రాతి పూలు

1
2

[box type=’note’ fontsize=’16’] “మనుషులెందుకింత పిచ్చిగా వస్తువ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నారు? మంచితనంలోనో మానవత్వంలోనో పోటీ పడొచ్చుగా. సమాజానికి తమ వంతు సేవచేయడంలో పోటీ పడొచ్చుగా?” అని అడుగుతోంది సలీం రాసిన ‘రాతి పూలు’ కథ. [/box]

[dropcap]రా[/dropcap]త్రి తొమ్మిది కావస్తోంది. రవి ఇంకా రాలేదు. డైనింగ్ టేబుల్ మీద సర్దిపెట్టిన భోజనపదార్థాలు చల్లబడిపోతున్నాయి. నాకు ఆకలేస్తోంది. కానీ తినాలనిపించడం లేదు. ఒక్కదాన్నే కూచుని తినాలంటే ఉత్సాహమే రావడం లేదు. “నాకోసం ఎదురుచూడకు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే ఇంతే. నేనొచ్చేటప్పటికి రాత్రి ఎంతవుతుందో తెలియదు. నువ్వు తినేసి పడుకో” అని రవి ఎన్నిసార్లు హెచ్చరించాడో.

ఏం తోచడం లేదు. చిరాగ్గా కూడా ఉంది. హాలంతా ఓ సారి పరిశీలించి చూశాను. ఖరీదైన సోఫా సెట్, నలభై రెండు అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ, నాలుగు కుర్చీలున్న విలాసవంతమైన డైనింగ్ టేబుల్… నేనూ ఆ హాల్లో ఉంచబడిన అందమైన గాజుబొమ్మలా.. లేచి బాల్కనీలోకెళ్ళి నిలబడ్డాను. రోడ్డువైపుకి ఉన్న బాల్కనీ .. కొంతమంది స్కూటర్ల మీద వేగంగా దూసుకెళ్తున్నారు. త్వరగా ఇంటికి చేరుకోవాలన్న ఆరాటం వాళ్ళలో.. వాళ్ళకోసం ఇంటి దగ్గర ప్రేమించే మనుషులెవరో ఎదురుచూస్తూ ఉండిఉంటారు. ఓ జంట పెద్దగా నవ్వుకుంటూ నడిచిపోతున్నారు. వీధి లైటు వెల్తురులో ఆమె మొహం విద్యుల్లతలా వెలిగిపోతోంది. అతను ఆమె నడుంచుట్టూ చేతులు వేసి, వజ్రాలగనేదో తన బాహువుల్లో ఇమిడినట్టు సంబరపడిపోతున్నాడు.

నాలోపల మొలుస్తున్న ఒంటరి ఎడారులు… హృదయంలో కార్చిచ్చులా రగులుతున్న వేనవేల కణాల అడవులు… ఆకలి ఎప్పుడో చచ్చిపోయినట్టుంది. వంటగదిలోకి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి చల్లటి మంచినీళ్ళు గట గటా తాగాను. గుండె మంట నెగడులా మండుతూనే ఉంది. కడుపుమంట మాత్రం చల్లారింది.

“చూశావా ఈ ఫ్రిజ్ ఎంత పెద్దదో… లేటెస్ట్ మోడల్… 260 లీటర్ల డబుల్ డోర్ ఎల్‌జి రిఫ్రిజిరేటర్. నీకు సంతోషంగా ఉందా?” ఫ్రిజ్ ఇంటికి వచ్చిన రోజు రవి నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి.

“ఈ ఇంట్లో ఉండేది మనిద్దరమే కదా. మనకు ఇంత పెద్ద ఫ్రిజ్ అవసరమా?” అన్నాను.

“అవసరమున్నా లేకున్నా ఇలాంటివి కొనక తప్పదు సుశీ. స్టేటస్ సింబల్.. మా ఆఫీస్‌లో నా కొలీ గ్ శేఖర్ లేడూ, అతనింట్లో ఇలాంటి ఫ్రిజే చూశాను. శేఖర్ నాకంటే మూడేళ్ళు జూనియర్. నాకంటే జీతం తక్కువ. పోటీ సుశీ.. మనమెప్పుడూ ఈ పోటీలో ఓడిపోకూడదనే నా తాపత్రయం.”

