Site icon Sanchika

రామసేతు

[అనుకృతి గారు రచించిన ‘రామసేతు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]రై[/dropcap]లు సికింద్రాబాద్ స్టేషన్ సమీపిస్తుండగా రెండు సూట్ కేసులూ, ఒక బ్యాగ్ తోటి ప్టయాణీకుల సాయంతో డోర్ దగ్గిరకు చేర్చింది సమీర. నాలుగేళ్ల హర్షని గట్టిగా పట్టుకొని నించుంది.. ఆమె మనసంతా ఆందోళనగా వుంది, కొత్త వూరు, బ్రతుకు తెరువు కోసం పసివాడితో ఒంటరి ప్రయాణ౦. స్టేషన్‌కి ఎవరైనా వస్తారో, రారో, ఒంటరిగా అడ్రస్ పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళాలో ఏమో అనుకుంటూ నించుంది.

స్టేషన్లో రైలు ఆగగానే, ఎదురుగా నించున్న పొడుగాటి యువకుణ్ణి చూసింది. “మీరు సమీర కదా,” అంటూనే “మీరు దిగండి, పోర్టర్ సామాను దించుతాడు” అంటూ హర్షని రెండు చేతులతో పట్టుకొని కిందకు దించాడు. సమీర కూడా దిగి ప్రక్కగా నించుంది. పోర్టర్ ముందు నడుస్తుంటే “హాయ్, యంగ్ మ్యాన్, కమాన్” అంటూ చేయి సాచాడు. హర్ష సిగ్గుపడి, తల్లి వెనక దాక్కున్నాడు.

“పోర్టర్ వెళ్ళిపోతున్నాడు, లగేజ్ తీసుకెళ్ళిపోతున్నాడు, నీ ఇష్టం” అన్నాడు శ్రీరామ్. బాబు వెంటనే తల్లి చేయి వదిలి అతని చేయి పట్టుకొని, నిజంగానే పోర్టర్ సామాను తీసుకెళ్ళిపోతాడన్నట్టుగా అతనితో పాటు పరుగు లాంటి నడకతో వెళ్ళటం చూసి ఆశ్చర్యపోయింది సమీర. హర్ష అంత తొందరగా ఎవరితోనూ కలవడు. ముందు వాడి మాట ఎవరికీ తొందరగా అర్థం కాదు. వాడిలోని లోపం వాడిని నలుగురిలో కలవనీయదు. తల్లే వాడి ప్రపంచం. అటువంటి పిల్లడు, ఒక్క నిమిషంలో శ్రీరామ్ వెనుక పరిగెత్తటం విచిత్రంగా తోచింది ఆమెకు. కొంత దూరం వెళ్ళాక, వాడిని ఎత్తుకొని నడవసాగేడు శ్రీరామ్. ఆతని నడకలో ఏదో తేడా ఉన్నట్టనిపించింది ఆమెకు. ఏదో అసహజత్వం ఉందనిపించింది, కానీ అదేమిటో ఆమెకు తెలియలేదు.

స్టేషన్ పార్కింగ్ స్లాట్‌లో వున్న జీప్ దగ్గరికి వెళ్ళగానే, “ముందు కూర్చోండి, వెనక కంఫర్టుబుల్‌గా ఉండదు” అంటూ, స్టీరింగ్ ముందు కూర్చుని, హర్షతో అన్నాడు, “డ్రైవ్ చేస్తావా” అంటూ వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, జీప్ స్టార్ట్ చేసాడు. హర్ష చేతులు స్టీరింగ్ మీద పెట్టాడు. వాడు అతనితో పాటు చేతులు తిప్పుతూ, నిజంగానే డ్రైవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ, మధ్య, మధ్యలో తల్లి కేసి చూస్తున్నాడు, ‘చూసావా నేను డ్రైవ్ చేస్తున్నా’, అన్నట్టుగా. శ్రీరామ్ చెప్పినప్పుడల్లా హారన్ కొడుతూ నవ్వుతున్నాడు.

