. వాటి గురించి చర్చే రాకుండా చేసి.. ఈ దేశంలో బలంగా వేళ్లూనుకొని పోయిన వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడానికి పూనుకొన్న శక్తులు.. రాముడిని విలన్‌ను చేయడానికి దశాబ్దాలుగా.. అదే పనిగా కూటనీతిని ప్రయోగిస్తూనే వచ్చాయి. వస్తున్నాయి. వీళ్లు రాజకీయాల్లో తొలి మెట్టు ఎక్కడానికి రాముడిని తిట్టాలి. రాజకీయాల్లో ఎదగడానికి రాముడి వ్యక్తిత్వాన్ని అంతం చేయాలి. రాముడిని ఎవరైనా పొరపాటున సపోర్ట్ చేశారంటే.. ‘మీరు రామ భక్తులు’ అని ఒక ట్యాగ్‌లైన్ తగిలించి ఇగ్నోర్ చేయాలి. రాముడిని తిట్టేవారికి (వాస్తవంగా రాముడిని ఆరాధించేవారికి కూడా) వాల్మీకి రామాయణం ఏమిటో తెలియదు. అసలు రామాయణం చరిత్రే తెలియదు. ఎవడో ఏదో చెప్పినదాన్ని పట్టుకొని వేలాడుతూ.. అడ్డగోలుగా, నోటికి వచ్చినట్టుగా తిట్టేస్తుంటారు. వీళ్ల లక్ష్యం ఒక్కటే. రాముడిని ఈ దేశచరిత్ర నుంచి శాశ్వతంగా చెరిపేయాలి. ఈ పని బ్రిటిషోడి కాలంలోనే మొదలైంది. వారి వారసుడుగా నెహ్రూ అండ్ కో కంటిన్యూ చేసింది. ఇప్పుడు కన్సాలిడేట్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసేవాళ్లు అందిపుచ్చుకున్నారు. వాళ్లకు సోషల్ మీడియా అన్న ప్లాట్‌ఫామ్ దొరికింది. రాముడిని దూషించటం రాజకీయపుటెదుగుదలకు రాచబాట అన్న అభిప్రాయం ప్రస్తుతం అటు రాజకీయాలో, ఇటు సాహిత్యంలో, సామాజికజీవనంలో నెలకొనివుంది. ఆశ్చర్యమేస్తుంది, ఈ సంస్కారం గురించి, ఈ ప్రవర్తనల గురించి . కొన్ని కోట్ల మంది కొన్ని వేల ఏండ్లుగా ఆరాధిస్తున్న ఒక మహాపురుషుడి గురించి.. ఆయన వ్యక్తిత్వాన్ని నిర్హేతుకంగా వ్యక్తిగత స్వార్ధంకోసం హననం చేస్తుంటే.. అదో గొప్ప అన్నట్టు విరగబడి సమర్ధించటం, కళ్ళు తెరిచేలోగా అలాంటివాళ్ళు సెలెబ్రిటీలయి ఆదర్శమయిపోవటం అత్యంత బాధాకరం, శోచనీయం, గర్హనీయం కూడా.
ఈ దేశంలో దురదృష్టమేమిటంటే.. కొందరికి మాత్రమే జీవించే హక్కు ఉంటుంది. కొందరికి మాత్రమే స్వేచ్ఛగా భావ ప్రకటన వ్యక్తంచేసే హక్కు ఉంటుంది. కొందరికి మాత్రమే దేవుడినో, దేవుడి కొడుకునో.. గురువునో, శిష్యుడినో, మతాన్నో, మతాచార్యుడినో, వారి బోధనలనో, భావజాలాన్నో విశ్వసించే హక్కు ఉంటుంది. మిగతావారు ఏది మాట్లాడినా అది తప్పే. విశ్వసిస్తే అది మూఢమే, మాట్లాడితే.. అది మనోభావాలను దెబ్బతీయడమే. గ‘మ్మత్తైన’ సమాజమిది.
