[శ్రీమతి మద్దూరి బిందుమాధవి రచించిన ‘రామాయణ మార్గదర్శనం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]భా[/dropcap]రతీయులకి రామాయణం ఆదర్శ కావ్యం. రామాయణంలోని వివిధ గాథల ద్వారా ఎన్నో వ్యక్తిత్వ వికాస అంశాలు నేర్చుకోవచ్చు. రామాయణం నుంచి నేర్చుకోదగ్గ అంశాలను – 24 చిన్న కథల ద్వారా ‘రామాయణ మార్గదర్శనం’ అనే పుస్తకంలో అందించారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.
~
చిన్నప్పుడు తనకి పాఠాలు చెప్పిన టీచర్ రోడ్డు మీద కనబడితే, శిష్యురాలు ఆవిడని చూసి పలకరింపుగా నవ్వుతుంది. బహుశా ఆవిడ గుర్తుపట్టలేదో లేక చేస్తున్న లావాదేవీలో లీనమై ఉండడం వల్లో శిష్యురాలిని గమనించలేదు. టీచర్ గారు పట్టించుకోలేదన్న అపోహలో శిష్యురాలు ఆవిడని పలకరించకుండా వెళ్ళిపోతుంది. ఇలాగే మరో టీచర్ విషయంలో కూడా జరుగుతుంది. చివరికి ఒక స్నేహితురాలు చెప్పిన మాటలతో తన అపోహ ఎంత నష్టం కలగజేసిందో తెలుస్తుంది. రామాయణంలో శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్ణయించినప్పుడు అయోధ్యావాసులు రాముడి గుణాలని వర్ణిస్తూ చెప్పిన మాటని అన్వయిస్తూ పిల్లలు నేర్చుకోవాల్సిన కీలకమైన అంశాన్ని ‘పూర్వభాషీ’ కథలో చెబుతారు రచయిత్రి.
‘కథం చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి। న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా॥’ అన్న శ్లోకం ఆధారంగా – ఎదుటివారిలోని మంచిని గుర్తించే సంస్కారం అలవర్చుకోవాలనీ, మనకి ఉన్నంతలో తోటివారికి సాయం చేయాలని సూచించే కథ ‘బుద్ధికి శిక్షణ’.
పాఠశాలలో పిల్లలు తమని ఉపాధ్యాయులన్న మాటలలో సగం మాత్రమే తల్లిదండ్రులకి చెప్పి, వాళ్ళ మీద ఫిర్యాదు చేయిస్తే – ఆ ఉపాధ్యాయుల స్పందన ఏమిటన్నది ‘గురువు’ కథ చెబుతుంది. రామలక్ష్మణులను ఒకసారి విశ్వామిత్రునికి అప్పజెప్పాకా, దశరథుడెన్నడూ కలగజేసుకోలేదనీ, ఒకసారి గురువు చేతిలో పెడితే, బిడ్డలను అందమైన శిల్పాలుగా మలచే బాధ్యత గురువుదేనని తలచాడని ఓ స్వామీజీ తల్లిదండ్రులకు కనువిప్పు కలిగేలా చెప్తారీ కథలో.
‘చెరపకురా చెడేవు’ కథ – ఇతరులకు నష్టం కలిగించాలని ప్రయత్నిస్తే, ఆ చెడు మనకే ఎదురవుతుందనే సత్యాన్ని మంథర, కైకేయి ఉదాహరణల ద్వారా చెప్తారు రచయిత్రి. చెప్పుడు మాటల వల్ల ఎన్ని సమస్యలొస్తాయో ఈ కథ చెబుతుంది.
సమాజంలో పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు, అనైతిక లైంగిక సంబంధాలు, వాటి వల్ల జరుగుతున్న నేరాలకు మూల కారణాన్ని ‘నిగ్రహం’ కథ చెబుతుంది. రాముడు తన స్వపత్ని పట్ల పాటించిన నియమాలు, నిగ్రహాన్ని జనాలు పరాయి స్త్రీ/పురుషుడు పట్ల పాటించలేకపోవడం వల్లే ఈ సమస్యలని అంటారీ కథలో.
అపార్థాల వల్ల ఆత్మీయుల మధ్య సంబంధాల దెబ్బతింటాయంటానీ, తొందరగా ఎవరినీ అపార్థం చేసుకోకూడని ‘అపార్థం’ కథ చెబుతుంది. సీతారామలక్ష్మణులు అరణ్యాలకు వెళ్ళిగా, రాముడిని దర్శించేందుకు భరతుడు ససైన్యంగా వస్తున్న సందర్భంలో లక్ష్మణుడు భరతుడిని అపార్థం చేసుకోగా, రాముడు సంశయాలని దూరం చేస్తాడు. రామాయణం లోని ఈ ఘట్టాన్ని వివరిస్తూ – ‘అర్థం చేసుకోవడం కష్టం – అపార్థం చేసుకోవడం తేలిక’ అని రచయిత్రి చేసిన వ్యాఖ్య నిజం!
