రంగస్థల నటునికి చివరికి మిగిలిన అంతరంగం – ‘రంగమార్తాండ’!

1
3

[కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’ సినిమాని సమీక్షిస్తున్నారు వేదాంతం శ్రీపతిశర్మ.]

[dropcap]మా[/dropcap]టల రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ చిత్రంలోని చివరి మాటలో ‘పాత్రల పార్థివ శరీరాలను మోసుకుంటూ..’ అంటాడు.

నటుడు మిగిలాడా? మిత్రులు మిగిలిపోయారా? జీవితం ఎలా ముగిసింది? నటన మిగిలిందా? ఇలా కొన్ని ప్రశ్నలు మటుకు మిగిలాయి!

నటన విషయంలో నటులు తాండవించారా లేక మార్తండునిలా వెలిగారా అనేది ఇతివృత్తం, సందర్భం బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది కానీ కేవలం ఒక నటుడిని పరిశీలించి చెప్పగలిగింది కాదు.

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’ – 2016లో వచ్చిన నానా పాటేకర్ చిత్రం ‘నటసామ్రాట్’ కు రీమేక్. దాదాపుగా అదే కథను అనుసరించారు దర్శకులు.

గురు దత్ ‘కాగజ్ కే ఫూల్’ లోని ఆలోచన – తన స్టూడియో లోని చప్పట్లతో షాడో ప్లే మనలను కథలోకి తీసుకుని వెళుతుంది.

ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం చిరకాల మిత్రులు, (పాత్రలలో) రంగస్థల నటులు. బ్రహ్మానందానికి సంతానం లేదు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆస్తి యావత్తూ పంచి నటనకు గుడ్‍బై చెబుతాడు ప్రకాశ్‍రాజ్. కోడలు ఇల్లు డెవెలప్‍మెంట్‍కి ఇస్తుంది. మనమరాలి ఆంగ్ల చదువు, వ్యవహారానికి తీవ్రంగా స్పందించి మొత్తానికి కొడుకు, కోడలిని వదిలి కూతురింటికి చేరతాడు ప్రకాశ్. అక్కడ ఒక దొంగతనాన్ని అంటగట్టడం వలన ఆ ఇల్లు కూడా వదిలి రోడ్డున పడి భార్య చనిపోయాక చివరికి నిప్పులో తగలబడిన పాత రంగస్థలం మీద నుండి జరిగిన కథను ఓ శిష్యునికి చెబుతాడు. అక్కడికి చేరుకున్న కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు చూస్తుండగా ప్రాణాలను వదిలేస్తాడు. దీనికి ముందు మిత్రుడు బ్రహ్మానందం కూడా భార్యను పోగొట్టుకున్నాక దాదాపు పిచ్చివాడై ఆస్పత్రిలో చేరి ముక్తిని ప్రసాదించమని ప్రకాశ్‍ను అడుగుతాడు. టాబ్లెట్లు ఎక్కువగా నీళ్ళల్లో కలిపి అతనికి ‘మోక్షం’ ప్రసాదిస్తాడు ప్రకాశ్!

అలా జరిగే ముందు గతంలో దుర్యోధన-కర్ణ సంవాదాన్ని గుర్తు చేసుకుంటారు ఇద్దరూ..

గంభీరమైన విషయాన్ని నడిపేటప్పుడు ఆసక్తికరంగా లాక్కెళ్ళటం అంత తేలికైన పని కాదు. బహుశః కృష్ణవంశీ చేయి కాబట్టి అది అవలీలగా జరిగినట్లు అనిపిస్తుంది.

రంగస్థలాన్నీ, చలనచిత్ర రంగాన్నీ కలిపేటప్పుడు ఏ ఫక్కీని మూలస్తంభంగా ఎంచుకోవాలి అన్నది చిక్కు ప్రశ్న. ఇద్దరు నటుల నేపథ్యాలు ఏ మాధ్యమం ద్వారా కూడా పూర్తిగా తెర మీదకి రావు. వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ చేసే చేష్టలూ, జరిపే సంవాదాల ద్వారా అంచనా వేసుకోవలసిన పరిస్థితి ఉంటుంది. భార్య చనిపోయాక బ్రహ్మానందం ప్రత్యేకంగా బాధ పడుతున్న సందర్భం ఏదీ ఉండదు. ప్రకాశ్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన సన్నివేశం తప్ప! అందుచేత ‘నాకు ముక్తిని ప్రసాదించు’ అన్నది పేలవంగా కనిపిస్తుంది. అలా అనిన మరుక్షణమే ప్రకాశ్ గ్లాసులో టాబ్లెట్స్ కలిపెయ్యటం మరింత విచిత్రంగా ఉంటుంది. ఒక ఆప్తమిత్రుని ప్రాణాలు తీసెయ్యటం అనేది సామాన్యమైన విషయం కాదు. కొద్దిగా తర్జన భర్జనలు తనలో తాను ఒక నటునిగా, మిత్రునిగా అనుభవించి (ఇక్కడ చిక్కని మాటలకు అవకాశం ఉంది!) ఆ తరువాత ‘ఇదిగో తెర దింపుతున్నాను’ అంటే అది నాటకీయత లోకి వస్తుంది.

