రసానంద రమణుడు – ముళ్ళపూడి వెంకట రమణ

0
2

[box type=’note’ fontsize=’16’] జూన్ 28వ తేదీ శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ జన్మ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం అందిస్తున్నారు డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్. [/box]

[dropcap]తె[/dropcap]లుగు వారి లోగిళ్ళలో జీవిత యథార్థ దృశ్యాలని హాస్యంలో రంగరించి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియల్లో మనకి శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ అందించారు. ఈయనని ‘ముళ్ళవాడి వ్యంగ్యట రమణ’ అన్నాడు ఎమ్విఎల్. నిత్యజీవితంలో మన చుట్టూ కనిపించే వ్యక్తులందరూ ఎన్నో పాత్రల్లో ముళ్ళపూడి రచనల్లో సాహిత్యంలో కానీ, అయన సినిమా స్క్రిప్ట్ లలో కానీ కనిపిస్తారు.

“మీరూ, రమణ గారు ద్వంద్వ సమాసం కదా! మీ ఇద్దరికీ ప్రేరణ ఎవరు?” అని నేను వారిని అడిగాను. ఒక దశాబ్ద కాలం వారిద్దరి సాన్నిహిత్యం లభించడం నా అదృష్టం. “తెలుగు వారి జీవితమే మాకు ప్రేరణ” అన్నారు జాయింట్ గా నవ్వుతూ బాపు రమణలు. వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యాన్ని చూపించే యుగకర్తల నుంచి, గోవులోస్తున్నాయి జాగ్రత్త వ్రాసే అధివాస్తవికత వాదుల దాకా వరకు ఎందరో కవులు రచయితలు సాహిత్య సామాజిక ప్రయోజనాలని వేరు వేరుగా చూపించారు. సౌందర్యాన్ని కళాత్మకతని ఎవరు చూపినా అది వాస్తవానికి దూరంగా ఉందనీ, జీవితానికి దూరంగా ఉందనీ కొందరు విమర్శకులు అధిక్షేపించారు. హాస్య రసం మీద విశ్వవిద్యాలయాల్లో ఆనాడే కాదు ఈనాడు కూడా పెద్దగా పరిశోధనలు జరగలేదు.

హాస్యానికి ఇంచుమించు మునిమాణిక్యం గారి ‘కాంతం’ వచ్చేదాక సాహిత్యంలో హాస్యమే ప్రధాన రసంగా పెద్దగా ఎవరు వ్రాయలేదు. హాస్యానికి ప్రముఖ స్థానం లభించలేదు. కందుకూరి వారి నుండి చిలకమర్తి, గురజాడ, పానుగంటి మొదలైన వారు వ్యంగ్య, అధిక్షేప, వక్రోక్తి రూపంలో సమాజం లోని ఎన్నో దురాచారాలని ఎత్తిపొడుస్తూ తమ రచనలని చేసారు కానీ, లలిత హాస్యాన్ని, జీవితంలో నుండి పరిమళించిన హాస్యాన్ని అందించలేదు.

అత్యంత ఆశ్చర్యకరంగా విశ్వవిద్యాలయాల్లో కూడా హాస్యరసం, హస్యరచయితలు కూడా ఉపేక్షించబడ్డారు. హస్యరసం పరిశోధనకి కూడా పెద్దగా నోచుకోలేదు. నిజానికి జీవితంలో అన్ని రసాల కన్నా ప్రజలు అతి ఎక్కువగా హాస్యాన్ని, చిరునవ్వునే కదా.

ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్య సామాజిక ప్రయోజనాలని ఒకేసారి సాధించాడు. జీవితం లోని కన్నీళ్ళు, అసమర్థతలు వ్యథల దగ్గరనుండి విజయం కోసం పోరాటాలు, రాజకీయాలు కుటుంబ జీవితం, ప్రేమల దాకా జీవిత చిత్రమంతా కనిపిస్తుంది. ఆ నవ్వులు హృదయంలో నుండి వచ్చినవి, జీవితమంతా నిలిచేవి అంతే కానీ కాసేపు నవ్వించి కరిగి పోయేవి కావు.

