[బాలబాలికలకు కాకతీయుల చరిత్ర, రామప్ప దేవాలయం గురించి కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.]
ప్రతాపరుద్రుడు
[dropcap]ర[/dropcap]వి ఆన్‌లైన్ క్లాస్‌లతో, హోమ్ వర్క్‌తో బిజీ అయ్యాడు. మదనిక గురించి మర్చిపోయాడు దాదాపుగా.
ఎప్పటిలా ఒక రోజు ఎర్లీ మార్నింగ్ నిద్రలో ఉన్న రవికి చమేలీల సువాసన, చల్లని గాలి రాకతో మదనిక వచ్చిందని తెలిసింది. బద్ధకంగా, ఆనందంగా లేచి కూర్చున్నాడు ఇవ్వాళ ఎవరి గురించి చెబుతుందో అనుకుంటూ.
“రవి! శుభోదయం! కుశలమా?” అని పలకరించింది.
“హే మదనిక! హౌ అర్ యూ? చాల రోజులయింది కనపడి. ఎలా ఉన్నావు?”
ఇద్దరు నవ్వుకున్నారు – ఒకే ప్రశ్న అడిగినందుకు.
“మదనికా! ఇవ్వాళ ఎవరి గురించి చెబుతున్నావు?”
“నేను నీకు కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాపరుద్రుని గురించి చెబుతాను. అతడు మహారాణి రుద్రమదేవి మనమడు. నీకు తెలుసుగా ఆమెకి కుమారులు లేరని. రుద్రమదేవి తన తరువాత తన అఖండ కాకతీయ రాజ్యాన్ని పాలించటానికి తన కూతురి కుమారుడైన ప్రతాపరుద్రుని దత్తత తీసుకుని ప్రిన్స్‌గా.. వారసునిగా చేసింది. అతనికి వీరరుద్రుడు, కుమారరుద్రుడనే పేర్లు కూడా ఉండేవిట. పాపం అతని పాలనాకాలం అంతా శత్రువులతో యుద్ధాలతోనే సరిపోయిందిట.”
“అమ్మో యుద్ధమా?”
“యుద్ధాలలో కూడా ప్రజలకు మంచి జరిగేలా అనేక సంస్కరణలు చేసాడు. కాకతీయ పాలకుల వారసత్వాన్ని నిలబెట్టాడు. ప్రజల మంచికి ప్రాధాన్యం ఇచ్చి నీటి వసతి కోసం చెరువులు తవ్వించాడు. నీటి వసతులు, ఇతర వసతులు, వాణిజ్యం, వ్యవసాయాలని ప్రోత్సహించాడు. 1289లో రాణి రుద్రమదేవి చనిపోయాక రాజుగా పరిపాలన ప్రారంభించాడు. అంబదేవుడనే సామంతుని..” అని మదనిక చెప్తుండగానే-
“సామంతుడంటే?” అని అడిగాడు రవి.
“నీకు అర్థం అయ్యేలా ఎలా చెప్పను? ఆ! ఒక గొప్ప రాజు లేక చక్రవర్తి అధికారాన్ని ఒప్పుకుని కప్పం అంటే టాక్సులు కడుతూ పరిపాలించే చిన్న రాజు లేదా పాలకుడు. బహుశా tributary ruler అనుకుంట. అంబదేవుని తిరుగుబాటును.. revolt ని కట్టడి చెయ్యటానికి ప్రయత్నించాడు. తన నాయక సైన్యానికి తగిన శిక్షణ ఇచ్చి, యుద్ధ తంత్రం అంటే స్ట్రాటజీతో సిద్ధం చేశాడు. సైన్యాన్ని మూడు భాగాలుగా మూడు మార్గాల్లో నడిపించి అంబదేవుని ఓడించి రాజ్యం నుండి తరిమేసాడట.”
“Wow. Good” అన్నాడు రవి ఉత్సాహంగా.
“కాకతీయ రాజ్యం లోని తిరుగుబాట్లు సమర్థవంతంగా ఎదుర్కొని సద్దుమణిగేలా చేసాడు. ఇంతలో నార్త్ ఇండియా వైపునుండి ఊహించని పెద్ద ముప్పు వచ్చిపడిందిట.”
