రికార్డుల రారాణి సురయ్యా

11
2

[dropcap]జూ[/dropcap]న్ 15 సురయ్యా జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

భారతీయ హిందీ సినిమా స్వర్ణయుగంలో బాలనటి, నటి, నటగాయని, నేపథ్యగాయని సంగీత దర్శకురాలు, సినిమా నిర్మాత్రిగా; నవరసాల-నటన, నర్తనను ప్రదర్శించిన గొప్పనాయికగా, అత్యధిక పారితోషికాన్ని తీసుకుని రికార్డు సృష్టించిన నటశిరోమణిగా, విఫల ప్రేమికురాలై అవివాహతగా మిగిలిన మహిళ సురయ్యా!

వీరు 1929 జూన్ 15 వ తేదీన అవిభక్త భారతదేశం (నేటి పాకిస్థాన్) లోని కరాచీ ప్రాంతం (సింధ్ రాష్ట్రం) ‘గుజ్రాన్ వాలా’ లో జన్మించారు. వీరి అసలు పేరు జమాల్ షేక్. తల్లిదండ్రులు ముంతాజ్ షేక్, అజీజ్ జమాల్ షేక్‌లు. వీరికి సంవత్సరం వయసులోనే బొంబాయికి వచ్చారు వీరి కుటుంబీకులు.

ఫోర్ట్ బొంబాయిలోని జె.బి. పెటిట్ బాలికోన్నత పాఠశాలలో చదివారు. ఇంటి దగ్గర పర్షియన్ భాషను చదివారు. ‘ఖురాన్’ను వల్లె వేశారు. ఆరేళ్ళ వయసులో ఆకాశవాణిలో పాటలు పాడారు. అపుడక్కడ సంగీత దర్శకులు నౌషాద్, కథానాయకుడు రాజ్ కపూర్ మొదలయిన వారు ఉన్నారు.

వీరి మేనమామ యం. జవార్ సినిమాలలో విలన్ పాత్రలను ధరిస్తున్నారు. ఆయన వెంట సినిమా షూటింగ్‌కి వెళ్ళేవారామె. ఇలా వెళ్ళిన సమయంలో దర్శకులు, సంగీత దర్శకుల దృష్టిలో పడ్డారు.

1937 లో ‘ఉస్నే క్యా సోచా’ చిత్రంలో బాలనటిగా ప్రవేశించారు. జగ్గన్ బాయి దర్శకత్వంలో ‘మేడమ్ ఫ్యాషన్’ చిత్రంలో బాలనటిగా నటించారు. ‘తాజ్ మహల్’ చిత్రంలో బాల ముంతాజ్ మహల్‌గా నటించారు. తమన్నా, స్టేషన్ మాస్టర్ చిత్రాలలోనూ బాలనటిగా కన్పించారు.

ప్రముఖనటి, నిర్మాత దేవికారాణి స్వంత చిత్రం ‘హమారీ బాత్’లో నటించారు. నెలకు 500 రూపాయలు పారితోషికంతో 5 సంవత్సరాల కోసం దేవికారాణి ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత సురయ్యకు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. దేవికారాణి పెద్ద (మంచి) మనసుతో సురయ్య ఒప్పందాన్ని రద్దుచేశారు.

1947లో దేశవిభజన తరువాత ప్రముఖనటీ మణులు నూర్జహాన్, ఖుర్షీద్ బానోలు పాకిస్థాన్ తరలి వెళ్ళారు. ఆ తరువాత సురయ్యకు సినిమా అవకాశాలు పెరిగాయి.

ఆతరువాత వరుసగా యతీమ్, తద్బీర్, ఫూల్, ఒమర్ ఖయ్యం, జగబిటి, అన్‌మోల్ ఘడీ, నాతక్, దిల్, దర్ద్, డాక్ బంగ్లా, భక్తి, శక్తి, గజ్రే, విద్య, రంగ్ మహల్, ప్యార్ కీ జీత్, షేర్, నాచ్, జీత్, షాయర్, లేఖ్, బడీ బెహెన్, దిల్లగీ, దునియా, అమర్ కహానీ, నిలి, షాన్, ఖిలాడి, అఫ్సర్, రాజ్‌పుత్, సనమ్, మోతీమహల్, లాల్ కున్వర్, ఖూబ్‌సూరత్, దీవానా, షామా, పర్వానా, వారిస్, మిర్జాగాలిబ్, బిల్వామంగల్, కాంచన్, మిస్టర్ లంబు, ట్రాలీడ్రైవర్, మాలిక్, రుస్తోమ్ సోహ్రాబ్ మొదతయిన సినిమాలను నటనతో సుసంపన్నం చేశారు.

