Site icon Sanchika

రాసమూర్తి సుద్దులు…చూడటానికి కూనలు-తరచి చూస్తే తాత్విక సంపన్నతలు

[box type=’note’ fontsize=’16’] రూమర్లు, ఉబుసుపోని కబుర్లు, టిక్ టాక్ వీడియోలు షేర్ చేసేందుకు పనికివచ్చే వాట్స్‌ఆప్‌కు, కార్యశూరులు చీకటిని తిట్టుకుంటూ కూచోరు, దీపం వెలిగిస్తారు. పదిమందికి వెలుగునిస్తారు అన్నట్టు  వాక్స్థలి అని నామకరణం చేసి, సిరికోన అన్న సాహితీ స్థలిగా మార్చి, అలనాటి భారతి పత్రికకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు సాహితీ పిపాసులు. సిరికోనలో ఆచార్య రాణి సదాశివమూర్తిగారు రచించిన రాసమూర్తి సుద్దులు  పుస్తకంపై విశ్వర్షి వాసిలి సమీక్ష. [/box]

[dropcap]”రా[/dropcap]సమూర్తి సుద్దులు” అంటూ ఆచార్య రాణి సదాశివమూర్తిగారు ‘సిరికోన’ వాక్స్థలీ సాహితీ సంచికలో శ్రీకారం చుట్టిననాడు అనుకున్నా రాణివారివి తాత్త్విక సుద్దులుగా పరీమళిస్తాయని. క్రమేపీ అవి వారి అక్షరోద్యానవనంలో విహరింపచేసాయి. స్వయంగా ఆచార్యులవారే ఒక్కొక్కమొక్కను పరిచయం చేస్తూ వచ్చారు. వారు ముందుకు కదులుతూ మొక్క దగ్గిరే కళ్ళప్పగించిన మాబోంట్లను చూసి మా మనసులలో మెదలుతున్న భావలయను అర్థం చేసుకున్న ఆచార్యుడిలా ముందుకు కదలుతుండేవారు. అలా మొగ్గల సమీప భవితవ్యాన్ని, పుష్పాల వర్ణసమీకరణాన్ని, పరీమళాల పరిణామాన్ని, ప్రకృతిలో వొదిగిన ప్రవృత్తిని చూపిన రసమూర్తి ఈ రాణివాస తోటమాలి. అందుకే ఈ తోటమాలి సుద్దులకు శుద్ధత్వం అబ్బింది. ఆ అక్షరాలకు సిద్ధత్వం చేకూరింది.

బ్రహ్మంగారి తత్త్వాలు మనకు చిరపరిచితాలు. గొల్ల సుద్దులు మనకు తెలుసు. కూన పదాలు కొంతమటుకు ఎరుకే. వీటికంటే భిన్నమైనవి రాసమూర్తి సుద్దులు. మొత్తానికి తత్త్వాలైనా, పదాలైనా, సుద్దులైనా ప్రయోజనాన్ని ఆశించి చేసిన రచనలే.

రాసమూర్తి సుద్దులు చూడటానికి కూనలు. కానీ తరచి చూస్తే తాత్విక సంపన్నతలు.

ఇది వంద సుద్దుల నవ శతకం. ఒక నవశకానికి వలసిన బౌద్ధికవాక్య విన్యాస రససిద్ధుల అక్షరవాహిని ఇది. చూడటానికి ముచ్చటగా ఉంటుంది. పుటలవెంట చూపుల్ని పరిగెత్తించే ఆకర్షణ ఈ చిరుపొత్తం ప్రత్యేకత. ప్రతి పుటలోని చిత్రం చిత్రంగా ఆశ్చర్యపరుస్తుంది … కొన్ని కిసుక్కున నవ్వుకునేలా చేస్తాయి … కొన్ని భృకుటి ముడిపడేలా చేస్తాయి. దాదాపుగా అన్ని చిత్రాలు అంతర్జాలం నుండి సుద్దుల చెంతకు చేరి సిద్ధిపొందినవే.

ప్రకృతినే అద్దం చేసి ఆ అద్దంలో నిన్నూ నన్నూ చూపుతూ ఆ కనిపించే రూపంలో భగవత్సౌందర్యాన్ని దర్శింపచేసి ఆత్మబోధ చేస్తారు తొలి సుద్దులో. అద్దంలా ఈ కవి పారదర్శకంగాను, శుద్ధంగాను మనిషిని ప్రతిబింబింపచేస్తారు ప్రతి సుద్దులోని గుప్పెడు అక్షరాలలో. ఎంతైనా కవిత్వాన్ని సేద్యం చేసే ఈ బహుభాషా కోవిదుడు కవితత్త్వాన్నే మలిసుద్దులో పలికిస్తూ ఆ తత్త్వాన్ని మనందరికీ ఆపాదింపచేస్తాడు.