ఆరు దశాబ్దాలుగా ముళ్ళపూడి హాస్యాన్ని అందించాడు. లోకంలో ఉన్న నవ్వుల రకాలన్నీ ముళ్ళపూడి రచనల్లో ఉన్నాయి. ఖరీదైన జరీ కండువా గుబురు మీసాల నవ్వులు, అందమైన రాధమ్మ సిగ్గు దొంతరల మల్లెపూవుల పరిమళాల నవ్వులు ఒకవైపు కనిపిస్తే, తన ఆకలి, చాతకానితనం మీద తనే జోకులు వేసుకుని నవ్వే అసమర్థపు నవ్వులు ఇంకో వైపు కనిపిస్తాయి. జేబులో ఒకే రూపాయి తనని చూసి నవ్వుతు ఉంటే, దాన్ని నోరు మూయించి, కొడుక్కి మూడు చక్రాల సైకిలు బేరమాడి ఖరీదుగా కనిపించాలని షావుకారుతో నవ్వే మధ్యతరగతి తండ్రి నవ్వుల దాకా ముళ్ళపూడి రచనల్లో కనిపిస్తాయి.

“నవ్వొచ్చినప్పుడు ఎవ్వడైనా నవ్వగలడు, ఏడుపోచ్చినప్పుడు కూడా నవ్వినవాడే మగాడు, అసలదే నవ్వు” అని నవ్వుకి క్రొత్త నిర్వచనం చెప్పినవాడు ముళ్ళపూడి. గ్రాంథికం పట్టు ఇంకా సడలని 1950 లలోనే ముళ్ళపూడి అందమైన లలిత పదాల్లో తెలుగు కథ సృష్టించాడు. వీధికో నవ్వు , పూటకో మాటకో లవ్వు, ఈ రోజుల్లోనే కనిపించిందని ఆధునికులు అనుకుంటుంటారు. పట్టువదలని విక్రమార్కుల లవ్వులు ‘ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిలు’ కథలు 1955 లోనే ముళ్ళపూడి వ్రాసాడంటే ‘హన్నా’ అనే ముళ్లపూడి స్టైల్లోనే ‘హచ్చేర్య’పడి పోతారు. ఒకే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగల గోపాలం వంటి ‘ఏకలవ్యుల’ నుండి (ఒకే అమ్మాయిని లవ్ చేసిన వాడు ఏకలవ్యుడు) ఓ ప్రభావతికి బీటేసే మూడవ నంబర్ ప్రద్యుమ్నుడి వరకు ఎందఱో లవ్వు కుమారులు ‘భగ్న వీణలు బాష్ప కణాలు’ మొదలైన కథల్లో కనిపిస్తారు.

జనత ఎక్స్‌ప్రెస్ కథల్లో మధ్యతరగతి జీవితంలోని సర్వ విధ పాత్రలు కనిపిస్తాయి. చిన్న చిన్న ఆనందాలు కలహాలు కన్నీళ్లు డాంబికాలు భేషజాలు అప్పులు, దర్జాలు, అమ్మాయిల కోసం పడే పాట్లు అన్నీ కనిపిస్తాయి. ఈ కథల్లోని సజీవ జీవిత చిత్రీకరణని మాతృకగా తీసుకుని ఆ తరువాత అక్కినేని నాగేశ్వర రావు నాయకుడిగా అందాల రాముడు సినిమా తీసారు బాపు రమణలు.

రాధాగోపాలం కథలో తన చెలికాడితో సహా తోటల వెంబడి, పెళ్ళిళ్ళలో గాఢమైన ప్రేమ కురిపించి చివరికి దిగ్విజయంగా రాధమ్మని పెళ్ళాడేస్తాడు గోపాలం. ఓ శుభోదయాన అందమైన కళ్ళతోనే అందంగా ముగ్గులు పెట్టేస్తున్న రాధమ్మ మురిపెంగా చూసుకుంటూ “నాకు బోల్డు బాకీ ఉన్నావు పిల్లా” అంటాడు గోపాలం. “ఏం బాకీ?” అని కళ్ళతోటే ప్రశ్నించి, అందంగా సిగ్గు పడింది రాధమ్మ.

