[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
సరిహద్దులు.. భద్రత
ఉడుకుల యంచులన్ జలములుబ్బి తరంగల నొత్తుచున్ సము
ద్రుడు బడబాగ్నివోలె సరితూగి యయోధ్య సమస్త రాజులన్
గడుపున దాచె దద్బల ముఖంబులు హద్దుల కొత్తి త్ప్రభల్
మడగకయుండ స్వీయమహిమల్ పెనుకాల్వలుగాకనూగగన్
[dropcap]ఇ[/dropcap]ది కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణ కల్పవృక్షంలోని ఇష్టి ఖండంలోని ఒక పద్యం. సముద్రములో బడబాగ్ని ఎట్లా ఉన్నదో.. సమస్త రాజుల సైన్యాలు అయోధ్యలో అట్లా ఉన్నాయిట. సముద్రుడు తన తరంగాలతోటి బడబాగ్నిని నొక్కిపట్టినట్టు.. దశరథ రాజు సైన్యములు పర రాజుల సైన్యాలను మెదలనీయవు. కోసలరాజు సైన్యముల గొప్పతనాలు సముద్రుడి లోని పెను కాల్వల లాగా ఉన్నాయిట.
అయోధ్యలో చక్రవర్తి దశరథుడు అశ్వమేథయాగం చేసాడు. ముగింపు కార్యక్రమం అద్భుతంగా సాగుతున్నది. దేశవిదేశాల నుంచి చాలా మంది రాజులు అనేక కానుకలు తీసుకొచ్చారు. రథ, గజ, తురగ, పదాతి దళాలతో సహా దిగిపోయారు. చక్రవర్తి గారికి గుర్రాలు, గజాలు కానుకలుగా ఇచ్చారు. ఆ వచ్చిన రాజులు తమతోపాటు సైన్యాన్ని కూడా తీసుకొచ్చారు. అందరూ అతిథులే. అయినా దశరథ రాజు సైన్యం పరరాజుల సైన్యాన్ని అడుగు కూడా మెదలనీయకుండా నిఘా ఉంచింది. ఎందుకు?ఈ పద్యం చదివినప్పుడు వచ్చిన ప్రశ్న ఇది.
అశ్వమేథయాగానికి యావత్ ప్రపంచదేశాల నుంచి రాజులు, సామంతులు ఋషులు (మేధావులు, ఇంటెలెక్చువల్స్).. ఇలా చాలామందిని దశరథుడు ఆహ్వానించాడు. వారందరి అతిథి మర్యాదలను చూసినవాడు వశిష్ఠుడు. రాజుగారి ప్రధానమైన ఋత్విక్కులు వామదేవుడు, వశిష్ఠుడు. కాగా, దశరథుడి క్యాబినెట్‌లో సహాయమంత్రులను పక్కనపెడితే, క్యాబినెట్ హోదా కల మంత్రులు ఎనమండుగురు ఉన్నారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు ఈ క్యాబినెట్ హోదా గల మంత్రులు. అశ్వమేథ యాగానికి వచ్చిన అసంఖ్యాక రాజులకు అతిథి సత్కార బాధ్యతలను వశిష్ఠుడు చూస్తుంటే.. వారిచ్చే కానుకలను స్వీకరిస్తూనే.. వారి వెంట వచ్చిన సైనికులను, ఏనుగులను, గుర్రాలను పరిశీలించే బాధ్యతను సుమంత్రుడు స్వీకరించాడు. అశ్వమేథ యాగానికి కనీసం ఓ పాతిక ముప్ఫై మంది రాజులైనా వచ్చి ఉంటారు కదా.. వీరు కానుకలుగా ధనధాన్యాదులు, మణిమాణిక్యాలు, గజాశ్వాలు.. ఇలా అనేకం తెచ్చారు. వాటన్నింటినీ స్వీకరించాడు సుమంత్రుడు. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ ఈ రాజులంతా సైన్యసమేతంగా వచ్చారు. ఒకవేళ ఈ రాజులంతా కలిసి కుట్రచేసి అయోధ్యను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే.. అశ్వమేథ యాగంలో తలమునకలై ఉన్న దశరథుడు ఏమైనా చేయగలడా? సాధ్యమేనా? వచ్చిన రాజులు చక్రవర్తికి విధేయులే కావచ్చు. కానీ.. వారిలో ఎవరో ఒకరు చెడ్డవారు ఉండి ఉంటే.. వారిద్వారా ఏదైనా కుట్ర జరిగితే.. రాజును కాపాడాల్సిన బాధ్యత మంత్రిది. అందుకే సుమంత్రుడు ఇంటలిజెన్స్ చీఫ్‌గా చేయాల్సిన పనిచేశాడు. అశ్వమేథం జరిగేంతవరకు.. దశరథుడి సైన్యం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించింది. అతిథులుగా వచ్చిన రాజులకు మర్యాదాతిక్రమణ జరుగకుండానే.. వారి కదలికలపైనా.. సైన్యం కదలికలపైనా.. కంటిమీద రెప్పవేయకుండా నిఘావేసింది. బయటకు కనిపించేదేమో ఆతిథ్యము. లోపల నడిచిందంతా రాజనీతి.
