Site icon Sanchika

రామం భజే శ్యామలం-7

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

అభారతీయం- 4

[dropcap]ఒ[/dropcap]క ప్రశ్న. కొన్నేండ్లుగా నాకు జవాబు దొరకని ప్రశ్న. మహమ్మదీయులు ఈ దేశంపై దండెత్తడానికి ముందు (బ్రిటిష్ వాళ్లు ఆ తర్వాత వచ్చారు కానీ.. ) ప్రపంచంలో మూడొంతుల్లో ఒక వంతు సంపద భారతదేశంలో ఉండేదంటారు.  మూడువైపుల సముద్రం.. ఒకవైపు మంచుకొండలు.. గుప్తుల కాలం స్వర్ణయుగం..అంగట్లో రతనాలు అమ్మటం.. ..ఇలాంటివన్నీ చెవుల్లో ఊదరగొట్టారు. ఇది నిజమా? కాదా? నిజమే అయితే.. ఇంత సంపదను మొత్తానికి మొత్తంగా బ్రిటిష్‌వాడు దోచుకుపోయాడా? ముస్లింలంటే.. మొదట్లో ఒకరిద్దరు తప్ప.. అందరు ఇక్కడే సెటిలైపోయారు కదా.. వీళ్లేం దోచుకున్నా.. దాచుకున్నా.. ఇక్కడే ఉండాలి. బ్రిటిష్‌వాడు మొత్తంగా దోచుకొనిపోయి సున్నా చేస్తేనే.. ఇక్కడ పేదరికం తాండవిస్తున్నదా? పోనీ, కమ్యూనిస్టుల సిద్ధాంతం ప్రకారం ఏ కొద్దిమంది దగ్గరో సొమ్మంతా పోగుపడితే.. దాన్నంతా తెల్లవాడు ఎత్తుకొనిపోయాడా?..

ఛ..ఛ.. నీకు నాగరికతే లేదు. అసలు కల్చరే లేదు. ఇంక చరిత్ర ఎక్కడిది? సోకాల్డ్ మాక్సుముల్లర్ నాలుక మడత తిప్పకముందు చెప్పినట్టు ఎవరో.. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారే తప్ప ఈ దేశానికి అంత సీన్ లేదు అంటూ రోమిలాథాపర్, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్లు రాసిన చరిత్ర పుస్తకాల్లోదే నిజమా? అదే నిజమైతే.. ఘజ్‌నీ మహమ్మద్ అనేవాడు 17 సార్లు ఒకే ఒక్క గుడిమీద ఎందుకు దండెత్తాడు? ఊరికే పనిలేక.. తనకు ఏమీ తోచనప్పుడల్లా సరదాగా సోమ్‌నాథ్‌పై దాడిచేశాడా?