“ముప్పు? Big danger? How? ప్రతాపరుద్రుడు అన్ని తిరుగుబాట్లు అదుపు చేసాడని చెప్పావుగా?” అన్నాడు రవి
“నిజమే. కానీ రాజ్యపాలన అంత సులువు కాదు. అప్పటి రోజుల్లో దక్షిణ భారత దేశ ప్రాంతంలో గొప్ప రాజ్య వంశాలు చాలా సంపదతో ఉండేవి. ఆ సంపద ఉత్తర ప్రాంత ముస్లిం పాలకులను ఆకర్షించింది.”
“అవును. మా సోషల్ టీచర్ అనేక యుద్ధాలలో అనేక కట్టడాలు శిధిలం అయ్యాయని, సంపదని దోచుకున్నారని చెప్పారు” అన్నాడు రవి.
“రవి నీకు ఖిల్జీ రాజుల గురించి తెలుసా?”
“ఏదో కొద్దిగా తెలుసు. ‘పద్మావత్’ సినిమాలో చూసాను.”
“సినిమా అంటావు. అదేమిటీ?”
“సినిమా తెలీదా? ఓహ్ సారీ. నువ్వు చాలా ఓల్డ్ టైమర్‌వి కదా” అన్నాడు రవి.
“నీకు తెలిసేలా ఎలా చెప్పాలి? మదనికా, మీ కాలంలో రంగమండపాలు, రాజు ఆస్థానంలో మీరు నృత్యం.. డాన్స్ చేసేవారు కదా? మేము ఒకేసారి వందలమంది హాల్లో కూర్చుని తెర మీద వినోదం చూస్తాం” అన్నాడు రవి. సరిగా చెప్పలేదని అనుకున్నాడు. ఇంకెలా చెప్పాలో తేలిక తలపట్టుకున్నాడు.
“రవి నీ మాటల్లో సినిమా తప్ప ఇంకేమి అర్థం కాలేదు” అంది మదనిక.
“సరే విను. 1296లో ఢిల్లీ సుల్తాన్ అల్లుడు దేవగిరిపై యుద్ధం చేసి గెలిచి చాలా సంపదను దోచుకువెళ్ళాడుట. తరువాత అతను మామను చంపి అల్లాఉద్దీన్ ఖిల్జీ అనే పేరుతో ఢిల్లీకి పాలకుడు అయ్యాడట. వర్తకులు మాట్లాడుకుంటే విన్నాను. 1303లో అతని చూపు సంపన్నమైన కాకతీయ రాజ్యంపై పడింది.”
“అయ్యో దేవా! తరవాత ఏమైంది? కాకతీయులతో యుద్ధం చేసారా? ప్రతాపరుద్రుడు ఖిల్జీని ఓడించాడా?” అన్నాడు రవి కంగారుగా.
“ఏమవుతుంది, నువ్వు అనుకున్నదే యుద్ధం. అన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగితే ఎలా? నీకు తెలుసు నేను అడవిలో దూరప్రాంతంలో గుడిలో ఉంటానని. మా గుడికి యాత్రకు వచ్చిన యాత్రికుల వల్ల నేను విన్నది వున్నట్లుగా చెబుతున్నాను. విను. నన్ను తికమక పెట్టకు” అంది విసుగ్గా.
“సరే సరే. తొందరగా చెప్పు” అన్నాడు రవి.
“అల్లాఉద్దీన్ ఖిల్జీ నమ్మిన సర్దారులు మాలిక్, జాజు పెద్ద సైన్యంతో దండెత్తివచ్చారట. కానీ వాళ్ళని కాకతీయ నాయకుడు పోతుగంటి, ఉప్పరపల్లి అనే చోట ఆపి ఓడించి ఢిల్లీ వైపుకి తరిమికొట్టారు.”
రవి ఆ యుద్ధాన్ని బాహుబలి వార్ సీన్స్ టైపులో ఊహించుకుని కాకతీయ రాజు గెలిచాడని ఆనందంగా నవ్వాడు.
“భలే అయింది. అంతే కావాలి” అన్నాడు. మదనిక నవ్వింది.
“మదనికా ఖిల్జీలతో యుద్ధం పూర్తవలేదా?”