ప్రత్యర్థి బలాబలాలను అంచనావేయడం, ఎవరిని ఆదరించాలి.. ఎవరితో యుద్ధం చేయాలి.. ఎవరితో సంధి చేసుకోవాలో తెలుసుకొని.. రాజుగారిని, దేశాన్ని ఎప్పటికప్పుడు కాపాడటానికి వ్యూహాత్మకంగా వ్యవహరించడమే మంత్రి విధి. కోసల రాజ్యంలోని రాజనీతి అది. దేశం లోపలి నుంచి.. బయటి నుంచి వచ్చే ప్రమాదాలను దూరదృష్టితో ముందే గ్రహించి రక్షణ చర్యలు అత్యంత కట్టుదిట్టంగా చేయడం మంత్రుల బాధ్యత. ఇదే యుద్ధనీతి. సుమంత్రుడు చేసింది అదే.
తన దగ్గరకు.. తాను పిలిస్తేనే అతిథులుగా వచ్చిన వారి విషయంలోనే రాజు ఇంత అప్రమత్తంగా ఉంటే.. తన రాజ్యం భద్రత విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండి ఉంటాడు? .. అయోధ్య అన్నది సదరు దశరథుడికి రాజధాని. దాని పేరులోనే అది ఎంత భద్రమైనదో తెలుస్తుంది. అయోధ్య అంటేనే యుద్ధం చేయడానికి శక్యం కానిది అని అర్థం. యుద్ధం చేయడానికి వీలు లేకుండా అత్యంత దుర్భేద్యంగా నిర్మించిన నగరమది. పన్నెండు యోజనాల పొడవుతో ఈ నగరం అద్భుతంగా నిర్మించారు. (యోజనమంటే సుమారు 12 కిలోమీటర్లు). తొమ్మిది వైపులా తొమ్మిది ద్వారాలున్నాయంట. అంటే సరిహద్దులు పక్కాగా నిర్మించారని అర్థం. అయోధ్యకు బయటనున్న తలుపులు, ద్వార బంధాలు చాలా దృఢమైనవి. ఈ సరిహద్దు గోడపైన అన్ని వైపుల్లో.. అన్ని కోణాలు.. అన్ని దిక్కులను కవర్ చేసేలా వందల సంఖ్యలో శతఘ్నులు ఏర్పాటుచేశారు. ఇవి క్షిపణులను మోసుకుపోగల సమర్థమైనవి. నగరం చుట్టూ అత్యంత ఉన్నతమైన ప్రాకారాన్ని నిర్మించారు. ఈ ప్రాకారం అయోధ్యకు వడ్డాణంలా ఉన్నదిట. అయోధ్య నగరం చుట్టూ ఎవరూ ప్రవేశించడానికి వీలులేనంత లోతుగా అగడ్త ఉన్నది. ఈ అగడ్త ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలతో నిండి ఉన్నది. ఈ అగడ్తను దాటి శత్రువు అనేవాడు ఎవరూ అయోధ్యలోకి ప్రవేశించలేరు. ఆ నగరంలో వేలకొలది మమహారథులైన వీరులుంటారు. అస్త్రాలతోనూ.. అస్త్రాలు లేకుండా కూడా యుద్ధం చేయగల అసాధారణ వీరులున్నారు. కేవలం బాహుబలంచేతనే శత్రువును చంపగల యోధులు వీరు. అయినప్పటికీ.. అయోధ్య నగరానికి బయటివైపు.. చుట్టూ వర్తులాకారంగా దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లదాకా సెక్యూరిటీ వ్యవస్థను అత్యంత పటిష్ఠంగా ఏర్పాటు చేశారు. శత్రువు అనేవాడు ఇన్ని అంచెల రక్షణ వలయాలను దాటుకొని నగరంలోకి ప్రవేశించడం దుస్సాధ్యం.