ఇంటి ముందు జీప్ ఆపాడు శ్రీరామ్, లగేజ్ సమీర తీయబోతుంటే వారించాడు శ్రీరామ్. “సత్యం తీస్తాడు, మీరు రండి” అంటూ లోపలికి దారితీశాడు.,

విమలమ్మ ఎదురొచ్చి, సమీరకు గెస్ట్ రూమ్ చూపించింది. హర్షని లోపలికి పిలిచి, స్నాన౦ చేయించి హాల్లో కూర్చోమని, తానూ స్నానానికి వెళ్ళింది. ఆమె బయటకు వచ్చేసరికి, హర్ష అతని ప్రక్కన కూర్చుని, గ్రేప్ జ్యూస్ తాగుతున్నాడు.

ఆమెను చూసి చిరునవ్వుతో అన్నాడు, “మీకు ఆఫీస్ ప్రక్కన పోర్షన్ రేపటికల్లా రెడీ అవుతుంది, చిన్న, చిన్న మోడిఫికేషన్స్, ఎల్లుండి షిఫ్ట్ అవుదురుకాని”

అతని గొంతు స్నేహపూర్వకంగా వుంది. ఒక్క క్షణం అతని మొహం కేసి చూసి తలవంచుకుంది, అతని చెంపల మీదా, నుదిటిమీదా, మానిన గాయాల తాలూకు గాట్లలాంటి మచ్చలు.

***

మర్నాడు పైకి వెళ్ళి, తన పోర్షన్ చూసుకొంది.. నాలుగేళ్ల నరకప్రాయమైన జీవితం తర్వాత, ఆ పోర్షన్ తనది అనుకుంటే ఆమెకు ఎంతో శాంతిగా, సంతోషంగా అనిపించింది. హర్ష మొహం లోని సంతోషం చూసి, ఆ తల్లి మనసు కూడా సంతోషపడింది. “ఇది మన ఇల్లా అమ్మా,” అన్న హర్షని హృదయానికి హత్తుకొని “అవున్నాన్నా, ఇంక మనం ఇక్కడే ఉండేది” అన్నది.

విమలమ్మ చెప్పాక ఆమెకు అతని నడక లోని తేడా ఏమిటో తెలిసింది. శ్రీరామ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రౌండ్ ఇంజనీర్‌గా వున్నప్పుడు. పఠాన్‌కోట్‌లో పాకిస్తాన్ చేసిన దాడిలో అతను గాయపడ్డాడు, బులెట్ తగిలిన, ఎడమకాలిని మోకాలి వరకు తీసేయాల్సి వచ్చింది. వంటినిండా గ్రనైడ్ దాడిలో గాయాలయ్యాయి. “హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యాక, హైదరాబాద్ వచ్చి, ఇది స్టార్ట్ చేశారు” అని చెప్పింది.

శ్రీరామ్ నడుపుతున్న సంస్థ ‘హెల్పింగ్ హాండ్స్’ అనే సోషల్ ఆర్గనైజేషన్. రెస్ట్ రూమ్ సౌకర్యం లేని గవర్నమెంట్, ముఖ్యంగా ఆడపిల్లల స్కూల్స్‌లో ఆ సంస్థ వాటిని కట్టిస్తుంది, ఇంకా చాలా రకాలుగా సోషల్ వర్క్స్ చేపడుతూ చాలా మంచి పేరు తెచ్చుకొంది క్లౌడ్ ఫండింగ్, విదేశాల నుండి ఫండ్స్ వస్తుంటాయి. సమీర ఆ సంస్థలో అకౌంటెంట్‌గా చేరింది. అందులో పనిచేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్న విద్యాధికులు.

రెండు రోజుల్లో తన వర్కుని ఆకళింపు చేసుకొని పని చేయసాగింది. అదివరకు ఏ పని చేయాలన్నా ఆందోళన, భయం, చేతుల్లో వణుకు ఉండేవి. ఇప్పుడదేమీ లేదు, ఎంతో ప్రశాంతంగా ఎప్పటికప్పుడు ప్రాజెక్టు రిపోర్ట్స్ తయారు చేసి పంపడం, ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయటం సమర్ధవంతంగా చేస్తోంది. శ్రీరామ్ ఆమెని ఒక ఎంప్లాయ్ లాగానే చూస్తున్నాడు.

