రెడ్ హ్యాండెడ్-1

16
2

[శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన ‘రెడ్ హ్యాండెడ్’ అనే పెద్ద కథని పాఠకులకి అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

కేబిన్ తలుపు తోసుకుని లోనికి అడుగు పెట్టి “గుడ్ మార్నింగ్ సార్” అని నవ్వాడు మహి.

“వెరీ గుడ్ మార్నింగ్ మహీధర్, ఈ రోజు ముఖ్యమైన పెద్ద అకౌంట్ గురించి మాట్లాడాలి. కూర్చోండి” అని చెప్పాడు కంపెనీ డైరెక్టర్ రాజ్.

“చెప్పండి సార్?” అని కూర్చున్నాడు మహి.

సీఎ పూర్తి చేసి ఆర్బిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు మహి.

“మన కంపెనీలో అతి పెద్ద కస్టమర్ మిస్ మేఘన. ఆవిడ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో చాలా పెద్దది. ప్రతి నెలా ఆవిడ డబ్బులను మనం ఎలా, ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నామో, ఎంత లాభం చేకూరుస్తున్నామో ఆవిడ గమనిస్తూ ఉంటుంది. ఏ ఒక్క నెలలో మనం లాభాలు చూపెట్టక పోతే మన దగ్గరనుండీ, నిర్దాక్షిణ్యంగా కోట్ల రూపాయలు తీసేసి వేరే కంపెనీకి మారిపోతుంది. అప్పటి వరకూ ఎంత లాభం చూపెట్టామన్నది ఆవిడ పట్టించుకోదు. కాబట్టి ఈ ఖాతా చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకే అది మీకు అప్పచెప్తున్నాను.” అని చెప్పటం ఆపాడు డైరెక్టర్.

“ఇన్ని రోజులూ ఎవరు చూసారీ అకౌంట్?” అడిగాడు మహి.

“ఆవిడతో బాధలు పడలేక వెళ్ళిపోయాడు. ఆ సంగతి వదిలేద్దాం” అని టాపిక్ మార్చాడు డైరెక్టర్.

“ఓకే సర్, నేను చూస్తాను.” అన్నాడు మహి.

“జాగ్రత్త.. చాలా భయంకరంగా తెలివైన అమ్మాయి. ఒంటరి!.. ఇంకా పెళ్లి కాలేదు. నాన్నగారు చనిపోవటంతో ఆ కోట్ల ఆస్తి, బంగళాలు, ఫ్యాక్టరీలలో భాగస్వామ్యం, అన్నీ ఈవిడ స్వంతమయ్యాయి.” అన్నాడు డైరెక్టర్.

అది వినగానే మహి కళ్ళలో మెరిసిన మెరుపులు కనిపెట్టి నవ్వాడు డైరెక్టర్.

“చాలా కష్టమైన వ్యక్తి. ఆవిడను చూస్తే అర్థం అవుతుంది మీకు” అన్నాడు డైరెక్టర్.

“ఎందుకు?” కాస్త అనుమానంగా అడిగాడు మహి.

“ఈ రోజు ఆవిడ ఇక్కడికే వస్తుంది, చూద్దురుగానీ” అని విచిత్రంగా నవ్వి “జాగ్రత్తగా హేండిల్ చేయాలి సుమా, చాలా పెద్ద కస్టమర్. ఆవిడ పోయిందంటే మీ ఉద్యోగం ఇబ్బందుల్లో పడుతుంది.” అన్నాడు. ఇంక నువ్వెళ్లొచ్చు అన్నట్లుగా డైరెక్టర్ మొహంలో నవ్వు మాయమైపోయింది. తన టేబుల్ మీదున్న పేపర్లు సర్దుకోసాగాడు.

ఆ సంభాషణ ఆపి లేచి వెళ్లి తన టేబుల్ వద్ద కూర్చొని మేఘన  ఇన్వెస్ట్‌మెంట్స్ వాటి రాబడి, లెక్కలు చూడటంలో నిమగ్నమైపోయాడు. మేఘన ఆస్తి, పెట్టుబడుల వివరాలు అతని మస్తిష్కం నిండా నిండిపోయాయి.

