రామాయణము తత్త్వవిచారము

1
2

[శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ రచించిన ‘రామాయణము తత్త్వవిచారము’ అనే ఆధ్యాత్మిక వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“రామ ఏవ పరంబ్రహ్మం రామ ఏవ పరం తపః
రామ ఏవ పరంతత్త్వం శ్రీరామో బ్రహ్మతారకం॥”

అని రామ రహస్యోపనిషత్తు చెబుతుంది.

ఆ శ్రీరాముడు ఎలా పరబ్రహ్మమో మనకు రామాయణము చూపుతుంది.

శ్రీరాముడు భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక, భారతీయుల ఆత్మ.

రామాయణము అంటే రాముడు నడచిన మార్గం. అదే రాముని నడత కూడా.

రామాయణము కేవలము ఒక కావ్యమో, గ్రంథమో కాదు వేద సమానము.

రాముడు కేవలం పరబ్రహ్మ స్వరూపమే. కాని మానవులకు నడవవలసిన మార్గం, ఆచరించవలసిన ధర్మం చూపటానికి ఆయన మానవుని‘లా’ కనిపిస్తాడు.

ఆ రామాయణ గ్రంథాన్ని పరిశీలనగా పరిశీలిస్తే లోతులు, గూడార్థాలు తెలుస్తాయి.

మన ఋషులు ఇచ్చిన వాఙ్మయం కేవలం కవితలో, లేక కావ్యాలో కాక బ్రహ్మం గురించి చెబుతూ జీవన విధానాన్ని సూక్ష్మంగా చెబుతాడు ముని. వాటి లోతులను అధ్యయనం చెయ్యవలసిన బాధ్యత మాత్రం మనదే. వాటిని మనము ధార్మిక, ఉపాసనా, తాత్విక దృష్టిలో చూడాలి. ఈ దృష్టిలో ఎలా చూడాలో మనకు తెలియకపోతే గురువుల వద్ద కూర్చొని తెలుసుకోవాలి.

రామాయణము గురించి చెబుతూ –

“రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్॥
కావ్యం రామాయణం కృత్స్నమ్, సీతాయాశ్చరితం మహత్
పౌలస్త్య వధమిత్యెవ, చకార చరితవ్రతః॥”

అంటాడు ముని.

రామాయణం యొక్క ఫలము, శక్తితో పాటూ అది ‘సీతాయాచరితం’ అని పేరు. అంటే అది రాముడు నడిచిన నడక- నడతయే కాక సీతమ్మ చరితం కూడా.

రామాయణము యొక్క అంతర్దృష్టి, ఋషి అయిన వాల్మీకి హృదయము పూజ్యగురువుల ప్రవచనం ద్వారా తెలుసుకునే అవకాశం కలగటం కేవలం మా అదృష్టం. ఆ తెలిసినది పంచుకునే ప్రయత్నమే ఈ వ్యాసము.

సనాతన ధర్మము, ఋషులు చూపిన మార్గం. ఋషులంటే మంత్రద్రష్టలు. శక్తివంతమైన అక్షరము మంత్రం. “మననాత్ ధ్యాయతే ఇతి మంత్రః” అని చెబుతారు. ఋషులు మంత్రాలను దర్శించి మనకు ప్రసాదించారు. అలా సమస్త వేదాలు, ఉపనిషత్తులు మనకు ప్రసాదించబడ్డాయి.

వాల్మీకి మహాఋషి. తపస్సుతో పండినవాడు. ఆయన చేస్తున్న తపస్సు ఫలముగా ఒకనాడు ఆయన ఆశ్రమానికి నారద మహర్షి వచ్చారు. నారదులవారిని వాల్మీకి అడుగుతాడు –

“కఃను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కఃచ వీర్యవామ్
ధర్మజ్ఞః చ సత్యవాక్యో దృఢ వతః” అని.