వీటిలో నిజమేమిటి? చరిత్రపుటల్లోకి తర్వాత పోవచ్చు. నా సందేహమల్లా ఒకటే. ఘజ్‌నీ మహమ్మద్ అనేవాడు డబ్బుకోసం ఒకే ఒక్క గుడిపై అన్నిసార్లు దాడిచేశాడంటే.. ఆ గుడిలో ఎంత సంపద ఉండవచ్చు. గుడితోపాటు ఆనాటి ఆ సమాజంలో ఎంత సంపత్తి పోగుపడి ఉండవచ్చు.. రాజు దగ్గర ఎంత ఉండవచ్చు. ప్రజల దగ్గర ఎంత ఉండవచ్చు. గుప్తుల కాలం స్వర్ణయుగం అంటే.. దేశంలో చాలాభాగాన్ని వాళ్లు పాలించారు కదా.. మరి వారి దేశంలో ఎంతో సంపద ఉండిఉంటే తప్ప స్వర్ణయుగం అనడానికి వీల్లేదే?  కేవలం సంపద మాత్రమే కాదు, ధర్మం నాలుగుపాదాలమీద నడవటం, ప్రతి ఒక్క వ్యక్తి సుఖ సంతోషాలతో వుండటం, ప్రజలకు కష్టం కలిగితే ఆ దోషం తనది అనుకునే రాజులు….ఒక అత్యద్భుతమయిన వ్యవస్థ…ఇంకా.. చాళుక్యులు, పల్లవులు, చోళులు, కాకతీయులు, రాజపుత్‌లు, శాతవాహనులు, మరాఠాలు.. ఇట్లా చాలా రాజరికాల గురించి చెప్పవచ్చు.  ఎంత సంపదవుంటే భారతదేశాన్ని రత్నగర్భ అంటారు? ఈరకంగా దేశంలోని చాలాచోట్ల సంపద పోగుపడింది కాబట్టే ఘజ్‌నీ మహమ్మద్ నుంచి ఎలిబెత్ దాకా ఉరుకురికి వచ్చారు. నీదగ్గర ఏమైనా ఉన్నదంటేనే కదా.. దొంగోడైనా వచ్చి దోచుకొనేది. నీ దగ్గర ఏ కాణీ కూడా లేనప్పుడు ఎవరైనా నీదగ్గరకు ఎందుకొస్తారు? అయో.. మీ దగ్గర ఏమీ లేదు.. మీకు బతకడమెట్లాగో చేతకాదు.. మేం వచ్చి మీకు ఎట్లా బతకాలో చెప్తాం.. అన్నం తినడం నేర్పిస్తాం.. ఆవకాయ రుచి చూపిస్తామని వచ్చారా తెల్లవాళ్లు? అర్నాల్డ్ టాయన్‌బీ చెప్పినట్టు ఇది కూడా పాశ్చాత్య ఔదార్యవాద ఫలితమేనా?

భారతదేశంలో అంతులేని సంపద పోగుపడి ఉన్నందువల్లే.. భారతీయ సమాజం అత్యంత సుసంపన్నంగా అన్ని రంగాల్లో వైభవంగా ఉన్నందువల్లనే పాశ్చాతపు దేశాల నుంచి దోపిడిమూకలు వచ్చి దాడులు చేశాయన్నది వాస్తవం.  ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సింది.. ఇక్కడ ఇంత సంపద ఉత్పత్తి ఎట్లా సాధ్యపడింది?  ఆనాటి రాజులకు బంగారం వెండి ఉట్టి పుణ్యానికి రోడ్లమీద దొరికిందా? లేక ఇక్కడి రాజులు ఘజ్‌నీ మహమ్మద్ లాగా వేరే దేశాలమీదకు దాడులు చేసి, దారిదోపిడీ చేసి ఈ సంపదనంతా తెచ్చి గుళ్లల్లో, ఇండ్లల్లో దాచుకున్నారా? లేకపోతే.. వీళ్లు నమ్మినట్టు ఉండే దేవుడు అప్పుడప్పుడు ఆకాశం నుంచి ఈ సొమ్మంతా కురిపిస్తూ వచ్చాడా? ఈ దేశంలో సంపద ఉత్పత్తి ఎట్లా సాధ్యమైంది?