దాదాపు రెండు గంటల వరకూ చూస్తూ తీక్షణంగా ఆలోచించసాగాడు. ఇంతకు ముందు వరకూ ఈ ఖాతా చూస్తున్న మేనేజర్ ఎందుకు వెళ్ళిపోయాడు! అని అనుమానం వచ్చిందతనికి. ఆ వెంటనే పక్క కేబిన్ అసిస్టెంట్ మేనేజర్‌కు ఫోన్ చేసి “హలో.. ఇంతకు ముందు నా సెక్షన్ చూసే మేనేజర్ ఎటెళ్ళారు?” అడిగాడు.

“వెళ్లడమేంటి సార్, ఆయనను ఎవరో చంపేశారు” అన్నాడు.

అది వినగానే మహి ఆశ్చర్యపోయి “ఎందుకని? ఎవరు చంపేశారు?” ప్రశ్న మీద ప్రశ్న వేసాడు.

“రాత్రి సమయంలో ఇంటికెళ్ళే దారిలో ఎవరో వెనక నుండీ తల మీద కొడితే, రోడ్ పక్కన పడి చనిపోయాడు. ఎవరు చంపారో ఇప్పటికీ దొరకలేదు.” అని చెప్పటం ఆపాడు.

“పోలీసులు తలచుకుంటే అదెంత” అన్నాడు మహి.

“మిస్ మేఘన ఆస్తి తగాదాలల్లో అతను తల ఎక్కువగా దూర్చినందుకే ఏదో జరిగింది అంటారు, కానీ నిజం బయటకు రాలేదు.” అన్నాడు అసిస్టెంట్ మేనేజర్.

“మరి నాకు వేరే రకంగా చెప్పారెందుకని!” అన్నాడు మహి అనుమానంగా.

“తెలీదు సర్”

ఆ జవాబు విని ఫోన్ పెట్టేసాడు మహి.

మర్డర్‌కు కారణం మేఘన ఆస్తి విషయాలు అని వినగానే మహిలో ప్రమాద ఘంటికలు మ్రోగసాగాయి. మనసుని భయం ఆవహించింది. కానీ స్వాభావికంగా మొండివాడు కావడంతో దాన్ని తోసిపుచ్చి మేఘన ఫైల్ చేతుల్లోకి తీసుకున్నాడు.

అయితే అదే అతను చేసిన భయంకరమైన పొరపాటు.

మధ్యాహ్నం  కంప్యూటర్ ముందు పనిచేసుకుంటుండగా, మూడు గంటల సమయంలో తన ముందు ఎవరో నిలబడ్డట్లుగా అనిపించి తలెత్తి ఆ వ్యక్తిని తలెత్తి చూసాడు.

తెల్లగా పాలిపోయిన చర్మంతో ఎముకల గూడు లాంటి శరీరంతో నిలబడి “సారీ టు డిస్టర్బ్. నా పేరు మేఘన. డైరెక్టర్ గారు మిమ్మల్ని కలవమన్నారు” అంది ఆ యువతి. ఆవిడ మొహంలో ఎక్కడా సౌమ్యత కనపడటం లేదు.

ఆ పేరు వినగానే చటుక్కున లేచి నిలబడి “గుడ్ ఆఫ్టర్‍నూన్ మేఘన గారు, కూర్చోండి.” అని మర్యాదగా ఎదురుగా వుండే కుర్చీ చూపించాడు మహి.

అతని కళ్ళ లోకి తీక్షణంగా చూస్తూ మెల్లిగా కూర్చుంది మేఘన.

మేఘన వేపు ఒకసారి తేరిపారా చూసాడు మహి. ఆ వయసులో ఆడవారికి వుండే అందం మచ్చుకయినా కనపడలేదు. ఆమె గురించి చెప్పిన డైరెక్టర్ ఎందుకు నవ్వాడో అర్థం అయ్యింది మహికి.

“ఈ రోజు ఉదయమే మీ పోర్ట్‌ఫోలియా చూసానండి. చాలా వరకూ మీ ఆదాయం పెరగకుండా మూడు సంవత్సరాల నుండీ అక్కడే ఆగిపోయి వుంది. ముఖ్యంగా మీ షాపింగ్ కాంప్లెక్సుల ఆదాయం ఈ రోజులకు తగినట్లుగా లేదు. షేర్ మార్కెట్ పెట్టుబడులలో కూడా మార్పులు చేయాలి” అన్నాడు చిరునవ్వుతో.

సమాధానం చెప్పకుండా మహి కేసి అలాగే చూసింది. ఆమె కళ్ళలో అతనికి ఎలాంటి భావం కనపడకుండా, నిర్జీవంగా అనిపించాయి.