రాముడు ఎవరు.. ఏమిటన్న మీమాంసను కాసేపు పక్కన పెడదాం. అయోధ్య అనేది ఒక రాజ్యం.. పైగా ప్రజలందరి ఆదరాభిమానాలను సామంతులందరి గౌరవాన్ని పొందిన ఒక రాజు.. తన దేశానికి సంబంధించి రక్షణ చర్యల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడు.. తన ప్రజలకు ఏ విధంగానూ ముప్పురాకుండా ఎన్నెన్ని చర్యలు తీసుకొన్నాడు.. సరిహద్దుల్లోనే అత్యంత పకడ్బందీగా వలయాలు వలయాలుగా రక్షణ ఏర్పాట్లు చేశాడు. గుర్రాలు, ఏనుగులు, ఒంటెల సైన్యాన్ని 24 గంటలు మోహరించాడు. క్షిపణులతో కూడిన శతఘ్నులను సర్వసన్నద్ధంగా ఉంచాడు. భద్రత అంటే ఇది. ముందుగా బయటి నుంచి వచ్చే ముప్పును అడ్డుకోగలిగితే.. అంతర్గతంగా దేశంలో వ్యవహారాలు చక్కబెట్టుకోవడం అంత కష్టమేమీకాదు. అభివృద్ధి కార్యక్రమాలు నల్లేరుమీద నడకలా ఉంటాయి. ఇది ప్రాథమిక రాజ్యతంత్రం. ఇది ఏ దేశమైనా చేసేపనే. కేవలం రామాయణమనే కాదు.. మహాభారతకాలంలోనూ ఈ విధానం స్పష్టంగానే కనిపిస్తుంది. హస్తినాపుర నిర్మాణంలోనూ, ఇంద్రప్రస్థ నగర నిర్మాణంలోనూ, మగధ, ద్వారక నగరాల నిర్మాణంలోనూ ఈ భద్రతాపరమైన వ్యవస్థలు కనిపిస్తాయి. మౌర్యులు, శాతవాహనులు, కాకతీయులు, చోళులు.. ఇలా ఏ రాజ్య వ్యవస్థను పరిశీలించినా భద్రతా పరమైన చర్యల్లో ఎలాంటి లోపం కనిపించదు. పైగా దుర్భేద్యంగా ఈ వ్యవస్థలు ఉంటాయి. కాకతీయులనే ఉదాహరణగా తీసుకొంటే.. కాకతీయుల ఓరుగల్లు కోట సప్త ప్రాకారాలుగా నిర్మించారు. మట్టికోట, రాతికోట.. ఇలా ఏడు ప్రాకారాలున్నాయి. మౌర్యుల కాలంలో సుప్రసిద్ధుడైన చాణక్యుడి రాజనీతి కూడా శత్రు విచ్ఛేదనాశీలిగా రాజ్యాన్ని ఎలా నిర్మించుకోవాలో స్పష్టంగా చెప్పింది.
