Site icon Sanchika

రంగుల వల

[డా. కోగంటి విజయ్ రచించిన ‘రంగుల వల’ అనే కవితని అందిస్తున్నాము.]


~
[dropcap]ఇ[/dropcap]దింతే
ఇలా ఇంటి చూరు నించీ రాలే వాన చుక్కై
చిన్ని మొక్క కొమ్మ చివర వాలి వూగి ఎగిరి పోయే గాలిపిట్టై
రాలినా వాలినా క్షణికమే అయినా
మనసును వున్నట్టుండి హరివిల్లును చేస్తుంది
హఠాత్తుగా ఆగిపోయిన వర్షంలా నిశ్శబ్దాన్ని పరుస్తుంది
కొండ మలుపులో కాపు కాచిన బెబ్బులిలా కలవరమూ కలిగిస్తుంది

రాలి పడిన వానచుక్క మళ్ళీ నింగికెగిరి కురుస్తుందేమో
ఎగిరెళ్ళిన పిట్ట నీ గుమ్మం ముందు చెట్టు మీద వాలి పిలుస్తుందేమో
బెబ్బులీ మనసు మార్చుకు పోరా పో అంటుందేమో
కానీ ఇది మాత్రం అలా కాదు

గతమూ వర్తమానమూ తానే అయినట్లు
నీ కనుల ముందొక రంగుల వల విసిరేస్తుంది
బేతాళ ప్రశ్నలు నింపిన అర్థం కాని కథను కల్పిస్తుంది
రేపటిని కలగానూ నిలిపి
తాను కన్పించకున్నా కనిపించినట్లూరిస్తుంది
నీతోనే కలిసి నడుస్తున్నట్లు
తనతోనే కలుపుకు పోతున్నట్లు
నిజంగానే తానున్నట్లు
భ్రమల దుప్పటిలో జో కొడుతూ
నిన్ను చుట్టుముట్టినట్టున్న పంజరమై..

Exit mobile version