ఏదైనా ఒక సమాజంలో ఒకవిధమైన సామాజిక, చారిత్రక సంస్కృతి ఉన్నప్పుడే నాగరికత వికసిస్తుంది. ఆ నాగరికత వికాసానికి దోహదపడే అంశాలు అనేకముంటాయి. ఊరకే ప్రజలకు ఏమీ పెట్టకుండా.. ప్రజలను అభివృద్ధి చేయకుండా.. డబ్బులన్నీ గుళ్లో తెచ్చి దాచిపెట్టుకుంటే.. ఆ ప్రజలు, సమాజం ఎప్పటికీ ఊరుకోదు. నా కంచంలో అన్నంముద్ద లాక్కొని.. గుళ్లో పెడతానంటే కచ్చితంగా తిరగబడతారు. కానీ ఈ దేశంలో రాజుల మధ్య యుద్ధాలు జరిగాయి. రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు జరిగాయి తప్ప.. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా రాజులను దింపడానికి తిరుగుబాట్లు జరుగలేదు. గుళ్లల్లోనో.. మరెక్కడో ఉన్న సంపద అంతా ఎక్సెస్ మనీ. వేర్వేరు రంగాల్లో ఉత్పాదకత, వినిమయం, వాణిజ్యం జరుగకుండా ఈ సంపద ఉత్పత్తి జరుగలేదు. ప్రజల మధ్య పని విభజన జరిగింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆహారోత్పత్తి వ్యవస్థ ఒకవైపు, నిర్మాణ రంగం, వస్తూత్పత్తి రంగం, వస్త్రోత్పత్తి రంగం.. ఖనిజాలు.. వాటి తవ్వకాలు.. ప్రాసెసింగ్.. వినియోగం వంటివన్నీ విరివిగా జరిగాయి. ప్రాసెసింగ్ ఎట్లా చేయాలో తెలియకుండానే ఆభరణాలు, తాపడాలు తయారు కాలేదు కదా.. పొరుగుదేశాలతో వాణిజ్యం చేయడం.. వివిధ రంగాల్లో పరస్పర సహకారం చేసుకోవడం, సముద్రమార్గం ద్వారా వ్యాపారం కొనసాగించడం వంటివి జరిగాయి కాబట్టే ఈ దేశంలో మనం ఇప్పుడు అంటున్నామే.. జీడీపీ అని.. అది యావత్ ప్రపంచంతో పోలిస్తే ఎన్నో ఎన్నో రెట్లు అధికంగా ఉన్నది.

అందుకే ముస్లింలు అయినా, బ్రిటిష్ వాళ్లైనా ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయి.. రైళ్లూ.. రోడ్లూ వేసుకొని మరీ అందింది అందినట్లుగా దోచుకుపోయారు. ఈ దోపిడీ కొన్ని శతాబ్దాలపాటు కొనసాగింది. సరే చాలాకాలం తర్వాత మనం రియలైజ్ అయ్యాం. ఏదో పోరాడాం.. ఇంక చాల్లేరా అని వాళ్లూ వెళ్లిపోయారు. ఓకే.. పోతూ పోతూ ముస్లింలకు రెండు ముక్కలిచ్చాడు. మనకేమో మిగిలిపోయిన సంస్థానాలన్నింటినీ కలుపుకుంటే కలుపుకో.. లేకుంటే లేదు.. నీ ఇష్టమని వెళ్లిపోయాడు.. ఆ పటేలో.. రాజాజీయో.. మరొకరో.. నానా తంటాలు పడి వాటన్నింటినీ కలిపి ఒకటి చేసి దేశమని అనిపించారు. సరే ఓ దేశమంటూ   ఏర్పడింది. ఇదేదో పదో, ఇరవయ్యో, ముప్ఫై ఏండ్లో పోరాడి స్వతంత్రమైన గ్రీక్ దేశం లాంటిది కాదు. ఇక్కడ జరిగిన విధ్వంసం ఏ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లో జరిగిన విధ్వంసం లాంటిది కాదు. కొన్ని శతాబ్దాల పాటు జరిగిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, చారిత్రక విధ్వంసమిది. ఇంతకాలం తర్వాత దేశం పరాయి పాలన నుంచి సర్వ స్వతంత్రమైనప్పుడు.. పాలకులు ఎవరైనా మొట్టమొదట ఆలోచించాల్సింది ఏమిటి? ఈ దేశ పునర్నిర్మాణం. ఈ జాతి పునర్నిర్మాణం. ఈ సమాజం ఒకనాడు ఎంత సుసంపన్నంగా ఉన్నదో.. ఏ యే వ్యవస్థలు పరాయిపాలన వల్ల చితికిపోయాయో.. ఆయా వ్యవస్థలను పునర్జీవింపజేయడం.. మన ప్రజలకు, మన సమాజానికి.. మన దగ్గర ఉన్న భిన్నమైన సంస్కృతులకు అనుకూలమైన పాలనావ్యవస్థను నిర్మించడం, మన ప్రజల అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికను రచించి అమలుచేయడం. దురదృష్టవశాత్తూ ఈ దేశంలో ఇవేవీ జరుగలేదు. ఈ దేశ మొదటి పాలకుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ దిశగా కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఆయన ఎంతసేపూ నోబెల్ శాంతి బహుమతికోసం ఆరాటపడ్డాడే తప్ప మరోదానిపై దృష్టి సారించలేదు. దాదాపు 11 సార్లు నోబెల్ శాంతి బహుమతి కోసం నెహ్రూ నామినేట్ అయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ పండితుల నుంచి పలువురు ప్రముఖులు నెహ్రూకు నోబెల్ గురించి నామినేట్‌ చేశారు. నోబెల్ రావడమో.. దానికోసం ప్రయత్నించడమో తప్పుకాదు. కానీ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన పరిస్థితులు చాలా చాలా భిన్నమైనవి. ఐదారువందల దారిదోపిడీ నుంచి బయటపడి స్వేచ్ఛావాయువులు పీల్చడం ప్రారంభమైన సందర్భం అది. ఒకరకంగా చెప్పాలంటే మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాల్సిన సమయం. తప్పటడుగుల నుంచి అడుగులు ముందుకుపడాల్సిన పరిస్థితి.

