Site icon Sanchika

రమణీయాలు రసభావ చిత్రాలు

[dropcap]గొ[/dropcap]ప్ప సాహిత్య విమర్శకుడు, అధ్యాపకుడు, కవి, తత్వవేత్త అయిన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారి కలం చిత్రించినవి ఈ రసభావ చిత్రాలు. ఈ చిత్రాలు రసభరితాలు, భావబంధురాలు, సహజత్వానికి దర్పణాలు, కవి లోకపరిశీలనకు ఆనవాళ్ళు. తాత్విక చింతనకు తార్కాణాలు. వీరి రచనలు షష్టిపూర్తిని జరుపుకుని సంవత్సరమయింది (సంఖ్యాపరంగా). ఈ రసభావ చిత్రాలు ఆంగ్లంలోకి అనూదితాలు. పాఠకులు శ్రమ పడకుండా సరళమైన ఈ అనువాదం కూడా పుస్తకంలోనే మూలంతోపాటు ముద్రితమైంది (కవితతోపాటే). శ్రీమతి భోగవల్లి గాయత్రి గారు ఈ రసభావ చిత్రాలను ఆంగ్లంలోకి అనువదించారు. ఆచార్య వీరభద్రయ్య గారు ఈ పుస్తకాన్ని తన మనసుకు నచ్చిన మిత్రులు, సాహిత్యకళా విమర్శకులు, కాశీ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న శ్రీ బూదాటి వెంకటేశ్వర్లు గారికి అంకితమిచ్చారు. కృతి స్వీకర్త ఈ రసభావ చిత్రాలకు చందనచర్చ పేరుతో చక్కని పీఠికను కూడా వ్రాసారు. విద్వద్వరేణ్యులు, విక్రమసింహపురి విశ్వవిద్యాలయ పూర్వ కులపతులు అయిన ఆచార్య విశ్వేశ్వరరావు గారు ఆంగ్లంలో వ్రాసిన పీఠికలో వీరభద్రయ్య గారి సాహిత్యకృషిని గురించి విపులంగా తెలియజేసారు. ఆ చిత్రాలను, వాటిలో పొంగే రసభావాలను మనమూ అనుభవిద్దాం. వాటిలో కొన్నిటిని మాత్రం ఉదాహరించి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. తేటతెల్లంగా ఉన్న ఈ చిత్రాలకు వ్యాఖ్యానం అవసరం లేదు. ఇది కేవలం పుస్తక పరిచయం మాత్రమే.

ఒకరి మనసులోని భావాన్ని మరొకరికి తెలియజేయటానికి ఉపయోగించే సాధనమే భాష; మాట. ఆ మాట ఎంత స్పష్టంగా ఉంటే ఎదుటివారికి అంత చక్కగా అర్థమవుతుంది. ఎంత క్లుప్తంగా ఉంటే ఆ మాటకు అంత విలువ ఉంటుంది. తగినంత వివరణ ఉంటే మరింత సులువుగా అర్థమవుతుంది. ఈ మాటల్ని సాదాసీదాగా కాకుండా అందంగా, ధ్వనిపూర్వకంగా, వర్ణనాత్మకంగా, కొన్నిసార్లు ప్రతీకాత్మకంగా చెప్పటం కవిత్వం. కవిత్వకళామర్మం తెలిసిన కవి తన మాటలతో, కవిత్వంతో పాఠకుల హృదయాలను గెలుచుకుంటాడు. కవిత్వంలో ఏది ప్రధానం అనేదాని మీద ఎన్నో చర్చలు జరిగాయి. అలంకారికులలో కొందరు వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు.

కావ్యాన్ని నిర్వచించారు. ఒకరు రమణీయార్థ ప్రతిపాదకం అంటే మరొకరు రసానికి, వేరొకరు ఔచిత్యానికి, ఇంకొకరు వక్రోక్తికి పెద్దపీట వేసారు. ఒకే దిశలో ప్రవహించే ఏరు అందంగానే ఉంటుంది. వంపులు తిరుగుతూ ప్రవహించే వాగు మరింత అందంగా ఉంటుంది. కవిత్వంలో దానినే వక్రోక్తి అనవచ్చునేమో! అందువల్లనే వీరభద్రయ్య గారు తన మాటలు వక్రోక్తిమయంగా ఉండాలని, అవి ఆయన తుండంలా అందంగా ఉండాలని గజముఖుని ప్రార్థించారు. కర్ణునికి కవచకుండలాలు పుట్టుకతోనే వచ్చాయి. తన మాటలు కూడా అలా సహజసుందరంగా, ఏ మెరుగులూ దిద్దవలసిన అవసరం లేకుండా పుట్టుకతోనే అలంకారాలతో ఉండాలని కోరుకున్నారు. అలా ఉండేలా చేయమని, అప్పుడే అవి గాయత్రీ మంత్రాలై పఠితలను రక్షిస్తాయని విశ్వసించారు. అందుకోసమే ఆదిత్యుని ప్రార్థించారు. కావ్యానికి పరమ ప్రయోజనం విశ్వ శ్రేయస్సే కదా!