అన్‌మోల్ ఘడీ 25 వారాలు ఆడి రికార్డును నెలకొల్పింది. స్వర్ణయుగపు హిందీ సినిమా నటీనటులు కె.యల్. సైగల్, పృథ్వీరాజ్ కపూర్, దేవానంద్, షమ్మీకపూర్, రాజ్ కపూర్, నూర్జహాన్. ఖుర్షీద్ బానో వంటి వారి సరసన నటించారు.

దేవానంద్ సరసన విద్యా, జీత్, షేర్, అఫ్సర్, నిలి, దోసితారే, సనమ్ వంటి సినిమాలలో నటించి, జీవించారు.

విద్య సినిమా షూటింగ్ సమయంలో పడవలో ఉన్న సురయ్యా నదిలో మునిగిపోయారు. దేవానంద్ తన ప్రాణాలొడ్డి వారిని రక్షించారు. అప్పటి నుండి పరస్పరం ప్రేమలో పడ్డారు, అయితే వీరి ప్రేమ ఫలించలేదు. సురయ్యా అమ్మమ్మ మతదురహంకారంతో అంగీకరించకపోగా – దేవానంద్‌ని చంపుతామని బెదిరించారు. ఆయన ప్రాణరక్షణ కోసం సురయ్యా తన ప్రేమను త్యాగం చేశారు! జీవితాంతం అవివాహితగా మిగిలారు.

వీరు గాయని, నటగాయని, నేపథ్యగాయని కూడా! సుమారు 338 పాటలను అద్భుతంగా, అలవోకగా ఆలపించారు. 1942లో ‘నయీదునియా’ లోని ‘భూల్ కరూఁ మై పోలిష్ బాబు’ పాట వీరికి నేపథ్యగాయనిగా తొలిపాట. శారద, కానూన్, సంజోగ్ సినిమాలలో నటీమణి ‘మెహతాబ్’ కోసం పాటలు పాడారు. సురయ్యా తనకు స్వరదానం చేయడం తొలిరోజుల్లో మెహతాబ్‌కు నచ్చలేదు. అయితే తరువాత సురయ్యానే పాడాలని ఆకాంక్షించారు.

కానూన్ సినిమాలో “ ఏక్ తూ హో, ఏక్ మై హూన్’ పాటను ఆలపించారు. భారతీయ సినిమాలో ‘లాటిన్ అమెరికన్ సంగీత లక్షణాల’ తో కూడిన తొలి పాటగా ఇది రికార్డ్ సృష్టించింది.

‘తద్బీర్’ సినిమాలో ‘రాణి ఖోల్ దేదావార్ మిల్‌నే కా దిన్ ఆగయా’! పాటను శ్రీ కె.యల్.సైగల్ తో కలసి ఆలపించారు.

‘హమారీబాత్’ సినిమా లోని “బిస్తార్ బిచా దియా హై తేరే ఘర్ కే సామ్నే” బాగా ప్రాచుర్యం పొందిన పాట.

ప్యార్ కీ జీత్ సినిమా లోని ‘ఓ దూర్ జానేవాలే, వాదా నా భూల్ జానా’ పాట అఖండ భారతమంతా మారు మ్రోగి సూపర్ డూపర్ హిట్టయింది.

వీరు సినిమాలలో నవరసాలను పోషించారు. తన అద్వితీయ అపూర్వ, అద్భుత నటనతో సినిమాలను సుసంపన్నం చేశారు. ముస్లిం ఫ్యూడల్ శైలి, నటన వీరి సొంతం.

నాట్యాభినయానికి వస్తే భారతీయ శాస్త్రీయశైలి, పాశ్చాత్య శైలి, మొఘలాయిశైలి, తేలికపాటి గజల్స్‌కు అద్భుతమైన, అనిర్వచనీయమైన, అద్వితీయమైన నర్తనతో సినిమాలను అజరామరం చేశారు.

వీరి సినిమాలను గమనిస్తే ప్యార్ కీ జీత్, బడీ బహెన్, దిల్లగి సినిమాలు ఆ రోజుల్లో బాక్సాఫీసును బద్దలు కొట్టాయి. మిర్జాగాలీబ్ సినిమా సూపర్ హిట్ అవడమేకాదు. రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రశంసలను అందుకుంది.

