రంగుల చిత్రం

0
3

[బాలబాలికల కోసం ‘రంగుల చిత్రం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]వే[/dropcap]దగిరిలో మహీపతి గురువు గారు చక్కని గురుకులం నడుపుతున్నారు. ఆయన వద్ద రాజుల మంత్రుల పిల్లలే కాకుండా సామాన్యుల పిల్లలు కూడా చదువుతున్నారు. మహీపతిగారు వారందరికీ కేవలం విద్య మాత్రమే కాకుండా, అనేక కళలు కూడా నేర్పుతున్నారు.

ఇలా ఉండగా గురుకులంలో కొందరు డబ్బు కలిగిన కుటుంబాల పిల్లలు మేమే గొప్ప అని, మరికొంత మంది మాదే ఉన్నత కులం అని ఇంకొందరు మేమే తెలివిగలవాళ్ళం అని, మా తెలివి ముందు మిగతా వాళ్ళు పనికిరారని బేషజాలకు పోతూ ప్రశాంత గురుకుల వాతావరణాన్ని పాడు చేస్తూ తగవులాడుకోసాగారు!

విద్యార్థుల మాటలను, చేతలను గురుపత్ని భార్య కమలాదేవి గమనించి వారిలో పెరుగుతున్న విభేదాలను మహీపతి గారికి తెలిపింది.

వారికి మంచి ఉదాహరణ చూపి, వారిలో మార్పు తీసుకురావాలని మహీపతి గారు నిశ్చయించారు.

చిత్రకళలో బాగా ప్రవేశం ఉన్న నలుగురు విద్యార్థులను పిలిచి ఒక చిత్రం ఇచ్చి వారికి ఇష్టమైన రంగులో చిత్రాన్ని చిత్రీకరించమన్నారు, అయితే చిత్రం మొత్తం వారికిష్టమైన ఒకే రంగుతో చిత్రీకరించాలనే షరతు పెట్టారు!

నలుగురు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో గురువు గారు చెప్పినట్టు తమకు నచ్చిన ఒకే రంగుతో చిత్రాలు చిత్రీకరించారు.

వాటిని గురువుగారు పరిశీలించి “మీ చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రంగుతోనే ఉన్నాయి, అదే ఈ చిత్రాల్ని రకరకాల రంగులతో చిత్రీకరించి ఉంటే ఎంతో అందంగా ఉండేవి కదా! ఆలోచించండి” అని చెప్పారు గురువు.

“అవును గురువుగారూ” అని నలుగురు ముక్త కంఠంతో అన్నారు.

గురువుగారు కూడా చిత్రకళలో నిష్ణాతులు కనుక ఆయన అదే చిత్రాన్ని రెండు గంటలలో రకరకాల రంగులతో అధ్బుతంగా చిత్రీకరించారు. ఆ చిత్రాన్ని చూసిన విద్యార్థులు “అద్భుతంగా చిత్రీకరించారు గురువు గారు” అని చప్పట్లు కొట్టారు.

“చూశారా అన్ని వర్ణాలు కలిస్తేనే చిత్రం అంత అందం వచ్చింది, ఏక రంగుతో అంత అందం రాలేదు! అదే విధంగా సంఘంలో కానీ, పాఠశాలలో గానీ అందరూ కలసి మెలసి ఉండాలి, మా కులం గొప్ప, మేమే గొప్ప అనే బేషజాలకు పోకూడదు. అందరూ కలసికట్టుగా ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు, ఈ రంగుల చిత్రం చూశాక మీకు అర్థం అయిందనుకుంటా” అని వివరించారు గురువు మహీపతి.

ఆయన మాటలు విన్న గురుకులంలో అందరు విద్యార్థులు తాము చేస్తున్న తప్పుని గ్రహించి ఇక మారాలని నిశ్చయించుకుని గురువు గారికి తమ ఆలోచనను సున్నితంగా వివరించారు.

వారిలో వచ్చిన మార్పుకి గురువు మహీపతి, ఆయన భార్య కమలాదేవి ఎంతో సంతోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here