“సరే.. ప్రస్తుతం మీరేం చేయదలచుకున్నారో చెప్పండి” అంది నిర్లిప్తంగా మొహం పెట్టి.

నవ్వు మొహం పెట్టడం ఇక అనవసరం అనుకుని “వారం లోగా మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాను మేడం” అన్నాడు చేతులు రెండూ కట్టుకుని.

కట్టుకున్న ఆ చేతులని ఒక క్షణం గమనించి చూసి, డిఫెన్స్ లో పడ్డాడు అనుకుని “సరే ఆ రిపోర్ట్ పంపండి, లేదా అది తీసుకుని మా ఆఫీస్‌కు రండి” అని లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది మేఘన.

ఆమె వెళ్ళగానే జేబులోనుండీ రుమాలు తీసుకుని నుదుటన పట్టిన చెమట తడుచుకుని, ఏసీ చల్లదనాన్ని పెంచుకుని ‘ఓహ్ గట్టి పిండం. కోట్ల ఆస్తి, భర్తకి దారాదత్తం. ఎవడో ఆ అదృష్టవంతుడు’ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

‘తెలివైన వాడే పర్లేదు’ అనుకుని కార్ స్టార్ట్ కాగానే వెనక్కి వాలింది మేఘన.

***

మరుసటి రోజు డైరెక్టర్ ముందు కూర్చుని మేఘన అకౌంట్ వ్యవహారాలు చర్చించసాగాడు మహీధర్.

“మీరు చెప్పిందంతా బాగుంది మహీధర్, కానీ మనం షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారంలో తల దూర్చకపోతే మంచిది.” అన్నాడు ఇబ్బందిగా సీట్లో కదులుతూ.

“ఎవరైనా మర్డర్ చేస్తారా?’’ అని డైరెక్టర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు.

ఆ మాట వినగానే, కళ్ళెగరేసి “మీకు తెలుసుగా ఇక నే చెప్పేదేముంది. అయినా ఇందులో మనం ప్రొఫెషనల్‌గా పని చేసుకోవాలి. అదే బెటర్ మనందరికీ” అన్నాడు మాటలను జాగ్రత్తగా ఉచ్చరిస్తూ.

“మనం పూర్తిగా తల దూరిస్తేనే గానీ ఏదైనా గొప్ప మార్పు చూపించగలం. లేదంటే ఎప్పటిలా ఏదో లాభం చూపిస్తూ సమయం గడుపుతూ, మన ఫీజు సంపాదించుకోవటమే.” అన్నాడు మహి.

మహి వంక నిరాసక్తతో చూసి “మీ ఇష్టం. జాగ్రత్త” హెచ్చరిక ధ్వనించేలా అని భుజాలెగరేసి చేతుల్లోకి మరో ఫైల్ తీసుకున్నాడు.

“నేనొకసారి ఆవిడ ప్రాపర్టీస్ అన్నింటినీ చూసొస్తాను” అని లేచాడు.

“జాగ్రత్త, మొదలే అది పాతబస్తీ. పోలీసులు, లా అండ్ ఆర్డర్ లాంటివి మీకు సపోర్ట్ చేయవు.” అని చెప్పి చేతిలో ఫైల్ చదవసాగాడు డైరెక్టర్ రాజ్.

***

కార్ దిగి షాపింగ్ కాంప్లెక్స్ పైన కనపడుతున్న పేరు చదివాడు ‘మేఘన హైట్స్’.

‘చాల పెద్ద కాంప్లెక్స్’ అనుకుంటూ చుట్టూ చూసాడు. పేవ్‌మెంట్ మీద చిన్న చిన్న దుకాణాలు. రోడ్ సగం ఆటోలు, బండ్లతో నిండిపోయి వుంది. కార్లు, వాహనాలతో రోడ్ కిటకిటలాడుతూ వుంది. కాంప్లెక్స్‌లో కనపడుతున్న దుకాణాలన్నీ జనాలతో నిండి పోయి కనపడుతూ వున్నాయి.

ఫైల్ తీసి చూసాడు. ఇందులో అరవై దుకాణాల అద్దె మొత్తంగా కలిపి నెలకు పన్నెండు లక్షలు వస్తున్నాయి. కాంప్లెక్స్ మేనేజర్ పేరు చూసాడు. ‘రహీం ఖాన్’ అని కనపడింది. మెట్లెక్కి ముందుగా కనపడిన సెక్యూరిటీ వ్యక్తి దగ్గరకు వెళ్లి “రహీం ఖాన్‌ను ఎక్కడ కలవాలి?” అని అడిగాడు మహి.