గుణవంతుడు(నిర్గుణుడైన పరమాత్మ తనలోని బీజాన్ని ప్రకృతిలో ప్రవేశింప చేసి, మాయను స్వాధినపరచుకొని సృష్టిని మొదలుపెడతాడు. అందుకే ఆయన గుణవాన్), వీర్యవాన్ (వీరుడు), ధర్మజ్ఞుడు, సత్యవంతుడు, ధృడవత్రము కలవాడు, విద్వాన్ (ఈశ్వరీ గుణము చూపువాడు), ఆత్మవంతుడు (తనంతట తాను సంపాదించుకోగలడు), జితక్రోదుడు (కోపము లేనివాడు), ధృతిమాన్(తేజస్సుకు కారణమైనవాడు), అన్నీ తెలిసినవాడు అయిన వాడు ఉన్నాడా? అని వాల్మీకి నారదులవారిని ప్రశ్నించాడు.

ఇందులో మర్మం ఏమంటే అన్నీ గుణములతో మానవులు ఉండరు. అందుకే పరమాత్మ ఇటువంటి సద్గుణములతో ఎక్కడైనా అవతరించాడా? అని ఋషి భావము ఈ ప్రశ్నలో అంతర్లీనంగా ఉంది.

దానికి సమాధానముగా నారదుడు సంక్షిప్త రామాయణముగా వంద శ్లోకాలలో వివరిస్తాడు. ఈ వంద శ్లోకాలు పారాయణం చేసుకునే సంప్రదాయం కూడా మనకు ఉంది.

నారదుడు వెళ్ళిపోయినా వాల్మికి హృదయమంతా రమణీయంగా మారుతుంది. రామః అంటే రమణీయమమే ‘రామ’. క్షణక్షణానికీ నూతనంగా కనిపించే అందం రమణీయత. సర్వుల హృదయ తాపాన్నీ తీర్చటమే రామః. ఆత్మ నే రామః.

రామ అంటే సుందరం. రామ అంటే ఆనందం కలిగించువాడు. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః (తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు).

సత్ చిత్ ఆనంద స్వరూపమే రామః. సత్ చిత్ స్వరూపము బ్రహ్మమే. అందుకే రాముడు బ్రహ్మమయ్యాడు. రామ పరబ్రహ్మగా కొలువబడుతున్నాడు. రామరహస్యోపనిషత్తు “సచ్చిదానందరూపోఽస్య పరమార్థ ఉచ్యతే” అని చెబుతుంది. అంటే రాముడు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మనే యని అర్థం.

రామ అంటే ‘ర’కార, ‘అ’కార, ‘మ’కారము రూపు దిద్దుకోవటం. ‘ర’కారము అగ్ని బీజం, ‘అ’కారము సూర్య బీజము, ‘మ’కారము చంద్రబీజము. రామః అంటే అగ్ని, సూర్య, చంద్రులు కలిసిన త్రయము. మానవ శరీరములో ‘ర’కార రూపమైన అగ్ని ఉదరములో, హృదయములో ‘మ’ చంద్ర బీజము, చక్షువులు, చర్మము ‘అ’ సూర్య బీజసంకేతముగా చెప్పబడతాయి. అంటే ఒక్కసారి రామ అనుకుంటే శరీరమంతటా స్పందన కలుగుతుందన్నమాట.

మూలాధారము నుంచి అనాహతం వరకూ అగ్ని చక్రాలుగా, అనాహతం నుంచి ఆజ్ఞ వరకూ సూర్య చక్రాలుగా ఆజ్ఞ నుంచి సహస్రారం వరకూ చంద్ర చక్రాలుగా భావించబడుతాయి.

మానవ శరీరములో ఉన్న నాడులలో ఇడ, పింగళా, సుషుమ్నా నాడులు ముఖ్యమైనవి. అందులో ఇడా పింగళా సూర్య చంద్రులకు ప్రతీకలైతే, సుషుమ్నా అగ్నిని సూచిస్తుంది. మూలాధారం క్రింద ఉన్న కుండలినీ శక్తిని ‘అగ్ని’ అని అంటారు. ఆ అగ్ని ‘రామ’ నామానికి స్పందించి లేచి సుషుమ్నా ద్వారా సహస్రారం చేరటమే సాధనలో ఫలము. అది రామ నామాన్ని సదా జపించటము వలన సాధ్యము.

