Site icon Sanchika

రంగస్థలం పైకి రావాలంటే..

[dropcap]నృ[/dropcap]త్యాభినయం నా వృత్తి.  వయస్సులో ఉన్నంత కాలం నేను నృత్య ప్రదర్శనలు ఇస్తూ పిల్లలకి కూడా అందులో శిక్షణ ఇస్తున్నాను. నేను స్వంతంగా ఏర్పర్చుకున్న కళా-సంస్థ ద్వారా ఏదైనా కార్యకమాల్లో నాకు తగ్గ పాత్ర ఉంటే నేను వేదిక మీదకు వస్తాను లేకపోతే నా శిష్యుల ద్వారానే ప్రదర్శన ఇప్పిస్తూంటాను.

నృత్యాన్ని నా వృత్తిగా ఎన్నుకున్నప్పుడు మా కుటుంబంలో ఎవరూ హర్షించలేదు. మొదటి కారణం వయస్సు మళ్లాక రంగస్థలం పై నా ప్రదర్శనలు తగ్గిపోతాయి. రెండవ కారణం ఈ వృత్తికి పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ. తెలుసును. అయినా ఇంట్లో వారిని ఒప్పించి నేను దృఢ సంకల్పంతో నా నృత్య కళ తోనే కొనసాగేను. నేను శిక్షణ పొందిన భరతనాట్యములో, భారతీయ లోక-నృత్య-రంగాల్లో నూతన ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాను. ఏదొక కార్యక్రమాల్లో మరియు సాంస్కృతిక సభల్లో వారు కోరిన విధంగా ప్రదర్శనలు ఇస్తూ, శిష్యుల చేత ఇప్పిస్తూంటాను. ప్రతి ప్రదర్శనకి ఒక మొత్తం చెల్లిస్తారు కార్యక్రమ ప్రాయోజకులు. అది కాక శిష్యులు ఇచ్చే నెల జీతమే నాకు ముఖ్యమైన ఆదాయం.

మా గురువు గారి లాగానే నాట్యంలో నిపుణుడు కాకపోయినా కనీసం బాగా ప్రవేశము ఉన్నవారినే జీవన-సహచరుడిగా పొందేటందుకు వేచి ఉన్నాను. అంతవరకు మా నాన్న్గగారే నాకు ముఖ్య సలహాదారులు, ఆధారం కూడా. నృత్యం అనేసరికి ప్రస్తుత కాలంలో టీ.వీ, రియాలిటీ షోలు ప్రభావం వల్ల పిల్లలకి-పెద్దలకి కూడా ఎప్పుడెప్పుడు వేదిక ఎక్కుదామన్న తొందర. అయితే నేను మాత్రం పిల్లలకు శాస్త్రీయ నృత్య కళ పట్ల నిజమైన అభిరుచి, శ్రద్ధా, కష్ట పడే దీక్ష ఉందనిపిస్తేనే నా శిష్యులగా స్వీకరిస్తాను. అయితే నా శిష్యుల్లో ఆడా- మగా ఇద్దరూ ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ. అలా కొన్ని ఏళ్ల నుంచి భరత నాట్యంలో శిక్షణ పొందుతూ కొంత ప్రావీణ్యం పొందాక ‘ఆరంగేట్రం’ అంటే మొదటి సారి శాస్త్రోక్తంగా గజ్జె కట్టి వేదిక పై భరతనాట్యములో ముఖ్యమైన అంశాలను రెండు మూడు గంటల పాటు ఒక కళాకారిణి వాద్య-సంగీతము, గాత్రము, నట్టువాంగంతో పాటు ప్రదర్శన ఇస్తుంది. అందుకే నాట్య గురువులకి పై మూడింటిలోనూ కొంత ప్రావీణ్యము ఉండి తీరాలి. అన్యథా నాట్య రంగంలో రాణించ లేరు. అయితే పిల్లల్ని ఉత్సాహపరిచేందుకు వారి చేత ఏవో కార్యక్రమాల్లో లోక-నృత్యాలు చేయిస్తూ వేదిక పరిచయం చేస్తూంటాను.

పైన చెప్పిన అరంగేట్రానికి అయ్యే ఖర్చు అంతా శిష్యుల తల్లీతండ్రులదే. ఆ సమయంలో మాత్రం గురువుగా నాకు కొంచెం పెద్ద మొత్తం వస్తుంది. ప్రదర్శన ఇస్తున్న కళాకారిణి అలంకరణ శాస్త్రోక్త వేష-భూష, ఆభరణాలు అంతా వారి తల్లి-తండ్రి చూసుకోవాలి.