“లేదు రవి. అది మొదటి దాడి.. మొదటి యుద్ధం. 1309లో సుల్తాన్ ఇంకా ఎక్కువ సైన్యంతో మాలిక్ కాఫర్‌ని పంపాడట. అతను ప్రతాపరుద్రుని సైన్యంతో యుద్ధం చేస్తూ కొద్దికొద్దిగా రాజ్యాన్ని ఆక్రమిస్తూ.. Occupy చేస్తూ ఓరుగల్లు కోటని, ఢిల్లీ సేనలు కోట చుట్టూ ఉన్న మట్టి కోటని దాని చుట్టూ ఉన్న అగడ్తని దాటి రావాలని చాలా ప్రయత్నాలు చేసారు. రాతి కోటను పాడుచెయ్యాలని ప్రయత్నించారు. ఓరుగల్లు యుద్ధం వారం రోజులపాటు జరిగింది. మాలిక్ కాఫర్ రాతి కోటను దాటి లోపలి రాలేకపోయాడు. ఆ కోపంతో, రవి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగిన ఫలితం అమాయక ప్రజలపై పడుతుంది. మాలిక్ కాఫర్ ఓరుగల్లు ప్రాంత గ్రామాలూ, ప్రజల ఆస్తులు నాశనం చేసాడు, ప్రాణాలు తీసాడు. అనేక కష్టాలు పెట్టాడట” అని మదనిక కన్నీరు పెట్టింది.
రవి యుద్ధ విధ్వంసాన్ని.. War destruction ని ఊహించుకున్నాడు.
“రవి ప్రతాపరుద్రుని ఏమి చెయ్యలేక ఢిల్లీ సర్దారు కోట బైట గ్రామ ప్రజలను చంపి దోచుకెళ్ళాడు. ప్రజల కోసం ప్రతాపరుద్రుడు సుల్తానుతో సంధికి ఒప్పుకున్నాడు. సంధిలో భాగంగా చాలా నిధి, బంగారం, ఏనుగులు ఇచ్చారట. ఈ యుద్ధం తరువాత కాకతీయ రాజ్య పతనం ఆరంభం అయింది” అంది మదనిక.
“మూడవ దాడి 1318లో జరిగింది. ఢిల్లీ సుల్తాను కొడుకు రాజయ్యాడు. అతడు దక్కను ప్రాంత రాజ్యాలపై దండెత్తుతూ ఓరుగల్లు వచ్చాడట. అతను చాలా క్రూరుడు. అది తెలిసిన ప్రతాపరుద్రుడు తన రాజ్య ప్రజల శాంతి జీవితం భంగం కావద్దని తానే సుల్తానుకి ధన రాశులు పంపాడట, యుద్ధం ఆపటానికి.”
“What ఆ great king. ఢిల్లీ రాజుల గోల ఆగిందా?” అన్నాడు రవి.
“లేదు. అంత అదృష్టమా?” అంది మదనిక.
“మళ్ళీ ఏమి జరిగింది?” అన్నాడు రవి.
“నాల్గవ దాడి 1320లో. ఢిల్లీలో ఖిల్జీలు పోయి తుగ్లకులు వచ్చారట.”
“మదనికా! నేను తుగ్లక్ పాలన గురించి విన్నాను. ఢిల్లీ నుండి రాజధానిని దేవగిరికి మార్చి ప్రజలను బలవంతాన తెచ్చి కొంతకాలం తరువాత మళ్ళీ ఢిల్లీకి మార్చాడట. ప్రజలు చాల ఇబ్బందులు పడ్డారని విన్నాను” అన్నాడు రవి.
“అవునా? నాకు తెలియదు. షియాజుద్దీన్ తుగ్లక్ సుల్తాన్ అయ్యాడట. ఏ అయోమయ స్థితిలోనో ప్రతాపరుద్రుడు, ఖిల్జీలకు ఇస్తానన్న కప్పం.. టాక్స్ ఆపేసాడు.”
“ఓహ్ నో! తుగ్లక్ రాజులకు కోపం వచ్చింది కదా? కాకతీయులు మా ఒప్పందం ఖిల్జీలతో నీతో కాదన్నారా?” అన్నాడు రవి.
“ఏమో! నాకు తెలియదు. బహుశా కావచ్చు.”
“తరువాత ఏమి జరిగింది?” అన్నాడు రవి ఆత్రుతతో.
“ప్రతాపరుద్రుడు కప్పం ఆపేసాడు. ఖిల్జీలకు ఇచ్చిన బీదర్ కోటని వెనక్కి తీసుకున్నాడు. ఇవన్నీ తుగ్లక్‌కి కోపం తెప్పిచ్చాయట. తుగ్లక్ కొడుకు కాకతీయులపై దాడి చేసి బీదర్, కోటగిరి కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఓరుగల్లు కోటని ముట్టడించారు. రాతి కోట చాలా గట్టిది.. స్ట్రాంగ్.. 5 నెలల యుద్ధం చేసిన ఓడించలేక విసుగుతో ఢిల్లీ వెళ్ళిపోయాడు.”