ఆ పేరు విన్న మరుక్షణం అతను వంగి చాలా మర్యాదతో నమస్కారం పెట్టి, వరండాలో కాస్త దూరం నడిపించి, ఒక గది ముందు ఆగి “ఇదే సర్” అని వెళ్ళిపోయాడు.

గది బయట తలుపుకు అడ్డంగా ముగ్గురు వ్యక్తులు నిలబడి మాట్లాడుకోవటం చూసి “రహీం ఖాన్‍ను కలవాలి” అన్నాడు.

“మీరెవరు, ఏం పని” అడిగాడొక వ్యక్తి. అతని గొంతు గరగర లాడుతూ, ఇనప డబ్బాలో రాళ్ళేసి కదిలించినట్లుగా వుంది.

సమాధానం చెప్పాడు మహి. అది విని లోకెళ్ళిన ఆ వ్యక్తి, కాసేపటిలో బయటకొచ్చి “వెళ్ళండి” అంటూ లోనికి దారి చూపించాడు.

లోనికి అడుగు పెట్టిన మహీధర్‍కి వెంటనే ఆల్కహాల్, సిగరెట్ల వాసన ఘాటుగా ముక్కుకు తగిలింది. లోపల ఎదురుగా వున్న పెద్ద టేబుల్ వెనక గడ్డపు వ్యక్తి కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. అతని పక్కన నలుగురు బలిష్ఠులైన వ్యక్తులు నిలబడి మహీ వేపు చూడసాగారు. ఫోన్ మాట్లాడుతున్న రహీం ఖాన్ మహిని చూసి, కుర్చీ వేపు చూపించి కూర్చోమని సైగ చేసి ఫోన్ మాట్లాడసాగాడు. ఆ సంభాషణ ఇరవై నిముషాలు కొనసాగింది. వాచీ చూసుకున్నాడు మహి. ఫోన్ పెట్టేసి పక్కనున్న వ్యక్తులను దగ్గరగా పిలిచి ఏదో చెప్పి బయటకి పంపించాడు రహీం ఖాన్.

అతన్ని సునిశితంగా చూసాడు మహి. చాలా మొరటుగా కనపడుతున్నా, మంచి బట్టలు, వాచీ, వేళ్ళకు అన్నింటికీ బంగారు ఉంగరాలు, మెడలో లావాటి చైన్ వేసుకుని ఖరీదైన వ్యక్తిలాగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు అనుకుని “గుడ్ మార్నింగ్ రహీం గారు” అని తన విజిటింగ్ కార్డు అతని చేతికిచ్చాడు మహి.

దాన్నొక సారి చూసి పక్కన పెట్టి “చెప్పండి, ఏం కావాలి?” అన్నాడు రహీం, ఏ మాత్రం నవ్వకుండా.

“మేఘన ప్రాపర్టీస్‌కి కొత్తగా మేనేజర్ గా వచ్చాను.” అని చెప్పి రహీం మొహం వంక చూసాడు.

“తెలుసు.. రఘు, అదే మీకంటే ముందు పని చేసే అతను ఏమయ్యాడో తెలుసుగా” అన్నాడు రహీం. అతడి మాటలో బెదిరింపు కదలాడింది.

“మరేం పర్లేదు. నాకు భార్య పిల్లలు లేరు. ఒంటరి వాడిని. నాకు భయం లేదు.” కన్నార్పకుండా చూస్తూ అన్నాడు మహి.

“మీకేం కావాలి, ఎందుకొచ్చారు.” అడిగాడు.

“ఇక్కడ షాప్స్ అన్నీ మీ మనుషులవే, నాలుగు సంవత్సరాలనుండీ అద్దెలు పెంచటం లేదు. సంవత్సరం నుండీ మీరు అద్దెలు కట్టటం లేదు.” అన్నాడు మహి కాస్త స్వరం పెంచి.

“అవును, ఇవ్వను, ఏం చేస్తావు. పోలీసులు కూడా నన్నేమీ చేయలేరు. నా మీద నాలుగు మర్డర్ కేసులున్నాయి, బహుశా నీకు తెలీదనుకుంటాను.” అన్నాడు కుర్చీలో వెనక్కి వాలి, చేతులు పైకి పెట్టి.