వేదాలలో “అగ్ని షోమాత్మకంజగత్” అని చెప్పబడింది. అంటే అగ్ని సోమ(చంద్ర) సూర్యుల కలయికే జగత్తు. అదే రామనామము, రాముని గురించి చెప్పిన రామాయణము. అందుకే రామాయణము ఒక యజ్ఞము.

‘రామ’ నామములో, పంచాక్షరీ మంత్రము ‘ఓం నమశ్శివాయ’ నుండి ‘మ’ బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము ‘ఓం నమో నారాయణాయ’ నుండి ‘ర’ బీజాక్షరము పొందుపరచబడియున్నవని చెబుతారు. మూడు మార్లు ‘రామ’ నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది.

“శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే”

ఇలా ఎన్నో భావార్థ గుడార్థాలను నింపుకున్నది రామనామము. అటువంటి రామ నామం తలుచుకొని పులకరించాడు వాల్మీకి.

ఆయనకు సర్వం రామమయంగా తోచింది. నారదులవారు వెళ్ళిన తరువాత కూడా ఆయనకు రామనామానందంతో హృదయము మునకలు వేస్తూ ఉంటుంది.  రామసిద్ధి కలుగుతుంది. సిద్ధి అంటే ఏ పరమాత్మను ఉపాసిస్తున్నారో ఆ పరమాత్మను అంతటా చూడగలగటమే సిద్ధి. “రామ మంత్రార్థవిజ్ఞానీ జీవన్ముక్తో న సంశయః”  ముని ఆ భావానందంలో ఉంటాడు.

ఆ సంతోషంలోనే తన పనుల నిమిత్తమై నదికి వెడతాడు. అక్కడ ఒక వేటగాడు పక్షి జంటలో ఒక పక్షిని కొట్టడము, మరో పక్షి విలపించటము చూస్తాడు. సర్వం ప్రేమమయమైన, ఆనందమైన రాముని చూస్తున్న మునికి హృదయంలో కరుణ పొంగి తొలి శ్లోకం ఉత్పన్నమైంది.

ఆ శ్లోకం –

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్రౌచమిథునాదేకమవధీః కామమోహితం॥

ఈ శ్లోకానికి అర్థాలు వివిధముగా చెబుతారు.

– ఓ నిషాదుడా! క్రౌంచపక్షుల జంట నుంచి మగపక్షిని చంపిన కారణంగా నీవు ఎక్కువ కాలం జీవించకుందువుగాక ఇది బోయవాని పరమైన అర్థం.

– మా (లక్ష్మీకి) నిషాదుడవైన (భర్త) ఓ రామా! సీతా విషయంలో కామమోహితుడైన రావణుణ్ణి, రావణమండోదరుల జంటనుంచి చంపి శాశ్వత ప్రతిష్ఠనీ, కీర్తిని పొందుదువుగాక! అని రామ పరంగా అర్థం. మానిషాద అనడం వలన బోయవాణ్ణి శ్రీ మహావిష్ణువుగా వాల్మీకి గమనించడం కేవలం ఆ స్థితిలోనే అని ఈ శ్లోకం చెప్తుంది.

-ముల్లోకాలనీ బాధపట్టే ఓ రావణుడా! రాజ్యం పోయి, వనవాసం చేస్తూ క్షీణించిన సీత అనే అల్పజీవిని చావుతో సమానమైన భర్త వియోగ దుఃఖాన్ని కలిగించిన కారణంగా శాశ్వత కాల కీర్తిని నీవు పొందకుండుదువుగాక! బ్రహ్మ ఇచ్చిన వంశాభివృద్ధి వరం ఫలింపకుండుగాక అని రావణపరంగా అర్థం.

వేదాల తరువాత అద్భుతమైన శ్లోకము అప్పటి మునులకు తెలియదు. వాల్మీకి శిష్యుడు ఆ శ్లోకము విని వ్రాసుకొని మరల మరల చదివి ఆనందపడ్డాడు. తోటి మునులకు ఆ శ్లోకం వినిపించటము జరుగుతుంది.

