[శ్రీమతి గీతాంజలి రచించిన ‘రండి ఎవరైనా..!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఎ[/dropcap]వరైనా నాతో మాట్లాడండి..
నన్ను పలకరించండి!
నన్ను దగ్గరకు తీసుకొని
మీ హృదయానికి హత్తుకొండి!
నా కన్నీళ్లు తుడవండి..
నా నుదుటిపై ముద్దు పెట్టుకోండి!
ఈ ఎడారిలోంచి తీసి
నన్ను పచ్చికలో వేసేయండి.
నన్ను సముద్రం వైపో..
తోట వైపో తీసికెళ్లి వదిలేయండి!
పోనీ వెన్నెల కురిసే
ఆకాశంలో కి ఎగరేయండి..
నా కళ్ళల్లోకి కొన్ని
నక్షత్రాల్ని పోగేయండి.
గుండెల్లోకి చంద్రుణ్ణి దింపడి..
చిన్నప్పుడు అమ్మ తినిపించినట్లు
గోరుముద్దలు తినిపించండి.
జోల పాట పాడుతూ
నన్ను కమ్మగా మీ ఒళ్లో నిద్ర పుచ్చండి.
చూడండీ.. ఒంటరిగా ఉన్నాను
నన్ను వదిలేయకండి!
రండి ఎవరైనా..