ఈ క్రమంలో ఈ దేశంలో పరిపాలనా వ్యవస్థ మన పౌరులకు సరిపోయేలా ఎలా ఉండాలి? అభివృద్ధి మోడల్ ఎలా ఉండాలి? ఈ మోడల్‌లోకి అన్ని వర్గాలు భాగస్వామ్యం కావడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ఏమిటన్నది ఆలోచించాలి. కానీ, దురదృష్టవశాత్తూ మనదేశంలో ఆ పని మాత్రం జరుగలేదు. మన పాలకులు స్వతంత్రాన్ని అనుభవించడం మొదలుపెట్టారు కానీ.. దానితోపాటు బాధ్యత కూడా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయారు. ఒక ఆఫీసులో ఒక మనిషి అధికారిగా కూర్చున్నాడంటే.. ఆ వ్యక్తి తన జాతి ప్రజల ఆశలు, ఆశయాలకు కేంద్రబిందువుగా వ్యవహరించాలి. భారతీయ పాలకులు ఈ విషయానికి ప్రాధాన్యమివ్వలేదు. వాస్తవానికి వారిపేరు నోబెల్‌ను మించి ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించగలిగే సువర్ణావకాశమది. ఎందుకంటే.. ఒక్కసారి పరాయివాడి దాస్యం నుంచి విముక్తమై.. రాజకీయ స్వాతంత్య్రం పొందిన దేశ ప్రజల్లో ఉత్సాహం కట్టలు తెగి ప్రవహిస్తుంది. ఒక ఆనందం.. ఒక ఉత్సాహం చైతన్యశక్తిగా పరిణమిస్తుంది. ఇది నేనంటున్న మాట కాదు. ప్రపంచ చరిత్రను ఒకసారి తిరగేస్తే అర్థమవుతుంది. పర్షియన్ల దాడులతో అతలాకుతలమైన పాత ఏథెన్స్ దేశంలో ప్రజలు యుద్ధాల్లో విజేతలైన తర్వాత ఉరకలెత్తిన విజయోత్సాహంతో అత్యద్భుతమైన సృజనాత్మక శక్తిగా రూపొంది.. ప్రపంచానికి అత్యంత ప్రామాణికమైన గ్రీకు సంస్కృతిని అందించింది. మనం బ్రిటిష్‌వాడి నుంచి స్వాతంత్య్రం పొందినప్పుడు అంతకంటే వెయ్యిరెట్లు రెట్టించిన ఉత్సాహంతో, భావోద్వేగంతో ఉన్నాం. ఈ ఉద్వేగాన్ని సృజనాత్మకంగా మలచుకొనే ఒక ప్రయత్నం ఆనాడు జరుగలేదు. మనకు భౌగోళిక వనరులున్నాయి. మానవ వనరులు ఉన్నాయి. నైపుణ్యానికి కొదవలేదు. వీటన్నింటిని సద్వినియోగం చేసుకొనేలా.. వీటి చుట్టూ అభివృద్ధి సాగేలా పరిపాలన వ్యవస్థను నెలకొల్పాల్సిన పాలకులు తమ భావాల కోసం.. తమకు స్ఫూర్తికోసం భారత సరిహద్దులకు అవతలివైపు చూస్తూ కూర్చున్నారు. దేశంలోపల ప్రజలవైపు కన్నెత్తి చూడకుండా.. బ్రిటిష్ ప్రభుత్వం వైపే చూస్తూ ఉండిపోయారు. దాని కనుసన్నల్లోనే.. అది అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను తూ.చ. తప్పకుండా పాటిస్తూ ఉండిపోయారు. బహుశా ఇందుకోసమేనేమో.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకొన్న తరువాత కూడా పది నెలలపాటు లార్డ్ మౌంట్‌బాటన్‌ను ఇక్కడే అట్టిపెట్టుకున్నారు. స్వదేశంలో, స్వపరిపాలనలో సొంత భాషల్లో, సొంత వ్యక్తిత్వంతో పరిపాలన చేయడానికి భయపడిపోయారు. పద్దెనిమిదేండ్లపాటు ఇంగ్లిష్‌ను రాజభాషగా కొనసాగిస్తామని ఎవరూ అడక్కుండానే ముందే తీర్మానించేసుకున్నారు.