సుప్రసిద్ధమైన సంస్కృత కవి, రచయత అయిన కాళిదాసు జన్మోత్సవ సందర్భంగా ప్రతి ఏడాది విధిగా ఆయన స్వస్థలమైన ఉజ్జయినీ నగరంలో సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతూంటారు. ఈ ఉత్సవాలు ‘అఖిల భారతీయ కాళిదాస-సమారోహ’ పేరున 1958లో ప్రారంభించి ప్రతి ఏడాదీ మరింత మెరుగులు దిద్దుకుంటూ ఈనాటి వరకూ విజయవంతంగా కొనసాగిస్తూనే ఉన్నారు నిర్వాహకులు. ఈ సమారోహంలో పాల్గొనటానికి అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఎక్కడెక్కడనుంచో పెద్ద పెద్ద కళాకారులు వస్తూంటారు. గత మూడేళుగా ప్రయత్నిస్తున్నాను ఈ సమారోహంలో పాల్గొవాలని. అది ఈనాటికీ ఫలించి ఈ ఏడాది అదే సందర్భంగా నా సంస్థకి పిలుపు వచ్చింది. రెండు నెల్ల గడువు ఇచ్చారు. అంత పెద్ద సమారోహంలో ఒక భాగంగా మా సంస్థ కు అవకాశం దొరకటం వల్ల రాష్ట్ర స్థాయిలో మనకు ఒక గుర్తింపు లభిస్తుందని నా ఆశ.

నా నాట్య బృందంలో అందరూ పదకొండు నుంచి పదిహేనేళ్ల లోపు వాళే. చిన్న పిల్లలు. నివేదిత ఒక్కర్తికి పద్దెనిమిదేళ్లు ఉంటాయి. ఏ పని అప్పగించినా చక్కగా బాధ్యత వహించి చేస్తుంది.

నేను శ్రీ కాళిదాసు రచన అయిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ని ఎన్నుకున్నాను ప్రదర్శనకి. నాటకం సంభాషణ అంతా సంస్కృతంలో జరగాలి. వారు పోషిస్తున్న పాత్రల బట్టి వారి సంభాషణ వేరే-వేరేగా టైపు చేయించి, సంస్కృత ఉచ్చారణ నేర్పించి, ఎవరి సంభాషణ వారికి ఇచ్చి, బట్టీపట్టమన్నాను. బట్టీపట్టిన సంభాషణకు డైలాగ్-డెలివరీ నేర్పించి పాత్రల అందరికీ ఆడియో అభ్యాసం ఇప్పించాను. పదిహేనురోజులు పట్టింది. ఇలా మొదలయింది మా ‘శాకుంతలం’ నృత్య-నాటిక దర్శకత్వం. ఒక్కొక ప్రదర్శనకి రెండున్నర గంటలు కేటాయించారు. వారం రోజులు జరుగుతాయి ఈ ఉత్సవాలు. ప్రతి రోజూ పగలు సాయంత్రం చెరోక ప్రదర్శన ఉంటుంది.

నా బృందం పిల్లలు అందరూ సమవయస్కులైనా వారి-వారి నాట్య అభినయ నైపుణ్యాని బట్టి వారికి వారి పాత్ర కేటాయించాను. ముఖ్యమైన పాత్రలు శకుంతల-దుష్యంతుడు, కణ్వముని అయినా శకుంతల చెలికత్తెలు, తపస్వినులూ, దూర్వాస ముని, దుష్యంతుడి రాజ-సభ సభ్యులు, ఇలా అంత మందిని కలుపుకుని మొత్తం పదిహేను మంది కూడారు. కణ్వ మహామునిగా, దూర్వాస మునిగా కూడా పాత్ర పోషణ నివేదితకి ఇచ్చాను. కణ్వునిగా శాంతం, దూర్వాసునిగా కోపం తను బాగా న్యాయం చేకూర్చగలదని నా నమ్మకం. ముఖ్యమైన మిగతా పాత్రలు కూడా నేను నిశ్చింతగా ఉన్నాను. కానీ అయిదేళ్ల భరతుడిగా ఎవర్ని తీసుకోవాలా ఆన్నది పెద్ద ప్రశ్న అయింది. అంత చురుకు అయిన పాపో/బాబో దొరకాలి. ఆ పాపని తల్లీ-దండ్రులు మాతో పై ఊరుకి పంపటానికి అనుమతించాలి. వెతగ్గా వెతగ్గా వేరే నృత్య కళాశాలలో శిక్షణ పొందుతున్న ఆరేళ్ల చిన్న చురుకైన పాప దొరికింది. పాప పేరు శిల్పి. తల్లితండ్రులని ప్రార్థించి ఒప్పించటం కష్టమే అయింది. అతి కష్టంపై వారు సమ్మతించాక ఆ పాపకి కూడా సంస్కృత సంభాషణ నేర్పించి నా బృందం లోకి ఆస్థాయిగా చేర్చుకున్నాను. ఇక ప్రతి పాత్రకి తగ్గట్టు నృత్యము అభినయం, సంభాషణ నేర్పేను. శిల్పి నేర్పించినది చక్కగా పట్టుకుని అభ్యాసం చేస్తున్నది. నెల పూర్తి అయ్యేసరికి నాటిక ఒక రూపానికి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. మా బృందానికి అలవాటుగా వచ్చే వాద్య-బృందంతో అభ్యాసం మొదలు పెట్టాము. సంస్కృతంలో నృత్య-నాటిక ప్రదర్శన కొత్త ఏమో పిల్లలు చాలా ఉత్సాహంగా ప్రతి రోజు సాయంత్రం వచ్చి అభ్యాసం చేస్తున్నారు.