‘రంగమార్తాండ’ బిరుదు పొంది మత్తులో ఇంటికి వచ్చి ఆస్తి పంపకాలు (అప్పటికే వ్రాసి ఉంచిన పత్రాలు) చేస్తాడు ప్రకాశ్. ఈ దృశ్యానికి ఎన్ని ప్రతులు స్క్రిప్ట్ వ్రాసారో తెలియదు కానీ, మరో ప్రతి (మంచిది) నాటకీయతను గట్టిగా ముందుకు తెచ్చేది వాడి ఉంటే బాగుండేది.

దొంగతనం అంటగట్టటం అనేది మరాఠీ చిత్రం లోంచి అలానే తీసుకున్నప్పటికీ అది అంతగా కథలోకి చేరలేదనే చెప్పాలి. కూతురు అల్లుడి ద్వారా నిజం తెలుసుకుని బాధపడి క్షమించమన్నప్పటికీ అవమానం భరించలేని ఇద్దరూ వెళ్ళిపోయి చివరికి ఆ సంఘటనే ఇద్దరి చావుకీ దోహదమైనట్లు చూపించారు.

నాటకం, నాటకీయత ప్రధానమైన అంశాలైనప్పుడు ఈ స్థానంలో అందరినీ స్పందింపజేసే మరో సామాజికపరమైన అంశం తీసుకుని ఉంటే కథకు పట్టు దక్కేది. ఒకటి రెండు సార్లు కూతురు వీళ్ళకి వేరే సందర్భాలలో దూకుడుగా వ్యవహరించి కూడా క్షమించమంటుంది. అలాగే తప్పత్రాగిన ప్రకాశ్ కూడా ఆ విధంగా ప్రవర్తిస్తాడు. అందుచేత ఇక్కడ ఎంతో ఆవశ్యకమైన గాఢమైన నాటకీయత లోపించింది.

(ఈ విషయంలో ఎమిల్ బెన్వనిస్టె-1971 చర్చించిన సబ్జెక్టివిటీ, ఇనన్సియేషన్ అంశాలు చూడవచ్చు)

చలనచిత్రమే మూలస్తంభంగా ఎంచుకుంటే పాత్రల ఫోర్‍గ్రౌండింగ్ అవసరమయి ఉండేది. కానీ దర్శకులు అలా చెయ్యలేదు. రంగస్థలం లోని భాష యొక్క ప్రాధాన్యత, వారి పరిశ్రమను ఆధునిక సమాజంలోని ఒరవడుల ముందరకు చేర్చి ఒక ప్రశ్న – సమాధానంలా మిగిల్చారు.

కథనంలో ఎలిప్సిస్ వాడినప్పుడు బాగా ముందుకు నడిచినట్లు కనిపించింది.

ఈ చిత్రానికి ఇళయరాజా నేపథ్య సంగీతం (ధ్వని) చక్కని హైలైట్. నిశ్శబ్దాన్ని దర్శకులు కొన్ని చోట్ల అద్భుతంగా వాడుకున్నారు. సిరివెన్నెల గారి పాటలు, శివప్రసాద్ మాటలు, ఇళయరాజా సంగీతం ఒక ఎత్తైతే; ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయల నటన మరో ఎత్తు.

అర్థరహితమైన ప్రస్తుత తెలుగు చలన చిత్ర ‘రణ’రంగ స్థలంలో నటన, నటుడు – ఈ రెండూ కథలోకి ప్రవేశించిన సందర్భం ‘రంగమార్తాండ’లో కనిపించటం తెలుగు ప్రేక్షకులని కొద్దిగా ఉత్సాహపరుస్తుందనే చెప్పాలి. గంభీరంగా ఎత్తుకున్న ప్రాజెక్టుకు ఎంతో మనోధైర్యం అవసరం. కృష్ణవంశీ ఎంతగానో అభినందనీయులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here