హర్ష అతనికి చాలా క్లోజ్ అయ్యాడు, అతన్ని రామ్ అని పిలుస్తున్నాడు, రోజూ శ్రీరామ్ వాడిని బైక్ మీదనో, జీప్ లోనో, కార్ లోనే బయటకు తీసుకు వెళుతున్నాడు. హర్షకు ఇది కొత్త అనుభవం. వాడు ఏదన్నా చెబితే అర్థం కానట్టు చూసేవారు పెద్దవాళ్ళు. పిల్లలతో ఆడుకోవాలంటే, ఎవరూ దగ్గరికి రానిచ్చేవారు కాదు. శ్రీరామ్ ఒక మగపిల్లల ఆర్ఫనేజ్‌కి తీసుకువెళుతుండేవాడు. ఆ ఆర్ఫనేజ్ నడుపుతున్న జంట, పెద్దవాళ్ళైయినా, అతనికి చాలా క్లోజ్, దానికి అతను ఫండింగ్ కూడా చేస్తాడు. అక్కడి పిల్లలు మాత్రం, వాడితో చాలా సహజంగా కలిసిపోయి ఆడేవాళ్లు. అక్కడికి వెళ్లివచ్చిన రోజు వాడు తెగ కబుర్లు చెప్పేవాడు. వాడి చిన్న జీవితంలో అంత సంతోషం ఎప్పుడూ ఎరగడు.

ఆర్నెల్లు ఎలా గడిచి పోయాయో తెలియనంతగా కాలం గడిచిపోయింది. ఆ రోజు సెలవు ఆఫీసుకి. హర్ష వచ్చి, “అమ్మా, రామ్ పిలుస్తున్నాడు” అంటూ చెప్పి తోటలోకి పరుగెత్తాడు.

“కూర్చోండి” సమీర నుద్దేశించి అన్నాడు శ్రీరామ్. “హర్ష గురించి మాట్లాడాలని, మిమ్మల్ని రమ్మన్నాను”

సమీర కంగారుగా అడిగింది, “ఏమైనా అల్లరి చేసాడా?” అని.

“చ, అలాంటిదేమీ లేదు. నిజానికి వాడు చాలా బ్రిలియంట్ ఛైల్డ్, తెలుగులో చెప్పాలంటే ఏకసంథాగ్రాహి అనొచ్చు. మీరు వాడి ‘cleft lip’ అదే ‘hare lip’ని ఇప్పటిదాకా ఎందుకు సరిచేయించలేదు? ఇది నిజానికి చాలా చిన్న ఆపరేషన్, చిన్నప్పుడే చేయిస్తే మామూలుగా ఉండేవాడు.” ఆగాడతను.

సమీర తల వంచుకుంది. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. శ్రీరామ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కొంతసేపటికి తేరుకొని చెప్పసాగింది. “పెద్దలు కుదిర్చిన పెళ్ళే మాది. ప్రకాష్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నాన్న మంచి మ్యాచ్ అని వున్నదంతా ఊడ్చి పెళ్ళిచేసారు. అతని మీద అతని అక్కలు తల్లితండ్రుల ప్రభావం చాలా వుంది. కోపం చాలా ఎక్కువ. రెండు నెలలలోనే వాళ్ళ ప్రవర్తన మారిపోయింది. వాళ్ళు అనుకున్నట్టుగా నాకు మంచి జాబ్ రాలేదు. నాన్నను వేధించి మళ్ళీ నాలుగు లక్షలు లాగారు. నాన్న చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో. వున్న ఆ చిన్న ఇల్లు అమ్మేసి, అప్పులు తీర్చుకొన్నాడు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు తెమ్మని కొట్టడం మొదలు పెట్టాడు. అప్పుడే నెల తప్పాను. ఆ రోజు బాగా కొట్టాడు.