“పొడి మాటల్లో కవిత్వం మొలవదు

అనుభూతి జల సేచనం చెయ్యి

మొలవడమే కాదు

పూలూ పళ్ళూ కాసి

అందరికీ ఉపయోగపడుతుంది!”

అంటూ అనుభూతికి ప్రాధాన్యమిచ్చారు. మాటకు మల్లెల సుగంధం, చందనపు చల్లదనం, మామిడి పండు రుచి ఉండాలన్నారు. ఒక విధంగా ఇది కవిత్వ లక్షణ నిర్దేశమే. ఇప్పుడు అసలు కావ్యం మొదలవుతుంది.

సగటు వ్యక్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తనకు తోచిన దక్షిణ హారతి పళ్ళెంలో వేస్తాడు. దైవమూర్తి నుండి బయలుదేరిన పళ్ళెం మళ్ళీ అక్కడికి చేరేసరికి హారతి ఆరిపోతుంది, నల్లబడిపోతుంది.కానీ కవికి అది సహజంగా తోచలేదు.

“నాణేల బరువూ మోతలతో

పుట్టెడు దుఃఖంతో,సిగ్గుతో

నల్లబడి ఆరిపోయింది”ట.

“భిక్షమా? ఎవరికి?”అని సూటిగా ప్రశ్నిస్తారు కవి.

సకల చరాచర సృష్టిని రక్షించేది పరమేశ్వరుడే. ఏ ప్రాణికి ఏది విహితమో ఆ ఆహారాన్ని ఆయనే అందిస్తాడు.

“జీవకోట్లను పోషింప నీవె కాని….” నరసింహ శతకం లోని ఈ పద్య పాదాన్ని గుర్తుకు తెచ్చే క్రింది మాటలు చూడండి.

“కదలలేని చెట్టుకి

కరుణతో సూర్య భగవానుడు

తన కిరణాలతోనే తిండి పెడుతున్నాడు”

కవికి ఈ నేలపైన, దీనిలో విలసిల్లిన మహోన్నతమైన సంస్కృతిపైన ఎనలేని గౌరవం. అందుకే

“భాగీరధి పారుతూనే ఉంటుంది

భరతభూమి ఆర్ద్రంగానే ఉంటుంది

శివ జటాజూటం ఎండిపోదు

ఈనేల సంస్కృతీవనం

ఏనాడూ ఎండిపోదు

ఎటొచ్చీ కలుపు మొక్కలను

ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉండాలి”

ఎంత గొప్ప వనమైనా కలుపు మొక్కలుంటే ఏపుగా ఎదగదు. ఎప్పటికప్పుడు వాటిని పీకి పారవేస్తూ ఉండాలి. సంస్కృతీవనమూ అంతే మరి. కలుపు మొక్కలను గుర్తించి ఏరివేయటం మన బాధ్యత.

“Face is the index of mind” అంటారు. చాలాసార్లు మనోభావాలను ఎంత దాచుకుందామన్నా దాగకుండా వ్యక్తమవుతూనే ఉంటాయి. కళ్ళు మరీనూ. మన మనోభావాలకు నిజంగా అవి ద్వారాలే. మనసు ఆ ద్వారాలలోంచే తొంగిచూస్తుంది కదూ! ఈ విషయాన్ని ముచ్చటగా మూడే మూడు మాటల్లో చెప్పారు చూడండి.

“కన్నుల ద్వారాలలోంచి మనస్సు

తొంగి తొంగి చూస్తుంటుంది

అందుకని దాన్ని నిర్మలంగా ఉంచాలి”

ధ్యానం చేస్తున్నా ఎన్నోసార్లు మనసు దానిపైన నిలువకుండా ముల్లోకాలను చుట్టివస్తుంది. నిశ్చలంగా ధ్యానం చేస్తే ఇక ఏమీ కనుపించదు,వినిపించదు-మనసుకి కూడా. ఈ కవిత చూడండి

“మనసును విసిరి

పారేయగలిగిన

దక్షుడు తప్ప

కనులు మూసికొన్నంత మాత్రంలో

ఎవరూ యోగివర్యుడు కాడు.”

