[dropcap]అం[/dropcap]గవైకల్యం, ఆత్మన్యూనతతో ఆత్మహత్యలు పెరిగిపోతున్న ఆధునిక ప్రపంచంలో మానసిక శాస్త్రవేత్తలు, వారి పరిశోధనలు సాధిస్తున్న విజయాలు చూస్తే చాల తక్కువనే చెప్పాలి. సినిమాల్లో, కథల్లో చూపినట్లు మానసిక వైద్యంతో ‘పూర్తిగ’ కోలుకున్న కేసులు చాల తక్కువ. ఎందుకంటే, మందుల కంటే వ్యక్తి తనలో నింపుకునే ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథం మాత్రమే పరిష్కారం చూపగలదు. అలాంటి సమస్యల్ని ఎదుర్కొని, పరిష్కారాల్ని వెదుక్కుని తమను తామే నిలదొక్కుకుని విజేతలుగా నిలవడం అంత తేలిక కాదు. కథల్లో పాత్రలు మాత్రమే అలా చేయగలుగుతాయి. కానీ, ప్రపంచంలో విజేతల విజయాల వెనక అంత తేలికైన ‘షార్ట్‌కట్’లు లేవు. పరిశీలించి చూస్తే నిజ జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని, పోరాడి విజయం సాధించిన ‘రియల్ స్టోరీస్’ ఎన్నెన్నో వున్నాయి.
అలాంటి వాస్తవిక జీవితాలని కథలుగా మలిచి, సమస్యలతో బాధపడేవారికి వెన్నుదట్టి, వెన్నుదన్నుగా నిలిపే కథల సంపుటి ‘రియల్ స్టోరీస్ – స్ఫూర్తినిచ్చే వాస్తవ విజయగాథలు’. శ్రీ కస్తూరి మురళీకృష్ణ ‘వార్త’ ఆదివారం అనుబంధంలో ధారావాహికంగా ఇటువంటి విజేతల పోరాటాన్ని, అంతిమ విజయాల్ని కథలుగా రాసారు. కేవలం క్రైమ్‌నే వర్ణించి, పాఠకుడి ‘టెన్షన్’ని పెంచి క్యాష్ చేసుకునే కొందరు రచయితలు ఉంటారు. కానీ క్రైమ్‌ను కూడ పదిమందికి ఉపయోగించేట్టు, భిన్నంగా రాయడం ఎలా అని ఆలోచించి, పదిమందికి పంచేలా, నేరాన్ని వర్ణించకుండా, నేరానికి గురయినవారి మానసిక వేదనను ప్రతిబింబించేట్టు ఈ కథలు రాసారాయన.
ఈ కథలు కాలక్షేపపు బఠానీలు కావు. ఒకడు ప్రేమ పేరుతో ఒకమ్మాయిని కత్తితో ఎలా పొడిచాడో స్లోమోషన్‌లో చూపిస్తూ, వైనాలు వైనాలుగా, అద్భుతమైన పదజాలంతో చూపించే టి.వి. వార్తా కథనాల వంటివి కావు. ప్రపంచంలోని వివిధప్రాంతాల్లో వివిధ సమస్యలతో బాధపడి, చివరికి ఆ బాధని ఛాలెంజ్‌గా తీసుకుని అధిగమించిన వ్యక్తుల వాస్తవ గాథలు. మొత్తం 50 కథలూ ఇలాంటి స్ఫూర్తి దాయకమైనవే.
ముఖ్యంగా ఈ కథలని 3 విభాగాలుగా మార్చవచ్చు.
- గర్భంలో ఉన్నది జన్యుపరమైన వ్యాధితో ఉన్న పిండమని తెలిసినా, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా జన్మనిచ్చిన తల్లులు.
- అంగవైకల్యంతో జన్మించినా, ఆ అవకరాన్ని ఆత్మస్ధైర్యంతో ఎదుర్కొని, జీవితాన్ని సార్థకం చేసుకున్నవారు.
- అన్యాయాన్ని ఎదిరించి, ఎవరూ తోడు రాకున్నా, సహాయం చేయకున్నా, ఆర్థిక స్తోమత లేకున్నా, ఒంటరిగా పోరాడి విజయం సాధించిన వారు.
