[శ్రీరామనవమి సందర్భంగా శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘రామాయణం లోని ముఖ్యమైన మూడు ఆదర్శాలు’ అనే వ్యాసాన్నిఅందిస్తున్నాము.]
[dropcap]రా[/dropcap]మాయణం దేవతల కథ కాదు, అచ్చంగా మన మనుషుల కధ, మన కథ. మానవుడు తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, జీవితసాఫల్యాన్ని ఎలా పొందాలో ఆ మహాకావ్యాన్ని చదివి నేర్చుకోవచ్చు.
మనం చర్చించాల్సిన మూడు విషయాల్లో అంతర్లీనంగా ఉన్న, శ్రీరామచంద్ర ప్రభువు స్పష్టంగా నిర్దేశించిన నిజాన్ని మనం గుర్తించకపోతే, ఈ చర్చలో మనం సమతౌల్యాన్నిసాధించలేము.
“ఆత్మానం మానుషం మన్యే
రామం దశరథాత్మజం”
అని ఆయన కుండ బద్దలు కొట్టాడు. తనను తాను రాముడుగా, సన్నాఫ్ దశరథునిగా, మామూలు మనిషిగా, భావిస్తున్నానన్నాడు. ఈ మాటలను పూర్తిగా అవగతం చేసుకుంటే గాని, మనం రామాయణాని మనుషుల కథగా చూడలేము.
పితృవాక్యపరిపాలన అంటే ఏమిటి, తండ్రి చెప్పిన మాటను పాటించడం. అది పైకి కనిపించినంత చిన్న విషయం కాదు. తండ్రిని సాక్షాత్తు దైవసమానుడిగా భావిస్తే గాని అది కుదరదు. “తండ్రి హరిజేరు మనియెడి తండ్రి; తండ్రి!” అన్నాడు భాగవతాగ్రేసరుడైన ప్రహ్లాదుడు. కానీ ఆ తండ్రి, హిరణ్యకశిపుడు, హరిని చేరమన లేదు, పైగా హరిని విడువ మంటున్నాడు. అందుకే పితృవాక్యపాలన చేయలేదు ప్రహ్లాదుడు.
తన తల్లిని వధించమని, జమదగ్ని మహర్షి, తన పుత్రుడైన పరశురాముని ఆజ్ఞాపించాడు. ఆయన వెంటనే దాన్ని ఆచరించాడు.
తండ్రి చెప్పిన మాటలో ధర్మచ్యుతి ఉందా లేదా అన్న మీమాంస లేకుండా ఆయన మాట పాలించినవాడు పరశురాముడు. తండ్రి మాట భగవద్వ్యతిరేకం కాబట్టి పాటించలేదు ప్రహ్లాదుడు.
మన కుటుంబాలలో చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలలో సైతం పిల్లలు తండ్రి మాటను ఖాతరు చేయరు. రాజ్యాధికారం చేపట్టడానికి తండ్రిని హతమార్చిన రక్తసిక్త చరిత్రలు కూడా ఉన్నాయి.
కానీ రాముడు తృణప్రాయంగా రాజ్యాన్ని త్యజించాడు. తండ్రి, పినతల్లికి మాట ఇచ్చాడు. అది వమ్ము కాకూడదు.
తెల్లవారితే తన పట్టాభిషేకం. కైకేయి అతన్ని పిలువనంపి “నీవు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని పితృనాజ్ఞ” అని చెబితే, కించిత్తు కూడ ఆశ్చర్యపోలేదట ప్రభువు, ముఖాన చిరునవ్వు చెక్కుచెదరలేదట. అలాగేనని అంగీకరించాడు. అదీ పితృ వాక్యపరిపాలనంటే.
సరే, రామయ్యనే కద, అడవులకు వెళ్లమన్నారు? సీతమ్మకేం పని? భర్తలు ఉద్యోగ వ్యాపారాల కోసం ఎంత దూరమైనా వెళ్లి రావలసిందే తప్ప, తాము ఇల్లు వదలని ఇల్లాండ్లు ఎందరు లేరు? కాని ఆమె రాముడు ఎంత చెప్పినా వినలేదు.
భారతంలో భీష్మపితామహుడు భార్యాభర్తల బంధాన్ని ‘శరణాగతధర్మం’గా బోధిస్తాడు. ఇక్కడ శరణం అంటే ఆశ్రయం అని అర్థం. భార్యాభర్త లిరువురూ ఒకరికొకరు ఆశ్రయం. ఇద్దరూ సంసారానికి అతి ముఖ్యమైన వారే. దీన్ని చెప్పినవాడు ఆజన్మబ్రహ్మచారి కావడం విశేషం.
‘నాస్తి భార్యా సమోనాథః నాస్తి భర్తృ సమం సుఖమ్
విసృజ్య ధన సర్వస్వం, భర్తావైశరణం స్త్రీయాః’ –
మరియు,
‘నాస్తి భార్యాసమో బంధుః నాస్తి భార్యా సమాగతిః
నాస్తి భార్యాసమోలోకే, సహాయోధర్మ సంగ్రమే’
“స్త్రీకి భర్తను మించిన భద్రతలేదు, భర్తతో సమానమైన సుఖం లేదు. ధనమంతా పోయినా, భర్త నిజమైన తోడు. అదే విధంగా భార్యకు సమానమైన బంధువు, శ్రేయోభిలాషి లేరు.”