అబార్షన్ చేయిస్తానని, ఒప్పుకోమని, బలవంతం చేసాడు, నేను వినలేదు. ఏది మాట్లాడినా తప్పే, ఆడవాళ్ళయి ఉండి కూడా వాళ్ళ అమ్మా, అక్కయ్యలు నన్ను చాలా హీనంగా చూసేవాళ్ళు. వాళ్ళు చెప్పే చాడీలు విని బాగా హింసించేవాడు. మీకు అతను అన్న మాటల్ని చెప్పలేను. తిండి సవ్యంగా తిననిచ్చేవాళ్ళు కాదు. 6వ నెలలో అమ్మ దగ్గరికి వెళ్లాను. అమ్మ, నాన్న క్షోభకు అంతులేదు. బాబు పుట్టాడు, ఇలా గ్రహణం మొర్రితో పుట్టాడు.. గ్రహణం రోజు బయట తిరిగానని, అందుకే అలా పుట్టాడని, చెప్పరాని తిట్లు తిట్టి వెళ్ళారు. గ్రహణం మొర్రికి సైంటిఫిక్ ఆధారం లేదని చెప్పినా నమ్మని మూర్ఖులు వాళ్ళు. బాబుకు పాకడం వచ్చింది అప్పుడు, భయపడుతూనే వెళ్ళాను. మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది.

ఓ రోజు హర్ష పాకుతూ వెళ్లి అతని కాలు పట్టుకొన్నాడు. ఒక్క తన్ను తన్నాడు, పాలరాయి మీద వెల్లకితలా పడి పెద్దగా ఏడ్చాడు. నేను పరుగెత్తుకెళ్లి వాడిని ఎత్తుకొన్నాను. ‘మనిషివా, పశువ్వా,’ అని అరిచాను, కొట్టాడు, ఎదురుతిరిగాను, నా సర్టిఫికెట్స్ వున్న బ్యాగ్ తీసుకొని ఆ కొంపనుంచి బయటపడ్డాను.

అమ్మా, నాన్న దుఃఖానికి అంతులేదు. నేను పంపిన మెస్సేజెస్ ఉత్తరాలు నాన్న ఎవిడెన్స్‌గా పెట్టి విడాకులకు అప్లై చేసాము. ముందు వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ హరాస్మెంట్ కేస్ నిరూపించబడితే జాబ్ పోతుందని తెలిసి ఒప్పుకున్నాడు. ఈ నాలుగేళ్ల జీవితం ఒక నరకం. వాడు నెల, నెలా ఇచ్చేభరణం తాలూకు డబ్బు వద్దని చెప్పాను. ఈ ఆరునెలల్లో నేను అనుభవించిన శాంతి ఎప్పుడూ లేదు. వాడి ఆపరేషన్ గురించి డబ్బు దాచాను” ఆగింది ఆమె.

శ్రీరామ్ మనసంతా వికలమై పోయింది. ఒక పీడకలలాంటి జీవితం, ఇంత చక్కటి అమ్మాయి పట్ల అంత క్రూరంగా ఎలా ప్రవర్తించ గలిగారురు వాళ్ళు? నెమ్మదిగా అంన్నాడు శ్రీరామ్, “ఆ జీవితాన్ని మర్చిపోండి సమీరా, బాబు ఆపరేషన్ ఖర్చు మన సంస్థ భరిస్తుంది” అన్నాడు ఓదార్పుగా.

“వాడు భయపడతాడేమోనండీ” ఆమె గొంతులోని దైన్యానికి చలించిపోయాడతను.

“లేదు సమీరా, హర్షని నేను ప్రిపేర్ చేస్తాను”

ఆమెకు మొదటిసారిగా హర్ష మాటలు అతను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడో అర్థం అయ్యింది.. అతను ఒక సైనికుడు, ఎంతో ఏకాగ్రత, తెగువ వున్నమనిషి. ఆ ఏకాగ్రత వలనే అతను హర్ష మాటల్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. అదే అతన్ని ఎంతో సహజంగా వాడితో ప్రవర్తించేలా చేసింది.

మర్నాడు హర్షని తన గదిలో కూర్చోబెట్టుకొని, యుద్దమంటే ఏమిటో, దేశమంటే ఏమిటో, వీడియోల ద్వారా అర్థమయ్యేలా చెప్పాడు. హర్ష సూక్ష్మగ్రాహి, త్వరగానే అర్థం చేసుకొన్నాడు. తర్వాత ఎయిర్‌ఫోర్స్‌లో ఎలా జాయిన్ అయ్యింది చెప్పి తన వీడియోలు కొన్ని చూపాడు. అబ్బురపడ్డాడు హర్ష, అతని వంక అడ్మిరేషన్‌తో చూసాడు. నెమ్మదిగా వాడిని మానసికంగా సమాయత్తం చేసాడు, దాడులు ఎలా జరుగుతాయో చెబుతూ, తాను ఎలా కాలు కోల్పోయాడో చెప్పి, తన ఆర్టిఫిషల్ లెగ్ తీసి చూపించాడు.