తాము చేస్తున్నది ‘తప్పు’ అని గ్రహించి, ‘ఎఱుక’ కలిగి ఆ తప్పుని దిద్దుకునేందుకు ప్రయత్నించాలని ‘ఎఱుక’ కథలో – అరణ్యవాసంలో రాముడికెదురైన ఇద్దరు రాక్షసుల వల్ల తెలుస్తుంది. రామాయణం కాలం నుంచి ఏర్పడిన ఓ సాంప్రదాయం గురించి రచయిత్రి ఈ కథలో చెప్తారు.
స్వాతిశయం, అహంకారం, బలగర్వం – మనిషిని ఎలా పతనం చేస్తాయో రామాయణంలోని కబంధుని పాత్ర ద్వారా ‘పరివర్తన’ కథలో తెలిపారు రచయిత్రి. కబంధుడిని వధించి, అతని శరీరానికి అంత్యక్రియలు చేశాకా, ఆ చితి లోంచి కబంధుడి పూర్వ రూపమైన గంధర్వుడు వెలువడి – సీతమ్మ జాడ కనుగొనడంలో సుగ్రీవుడనే వానర రాజు సాయపడగలడని చెప్తాడు. స్నేహం, సౌహార్ద్రం, సౌశీల్యత పరస్పరం ఉంటే కార్యసాధన సక్రమంగా జరుగుతుందని రచయిత్రి అంటారు.
శ్రీరామలక్ష్మణులను హనుమ తొలిసారి కలిసినప్పుడు హనుమ చేసిన సంభాషణ ద్వారా అతని మాటతీరు అత్యుత్తమైనదని రాముడు లక్ష్మణునితో చెప్పిన వైనాన్ని ‘మాట ఎలా ఉండాలి?’ అనే కథలో తెలుపుతారు రచయిత్రి. భర్తృహరి రచించిన ‘కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా’ శ్లోకాన్ని ఈ కథలో ఉపయోగించడం సందర్భోచితంగా ఉంది.
స్నేహం గురించి, స్నేహితుల విలువ గురించి చెప్పిన కథ ‘ఆపదలో నిజమైన మిత్రుడు’. శ్రీరామునితో హనుమంతుడి, సుగ్రీవుల మైత్రి వలన జరిగిన మేలుని ఉటంకిస్తూ మంచి మిత్రుల ఆవశ్యకతని వివరించారు రచయిత్రి.
కొందరు అజ్ఞానంతో, రామాయాణాన్ని ‘పుక్కిటి పురాణం’గా, ‘కట్టె-కొట్టె-తెచ్చె’ లాంటి గాథగా విమర్శించడం తగదని చెప్తూ; రామాయణంలోని ఒక్కొక్క అంశాన్ని సైన్స్ కోణంలో వ్యాఖ్యానించిన శ్రీ భాష్యం అప్పలాచార్య ప్రవచనం ఆధారంగా రాసిన ‘సముద్ర లంఘనం’ విశిష్టమైన కథ.
ఏదైనా పని మొదలుపెట్టే ముందే – ఆ పని గురించి సమగ్రంగా తెలుసుకుని మొదలుపెట్టాలని ‘దిగే ముందు లోతు చూడాలి’ అన్న కథ చెబుతుంది. హనుమంతుడు లంకలో విధ్వంసం సృష్టిస్తూ పేరుమోసిన రాక్షస వీరులను సంహరించినప్పుడు – తన కుమారుడు ఇంద్రజిత్తును హనుమపైకి యుద్ధానికి పంపుతూ రావణుడు అతనికి చెప్పిన మాటలు ఈ కథకి బలాన్నిచ్చాయి.
ఓ ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నప్పుడు, దానిపైనే దృష్టి నిలిపి, అవిశ్రాంతంగా కృషి చేసి సాధించాలని ‘లక్ష్యం’ కథ చెబుతుంది. ఇందుకు ఉదాహరణగా సీత జాడను తెలుసుకోవడంగా లక్ష్యంగా పెట్టుకుని సముద్ర లంఘనం చేస్తున్న హనుమంతుని కథని చెప్పారు రచయిత్రి. హనుమకి రోజూ నమస్కరించడం మాత్రమే కాదనీ, ఆయన లక్షణాలను అలవర్చుకోవాలని పిల్లలకి సూచిస్తారు.
మనకప్పగించిన పని విజయవంతంగా పూర్తి చెయ్యాలంటే.. దారిలో కలిగే ఆటంకాలకి కుంగిపోకూడదు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ మన శక్తి ప్రదర్శించాలో.. ఎలా శత్రువుని అదుపులో పెట్టాలో.. మన గురించి ధైర్యంగా ఎలా అవతలి వారికి తెలియచెయ్యాలో.. అనే విచక్షణ తెలియాలని చెప్పే కథ ‘కార్యసాధన’. ఇందుకు ఆంజనేయుడు నిలువెత్తు ఉదాహరణ అంటారీ కథలో రచయిత్రి.
