Site icon Sanchika

రమణీయం

[dropcap]“ర[/dropcap]మణీ, రమణీ! గంటయి అరుస్తున్నాను. ఆ కాఫీ తగలెడతావా! లేదా?” కోపంగా అరిచాడు రాఘవ. అసలే, నిన్నటి సంఘటనతో, ఒళ్లు మండి అసహనంగా ఉన్న రమణి.. కప్పు కాఫీతో పాటు, ఒక అగ్గిపెట్టె తెచ్చి పెట్టిందక్కడ.

“అరే! అగ్గిపెట్టె? నాకెందుకు?” అంటుంటే, “ఆ తగలెసేదేదో, మీరే తగలేసుకోండి” కోపంగా అంది రమణి.

విచిత్రంగా చూస్తున్న భర్త దగ్గరనుండి విసవిసా వచ్చింది.

“అమ్మాయ్! నైవేద్యానికి పొంగలి సిద్ధమైందా లేదా? గంట వాయించాలి” అంటున్నఅత్త గంగమ్మ అరుపులు గంగవెర్రులెత్తిస్తుంటే, గంట పట్టుకెళ్ళి అత్తగారికిచ్చి, “మీకు కావలసినంత సేఫు వాయించుకోండి. లేదా పొంగలి అయేవరకూ ఆగండి. స్టవ్ మీద నేను కూర్చున్నా. తొందరంటే కుదరదు. నన్ను వాయించకండి” అంది విసురుగా వస్తూ.

“మా కాలంలో మేమెరగమమ్మా! అత్తగారి పేరు చెప్తే హడలి చచ్చేవాళ్ళం.. ఆరుగురి పిల్లలతో ఇంటెడు చాకిరీ ఎంచక్కగా ఒంటి చేత్తో చేసుకునేదాన్ని.. ఒక్క ఉద్యోగం చెయ్యలేదని మాటేగాని,ఇంటిటింటెడుపని చేసేదాన్ని, ఈ రుసరుసలు బుసబుసలు ఎరగమమ్మా!” దీర్ఘాలు తీస్తున్న అత్తగారితో –

“అవును మరి, అన్నపూర్ణాదేవిలా అలా వండి వడ్డించే అత్తగారు, ఇరవైనాలుగ్గంటలూ ఇంట్లో ఉండి చాకిరీచేసే దాసి, మీ పిల్లల్ని ఆడిస్తూ మీ దగ్గరకి రాకుండా చూసే ఆడబిడ్డ, మరిది, పాలేర్లు, సంచులతో కాసులు  తెచ్చి ఇల్లు నింపే మామగారు, పెద్ద ఉద్యోగం చేసి పేరు ప్రతిష్ఠలున్నా, నౌకర్లు చాకర్లున్నా నోరెత్తకుండా తన పని తాను చేసుకు పోయే భర్త. పాపం. ఎన్ని కష్టాలు పడ్డారో?” వ్యంగ్యంగా అంది రమణి..

గొణుక్కుంటూ ఉంది గంగమ్మ..

“అమ్మా, అమ్మా! అక్క చూడు, కుక్కలా ఎలా కరుస్తోందో?” కొడుకు కుశల్ కేకలు వేసాడు.

“అమ్మా! తమ్ముడే నా థీరం బుక్ తీసుకొని, అడిగితే అట్టలూడబీకుతున్నాడు” కూతురు కోమలి ఫిర్యాదు.

విసురుగావెళ్ళి, అక్కడున్న కోలాటం కర్రలు చెరొకటీ. వారి చేతికి ఇచ్చి, “ఇక్కడ కాదు.. రోడ్దుమీదకెళ్ళి కొట్టుకోండి. మీ నైపుణ్యం చూసి, ఏ కళాకారులో అని జనం మెచ్చుకుంటారు.. వేషాలెయ్యకండి. ఇంకోసారి అరిస్తే చీరేస్తాను” అంది.

అక్కడో చీర పడేసి వచ్చింది రమణి కూతురు నవ్వుతూ. ‘జబర్దస్త్’ అని నవ్వాడు కొడుకు..

“ఒరేయ్! తమ్ముడూ! అమ్మ, ఈ రోజు చాలా వేడిమీదుంది, అరిచావో దోసె లేస్తుంది”.. అన్నకూతురితో.. “నీ వీపు మీద వేడి వేడి బొబ్బట్లేస్తాను.. ముందు లేచి, ఈ రూం నీటుగా సర్దుకొని. స్నానాలు చేసి రండి. వీడొక ‘రావణుడు’, నువ్వొక ‘శూర్ఫణఖ’ నాప్రాణానికి..

కాకపోతే రామాయణంలో రావణుడు, చెల్లెలి కోసం రాముడితో యుద్ధంచేస్తే, ‘మీ తమ్ముడు రావణుడు ఏది కావల్సినా నీతోనే యుద్ధం చేస్తాడు. అంతే తేడా!” అంది రమణి అక్కడనుండి కదుల్తూ.

కూతురుతో “మీ అమ్మకు, ఈ రోజేమయింది రా? తిక్క తిక్కగాఉంది?” అన్నాడు రాఘవ.

“నీకు తెలియదా! నాన్నా? నిన్న అమ్మకి ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చారు.. అందుకే! అమ్మ. మనకి వార్నింగ్ లిస్తోంది. ..ఆన్‌లైన్ క్లాసులో, అమ్మ స్టూడెంట్స్ – ‘లాక్‌డౌన్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారా టీచర్?’ అని ఒకడు.. ‘మీ హస్బెండ్ పిలుస్తున్నారు. వినిపిస్తోంది. చూడండి మేడం’ అని ఒకడు.., ‘టీచర్ మనిద్దరం డాన్స్ చేద్దామా?’ అని ఒక్కర్తి అడిగిందిట.. మీ క్లాస్‌లో పిల్లలు మీ తోనే అలా ఎందుకు మాట్లాడారు? అని అమ్మని కోప్పడ్డారు ప్రిన్సిపల్. అదీ సంగతి!” అన్నాడు కొడుకు..

