రామప్ప కథలు-6

0
1

[బాలబాలికలకు కాకతీయుల చరిత్ర, రామప్ప దేవాలయం గురించి కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.]

పేరిణి నృత్యం

చాలా రోజుల తరువాత మంచి నిద్రలో ఉన్న రవికి మల్లెల వాసనతో చల్లని గాలి తగిలి వణికాడు నిద్రలో. అంతలోనే “రవి! ఓ యువకా రవి!” అనే పిలుపు వినిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలోంచి లేచాడు.

ఎదురుగా స్టడీ టేబుల్ దగ్గర కూర్చున్న మదనిక కనపడింది.

“ఓహ్ మై! ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు! వచ్చావు. సో సో హ్యాపీ!” అన్నాడు రవి.

“రవి! కుశలమా?”

“కుశలమే మదనికా” అని నవ్వాడు రవి.

“రవి నీకు రామప్ప దేవాలయంలో ఉన్న నృత్య శిల్ప భంగిమలు.. అంటే మీ నూతన భాషలో పోజ్‍ల గురించి, వాటికి ఆధారమైన ‘పేరిణి నృత్యం’ గురించి చెబుతాను”

“వావ్! నేను వినటానికి రెడీ” అంటూ రామప్ప కథలు రాసిపెట్టిన నోట్ బుక్ తీసాడు రవి.

“చెప్పు”

“రవి! కాకతీయ వీరుడు సేనాని జయాప ‘నృత్య రత్నావళి’ అనే పుస్తకం రాసాడు అని చెప్పను కదా!  కాకతి గణపది దేవ చక్రవర్తి ప్రేమకు పాత్రుడైన జాయప తన శక్తి వల్ల సేనాని అయ్యాడు. ఈయన వీరుడే కాక కళాకారుడు కూడా. జాయపకు నృత్యాలంటే చాలా ఇష్టం. గణపతిదేవ చక్రవర్తి జాయప అంటే ఉన్న ప్రేమ కారణంగా అతనికి సకల విద్యల్నీ, కళలనూ నేర్పించాడు. ఆ తరువాతనే జాయప నృత్తరత్నావళి రచన ప్రారంభించి దానిని క్రీ॥శ॥ 1253-54 ప్రాంతాల్లో పూర్తి చేశాడు. ఇది నృత్యంలో ఆభరణం లాంటిదని నృత్యకారుల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రులు రచించిన ప్రపథమ నృత్య శాస్త్ర గ్రంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు అనే వారు చెప్పేవారని రామప్పకు వచ్చిన నాట్యగాళ్ళు అంటుంటే విన్న గుర్తు. భరతనాట్యమంతా మూర్తీభవించి రామప్ప గుడి స్థంభాల మీదా, కప్పుల మీదా కనబడుతూ వుంది.

ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే ‘పేరిణి శివ తాండవం’. ఇది వీరులు చేసిన వీర నాట్యం. శివాలయాల్లో పురుషులే నృత్యం చేసేవారు. రోజుకు 6 సార్లు దేవుని దర్బారని పిలువబడే కళ్యాణ మండపాలలో చేసేవారు తెలుసా. స్త్రీలు కేశిక నృత్యాలను చేసేవారు. దేవాలయాల్లో చేసేది సంప్రదాయ సిద్ధమైన నృత్యాలు మాచర్లలో నున్న శివకేశవుల దేవాలయాల్లో, పేరిణి నృత్యాన్ని భక్తితో చేసేవారట. అంతే కాదు కోటప్ప కొండ, శ్రీశైలంలో శివరాత్రి నాడు పేరిణి నృత్యానికి చెందిన కొన్ని నృత్యాలు చేశారట.

పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం. దీన్నే ‘యోధుల నృత్యం’.. వీరుల డాన్స్ అని కూడా అనేవారు. పూర్వకాలంలో సైనికులు యుద్ధనికి వెళ్ళబోయే ముందు పరమ శివుడి ముందు ఈ నాట్యాన్ని చాలా భక్తితో చేసే వారు. ఓరుగల్లును దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా వాడుకలో ఉందిట. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించిగొప్ప అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనపడకుండా పోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య నటరాజ రామకృష్ణ కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చిందని యాత్రికులు అనుకుంటే విన్నాను.

రవి ఎప్పుడైనా మీ మా ఆంధ్ర నృత్యం పేరిణి శివ తాండవాన్ని చూసావా?” అని అడిగింది మదనిక.

“లేదు. స్టేజి మీద చూడలేదు. కానీ ఒకసారి మా ఫ్రెండ్ అక్క వీడియో ప్లే చేసి చూస్తుంటే చూసాము. అక్క డాన్స్ నేర్చుకుంటున్నది.”

“అవునా? సంతోషం. ఇది వీరుడు, కళాకారుడు అయిన జాయప రాసిన పేరిణి నృత్యం కథ. వీలైతే ఇంకొంచం తెలుసుకో. నాకు తెలిసింది ఇంతే. వెళ్లి వస్తాను మిత్రమా రవి!”

“ఇంకో కథతో” అంటూ రవి ఏదో అనేలోపలే తొలి పొద్దు బంగారు కిరణాలలో కలిసిపోయింది మదనిక.

రవితో పాటు మనము వేచిచూద్దామా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here