‘పోటీ కోసమని అవసరం లేకున్నా ఆర్భాటాలకెళ్ళటంవల్ల నష్టపోయేది మనమే. ఎందుకు డబ్బులిలా తగలేస్తావు? మన దగ్గర లేకున్నా అప్పులు చేసి కొంటున్నావు. ఇలా చేస్తూపోతే జీవితాంతం అప్పులు తీర్చుకుంటూనే ఉండాలి రవీ.”

నా మాటలకు రవి పెద్దగా నవ్వాడు. “రాత్రనక పగలనక కష్టపడి పని చేస్తోంది ఇలా దర్జాగా బతకడానికేగా. నువ్వు సంతోషంగా ఉండటమే నాక్కావల్సింది. మన ఇంటిని ఖరీదైన గాడ్జెట్స్‌తో నింపేస్తా చూడు’ అన్నాడు.

సంతోషంగా ఉండాలట. దేన్ని చూసుకుని సంతోషంగా ఉండాలి? ఖరీదైన స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కారు, ఫర్నీచర్… ఇవి సంతోషాన్నిస్తాయా? నా ఉద్దేశంలో కనీసం అదనపు సుఖాన్ని కూడా ఇవ్వవు – ఇరవైఒక్క అంగుళాల టీవీ ఐనా అదే బొమ్మ… ఇప్పుడు మా యింట్లో ఉన్న నలభై రెండు అంగుళాల టీవీ ఐనా అదే బొమ్మ… ఐదు లక్షల కారైనా యాభై లక్షల కారైనా మనిషిని గమ్యం చేర్చడానికి పనికొచ్చే వాహనంగానే ఉపయోగపడ్తుంది.

పోటీ అట. ఎందులో పోటీ? ధనదర్పాలు చూపించుకోవడంలో పోటీనా? మనుషులెందుకింత పిచ్చిగా వస్తువ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నారు? మంచితనంలోనో మానవత్వంలోనో పోటీ పడొచ్చుగా. సమాజానికి తమ వంతు సేవచేయడంలో పోటీ పడొచ్చుగా. వుహు… ఎవర్ని చూసినా లక్షలకు లక్షలు సంపాయించాలన్న తాపత్రయం… ఆస్తులూ విలాసవంతమైన వస్తువులూ స్వంతం చేసుకోవాలన్న ఆరాటం..

నన్ను ప్రేమించడంలో పోటీ పడొచ్చుగా.. ప్రేమ! ఆ అద్భుతమైన పదంలోని మాధుర్యాన్ని గ్రోలి ఎన్ని రోజులైందో.. రవిని నేను ప్రేమించే రోజుల్లో దూదిపింజల్లాంటి మేఘాల తేరుమీద కూచుని వినీలాకాశంలో హాయిగా విహరిస్తున్నట్టుండేది.

రవి అనే పేరు తల్చుకోగానే గుండెల్లో వీణతంత్రుల్ని ఎవరో కమ్మగా మీటినట్టుండేది. రవి పూర్తి పేరు రవిశంకర్. పండిట్ రవిశంకర్‌లా గొప్ప సితార విద్వాంసుడు కాకున్నా బాగా పాడేవాడు. ఎక్కువగా పాత సినిమాల్లో ఘంటసాల గారు పాడిన పాటలు… ఎంత మధురమైన గాత్రమో.. సిటీకి దూరంగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళి, అక్కడి బండరాళ్ళ మీద కూచుని, రవి గొంతులోంచి జాలువారే పాటని వినడం నేనెప్పటికీ మర్చిపోలేని తీయటి అనుభూతి.. ఏవీ ఆ పాటలు… ఎక్కడికి పోయాయి ఆ లాంగ్ డ్రైవ్లు.. ఆత్మీయంగా హత్తుకోవడాలు.. పెదవుల్తో చేసిన మంతనాలు.. నోరు తెరిచి అడిగితే “సంపాదనకే సమయం చాలటం లేదని” కదా అన్నాడు. అతను డబ్బువెంట పరుగెత్తుతూ తన అందమైన పాటని ఎక్కడో పారేసుకున్నాడు.. పారేసుకుంది పాటనేనా? నన్నుకూడానేమో…