“అదుగో ఆ నవ్వే నా కొంప ముంచింది. మీ నాన్నని అర్జెంట్‌గా బాకీ డబ్బులు పంపించమని చెప్పు. వైకేరియన్ లయాబిలిటి తెలుసా?” అన్నాడు లాయర్ గోపాలం.

“అంటే ఏమిటో?” మూతి ముడిచింది రాధమ్మ.

“ఏవిటేవిటి! పెళ్లిగాక ముందు ఎన్నిసార్లు నీ కోసం బీటేసి, ఫ్రెండ్స్‌తో సహా ఎన్ని టీలు త్రాగానో, నువ్వు నన్ను చూసి నవ్వితే నా ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చాను. నేనడిగిన చీర లేదా ఓణీ నువ్వేసుకుంటే, నా టీముకి సినిమాలు చూపించాను. ఇలా ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జ్‌లు అయ్యాయో తెలుసా? నువ్వు మీ నాన్న కలిసి కట్టండి” అంటాడు గోపాలం.

“మీకేనేమిటి పెద్ద గొప్ప! మీకోసమని పట్టు పావడాలు, జుంకీలు మీరడిగిన కలర్ చీరలు ఓణీలు, వీటికెంత ఖర్చయ్యిందో తెలుసా? ..అయినా మా ఫ్రెండ్ పెళ్లిలో మీ కోసం కష్టపడి నే తయాయి వస్తే, ఏటో మాయమయి ఇంత మందం పౌడర్ కొట్టుకుని ప్రత్యక్షమయ్యారు. అయినా. మీ బాకీలు పోను ఇంకా మీరే నాకు బోల్డు బాకీ” అంది రాధమ్మ ….ఇదీ రాధా గోపాలం. (ఈ రాధా గోపాలం కథలని రేడియో నాటకం అనుసరణగా నేను వ్రాసాను. ముళ్ళపూడి గారు ఆద్యంతం చదివి మెచ్చుకున్నారు. ఇది ఆకాశవాణి మద్రాస్ కేంద్రం సమర్పించింది.)

అక్కినేని నాగేశ్వర రావు జీవిత చరిత్రని ‘కథానాయకుడి కథ’ అనే పేరుతో ఆయన జీవిత చరిత్ర వ్రాసారు. అక్కినేని జీవితం లోని విజయాలు, కీర్తి శిఖరాలు, నటనలో సరి క్రొత్త వైవిధ్యాలు, శాశ్వతంగా నిలిచిన అద్భుత ప్రతిభకి ప్రతీకలతో పాటు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు చిక్కులు, కఠిన సమస్యలు, కొన్ని అపజయాలు కూడా యధాతధంగా వివరించి నట సామ్రాట్ జీవిత కావ్యాన్ని మన కళ్ళ ముందు ముళ్ళపూడి నిలిపారు.

సృష్టిలో అప్పు అడగటం కన్నా బాధ కలిగించే విషయం మరొకటి లేదు. దీన్ని జీవన ధర్మం, సృష్టి ధర్మం అంటాడు ముళ్ళపూడి. “ప్రతి రోజు అఋణ కిరణుడు సరస్సులు సముద్రాల దగ్గర నుడి అప్పు, ‘అప్ (నీరు)’ తీసేసుకుని మేఘాల ద్వారా తిరిగి అప్పు తీర్చేస్తున్నాడట. ముళ్ళపూడి ‘ఋణానంద లహరి’ అనే అప్పు కవీయం వ్రాసాడు. ఆ ‘ఋణగొణధ్వని’ మీరు చదివితే వినిపిస్తూనే ఉంటుంది.