వీరంతా స్ఫూర్తి నిచ్చినవారే. వీరి జీవితాలు ఎంతో ఆదర్శవంతమైనవే. నిరాశతో, డిప్రెషన్‌తో కుంగిపోయేవారికి ధైర్యాన్నిచ్చే మార్గదర్శకులే.
మరణం నుండి జీవితం కథలో… గర్భంలో కవలలు ఉన్నారని, ఛాతీభాగం గుండె కలిపి ఉన్నదని అబార్షన్ చేయకతప్పదని డాక్టర్ చెప్తుంది. కానీ తల్లి ఒప్పుకోదు. ఎంతో ఆశావహ దృక్పధంతో వేచిచూస్తుంది. డాక్టర్లు కూడ ఎంతో ప్రయత్నిస్తారు, కాని ఒకరే బ్రతికారు. తల్లికి మరణించిన పాప గుర్తొస్తే ‘జీవితం ఎంత విలువైనదో, బ్రతకడం ఎంత అపురూపమో’ అనిపిస్తుంది. తండ్రికైతే పాప ప్రతి చర్యా ఒక అద్భుతంలా తోస్తుంది. అమ్మ ప్రాణం సాక్షిగా … కథలో ఒక గర్భవతికి పరీక్షలో కాన్సర్ అని తెలుస్తుంది. గర్భస్రావం చేయాలని, తర్వాత రేడియేషన్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని డాక్టర్ చెప్తుంది. భగవంతుడు ఇస్తున్న వరం మాతృత్వం, తను మరణించినా ఫరవాలేదు, పాపకు జన్మ నివ్వాలని నిర్ణయించుకుందామె. కాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించండి అంటుంది. తర్వాత ఆరోగ్యంగా పుట్టిన పాపను చూసుకొని, తను భయపడి భ్రూణహత్యకు ఒప్పుకొని వుంటే ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఉండేదా అనుకుంటుంది ఆనందంగా. అమ్మా నాన్న ఒక పసిపాప.. కథలో…. జన్యుపరమైనవ్యాధితో పుట్టిన పాపకు 4 నెలల వయసులో తల్లితండ్రులు ముద్దుగా ముట్టుకున్నా, లోపల సున్నితమైన ఎముకలు విరిగిపోతుంటాయి. డాక్టర్లు, పోలీసులు కూడ తండ్రే ముద్దాయిగా నిర్ణయిస్తారు. తల్లి ఆలోచిస్తుంది, అనేక పుస్తకాలు రిఫర్ చేస్తుంది. కోర్టులో నిరూపించి భర్తను, బిడ్డను ఇంటికి తెచ్చుకుంటుంది.
మరణమా నువ్వెక్కడ… కథలో పుట్టినప్పటినుండి బ్రియాన్‌కి ఏదో ఒక వ్యాధి, ఒక దాని తర్వాత ఒకటి. ఎన్నాళ్ళు బ్రతుకుతాడో తెలీదు. అతను కుంగిపోలేదు. తన లోపాలు తనకు తెలుసు. శారీరకంగా బాధలు పడుతూనే, మానసికంగా ధైర్యంతో వైద్యవిద్య నభ్యసించాడు. రేపు చివరి పరీక్ష అనగా మరణం అంచుదాకా వెళ్ళాడు. కానీ, హాస్పిటల్ రూమ్ లోనే పరీక్ష రాసాడు. డిగ్రీ అందుకుంటూ అనుకుంటాడు.. ‘నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు. కానీ బతికినన్నాళ్ళు నాలాంటి వాళ్ళకు సేవ చేయాలని నా ఆకాంక్ష. నిరాశామయ జీవితాలలో ఆశా వెలుగులు నింపాలన్నది నా లక్ష్యం. అందరం ఏదో ఒకరోజు మరణించాల్సిన వారమే. అలాగని జీవితాన్ని చేజార్చుకోవడం మూర్ఖత్వం. ఏ పని అయినా ప్రయత్నించిన తరువాత సాధ్యమో, అసాధ్యమో తెలుస్తుంది. నాలోని వ్యాధులు నాకు తెలుసు. జీవితం ఎంత విలువైనదో నాకు తెలుసు. ఈ అమూల్యమైన జీవితాన్ని ప్రతిక్షణం ఆనందంగా, అర్థవంతంగా జీవించడమే నా లక్ష్యం’ అనుకుంటాడు. నిజానికి పాఠకులకు పరోక్షంగా రచయిత చెప్తున్నారు.
