[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
అభారతీయం 3
“ధృతి మన్నించి పరాయివాడు తన దారిం దాను పోగా, సము
న్నతి స్వాతంత్ర్యము వచ్చిపడ్డ దనుకొన్నన్ వానిదే పిచ్చి సం
గతికాండ్రై పొరుపింతలేక నలతన్ కల్లోలముల్‌గా, ప్రచం
డ తరంగార్ణవమెల్ల జేసికొనకుండం జూచుకోగావలెన్.”
(విశ్వనాథ సత్యనారాయణ, ‘కేదారగౌళ’ (1947) ఖండకావ్యం)
[dropcap]మీ[/dropcap]రు ఎవరైనా చెప్పగలరా? మనకు స్వాతంత్ర్యం ఎట్లా వచ్చిందో? కొద్దిసేపు క్విజ్ అనుకుందాం? స్వాతంత్ర్యం మహాత్మా గాంధీ సత్యాగ్రహం వల్ల వచ్చిందా? లేక సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్‌ఫౌజ్ వల్ల వచ్చిందా? ఇంకాస్త వెనుకకు పోతే వందేమాతరం ఉద్యమమో.. క్విట్ ఇండియానో.. లేక మరొకటో….? దేనివల్ల స్వాతంత్ర్యం వచ్చింది?
ఇవేవీ కావంటున్నాడు ఓ పెద్దమనిషి. మనల్ని వదిలేసి వెళ్లిపోయిన దేశం నుంచి.. వెళ్లిపోయిన పదమూడేండ్ల తర్వాత వచ్చి.. తాము ఈ దేశాన్ని ఎందుకు ఎలా విడిచిపెట్టామో కుండబద్దలు కొట్టాడు. 1958లో మనదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ కన్నుమూశారు. ఆ తర్వాత ఏడాదికి ఆజాద్ స్మారకోపన్యాస పరంపర మొదలైంది. 1959లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆజాద్ తొలి స్మారకోపన్యాసం చేశారు. 1960లో రెండో స్మారకోపన్యాసానికి ఇంగ్లండ్ నుంచి అర్నాల్డ్ టాయన్ బీ అనే ఆయనను పిలిచారు. అయ్యా ఏ విషయంపై మాట్లాడమంటారు అని ఆయన ముందే నిర్వాహకులను అడిగాడు. వాళ్లకు ఏం చెప్పాలో తోచక.. మీకేది తోస్తే అది మాట్లాడేయండి.. అని అన్నారు. ఇంకేం ఆయన రెచ్చిపోయాడు. ఆయన ఎంచుకున్న విషయం ‘వన్ వరల్డ్ అండ్ ఇండియా’. తెలుగులో తర్జుమా చేస్తే ‘ఒక ప్రపంచము.. ఇండియా’ అని అనుకోవచ్చు. ఈ ప్రసంగంలో ఆయన భారతీయులకు తాము స్వాతంత్ర్యం ఎలా ఇచ్చారో చాలా అద్భుతంగా సెలవిచ్చారు. ఈ ప్రసంగాన్ని జాతీయ పుస్తక సంస్థ వారు ఆ తర్వాత ప్రచురించారు. వివిధ భాషల్లోకి అనువదించి మరీ ప్రచురించారు. సరే.. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం.
