[dropcap]న[/dropcap]వలాకారుడిగానే కాకుండా ప్రాణ్‌రావు చారిత్రక నవలాకారుడిగా మరింత ప్రసిద్ధులు. తెలంగాణ రైతాంగ పోరాటంపై రెండు నవలలు రాసిన ప్రాణ్‌రావు రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, మహామంత్రి మాదన్న, ప్రజాజ్యోతి పాపన్న, కొమరం భీం లాంటి చారిత్రక నాయకుల మీద విడిగా నవలలు రాయడం అభినందించదగ్గ విషయం. ఆశ్రిత గాయకులు పాడుకునే జానపద కథాగేయాలలోని వీరనాయకుడు సర్దార్ పాపన్న మీద రాసిన నవల ప్రజాదరణను పొందింది. అదే కోవలో ఇప్పుడు రాణి శంకరమ్మ మీద నవలను రాసి వెలువరించారు. జానపద కథాగేయాలలో వినిపించే రాణి శంకరమ్మ కథను చారిత్రక, వాఙ్మయ ఆధారాల వెలుగులో పరిశోధించి, దానికి ఇలా నవలా రూపాన్ని కలిగించారు.
పాపన్న పేట దక్కను సుబాలోని తెలుగునాడులో గల పలు సంస్థానాలలో ఒకటి. ఇది ఎంతో ప్రాచీనమైనది మాత్రమే గాకుండా మెతుకుసీమ అంతటా విస్తరించిన విశాల సంస్థానం. 700 గ్రామాలు గల ఈ సంస్థానాన్ని క్రీ.శ. 1400 ప్రాంతంలో రామినేడు స్థాపించాడు. ఈయన పాకనాటి రెడ్డి, మునిలోల గోత్రుడు. రామినేడు తర్వాత ఏడవతరానికి చెందిన పెద్ద నరసింహారెడ్డి మహావీరుడు. ఈయనకి ఔరంగజేబు ‘మెతుకు సర్కార్’ బిరుదు ఇచ్చి సత్కరించాడు. ఈ రాజవంశంలో 14వ తరానికి చెందిన రాణి శంకరమ్మ. ఈమె వెంకట నరసింహారెడ్డి భార్య. అరివీర భయంకరుడైన సదాశివరెడ్ది తల్లి. శంకరమ్మ గొప్ప వీరవనిత. రుద్రమదేవితో పోల్చతగిన అనేక లక్షణాలు ఉన్న ధీరవనిత. భర్త మరణాంతరము శంకరమ్మ తనకు హక్కుభుక్తమయిన సింహాసనం నుండి వంచించబడింది. అయినా గొప్ప వ్యక్తిత్వము, ధైర్యము గల శంకరమ్మ నిరాశపడలేదు. తగిన అవకాశం కోసం ఓర్పుగా వేచివుంది.
ఇంతలో మహారాష్ట్రులకీ, నైజాం మీర్ అలీఖాన్ రెండవ అసఫ్ జా కి మధ్య యుద్ధం చెలరేగింది. ఆ యుద్ధంలో శంకరమ్మ నైజాంకి బాసటగా నిలిచింది. నిజాం ప్రభువు సర్వసైన్యాద్యక్షుడు మురాద్ ఖాన్ ఆవేశంతో, మరాఠా సేనలు కొండ దిగకుండా, శంకరమ్మ చేసిన వ్యూహ రచన, దాడి చేసిన తీరు, సాహసోపేతంగా సమయస్ఫూర్తితో కూడుకుని వున్నాయి. మహారాష్ట్రులతో వీరోచితంగా పోరాడి నైజాంకి విజయం వెండి పళ్ళెంలో అందించింది. శంకరమ్మ యుద్ధ వ్యూహం, అసమాన పోరాట పటిమ నైజాం మెప్పు పొందాయి. నిజాం ఆమెను ఆందోలు గద్దె మీద కూచోబెట్టాడు. ఆమెకి రాయ్‌బాగిన్ (రాణి పులి) బిరుదు ఇచ్చి సత్కరించాడు.