భార్యాభర్తల మధ్య అపార్థాలకు అపోహలకు తావుండరాదు. ఒకర్నొకరు అధిగమించే ప్రయత్నం (domination), ఒకర్ని ఒకరు స్వంతం చేసుకోవాలనే ఆలోచన (Possession) ఉండకూడదు. ఇద్దరికీ ప్రత్యేక, భిన్న వ్యక్తిత్వాలుంటాయి. అభిరుచుల్లో అభిప్రాయాల్లో తేడాలుంటాయి. వాటిని పరస్పరం గుర్తించినప్పుడు, ఏ సమస్యలు రావు.
సరే, భార్యాభర్త లిరువురు అడవులకు వెళుతున్నారు. లక్ష్మణునికి ఏం పని? అతన్ని వెళ్లమని తండ్రి ఆదేశించలేదు. కానీ అతడు బయలుదేరాడు. అన్న, వదినెలకు ఈ కష్టకాలంలో తోడుగా ఉండాలనుకున్నాడు. అదీ సోదర భావం అంటే!
వీరందరి కంటే శిఖరాయమైన వ్యక్తిత్వం సుమిత్ర దేవిది. తల్లి అనుమతి తీసుకోవడానికి సౌమిత్రి వెళ్ళినపుడు, “నీవెందుకు రా నాయనా వెళ్లడం? వాళ్లకైతే తప్పదు!” అనలేదామె.
“రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం
అయోధ్యాం అటవీం విద్ధి, గచ్ఛతాత! యథా సుఖమ్”
అంటుందా తల్లి.
“నాయనా, రామున్ని దశరథునిగా భావించు, జానకిని నన్నుగా తలుచుకో. అడవిని అయోధ్య అనుకో. అంతే! హాయిగా వెళ్లిరా తండ్రీ!”
ఎలా అయితే లక్ష్మణుడు భ్రాతృధర్మాన్ని నిర్వర్తించగలడో, ఆ పథ నిర్దేశం చేసింది సుమిత్రమ్మ.
‘జ్యేష్ఠభ్రాతాపితృసమః’ అని కదా ఆర్యోక్తి.
ఇక భరతుడేం తక్కువ వాడా? తనకు అర్హతలేని సింహాసనం మీద కనీసం కూర్చోలేదు. అన్నయ్య పాదుకలను దానిపై ఉంచి పరిపాలన సాగించాడు. తాను రాజ్యాధికారం స్వీకరిస్తే, పధ్నాలుగేండ్ల తర్వాత శ్రీరాముడు రాజ్యార్హత కోల్పోతాడు.
సీతారాములు అడవుల్లోనైనా ఒక్కచోట ఉన్నారు. మరి ఊర్మిళాదేవి? భర్తను విడిచి అన్ని రోజులు ఉంది. ఒంటరిగా. విరహబాధను సహించడానికి నిద్రాదేవిని ఆశ్రయించింది. సీతమ్మవారికేం తీసిపోదు ఆమె.
పరుల పంచన ఉన్నదని సీతను అనుమానించాడని మహోన్నతమైన ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంటారు. ఆమెను అగ్నిపరీక్షకు గురిచేసింది, ఆమె సచ్ఛీలాన్ని ప్రపంచానికి చాటడానికే. సీత రామున్ని అర్థం చేసుకుంది. ఆయనకు సీత మీద ఏం మాత్రం అనుమానం లేదు. ప్రజల మనస్సులతో ఉన్న భావనను తొలగించడం ఆయన లక్ష్యం. ఏ సందేహం లేకుండా ఆయన ఆమెను స్వీకరించి ఉంటే, సామాన్యుడు ఆమెను శంకించేవాడు. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదంటే, తమ మీద తమకు నమ్మకం లేనట్లే!
‘రామో విగ్రహవాన్ ధర్మః’. ధర్మం మనిషి రూపు దాలిస్తే రాముడవుతాడు. ఆయన తాను దేవుడనని చెప్పుకోలేదు. మహిమలు చూపలేదు. సీతమ్మ మరిదిని అనుమానించింది. సీతను రావణుడు తీసుకుపోయినప్పుడు రాముడు ఏడ్చాడు. రావణుని వధించిన తర్వాత విజయధ్వానం చేశాడు. అంతా మానవ సహజమే. మరి ఆయనకు గుడి కట్టి ఎందుకు పూజించుకుంటున్నాం? సీతారాముల వివాహాన్ని ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటున్నాం? మనం ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదో తెలిపి, వారు మనకు ఆదర్శంగా నిలిచారు గనుక.