“మీరంటే ఏ మాత్రం పడని పెద్ద కుస్తీ వీరుడు, అదే పహిల్వాన్ దగ్గరికి వెళ్తాను.’’ అన్నాడు మహి, ఆవలిస్తూ.

వెంటనే చేతులు కిందకు పెట్టి, “ఇలాగే నీ ఆఫీసులో రఘురాం కూడా ఏదో చేయబోయాడు. అతనికేం జరిగిందో తెలుసుగా” అన్నాడు రహీం.

“అతని సంగతి అనవసరం, నేనన్నిటికీ తెగించే వున్నాను. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టించి నీ ప్రాబ్లెమ్ లేకుండా చేసుకునే పద్ధతి కూడా నాకు తెలుసు. నీ అడ్డం తొలగించుకోవటానికి మా మేడం దగ్గర డబ్బులకేం కొదవ లేదు. పోనీ.. అది తెలుసుగా. ఆమెకు నేను నచ్చ చెప్పి అన్నీ చేయించగలను, అంత వరకూ వస్తే నీకే మంచిది కాదు. తెగే వరకూ లాగేంత అమాయకుడివి కాదని అనుకుంటాను” అన్నాడు మహి.

పెదాల మధ్య సిగరెట్ పెట్టుకుని, లైటర్‍తో అంటించి, బంగారు రంగులో మెరుస్తున్న ఆ లైటర్ టేబుల్ మీద పెట్టి గుండెల నిండా పొగ పీల్చి వదుల్తూ “నా దగ్గరకొచ్చి నన్నే బెదిరిస్తున్నావా?” అని అడిగాడు రహీం.

“నేను చాలా సింపుల్‍గా అసలు విషయం చెప్తున్నా. ఇక నీ ఇష్టం” అని వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు మహి.

“అన్నా వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడే” అన్నాడు అప్పుడే వచ్చి వెనకాల నిల్చున్న రంగా

రంగా వేపు మాట్లాడొద్దని సైగ చేసి “నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఇక లేచి వెళ్ళు” అన్నాడు రహీం కరకుగా.

లేచి నిలబడి రంగాను సీరియస్‍గా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు మహి.

“భయ్యా వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి.” అన్నాడు రంగా.

***

వారం తర్వాత ఒక రాత్రి పెద్ద చప్పుడు రావటంతో ఉలిక్కి పడి నిద్ర లేచాడు మహి. లేచి బెడ్ పక్కనున్న లైట్ వేసాడు. కిటికీ అద్దాలు పగిలి పోయి గది నిండా నేల మీద పరుచుకుని వున్నాయి. వాటితో బాటు ఒక పెద్ద రాయి కూడా పడి వుంది. చటుక్కున లేచి కిటికీ బయటకు చూసాడు. ఇంటి గేటుకి కాస్త దూరంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ మీద కూర్చుని మహి వేపు చూస్తున్నారు.

మహిని చూడగానే వాళ్ళు చేతులూపుతూ వెళ్లిపోయారు. అందులో వెనక కూర్చున్న వ్యక్తిని చూసి ఆలోచనల్లో పడ్డాడు మహి.

ఎక్కడ చూసాను వీడిని? ఎక్కడా అని ఆలోచిస్తుండగా గుర్తొచ్చిందతడికి, అతను రహీం ఖాన్ పక్కన నిలబడ్డ వ్యక్తి అని.

తనకు బెదిరింపులు మొదలయ్యాయి అని అర్థం అయి కోపంతో మహి శరీరం వేడెక్కింది. కోపాన్ని అదుపు చేసుకుని, ఇక ముందు ఏం చేయాలా? దెబ్బకు దెబ్బ కొట్టాలి. ఎలా? వాడికి కండ బలం ఎక్కువ. వాడిని డీ కొట్టడం అయ్యే పని కాదు. మరెలా? అని పడుకుని చాలాసేపు ఆలోచించాడు. మెల్లి మెల్లిగా అతని మనసులో ఒక ప్రణాళిక రూపు దిద్దుకోసాగింది. అది చేసే తీరాలి అని అనుకున్నాడు.

అతనిలో పునరాలోచన మొదలయ్యింది.. ఎవరి గురించో ఈ తలనెప్పి అవసరమా అనుకున్నాడు. అయినా సరే తప్పదు. వాడికి సమాధానం చెప్పాల్సిందే అని నిర్ణయించుకుని, కళ్ళు మూసుకుని దిండులో తల దూర్చాడు.