‘నా ప్రసంగంలో ఆధునిక పాశ్చాత్య ఔదార్యవాదము (లిబరలిజం) ప్రసక్తి తెచ్చాను. పాశ్చాత్య దేశాలు ఆధునిక ప్రపంచానికి పెట్టిన భిక్ష ఇది. పాశ్చాత్య దేశాలు దీనిని తమ గర్వకారణముగా చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. అలా భావించడం సమంజసం కూడా. ఈ ఔదార్యవాదము వల్ల కొన్ని ఉత్తమమైన పనులు జరిగాయి. ఉదాహరణకు నా దేశీయులు భారతదేశంపై తమ పరిపాలనాధిపత్యాన్ని వదులుకొని భారత ప్రభుత్వ యంత్రాంగాన్ని భారత ప్రజలు ఎన్నుకొన్న నాయకుల ఆధీనంచేసి తరలిపోవడమనేది ఔదార్యవాదము యొక్క పర్యవసానమే. ఏ నాయకులకు తాము ప్రభుత్వాన్ని అప్పగింత పెట్టారో.. వారినే ఒకప్పుడు కారాగారాలలో బంధించారు. తిరిగి వారికే అధికారమార్పిడి జరిగింది. పాశ్చాత్య ఔదార్యవాదం యొక్క ఈ పర్యవసానానికి నేను మిక్కిలి గర్విస్తున్నాను. మన ఉభయదేశాల మధ్య బెడిసిన సంబంధాలు తుదకు ఇలా చక్కబడటమనేది ఒకవంక పాశ్యాత ఔదార్య ఫలితం కాగా, మరోవంక పగవానిని కూడా ద్వేషించనట్టి భారతీయుల క్షమాబుద్ధి ఫలితంగానూ సంభవించింది. ఈ క్షమాబుద్ధిని మహాత్మాగాంధీ కడు సందిగ్ధకాలంలో మనసావాచా కర్మణా అభివ్యక్తీకరించారు. మా ఔదార్యవాదం భారతదేశ గాంధీతత్వంతో శ్రుతి కలిపింది. అంతేకాదు.. మీరు మీ రాజకీయ స్వాతంత్ర్యం పొందిన పిమ్మట మీ దేశ పరిపాలన నిమిత్తం పాశ్యాత్య విధానపు పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిపాలనా వ్యవస్థను స్వీకరించవలెనన్న నిర్ణయం గైకొని తద్వారా పాశ్చాత్య ఔదార్యవాదంపై మీకుగల ఆదరాభిమానాలను వ్యక్తంచేశారు. ఇదికూడా పాశ్చాత్య ఔదార్యవాద ఫలితమే.’
ఇప్పుడు అర్థమైందా? మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో.. పాశ్చాత్యులు.. బ్రిటిష్ వారు ఎంతో ఔదార్యంతో.. జాలితో.. దయతలచి మనల్ని వదిలేసి వెళ్లిపోయారన్నమాట. అంతేనా.. అధికార మార్పిడి విషయంలోనూ ఏలినవారు ఎంతో ఔదార్యం చూపించారు. ధర్నాల పేరుతో, ఆందోళనల పేరుతో రోడ్ల మీదికి వచ్చినోళ్లను వచ్చినట్టు జైల్లో పెట్టాం కదా.. పాపం చాలా కష్టపెట్టాం.. వారికే అధికారం ఇస్తే పోలే.. అనుకున్నారట.. తాము జైళ్లలో పెట్టినవారికే తిరిగి అధికారం అప్పగించడం తమ గొప్పతనమని సగర్వంగా చాటుకున్నాడు. మరి ఇంతకాలం మనం అనుకుంటున్న, పుస్తకాల్లో, పాఠాల్లో చదువుకుంటున్నట్టు గాంధీ ఉద్యమాలు ఏమైనాయి.. నేతాజీ పోరాటాలు ఏమైనాయి.. అంతా ఉత్తిదేనా? బ్రిటిష్ వాళ్లకు బోరు కొట్టి.. ఇక్కడి నుంచి మనకు వచ్చేదేం లేదు.. వీళ్లకు దక్కేదేం లేదని డిసైడ్ అయిపోయి మనమీద జాలిపడి వదిలేసి వెళ్లారన్నమాట.
అక్కడితో ఆగాడా ఈ మహానుభావుడు..