ఇంతకీ ఈ దేశానికి, సమాజానికి, జాతికి రాముడు చేసిన ద్రోహం ఏమిటి? అర్థం కాదు. వీళ్లకు సింపుల్‌గా కనిపించేది ఉత్తరకాండ.. అందులోనూ.. సీతను అడవుల్లో వదిలేయటం, శంబూకుడనేవాడిని చంపడం.. ఎవడో పనికిమాలినవాడు.. వాల్మీకికి ఆపాదించి ఇన్‌కార్పొరేట్ చేసిన ఈ భాగాన్ని మన గొప్ప గొప్ప పండితులు నెత్తిన పెట్టుకోవడం వల్లనే రాముడి వ్యక్తిత్వ హననానికి అవకాశం ఏర్పడింది. ఇందుకు సంబంధించి ఇంతకుముందే చర్చించుకొన్నాం కాబట్టి.. ఇక్కడ వివరించుకోవాల్సిన పనిలేదు. కాసేపు రాముడి గురించే మాట్లాడుకొందాం. రాముడు ఈ దేశానికి చేసింది మేలా? కీడా? రాముడిని తిట్టేవాళ్లంతా మూకుమ్మడిగా ఒక్కసారి.. ఒకే ఒక్కసారి వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా చదవండి. మళ్లీ చెప్తున్నా.. యథాతథంగా వాల్మీకి రామాయణాన్ని బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు చదవండి. సంస్కృతం వస్తే సంతోషం. మన భాషలో చెప్పాలంటే ప్రతిపదార్థ తాత్పర్యంతో.. యథాతథంగా చేసిన అనువాదాలు దొరికినా చదవండి. రామాయణం గురించి మాట్లాడినా, తిట్టాలనిపించినా ఆ తరువాత చేయొచ్చు. అదేదీ చదువకుండా.. మాట్లాడటాలు.. మాట్లాడుకోవడాల వల్ల ఉపయోగం లేదు.
రామాయణంలో రాముడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే.. విస్తారంగా చర్చించుకోవాలి. అందుకు రామాయణంపై పూర్తి అవగాహన కలగాలి. రాముడు అయోధ్యను వదిలి వనవాసానికి బయలుదేరినది మొదలుగా భిన్నమైన జీవన విధానాలతో కూడుకొని ఉన్న అనేక సమాజాలు కలిగిన ఈ దేశాన్ని ఏకత్రితం (ఇంటిగ్రేట్) చేసుకుంటూ వెళ్లాడు. అయోధ్యనుంచి అడవికి బయలుదేరిన రాముడు నిషాదుడైన గుహుడి ఇంటికి వచ్చాడు. అక్కడ ఆయన పరివారంతో హాయిగా గడిపాడు. రోజంతా కబుర్లు చెప్పుకున్నారు. అక్కడే భోజనం చేశాడు. రాత్రి అక్కడే పడుకున్నారు. లక్ష్మణుడు గుహుడితో తన బాధను పంచుకొన్నాడు. గుహుడు తన కష్టసుఖాలను చెప్పుకొన్నాడు. తరువాత అడవిలోని జనస్థానాల్లో పర్యటించాడు. చిత్రకూటంపై ఉన్నప్పుడైనా.. పంచవటికి చేరుకున్నాక అయినా.. అక్కడి జనస్థానాల్లోని ప్రజలతో మమేకమై జీవించాడు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొన్నాడు. వారిని కష్టపెడుతున్న రాక్షసులను అంతం చేశాడు. ఈ ప్రస్థానంలో ఎక్కడ కూడా కులాలు, జాతుల ప్రస్తావన రానేలేదు. సుతీక్ష్ణుడు ఫలానాచోట గొప్ప తాపసి ఉన్నదని చెప్పిన మీదట రాముడు శబరి దగ్గరకు వెళ్లి ఆమె ఆతిథ్యం స్వీకరించాడు. భేషజాలకు పోలేదు. నువ్వెందుకు తపస్సు చేస్తున్నావని అడుగలేదు. ఆమె బాగోగులు కనుక్కున్నాడు. జటాయువు తనవెంటే ఉంటానని చెప్తే.. తమతోపాటు ఉండటానికి రామలక్ష్మణులు స్వయంగా తమ పర్ణశాలతో పాటు జటాయువుకూ నిర్మించారు. ఆ జటాయువే.. రావణుడి రథాన్ని, సారథిని, గుర్రాలను చంపి సీతను రక్షించడానికి ప్రయత్నించాడు. కిష్కింధలో వాలిని చంపిన తర్వాత తానేమీ రాజ్యాధికారం