ఇదే సోదర సంబంధాలు వాలి సుగ్రీవుల మధ్య, రావణ, విభీషణ, కుంభకర్ణుల మధ్య, వేరుగా ఉన్నాయి. అన్న చేస్తున్నది తప్పని తెలిసి, విభీషణుడు అతన్ని వదిలేశాడు. కాని కుంభకర్ణుడు వదలలేదు. వాలి సుగ్రీవులు బద్ధ శత్రువులు. ఇలా సోదర సంబంధాలలోని విభిన్న పార్శ్వాలను రామాయణం ఆవిష్కరించింది.
William Congreve వ్రాసిన ‘వే ఆఫ్ వర్డ్’ అన్న నాటకంలో భార్యాభర్తల మధ్య ‘హిపోక్రసీ’ ఉండకూడదంటాడు రచయిత. చాలా గొప్ప నాటకం అది. సీతమ్మవారు అవసరమైతే రామునితో విభేదించిన సందర్భాలున్నాయి.
‘బోనామీ డోబ్రీ’ అన్న సాహిత్య విమర్శకుడు ఇలా అన్నాడు –
“Marriages can be successful, only when the ‘Otherness’ of the other individual is identified and respected.”
భీష్ముడు చెప్పింది కూడా ఇదే. ‘Otherness’ అనే మాట చాలా లోతైనది. ‘ప్రత్యేక వ్యక్తిత్వం’ అనే అర్థంలో డోబ్రీ గారు దానిని వాడారు. యుగాలు గడిచినా సీతారాములు ఆదర్శ దంపతులుగా నిలిచిపోయారంటే అందుకే. ఈనాడు ‘ego clashes’ తో యువతరం వివాహవ్యవస్థను అపహాస్యం చేస్తున్నది. ప్రేమ వివాహాలు కూడా విడాకులకు దారి తీస్తున్నాయి. సామాజిక కౌన్సిలర్స్ పుట్టుకొస్తున్నారు. ‘సహజీవనం’ లాంటి వింతపోకడలు మన సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో రామాయణాన్ని కరదీపికగా గ్రహిస్తే, దాంపత్యాలు పరిఢవిల్లుతాయి!
కోవెల సుప్రసన్నాచార్యగారు సీతారాముల తత్త్వాన్ని, వివరిస్తూ, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాన్ని ఉటంకించారు.
ఏపున మంటి నుండి యుదయించిన జానకి మింటి నుండి, ఆ
వాపముగన్న రాఘవుడు వచ్చి బుగధ్వజులందు నుండి, ద్యా
వాపృథువుల్ సమాహరణ భావము పొందిన రీతి సంగమ
వ్యాపృతి పండు వెన్నెలమయంబుగ జేసెద రాత్మరోదసిన్
(రామాయణ కల్పవృక్షము, కల్యాణ ఖండము)
రాముడు ఆకాశం నుంచి దిగివచ్చిన చైతన్యమైతే, సీతాదేవి భూమి నుంచి ఉద్భవించిన మహశక్తి. భూమ్యాకాశాల మధ్య విశ్వశ్రేయస్సును సాధించడమే సీతారామావతార రహస్యం. ఈ రెండిటి మధ్య సమన్యయం కుదిరితే ఆత్మ అనే ఆకాశంలో పండువెన్నెల కాస్తుందంటున్నారు విశ్వనాథ. అన్యోన్య దాంపత్యాన్ని సాధించిన భార్యాభర్తలందరికీ ఈ అనుభవం తెలిసిందే. మాయ లేడిని కోరుకోవడం దగ్గర నుంచి, సీతమ్మవారి పాత్ర రావణ సంహారంలో ఉంది అంటారు శ్రీ కోవెల సంతోష్ కుమార్, తన ‘రామం భజే శ్యామలమ్’ అన్న గ్రంథంలో.
ఉపసంహారం:
ఈ వ్యాసంలో, పితృవాక్య పరిపాలన లోని ధర్మనిరతి, ధర్మ నియతి, ఆదర్శ దాంపత్యంలోని ఔన్నత్యం, సోదర సంబంధాల లోని ఔచిత్యం, సాధ్యమైనంత వరకు ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. రామాయణాన్ని కేవలం ఒక పారాయణ గ్రంథంగా, రామున్ని ఒక దేవునిగా కాకుండా, మన జీవితాలకు అన్వయించుకుంటూ చదివితే మన జీవితాలు ధన్యమవుతాయి.
‘తేజస్వినావధీతమస్తు!’
***
పరిశీలించిన గ్రంథములు:
- ‘రామకథాసుధ’ సంకలనం. సంపాదకులు శ్రీ కస్తూరి మురళీ కృష్ణ, శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్, సాహితి ప్రచురణలు, 2023, P 88-91, P 192-193.
- ‘మనప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వవికాస పరిమళాలు’, నాల్గవభాగం. సంచిక డాట్ కామ్, వెబ్ మ్యాగజైన్, పాణ్యం దత్తశర్మ,
- ‘రామం భజే శ్యామలమ్’, శ్రీ కోవెల సంతోష్ కుమార్. సాహితి ప్రచురణలు, 2022, P-387
- మహా భారతం, శాంతి పర్వం.
- ‘Way of the world’, Sri Raghukula Tilak, 1983, ‘Comprehensive Criticism’.