ప్రేమతో నన్ను కౌగిలించుకుని ఎన్నాళ్ళయిందో.. ఏ అర్ధరాత్రో అలసిపోయి ఇంటికొస్తాడు. నిద్రకు మొహం వాచినట్టు మంచంపై వాలిన పదిసెకన్లలోపే నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం లేచినప్పటినుంచి మళ్ళా ఆఫీస్ కెళ్ళాలన్న హడావిడి. శారీరిక సుఖం కోసం నేను వెంపర్లాడటం లేదు. నా పైన ప్రేమగా చేయి వేసి… నా కళ్ళల్లోకి చూస్తూ… నాలుగు తీయటి మాటలు మాట్లాడితే చాలు… ఓ చిన్న ఆత్మీయ స్పర్శ చాలు…

ఆలోచనల్లోనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు. గిన్నెల చప్పుడు విన్పిస్తే మెలకువొచ్చింది. రవి వచ్చినట్టున్నాడు. అతని దగ్గర ఓ తాళంచెవి ఉండటంవల్ల నన్ను లేపాల్సిన అవసరం లేకుండానే తలుపు తీసుకుని లోపలికి వచ్చేస్తాడు. డైనింగ్ టేబుల్ మీద కూచుని తింటున్న శబ్దం.. కళ్ళు బాగా తెరిచి గోడ గడియారం వైపు చూశాను. సమయం పన్నెండున్నర..

ఇద్దరం కలిసి డైనింగ్ టేబుల్ మీద కూచుని డిన్నర్ చేసి ఎన్నాళ్ళయిందో.. తినకున్నా కనీసం అతనికి కంపెనీ ఇవ్వాలనిపించి, లేచి హాల్లో కెళ్ళాను. వంకాయ కూర కలుపుకుని తింటున్నవాడు నా అడుగు ల చప్పుడుకి తలయెత్తి చూసి “నువ్వు తిన్నావా?” అని అడిగాడు. తిన్నానని అర్థం వచ్చేలా తల వూపి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూచున్నాను. అతను తలవొంచుకుని తినడంలో నిమగ్నమైపోయాడు. అతనికి వంకాయ కూర ఇష్టమని లేత వంకాయలు ఏరుకొచ్చి టమేటాలు వేసి ఎంత శ్రద్దగా చేశానో.. “కూర చాలా రుచిగా ఉంది సుశీ’ అంటాడన్న ఆశ.. రవి భోజనం కానిచ్చి ప్లేట్ తీసుకెళ్ళి సింక్‌లో పడేశాడు.

రాత్రి ఎనిమిది దాటి పన్చేసేవారికి వాళ్ళ కంపెనీలోనే డిన్నర్ ఏర్పాటు చేస్తారు. “నీకెందుకూ శ్రమ? నీకేం కావాలో వండుకుని తిని పడుకో. నేను ఆఫీస్ క్యాంటీన్లోనే తినేస్తాలే” అని చెప్పినపుడు నేను తీవ్రంగా అభ్యంతరం చెప్పాను. భర్త కోసం వంట చేయడాన్ని ఏ భార్య కూడా శ్రమ అనుకోదని చెప్పాను. ఆఫీస్ వాళ్ళు పెట్టే భోజనం తింటే ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముందని హెచ్చరించాను. ఎంత రాత్రయినా సరే ఇంటికొచ్చాకే డిన్నర్ చేయాలని రవిని బలవంతపెట్టడానికి మరో కారణం కూడా ఉంది. నా ఒక్కదాని కోసమే వండుకోవాలంటే ఎక్కడలేని నీరసం వచ్చేస్తుంది. రవి కోసం రకరకాల వంటలు రుచిగా వండి పెట్టాలనీ, వాటిని తృప్తిగా తింటూ “నీ చేతిలో అమృతం ఉంది సుశీ. ఎంత కమ్మగా వండుతావో’ అని పొగిడితే పొంగిపోవాలనీ ఆరాటం.. హడావిడిగా ఏదో నోట్లో వేసుకుని మింగడం తప్ప ప్రశాంతంగా భోజనంలో వడ్డించిన పదార్థాల రుచిని ఆస్వాదిస్తూ తింటేగా తెలిసేది… ఈ జన్మకా పొగడ్త లభించదన్న నిరాశ నాలో నిప్పుల నదిలా పొంగుతూ…