జూడిత్, జాయ్ కవలలు. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు, పెరిగారు. రానురాను జూడిత్ అన్నిటిలో వెనకబడసాగింది. మానసిక ఎదుగుదల లేదు. ఏడున్నర ఏళ్ళ వయసులో ఆమెను ప్రత్యేక స్కూల్‌లో చేర్చి, అప్పుడప్పుడు చూసి వచ్చేవారు. జాయ్‌ని చూస్తే జూడిత్ కళ్ళలో వెలుగు. జాయ్‌కి పెళ్ళయింది. భర్త, పిల్లలు… అన్నీ వున్నా ఏదో అశాంతి. మానసిక వైద్యుల్ని సంప్రదించినా దొరకని సమాధానం, తన మనసుని మధించగా దొరికింది. ‘కలిసి గర్భంలో పెరిగాం. అవిభాజ్యమైన అంగాలం. తనని విస్మరించడమే ఈ అశాంతి అని గుర్తించి జూడత్‌ని ఇంటికి తెచ్చుకుంది. కానీ ఆమెని మామూలుగా మార్చడం అంత సులభం కాదు. ఎంతో సహనంతో తనని పరిశీలించి తనకు దేనిలో ఆసక్తి వుందో గమనించి, రంగు దారాలతో బొమ్మలు చేయడాన్ని ఉత్సాహపరచింది. సృజనాత్మకతతో ఆమె చేసిన బొమ్మలతో ఒక ఎగ్జిబిషన్‌నే ఏర్పాటు చేసింది. భగవద్దత్తమైన సృజనాత్మకత ప్రతిభను వ్యర్థం చేసుకోకూడదు అని చెప్పారు రచయిత.
ప్రేమే గెలిచింది కథలో… భర్తకు తీవ్రమైన గుండె సమస్య అని తెలుసుకుని, కుంగి పోకుండా, ‘ది విమెన్ హూ ఛాలెంజ్డ్ డెత్’ అనే భారతీయ సాధ్వీ సావిత్రి కథ చదివి, స్ఫూర్తి పొంది, అనేక పుస్తకాలు చదివి చదివి, గుండె రక్తనాళాల గురించి డాక్టర్లతో చర్చించింది. భర్తను బ్రతికించుకొంది. తర్వాత ఆ ‘జీన్ ధెరఫీ’ ఆపరేషన్ పద్ధతి ద్వారా ఎందరో ఆరోగ్యవంతులయ్యారు. చిన్నారుల బతుకుపోరాటం కథలో తలలు కలిసి పుట్టిన కవలలకు ప్రపంచంలోనే సుదీర్ఘమైన 83 గంటలు ఆపరేషన్ చేసి వేరు చేయడం, ‘వైద్యో నారాయణో సెమ్’ కథలో ఎండోస్కోప్‌ని సులభతరం చేసి చూపించడం వైద్యచరిత్ర లోనే గొప్ప మలుపులు.
వెలిగిన జ్యోతి కథలో… నికేత తన రెండు కిడ్నీలు పాడైనా చావుకు భయపడక, స్టిరాయిడ్స్ తీసుకుంటూ, బరువు పెరిగి డిప్రెషన్ కెళ్ళినా, ధైర్యం తెచ్చుకుని,నృత్య ప్రదర్శన లిచ్చి, తద్వారా వచ్చిన ధనాన్ని డయాలసిస్ చేయించుకోలేని పేదలకి వినియోగిస్తుంది. ప్రాణభిక్ష కథలో… దొంగతనానికి వచ్చిన వాడిని ఎదిరించడంతో కత్తిపోట్లకి గురై ప్రాణాపాయస్తితిలోకి వెళ్ళినా, తన బిడ్డను రక్షించుకోవడానికి బిడ్డను గుండెకు హత్తుకుని బాత్ రూమ్‌లో దాక్కుంటుంది. తర్వాత డాక్టర్లు చెప్తారు గుండెకు బిడ్డను గట్టిగా హత్తుకోవడం వల్లనే గాయం నుండి రక్తస్రావం ఆగి, బ్రతికిందని.