ఈ దేశం పరిపాలన కోసం వాళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను స్వీకరించడం కూడా వారి ఔదార్యమేనంట. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పదమూడేండ్ల తర్వాత ఎవడో ఒకడు ఈ దేశానికి వచ్చి (అలాంటి వాడిని పిలవడమే మన వాళ్ల దౌర్భాగ్యం) మీరు స్వాతంత్ర్యోద్యమం పేరుతో మీరు చేసిందేమీ లేదు. మేం ఉండాలనుకున్నంతకాలం ఉన్నాం.. వెళ్లిపోవాలనుకొని వెళ్లిపోవాలనుకున్నాం.. పైగా మేం ఏ పద్ధతి ప్రకారం పాలించామో.. దాన్నే మీరు స్వీకరించేలా చేయడం కూడా మా గొప్పతనమేనని సగర్వంగా చాటుతున్నానని చెప్తుంటే.. మనం చప్పట్లు కొట్టి.. జయజయ ధ్వానాలు చేసి సన్మానించి.. సత్కరించి సకల మర్యాదలు చేసి పంపించాం. అంతటితో ఆగామా? అద్భుత ప్రసంగం అంటూ దాన్ని దేశభాషలన్నింటిలో అనువాదం చేసి మరీ పంచిపెట్టాం. అంటే సదరు అర్నాల్డ్ చెప్పినట్లు వాళ్ల దయాదాక్షిణ్యాలపైనే స్వాతంత్రం అనేది తెచ్చుకొన్నామా? మన సత్యాగ్రహాలు, అహింసోద్యమాలన్నీ విఫలమయ్యాయని అంగీకరించినట్లే కదా! అలాంటప్పుడు ఎక్కడపడితే అక్కడ గాంధీ, నెహ్రూ ఫొటోలు, విగ్రహాలు పెట్టడం దేనికో.. చక్కగా బ్రిటిష్ రాణీవారి విగ్రహాలు, ఫొటోలు పెట్టుకొని – అమ్మా మీ ఎనలేని ఔదార్యం వల్ల ఇంతకాలం జైల్లో మగ్గిన మేము ఇవాళ పాలకులమైనాము.. స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామని ఆరాధించవచ్చుకదా..
స్వాతంత్ర్యం ఇచ్చినప్పటికీ.. మీరు సొంతంగా బతుకుతున్నదేమీ లేదని అర్నాల్డ్ తేల్చి చెప్పాడు. నిజానికి జరిగిందీ.. ఇవాళ్టికి జరుగుతున్నదీ అదే.
‘సైమన్ గో బ్యాక్’ అన్న నినాదం చాలామందికి గుర్తుండే ఉంటుంది. దేశంలో పరిపాలనా సంస్కరణలు తీసుకొని రావడానికి జాన్ సైమన్ నేతృత్వంలో ఒక కమిటీ ఈ దేశానికి వచ్చింది. ఇందులో ఏడుగురు బ్రిటిష్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. మనదేశానికి చెందిన ఏ ఒక్క నాయకుడికీ ఈ కమిటీలో చోటివ్వలేదు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. మనదేశంలో సంస్కరణలు అంటూ.. మనదేశానికి సంబంధించిన వారు లేకుండా కమిటీ వేయడమేమిటని ‘సైమన్ గో బ్యాక్’ అంటూ నినాదమిచ్చారు. ఇది 1928 నాటి ముచ్చట. ‘గుండుకెదురుగా గుండె నిలిపెను..ఆంధ్రకేసరి టంగుటూరి’ అని ప్రకాశం పంతులుగారి గురించి పాటలు పాడుకున్నది ఈ సైమన్ గో బ్యాక్ సందర్భంలోనే.. ఈ సందర్భంలోనే లాహోర్‌లో లాలా లజపతిరాయ్ పోలీసుల లాఠీదెబ్బలు తిని ఆ గాయాలతోనే కన్నుమూశారు. లార్డ్ బెర్కెన్‌హెడ్ అప్పుడు భారత వ్యవహారాలుచూసే బ్రిటిష్ మంత్రిగా ఉన్నాడు. భారతనేతలకు నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకొనివచ్చే సామర్థ్యం లేదని అని అతని అభిప్రాయం. అందుకే అతను సైమన్ కమిషన్‌ను పంపించాడు. ఈ కమిషన్‌లో క్లెమెంట్ అట్లీ కూడా సభ్యుడే. ఇతనే 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేనాటికి, దేశాన్ని విభజించేనాటికి బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. సైమన్‌ను కాంగ్రెస్ వాళ్లు పూర్తిగా వ్యతిరేకించలేదు. డాక్టర్ అంబేద్కర్ స్వాగతించాడు. తాను కొన్ని ప్రతిపాదనలతో ఒక నివేదికను సమర్పించాడు. ముస్లింలీగ్‌లో జిన్నా వ్యతిరేకించినప్పటికీ, ఆ పార్టీలోనే ఒక వర్గం సమర్ధించింది. దక్షిణాన జస్టిస్ పార్టీ సైమన్ కమిషన్‌ను స్వాగతించింది. ఏమైతేనేం సదరు సైమన్ దొరవారి సిఫార్సుల ప్రకారమే 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. అందులో భాగంగానే ద్వంద్వ పరిపాలనా వ్యవస్థ వచ్చింది.