“ఇంకా అక్కడే కూచున్నావేం? లోపలికెళ్ళి పడుకుందాం పద” అనేసి నా కోసం ఎదురుచూడకుండా రవి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. నేను ఆలోచనల్లోంచి బైటపడి డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి, లైటర్పేసి, లోపలికెళ్ళి అతని పక్కన పడుకున్నాను.

“ఇలా నిద్రాహారాలు సరిగా లేకుండా శ్రమ పడితే నీ ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించావా?” అని అడిగాను.

“డబ్బులు సంపాయించాలంటే హింస పడక తప్పదు. తరుముకొచ్చే ఆర్థికావసరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎంత సంపాదించినా సరిపోనన్ని…”

“ఎందుకా పరుగు? మనకున్న దాంతో తృప్తిగా ఉండొచ్చుగా. ఎంత కృత్రిమమైన జీవితం గడుపుతున్నామో ఆలోచించావా?” అలా అన్నవెంటనే మా గుమ్మానికి డెకొరేషన్ కోసం అమర్చిన ప్లాస్టిక్ పూల దండ గుర్తొచ్చింది. దూరంనుంచి అచ్చం నిజమైన రంగు రంగుల పూలదండలానే కన్పిస్తుంది. తాకి చూస్తేనే పూలలో ఉండే సౌకుమార్యం, మృదు పరిమళం లేవన్న నిజం తెలుస్తుంది

“ఈ రోజుల్లో డబ్బుల్లేకపోతే మనిషికి విలువలేదు సుశీ. ఒకప్పుడు కోటి రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. అంత డబ్బు ఇప్పుడు చాలా మంది దగ్గర ఉంటోంది. కనీసం పదికోట్లయినా సంపాయించాలనేది నా లక్ష్యం”

“ఎందుకంత డబ్బు? మనకిప్పుడు ఏం తక్కువైందని?”

“మనమింకా ఈ అద్దె ఫ్లాట్లోనేగా ఉంటున్నాం. వీలైనంత తొందరగా స్వంత యింటి కల నెరవేర్చుకోవాలని ఆరాటపడ్తున్నా. ఒక్కసారి వూహించుకో.. మన స్వంత ఫ్లాట్.. మూడు బెడ్రూంలు.. విశాలమైన హాల్… కిచెన్.. నీ ఇష్టప్రకారం దాన్ని అలంకరించుకోవచ్చు. నీ పేరుతోనే కొంటాను సుశీ. నీకు సంతోషమేగా” అన్నాడు.

నా పేర్న ఫ్లాట్ కొంటాడట… అది నాకు సంతోషాన్నిస్తుందా… సంతోషం అనేది కాంక్రీట్ కట్టడా లను స్వంతం చేసుకోవడంవల్లనో లోహనిర్మితమైన వాహనాల్ని పొందడం ద్వారానో వస్తుందా? అయ్యో దేవుడా.. ప్రేమించానంటూ వెంటపడ్డాడే.. పెళ్ళి చేసుకుందామని తొందర పెట్టాడే.. నాకేది సంతోషాన్నిస్తుందో తెలియదా? పక్కకు తిరిగి నిశ్శబ్దంగా కన్నీరు కార్చాను.