స్ఫూర్తి విచ్చే ఈ కథలో మకుటాయమానమైనది ‘విరబూసిన ప్రేమ అరవిందం’. డయానాకు 12ఏళ్ళ వయసులో బోన్ కాన్సర్ తీవ్రత వల్ల కుడికాలు తీసేయాల్సివచ్చింది. అయినా ఆత్మవిశ్వాసంతో స్కీయింగ్ చేయడం ప్రారంభించింది. క్రచెస్ తోనే పరుగుపందాలలో పాల్గొనేది. అంతలో బ్రెస్ట్ కాన్సర్. కీమోథెరపీతో కొంచెం నయం అనుకునే సమయంలో యుటరస్ కాన్సర్. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నిద్రమాత్రల నాశ్రయించింది. తనకు తనే కౌన్సిలింగ్ చేసుకుంది. ‘అంగవైకల్యం భౌతికమే కానీ మానసికం కాదు. మనిషి తలుచుకుంటే భౌతిక లోపాలను మనోశక్తితో అధిగమించగలడు’ అనుకొంది. కుంటుతునే నాట్యప్రదర్శనలిస్తూ, వికలాంగులలో నిరాశను పారద్రోలి ఆత్మస్ధైర్యాన్ని నింపే ఉపన్యాసాలు ఇవ్వసాగింది. ఇక్కడ అద్భుతమైన మలుపు ఏమిటంటే, కాలేజిరోజుల నుండి ఆమె వ్యక్తిత్వాన్ని ఆరాధించే స్టీవ్ తాను ప్రఖ్యాత కార్టూనిస్టుగా ఎదిగినా, అందమైన అమ్మాయి లెందరో ఎదురైనా, చివరికి ఆమెకి వెన్నుపూస కాన్సర్ కూడ వచ్చిందని తెలిసినా ఎంతో యిష్టంగా ప్రపోజ్ చేస్తాడు. ‘ఉన్నంత కాలం ప్రతి క్షణం ఆనందంగా బ్రతుకుదాం’ అని ‘ఒప్పించి’ పెళ్ళిచేసుకుంటాడు. యాసిడ్ దాడి, కత్తిపోట్ల బాపతు ప్రేమికుడు కాదితడు. ఇలాంటి వాస్తవ గాధను తీసుకున్న మురళీకృష్ణ అభినందనీయులు.
న్యాయం గెలిచింది, అంతుదొరికిన వింతకథ, ఎగిరివచ్చిన పావురం, ఛాయాచిత్రాలు చెప్పే కథలు, నిప్పులా దాగిన నిజం, మృత్యువుతో ముఖాముఖి, ఎవరు దేశద్రోహి, పడగ విప్పిన తుపాకీ, మానవమృగాల మధ్య, మరో సత్యాగ్రహం, ఇది అన్యాయం, మారణకాండకు మరోవైపు వంటి కథలు చదివితే, ఇవి నిజంగా వాస్తవగాథలా అని ఆశ్చర్యమేస్తుంది. అన్నీ ఒంటరి పోరాటాలే. ఎదుటవున్నది బలమైన రాజ్య వ్యవస్ధ కావొచ్చు, భయంకరమైన మాఫియా కావొచ్చు, కరుడు కట్టిన దోపిడీ దొంగలు కావొచ్చు… తాము సామాన్యమైన ఒంటరివ్యక్తులైనా భయపడకుండా పోరాటం చేసి, చట్టాన్నాశ్రయించి న్యాయమార్గంలో విజయం సాధించిన విజేతల కథలివి.