ఈ చట్టం ప్రకారమే 1937లో వివిధ ప్రావిన్సుల్లో ఎన్నికలు జరిగాయి. సహజంగానే కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రావిన్సుల్లో ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. ఒక దేశంలో పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తున్నప్పుడు.. ఆ దేశానికి సంబంధించిన భౌగోళిక, చారిత్రక, సాంసృ్కతిక, సామాజిక, రాజకీయ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దానికి తగినట్టుగా ఆ సంస్కరణలు తీసుకొని వస్తేనే అవి విజయవంతమవుతాయి. కానీ కాంగ్రెస్ నాయకులకు అప్పుడు ఇవేమీ పట్టలేదు. చిన్నదో.. పెద్దదో.. ఏదోరకంగా తమకు అధికారం లభించిందనే భావించారు. 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం (సైమన్ కమిషన్ కారణంగా ఏర్పాటైన చట్టం) లోని అనేకానేక అంశాలు ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగమని మనం చెప్పుకొనే.. అనుసరించే భారత రాజ్యాంగంలోని చాలా విభాగాల్లో అంతర్భాగమైన సంగతి! ఏ సైమన్‌ను మనం గో బ్యాక్ అన్నామో.. ఆ సైమన్ చేసిన చట్టంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకేనేమో.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాన్ని ఇప్పటికీ యథాతథంగా పాటిస్తూనే ఉన్నాం. పాఠాల్లో మాత్రం గుండుకెదురుగా గుండె నిలిపెనంటూ పాటలు పాడుకుంటున్నాం. ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే , ఆనాటి వారి త్యాగాలు, పోరాటాలూ వారు వ్యతిరేకించి ప్రాణాలర్పించిన సైమన్ కమీషన్ సిఫార్సులను తరువాత అమలుచేయటంకోసమేనా అన్న బాధ కలుగుతుంది.
1937 ఎన్నికల తర్వాత దాదాపుగా జాతీయోద్యమం బలహీనపడుతూ వచ్చింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ చేసిన చివరి ఉద్యమం. అనంతరం మరో ఐదేండ్లు బ్రిటిష్‌వాళ్లు హాయిగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి దేశానికి స్వాతంత్య్రం ఇస్తామని ప్రకటించారు. క్విట్ ఇండియా ఉద్యమం అంతగా బలంగా ప్రభావం చూపి ఉంటే 1942లోనే ఇచ్చిపోయేవారు కదా.. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్యమాలే చేయలేదు. జిన్నా, నెహ్రూ ఆధిపత్యపోరులోనే పూర్తిగా సతమతమైపోయింది. క్లెమెంట్ అట్లీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత సడన్‌గా స్వాతంత్య్రం ఇచ్చేసి వెళ్లిపోయాడు.. ఇది ఎట్లా సాధ్యమైంది? ఈ పరిణామాలను దేశంలోని తర్వాతి తరాలకు చెప్పాల్సిన బాధ్యత సోకాల్డ్ హిస్టారియన్లకు అనిపించలేదా? సమకాలంలో చోటుచేసుకున్న సంఘటలను చరిత్ర అంటామా? లేక మనం ఏది రాస్తే.. ఏది చెప్తే దాన్ని చరిత్ర అంటామా? మనమేమో మహాత్మాగాంధీ, నెహ్రూల అహింసా ఉద్యమం వల్ల బ్రిటిష్‌వాళ్లు బెదిరిపోయి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లిపోయారని గొప్పలు చెప్పుకుంటూ.. పంద్రాగస్టునాడు వాళ్ల బొమ్మలకు దండలు వేస్తూ దండాలు పెడుతున్నాం. మంచిదే. మహానుభావులను స్మరించుకోవాల్సిందే.