***

ఆదివారం ఉదయం… రవి ఇంట్లోనే ల్యాప్‌టాప్‌లో తల దూర్చి పని చేసుకుంటున్నాడు. ప్రేమించుకునే రోజుల్లో రవి రావడం ఆలస్యమైతే ప్రాణం విలవిల్లాడిపోయేది. ఎప్పుడెప్పుడు వస్తాడా అని క్షణాల్ని లెక్కపెట్టుకుంటూ అసహనంగా ఎదురుచూసేదాన్ని. అతను వెళ్ళిపోవడానికి లేచినపుడు నా హృదయంలోంచి ఓ బలమైన శకలం విడివడి వెళ్ళిపోబోతుందన్న భావనతో దుఃఖం పెల్లుబికేది. ఇప్పుడు రవి ఉదయం ఆఫీసుకెళ్తుంటే ఏమీ అనిపించడం లేదు. శనాదివారాలు అతను ఇంట్లో ఉన్నా సంతోషంగా అన్పించడం లేదు. అతను ఇంట్లో అయితే ఉన్నాడుగానీ నాతో కదా ఉండాలి… నాలో కదా నిండిపోవాలి..

అతను ఆఫీస్‌లో ఉన్నా ఇంట్లో ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ల్యాప్‌టాప్‍ని కౌగిలించుకుని కూచుంటాడు. అదేమంటే ‘వర్క్ ఫ్రం హోం… ఎంత పనిచేస్తే అన్ని డబ్బులు తెలుసా’ అంటున్నప్పుడు అతని కళ్ళు వింత కాంతితో మెరుస్తాయి. కంప్యూటర్ స్క్రీన్ మీదనుంచి దృష్టి మరల్చి నా కళ్ళల్లోకి చూస్తే కదా వాటిలో కదలాడే నీలి నీడలు కన్పించడానికి…

పక్క ఫ్లాట్లో ఉండే నీరజ బాగా సింగారించుకుని, తాళాలిచ్చిపోవడానికి వచ్చింది. గ్యాస్ సిలిండర్ వాడు వస్తే కిచెన్లో పెట్టించాలట. “ఏదైనా పేరంటానికా?” అని అడిగాను. ముసిముసిగా నవ్వుతూ “లేదు. ఆదివారం కదా. మ్యాట్నీ సినిమాకెళ్ళి, అట్నుంచి సాయంత్రం నెక్లెస్ రోడ్‌లో గడిపి, తర్వాత మంచి హోటల్‍కెళ్ళి డిన్నర్ చేద్దామని ఈయన ప్లాన్ చేశారు” అంది.

నాకలాంటి కోరికలు కూడా లేవు. రెండు మూడుసార్లు సినిమాకెళ్లామా అని అడిగినపుడు ‘నాకు తీరిక లేదు. పూర్తి చేయాల్సిన పెండింగ్ పని చాలా ఉంది. కావాలంటే నువ్వెళ్ళు’ అని రవి అనడంతో ధియేటర్లో సినిమా చూడాలన్న ఆసక్తి చచ్చిపోయింది. నాకు సినిమాలూ షికార్లు లేకున్నా పర్లేదు. నాతో ప్రేమగా ఓ గంట గడిపినా చాలు. నాలుగు తీయటి మెత్తటి మాటలు చాలు. మనసంతా నిండిపోయేలా ఒకరి కళ్ళల్లోకి ఒకరం కొన్ని నిమిషాలు ఆరాధనగా అనురక్తితో చూసుకున్నా చాలు.. హృదయం నిండా పర్చుకుని, పర్వతాల్ని మోస్తున్నంత బరువుగా ఉన్న శూన్యాన్ని తీసి బైటికి గిరాటేస్తాను.