అప్పుడప్పుడూ కవి మెత్తని చురకలు వేస్తుంటారు. బిరుదులు, పదవులు, సన్మానాలు- వీటి పైన మోజు, తాము రాసినదంతా కవిత్వమేననే భ్రమ కుకవులను పట్టి పీడిస్తుంటాయి. వారు ఎంత భ్రమలో ఉంటారంటే పేరు ప్రఖ్యాతులతో తాము నిజంగానే వెలిగి పోతున్నామనుకుంటారు. శరీరానికున్న శుభ్ర వస్త్రాలను కాక అకవిత్వానికున్న మలిన వస్త్రాలను చూస్తే గాడిదకు నవ్వు రాదూ మరి! చూడండి కవి ఏమంటారో-

“అకవిత్వ మలిన వస్త్రాలను

మోస్తున్న అరసికులను చూసి

మాసిన బట్టలు మోస్తున్న

గార్ధభరాజం ఫక్కున నవ్వింది

వారి కన్నా తానే నయమని!!”

మానవుని దృష్టి సంకుచితత్వపు పరిధులను దాటి క్రమంగా విశ్వైక దృష్టిని అలవర్చుకోవాలని బోధించే ఈ చిన్ని కవితను చూడండి.

“జాతి మాత గర్భం నుంచి

అంతర్జాతీయతా శిశువు

రాబోతోంది

కనబోయే తల్లికి

పౌష్టికాహారం ఈయాలి

శిశువు బలంగా ఉండాలి కదా

శిశు మరణాలు నివారిద్దాం.”

చురకలే కాదు- అప్పుడప్పుడు నవ్వులనూ చిత్రిస్తాయీ భావ చిత్రాలు. మనిషి పక్షుల్ని. మిడతల్ని, చేపల్ని, నీటి ఆవిరిని కాపీ కొట్టి విమానాలు, నౌకలు,రైళ్లు మొదలైన వాటన్నిటిని నిర్మించుకున్నాడు. కానీ కాపీ అన్న మాట చెరిపేసి ‘మాస్టర్ ‘ని మాత్రం మిగుల్చుకున్న తెలివైనవాడు అంటారు కవిగారు.

శివజటాజూటానికీ, ఆకాశ కన్యకూ సహజా లంకారమైన చంద్రవంకకు వంకలు పెట్టవద్దు అంటారు. ఎందుకంటే మంచి కవితకు వక్రోక్తి అలంకారం కాబట్టి. తన కవితలు ఆయన తుండంలా వక్రోక్తి మయాలుగా ఉండాలని గజముఖుని ముందే ప్రార్థించారు కదూ!? వేదికపైనున్న వారి మెడలోని గులాబీ గజమాలలోని పూరెక్కలపైనున్న నీటి బిందువులు వాటి కన్నీటి బిందువులలా కనుపించాయి కవికి.అయోగ్యుల చేతిలో పడిన ఏవస్తువుకైనా ఆ వ్యథ తప్పదు మరి.

తెగిన గాలి పటానికి దారీ తెన్నూ ఉండదు. అడ్డదిడ్డంగా ఎగిరి చివరకు నేలపై పడుతుంది. నీతి అనే సూత్రం లేని బ్రతుకులూ అంతే. అందుకే నీతి సూత్రాన్ని గట్టిగా పట్టుకోమని హెచ్చరిస్తున్నారు కవిగారు. మనిషి మనసుకు విలువ ఇవ్వాలి కానీ అతని సంపదను బట్టి కాదని హితవు చెపుతున్నారు.

“తాటాకుల సౌధం

ఏడంతస్తుల

పాలరాతి కొంప

లోన ఉన్న వారి

హృదయాలను బట్టే విలువ!”

ఇక్కడ తాటాకుల ఇంటిని సౌధమని, పాలరాతి భవనాన్ని కొంప అని అనటం గమనించదగినది. మనిషి విలువ వాటిని బట్టి ఉండదని చెప్పటానికే ఈ పదాలను ఉపయోగించారు. సుందరమైనదైనా నిరుపయోగంగా మిగిలిపోతే ‘అడవి గాచిన వెన్నెల’ అనటం కవిసమయం; లోక సహజం. కానీ కవి ఏమంటున్నారో చూడండి.

“అడవిగాచిన వెన్నెలని

తక్కువ చేయకు

చెట్లన్నీ అందులోనే జలకాలాడుతున్నాయి

జనావాసాలలోనేమో రాత్రుళ్లు

దుప్పట్లు కప్పుకొని నిద్రపోతున్నారు!”

ఎంత గొప్ప వస్తువైనా అందనంతకాలం అది అందించే ఆనందం సొంతమైతే ఉండదు. పైగా ఆ వస్తువు నిరాదరణకు గురవుతుంది. అందుకే సౌందర్యాన్ని సొంతం చేసుకుంటే సమాధి అయిపోతుందని,దూరంగా ఉంటేనే అది హృత్పంజరంలో చిలుక అయి బ్రహ్మానందంలో ముంచుతుందనీ బోధిస్తారు వీరభద్రయ్య గారు.

