రాయలవారి తెలుగు

0
2

[dropcap]”ఇ[/dropcap]దిగో ఈ శిల్పాలు చూశావా? ఎంత బాగున్నాయో?” అంది భవ్య తన స్నేహితురాలు లతతో. ఇద్దరమ్మాయిలూ హంపీ విరూపాక్షాలయంలోని శిల్పసంపదను మైమరచిపోయి చూస్తున్నారు.

ఇంతలో “క్షమించండి. ఈ ఆలయ విశేషాలు నేను తెలుసుకోవచ్చా?” అని ఇంగ్లీషులో మర్యాదగా అడుగుతున్న ఒక వ్యక్తిని వెనుదిరిగి చూశారిద్దరూ. ఇట్టే తెలిసిపోతుంది ఆ వ్యక్తి పరాయి దేశస్థుడని. అతని వేషధారణ కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అతను పూర్తిగా ఒకనాటి తెలుగువాళ్ళ వేషధారణలో అంటే ధోవతి, చొక్కా, కండువా వేసుకొని వున్నాడు. “మీరు….” అని వెంటనే “యు….” అంటూ ఆగిపోయారు.

“ఫర్వాలేదు. నేను తెలుగు బాగా అర్థం చేసుకోగలను, మాట్లాడగలను, వ్రాయగలను. నేను లండన్ నుండి యిక్కడకు వచ్చాను. మైసూర్ యూనివర్శిటీలో హిస్టరీ రిసెర్చి స్కాలర్‍ని. పురాతన శాసనాల్లో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేయించిన తెలుగు శాసనాల మీద రిసెర్చ్ చేస్తున్నాను. ఆ సందర్భంగానే ఇక్కడకు వచ్చాను.” అని అంటుంటే స్నేహితురాళ్ళిద్దరూ నోరు తెరిచి వింటూ ఉండిపోయారు.

“ఏమైంది? మిస్… మాట్లాడటం లేదు!” అన్న అతని మాటలకు ఈ లోకంలోకి వచ్చారిద్దరూ.

“నా పేరు భవ్య. నేను కూడా మైసూరు యూనివర్శిటీలోనే కెమిస్ట్రిలో రిసెర్చి చేస్తున్నాను. ఇంకొక రెండు సంవత్సరాలలో థిసీస్ సబ్మిట్ చేస్తున్నాను. ఈమె నా స్నేహితురాలు లత. నా చిన్నప్పట్నుండి మేము స్నేహితులము. లత నెల్లూరులో టీచర్‍గా పనిచేస్తుంది. దసరా సెలవులు కావడంతో నా దగ్గరకు వచ్చింది. మా యిద్దరికీ ఇలాంటి చారిత్రక ప్రదేశాలు చూడటం, తెలుసుకోవడం చాలా యిష్టం! అందుకే యిలా వచ్చాం. మిమ్మల్ని నేనెప్పుడూ యూనివర్శిటీలో చూడలేదే?”

“మీకు ఆ ఛాన్స్ లేదు. సారీ. అవకాశం లేదు. బైదిబై నా పేరు ఫిలిప్! నేను లండన్ యూనివర్శిటి నుండి వచ్చాను. ఇక్కడి యూనివర్శిటీ ప్రొఫెసర్, మా ప్రొఫెసర్ కలిసి నా వర్క్ చూస్తారు. అందుకే నేను లండన్‍కి, మైసూర్‍కి తిరుగుతుంటాను. పైగా మన డిపార్టుమెంట్లు చాలా దూరం కదా! అందుకే నేను మీకు కనబడి వుండను. అయినా మీ కెమిస్ట్రి వాళ్ళు ఎక్కడ? ఎప్పుడూ మీ ల్యాబ్‍లో వుంటారు. మీరెప్పుడు పట్టించుకోవాలి మిగిలిన వాళ్ళని!” అని సరదాగా మాట్లాడ్డంతో.

“నిజమే! ఒకసారి ల్యాబ్‍లో ఆడుగుపెడితే అదే లోకంలో వుంటాము. ఒక్క చిన్నపొరపాటు జరిగినా నష్టమే కాకుండా చాలా ప్రమాదం కూడా! అన్నీ టైము ప్రకారంగా చెయ్యాలి” అంటున్న భవ్యతో.

“తల్లీ! భవ్యా…. యిక్కడ కూడా నీ కెమిస్ట్రీయేనా? పద యింకా చాలా చూడాలి” అంది లత.