రాత్రి తొమ్మిదయింది, భోజనాలు పూర్తయ్యాయి. పదింటికి పక్కమీదకు చేరితే పాములా వంటిమీద పాకుతూ రవి చేయి.. ఆ స్పర్శలో ప్రేమ లేదు.. కౌగిలింత.. అది అనురాగ బంధం కాదు. కనీసం కొలిమిలా మండుతున్న కోరికని చల్లార్చుకోడానికి పడే తపనకూడా కాదు. టైంటేబుల్ ప్రకారం జరగాల్సిన ఓ చర్య మాత్రమే… “మనం కలిసి సరిగ్గా వారం. ఎంత తీరిక లేకున్నా, ఎంత పని వత్తిడి ఉన్నా ప్రతి ఆదివారం తప్పకుండా సంభోగించాలని కదా మనం నిర్ణయించుకున్నాం. మా టెక్కీల్లో కొంతమంది నెలకోసారి కూడా కలవరట తెలుసా” అన్నాడు.

వారానికోసారి కలవాలని మనం నిర్ణయించుకున్నామా… ఆ ఆలోచన నీది. అందులో నా భాగస్వామ్యం లేదు. అయినా దీన్ని సంభోగమంటారా… సమత్వం ఎక్కడుంది? ప్రేమలోంచి కదా శృంగారభావాలు మొలకలెత్తి శరీరాలు ఒక్కటి కావాలి? శరీరం అచలం కాదు… దానికో మనసుంది. దాన్ని వీణలా శృతి చేసి మీటితే కదా మనోహర రాగాలాపన.. రెండు రాతి బొమ్మలు.. ఒకదాన్ని మరొకటి ఒరుసుకున్నట్టు..

“నీ కోసమే తెలుసా ఈ ఏర్పాటు? నీకు సంతోషంగా ఉందా?” అని అడిగాడు.

పక్కకు తిరిగి దిండులో తల దూర్చి, ప్రతిసారీ గాయపడ్తున్న నా హృదయంలోంచి కారిన రక్తాశ్రువుల్తో దాన్ని తడిపేశాను.

***

“బ్యాంక్ నుంచి డెబ్బయ్ లక్షలు లోన్ తీసుకుందామనుకుంటున్నాను” అన్నాడో రోజు రవి.

“డెబ్బయ్ లక్షలా? అంత డబ్బు ఎందుకూ?” అన్నాను.

“టోలీచౌకీలో మంచి ఫ్లాట్లు అమ్మకానికున్నాయట. రెడీ టు ఆక్యుపై… డబ్బులు కట్టాక, ఫ్లాట్ మన స్వంతం కావడానికి రెండు మూడేళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. నేను కోరుకున్నట్టే త్రీ బెడ్రూం ఫ్లాట్.. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. మా ఆఫీస్‌లో ముగ్గురు కొలీగ్స్ కొనబోతూ నన్నూ అడిగారు. నేను వెళ్ళి చూసొచ్చాను. మొత్తం కలిపి ఎనభై లక్షలవుతుందన్నారు. బ్యాంక్‌లో పది లక్షలున్నాయిగా. మిగతా డెబ్బయ్ కోసమే లోన్”

“డెబ్బయ్ లక్షల లోన్ అంటే మాటలా? ఎప్పటికి తీరేను?”

“టోలీచౌకీ ఏరియాలో త్రీ బెడ్రూం ఫ్లాట్ అంటే మాటలా” అంటూ నవ్వాడు. “అప్పుదేముంది? మెల్లగా తీర్చుకోవచ్చులే. ఐనా కలల్ని నిజం చేసుకోవడం కోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా?”

కలలు కంటున్నాడట.. నేనూ కలలు కంటున్నాను. అతని కలల్లో ప్లాట్లు, మెర్సిడెస్ కార్లు, విదేశీ ప్రయాణాలూ… స్టార్ హోటళ్ళలో విడుదులూ వినోదాలూ ఉంటాయి. నా కలల్లో కేవలం అతని ప్రేమ మాత్రమే ఉంటుంది. ఓ నీటి చుక్క కోసం నోరు తెర్చుకుని ఎదురుచూసే ఎడారిలా అతని ప్రేమామృత ధార కోసం తపిస్తూ నేను.. గొంతు తడారిపోతోంది. కోట్లు ఖరీదు చేసే సిమెంటు కట్టడాలతో నా దాహం తీరుతుందా అతని పిచ్చిగాని.. నాక్కావల్సింది గుక్కెడు అనురాగం.. పిడికెడు ప్రేమ…

ఫ్లాట్ నా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. గృహప్రవేశానికి బంధుమిత్రులందర్నీ ఆహ్వానించాడు. ఇద్దరం పీటలమీద కూచుని సత్యన్నారాయణవ్రతం చేశాం. భోజనాలకు క్యాటరింగ్ వాళ్ళకు ఆర్డరిచ్చాడు.