హర్ష అతని ఎడమ కాలు మోకాలి వరకే ఉండటం చూసి తట్టుకోలేక “రామ్” అంటూ పెద్దగా ఏడ్చాడు. పదే, పదే అతని మోకాలు మీద తన చిన్న చేతులతో తడుతూ వెక్కి, వెక్కి ఏడ్చాడు.

“ఎందుకమ్మా ఏడుస్తున్నావు, భయం వేస్తోందా?” అడిగాడు.

వాడు ఏడుస్తూనే, “నీకు అప్పుడు ఎంత నొప్పి లేచిందో” అంటూ మళ్ళీ ఎడ్చాడు.

రామ్ వాడిని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. “హర్షా, నీ పై పెదవికి ఆపరేషన్ చెయ్యాలి, నాకు ఆపరేషన్ చేసి కాలు తీసేసారు, కానీ నీకు నీ పెదవి బాగవుతుంది, అందరి పిల్లల్లా మాట్లాడగలుగుతావు”

హర్ష అప్పటికి తేరుకున్నాడు. “రామ్ నువ్వు నాతో వుంటావా ఆపరేషన్ అప్పుడు”

శ్రీరామ్ నవ్వి తప్పకుండా, “దట్స్ ది స్పిరిట్ అఫ్ మై లిటిల్ సోల్జర్” అంటూ వారిని దగ్గరకు తీసుకొన్నాడు.

హర్ష ఆపరేషన్ బాగా జరిగింది. వాడు డిస్చార్జ్ అయ్యేదాకా రామ్ తోడున్నాడు.

మరో నాలుగు నెలలు హర్షకి స్పీచ్ థెరపీ ఇప్పించాడు శ్రీరామ్. వాడికి భాషలో పట్టు రావటానికి సంగీతం నేర్పించే ఏర్పాటు చేసాడు. వాడిని ఆ రోజు స్కూల్‌లో చేర్చటానికి తీసుకెళ్లాడు.శ్రీరామ్,సమీర కూడా వెళ్ళింది. హర్ష గ్రాహ్య శక్తిని చూసాక వాడిని సెకండ్ క్లాస్‌లో జాయిన్ చేసుకొన్నారు.

ఇంటికొస్తున్నప్పుడు సమీర తనని తాను కంట్రోల్ చేసుకోలేక పోయింది. ఇంటికి చేరాక, తోటలో బెంచ్ మీద కూర్చున్నాక కన్నీళ్లతో అతనికి చేతులు జోడించి నమస్కరిస్తూ, “మీకు, మీకు” అంటూ దుఃఖం నిండిన గొంతుతో మరి మాట్లాడలేక పోయింది.

“నేను జీవితంలో ఏ బంధాలు పెంచుకోకూడదనుకొన్నా సమీర, హర్షతో నాకు తెలియకుండానే అనుబంధం పెరిగింది. ఇంక మీరు దేని గురించీ ఆలోచించకుండా ప్రశాతంగా వుండండి.” లేచి వెళ్లిపోతున్న శ్రీరామ్ పట్ల ఆరాధనా పూర్వక కళ్ళతో చూస్తూ ఉండిపోయింది.