నాకు ఇంటి బాధ్యత, వంట బాధ్యత లేక పోవటంతో ఎక్కువ సమయం మా కళాశాలలో గడుపుతున్నాను. నాటిక ఒక దారికి వచ్చాక పిల్లలకి పాత్రకు తగ్గ వేష-భూష అలంకరణ తయారు చేయించాను. ఉజ్జయినీ నగరాని బాయిల్దేరే పది రోజుల ముందు ‘వేష-పూర్వాభినయ అభ్యాసం’ [డ్రస్ రిహార్సల్స్] చేయించాక నేను కొంత తృప్తి చెందాను. పదహారు మంది, పిల్లలతో వాద్య బృందంతో నలుగురు పెద్దవారు ఉన్నా నేను నాన్నని తోడుగా రమన్నాను. పిల్లల వ్యక్తిగత సామగ్రి ఒక ఇరవై కాకుండా నాట్య సామాగ్రీ,వాద్య-యంత్రాలూ,కలుపుకుని ఇంకో పది పెద్ద సూట్కేసులు సిద్ధం అయినాయి. ఉజ్జయినిలో కార్యక్రమాలు మొదలవటానికి రెండు రోజులు మునుపు మేము క్షేమంగా చాలా ఉత్సాహంగా కార్యక్రమ స్థలానికి చేరుకున్నాము. అప్పటి వరకు అంతా సవ్యంగా జరిగి పోయినందుకు దేముడికి దణ్ణం పెట్టుకున్నాను. ఇంకా ముందు-ముందు కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని విఘ్నేశ్వరుడిని, నటరాజుని మరీ మరీ ప్రార్థిస్తున్నాను.

ప్రదర్శనలు ప్రాంభించారు. మా ‘శాకుంతలం’ ప్రదర్శన మూడో రోజు సాయంకాలానికి పడింది. రోజుకి పగలు ఒక ప్రదర్శన రెండో పూట మరో ప్రదర్శనకి ఏర్పాటులు జరిగాయి. మొదటి రెండు ప్రదర్శనలూ చూసి నేను నా పిల్లలు చాలా నిరుత్సాహం చెందాము. ‘మాలవికాగ్నిమిత్రం’, ‘మేఘదూతం’ ప్రదర్శించారు. రెండింటిలో మేధావులైన పెద్ద పెద్ద కళాకారులు పాల్గొన్నారు. ఆరితేరిన వారి కళా-ప్రదర్శన ముందు నా చిన్న పిల్లల కళ ఏ మూలకి అని నేను నిరుత్సాహం చూపితే పిల్లలు ఇంకా ఆందోళన చెందుతారని “అదే మరి పెద్ద పెద్ద వారితో పోటీపడితేనే గొప్ప” అని నేను వారిని ఉత్సాహపరిచాను.