అందరూ మమ్మల్ని అభినందించారు. ఫ్లాట్ నా పేరున కొన్నందుకు మా అమ్మానాన్నలయితే నా అదృష్టానికి మురిసిపోయారు.

ఆ రాత్రి పడగ్గదిలో నా పక్కన పడుకుని ఉన్న రవి మొహంలో వేనవేల నక్షత్రాల కాంతి.. “మనం ప్రేమించుకునే రోజుల్లో కన్న కల… ఇప్పటికి నిజమైంది సుశీ” అన్నాడు.

నేను మౌనంగా ఉండటం చూసి మళ్ళా తనే అన్నాడు. “నీకో మహల్ లాంటి ఇల్లు బహుమతిగా ఇవ్వాలనీ, అందులో నువ్వు మహారాణిలా ఉండాలని అనుకునేవాణ్ణి. నీకు సంతోషంగా ఉంది కదా”

“ఖరీదైన కార్లు, ఇళ్ళూ బహుమతిగా ఇస్తే సంతోషంగా ఉంటుందని నేనెప్పుడైనా చెప్పానా?”

“ఆడవాళ్ళు కోరుకునేది అవేగా. ప్రేమించుకునే రోజుల్లో బాయ్ ఫ్రెండ్ తమకు ఖరీదైన బహుమతు లివ్వాలని కోరుకుంటారు. రకరకాల చీరలూ నగలూ ఇష్టపడని ఆడవాళ్ళుంటారా ఎక్కడైనా? పెళ్ళయ్యాక కార్లలో తిరగాలనీ, ప్యాలెస్ లాంటి స్వంతింట్లో కాపురముండాలని కదా మీ ఆడపిల్లలందరూ కలలు కంటుంటారు” అన్నాడు.

ఎంత తప్పు ఆలోచనో కదా…మగవాళ్ళందరూ ఆడవాళ్ళని ఇలానే అంచనా వేస్తారా? ఖరీదైన బహుమతులిస్తే చాలా … ప్రేమకు అవి ప్రత్యామ్నాయాలెలా అవుతాయి? కొంతమంది అమ్మాయిలు అలా ఉన్నారేమో. కాదనను. అందర్నీ అలా అనుకుంటే ఎలా? నాలాంటి వాళ్ళు కూడా ఉంటారుగా..

అప్పు తీరాలంటే బ్యాంక్తి నెలకెంత కట్టాలో చెప్తున్నాడు. దానికోసం మరింత కష్టపడాలట. ఓవర్ టైం చేయాల్సి వస్తుందట. మిగిలిన జీతంతో ఎలా గడుపుకోవాలో చెప్తున్నాడు. ఎప్పుడూ డబ్బు చుట్టూతా తిరిగే మాటలే మా మధ్య…

బయట వెన్నెల పుచ్చపువ్వులా విరగ కాస్తోంది. బాల్కనీలో అతని వొళ్లో పడుకుని.. అతను పాడే పాటను మైమరచిపోయి వింటూ… అతను చెప్పే తీయటి కబుర్లని కనులు అరమోడ్పులు చేసి ఆస్వాదిస్తూ, .. ఎంత తీయటి కల… రవికెప్పటికి అర్థమౌతుందో.. నాక్కావల్సింది త్రీ బెడ్రూం ఫ్లాటో, రాజమహల్ లాంటి భవంతో కాదని… అతని గుండెల్లో నాకోసం కట్టిన చిన్న పూరిపాకైనా చాలని…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here