మహాకవివి కావాలంటే / నీ తోటి కవులతో పోటీ పడకు
వ్రాయాల్సిన కావ్యతత్త్వమెరిగి / నీతోనువ్వు పోటీ పడు”

ఇది కేవలం కవులకు మాత్రమే వర్తించే సుద్దు కాదు… ఏ రంగంలోనైనా సరే పోటీపడాలనుకునే ప్రతిఒక్కరు తుదిశ్వాస వరకు మరవకూడని జీవనతత్త్వం.

ఇక శరీరతత్త్వాన్ని గురించి షడ్రసోపేత ఆహారాన్ని ఆశించేవారికి రాణివారి ఈ ఆరోసుద్దు ఒక చురక వంటిది –

అతిగా మధురాలను ఆశించిన కిడ్నీలు
దుర్బలమైన ఆహారం తీసుకున్న ఉదరం
ఎక్కువకాలం మనినట్లు చరిత్రలో లేదు”

ఏదో చలనచిత్ర సంభాషణకు అనుకరణలా అనిపించినా ఎంతో శాస్త్రీయ అవగాహన దాగున్నసుద్దు ఇది.

తల్లీ పిల్లల అనుబంధ తత్వాన్ని కిశోర న్యాయాలుగా –

బిడ్డను బట్టి తల్లి – మర్కట కిశోర న్యాయం
తల్లిని బట్టి బిడ్డ – మార్జాల కిశోర న్యాయం”

ఉదరాన్ని వదలని బిడ్డతో తల్లి, బిడ్డని నోట కరుచుకుని తల్లి – రెండు సామ్యాలు అమ్మతనానికి రెండు అసమాన చూపులు.

వాస్తవాన్ని, వ్యంగ్యాన్ని రంగరించిన ఈ సుద్దు చూడండి –

శ్వాసించడానికి దిక్కు లేదు
శాసనాలకు తక్కువ లేదు

గట్టిగా ఆరు పదాలు లేని ఈ సుద్దులో సత్యదూరం కానిదంటూ ఉందా?!

పొగడ్త ఒక అగడ్త అంటున్న రాణివారి ఈ సుద్దు సున్నితం అనిపిస్తూనే చురుక్కు మనిపించటం తధ్యం –

మనిషి ఈ ఒడ్డున
ఆనందం ఆవలి ఒడ్డున
మధ్యలో
పొగడ్త ఒక అగడ్త”

ఆచార్యులవారి ఈ సుద్దును పొగడాలంటే ఆలోచించాల్సిందే. అయినా నాది సమీక్ష కాబట్టి పొగడ్త ఎలా అవుతుంది. ఈ సుద్దును మనసు కెక్కించుకుని ఏదో ఒక ఒడ్డుకే తెడ్డు వెయ్యండి. లేదంటే అదేదో సామెతకు నిలువెత్తు సాక్ష్యం అయిపోతారు. తస్మాత్ జాగ్రత్త!

ఆడవారిముందు ఆటాడువారము, తారాడువారము, పోట్లాడువారము, చెప్పినట్లాడువారము అంటూ శైశవ, యౌవన, దాపంత్య, వృద్ధాప్య దశలలో పురుష ప్రవృత్తిని అక్షరీకరిస్తారు. తేజరిల్లే జ్ఞానప్రసూనాన్ని సత్యభామగాను, అసత్యపు చీకటికొదమను నరకుడుగాను ‘దీపావళి’ అన్న సుద్దులో పేర్కొంటారు. “అడగనిది బిడ్డా కాదు / పెట్టనిది అమ్మా కాదు” ఒక సుద్దులో అంటే మరొక సుద్దులో “బిడ్డది అడగలేని నిస్త్రాణం / అమ్మది తపించి విలపించే ప్రాణం” అని తల్లీ బిడ్డల తత్వాన్ని విశదీకరిస్తారు. “ప్రకృతి గెలిచిన బంగారు పతకం నెలరాజు / పందానికి కాలుదువ్వి కవ్వించేది కాలం” అని మరొక సుద్దులో ప్రకృతి కాలాల తాత్వికతను నిర్వచిస్తారు.