మాకు కేటాయించిన వేదిక మీద ‘శాకుంతలం’ అభ్యాసం కూడా తృప్తికరంగా జరుగుతున్నది. అసలీ ప్రదర్శన సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాకు ఆందోళన ఎక్కువ అవుతున్నా పిల్లలు మాత్రం ఇంటికి దూరంగా ఉన్నా తమ తోటివారితో కలిసి ఆడుతూ పాడుతూ ఉత్సాహంగానే ఉన్నారు. ఈ ప్రదర్శన మా అందరికీ మంచి అవకాశం అనుభవం. రాత్రి భోజనాల గది నుంచి తిరిగి మాకు ఇవ్వబడిన హాలు లోకి వచ్చాము. పిల్లలకి ఒక హాలూ, దానితో పాటూ మూడు పడక గదులు, ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు. మర్నాడు సాయంత్రమే మా ప్రదర్శన కాబట్టి పిల్లలు వేసుకోవాల్సిన దుస్తులూ,అలంకరణ ఆభూషణాలూ, రంగస్థలం పృష్ఠ తెర, దాని పైకి అమర్చుకోవాల్సిన సామగ్రీ, రంగస్థలం దృశ్యం మారినప్పుడు మార్చవల్సిన నాలుగు రకాల పృష్ఠ తెరలూ,అన్నీ సరి చూసూకుంటున్నాను. ఇంతలో నివేదిత గాబరాగా నా వద్దకు వచ్చి, మేడమ్ ఒకసారి పక్కకు రమ్మని పిలిచింది. “మేడమ్ పుష్పకి మొదటి రక్తస్త్రావం మొదలయింది. ఒళ్లు కూడా చాలా వెచ్చగా ఉన్నది.” అంది నివేదిత. వెంటనే వెళ్లి చూశాను. పిల్ల విపరీతమైన జ్వరంతో ఉంది. పుష్పకి పన్నెండు ఏళ్లు. సరైన సమయమే. పాపం ఇలాంటి సమయంలో తల్లి దగ్గర దక్షత అవసరం. వెంటనే ఆ పి‌ల్లకి కావాల్సినవి అమర్చి, నివేదితకి తనని గైడ్ చేయమని చెప్పాను. అదృష్టవశాత్తు లేడీ డాక్టర్ దొరికారు. తీసుకోవల్సిన జాగ్రత్తలు చెప్పారు. రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గి పోతుంది అని ధైర్యం చెప్పారు. పుష్పఇంటికి ఫోను చేసి విషయం చెప్పాను. ఇవన్నీ అయ్యాక నాకు మీమాంస మొదలయింది_ “పుష్ప మర్నాడు ప్రదర్శనలో పాల్గొనలేదు. తన పాత్ర సంగతి ఏమిటి?” అని. తనకి జ్వరం తగ్గినా కానీ, అసలు అలాంటి పరిస్థితిలో తను నాట్యం చేయవచ్చా!!!

నాట్యం అనేది నటరాజుని ఆరాధన. అన్నీ తెలిసి పిల్ల చేత తప్పు పని ఎలా చేయించటం. ఇన్నాళ్ల నుంచీ తను అంత అభ్యాసం చేసింది ఏమో పాపం “ప్లీజ్ మేడమ్ నా పాత్ర చిన్నదే కదా నేనే చేస్తాను” అంటూ ఏడుస్తున్నది. తనని అలా చూస్తే మాకు కూడా బాధగా ఉంది. “అలాగే ముందు జ్వరం తగ్గనీ. తరువాత ఏం చేయాలో చూస్తాను” అని పుష్పని ఓదార్చాను. నాకు వెంటనే ఒకే దారి తోచింది.

శంకుంతల ఇద్దరి చెలికత్తెలలో పుష్ప ఒకర్తిగా వేస్తోంది చిన్న పాత్రే అయినా ముఖ్యమైనది. రెండు నెలల్లో పిల్లలందరు ఒకరి సంభాషణ ఒకరు వింటూ కొంత వరకు పక్క వారిది కూడా నేర్చేసుకుంటున్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాక పిల్లలందరిని ఒక దగ్గర సమావేశ పరిచి పరిస్థితి వివరించి అడిగాను “ఎవరు తన పాత్రతో పాటూ పుష్ప వేస్తున్న పాత్ర కూడా ధరించగరు, ఈపూటా, రేపు పొద్దున బాగా అభ్యాసం చేసి సిద్ధపడాలి” అని. కాసేపు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయాక సౌమ్య మెల్లగా చేయి ఎత్తింది. నేను ఆలోచించాను. సౌమ్య చాలా చురుకు అయిన పిల్ల. పుష్పకి ఇచ్చిన పాత్ర ధారణ నాటిక మొదటి భాగంలో ఎక్కువ. సౌమ్య వేయ వల్సిన పాత్ర నాలగవ భాగంలో. రెండు పాత్ర పోషణకి సమయ వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి సౌమ్య తేలికగా పుష్ప పాత్ర పోషణ అయ్యాక తన పాత్ర పోషించటానికి వేషం మార్చుకుని సిద్ధం అవగలదు. పుష్పకి నచ్చ చెప్పటం కష్టమే అయింది. రాత్రి పన్నెండు గంటల దాకా అభ్యాసం చేశాక, ఉదయం ఎనిమిది గంటలకి మళ్ళీ సౌమ్య చేత అభ్యాసం చేయించాక మొత్తం నాటిక అన్ని హంగులతో పూర్తిగా సిద్ధమయింది. నా మనసు కొంత తేలిక చెందింది.