“ఆపరా! వెధవా! అమ్మని అనేంత గొప్పవాళ్ళా మీరు? ఆ మూర్ఖపు పిల్లలు, ఏదో వాగితే, మీరింకా మూర్ఖుల్లా వాగకండి.. పిల్లలు, భయం భక్తి లేక ఏదో వాగితే వాళ్ళని తిట్టక, ప్రిన్సిపల్ తనననడమేంటి? అయినా మీరు, మీ నాన్న, నాన్నమ్మ, హాల్లో కూర్చొని ఆర్డర్లెయ్యకపోతే, వంట గదిలోకెళ్ళి సాయం చేయొచ్చు గదా? అటు ఆన్‌లైన్ క్లాసులూ, ఇటు ఇంట్లో చాకిరీ కాళ్ళా, చేతులా ఎలా కొట్టుకుంటోందో చూస్తున్నారు గదా? ఇలా ఇంట్లో ఉన్నప్పుడు. నలుగురూ నాలుగు పనులూ చేసుకుంటుంటే, తనకి బాగుంటుంది కదా?” అన్నారు లోపలికి వస్తూ రమణి మామగారు మాధవరావు.

కుర్చీలో కూర్చొని కుప్పగా పడున్న బట్టలు, మడతలు పెట్డాడానికి చేతిలోకి తీసుకుంటున్నారు మాధవరావు.

“అయ్యో! మీరు ఆ పన్లు చేయొద్దు. నేను చేస్తాను మామయ్యా! అలా వదిలేయండి. వాళ్ళకి మంచి చెప్పకండి. మిణుగురు పురుగుల్తో మంట కాచుకోలేరని హితవు చెప్పిన పక్షి పీక కొరికి చంపిన కోతుల్లాంటి వారు వీరు.. మీరిలా అన్నారని మీ మీద పడిపోతారు వీళ్ళు.. కనీసం, మీరైనా నా కష్టం గుర్తించారు.. సంతోషం మామయ్యా!” అంది రమణి ఆయనకు నమస్కరిస్తూ..

“కష్టం గుర్తించడం కాదమ్మా! నీ కష్టానికి భగవంతుడు కరుణించాడనే శుభవార్త తీసుకొచ్చి, ఈ గోల హడావిడిలో మరచిపోయాను. నీవు చాలా కాలం క్రితం మా స్నేహితుడు రాఘవయ్య వాళ్ళ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా అప్లయి చేసావు కదా.. ‘అప్పుడు ఏదో ఒత్తిడిలో మీ కోడలికి లెక్చరర్ పోస్టు ఈయలేకపోయాను.. ఇప్పుడు మా జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ పోస్టు ఖాళీగా ఉంది. మీ కోడలికి పూర్తి అర్హతలున్నాయి.. దానికి తోడు మన పిల్ల కాబట్టి బాధ్యతగా చూసుకుంటుంది.. మా కొడుకు కోడలు అమెరికా వెళ్లి పోతున్నారు.. నేను పెద్దవాడినయ్యాను. మీ కోడలయితే, నా కూతురికి అండగా నిలబడి మన ఆశయాలను అనుగుణంగా కళాశాల నడుపుతుంది అనుకున్నాం మా కుటుంబ సభ్యులంతా. నిర్ణయించుకున్నాం. అమ్మాయికి ఇష్టమైతే వచ్చి, అప్లికేషన్ ఇయ్యమని పద్ధతి ప్రకారం మాత్రమే చెప్పు. మేము అమ్మాయిని ప్రిన్సిపల్ చేస్తాము. నేను ఎప్పటిలాగే చైర్మన్‌గా ఉండి చూస్తాను’ అన్నాడమ్మా” అన్నారు మాధవరావు.

“నిజమా, మామయ్యా!” సంభ్రమంగా అంటున్న రమణి చేతులు పట్టుకొని, “వావ్. కంగ్రాట్స్ అమ్మా” అన్నారు పిల్లలు గెంతుతూ..

“నాన్నా! రేపటి నుండి అమ్మ ప్రిన్సిపల్, నువ్వు లెక్చరర్” అన్నారు సంతోషంగా.

“ఇంత క్వాలిఫైడ్ అయినా ఆ ప్రిన్సిపల్ చేత అన్ని మాటలు పడుతూ అక్కడే చేస్తోందని అన్నాను గానీ, నాకు మాత్రం సంతోషం కాదా? అయినా ఈ ఇంటికి ఆవిడే కదా ప్రిన్సిపల్. మనందరం స్టూడెంట్సుమే.. కంగ్రాట్స్ రమణీ” అన్నాడు రాఘవ.

ఇంత ‘కలకండ’ తెచ్చి కోడలికి మనుమలికి కొడుకుకు భర్తకు పంచి – “చూసారా? నేను పూజలు చేసిన ఫలితమే కోడలు ప్రిన్సిపల్ అయ్యింది. అక్షతలు వేస్తానుండండి” అనిన భార్యతో మాధవరావుగారు –

“ఆ అక్షతలు వేయకుండా, ఈ అక్షతలు వేస్తే సంతోషమే కదా” అన్నారు.

ఘొల్లున నవ్వారంతా..

Exit mobile version