తదనంతరం బ్రహ్మ రాక, వాల్మీకిని రామాయణము రచించమని చెప్పటము ఇత్యాదివి జరుగుతాయి. అలా వాల్మీకి రామాయణముకు శ్రీకారము జరిగుతుంది.

రాముడు నడత – నడక అంతా ఋషుల యొక్క ప్రణాళిక. రాముని జననము తదనంతరము, విశ్వామిత్రుని రాకతో రామావతార కార్యం మొదలవుతుంది. విశ్వామిత్రుడు రాముని యాగ రక్షణకు తీసుకుపోతాడు. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రద్రష్ట. ఆ గాయత్రీ మంత్ర తేజస్సును రాముని చూశాడు ముని. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన గాయత్రే రాముడు. కాబట్టి గాయత్రి మంత్రద్రష్ట రాముని కథను ముందుకు నడిపాడు కొంత తడవు. మున్యాశ్రమములో యాగమనంతరం, గౌతమముని ఆశ్రమం మీదుగా రాముడు మిథిలకు సాగుతాడు. దానికి మునుపు విశ్వామిత్రుడు రామునితో

“త్వం చైవ నరశార్దూల సహాస్మాభిర్గమిష్యసి
అద్భుతం చ ధనూరత్నం తతైకం ద్రష్టుమర్హాసి॥” అని పిలుస్తాడు.

అద్భుతం ‘చ’ ధనూరత్నం తతైకం ద్రష్టుమర్హాసి లో శ్లేష పెట్టాడు ముని. ‘చ’ అని ఉంచటములోనే ఆయన ద్రష్ట యని చెబుతోంది. అద్భుతమైన ధనస్సు యనే రత్నం, ధనస్సు మరియు రత్నం చూడటానికి రావాలట. ఆ రత్నమేమిటో మనకు తెలిసినదే.

అదే సీతా మహాత్రిపురసుందరి.

సీత అంటే నాగేటిచాలు అని అర్థం. దేహం నేను కాను అన్న జ్ఞానము కలిగిన విదేహ రాజు గృహములో వెలసింది వైదేహి. దేహకాంక్ష లేని చోట వెలసింది అమ్మవారు బ్రహ్మం,  జ్ఞాన ఇచ్ఛా క్రియా శక్తి స్వరూపిణి. అమ్మవారు వచ్చే వరకూ రాముని మునులు నడిపారు. అమ్మవారు వచ్చాక ఇక సీతాయచరితం కదా, అమ్మే నడుపుతుంది కథను.  రామావతార లక్ష్యం అమ్మవారికి తెలుసు. అందుకే ఆమె సదా తోడుగా ఉంటుదని జనకుడు చెబుతాడు –

“ఇయం సీతా మమసుతా సహధర్మ చారణీ తవ।”

ఈమె సీత, నా కూతురు  అన్నాడు జనకుడు. నా కూతురు సీతా అనవచ్చు కదా. అలా కాక ఈమే సీత, నా కూతురుగా మసులుతున్నదని చెప్పటములోనే ఈమె నా కూతురుగా కనపడుతున్నా, మూల ప్రకృతి, విశ్వశక్తి అన్న భావము అంతర్లీనంగా సూచిస్తున్నాడు ముని.

మూల ప్రకృతి అయిన శక్తిని పురుషుడైన పరమాత్మ నుంచి వేరు చెయ్యలేరు.

ప్రకృతీపురుషులే ఈ సృష్టికి జననీ-జనకులు. వారే మహాకామేశ్వరుడు-కామేశ్వరీ. వారు ఏ రూపములో వచ్చినా వారిని విడదీయలేరన్నది యుగయుగాలుగా కనపడుతున్న నిజం. అమ్మవారు సీతామాత భూమి నుంచి వచ్చినది. శక్తిని జననము లేదు. ఆమె కేవలము ప్రకటితమవుతుంది. అందుకే సీతను జనకుడు కేవలము దతత్త తీసుకోగలిగాడు. ఆ తల్లి శక్తి స్వరూపిణి, ఆమెను చేపట్టిన తరువాతనే రాముడు తన అవతారకార్యం నిర్వహించగలిగాడు. సీతామాతను వివాహము చేసుకోవటానికి శివధనస్సు విరిచాడు రాముడు.