రంగస్థలం నేపథ్యానికి దృశం మార్చటానికి నాలుగు తెరలు సిద్ధంగా ఉంచాము కణ్వ ముని ఆశ్రమం చూపించటానికి, దుష్యంతుడి రాజ సభ, ఇలా నాలుగు వివిధ తెరలు, కృత్రిమ పూల మొక్కలు చెట్లూ, నోరు తెరిచిన కృత్రిమ సింహా శావకం భరతుడి కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ తయ్యారు చేయటమే కాదు ప్రదర్శన పూర్తి అయ్యే దాకా వాటిని పదిలంగా ఉంచటం, ఇంత దూరం వాటిని తీసుకుని ప్రయాణం చేయటం పెద్ద బాధ్యత. పిల్లలు ఆరోగ్యం పాడవకుండా అన్ని జాగ్రత్తలు వహించాను. అయినా ఆందోళన వల్ల రెండు రాత్రులు నిద్ర లేదు. అనుక్షణం నా నాట్య గురువుగారికి ప్రణమిల్లుతూనే ఉన్నాను.

పిల్లలు వారి పాత్ర అనుసారంగా ఎలా అలంకరణ చేసుకోవాలో శిక్షణ పొంది ఉన్నారు కాబట్టి వారు సరిగ్గా సమాయానికి సిద్ధం అయి రంగస్థలం ఇరు వైపుల ప్రవేశం దగ్గర క్రమబద్ధంగా నిలుచుని ఉన్నారు. దృశ్యానుసారంగా, పృష్ఠ తెర మార్చటానికి నాన్నగారు మరో సిబ్బందితో పాటు తయారుగా ఉన్నారు. పుష్పని కూడా తీసుకు వచ్చి ప్రేక్షకుల స్థానం లో కూర్చో పెట్టాను.

‘శాకుంతలం’ శాస్త్రోక్తంగా, నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడి మరియు నటరాజుని ప్రార్థనతో ఆరంభమయింది. సూత్రధారులు నృత్య-నాటిక సారాంశం చెప్పి వెనక్కి వచ్చేశారు. నృత్య నాటిక మొదలయింది.

రాత్రింబగళ్లు ఎంత కష్ట పడినా, ప్రేక్షకులతో పాటూ కూర్చుని ఏ ప్రదర్శననీ చూసి ఆనందించే భాగ్యం నిర్దేశకునిగా నాకు ఉండదు.. ఏమంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని వేదిక పక్కనే చాలా మెళుకువగా ఉండాలి నిర్దేశకులు.

ఒకసారి ప్రదర్శన ఆరంభం అయ్యాక రెండున్నర గంటలు ఎలా గడిచి పోయాయో తెలీలేదు. నృత్య-నాటిక మధ్యలో మంచి దృశ్యము గానీ సంభాషణ గానీ నచ్చి నపుడు ప్రేక్షకులు ప్రశంశాపూర్వకంగా చప్పట్లు కొట్టారు. కానీ నృత్య-నాటిక పూర్తి అయ్యాక రెండు క్షణాలు హాలంతా నిశ్శబ్దంగా ఉండి పోయి ఒక్కసారి గట్టిగా వినపడిన చప్పట్ల సందడి నా ముఖం పై నవ్వు తెప్పించింది. ఆ సంతృప్తి ఎనలేనిది.

ప్రదర్శనలు అన్నీ పూర్తిగా చూసి వారాంతంలో తిరుగు ప్రయాణం అనుకున్నాము. అందులో కొంత మార్పు చేయవలసి వచ్చింది. మా వాద్య బృందంలో ఒక మేడమ్‌ని తోడు ఇచ్చి పుష్పని ఆ మర్నాడే వాళ్ల తల్లి తండ్రుల దగ్గరకు పంపించాక కానీ నేను తేలిక పడలేదు.

Exit mobile version