“అవునవును. ప్లీజ్ కమ్ ఫిలిప్స్” అంటున్న భవ్యతో “భవ్య మనం తెలుగులోనే మాట్లాడుకోవచ్చు” అన్నాడు ఫిలిప్స్.

“మీకు తెలుగు ఎలా?”

“దానికో పెద్ద కథ ఉంది” అన్నాడు ఫిలిప్స్.

“రండి ఇక్కడ కూర్చుందాం” అంటూ విరూపాక్షాలయం ప్రాంగణంలోని ఒక తిన్నె దగ్గరకు దారి తీశారు.

ఫిలిప్స్ మొదలుపెట్టాడు.

“మీకు సి.పి బ్రౌన్ తెలుసు కదూ!”

“తెలియకేం. చాలా గొప్పవారు. ఆంగ్లేయుడైన యిక్కడి భాషలమీద మక్కువ పెంచుకున్నారు. ముఖ్యంగా మా తెలుగువారు. బ్రౌన్ దొరగారికి ఎంతో ఋణపడి ఉన్నారు. ఒక నిఘంటువును అదే డిక్షనరీని తీసుకొచ్చారు” అంది భవ్య.

“అంతేనా! ఎన్ని కైఫియత్తులు, ఎన్నో గ్రంథాలను బయటకు తీసుకొచ్చారు” అంది లత.

“అవునవును. మరి ముఖ్యంగా రాజశాసనాలు, నన్నయ్య, తిక్కన గారి కొన్ని గ్రంథాలు మరీ ముఖ్యంగా పెద్దన మనుచరిత్ర, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని “అష్టదిగ్గజాల…” అంటూ ఉత్సహంగా చెప్పుకుపోతున్న భవ్యను ఆపాడు ఫిలిప్స్.

“అష్టదిగ్గజాలు అంటే”

“శ్రీకృష్ణదేవరాయలు తన కాలంలో సాహితీ సభకు “భువన విజయం” అని పేరుపెట్టి అందులో ఎనిమిదిమంది కవులలో కవితా గోష్ఠి , సమావేశాలు నిర్వహించేవారు. తను స్వయంగా కవి కావటంతో ఆ కవులను ఆదరించి వారిచేత ఎన్నో కృతులను రచింపచేశాడు. ఎనిమిది మంది సమర్థులైన కవులు కనుక వారిని ’అష్టదిగ్గజాలని” గజము అంటే ఏనుగువలె కవితారణంలో పోటీపడేవారని వారిని మన్నించాడు.

“మన అష్టదిక్పాలకుల్లాగా” అనమాట అంది లత.

“అవునవును. అంతేకదా! నిత్యం సాహిత్యోద్యమం, సమస్యాపూరణులు, నాట్యం, సంగీతం, ఒక్కటేమిటి రాయలకలం మాకు స్వర్ణయుగం. అందుకే ఆయనకు ’సాహితీ సమరాంగణ సార్వభౌముడు’ అని పొగిడేవారు అంటున్న భవ్యను చూసి,

“భవ్య! ఆఖరి పదం అర్థం ఏమిటి” అడిగాడు ఫిలిప్స్.

“దాని అర్థం ఆయన సాహిత్యం అనే యుద్దాన్ని గెలిచిన చక్రవరి” అని “యిందుకూ మీకు బ్రౌన్ గారికి సంబంధం”

“ఆయన నాకు గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్!”

“అబ్బా! ఎంతో సంతోషంగా ఉంది!” అంటూ ఫిలిప్స్ చేతులు పట్టుకుని ఊపేస్తున్న భవ్యను చూస్తున్న ఫిలిప్స్ కళ్ళు మెరిశాయి.

“మీ భవ్యకు తెలుగు అన్నా, హిస్టరీ అన్నా ఒక ఆవేశం… ఏకబిగిన చెప్పేయాల్సిందే” అంటూ లత నవ్వింది.

ఈ లోకంలోకి వచ్చిన భవ్య సిగ్గుపడింది ఆ మాటలకు ఫిలిప్స్ చెయ్యి వదిలేసింది.

అప్పటివరకు ఉన్న బిడియం పోయి ఫిలిప్స్ కూడా పెద్దగా నవ్వేశాడు.

“పదండి మనం చాలా చూడాలి” అని ముగ్గురూ బయలుదేరి విఠలాలయం, రాతిరథం, సాలభంజికలు, స్వరస్తంభాలు అన్నీ చూశారు. పురావస్తుశాఖ వారు ఏర్పరచిన కళాఖండాలు, మ్యూజియం అన్నీ చూశారు. అక్కడి శాసనాలు, వాటిలిపి ఫిలిప్ తన కెమెరాలో బంధించాడు. రెండురోజులు చాలా సరదాగా గడిచిపోయాయి.