కానీ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన తొలి ప్రభుత్వం ప్రధానంగా వదిలేసింది ఈ అంశాన్నే. దేనికైతే అత్యంత ప్రాధాన్యమివ్వాలో.. దాన్ని మన పాలకులు గాలికి వదిలేశారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన నాటి పరిస్థితులు చాలా సంక్లిష్టమైనవి. విభజన సమయంలో జరిగిన హింసాకాండ అసాధారణమైంది.. అత్యంత దారుణమైంది. నాయకుల రాజకీయ కుట్రలకు వేలమంది బలయ్యారు. ఒక పక్క విభజన మారణకాండ కొనసాగుతుండగానే.. మరోవైపు గిరిజనమూకలను అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ యుద్ధానికి తెగబడింది. షేక్ అబ్దుల్లా కోసమో.. మౌంట్‌బాటన్ కోసమో.. లేక.. అహింసా సిద్ధాంతకర్తలమైన మనల్ని ఎవరూ ఏమీ చేయలేరన్న అతి విశ్వాసంతోనో తొట్టతొలి ప్రధానమంత్రి, రక్షణ ప్రణాళికను చెత్తబుట్టలో పారేయమన్నారు. ఆయన మేలుకొనేసరికి పాకిస్తాన్ జమ్మును ఆక్రమించేసుకొన్నది. పర్యవసానంగా మనం ఒక వాస్తవాధీన రేఖ గీసుకోవాల్సి వచ్చింది.
ఒకసారి మన దేశానికి ప్రస్తుతమున్న భౌగోళిక స్వరూపాన్ని గమనిద్దాం. మూడువైపుల సముద్రం ఉన్నది. ఈ మూడు వైపులా మనకు శత్రుభయం అన్నది అంత తీవ్రమైనది కాదు. ఉత్తరం నుంచి.. తూర్పు వైపునుంచి భూతలంమీదుగా ఉన్నంత తీవ్రమైనది అసలే కాదు. శ్రీలంకలో కొద్ది సంవత్సరాలపాటు కొనసాగిన ఎల్టీటీఈ లాంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు మినహాయిస్తే.. ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి నేరుగా యుద్ధభయం అన్నది లేదు. మనం ప్రధానంగా ఇవాళ ప్రధానంగా ఎదుర్కొంటున్న శత్రువుల సమస్య ఉత్తరం నుంచి ఈశాన్యం వరకు పాకిస్థాన్, చైనాల నుంచే. ఇరవై నాలుగు గంటల శత్రుభయం ఉన్నది. ముంబైలో 2008, 26 డిసెంబర్ దాడులు కూడా ఉత్తరాన ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా జరిపినవే తప్ప ఇతర దేశాలనుంచి వచ్చిన ముప్పేమీ లేదు. ముందుగా ఈ రెండు దేశాలకు సంబంధించి అన్ని రకాలుగా పకడ్బందీగా సరిహద్దులు గీసుకొని పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. కానీ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆ విషయం పట్ల అత్యంత నిర్లక్ష్యం వహించారు. ఆయన దృష్టి అంతా అంతర్జాతీయ కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకోవడంపైనే నిలిచింది. నోబెల్ శాంతి బహుమతి పొంది.. తన సోషలిస్టిక్ ఇమేజి ద్వారా ప్రపంచ నాయకుడిగా.. గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుతెచ్చుకోవాలన్న కాంక్షతోనే తన కాలమంతా గడిపినట్టు అర్థమవుతుంది.
నెహ్రూ హయాంలో జరిగిన పరిణామాలు చూస్తే.. 1948 జూలై లో .. ఢిల్లీలోని చారిత్రక రామ్ లీలా మైదాన్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో నెహ్రూ మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల గురించి ప్రసంగించారు. అదే ప్రసంగంలో హైదరాబాద్ సంస్థానం గురించి కూడా ప్రస్తావించారు. దేశం నడిబొడ్డులో హైదరాబాద్ వేరే దేశంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇది సరిగ్గా పోలీస్ యాక్షన్‌కు రెండునెలల ముందు జరిగింది. ఆకాశవాణి నెహ్రూ ఆర్కైవ్స్‌లో ఆయన ప్రసంగ భాగం ఇప్పటికీ అందుబాటులో ఉన్నది. చక్కగా వినవచ్చు. (https://youtu.be/9NTpiqdxj6A (swadhyaya kovela యూట్యూబ్ చానల్ లింక్‌లో ఈ ప్రసంగభాగం అందుబాటులో ఉన్నది.) హైదరాబాద్ విషయంలోనే ఇంత స్పష్టంగా తన వైఖరి చెప్పిన నెహ్రూకు.. దేశ సరిహద్దుల్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని తెలియదనుకోవాలా?