వేసవిలో వచ్చారు శ్రీరామ్ తల్లీ తండ్రి రఘురామ్, ప్రభావతిలు.. ఆనతి కాలం లోనే హర్ష వాళ్ళ మనసుని ఆకట్టుకున్నాడు. సమీరని చూసిన ప్రభావతి, రఘురామ్‌కి మనసులో ఒక ఆలోచన మెదిలింది. ప్రభావతి, శ్రీరామ్ గురించి ఆమెకు తెలియని విషయాలు చెప్పింది. శ్రీరామ్‌కి పెళ్ళైన ఆరు నెలలకే ఆ దుర్ఘటన జరిగింది. మంజుల అతని ఎయిర్‌ఫోర్స్ జీవితాన్ని ఇష్ట పడింది కానీ, అతని రూపం మారిపోవట౦, తట్టుకోలేకపోయింది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొన్నారు. నేను మంజుకి నచ్చ చెబుతానన్నాను, శ్రీరామ్ దానివల్ల ప్రయోజనం లేదని, విడాకులకు ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి వాడి అవిటితనాన్నే చూసింది కానీ, వాడి మంచితనాన్ని చూడలేకపోయింది” ఆ తల్లి కళ్ళలో నీళ్లు.

మరో రెండు రోజులకి సమీరతో వివాహ ప్రస్తావన తెచ్చారు. తన గురించి చెప్పబోయింది, వారించింది ప్రభావతి, “ నాకు తెలుసమ్మా, మీరిద్దరూ ఎదురుదెబ్బలు తిన్నవాళ్ళే”,

శ్రీరామ్ ఆమెతో ఆ రాత్రి మాట్లాడాడు. “నేను సంసార జీవితానికి అర్హుడినో, కాదో నాకు తెలియదు సమీరా, మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి”

సమీర లేచి, క్రింద కూర్చుని అతని మోకాళ్ళ మీద తల ఉంచి అన్నది, “నేను అన్నీ ఆలోచించాను శ్రీరామ్, ఏదో కృతజ్ఞతా భావానికి లోబడి నేను ఒప్పుకోవటం కాదు, ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు” అన్నది.

వాళ్ళ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. సమీర తల్లి, తండ్రి అక్కా, బావా సంతోషంగా ఒప్పుకొన్నారు. మర్నాడు శ్రీరామ్ ఆఫీస్ పని చూసుకొంటున్నాడు. “వెళ్లి రామ్‌ని పిలువురా” అన్నాడు రఘురామ్. తూనీగలా పరుగెత్తి “రామ్, అమ్మ పిలుస్తోంది” అంటూ క్రిందకి వచ్చి కిచెన్ లోకి తొంగి చూస్తూ “సీతా, రాముడొస్తున్నాడు, టిఫిన్ రెడీ చేయి” అన్నాడు.

సమీర బయటకు వచ్చి “సీత ఎవర్రా? అంది ఆశ్చర్యంతో.

“సీత తెలియదా, శ్రీరామ్ వైఫ్” అల్లరిగా జవాబు చెప్పి, యేవో కూనిరాగాలు తీస్తున్న హర్షని చూసి రఘురాం “నువ్వు సంగీతం నేర్చుకొంటున్నావుగా, ఏదీ ఒక పాట పాడు” అన్నాడు.

“రామ్ రానీ తాతయ్యా, పాడతాను” అన్నాడు. సమీర సిగ్గుపడింది అక్కడికి వచ్చి నిలుచున్న శ్రీరామ్‌ని చూసి. . శ్రీరామ్ రాగానే వాడు అతన్ని చూస్తూ, చేతులు జోడించి పాడటం మొదలెట్టాడు.

‘శ్రీరాఘవ౦ దశరధాత్మజ మప్రమేయం
సీతా పత్తిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి’

అంతా నివ్వెరపోయారు శ్రీరామ్ పట్ల వాడు చూపించిన ఆరాధనకు.

ముందుగా తేరుకున్న రఘురాం “సీతా, రాములు వీళ్లయితే మరి నువ్వెవరివిరా” అన్నాడు.

వాడు శ్రీరామ్ కుడిచేతి క్రింద అచ్చ౦ ఆంజనేయుడిలా ఒక కాలు మడిచి, చేతిని గద పట్టుకొన్నట్టుగా వంచి, రెండు పెదవులూ వానర ముమూతిలా చేసి తాను రామభక్త హనుమాన్ అని చెప్పకనే చెప్పాడు.

ఉద్వేగంతో లేచి వాడిని గుండెలకు హత్తుకొని, “అవును చిరంజీవీ, సీతా రాములని కలిపినా ఆ రామ సేతు నువ్వేరా” అన్నాడు రఘుపతి కన్నీళ్లతో.

Exit mobile version