మన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పు చేస్తున్నా.. మనం తప్పు చెయ్యకుండా.. విచక్షణతో ఆలోచించి.. వారికి నచ్చచెప్పి.. ఆ తప్పు చెయ్యకుండా వారించాలని ‘గంజాయి వనంలో తులసి మొక్క’ కథ చెబుతుంది. రామాయణంలో విభీషణుడి పాత్రను ఇందుకు ఉదాహరణగా నిలిపారు రచయిత్రి ఈ కథలో.
‘ఎవరి ధర్మం వారే నిర్వర్తించాలి’ కథలో సీతాదేవి హనుమకి చెప్పిన మాటల ద్వారా – మనం ఎంత ప్రయోజకులమైనా, మనకి నిర్దేశించని పనికి మనం పూనుకోకూడని తెలియజేస్తారు రచయిత్రి.
నానమ్మ ద్వారా రామాయణం గాథలు, హనుమంతుని కథలు విన్న ఓ చిన్నారి హనుమ లక్షణాలలో ఒకదాన్ని అలవర్చుకుని ఆపద నుంచి చాకచక్యంగా బయటపడిన వైనాన్ని ‘సమయస్ఫూర్తి’ కథ చెబుతుంది. చిన్నారి బాలబాలికలకు సమయస్ఫూర్తి ఎంత అవసరమో ఈ కథ మరోసారి గుర్తు చేస్తుంది.
ఎదుటి వ్యక్తి శత్రువైనా, అతని గొప్పతనాన్ని అంగీకరించడానికి సంస్కారం అవసరమని ‘హృదయ వైశాల్యం’ కథ చెబుతుంది. ఇందుకు బ్రహ్మస్త్రాని లోబడి ఇంద్రజిత్తుకి లొంగి నిండు సభలో రావణునిని చూసిన హనుమలో మెదిలిన భావాలు నిదర్శనం.
ఎంత గొప్ప వీరులైనా, వారు విజయం సాధించడానికి ఒక్కోసారి వేరొకరి ‘సహాయం’ అవసరమవుతుందని ‘బంగారు పళ్ళేనికైనా..’ కథ చెబుతుంది. ఉదాహరణలుగా – రామయణం, మహాభారతంలోని ఘట్టాలను ఉటంకిస్తారు రచయిత్రి.
నశించే సమయం ఆశించినప్పుడు మనిషి ఎవరి మాట వినడని, మిత్రుల హితోపదేశాన్ని తలకెక్కించుకోడని ‘పోగాలము దాపురించిన వాడు..’ కథలో చెప్తారు రచయిత్రి. మారీచుడు రాముని గురించి రావణుడిని హెచ్చరించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు.
“ప్రలోభాలు, ఆకర్షణలు కలిగించేవారు తక్కువేం కాదు. ఎంత వరకు అవి నమ్మాలి అనే విచక్షణ ముందు నేర్చుకోవాలి” అంటూ ఓ బామ్మగారు తన మనవరాలికి జాగ్రత్తలు చెప్పిన కథ ‘విచక్షణ’. ఇతరులు వ్యామోహం కలిగించినప్పుడు, వివేకం పోగొట్టుకోకుండా ఆలోచించి విచక్షణతో నిర్ణయం తీసుకోమని మన సాహిత్యం మనకి నేర్పుతుందని రచయిత్రి అంటారు.
“రామాయణం కథ అనుకున్నా, చరిత్ర అనుకున్నా, నిజమనుకున్నా అది మనకి ఎన్నో విషయలాను నేర్పిస్తుంది” అంటూ ఓ బామ్మగారు తన మనవడిలో స్ఫూర్తి నింపిన వైనం ‘ఓటమి నుంచి గెలుపు’ కథ చెబుతుంది. ఇందుకు ఉదాహరణగా రాజుగా ఉన్న విశ్వామిత్రుడు రాజర్షిగా, బ్రహ్మర్షిగా ఎదిగిన వైనం వివరిస్తావిడ.
తాత్కాలికంగా ఆకర్షణీయంగా ఉండే కొన్ని స్నేహాలు, కొంత మందితో సాంగత్యం మన పతనానికి దారి తీస్తాయని ‘సాంగత్యం’ కథ హెచ్చరిస్తుంది. ఇందుకు ఉదాహరణలుగా మంథర, విభీషణుడి పాత్రలను ఈ కథలో ప్రస్తావిస్తారు రచయిత్రి.
~
రామాయణాన్ని ఒక కథగా కాకుండా మనకి నడవిడిక నేర్పే మార్గదర్శనంగా భావించాలని రచయిత్రి పల్కిన మాటలు అక్షర సత్యాలు. ప్రధానంగా బాలబాలికల కోసం ఉద్దేశించిన కథలైనా, పెద్దలు కూడా చదవదగ్గవి.
***
రామాయణ మార్గదర్శనం
రచన: బిందుమాధవి మద్దూరి
ప్రచురణ: మాధవి పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 102
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000 413 413
రచయిత్రి: 9491727272