ఇది జరిగిన మూడవ రోజు అర్ధరాత్రి పహిల్వాన్ ఇంటి గేట్ ముందు కాస్త దూరంలో ఒక వ్యక్తి మోటార్ బైక్ మీద నుండీ దిగి గేట్ దగ్గరకొచ్చి చేతిలో పెట్రోల్ సీసాకున్న బట్టను అగ్గిపుల్లతో అంటించి ఆ సీసాను గేట్ లోపలున్న బెంజ్ కారు మీదకి విసిరి, వెంటనే పరిగెత్తి తన మోటార్ బైక్ ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు.

మండుతున్న ఆ సీసా కారు పక్కన పడి పేటెలమంటూ పగిలి అందులో నుండీ చిమ్మిన పెట్రోల్ భగ్గున అంటుకుని ఆ ఖరీదైన కారు ఆ మంటల్లో ఆహుతి కాసాగింది.

***

మరుసటి రోజు పహిల్వాన్ ఇల్లు, అతని స్నేహితులతో నిండి పోయింది. పెద్ద వరండాలో సోఫాలో గంభీరంగా కూర్చుని అందరితో మాట్లాడుతూ వున్నాడు పహిల్వాన్. అప్పుడే లోపలి కొచ్చిన ఒక గడ్డం వ్యక్తి పహిల్వాన్ దగ్గరగా వచ్చి పక్కన నిలబడ్డాడు.

 అతన్ని చూసి “చెప్పు అంజాద్” అని అన్నాడు పహిల్వాన్.

“గేట్ పక్కన చెట్టు మీద వుండే సీక్రెట్ కెమెరా లోని వీడియో మొత్తంగా తిరగేసాము. మోటార్ బైక్ మీదెవడో వచ్చి పెట్రోల్ బాంబు వేసి వెళ్ళాడు. బండి నెంబర్ కనపడింది, వేసిన వాడు మొహానికి గుడ్డ కట్టుకున్నాడు, వాడెవరో గుర్తుపట్టలేకుండా వుంది. అయితే బండి ఎవరిదో కాసేపటిలో తెలుస్తుంది.” అన్నాడు అంజాద్.

ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక చిన్న పేపర్‌ను అంజాద్ చేతిలో పెట్టాడు. అది చదివి “భయ్యా ఇది చూడు” అని పహిల్వాన్ చేతికి దాన్ని అందించాడు అంజాద్.

తన బలమైన చేయి సాచి దాన్ని తీసుకుని చదివి “వీడెవడు” అన్నాడు పహిల్వాన్.

“ఆ బండి నెంబర్ రంగా అని రహీం ఖాన్ మనిషిది. మనిషిని మాత్రం గుర్తు పట్టలేము వీడియోలో” అన్నాడు అంజాద్.

పిడికిళ్లు బిగించి కాసేపు ఆలోచించి అన్నాడు పహిల్వాన్ “ముందు ఆ రహీం గాడికి ఫోన్ కలుపు” అని అంజాద్ కేసి చూసాడు.

మొబైల్‌లో నెంబర్ కలిపి దాన్ని పహిల్వాన్ చేతికిచ్చాడు అంజాద్.

“హలో కౌన్?” అన్నాడు రహీం అటువైపు నుండీ.

“నేను.. రాత్రి నా ఇంటి మీద పెట్రో బాంబు వేసాడు నీ రంగా గాడు. ఇక నేనేం చేస్తానో చూడు” అన్నాడు పహిల్వాన్.

ఆ మాటతో ఉలిక్కిపడి సమాధానం ఇచ్చాడు రహీం. “మావాడు అలాంటి పని చేయలేదు. చేయడు కూడా. సరిగ్గా తెలుసుకుని మాట్లాడు. నువ్వేం చేసినా ఊరుకోవటానికి ఇక్కడెవరూ గాజులు తొడుక్కోలేదు” అని ఫోన్ కట్ చేసాడు రహీం.

అంజాద్ వేపు చూసి కళ్ళతో ఏదో చెప్పాడు పహిల్వాన్. అతని చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న అంజాద్ సరేనన్నట్లుగా తల ఊపాడు.

పహిల్వాన్‌తో ఫోన్ మాట్లాడిన తర్వాత తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు రహీం ఖాన్.

విషయం అంతా వాళ్లకి చెప్పి “మనం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన తగాదాలు మనకొద్దు” అన్నాడు రహీం ఖాన్, అందరి వేపు చూస్తూ.

