Site icon Sanchika

బాలల హితం కోరే ‘రాణిగారి కథలు’

[dropcap]ప్ర[/dropcap]సిద్ధ రచయిత శ్రీ ఆర్.సి. కృష్ణస్వామిరాజు గారు 30 బాలల బొమ్మల కథలతో వెలువరించిన పుస్తకం ‘రాణిగారి కథలు’. ఈ కథలన్నిటికీ ప్రసిద్ధ చిత్రకారుడు, కార్టూనిస్ట్ శ్రీ మాధవ్ యుక్తమైన బొమ్మలు గీశారు.

ఇందులో – ఆనంద రహస్యం, వెదురు కర్ర, పచ్చ ఇడ్లీ, రాత్రి బడి, మాపటి మాట, బుద్ధి మాటలు, గంప కింద పిల్లి, ప్రాణ వాయువు, అందరూ చదవాలి!, వ్యాపార యంత్రం, దర్భమాల, జామీను, రాణి గారి కథ, మిరప బజ్జీ, చీపురు పుల్ల, ఉత్తరు శ్రోత, వేళ్ళు బలంగా ఉంటేనే మహావృక్షం, వాన – ఏడుపు, కలసి తింటే కలదు సుఖం, పులి – గిలి, యోగా ఒక యోగం, పిల్లన గ్రోవి, కుక్క చెవులు, మంచి గురువు ఉండాలి, నక్క తోక దొందూ దొందే.., రాణి నవ్వు, నమ్మకానికి చిరునామా నాన్న – అనే కథలున్నాయి.

***

“కథలు కన్నతల్లిగా ప్రేమగా తప్పులను సవరిస్తాయి. స్నేహితునిలా సమాజాన్ని అర్థం చేయిస్తాయి. తండ్రిలా నిరంతరం హెచ్చరిస్తాయి. గురువులా మంచి మార్గం వైపు అడుగులేయిస్తాయి. పిల్లలను డబ్బు సంపాదించే యంత్రాలుగా కాక, మానవీయ విలువలను పెంపొందించే నిజమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి.

కథలు చిన్నారులను నవ్విస్తాయి, ఏడ్పిస్తాయి, ఆనందపరుస్తాయి. ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఆలోచింపజేస్తాయి. ఊహాలోకంలో విహరింపజేస్తాయి. కొత్త కొత్త ఆలోచనలకు పదునుపెడతాయి. నూతన ఆవిష్కరణలకు దారులు వేస్తాయి. చిన్నారుల్లో ఉన్నత విలువలు నింపి, చక్కని వ్యక్తిత్వాన్ని పెంపొదిస్తాయి. అటువంటి పనిని మన రాజుగారు అంకితభావంతో నిర్విరామంగా చేస్తూ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తన కథల ద్వారా చక్కని బాటలు వేస్తున్నారు.

ఈ సంపుటిలో ప్రధానంగా రెండు రకాల కథలున్నాయి. మొదటివి ఉపదేశ ప్రధాన కథలయితే, తరువాతవి హాస్య, వ్యంగ్య కథలు. రెండిటిలో ఏవి ఎక్కువ అంటే, ఉపదేశ ప్రధాన కథలే ప్రధానంగా కనిపిస్తాయి.

పిల్లలను పెద్దలను ఒకేసారి అలరించే ఈ ‘రాణిగారి కథల’కు స్వాగతం పలుకుదాం.” అన్నారు డా. ఎం. హరికిషన్ తమ ముందుమాట ‘ఉపదేశ ప్రధానంగా సాగిపోయే కథలు’లో.