తెలుగువారి అల్లరి పిడుగు బుడుగు. ‘సీగాన పెసూనాంబ’ బుడుగుకి ఫ్రెండు. వాడి కింద ఎంత మంది మాష్టార్లు పనిచేసారో తెలియదు. వాడికి ప్రైవేటు అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాడు ఎవరి గుండు మీద నైనా ‘గాఠిగా’ ప్రైవేటు చెప్పగలడు. కాణీయో ప్ఫదణాలో ఇచ్చి బుడుగును సంతోష పెట్టవచ్చును. బుడుగంటే పెద్దలకీ పిల్లలకీ కూడా ఇష్టమే. ముళ్ళపూడి సాహిత్యం ఒక వినోదం, ఒక లోక జ్ఞానం, జీవిత సాగరం లోని సమస్త కష్ట నష్టాలని హాస్యంలో రంగరించి ఆవిష్కరింప చేసిన రమణీయ రసానంద లహరి ముళ్లపూడి సాహిత్యలహరి.

ముళ్లపూడి వెంకట రమణ సాహిత్య ప్రస్తానం ఒక శిఖరం అయితే మరో ఎత్తు సినీ ప్రస్థానం. ఇది బాపు రమణల అపూర్వ సృష్టి. ‘సాక్షి’ నుండి ‘శ్రీ రామ రాజ్యం’ దాక వారి మహా ప్రస్థానం సాగింది. ముళ్ళపూడి గారిని కలిసినప్పుడు ‘మీ జీవితంలో ఆశ్చర్య పోయే సంఘటన చెప్పమ’ని అడిగాను. “నన్ను హాస్య రచయిత అని మీరు అనుకుంటారు. తెలుగు సినిమాల్లో అత్యంత శోకభరిత సినిమా ఎన్.టి.ఆర్ ‘రక్త సంబంధం’కి కథ మాటలు నేనే వ్రాసాను” అన్నారు నవ్వుతూ. అదే ముళ్ళపూడికి, ఆ తరువాత ‘మూగమనసులు’కి అవకాశం వచ్చింది. చిత్రం ఏమిటంటే ఈ సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఆత్రేయ గారితో కథ స్క్రీన్ ప్లే వ్రాయించారు. అక్కినేని ఓ.కే అన్నారు. కొన్ని సన్నివేశాలు షూటింగ్ కూడా అయిందట. ఆదుర్తి గారికి ఎక్కడో అసంతృప్తి. “పడవ నడుపుకునే వాడికి (అక్కినేని) అమ్మాయిగారికి (సావిత్రి) లవ్ ఏమిటయ్యా?” అన్నారట. అప్పుడు ముళ్ళపూడి చేతికి కథ వచ్చింది. గౌరీ (జమున) పాత్ర ఆయన సృష్టించారు మొత్తం మారిపోయింది.

బాపు రమణల సినిమాలో ఆత్మ ఒక్కటే శరీరాలు వేరు వేరు. నేను రమణ గారి స్క్రీన్ ప్లే చూసాను. ఒక దృశ్యాన్ని చిత్రీకరించే టప్పుడు దానికి అవసరమైన అతి చిన్న వివరాలని కూడా రమణ పొందుపరుస్తారు. బాపు సినిమాలో బొమ్మ అంటేనే అందులో రమణ ఆ బొమ్మలో ఆత్మ సౌందర్యం అంతా అంటారు బాపు. ముళ్ళపూడి స్క్రీన్ ప్లేతో బాటు కథ సంభాషణలు కూడా సమకూరుస్తారు. ఆ గౌరవానికి ఇదే కారణం.