“వీడు కావాలని మనతో కయ్యానికి దిగుతున్నాడు” అన్నాడు రంగా.

ఎవరూ మాట్లాడలేదు.

***

అదే సమయంలో స్నేహితులతో బార్‌లో మందు కొట్టి, బయటకొచ్చి కాస్త తూలుతూ బైక్ మీద కూర్చుని ఇంటిదారి పట్టాడు రంగా. బైక్ మెల్లిగా నడుపుతూ ఇంటి మలుపు దగ్గరకు చేరుకున్నాడు. మలుపులో స్ట్రీట్ లైట్స్ వెలగటం లేదు. అది చూసి ఏదో అనుమానం వచ్చి బండి వెనక్కి తిప్పబోయాడు రంగా, కానీ అప్పటికే ఆలస్యమయింది.

చీకటిలో నుండీ ఏదో వచ్చి రంగా మొహం మీద విసురుగా తగిలింది. ఆ దెబ్బకు తల దిమ్మెక్కి, బైక్ జర్రున జారీ దూరంగా వెళ్లి పడ్డాడు రంగా. లేవడానికి ప్రయత్నించి మళ్ళీ పడిపోయాడు.

చేతిలో కర్రతో చీకట్లో నిలబడి చూస్తూ వున్న ఆ వ్యక్తి తృప్తిగా ఊపిరి పీల్చి అక్కడనుండి వెళ్ళిపోయాడు.

***

మరుసటి ఉదయం హాస్పిటల్‌కు చేరుకున్నాడు రహీం ఖాన్.

“ఏం జరిగింది?” అడిగాడు అక్కడ నిల్చున్న తన మనుషులకేసి చూస్తూ.

“ఇంటికి కాస్త దూరంలో తల పైన దెబ్బలతో పడి ఉండటం చూసిన పోలీసులు అంబులెన్సు‌లో ఇక్కడ తీసుకొచ్చి షరీక్ చేసిండ్రు అన్నా, సృహలో లేడు. ఏం జరిగిందో తెలీదు”

“చుట్టూ ఏదైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమో చూడండి.” అని చెప్పి గదిలో కెళ్ళి ఆక్సిజెన్ సహాయంతో పడుకున్న రంగాని చూసి బయటకు వెళ్ళిపోయాడు రహీం ఖాన్. అతని దవడలు గట్టిగా బిగుసుకున్నాయి. మొహంలో ఒక సెకను పాటు క్రూరత్వం తళుక్కుమంది.

***

రంగా ఇంటి మలుపులో ఆగింది పోలీసు వ్యాన్. అందులోనుండి దిగి చుట్టూ చూసాడు ఇన్‌స్పెక్టర్.

“ఇదుగో ఇక్కడ పడ్డాడు సార్” అని చూపించాడు కాన్‌స్టేబిల్.

అక్కడ వున్న రక్తం మరకలను చూసి, రోడ్డు మీద బైక్ జారిన గుర్తులను చూస్తూ వెళ్లి రోడ్ మలుపు వేపు వెళ్ళాడు.

‘ఇక్కడ ఈ మలుపులో ఎవడో నిలబడి కొట్టాడు, ముగ్గురు ఉన్నట్లుంది.’ అనుకున్నాడు ఇన్స్పెక్టర్, నేల మీదున్న షూ గుర్తులను చూసి. కింద గడ్డిని, చిన్న పొదలను గమనించసాగాడు. ఒక పక్కన అతనికి కాల్చిపారేసిన సిగరెట్ ముక్క కనపడింది. గడ్డిని జరిపి చూసాడు. ఇంకా ఎటువంటి ఆధారాలు కనపడక వెనక్కి తిరిగి వ్యాన్ వేపు వెళ్ళాడు ఇన్‌స్పెక్టర్.

సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో పెద్ద టేబుల్ ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నారు నలుగురు ఇన్‌స్పెక్టర్స్.

“గ్యాంగ్ వార్ మొదలయ్యినట్లుందిగా?” అని నవ్వాడు ఒక ఇన్‌స్పెక్టర్.

“మంచిదే మనకు చేతి నిండా పని” అన్నాడింకో ఇన్‌స్పెక్టర్.

“పనితో బాటు అన్నీ” అని చిన్నగా నవ్వాడు మొదటి ఇన్‌స్పెక్టర్.