పాకిస్తాన్ విషయంలో ఒక పొరపాటు జరిగింది. చైనా విషయంలో మాత్రం ఒరగబెట్టిందేమిటి?
1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించింది. అదే సమయంలో అటు కొరియా యుద్ధంలోనూ జోక్యం చేసుకొన్నది. కొరియా యుద్ధంలో చైనా జోక్యంతో మనకేమీ సంబంధం లేదు. కానీ, మన సరిహద్దుల్లో ఉన్న టిబెట్‌పై యుద్ధం అన్నది మనకు ముఖ్యం కదా.. మన ప్రయోజనాలకు భంగకరం కాదా? మనకు సరిహద్దులో చైనా ఉంటే క్షేమమా? టిబెట్ ఉంటే క్షేమమా? కనీసం ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా? ఏ సిద్ధాంతం ప్రకారం చూసినా కమ్యూనిస్టులైనా.. సోషలిస్టులైనా, క్రైస్తవ రాజ్యాలైనా, అరబ్బుదేశాలైనా.. ఏదైనా సరే.. మనకు సరిహద్దులో ఉండే దేశం మనకు అనుకూలంగా ఉండాలని.. ఉండేలా చూసుకోవాలని అనుకోవడం సహజమే కదా.. ఇందుకు తగ్గట్టుగా మన దౌత్య ప్రయత్నాలు కానీ, రక్షణ చర్యలు కానీ ఉండాలి కదా? కానీ, నెహ్రూ సర్కారు ఆ దిశగా ఆలోచించడానికి కూడా ప్రయత్నించలేదు. పొరుగుదేశంతో అధికారిక సరిహద్దుల్ని స్థిరంగా ఏర్పాటుచేసుకోవడం మన ముందున్న ప్రధాన బాధ్యత. టిబెట్ మనకు పొరుగున ఉన్నది. కొరియా యుద్ధంతో మనకు ఏ విధంగా చూసినా సంబంధం లేదు. చైనా వాడికంటే వాడి ప్రయోజనాలు వాడికుంటాయి. ఎందుకంటే చైనాకు సరిహద్దులో కొరియా ఉన్నది కాబట్టి. కొరియాతో తనకు సరిహద్దు సంఘర్షణలు రాకుండా ఉండటానికి.. పొరుగుదేశంతో తరచూ సంఘర్షణలు తనకు ప్రమాదకారిగా పరిణమించకుండా ఉండటానికి చైనా వ్యూహాత్మకంగా కొరియా యుద్ధంలో జోక్యం చేసుకొన్నది. దాని డిఫెన్స్ స్ట్రాటజీ అది. అందులో మనం తప్పు పట్టడానికి ఏం లేదు. కొరియా వ్యవహారం ఏదైనా ఉంటే.. చైనానో, యుద్ధానికి కారణమైన అమెరికాయో చూసుకొంటాయి తప్ప మనకు అవసరం ఏమిటి? చైనా ఏ విధంగానైతే తన ప్రయోజనాల కోసం కొరియా యుద్ధంలో జోక్యం చేసుకొన్నదో.. టిబెట్ వ్యవహారంలో మనం కూడా అలాగే వ్యవహరించాలి కదా.. నెహ్రూ మాత్రం ఆ వైపు చూడవద్దనుకున్నారు. కశ్మీర్ వ్యవహారంలో ఏవిధంగా తెలిసీ తప్పుచేశారో.. టిబెట్ విషయంలోనూ అదే తప్పుచేశారు. ఫలితంగా ప్రపంచపటం నుంచి టిబెట్ మాయమైపోయి, చైనా వంటి మహమ్మారిని నెత్తిన కుంపటిలా తెచ్చిపెట్టుకున్నాము.