రాజ్యాంగ నిర్మాణం కోసం ఒక కమిటీ ఏర్పడింది. రెండు సంవత్సరాల పదకొండు నెలలపాటు ఈ రాజ్యాంగ సభ అనేక అంశాలను పరిశీలించింది. 11 సార్లు సమావేశమై చాలా విషయాలపై చర్చించింది. రాజ్యాంగాన్ని రాయడానికి దాదాపు 166 రోజులు సమయం తీసుకున్నది. చివరకు 395 అధికరణాలు, 22 భాగాలు, ఎనిమిది షెడ్యూల్‌లు, 1,45,000 పదాలతో రాజ్యాంగాన్ని అద్భుతంగా రచించారు. 1950 జనవరి 26 నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అంతా బాగానే ఉన్నది. భారత రాజ్యాంగం నిస్సందేహంగా ఒక విశిష్టమైన రాజ్యాంగం. అనేక దేశాలలోని అత్యుత్తమ నిబంధనలను, వ్యవస్థలను అన్నింటిని యథాతథంగా స్వీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ రాజ్యాంగంగా రచించారు. బ్రిటన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సోవియట్ యూనియన, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా, జపాన్.. ఇట్లా చాలా దేశాలనుంచి చాలా అంశాలు భారత రాజ్యాంగంలో అధికరణాలుగా మారిపోయాయి. బాగానే ఉంది. ఇందులో వివాదం ఏమీలేదు. ఎక్కడైనా మంచి ఉంటే స్వీకరించాల్సిందే. కానీ, ఇన్ని దేశాలనుంచి.. ఇన్ని రకాలుగా.. నిబంధలను జొప్పించి రాజ్యాంగాన్ని రాసుకున్నాం కదా.. ఇంతమంది మేధావులకు ఈ దేశంలో అప్పటికే ఉన్న.. ఉండిపోయిన.. వ్యవస్థల్లో ఈ దేశ ప్రజలకు మంచిదైన, అనుసరణీయమైన వ్యవస్థ ఒక్కటంటే ఒక్కటి కనిపించలేదా? మాతృభాషలో చదువుకుంటేనే విజ్ఞానం పెరుగుతుంది.. అని అంటారే.. మరి ఇతర రంగాలకు, వ్యవస్థలకు మాత్రం ఆ నేటివిటీ అనేది వర్తించదా? చివరకు భారతీయులు ఎవరు.. ఎలాంటి వారు, వారి సమాజం ఏమిటి? ఎట్లా ఉంటుంది? వారి జీవన విధానమేమిటి? అని నిర్వచించే రాజ్యాంగం ప్రియాంబుల్ కూడా ఎక్కడో అమెరికా నుంచి అడుక్కోవాలా? ఏం ఆ ఐదారు వాక్యాలు కూడా మనం సొంతంగా మనల్ని మనం నిర్వచించుకోలేకపోయామా? ఇవాళ ఇరిగేషన్ వ్యవస్థను బాగుపరచాలంటే.. చెరువులు నిండాలని ఆ దిశగా పావులు కదుపుతున్నారు. గొలుసుకట్టు చెర్వుల వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఇదెప్పుడో వెయ్యేండ్ల కిందట కాకతీయులు అనుసరించిన, అమలుచేసిన నీటిపారుదల వ్యవస్థ. అలాంటి వ్యవస్థ ఇప్పటికీ అనుసరణీయమైనప్పుడు దాన్ని స్వీకరించడంలో తప్పేంలేదు కదా.. ఇలాంటి వ్యవస్థలేవీ మన దేశంలో అమలుచేయదగినవి గతంలో లేనే లేవా? డిస్కవరీ ఆఫ్ ఇండియా రచయిత దేశంలోని మూలమూలనా తిరిగి ఆయా సమాజాలను చూసిన తర్వాతే కదా