“బ్రౌన్ దొరగారి లైబ్రరి చూశావా ఫిలిప్స్” అడిగింది భవ్య.

“లేదు! మా గైడ్ కూడా చెప్పారు. అక్కడ కూడా నాకు కావలసిన మెటీరియల్ దొరుకుతుందని” అన్నాడు ఫిలిప్స్.

“లత! నీకు యింక రెండురోజులు సెలవులున్నాయి కదా! మనం కడపకు వెళ్ళి ఆ లైబ్రరీ కూడా చూద్దాం”

“నేను అట్నుండే నెల్లూరు వెళ్ళిపోతాను. మీరిద్దరూ మైసూరుకు వెళ్ళండి” అంది లత.

ముగ్గురూ బయలుదేరి కడపలో సి.పి బ్రౌన్ లైబ్రరీ చూశారు. ఈ ప్రయాణంలో ఫిలిప్స్, భవ్య బాగా కలిసిపోవడం చూసిన్ లత మనసులో ఏదో ఆలోచన మెదిలింది. పెదవులమీద చిరునవ్వు మెరిసింది.

“నువ్వే నవ్వుకుంటావా? కొంచెం మాకు కూడా చెప్పు” అని అడిగింది భవ్య.

“చెప్తా… చెప్తా… ముందునన్ను బస్సు ఎక్కనివ్వండి” అని లత వెళ్ళిపోయింది చెయ్యూపి.

ఫిలిప్స్, భవ్య మైసూరు వచ్చేశారు.

వచ్చినప్పటినుండీ ఎవరిపనుల్లో వారు నిమగ్నమైపోయారు. అప్పుడప్పుడూ లైబ్రరీనుండి ఫిలిప్స్, భవ్య దగ్గరలో వున్న క్యాంటిన్‍లో కలుసుకునేవాళ్ళు. ఇద్దరి రిసెర్చి విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఒక్కోసారి భవ్య తెలుగు డిపార్టుమెంటుకు వెళ్ళేది. రాత్రిపూట ఒక్కోసారి ఫిలిప్స్ భవ్యను ల్యాబ్‍లో కలిసేవాడు. ఇట్టే రెండు సంవత్సరాలు గడిచాయి.

భవ్య ఈ మధ్యలో రెండు పేపర్స్ పబ్లిష్ చేసింది. వాటికి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఆమె గైడ్ “భవ్య! నీవు థిసీస్ వ్రాయడం మొదలుపెట్టు” అన్నాడు.

ఎంతో ఉత్సాహంగా “ఫిలిప్స్! నేను థిసీస్ వ్రాయడం మొదలు పెటాను” అని భవ్య ఫోన్ చేసింది.

“కంగ్రాట్స్ భవ్యా!” అట్నుంచి ఫిలిప్స్.

“నాది కూడా యింకొద్ది నెలల్లో అయిపోతుంది భవ్వ” అంటున్న ఫిలిప్స్ గొంతులో ఏదో తెలియని బాధ ధ్వనించింది.

తనదీ అదే పరిస్థితి, ఏమిటి? ఏమైంది? అనుకున్నా థిసిస్ వ్రాయటంలో పడి అన్నీ మరచిపోయింది.

“ఫిలిప్స్! నీవు ఖాళీగా ఉన్నావా? ఈరోజు నేను థిసీస్ సబ్మిట్ చేయ్యడానికి వెళ్తున్నాను” అన్న భవ్యకు “తప్పకుండా వస్తాను” అని ఫోన్ పెట్టాడు ఫిలిప్స్. పది నిమిషాల్లో భవ్య ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతకుముందు వారంలోనే తను కూడా లండను యూనివర్శిటీకి తన థిసిస్ సబ్మిట్ చేశాడు. యూనివర్శిటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‍గా కూడా తనకు ఉద్యోగం వచ్చింది. చేరటమే మిగిలింది. భవ్య థీసిస్ అంతా చదివి భాషాపరంగా అన్నీ సరిచేశాడు ఫిలిప్స్. భవ్యకు ఎంతో ధైర్యం చెప్పాడు.