1950 అక్టోబర్ 25 న టిబెట్‌లోకి చైనా చొరబడింది. ‘ఫ్రీ టిబెట్ ఫ్రం ఇంపీరియలిస్టిక్ ఫోర్సెస్’ అన్న పేరుతో చైనా కమ్యూనిస్టులు టిబెట్‌ను ఆక్రమించారు. చైనా చేపట్టిన ఈ చర్యతో తాను ఆశ్చర్యపోయానని.. అనూహ్యమైన ఈ పరిణామంతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని నెహ్రూ తర్వాత ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
“extremely perplexed and disappointed with the Chinese Government’s action…led to believe by the Chinese Foreign Office that the Chinese would settle the future of Tibet in a peaceful manner by direct negotiation with the representatives of Tibet…”
టిబెట్‌పై చైనా దాడి విషయం తనకు అప్పుడే తెలిసినట్టుగా నెహ్రూ నటించాడు. కానీ, 1949 సెప్టెంబర్‌లోనే నెహ్రూకు ఇందుకు సంబంధించిన సమాచారం పక్కాగా ఉన్నది. ‘చైనీస్ కమ్యూనిస్ట్స్ లైక్‌లీ టు ఇన్‌వేడ్ టిబెట్’ అని తానే రాశారు కూడా. అలాంటప్పుడు ఆశ్చర్యానికి తావెక్కడిది? తనకు ముందుగా సమాచారం తెలిసినప్పుడు భారత్‌కు టిబెట్ సరిహద్దుగా ఉంటే బాగుంటుందని ఆలోచించుకొని సేఫ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఉన్నది కదా.. నెహ్రూ మాత్రం ఆ పనిచేయలేదు. కొరియా యుద్ధంపై అమితాసక్తిని ప్రదర్శిస్తూ, టిబెట్‌పై చైనా ఆక్రమణను ప్రోత్సహించాడు.
“our primary consideration is maintenance of world peace… Recent developments in Korea have not strengthened China’s position, which will be further weakened by any aggressive action [by India] in Tibet.”
ఇవాళ టిబెట్ స్వతంత్రంగా ఉండి ఉంటే, భూటాన్, నేపాల్ మాదిరిగా మనకు ఆ దేశంతో సాన్నిహిత్యం చక్కగా ఉండేది. భూటాన్‌తోనూ.. నేపాల్‌తోనూ స్నేహపూర్వక సరిహద్దు అనుబంధాలు ఉన్నట్టే టిబెట్‌తోనూ ఉండేవి. కానీ ఆ అవకాశాన్ని నెహ్రూ చేజేతులా చేజార్చుకొన్నాడు. టిబెట్‌తో మనకు శతాబ్దాలుగా సాంస్కృతికంగా, చారిత్రకంగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మనకు దౌత్యపరంగా, భద్రతపరంగా కూడా సానుకూలంగా ఉండేది. ఈ ఆక్రమణకు ముందువరకు టిబెట్‌లోని ల్హాసా, గ్యాంగ్‌ట్సేలో భారతదేశం దౌత్య కార్యకలాపాలను కూడా నిర్వహించింది. కానీ, నెహ్రూ ప్రభుత్వం సైలెంట్‌గా ఇక్కడి నుంచి దౌత్య వ్యవహారాలను ఎత్తివేసింది. టిబెట్‌లో భారత ప్రయోజనాలను పణంగా పెట్టి.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి చైనాను నెహ్రూ ప్రమోట్ చేశారు. ఇప్పుడు అదే చైనా మనకు సభ్యత్వం ఇవ్వాలనేసరికి ఏం చేస్తున్నదో అందరికీ తెలిసిందే కదా..
ఈ మొత్తం వ్యవహారంలో నెహ్రూను తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తి చైనాలో భారత రాయబారిగా ఉన్న కేఎం పణిక్కర్. ఇతను కమ్యూనిస్టు. చైనాలో రాయబారిగా ఉన్న పణిక్కర్ కు అక్కడ జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి భారత్‌కు సమాచారం అందించాల్సిన బాధ్యత ఉన్నది. కానీ, ఆయన మాత్రం చైనా అనధికార ప్రతినిధిగా వ్యవహరించారనే చెప్పాలి. టిబెట్‌లో చైనా సేనలు ప్రవేశించి స్వాధీనం చేసుకొనేంత వరకు కూడా ఆయన తనకు సమాచార ధ్రువీకరణ జరుగలేదంటూ కాలయాపన చేశారు. ఇది ఒకవిధంగా ద్రోహమే. పణిక్కర్ వ్యవహారంపై అప్పుడు ఉప ప్రధానిగా ఉన్న సర్దార్ పటేల్ బహిరంగంగానే అన్నారు. నెహ్రూను హెచ్చరించారు కూడా.
