Site icon Sanchika

‘రామాయణము ధర్మవచనములు – సూక్తులు’ పుస్తకావిష్కరణ సభ – నివేదిక

[dropcap]డా॥ [/dropcap]వైరాగ్యం ప్రభాకర్ రచించిన ‘రామాయణం ధర్మవచనములు – సూక్తులు’ అనే పుస్తకం ఆవిష్కరణ సభ 13.7.24, శనివారం నాడు కరీంనగర్ లోని వాగేశ్వర డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో జరిగింది.

రామాయణం (వాల్మీకి విరచితం) లోని వివిధ ధర్మవచనాలను, సూక్తులను, సమీకరించి, వాటిని విశ్లేషిస్తూ, ఒక చక్కని రచన చేశారు డా॥ వైరాగ్య ప్రభాకర్. ఇది వారి 97వ పుస్తకావిష్కరణ. ఈ సంవత్సరం డిసెంబరు కల్లా వంద పుస్తకాలు పూర్తవుతాయి. ఇది నిజంగా గొప్ప విషయం. వైరాగ్యం వారు చేస్తున్న సాహిత్యసేవ అనుపమానం.

హైదరాబాద్ నుండి, ప్రముఖ కవి, రచయిత, గాయకులు, విమర్శకులు శ్రీ పాణ్యం దత్తశర్మ ఈ సభకు ప్రధాన వక్తగా ఆమంత్రితులై, గ్రంథము యొక్క గొప్పదనాన్ని, సమకాలీనతను, అందులోని వ్యక్తిత్వ వికాస అంశాలను వివరించారు. సీతారామ తత్వాన్ని కవిసమ్రాట్ విశ్వనాథ తమ రామాయణ కల్పవృక్షము అని కల్యాణ ఖండంలో ఎలా అద్భతంగా ఆవిష్కరించారో దత్తశర్మ తెలిపారు. గ్రంథంలో సంకలనం చేసిన విషయాలను విశ్లేషిస్తూ ఆయన, ఈనాటికే అవి వన్నెతరగని అనర్ఘరత్నాలని, వాటిని ఈ తరానికి అందించిన వైరాగ్యవారు అభినందనీయులని ప్రశంసించారు.

సమైక్యసాహితి అధ్యక్షులు శ్రీ మాడిశెట్టి గోపాల్ గారు సభకు అధ్యక్షత వహించారు. గ్రంథాన్ని, తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి, కాగజ్‍నగర్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగిస్తూ, రామాయణం ధర్మానికి ప్రతీకలా నిలిచి, సత్యావిష్కరణ చేస్తూ, శాసన రూపం లోని న్యాయాన్ని విశదీకరిస్తుందని తెలిపారు.

మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయం వేటపాలెం ప్రిన్సిపాల్ డా. సి. నారాయణ స్వామి ప్రత్యక అతిథిగా హజరై ప్రసంగించారు. ప్రముఖ కార్టునిస్ట్, యానిమేషన్ డైరెక్టర్ శ్రీ కల్యాణం శ్రీనివాస్ గారు గ్రంథం యొక్క విశ్వజనీనతను కొనియాడారు.

డా॥ వైరాగ్యం ప్రభాకర్ మాట్లాడుతూ పాణ్యం దత్తశర్మగారు తమ అన్నగారు కావటం తన అదృష్టమని, ఈ గ్రంధాన్ని దత్తశర్మగారు త్వరలో ఆంగ్ల భాషలోనికి అనువదించతున్నారని, సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పాణ్యం దత్తశర్మ గారిని, వైరాగ్యం వారు, ఇతర అతిధులు ఘనంగా సన్మానించారు.

సాహిత్యాభిమానులు ఎందరో సభకు హాజరై సాహిత్యం సమాజంలో ఇంకా సజీవంగా, సుసంపన్నంగా ఉన్నదని నిరూపించారు.

‘కవితాయ ద్యస్తి రాజ్యేన కిమ్?’ (భోజమహారాజు).

Exit mobile version