పుట్టుకతో జన్యుపరమైనరెటీనా వ్యాధి వున్న ఎరిక్స్ 13వ ఏట పూర్తిగా చూపు కోల్పోయాడు. “ప్రపంచం నువ్వు ఏడిస్తే మరింత ఏడిపిస్తుంది. తలయెత్తి నిలిచి పోరాడు. ప్రపంచం చప్పట్లు చరుస్తూ నీముందు తలవంచుతుంది” అన్న తల్లి ప్రోత్సాహంతో ట్రెక్కింగ్ నేర్చుకుని, చివరికి ఎవరెస్ట్ నధిరోహించి, ‘జీవితంలో అందరికీ అన్నీ వుండవు. లేని వాటిని తలుచుకుని కుంగిపోకూడదు. పరిమితులను ప్రతిబంధకాలుగా భావించకూడదు. వాటిని అవకాశాలుగా మార్చుకుని ఎదగాలి’ అని నిరూపించాడు.
14 ఏళ్ళ అన్నాకు చిన్నప్పటినుండి పక్షులపై ప్రేమ. రోజూ వాటికి గింజలు వేస్తుంది. ఒకరోజు అవి గింజలు తింటుంటే , తను డిస్టర్బ్ చేయడం ఎందుకని యిష్టంగా చూస్తూ ఉండిపోయింది. ఆ ఆలస్యం వల్లే , బాంబ్ దాడిలో ఆమె వెళ్ళాల్సిన కారు పేలిపోయి, ప్రాణాలతో బయటపడింది. చాలా పక్షులు చచ్చిపోయాయి. పక్షి వేటగాళ్ళని శిక్షించాలని రేడియో, టివిల్లో విస్తృత ప్రచారం చేసి , అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వందలమంది పక్షి వేటగాళ్ళకు చట్టపరంగా శిక్ష పడేటట్టు చేసి, దాదాపు నోబుల్ బహుమతితో సమానమైనదాన్ని పొందింది.
చివరగా, ఒక అద్భుతమైన, సార్ధకమైన కథ, సార్ధకమైన రచయిత కథ. తడి ఇసుకలో పూచిన పువ్వు అనే కథ. తన వృత్తిలో పూర్తిగ మునిగిపోయిన వ్యక్తికి భార్యాపిల్లలతో గడిపే సమయమే లేనంత పని ఒత్తిడి. కానీ తనని పిల్లలు ఎంతగా మిస్సవుతున్నారో వారి మాటలు వినడం తటస్థించి, నిస్సహాయంగా మథనపడతాడు. ఒక స్త్రీ 38 ఏళ్ళ క్రితం 10 రోజుల వయసులో మరణించిన కొడుకు తలుచుకుంటూ ఒక వృక్షం దగ్గర పూలు వుంచడం చూస్తాడు. తన బాల్యం, తల్లితండ్రులు గుర్తుకు వస్తారు. తన ఆవేదన నంతా ‘ది క్రిస్టమస్ బాక్స్’ అనే నవల రాస్తాడు. చెట్టుకు బదులు ఒక ‘బాలదేవదూత’ విగ్రహంగా రాస్తాడు. అది చదివి అతని తల్లీ తండ్రీ, భార్యాబిడ్డలే కాక పాఠకులందరూ విపరీతంగా స్పందించారు. ఎంతగా అంటే, ఆ బాలదేవదూత విగ్రహం ఎక్కడా అని వెదకసాగారట. చివరికి ఆ రచయితే విగ్రహాన్ని తయారు చేయించాడు. తమ దుఃఖాలన్నిటినీ దేవదూతకు విన్నవించుకోడానికి తండోపతండాలుగా జనం రాసారు. 17 భాషలలోకి అనువదింప పడింది ఈ నవల.
“రచయిత హృదయలోతుల స్పందన అక్షరరూపం ధరించినప్పుడు ఆ అక్షరాలకొక శక్తి వస్తుంది. అది పాఠకుల హృదయాలను స్పందింపజేస్తుంది. అటువంటి రచన చిరంజీవిగా నిలుస్తుంది. సమాజానికి మేలు చేస్తుంది” అంటారు మురళీకృష్ణ.
కన్నీరును పట్టుదలగా, నిరాశను విశ్వాసంగా మార్చకొని విజయశిఖరాల్ని అందుకున్న వ్యక్తుల నిజంగా జరిగిన జీవిత సంఘటనలివి. ప్రపంచంలో ఇంకా ఎందరో వున్నారు. కానీ డిప్రెషన్‌లో మునిగిపోయి, పరిస్థితులతో పోరాడలేక, జీవితంలో ఓడిపోయాం అని ‘భావించుకుని’ ఆత్మహత్యలు చేసుకునే వారినే టివి లలో పదేపదే చూపించడం వల్ల ‘మాస్ హిస్టీరియా’ ఏర్పడే అవకాశం వుంది.