Panikkar has been at great pains to find an explanation or justification for Chinese policy and actions. Even though we regard ourselves as friends of China, the Chinese do not regard us as friends. In Kali Yuga, we shall return ahimsa for ahimsa. If anybody resorts to force against us, we shall meet it with force.
పటేల్ మాటల్ని నెహ్రూ పెడచెవిన పెట్టాడు. అసలు పట్టించుకోలేదు. నెహ్రూను ఈ విషయంలో హెచ్చరించిన సర్దార్ పటేల్ ఆ తర్వాత కొద్దిరోజులకే కన్నుమూశారు. ఇంత జరుగుతున్నప్పటికీ, నెహ్రూ మాత్రం హిందీ చీనీ భాయి భాయి.. అంటూ.. పంచశీలాలు అంటూ ఫిడేల్ వాయించారే తప్ప మన ప్రయోజనాలు ఏమిటి.. మనం మన దేశానికి రక్షణగా ఏం చేయాలన్న ఆలోచన చేయలేదు. నెహ్రూ గారు చైనీయులను తన దోస్తులుగా భావించారే తప్ప మావో మాత్రం అలా ఎన్నడూ అనుకోలేదు. చీనీ హిందీ భాయి భాయి.. అని చైనా అన్నట్టు చరిత్రలో మనం ఎప్పుడైనా విన్నామా..? నిజానికి అప్పటికి చైనా అంత బలవత్తరంగా ఏమీ లేదు. నాకు తెలిసి అణ్వస్త్రం కూడా సంపాదించి ఉండలేదు. తర్వాత ఎప్పుడో పదేండ్ల తర్వాత సంపాదించింది. మనసైన్యం కొంత బలంగానే ఉన్నది. కాస్త గట్టిగా నిరోధించి ఉన్నట్టయితే టిబెట్ స్వతంత్రరాజ్యంగా ఉండేది. చైనా కబళించకుండా ఉండేది. మన ప్రయోజనాలు కూడా నెరవేరేవి. వాస్తవానికి ఆనాటి ప్రపంచ అభిప్రాయం కూడా అదే. భారత్ ఎప్పుడు చొరవతీసుకుంటుందా అనే ఎదురుచూస్తున్నది. ది ఎకనామిస్ట్ పత్రికలో రాసిన ఈ అభిప్రాయం చదవండి..
Having maintained complete independence of China since 1912, Tibet has a strong claim to be regarded as an independent state. But it is for India to take a lead in this matter. If India decides to support independence of Tibet as a buffer state between itself and China, Britain and U.S.A will do well to extend formal diplomatic recognition to it.
పశ్చిమ దేశాల దృష్టికోణంలో ది ఎకనమిస్ట్ పత్రిక చాలా ప్రభావవంతమైనది. కానీ నెహ్రూ ఈ అవకాశాన్నీ వదిలేశాడు. స్వతంత్ర టిబెట్‌కు మద్దతు ప్రకటించడం ద్వారా చైనాపై ఆనాడు భారత్ పట్టుసాధించి ఉంటే.. ఇవాళ పాకిస్తాన్‌తో సమానంగా తృతీయ దేశంగా కాకుండా శక్తిమంతమైన దేశంగా ఎదిగి ఉండేది. మన ఖర్మకొద్దీ టిబెట్‌ను పోగొట్టుకున్నాం. ఆ తర్వాతైనా చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకున్నామా అంటే అదీ లేదు. సరిహద్దును స్పష్టంగా గీసుకొనేందుకు చైనా అధినేత ఝౌఎన్‌లై చాలాసార్లు భారత్‌కు వచ్చాడు. సరిహద్దుకు సంబంధించిన ప్రతిపాదన కూడా చేశాడు.