ఇన్ని అద్భుత లక్షణాలు వున్న శంకరమ్మ ఏ రాజవంశంలోనో, మరో కులీన కుటుంబంలోనో జన్మించలేదు. సంగారెడ్డి అనే పేదరైతు కడుపున పుట్టింది. అయితే పేదింటి పిల్ల శంకరమ్మను నరసింహారెడ్డి పరిణయమాడటానికి దారితీసిన సంఘటనలు వివరిస్తారు రచయిత, వారి వివాహం ఇష్టం లేని రాజమాత కక్ష గడుతుంది. ఆమె చెల్లెలు కొడుకు దుర్బలుడైన జీవనరెడ్డిని చేరదీసి, అతని భార్య లింగమాంబతో కలిసి అంతఃపుర కుట్రలకు పాల్పడుతుంది.
సిద్దిబిలాల్ కుమారులు అబ్దుల్లా, గులాంలు నరసింహారెడ్డి కాలంలో మంత్రి, సేనాపతి పదవుల్లో వుండి అవినీతికి పాల్పడి, అధికార దుర్వినియోగం చేయడానికి అలవాటు పడడం, ఈ దుర్మార్గులను నరసింహారెడ్డి తొలగించడంతో వారు రాజకీయ దళారి బాబుఖాన్‌ను ఆశ్రయించి ఆడిన నాటకంతో నవల ఆసక్తిదాయకంగా మారుతుంది. ఆ తరువాత వారు రాణి శంకరమ్మ పాలనలో ఆటంకాలు సృష్టించడం, వాటిని అధిగమించడానికి రాణి శంకరమ్మ చేసిన ప్రయత్నాలు, ముఖ్యంగా సత్యానంద స్వామి బూటకపు మాటల మాయాజాలంలో ఆమె పడిపోయి, నిరాయుధంగా కాలినడకనే కాశీయాత్రకు బయలుదేరడం, మార్గమధ్యంలో ఆమెని చంపడానికి ప్రయత్నించడం, దేవుడిచ్చిన బిడ్డ సదాశివరెడ్డి ఆమెకి అండగా నిలవడం, అనంతర కాలంలో ఆ కుర్రవాడిని రాణి శంకరమ్మ దత్తత తీసుకోవడం, రాచ పుండు వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించడం, అందువల్ల ఆమె సదాశివరెడ్డి వివాహం జరిపి, అతను సింహాసనం ఎక్కిన తరువాత మరణించడంతో నవల ముగుస్తుంది.
ఆందోలు సంస్థానం అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర గల సిద్దిబిలాల్ పేరిట ఏర్పడిన సిద్దిపేట, రాణి శంకరమ్మ తండ్రి పేరున ఏర్పాటైన సంగారెడ్డి ఇలా అనేక అంశాలు ఈ నవలలో పూలదండలోని దారంలా కనిపిస్తాయి. ఆందోలు నగరం చుట్టూ గల ప్రాకారాలు, గవనిలు, పిల్లిదిడ్లు, బురుజులు, వాటిపై ఫిరంగులు, కోట మధ్య భాగంలోని రాజప్రాసాదాలు, ప్రత్యేక మందిరాలు, అభ్యంతర మందిరాలు మొదలైన వాటితో ఆనాటి వాతావరణాన్ని కళ్ళకు గట్టినట్లు చిత్రీకరించారు.
ప్రాణ్‌రావు గారు చరిత్రను ప్రతిబింబింపజేస్తూ చారిత్రక ఆధారాలతో, వాస్తవాలకి వీలైనంత దగ్గరగా ఈ రాణి శంకరమ్మ నవలను రూపొందించారు. ఈ నవల వ్రాయడానికి రచయిత విస్తృత పరిశోధన చేశారు. అనేక పుస్తకాలను తిరగేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా పర్యటించారు. ఆ కాలం నాటి కోటలు, గడీలు, దేవాలయాలు, దిగుడు బావులు దర్శించారు. అలాగే అనేక జానపద గాథలను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఎక్కడా అభూతకల్పనల జోలికి పోలేదు. సినిమా స్క్రిప్టును మరిపించేలా ఈ చారిత్రక నవలను తీర్చిదిద్దడంలో ప్రాణ్‌రావు చూపిన నేర్పు ప్రశంసనీయం.
***
మెతుకు మాణిక్యం రాణి శంకరమ్మ
రెడ్ది రాణి వీరగాథ (చారిత్రక నవల)
రచన: ఎస్. ఎమ్. ప్రాణ్‌రావు
పేజీలు: 200
వెల: ₹150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్
మరియు 8008950101