హింసాత్మక ప్రవృత్తిని మానుమని చెప్పే ఈ కవితను చూడండి.

“కత్తీ కరవాలం ఖడ్గం

తుపాకీ ఫిరంగీ బుల్లెట్టూ

తీసెయ్యి నిఘంటువుల నుంచి

లేకపోతే

రక్తమోడుతాయి పేజీలు

హాసం దరహాసం మందహాసం

నవ్వూ చిరునవ్వులకు

చిదానందానికి పర్యాయాలని లిఖించు.”

కొన్ని గాఢమైన అనుభవాలను తర్కంతో వ్యాఖ్యానించకూడదు. లౌకిక విషయాల్లోనే కాదు భగవంతుని పైనున్న నమ్మకం, భక్తి- వీటిలోకూడా. అసలు తర్కానికి చోటివ్వకూడని విషయం ఇదే. భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు ఆయా వ్యక్తుల మానసిక స్థాయిని బట్టి, చిత్తసంస్కారాన్ని బట్టి ఉంటాయి. ఎక్కడైనా బుద్ధి ఎక్కువగా పని చేస్తే మనసు మొద్దుబారిపోవడం ఖాయం. దివ్యమైన అనుభూతిలో తర్కానికి తావుండకూడదు. ఈ విషయాన్నే కవి ఇలా చెపుతున్నారు.

“భగవంతునిపై నా నమ్మకాన్ని

తర్క వితర్కాల ముళ్ళకంచెలో

ఇరికించను

బుద్ధికి పదును ఎక్కువైతే

హృదయం మొద్దు బారుతుంది!!”

నేలలో చెమ్మ ఉంటేనే, క్షేత్రంలో సారముంటేనే మొక్కలు చక్కగా పెరుగుతాయి. పరిమళాలను వెదజల్లే అందమైన పూలనిస్తాయి. అలాగే హృదయంలో ఆర్ద్రత ఉంటేనే అనుభూతులనేవి ఉంటాయి. అనుభూతి లేని హృదయం కవనకుసుమాలను పూయించలేదు. ఈ విషయానికి కవితా రూపమే దిగువ పంక్తులు.

“వానకు తడిసి పోయిన నేలలో

దాని సారపు చెలిమి బలంతో

పైకి చిమ్ముకొని వచ్చిన మొలకే అనుభూతి

దానికి పూసిన పూవే కవిత్వం.”

ఇన్ని చిత్రాలు చూసిన తర్వాత భావచిత్రాలు అంటే ఏమిటో పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది. మినీకవితలలా కనుపించే భావచిత్రాలలో అలంకారం అవివక్షితంగా ఉంటుంది. ఆచార్య వీరభద్రయ్యగారు వీటి గురించి ప్రత్యేకమైన రచనలు చేసారు. భావచిత్ర విమర్శ, భావ చిత్రం- భేదాలు,భావ చిత్రం-అభివ్యక్తి, రూపక పరిణామమే భావచిత్రం మొదలైనవి వాటిలో కొన్ని.

ఈ కవితలో రసభావ చిత్రాలకు నిర్వచనం ఇచ్చారు చూడండి.

“స్వభావోక్తులుండవు కవికి

వస్తువు కవికి స్వభావాన్ని

తెలుపుకొంటుంటే

తన భావ మధుభాండంలో దాన్నిముంచి

రసభావంగా,అక్షర చిత్రంగా

చిత్రీకరిస్తాడు కవి

అందుకే అవి రస భావ చిత్రాలు!!”

అవును. సహజసిద్ధమైన వస్తువును కవి తన భావనా బలంతో రసభరితంగా చిత్రించినవే రమణీయమైన ఈ రసభావ చిత్రాలు. వస్తువును తన భావ మధుభాండంలో ముంచి రసరమ్యంగా చిత్రించిన చిత్రాలివి. కవి కోరుకున్నట్లే వక్రోక్తిమయాలైన, సహజ సుందరా లంకార శోభితాలైన ఈ చిత్రాలు కర్మసాక్షి సాక్షిగా గాయత్రీ మంత్రాలయి పాఠకులను రక్షిస్తాయి. ఆచార్య వీరభద్రయ్యగారి గ్రంధ మణిహారంలో చేరిన మరొక అనర్ఘరత్నం, భారతీదేవి గళసీమను అలంకరించిన పచ్చలపతకం ఈ రసభావ చిత్రాలు.

***

రసభావ చిత్రాలు (కవితా సంపుటి)

రచన: ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య

ప్రచురణ: ఎస్. ఆర్. పబ్లికేషన్స్, విజయవాడ. ఫోన్: 0866-2421052

వెల: ₹ 150/-

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

Exit mobile version