మురళీకృష్ణగారు చేసిన ఈ ప్రయత్నం వృథా పోకూడదు. మానసిక వైద్యులు కేవలం పాఠ్యపుస్తకాలు చదవడం, బోధించడమే కాక, నిజ జీవితంలో విజేతలుగా నిలిచిన ఇలాంటి వారి గాథలను కూడ స్వీకరించాలి. పరీక్ష తప్పినా, ప్రేమ విఫలమైనా ఆత్మహత్య ఆలోచన వైపు వెళ్లకుండా నేటి యువతకు ‘వ్యక్తిత్వ వికాసం’ తరగతులు నిర్వహించాలి, ఇలాంటి పుస్తకాలు రిఫరెన్స్‌గా ఉంచాలి. మురళీకృష్ణ గారు ప్రతి కథ లోనూ ఒక మంచి కొటేషన్ మొదట్లోనో, చివరలోనో చెప్పారు. ఈ వ్యాసానికి అలాంటి ఒకదానితో ముగింపు…. “ రచన ద్వారా సమాజాన్ని మార్చడం రచయిత పని కాదు.సమాజంలో మార్పు బీజాలను నాటి, ఆలోచనల కొక దిశ నివ్వడం రచయిత బాధ్యత. సమాజంలోని ఆవేశాలను, ఆనందాలను, ఆశ నిరాశాలను తనలో దర్శించి, తన రచనలో అర్ధం చేసుకుంటాడు. అతని రచనలు పాఠకుల అంతరంగాలను స్పృశించి, మానవజీవితం లోని మార్మికతను వారి గ్రహింపుకు తెస్తాయి. వారి పెదవులపై చిరునవ్వు నిలుపుతాయి. వారి కంట కారే నీటిని తుడుస్తాయి.”
స్త్రీల పట్ల రచయితకు ఉన్న గౌరవం తెలియజేసేందుకు ఉదాహరణగా కొన్ని కథలు ఉన్నాయి. న్యాయం కోసం ఒంటరి పోరాటం చేసి చివరకు విజయం పొంది, తర్వాత తరాల వారికి తమ పేరనే చట్టాలు తీసుకొచ్చి, తమ వలే ఇంకెవ్వరూ కష్టనష్టాల పాలు కాకుండా, మేలు కలిగేలా చేసినవారున్నారు. అలాంటి ఒక మహిళామణి కేటి. అతి పెద్ద. బహుళజాతి చమురు సంస్ధతో తలబడింది. న్యాయం కోసం , చట్టాలలో ఏఏ మార్గాలు వున్నాయో వెదికి, చివరకు, 200 ఏళ్ళ నుండి మరుగున పడిన ‘ఎలియన్ టార్ట్ క్లెయిమ్స్’ అనే చట్టాన్ని వెలికితీసింది. దాంతో ఆ సంస్ధ రాజీకి వచ్చి, తమ వల్ల నష్టం కలిగిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి, గ్రామాల్లో పునరావాసం కల్పించేందుకు, పనిచేసేవారి పిల్లలకు విద్య ఆరోగ్య వసతులు కల్పించేందుకు అంగీకరించింది.
రెండో ప్రపంచయుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అకృత్యాలను, ప్రజల ముఖాల్లో ఉట్టిపడుతున్న దైన్యం, నిస్సహాయతను, మృగాలు సైతం సిగ్గుపడేంత క్రూరంగా జపాన్ సైనికులు కావించిన ఊచకోతను ధైర్యంగా ఒక నవలగా రాసింది రచయిత్రి ఇయాన్. దేశాలు పర్యటించి సామాన్య ప్రజలకు అవగాహన కలిగించింది.