దశలవారీగా సమస్యను పరిష్కరించుకుందామని ఝౌఎన్‌లై చెప్పాడు. తూర్పున చిన్న చిన్న సర్దుబాట్లతో మెక్ మోహన్ రేఖను సరిహద్దుగా అంగీకరించడానికి చైనా సుముఖంగానే ఉన్నది. ఆ తర్వాత లడఖ్, టిబెట్ విషయంలో చర్చలు జరిపి కొలిక్కి తెద్దామని ఝౌఎన్ లై ప్రతిపాదించాడు. ఎక్కడో ఒకచోట మొదలుపెట్టి ఉంటే సమస్య పరిష్కారం దిశగా కదిలేది. నెహ్రూ మాత్రం సమస్య మొత్తాన్ని ఒక్కసారిగా పరిష్కరించుకోవాలని పట్టుపట్టాడు. దీంతో ఎక్కడి గొంగడి అక్కడే అన్న మాదిరి తయారైంది. ఒక్కసారిగా పరిష్కారం కావడం ప్రాక్టికల్‌గా అసాధ్యమని ఝౌ స్పష్టంచేశాడు. 1960 ప్రాంతాల్లో లఢక్ కు నెహ్రూ సర్కార్ సర్వేయర్లను పంపి.. సరిహద్దుల మ్యాపులను గీయమని ఆదేశించింది. లడఖ్ వద్ద సరిహద్దు స్పష్టంగానే ఉన్నదని, కానీ చైనా దాన్ని అంగీకరించడంలేదని అక్కడి ప్రజలకు ప్రభుత్వం చెప్పింది. ఏమైనప్పటికీ.. సరిహద్దు మార్కింగ్ విషయంలో కొంత క్రియాశీలంగా వ్యవహరించి ఉంటే.. చైనాతో సంబంధాలు కూడా బాగుండేవి. మనం బలమైన శక్తిగా ఎదిగేవాళ్లం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.. టిబెట్ నుంచి పశ్చిమాన ఉన్న గ్జింజియాంగ్ వరకు కలుపుతూ ఒక రోడ్డు నిర్మించాలని చైనా అనుకున్నది. ఇందుకోసం చైనాకు అక్సాయ్‌చిన్ కావాలి. వ్యూహాత్మకంగా అక్సాయ్‌చిన్ చైనాకు చాలా అవసరం. వాస్తవానికి మనకు అక్సాయ్‌చిన్‌ను నిర్వహించడం సియాచిన్ గ్లేసియర్ కంటే కూడా చాలా భారం. దీనిపై కొంత వరకు చర్చించి ఉంటే.. అక్సాయ్‌చిన్‌ను చైనాకు వదిలేసినా, కైలాస పర్వతం, మానస సరోవరం వంటి వాటిని మనం కలుపుకొనేవాళ్లం. మనకు ఇవి ఆధ్యాత్మికపరంగానే కాకుండా.. వ్యూహాత్మకంగా కూడా ప్రయోజనకారిగా ఉండేవి. కాస్త మనసు పెట్టి ఆలోచించి ఉంటే చైనాతో మన సరిహద్దు సుస్పష్టమయ్యేది. ఇప్పుడేమయింది. మనం సరిహద్దుపై చర్చ జరుపలేదు. అక్సాయ్‌చిన్‌ను మనం ఇవ్వలేదు. చైనా సింపుల్‌గా దాన్ని ఆక్రమించుకొన్నది. ఇందులో మనం సాధించింది ఏమున్నది? నిండు సున్న. దేశ రక్షణకు సంబంధించి, సరిహద్దుల్లో వ్యూహానికి సంబంధించి మన పాలకుడి రాజనీతిజ్ఞత ఇది. ఎంతసేపూ పంచశీల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడంపైన నెహ్రూకు ఉన్న దృష్టి.. భారత ప్రయోజనాలపై లేకుండాపోయింది. టిబెట్‌పై చైనా దురాక్రమణను నివారించి సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకొని ఉంటే.. నెహ్రూకు అంతర్జాతీయ ఖ్యాతి సహజంగానే వచ్చేది. నోబెల్ బహుమతీ వచ్చేదేమో. ఈ లాజిక్‌ను నెహ్రూ ఎందుకు మిస్సయ్యాడు? జవాబులేని ప్రశ్న.