దాన్ని రాసింది. ఆయనకు ఈ దేశంలో ప్రజలకు అవసరమైన పరిపాలన, అభివృద్ధి వ్యవస్థలు ఏవీ కనిపించలేదా? రాజ్యాంగంలో దేశీయమైన ఏ ఒక్క అంశం లేకుండా ఎందుకు రాయాల్సి వచ్చింది? రాజ్యాంగం రాసినవాళ్లంతా చాలా చాలా పెద్దవారు.. మేధావులు.. వారికి ఇవన్నీ తెలిసే ఉండాలి. కానీ మన సమాజానికి, మన ప్రజలకు మనవైన అంశాలు ఒక్కటి కూడా ఐదారువందల ఏండ్లనాటి సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో కనిపించలేదా అన్న సందేహం కలుగుతున్నది. ఈ క్రమంలోనే ఒక్కసారి వెనుకకు వెళ్లిచూస్తే మన సమాజంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలు గతంలో ఎంతగా పరిఢవిల్లాయో విస్పష్టంగా కనిపిస్తుంది. వేదాల నుంచి, పురాణాల నుంచి బ్రిటిష్ వాడు రాకముందువరకు పరిపాలించిన రాజ్యవ్యవస్థలు ఈ దేశాన్ని ఎంత సుసంపన్నం చేశాయో ఒక్కసారి చదవండి. వీటిలో అనేక వ్యవస్థలను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించుకొని ఉంటే.. మన సమాజానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించుకొని ఉంటే భారతదేశం ఇప్పటికంటే ఎన్నో రెట్లు ప్రగతిపథంలో దూసుకొనిపోయి ఉండేది కాదా?

ప్రాచీన భారత సామాజిక వ్యవస్థ గురించి శ్రీ అరబిందో తన పుస్తకం  THE SPIRIT AND FORM OF INDIAN POLITY లో ఇలా అన్నారు.

At the height of its evolution and in the great days of Indian civilisation we find an admirable political system, efficient in the highest degree and very perfectly combining village and urban self-government with stability and order. The State carried on its work administrative, judicial, financial and protective – without destroying or  encroaching on the rights and free activities of the people and its constituent bodies in  the same department. The royal courts in capital and country were the supreme  judicial authority coordinating the administration of justice throughout the kingdom”.….

ప్రాచీన భారత సామాజిక వ్యవస్థ ఇంతగా సంపదను, శాంతిని, పటిష్టతను సాధించటానికి కారణాలను ఆనాటి వ్యవస్థను పరిశీలించి తెలుసుకోవాల్సివుంటుంది.  ఈ నేపథ్యంలో మన ప్రాచీన పరిపాలనా వ్యవస్థలు కొన్నింటిని పరిశీలిద్దాం.

 

(ఇంకావుంది)

Images Courtesy:

Swadhyaya Resource Centre and Internet

Exit mobile version