అమ్మవారి కన్నుబొమలు ధనస్సులా ఉన్నాయట. సాధకులు ఆజ్ఞాచక్రంలోని రుద్రగంధిని విడదీసుకోగలిగితే సహస్రారంలోని శివునితో కుండలినీ శక్తి కలుస్తుంది. అదే భౌతికమైన కథలో శివధనస్సు విరిచిన తరువాత సీతా కల్యాణం జరిగింది.

రామునితో కలిసి అడవికి వెళ్ళింది సీత. పంచవటిలో నివాసము. పంచప్రాణాల మధ్య, పంచభూతాల సాక్షి. రావణుడు వచ్చి సీతమ్మను ఎత్తుకుపోతాడు. ఇదీ రామావతారం ప్రయోజనం కోసమే.

ఎందరో క్రూర రాక్షసుల మధ్య ఉన్నా అమ్మవారు తపస్సులో ఉన్నది తప్ప భయపడినది లేదు. అమ్మవారి శక్తి స్వరూపముగా మనకు అర్థమవ్వాలి అప్పుడైనా.

అమ్మవారిని హనుమ చూసే సర్గ పదహేనవ సర్గ. పంచదశీ మహామంత్రాక్షరములు కూడా పదహేను. ముని మనకు అంతర్లీనంగా సీతా మహాసుందరీ త్రిపుర సుందరని చెబుతున్నాడు. అమ్మవారు షోడసి. కాబట్టే చంద్రోదయ వేళ హనుమ అమ్మను చూస్తాడు. రావణుడు వచ్చి పలు రకాలైన ప్రలోభాలు చూపపోతే, ‘గడ్డి కన్నా హీనము నీవన్నది’ నా తల్లి.

హనుమ సీతమ్మను చూసి పొగ కప్పిన అగ్నిలా ఉన్నదన్నాడు. సందేహాలతో కూడిన స్మృతిలా ఉన్నదీమే, పాడ్యమి నాటి బుద్ధిలా ఉన్నదీమె అనుకున్నాడు.  దుర్గాసప్తశత్తి అంతర్గతపాఠమైన దేవీ సూక్తంలో మార్కండేయ ముని అమ్మవారిని చెబుతూ “యా దేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేన సంస్తితా.. శృతి రూపేణ సంస్తితా, మేధా రూపేణ సంస్తితా..” అంటాడు. అదే మనకు ఇక్కడ చూపబడుతోంది. సాధకునికి తన దైవము ఎదురొచ్చినప్పుడు గుర్తుపట్టే ఒకానొక శక్తి కూడా ఆ దైవమే ఇస్తుంది.

అస్యాఃదేవ్యాఃరూపం అజ్గప్రత్యజ్గసౌష్టవం యథా చ తస్య రూపం యథా ఇయం అసితేక్షణా.. ఇదే ప్రకృతిపురుషతత్త్వం. వారివురూ ఒక్కరే అని చెప్పకనే చెబుతున్నాడు ముని. వారిని విడదీయ్యాలనుకునేదేదైనా సరే నాశనము తప్పదు. అలాగే లంక, రావణుడు నశించారు. రావణుడు అజ్ఞానానికి గుర్తు. అందుకే పరబ్రహ్మను చూడలేకపోయాడు.

హనుమ గురించి ఎంత చెప్పినా అదీ తక్కువే. సుందరకాండ ఒక్కటీ సంపూర్ణ కాండ, కేవలం బ్రహ్మవిద్యా స్వరూపము. సుందరకాండలో హనుమ నోటి నుంచి రామాయణం వింటాము మనము. క్షిప్ర అనుగ్రహం హనుమ ఆరాధన. ఆయన సీతాశోక వినాశనకారి. ఆనందం అందించినవాడు. గంభీరంగా సాగే రామాయణములో హనుమ వచ్చాకనే ఒక ఆనందకరమైన ఉత్సాహకరమైన వేగము వస్తుంది. ఆనంద స్వరూపమే హనుమ. సీతమాతకు రాముని ముద్రికనిచ్చి, “చూచితి సీతను” అని శ్రీరామునికి సంతోషాని ఇచ్చిన హనుమ, భక్తుల భవబంధ విముక్తినిచ్చే మోక్ష ప్రదాత.