“అమ్మ కడుపులోంచి ఊడిపడ్డ” మనిషి “నిజం తెలుసుకునే లోపు కాలం జీర్ణకోశంలో పడ్డాడు” అంటారు మనిషి జీవన జీర్ణావస్థను ఎరిగిన ఈ సదాశివులవారు. “ముందుచూపు లేనివాడు తన గతాన్ని పొగుడుకుంటాడు” అని మనిషి తత్త్వంపై ఒక కొరడా ఝుళిపిస్తారు. పనిలో పనిగా మరో సుద్దులో “రెండవసారి పొగిడించుకోవాలనుకునేవాడు / తనకు వచ్చిన తొలి పొగడ్తలకు తాను తగనంటాడు” ఎంత తియ్యని చురక ఈ సుద్దు. అలాగే “పరనింద ఆత్మన్యూనతాభావాల గుట్ట” అంటూ నిందాస్తుతి గుట్టు విప్పుతారు.

ఈ సందర్భంలో రాణివారి మరొక సుద్దును చెప్పుకునే తీరాలి –

ఇతరుల గుణ ప్రశంస చేయకపోవడం అనారోగ్యం
ఉత్తుత్తి పొగడ్తలు చేయకపోవడం ఆరోగ్యం”

ఈ సుద్దు చదివినతర్వాత ఆరోగ్యంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా అన్న ప్రశ్నకు మనకు మనమే కొలమానం. ఈ పంక్తినే మరొక సుద్దులో “తనను తాను పొగడుకోవడం ఆత్మహననం / పొగడ్తలకు అతిగా పొంగకపోవడం సంయమనం” అంటారు. మరొక సుద్దులో “ఆవేశం – అది అవసరం / ఆక్రోశం – అది సలపరం” అని అర్థవంత నిర్వచనాన్నందిస్తారు.

ఆచార్య రాణి సదాశివమూర్తి గారి తాత్వికత చాలా గాఢమైంది. చిరు పదాలలో పరచుకున్నప్పటికీ పెను రహస్యాలను విప్పుతుంటాయి. చూడండి –

ఈ భ్రాంతిమయ జగత్తులో
అజ్ఞానం నిత్యసత్యం
నేను అసత్యం
నాది ‘అ’నాది”

కర్మను వీరు నిర్వచిస్తున్న తీరు చూడండి –

పులిలా తరుముతూ
మనిషిని పరిగెత్తించేదే కర్మ”

పులి తరిమితే మన పరుగు ఎంత వేగవంతమో కర్మ వెంటపడ్డా మనం పరుగులో ప్రథములమే.

రాణివారి చెంపదెబ్బలు భలే పసందుగా ఉంటాయి. మచ్చుకు ఒకటి –

ప్రపంచంలో అవకాశం రానివాడు
మాత్రమే
తప్పు చేయనివాడు”

అంటే, ప్రతిఒక్కరమూ తప్పు చేస్తున్నవారమనే కదా.

ఈ ఆచార్యుల వారు సుద్దు చెప్పని విషయం ఉందా అనిపిస్తుంది ఈ “రాసమూర్తి సుద్దులు” చదువుతుంటే. “వాదబలం లేనివాడు వాదిబలం చూపుతాడు / మాట నెగ్గలేనివాడు తన మాటే బాటంటాడు” అని ఒక సుద్దులో ఇహవాస్తవాన్ని గురించి చెబుతూ మరొక సుద్దులో “పదేపదే చెబుతుంటే పరమార్థం అయిపోతుందా? / కాదని పదిమార్లంటే పరమార్థం మారిపోతుందా?” అని పరవాస్తవాన్ని గురించి అతి సరళంగా సత్యపథం పట్టిస్తారు. అలాగే “నువ్వు చెప్పుకోవాల్సింది నీ గతం కాదు / నువ్వు మర్చిపోవాల్సింది నీ పూర్వీకులను కాదు”. ఈ కవికి గతంపై బ్రతకటం ఇష్టం ఉండదు. అలాగని సంస్కృతీపర, సంసారపర పూర్వాన్ని అందలమెక్కించకా మానరు. అది రాణివారి సంస్కారం. ఇలా మన పూర్వీకులను, సంప్రదాయాలను కాదనుకోని ఆచార్య సదాశివమూర్తి గారు “నీ ఇంటికి రాళ్లెత్తినవారూ దోపిడీకి గురైనవారే కదా నేస్తం” అంటారు. ఇంతటి సమకాలీన దృక్పథం, సహృదయత ఈ వంద సుద్దుల నిండా పరచుకుని ఉంటాయి. అందుకే కాబోలు “కాలమే ఒక మహానుభూతి కావాలి” అంటారు మరొక సుద్దులో.