“హుర్రే. ప్రతాపరుద్ర యు అర్ గ్రేట్” అన్నాడు రవి.
“అవును రవి ఈ యుద్ధం కాకతీయుల సైన్యం, రాజు, నాయకుల పోరాట పటిమకి నిదర్శనం. ఇక 5వ దాడి..” అని చెప్తుండగా
“ఇన్ని సార్లు దాడులా?” అన్నాడు రవి.
“5 నెలల యుద్ధంలో గొప్ప సైన్యాన్ని ఓడించిన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు” అంది మదనిక.
“అదేంటి? ఇప్పుడే చెప్పావుగా యుద్ధం గెలిచారని” అన్నాడు రవి.
“అన్నాను. రవీ, యుద్ధంలో గెలిచినా ఓడినా ఆస్తి ప్రాణ నష్టం తప్పదు ఇద్దరికీ. అందులో ఎక్కడి నుండో వచ్చి ఇక్కడి ఆస్తులు, కోటలు, పంటలు నాశనం చేస్తే గెలిచినా ఆనందం తక్కువే.” చెప్పింది మదనిక.
“అవును. మన లాస్ ఎక్కువ” అన్నాడు రవి.
“రవి! ఎందుకోగానీ నాకు తెలియదు ప్రతాపరుద్రుడు నిరంతర యుద్ధాలతో పాడైన తన కోటలు, కందకాలు ఇతర భద్రతా కట్టడాలను సకాలంలో మరమత్తులు చేయించటంలో అశ్రద్ధ చేసాడు. విఫలం అయ్యాడు. అందుకు తగిన మూల్యం చెల్లించాడు. మంత్రులు, నాయకులు చెప్పినా వినలేదు. కారణం ఏదైనా కోటలు కట్టడాలు బలహీనం అయ్యాయి. ఇంకో దాడిని తట్టుకోలేక పోయాయిట” అంది విచారంగా.
“అయ్యో! అలా ఎలా చేసారు? Repairs అవసరం కదా” అన్నాడు రవి.
“నెల రోజుల్లోనే తుగ్లక్ రాకుమారుడు ఇంకా ఎక్కువ సైన్యంతో దాడి చేసాడు. ఎంతలా పోరాటం చేసిన కాకతీయులు ఓడిపోయారు.”
“అయ్యో! So sad. And then?”
“ఏముంది? ఓడిపోయిన ప్రతాపరుద్రుని బందీగా చేసారు. ఓరుగల్లు కోటలో బందీగా ఉంచితే ప్రజలు, సైనికుల మద్దతుతో బైటపడి ఎదిరిస్తాడనే భయంతో ప్రతాపరుద్రుని, కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకుపోయారుట. కానీ దోవలోనే నర్మదా నది తీరంలో చనిపోయారని చెప్పుకుంటుంటే విన్నాను. ఈ 5 యుద్ధాలలో ఓరుగల్లు పట్టణం, పరిసర ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని విన్నాను” అంది మదనిక బాధగా.
“ఓరుగల్లు గొప్పతనానికి, యుద్ధ విధ్వంసానికి గుర్తుగా మిగిలింది కాకతీయ తోరణం, శిధిల కట్టడాలు” అంది మదనిక.
“మీ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ తోరణాన్ని రాష్ట్ర చిహ్నంగా చేసిందని విన్నాను. సంతోషం. గత వైభవానికి, పాలకులకు తగిన గుర్తింపు. రవీ ఎంతటి గొప్ప రాజ్యాలైన కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ప్రజలకు మేలు చేసిన రాజ్యాలు గుర్తుండిపోతాయి తరతరాలు. సెలవు మిత్రమా!” అని తొలిపొద్దు వెలుగు జిలుగుల్లో మెరిసిపోతూ గాలిలో తేలుతూ వెళ్ళిపోయింది మదనిక.
స్టడీ టేబుల్ దగ్గర కూర్చుని మదనిక చెప్పిన సంగతులు నోట్ బుక్‍లో రాసుకుంటున్న రవిని చూసిన అమ్మ ‘మా బంగారు కొండ! బుద్ధిగా చదువుకుంటున్నాడు’ అనుకుంది.