బాపు రమణలు చిత్రీకరణలో తాము చెప్పదలచుకున్న విషయాన్ని నాలుగు అంశాలుగా విభజిస్తారు. నేపథ్యం చాలా ప్రధానాంశం. అదే ఎంతో చెబుతుంది. ఈ నేపథ్యంలో సంగీతం కూడా అద్భుతం ఎంతో చెబుతుంది. ఆ తరువాత నటీనటుల దుస్తులు సందర్భాన్ని బట్టి వారి మనోభావాలను బట్టి వారి అలంకరణ కూడా తీర్చిదిద్దుతారు. ఆ తరువాత సంభాషణలు ప్రాధాన్యం వహిస్తాయి. ఒక్కోసారి సంభాషణలు ఉండకపోవచ్చు. దృశ్యమే ఎంతో చెబుతుంది. ఈ చిత్రీకరణలో బాపు కెమెరా ఇంకా అద్భుతపాత్ర వహిస్తుంది. చివరిగా పాత్ర పోషించే నటుడి నుండి నటనని తీర్చి దిద్దుతారు.

శ్రీరాముడికైనా రావణాసురుడికైనా అతి సుదీర్ఘ సంభాషణలుండవు. శ్రీ నందమూరి తారక రామారావు గారికి కూడా ముళ్ళపూడి సుదీర్ఘ సంభాషణలు వ్రాయలేదు. ఆయన రెండు బాపు సినిమాల్లో నటించారు. 1. శ్రీ రామాంజనేయ యుద్ధం 2. శ్రీ నాథ కవి సార్వభౌముడు. అక్కినేని నాగేశ్వర రావు గారు కూడా రెండే బాపు సినిమాల్లో వేసేరు. 1. బుద్ధి మంతుడు 2. అందాల రాముడు. బాపు దర్సకత్వ ప్రతిభ గురించి చెప్పాలంటే 18 పర్వాలు ఉంటుంది.

బాపు రమణలకి రాముడన్నా రామాయణమన్నా ఎంతో ఇష్టం. ‘రాజాధి రాజు’ సినిమా ఒక్కటే ఆయన ఏసు పభువు ప్రేమ సిద్ధాంత ప్రాతిపదికగా తీసారు తప్ప మొత్తం అన్ని సినిమాల్లోనూ, వీలు అయినంత వరకు ఎక్కడో అక్కడ రామాయణ స్పర్శ, ముద్ర ఉన్నాయి. మానవ జీవితంలో రామాయణ ధర్మం ‘ముత్యాలముగ్గు’ లాంటి సాంఘిక సినిమాల్లోని వారు చూపించారు. ‘సంపూర్ణ రామాయాణం’ నుండి ‘శ్రీ రామ రాజ్యం’ దాకా అయన వీలు దొరికినప్పుడల్లా రామాయణాన్ని వదిలి పెట్టలేదు.

సాధారణంగా తమ సినిమాల్లో ఒకే హీరొయిన్‌కి ఎక్కువ అవకాశాలు బాపు రమణలు ఇవ్వరు. శ్రీమతి విజయ నిర్మల మాత్రమే అత్యధికంగా 3 సినిమాలు – ‘సాక్షి’ (నాయకుడు కృష్ణ) ‘బంగారు పిచిక’ (నాయకుడు చంద్ర మోహన్) బుద్ధిమంతుడు (అక్కినేని) చేశారు. వీరు గాక శ్రీమతి వాణిశ్రీ మాత్రమే రెండు సినిమాల్లో నాయికగా నటించారు. భక్త కన్నప్ప (నాయకుడు శ్రీ కృష్ణంరాజు), గోరంత దీపం (నాయకుడు శ్రీధర్). ‘శ్రీ రామ రాజ్యం’లో నయన తార వరకు ఎందరో నాయికలు బాపు బొమ్మలుగా నాయికలుగా ఆయన చిత్రాల్లో కనిపిస్తారు.