21 ఏళ్ళ టెరిస్సా తమ స్ధలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న మాఫియాతో ధైర్యంగా తలపడింది. ఈ పోరాటంలో తండ్రి చనిపోయాడు. గొడవలు ఎందుకులే అని భయపడుతున్న సోదరున్ని కూడ చంపేసారు వాళ్ళు. పారిపోతున్న హంతకున్ని వెంటాడి పట్టుకుని చట్టానికి అప్పగించింది. తీగలాగితే మాఫియా డొంక కదిలింది. ఒక మహిళ ఆత్మశక్తితో మాఫియాను మట్టి కరిపించడంలో అసాధారణ సాహసాన్ని ప్రదర్శించినందుకు కోర్టు ప్రశంసించింది.
అలిసన్ అనే 27 ఏళ్ళ యువతిపై క్రూరంగా శారీరక దాడి జరిగింది. చీకటి పొదల్లో తనపై భయంకరంగా జరుగుతున్న అత్యాచారం, తరువాత విచక్షణా రహితంగా కత్తిపోట్లు , చచ్చిపోయే పరిస్థతి. “భయాలన్నీ శరీరానికే. ఈ శరీరం లోపల మరో సజీవశక్తి వుంది. మనం పైపై శరీరాన్ని చూసి భ్రమపడతాం. కానీ లోపలి సజీవశక్తిని గుర్తిస్తే మనకు భయం లేదు. కోపం లేదు. ద్వేషం లేదు. నిరాశా నిస్పృహలు దరిదాపులకు రావు. అనంతమైన ప్రశాంత ఆనందసాగరం మనలోన వుంది” అని తనకు తనే కౌన్సిలింగ్ ఇచ్చుకుంది. వాళ్ళు పిల్చుకోవడంతో పేర్లు విని గుర్తు పెట్టుకుంది. హాస్పిటల్‌లో డాక్టర్లే ఆశ్చర్యపోయారు 25 పైగా వున్న కత్తిపోట్లు చూసి. 15 రోజుల్లో కోలుకొని కోర్టులో కేసు వేసి, వారికి యావజ్జీవశిక్ష పడేలా చేసింది.
ఒక ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుని ధైర్యం, సమయస్ఫూర్తి, వృత్తి పట్ల అంకిత భావం తెలుస్తుంది పడగవిప్పిన తుపాకి కథలో. తన పాఠశాలలోకి తుపాకితో ప్రవేశించి, ఒక తరగతి గదిలో దాదాపు 12 మందిని బందీలుగా వుంచి బెదిరిస్తున్న 18 ఏళ్ళ కుర్రాడిని చూసి, టీచర్లు భయపడుతుంటే, తానొక్కడే గదిలోకి ప్రవేశించాడు హెడ్ మాస్టారు. పోలీసులు వచ్చే లోగా అతన్ని మాటల్లో పెట్టి, మానసికంగా అతన్ని అయోమయానికి గురిచేసి, పోలీసులకు పట్టించి తన స్టూడెంట్స్‌ని రక్షించుకున్న ఉత్తమ ఉపాద్యాయుడాయన.
నేపాలీ అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేసిన వారిని పోలీసులకు పట్టించి, నిస్సహాయులైన ఆ అమ్మాయిల కోసం ‘మైత్రీ నేపాల్ సంస్ధ’ ఏర్పరచి, వందల మందికి ఆశ్రయం కల్పించిన అనూరాధ కోయిరాల ధైర్యానికి ప్రతీక.
సినిమాల్లో అవకాశాలు రాలేదని, సినీ ఫంక్షన్లకి ఆహ్వానం రాలేదని, అనుకున్న గుర్తింపు రాలేదని బలవన్మరణానికి పాలుపడే నేటి యువతకు స్ఫూర్తి నిచ్చే వాస్తవగాథలివి.
ఆశావహదృక్పధాన్ని కలిగించే ఇటువంటి వాస్తవగాథలను పాఠకుల కందించి స్ఫూర్తి నందించిన మురళీకృష్ణ గారు ప్రశంసనీయులు.
***
రచన: కస్తూరి మురళీకృష్ణ,
ప్రచురణ: ఎమెస్కో బుక్స్,
పేజీలు: 296, వెల: ₹ 60/-
ప్రతులకు: ఎమెస్కో బుక్స్,
1-2-7, భానూ కాలనీ,
గగన్ మహల్ రోడ్, దోమలగుడా,
హైదరాబాద్ 500029
ఫోన్: 040-23264028