1945లో బ్రిటిష్ ప్రధానమంత్రిగా క్లెమెంట్ అట్లీ అయ్యాడు. 1946లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని హౌస్ ఆఫ్ కామన్స్‌లో తమ ప్రభుత్వ విధానాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత మన నాయకులు అధికారం కోసం కొట్టుకోవడం.. దేశ విభజన జరగటం అదో పెద్ద కథ. ఇంతకీ దేశానికి స్వాతంత్ర్యం ఈ అహింసాఉద్యమం వల్లనే వచ్చిందా? అన్నదానిపై ఇప్పటిదాకా పెద్ద చర్చే జరిగింది. అందరూ రాసిందే.. చెప్పిందే. కానీ మన చరిత్రకారులు ఈ నిజాల్ని ఏడున్నర దశాబ్దాలుగా అంగీకరించలేదు. మన పాలకులు వాస్తవాలను చెప్పనివ్వడంలేదు. పదే పదే.. పదే పదే.. పదే పదే.. ఒకే కథను వినిపిస్తూ.. చదివిస్తూ.. ఇదే నిజమని తరాలకొద్దీ ఉపదేశాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవాలు అనేక వైపులనుంచి చెవులను ఊదరగొడుతున్నా ఉఫ్ అని ఊదేస్తున్నారే తప్ప చెవులకు ఎక్కనివ్వడంలేదు. గాంధీ వల్ల వచ్చిందంటారు.. నేతాజీ వల్ల వచ్చిందంటారు.. నెహ్రూ ఆధునిక భారత నిర్మాత అంటారు. ఇంతకీ ఏది నిజం?
దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన తర్వాత క్లెమెంట్ అట్లీ కలకత్తాకు 1956లో బెంగాల్ గవర్నర్ అతిథిగా వచ్చాడు. ఓ రెండురోజులు అక్కడే ఉన్నాడు. అప్పుడు బెంగాల్ తాత్కాలిక గవర్నర్‌గా చీఫ్ జస్టిస్ పీబీ చక్రవర్తి వ్యవహరిస్తున్నారు. మిలటరీ చరిత్రకారుడు జనరల్ జీడీ బక్షీ తన గ్రంథంలో పీబీ చక్రవర్తికి, క్లెమెంట్ అట్లీకి మధ్య జరిగిన సంభాషణను యథాతథంగా కోట్ చేశారు. పీబీ చక్రవర్తి.. తనకు, అట్లీకి మధ్య జరిగిన సంభాషణను యథాతథంగా ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్సీ మజుందార్‌కు రాశారు.
“When I was acting Governor, Lord Attlee, who had given us independence by withdrawing British rule from India, spent two days in the Governor’s palace at Calcutta during his tour of India. At that time I had a prolonged discussion with him regarding the real factors that had led the British to quit India.”
Chakraborthy adds, “My direct question to Attlee was that since Gandhi’s Quit India movement had tapered off quite some time ago and in 1947 no such new compelling situation had arisen that would necessitate a hasty British departure, why did they had to leave?”
“In his reply Attlee cited several reasons, the principal among them being the erosion of loyalty to the British crown among the Indian army and Navy personnel as a result of the military activities of Netaji,” Justice Chakraborthy says.
That’s not all. Chakraborthy adds, “Toward the end of our discussion I asked Attlee what was the extent of Gandhi’s influence upon the British decision to quit India. Hearing this question, Attlee’s lips became twisted in a sarcastic smile as he slowly chewed out the word, m-i-n-i-m-a-l!”