హనుమ సాధకులకు ఉండవలసిన వినయం చూపుతాడు. సాధకులుగా మనము హనుమ నుంచి ఎన్నో గ్రహించాలి. మహవీరుడైన హనుమ తను ‘రామబాణం’ అని చెప్పుకుంటూడు. సాధకుడు సర్వదా పరమాత్మ యొక్క బలమే తన యందు ప్రవహిస్తున్నదన్న విషయం జ్ఞప్తికి పెట్టుకోవాలి. హనుమకు సముద్రలంఘనలో కలిగిన మూడు విఘ్నాలు సత్వ, తమో, రజో గుణాలకు గుర్తు. సాధనలో కలిగే అడ్డంకులను సాధకులు హనుమ వలే నిరోదించుకోవాలి. సాధన ఫలితం పొందే వరకూ కొనసాగించాలి, సీత కనిపించే వరకూ సాగిన అన్వేషణలా.

సుందరకాండలో హనుమ చేసిన జయకారం ఎంతో ముఖ్యమైనది:

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్॥

మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడు, కిష్కింధకు ప్రభువు అయిన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసల దేశపు ప్రభువు అయిన శ్రీరామునకు నేను దాసుడను. వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయి మంది రావణులైనా గాని యుద్ధ రంగమున నన్నెదిరించి నిలువలేరు. వేలకొలది శిలలతోడను, వృక్షములతోడను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చూస్తూ ఉండెదరు గాక. నేను వచ్చిన పనిని ముగించుకొని, సీతాదేవికి నమస్కరించి వెళతాను.

అగ్ని వంటి వాక్కుకలిగిన హనుమ చూపే వినయము సుస్పష్టము. తాను కేవలం రామ దాసుడనని చెప్పుకున్న మహాబలుడు, సంజీవరాయుడు హనుమ.

రామాయణములో పరమాత్మను శరణాగతి, ప్రపత్తి చేసి మోక్షం పొందినవాడు విభీషణుడు. పరమాత్మ తప్ప అన్యం పట్టనిదే భక్తి అంటే. త్రికరణాలను ఒకవద్ద చేర్చిశరణుకోరటం శరణాగతి. అట్టివారిని రామస్వామి కరణ చూస్తాడని విభీషణుని కాపాడిన రామప్రభువు సాక్షి.

రాముని విజయం తదనంతరం సీతతో అయ్యోద్యకు వచ్చిన పట్టాభీషిక్తుడైన రామచంద్రుడు పరివారము మనకు రక్ష. అదే సర్వ జగత్తుకు రక్ష.

పట్టాభిషేక రాముని పఠము ‘ఓంకార రూపానికి’ ప్రతీక. మానవ నాలుగు స్థితులకు ప్రతీక. ఓంకారములో అకార, ఉ కార, మకారము తరువాత బిందువు, నాదము, కళా, కళాతీత, తత్పర యని ఐదు స్థితులు ఉంటాయి.

అకారము జాబవంతుని, ఉకారము సుగ్రీవుని, మకారము హనుమును, బిందువు భరతుని, నాదము శత్రఘ్నుని, కళా లక్ష్మణస్వామిని, కళాతీతము సీతను, తత్పర రాముని చూపుతుంది. ఇలా చిన్ముద్ర పట్టి పరివారముతో ఉన్న రామచంద్రుడు మనకు రక్ష. సాధనలో కలిగే విఘ్నాలు నిరోధిస్తూ అనుగ్రహాన్ని అందించే రామాయణ తత్త్వ విచారము, రామచంద్రుని నామ సంకీర్తనము కేవలము గురువు అనుగ్రహముతో సాధ్యము.

అట్టి గురుదేవుల పాదాలకు రామనామ ఫలసర్వం సమర్పయామి.

“రామ మంత్రార్థ విజ్ఞానీ జీవన్ముక్తో న సంశయః”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here