***

“కృష్ణస్వామిరాజు గారి కథల్లో నేను స్పష్టంగా గమనించిన ప్రత్యేకత – సాధారణంగా ఎవరైనా కథను అల్లడం, సన్నివేశాలు రూపొందించడం, పాత్రల మధ్య డ్రామా ఈ క్రమం మామూలే. కానీ రాజుగారి కథల్లో, కథ కోసం పాత్ర, పాత్రల మధ్య సన్నివేశం ఫార్ములా కాకుండా ఒక చక్కటి నీతిని ఎన్నుకుని, దానిని చెప్పడానికి తగు పాత్రలను, వాటి మధ్య ఆసక్తికర సన్నివేశం, సంభాషణలతో ఆ విషయాన్ని చెప్పడం ఈ కథల్లోని ప్రత్యేకత… అలాగే రాజుగారు ఇక్కడొక విషయాన్ని విస్మరించలేదు. ఎవ్వరికీ మాటలతో చెప్తే సరిపోదు. అర్థంకాదు. ప్రాక్టికల్‌గా అర్థమయ్యే పరిస్థితి రావాలి. అప్పుడే మంచి మాటలు చెవికెక్కుతాయి. అందుకోసం రచయిత అర్థమయ్యే పరిస్థితులను సృష్టించి, ఆ సందర్భంలో చెప్పడం వల్ల పాఠకుల హృదయాలకు హత్తుకుంటాయి. ఇక్కడ మరొక విషయం తప్పక చెప్పుకోవాలి. పాత తరంతో ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలంటే ఇంట్లోని పెద్దలు, చదువు నేర్పే గురువులు, ఊరి పురోహితులు ముఖ్య పాత్ర వహించేవాళ్ళు. వాళ్ళ మాటల్లో ఆధ్యాత్మిక, ధార్మిక పురాణేతిహాసాల ఉదాహరణలతో బాటు సందర్భోచిత సామెతలూ ఉండి ఆ మాటల విలువను పెంచేవి. ఈ కథల్లో అలాంటి పాత్రలే కనిపిస్తాయి. ప్రతీ కథ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. ప్రతీ పాత్ర పరిచయమున్నట్టుగానే అనిపిస్తుంది.. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.” అని వ్యాఖ్యానించారు శ్రీ మాధవ్.

***

“బాల్యంలో ఏ భావాలు అయితే మనసులో బలంగా నాటుకుపోతాయో, వాటి ప్రభావం జీవిత కాలమంతా ఉంటుంది. అందుకే మనం పిల్లలకు మంచి విషయాలు, ఆశావాద ఆలోచనలు అనే విత్తనాలను బాల్యంలోనే వారి మెదడులో నాటాలి.

ప్రత్యక్షంగా మనం మంచి విషయాలు చెబితే వారికి అంత ఆకర్షణీయంగా అనిపించదు కాబట్టి తరతరాలుగా కథల రూపంలో చెప్పడం అలవాటయ్యింది.

అనేక కథల్లో సామెతలు, నానుడులు విరివిగా వాడడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే పిల్లలకు కథల పట్ల ఆసక్తి, సమాజం పట్ల అవగాహన, భాష పట్ల గౌరవం కలగుతుందని ఆశ.

అంతేకాకుండా, మన సంస్కృతీ సంప్రదాయాలు, మానవ సంబంధాలు, కుటుంబ సభ్యుల మధ్యన అనురాగాలు, గురుశిష్యుల బంధాలు మంచిగా, బలంగా ఉండాలనే తాపత్రయంతో రాసినవి.

పుస్తకంలోని ముప్ఫై కథలూ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. ఎక్కువమంది పాఠకులను ఆలోచింపజేసినవే. వీటిని ఒక పుస్తక రూపంగా తెస్తే ఎక్కువమందికి చేరుతుందనే ప్రయత్నంతోనే ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెచ్చాను” అన్నారు రచయిత ‘నామాట’లో.

***

బాలల హితం కోరే కథల సంపుటి ఇది.

***

రాణిగారి కథలు (బాలల కథలు)
రచన: ఆర్.సి. కృష్ణస్వామి రాజు
పేజీలు: 120
వెల: ₹ 140
ప్రచురణ: సమత పబ్లిషర్స్, విశాఖపట్నం
ప్రతులకు:
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
ఫోన్ 9393662821.
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

Exit mobile version