‘నేను బెంగాల్ తాత్కాలిక గవర్నర్‌గా ఉన్నప్పుడు క్లెమెంట్ అట్లీ వచ్చారు. రెండురోజులు గవర్నర్ అతిథిగా ఉన్నారు. కలకత్తా గవర్నర్ ప్యాలెస్‌లో అట్లీతో నేను చాలా విషయాలు మాట్లాడాను. బ్రిటిష్‌వారు భారతదేశాన్ని వదిలి వెళ్లటం వెనుక నిజమైన కారణాలు ఏమిటని ఆయనతో చర్చించాను. ‘గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం కొన్నేండ్ల కిందటే ఆగిపోయింది కదా.. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపేంత ఉద్యమాలు ఏం జరగలేదు. మరి బ్రిటిష్‌వాళ్లు భారత్‌ను వదిలి వెళ్లటానికి కారణమేమిటి?’ అని నేరుగానే అట్లీని ప్రశ్నించాను. దీనిపై జనరల్ అట్లీ చాలా కారణాలే చెప్పారు. అందులో ప్రధానమైంది.. సుభాష్ చంద్రబోస్ సైనిక కార్యకలాపాల వల్ల భారత ఆర్మీలో, నావికాదళంలో బ్రిటిష్ సామ్రాజ్యం పట్ల విధేయత బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితి రోజురోజుకూ పెరుగుతున్నది. అందువల్ల ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది అని అట్లీ చెప్పారు. మరి బ్రిటిష్ వాళ్ల ఈ నిర్ణయం (భారత్‌ను వదిలి వెళ్లాలనే) వెనుక గాంధీ ప్రభావం ఏమీ లేదంటారా అని అడిగాను. దానికి అట్లీ ‘ప్చ్’ అని పెదాలను చప్పరిస్తూ.. విచిత్రంగా ఒక నవ్వు నవ్వుతూ.. ‘చా..లా.. త.. క్కు..వ’ (మినిమల్) అని అన్నారు.’
ఇది జస్టిస్ పీబీ చక్రవర్తితో మన దేశానికి స్వాతంత్య్రాన్ని సమర్పించిన వ్యక్తి స్వయంగా అన్నమాటలు.
మనం ఎవర్ని మోసం చేస్తున్నాం. మనల్ని మనమే మోసగించుకుంటున్నాం.
ఒక పక్క బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో లాయల్టీ తగ్గిపోతుంటే.. మరోపక్క అధికారంకోసం బ్రిటిష్ పాలకుల పట్ల లాయల్టీ మన నేతల్లో పెరుగుతూ పోయింది. అందుకే వాడు మతపరంగా దేశాన్ని విభజిస్తామన్నా.. సంస్థానాలకు ఏ దేశంలో చేరాలో స్వేచ్ఛనిచ్చినా.. ప్రభువుల ఆదేశాలను యథాతథంగా పాటిస్తూ వచ్చాం. వాడి చట్టాన్ని అమలుచేసుకున్నాం.. వాడి పరిపాలనా వ్యవస్థను స్వీకరించాం. స్వాతంత్ర్యానికి ముందుకానీ, ఆ తరువాత కానీ మన పాలకులు స్వతంత్రంగా ఆలోచించింది లేదు.. పాలించింది లేదు. ఇది మీ చరిత్ర అంటే అదే రాసుకున్నాం. ఇవి మీ చట్టాలు అంటే అవే పాటించాం. మీకేం చేతకాదు.. ఇలా పాలించుకొండి అంటే అలా పాలించుకున్నాం. కుంటున్నాం. కేవలం రాజకీయం చేయడం తప్ప మనవాళ్లు స్వతంత్రంగా చేసిందేమీ లేదు. ఇందుకోసం కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా మన మూలాలను మనం నరుక్కోవడానికి కూడా వెనుకాడలేదు. మరి.. ముందుగా అర్నాల్డ్ టాయన్‌బీ చెప్పిన మాటలు వాస్తవమే కదా. వారి ఔదార్య వాదానికి మనం మోకరిల్లినట్లే కదా…
బ్రిటీష్ వాడి ముందు మోకరిల్లటానికి, మనం స్వాతంత్ర్యం సాధించిన తరువాత అంతకుముందు మనం వ్యతిరేకించిన వాటినే మనం సంతోషంగా స్వీకరించటానికి, రాముడికి సంబంధం ఏమిటనుకుంటున్నారా???
వుంది. ఇది రాబోయే వ్యాసాల్లో తెలుస్తుంది.
References:
- History of the Freedom Movement in India
- Bose – An Indian Samurai
- Main Currents of Indian History
- Military Architecture in Ancient India
- Nehru and Bose –Parallel Lives
Images Courtesy:
Swadhyaya Resource Centre and Internet