వీరి సినిమాలు విడుదలయిన మొదటి రోజు మొదట ప్రదర్శన చూడడం కోసం ప్రజలు మక్కువతో ఆసక్తి చూపేవారు. ఆ సమయంలో పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసులు, షాపులు తదితరాలన్నీ మూసేసేవారట. ఇంత కంటే ఏ ఆధారం కావాలి వారి ప్రజాదరణను అంచనా వేయడానికి.

ఆ రోజుల్లో పుచ్చకాయలు అమె పళ్ళవ్యాపారులు వారి వ్యాపారం పెంచుకోవడం కోసం ఈ విధంగా నినాదమిచ్చేవారట. ఈ పుచ్చకాయలు ఎంత తీయగా ఉంటాయంటే మన సురయ్యా గారి పాటలంత తీయగా ఉంటాయని. ఆమె స్వర మాధుర్యానికి ఇంత కంటే ఉదాహరణ ఏం కావాలి? హిందీ సినిమా రంగంలో వీరికి చాల ప్రత్యేక స్థానం లభించింది.

1951లో ఫిల్మ్ న్యూస్ పత్రిక ‘స్క్రీన్’ తొలి సంచికలో వీరి ఫోటోకి స్థానం లభించింది. దీని ద్వారా నటీమణిగా సురయ్యా స్థానం అందరికీ తెలిసింది.

1954లో 2వ జాతీయ చలన చిత్రోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో వీరు నటించిన ‘మిర్జాగాలిబ్’ సినిమాకు ఉత్తమ చలన చిత్ర పురస్కారం లభించింది. బంగారు పతకం లభించింది.

ఈ సినిమా ద్వారా “మీరు గాలిబ్ యొక్క ఆత్మను తిరిగి జీవానికి తీసుకువచ్చారు” అని అప్పటి ప్రధాని స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూ ప్రశంసించారు.

1998 డిశంబర్‌లో ఢిల్లీలో ‘మిర్జాగాలిబ్ ద్విశతాబ్ది ఉత్సావాలు’ జరిగాయి. ఈ సందర్భంలో ‘మిర్జాగాలిబ్’ సినిమాలోని సురయ్యా పాడిన పాటలు, నటనలను గుర్తు చేసుకున్నారు. వీటి ద్వారా గాలిబ్ గొప్పతనాన్ని శాశ్వతం చేసినందుకు వీరిని ప్రత్యేకంగా సత్కరించి గౌరవించారు.

1996లో స్క్రీన్ పత్రిక వారు సురయ్యాకు (లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్) జీవన సాఫల్య పురస్కారాన్నిఅందించారు.

1956లో భారత ప్రభుత్వం సినిమా ప్రతినిధుల బృందాన్ని రష్యాదేశానికి పంపించింది. ఈ బృందంలో రాజ్ కపూర్, నర్గీస్, కామినీ కౌశల్‌తో పాటు వీరికీ స్థానం కల్పించి గౌరవించారు.

2003 ఏప్రిల్ 30వ తేదీన దాదాసాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ఫాల్కే అకాడమి వారు, స్క్రీన్ వరల్డ్ పబ్లికేషన్ వారు వీరిని సత్కరించారు.

1946 – 1951 మధ్యలో అత్యధిక పారితోషికం రూ 40,000 లు తీసుకున్న నటిగా వీరు రికార్డు సృష్టించారు.

2004 జనవరి 31 వ తేదీన వృద్ధాప్య బాధలు హైపోగ్లైసీమియా, ఇస్కేమియా, ఇన్సులినోమా వంటి వాటితో బాధపడుతూ ముంబైలోని హర్కిషాందాస్ హాస్పటల్‌లో మరణించారు.

వీరిని ప్రేక్షకాభిమానులు ‘మాలికా-ఎ- హుస్న్’ (అందాల రాణి), ‘మాలికా-ఎ- తారాన్నం’ (శ్రావ్యత రాణి), ‘మాలికా-ఎ- అదకారి’ (నటన యొక్కరాణి) అని అభిమానంగా ప్రశంసిస్తూ ఆనందించేవారు.

వీరి జ్ఞాపకార్థం 2003 మే 13 వ తేదీన భారతీయ సినిమా 100 సంవత్సరాల సందర్భంగా 5 రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

వీరి జయంతి జూన్ 15 వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here