చేపట్టలేదు. రాజ్యంలో అశాంతి రాకుండా సుగ్రీవుడికే పట్టాభిషేకం చేశాడు. గోలాంగూలాలు, భల్లూకాల జాతులతో స్నేహంచేశాడు. రావణ వధ తర్వాత విభీషణుడికే రాజ్యం అప్పగించాడు తప్ప తాను అధికారాన్ని గ్రహించలేదు. అటు ఉత్తరం వైపు శతృఘ్నుడు, ఇటు వాయవ్యంవైపు భరతుడు, దక్షిణం వైపు రామలక్ష్మణులు వెళ్లి యావత్ భారతజాతిని ఏకంచేశారు. చివరకు తన రాజ్యాభిషేకం జరిగినప్పుడు వీళ్లందరినీ పిలిచి.. ఆప్యాయంగా ఆతిథ్యమిచ్చి.. ఆదరించి, సత్కరించి, గౌరవించి పంపించాడు. ప్రజలందరూ నేడు పిలుచుకొనే భారతీయ జాతిగానే నాటి సమాజం విలసిల్లింది. నువ్వు ఏ వర్ణం? ఎవరికి పుట్టావు? ఏం చేస్తున్నావు అని రాముడు ఎవరినీ అడుగలేదు. అందరి పట్లా ఒకేవిధంగా వ్యవహరించాడు కాబట్టే.. రాముడి రాజ్యం ఇవాళ్టికీ కావాలని అంతా కోరుకునేది. అగస్త్యుడు, అనసూయ, అత్రి, వసిష్ఠుడు.. వీళ్లంతా ఎవరికి పుట్టారనే చర్చ రామాయణంలో కానీ మరెక్కడా కానీ జరుగలేదు. ఏ దశలో కూడా.. పుట్టుక అన్నది భారతీయ ధర్మానికి మౌలిక సూత్రం కాలేదు. కాదు కూడా. ఉన్నతంగా ఎదిగిన మహాపురుషులందరినీ ఈ జాతి పూజించింది. పూజిస్తూ వచ్చింది. రాముడు చేసిందీ అదే. రాముడి ప్రస్థానంలో.. సమగ్రమైన భారతదేశం ఆవిష్కారమైంది. రకరకాల జాతులను, ఆచార వ్యవహారాలు, సంస్కృతి కలవాళ్లను, భాషను మాట్లాడేవాళ్లను సక్రమంగా ఒకరినొకరిని కలుపుకుంటూ ఆసేతు శీతాచలం పాదయాత్ర చేసిన రాముడు ఆరాధ్యుడు కాదా? ఆదర్శం కాదా?
దీన్ని కన్వీనియంట్‌గా ఇగ్నోర్ చేసి.. అదే పనిగా నిందలు మోపే దౌర్భాగ్యమైన సమాజం ఈ దేశంలో తయారైంది. ఈ దేశంలో పీడిత వర్గాలు, అణగారిన వర్గాలు అనేవి తయారుకావడానికి కారణం ఇప్పుడున్న పరిపాలనా వ్యవస్థా? రాముడా? ఈ వ్యవస్థ బ్రిటిష్ వాడినుంచి స్వతంత్రమైన తొలినాటినుంచి అనుసరించిన విధానం ఏమిటి? ఆదర్శంగా తీసుకొన్నది అశోకుడినే కదా.. వేలమంది కుటుంబ సభ్యులను, లక్షమంది కళింగులను దారుణంగా ఊచకోత కోసి.. లక్షన్నరమందిని బందీలను చేసి.. బౌద్ధం స్వీకరించిన అశోకుడినే కదా. ఆ అశోకుడి ధర్మచక్రం, నాలుగు సింహాలే కదా ఈ వ్యవస్థకు చిహ్నాలు. తొలి దశాబ్దం అంతా ఇదే వ్యవస్థ బౌద్ధానికే కదా పెద్దపీట వేసింది! మరి ఈ దేశంలో ఎన్‌కౌంటర్లు జరగడానికి బౌద్ధాశోకుడు ఆదర్శమా? చండాశోకుడు ఆదర్శమా? స్త్రీలను చెరపట్టినందుకు రాముడు వాలిని, రావణుడిని చంపాడు. పబ్లిక్‌లైఫ్ లోకి వెళ్లడానికి ముందు భార్యకు అగ్నిపరీక్ష పెట్టాడు. మరి ఈ దేశంలో రాముడినే ఆదర్శంగా తీసుకొన్నట్టయితే ఇవాళ నిర్భయ చట్టాలు, దిశ చట్టాలు ఎందుకు వస్తాయి. నలుగురు భార్యలను చేసుకొని.. భార్యను హింసించి చంపిన అశోకుడు ఆదర్శం కాకపోతే! ఎవరు జాతి నిర్మాత? ఎవరు విధ్వంసకర్త? ఎవరిని నిందించాలి? ఎవరిని ఓన్ చేసుకోవాలి? ఈ దేశంలో కమ్యూనిస్టులు, సంఘీయులు, గాంధేయవాదులు కోరుకుంటున్న సమసమాజం రావాలంటే.. కచ్చితంగా ఓ రాముడు మళ్లీ రావాల్సిందే. అశోకుడు కాదు.