తెలుగు సినిమాల్లో హాస్యం బాపురమణ సినిమాల్లో క్రొత్త రూపం సంతరించుకుంది. 1971 వరకు శ్రీ నాగ భూషణం, శ్రీ అల్లు రామలింగయ్య జంటగా బాపు రమణలు హాస్యాన్ని అందించారు. తెలుగు సినిమాల్లో హాస్యం అప్పటివరకు కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా ఉండేది. సినిమాలు కూడా ఎంత పెద్ద హీరోలు ఉన్నా కుటుంబ కథా చిత్రాలే ఎక్కువగా ఉండేవి. 1966 తరువాత కథ సినిమా అంత హీరో చుట్టూ తిరిగేది. బాపు రమణలు తమా సినిమాలకి కొత్త ఒరవడి సృష్టించారు. కథకి కధా కథన శిల్పానికి ప్రాధాన్యం ఇచ్చారు. హాస్యం కూడా జీవితంలో నుండి కథ లోకి, ప్రతి పాత్ర లోకి ప్రవేశించింది. ఇది అత్యంత విలక్షణమైన బాపు రమణల శైలి. దీనినే ఆ తరువాత జంధ్యాల స్వీకరించారు.

1971లో ‘ముత్యాల ముగ్గు’ తీసారు బాపు రమణలు. అప్పటి వరకు రావు గోపాల రావు గారు జగత్ జెట్టీలు, జగత్ కంత్రీలు వంటి సినిమాల్లో కల్తీ లేని విలన్‌గా క్రూర పాత్రలు వేస్తుండేవారు. ‘ముత్యాల ముగ్గు’లో కంట్రాక్టర్ పాత్ర క్రొత్త హస్యసృష్టి క్రొత్త ఒరవడిని సృష్టించింది. అది దశాబ్దాలు నిలబడింది. ఆ పాత్ర డైలాగులు రికార్డ్స్‌గా కూడా వచ్చాయి. బాపు రమణల హాస్యం రాజబాబు (అందాల రాముడు), నాగభూషణం అల్లు రామలింగయ్య (బుద్ధి మంతుడు), రావు గోపాల రావు అల్లు రామలింగయ్య( మంత్రి గారి వియ్యంకుడు, హీరో చిరంజీవి) జతగా ఎన్నో సినిమాల్లోను ప్రతి పాత్రలోనూ ప్రత్యేకంగా కనిపించింది.

బాపు ముళ్ళపూడి తీర్చిదిద్దిన నాయికని బాపు బొమ్మ అనడానికి కల ప్రత్యేక కారణం ఉన్నది. బాపు సినిమాల్లో నాయికకి ఒక ప్రత్యేక స్థితిలో కలిగే అలుక, కన్నీరు, వలపు, బెట్టు మొదలైనవి దేహంగా కనిపిస్తుంది. ఆ నాయికకి రాగం రసం గుణం స్వభావం ఆత్మ. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే తిక్కన గుణ కవిత్వం కోవ లోకి వస్తుంది. నాయిక పాత్రలో సౌందర్యం అంతా, ఆ నాయిక స్వభావంలో, ఒక స్థితి లోని ఆవేశంలో, గుణ స్వరూపంలో, వ్యక్తిత్వంలో, ఆ ఆమ్మాయి జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బల్లో, ఆ అమ్మాయి ప్రతి కదలికలో కనిపిస్తుంది.

ప్రధానంగా సౌందర్యం అన్నది మనిషి గుణంలోనే కదా కనిపిస్తుంది. శ్రీ రాముడిని ‘సకల గుణాభిరాముడు’ అంటారు. బాపు గారికి, ఆయనకి ఆయన ఆత్మప్రతి రూపం ముళ్ళపూడి వెంకట రమణ గారికి అంతా ‘రామ మయం’.

బాపు దర్శకత్వం విశేషమైన రీతిలో ఒక ప్రత్యేకమైన ముద్రలో కనిపిస్తుంది. రమణ గారు అందించిన స్క్రీన్ ప్లే, కథ, మాటలని బాపు గారు తనదైన శైలిలో ఒక దృశ్య కావ్యంగా మలచుకుంటారు. బాపు ప్రత్యేకత ఆయన కథన శిల్పంలో రమణీయంగా కనిపిస్తుంది. ఇతివృత్తాన్ని కథని బాపు అనేక కోణాల్లో చూపిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here