ప్రస్తుతం ఇద్దరూ యూనివర్శిటి ఎక్సామినేషన్ సెల్‍కు వెళ్ళి అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. తర్వాత ఇద్దరు కలిసి భవ్య గైడ్‍ని కలిసి థీసిస్ ప్రతిని ఆయనకు ఇచ్చారు.

ఇద్దర్ని చూసిన భవ్య గైడ్ “గుడ్ లక్ టు బోత్ ఆఫ్ యూ!” అని అభినందించడంతో భవ్య కళ్ళు మెరిసాయి.

“ఏంటి ఫిలిప్స్!” అంటున్న భవ్యతో “భవ్యా! సాయంత్రం గుడి దగ్గర” అని గబగబా వెళ్ళిపోయాడు ఫిలిప్స్.

గుడికదా అని తన కిష్టమైన పట్టుచీర కట్టుకుని అసలు సిసలు తెలుగమ్మాయిలా తయారై, సాయంత్రం 5 గంటలకల్లా గుడి దగ్గరికి వచ్చింది. అప్పటికీ ఫిలిప్స్ అక్కడకు వచ్చి వున్నాడు. అదే పంచకట్టు! కొద్దిదూరం నుండి వస్తున్న భవ్యను చూస్తున్న ఫిలిప్స్ ’బ్యూటిఫుల్’ అనుకున్నాడు.

“చాలా సేపైందా?”

“అవును నీకోసం ఎంతసేపైనా ఫర్వాలేదు” అంటూ భవ్య చేతిని తన చేతిలోకి తీసికొని గుడిలోపలికి బయలుదేరాడు ఫిలిప్స్. సాయంత్రం నీరెండ గాలికి భవ్య ముంగురులు అలా కదులుతుంటే ఆమెను చూస్తూండిపోయాడు.

“దీర్ఘసుమంగళీభవ, సుపుత్ర ప్రాప్తిరస్తు” అన్న అర్చకస్వామి మాటలతో ఈ లోకంలోకి వచ్చారిద్దరూ. ఫిలిప్స్ ముఖంలో పట్టరాని ఆనందం, భవ్య ముఖంలో కొంచెం కంగారు.

ఇద్దరూ బయటకు వచ్చి గుడి మెట్లమీద కూర్చున్నారు. ఏదో తెలియని భావం. ఉన్నట్టుండి ఫిలిప్స్ భవ్య ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె చేతుల్ని తన చేతిలోకి తీసుకుని “భవ్య! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకిష్టమైతే పెళ్ళి చేసుకుందాం” అన్నాడు.

భవ్య వెంటనే ఫిలిప్స్ చేతులు గట్టిగా పట్టుకుని “ఫిలిప్స్! నీతో ఈ బంధం నాకు చాలా ఇష్టం నిన్ను కలిసి నీతో పరిచయం పెరిగినప్పటి నుండి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేశాను. నాకు ఒక ధైర్యం. మా గైడ్ కూడా అదే అన్నారు. కానీ ఈరోజు థిసీస్ సబ్మిట్ చేసిన తరువాత్ ఏదో తెలియని వెలితి. తెలియని భయం. నీకు చెప్పలేకపోయాను. ఇప్పుడు ఏ భయం లేదు. కానీ మీ పేరెంట్స్?”

“వాళ్ళకు నేనెప్పుడో చెప్పేశాను భవ్యా! కానీ నీవేమంటావో అని వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ దేవుడికి తెలుసు నీ భావాలు నా భావాలు ఒకటేనని. కాదు… కాదు.. ఈ తెలుగు భాషా సరస్వతే మనల్ని కలిపింది. ఈ భాషమీది ఇష్టంతోనే నేను ఇక్కడకు వచ్చాను. అలాగే నిన్ను కలిశాను” అని చక్కటి తెలుగులో మాట్లాడుతున్న ఆంగ్లేయుణ్ణి చూసి పరవశించిపోయింది భవ్య. వెంటనే “ఏం కాదు, అంతా మా రాయలవారి గొప్పతనం. ఆయన అలా గొప్ప కట్టడాలు కట్టించకపోయివుంటే, శాసనాలు వ్రాయించకపోయివుంటే…” అని చెప్తున్న భవ్య చెంపమీద చిటికేసి.