ఇక మనిషి కీర్తి కండూతి గురించి “పది పదుల వత్సరాలుండాల్సిన ఈ శరీరాన్ని / ఆరేడు పదులకే పైకి పంపి సంపాదించుకున్న ఆయాసమే కీర్తి” అని అంటారు. అంటే కీర్తి కోసం మనం ఆయుష్షును ధారబోస్తున్నామని ఎంత చక్కగా, చురుక్కుమనిపించేలా చెప్పారో!

ఈ కవి తాత్విక సరళిని గాఢంగా పరిచయం చేసుకోవటానికి నాలుగయిదు సుద్దులను అనుశీలిద్దాం – “నాలుగు దిక్కులు, మూడు కాలాలు ఏర్పరచుకున్నది నువ్వే / విశ్వంలోకి వెడితే ఇవేమీ లేవు / ఈ లెక్కలు నీవే” అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పే ఈ కవి వ్యక్తిత్వాన్ని కేవలం ఆచార సంప్రదాయాల మధ్య కుదించటం మన సంకుచిత దృక్పథాన్ని బయటపెట్టుకోవటమే అవుతుంది. కల్పనతో బ్రహ్మ కావటం కాదు వాస్తవికతతో పరబ్రహ్మ కావటం మనిషి తత్వం కావాలంటూ –

నాలుగు దిక్కులు ఏర్పరచుకుని
నాలుగు ముఖాలను ధరించి
ఈ జగత్తు కల్పనకై బ్రహ్మవౌతావో
ఈ జగత్తు జంజాటం
వదిలించుకుని పరబ్రహ్మమౌతావో
నిర్ణయం నీదే”

అని అంటూ వాస్తవంలోకి దిగిరమ్మంటాడు. అంతేకాదు –

నాలుగు చేతులు పెంచుకుని
నీ జగత్తును కాపాడుకునే
విష్ణువు అవుతావో
నాలుగు చేతులా అందరికీ పంచేసి
నిర్వికారంగా పరమాత్మవౌతావో
నిర్ణయం నీదే.

మరొక సుద్దులో –

సంసారసాగర గరాన్ని
కంఠంలో దాచుకుని నీలకంఠుడివి అవుతావో
లయవిలయాతీతుడవై
పరమపురుషుడవౌతావో
నిర్ణయం నీదే”

అని మనిషికి పరమార్థాన్ని బోధించే దిశలో ఈ తాత్విక కవి కలంపట్టి జీవనతత్వాలను అక్షరీకరించిన ఈ వందసుద్దులు వందసిద్ధుల పెట్టు.

ఇప్పటివరకు నేను తడిమింది పదోవంతు పుస్తకాన్ని మాత్రమే. అదీ స్థాలీపులాక న్యాయంగా. రాణి సదాశివమూర్తిగారి సుద్దులను సంపూర్ణంగా ఆకళింపుచేసుకోవాలంటే మొదటి పుట నుండి చివరి పుట వరకు ఏ అక్షరాన్నీ వదలకుండా చదవాల్సిందే … అప్పుడుగానీ ఈ సుద్దుల సిద్ధత్వం అందిరాదు.

ఈ పుస్తకాన్ని రాణి సదాశివమూర్తి 74 వ స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అందించారు. రాణి సదాశివమూర్తి ఈ నూరు సుద్దులు అక్షరాకృతిగా మనముందుకు తెలుగులోగిళ్లలోకి రావటానికి ప్రేరకులైన సాహితీ సిరికోన సాహితీ సమూహ సంచాలకులు, రచనావని మార్గదర్శి, ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టిగారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేయటం రాణివారి సహృదయ స్నేహశీలతకు నిదర్శనం.

***

పుస్తకం : రాసమూర్తి సుద్దులు
రచయిత : ఆచార్య రాణి సదాశివమూర్తి
పుటలు : 113  ఈ-ప్రతి వెల : రూ 100/-
ప్రకాశకులు : శివతరుణీ పబ్లికేషన్స్
23-2-204, ప్లాట్ 17 టిటిడి ఫేజ్ II ప్లాట్స్,
యమ.ఆర్.పల్లి, తిరుపతి 517502
చరవాణి : 9440246354
Email : ranisadasivamurty@gmail.com

Exit mobile version