”అల్లరిపిల్లా! మీ రాయలవారు ప్రేమించింది కూడా తెలుగునే”

“తెలుగుదేలయన్న దేశంబు తెలుగుదేను
తెలుగువల్లభుండు తెలుగుకొండ ఎల్లి
నృపులు గొల్వగ బాసా డలె దేశభాషలందు
తెలుగు లెస్స…. అని చెప్పారుగా…

అష్టదిగ్గజాలను పోషించాడు. అల్లసాని అల్లిక జిగిబిగిని ధూర్జటి పలుకుల మాధుర్యాన్ని ఒకేసారి చవిచూశాడు. భట్టుమూర్తి రోదన విన్నాడు, ముక్కు తిమ్మన ముద్దుముద్దు ఏడ్పులు భరించాడు. రామలింగడి సరససల్లాపాలతో సేద తీరాడు. పింగళి సూరనని, అయ్యలరాజును, మాదయిగారి మల్లన్నని సంభవించాడు. తాను స్వయంగా గోదా కల్యాణం, మదలస చరితం రచించాడు కదా! పెద్దన మనుచరిత్రానికి పరవశించి గండ పెండేరాన్ని తొడిగి, “ఎదురైనచో తన మదకరీంద్రముడిగి” ఆయన పల్లకీ భుజానికెత్తుకున్నాడు కదా! అంటూ రెచ్చిపోతున్న ఫిలిప్స్ ని “ఆగు… ఆగు… నన్ను కూడా చెప్పనీ”

“మా భాష యాభై ఆరు అక్షరాల అందమైన భాష. అజంత భాష. అమరభాషకు సాటియైన భాష అని రాగం కలిపింది భవ్య.

“ఓయ్! మీరు కాదు మనది” అన్నాడు ఫిలిప్స్ పెద్దగా నవ్వుతూ.

“నీకు సంగీతం వచ్చా?” అడిగాడు ఫిలిప్స్.

“చిన్నప్పుడే నేర్చుకున్నాను. ఇప్పుడుకూడా ఇప్పుడు కూడా పాడుకుంటూంటాను”

”అయితే హిందోళరాగం పాడు”

“వాట్! నీకెలా తెలుసు?”

“పెద్దనగారు చెప్పారుగా హిందోళము బాడిది బృందారాక సతులు అని, శిశిర, వసంతకాలాల్లో హిందోళం నప్పుతుందట కదా!”

“అవునా! ఎంత బాగా చెప్తున్నావో” అంటూ బుగ్గలు పుణికింది భవ్య.

వెంటనే భవ్యని దగ్గరికి తీసుకున్నాడు. “పద. ఇది గుడి కదా! ఇక్కడి నుండే మా పేరెంట్స్‌కి ఫోన్ చేస్తాము” ఫిలిప్స్ భవ్య పేరెంట్స్ కి ఫోన్ చేశారు. వారు ఎంతో సంతోషంతో ఇద్దరికీ శుభాకంక్షలు తెలిపారు.

కొద్దినెలల్లోనే భవ్య తలిదండ్రులు, ఫిలిప్స్ తలిదండ్రులు సమక్షంలో భవ్య, ఫిలిప్స్, పెళ్ళి జరిగిపోయింది. లత ఇద్దరిని ఆట పట్టించింది ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసునని.

పెళ్ళి అయిన కొద్దిరోజులకి భవ్యకి డాక్టరేట్ వచ్చింది. ఇద్దరూ లండన్‍లోని ఫిలిప్స్ తల్లిదండ్రుల ఇంటిదగ్గరలోని ఫిలిప్స్ యింటికి బయలుదేరారు. ఇంటిదగ్గర భవ్యకు ఎంతో సంభమాశ్చర్యం. తెలుగింటి వేడుకలాగా ఫిలిప్స్ తల్లిదండ్రులు వాళ్ళకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళారు. “ఫిలిప్స్ టోల్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్” అని చెప్తున్నా ఫిలిప్స్ తల్లిదండ్రుల్ని భవ్య ప్రేమగా కౌగలించుకుంది.

ఒకరోజు సాయంత్రం ఇంటి పెరట్లో మల్లెతీగ దాని పూలు కనిపించాయి భవ్యకు. క్రింద కొన్ని రాలిపడ్డాయి. మంచి పరిమళం. “ఫిలిప్స్ ఇది ఎలా?” అన్న భవ్యకు ఆమె ఒకరోజు పాడిన పాట రికార్డు చేసింది వినిపించాడు ఫిలిప్స్.

“వచ్చెనిదె వాసంతము. తెచ్చెనే సుమసౌరభం
మధుకరములకు సోయగం మల్లెల ఆరాధనం”

ఇద్దరూ ఆ వెన్నెల రాత్రిలో మల్లెల పరిమళాన్ని అస్వాదిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here