“ఒకసారి ఇద్దరినీ పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి” అన్నాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్.

సరేనంటూ తలూపారందరూ.

***

రింగవుతున్న తన మొబైల్ ఫోన్ చేతుల్లోకి తీసుకుని “హలో” అన్నాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్.

“సార్ నేను రహీం ఖాన్ మాట్లాడుతున్నా, నమస్కారం సార్” అన్నాడు వినయం ఉట్టిపడుతూ.

“తెలుసు. చెప్పు రహీం ఖాన్, ఏంటీ ఈ అనవసర తగాదాలు?. జాగ్రత్త. అనవసరమైన గొడవలు వద్దు” అన్నాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్.

“నాదేం లేదు సార్. వాడనవసరంగా నాతో పెట్టుకుంటున్నాడు. మీకో సమాచారం ఇద్దామని ఫోన్ చేశా సార్” అని ఆగాడు రహీం ఖాన్.

“చెప్పు రహీం” అన్నాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కుతూహలంతో ముందుకు జరిగి.

అయిదు నిముషాలు ఆగకుండా చెప్పసాగాడు రహీం ఖాన్.

అంతా విన్న తర్వాత “గుడ్. నువ్ చెప్పింది ఫేక్ కాదుగా?” అనుమానంగా అడిగాడు.

“పక్కా సార్. మీరే చూస్తారుగా సార్” అని ఫోన్ పెట్టేసాడు రహీం ఖాన్.

ఆ రోజు రాత్రి, నాగులపల్లి అడవిలోకి నాలుగు వ్యాన్‌లు కొద్దీ దూరం వెళ్లి పెద్ద బండరాళ్ళు దాటలేక ఆగిపోయాయి. అందులోనుండి దాదాపుగా యాభై మంది పోలీసులు దిగి కాలినడకన అడవి దారి గుండా నడవసాగారు.

మరుసటి ఉదయం వార్తా పత్రికల్లో ‘నాగులపల్లి అడవిలో పోలీసుల ఆకస్మిక దాడి. రహస్య స్థావరంలో దొరికిన కోట్ల విలువ చేసే మత్తుమందులు, డ్రగ్స్’ అనే వార్త చదివి మనసు తీరా నవ్వుకున్నాడు రహీం ఖాన్.

కొద్దీ రోజుల తర్వాత ‘కేంద్ర బలగాలకు అందిన సమాచారం మేరకు మార్కెట్ గోడౌన్‌లో దొరికిన కొన్ని కోట్ల విలువైన నల్లమందు’ అని ఇంకో వార్త ప్రచురితమైంది. అది చూసి తృప్తిగా నిట్టూర్చాడు పహిల్వాన్.

ఇలా ఇద్దరి మధ్యా మొదలయిన గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరిగ్గా ఆ సమయంలో రహీం ఖాన్‌కు ఫోన్ చేసాడు మహి.

“చెప్పు” అన్నాడు రహీం చిరాకుగా.

“ఒకసారి కలుద్దామని” అన్నాడు మహి.

ఒక క్షణం ఆలోచించాడు రహీంఖాన్. ఇదేదో సెటిల్ చేసుకుంటే మంచిది. అసలీ గొడవల మధ్యన రాబడి తగ్గి పోయింది. ఈ సమయంలో వీడు పహిల్వాన్‍తో కలిస్తే ఇంకా సమస్యలు ఎక్కువవుతాయి. ముందీ సమస్యలు తగ్గించుకోవాలి అనుకుని “సరే సాయంత్రం రా” అన్నాడు.

***

ఆ సాయంత్రం రహీం ఖాన్ తన ముందు కూర్చున్న మహి వేపు సీరియస్‍గా చూసి

“సూటిగా, నీకేం కావాలో చెప్పు” అన్నాడు రహీం. అతని గొంతులో అంతకు ముందున్న గట్టితనం లేదు.

అది పసిగట్టిన మహి చిన్నగా నవ్వి “ముందు అద్దెలు, ఈ నెల నుండీ వంద శాతం పెంచాలి. తర్వాత పాత బాకీలు చెల్లించాలి.” అన్నాడు మహి.

“కానీ నాకేంటి లాభం?” అన్నాడు రహీం.

“దానికి నేను మంచి ఆఫర్ ఇస్తాను. అది పూర్తి చేయటానికి సమయం పడుతుంది. కొన్ని షాపులు, ఫ్రీగా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాను.” అని చెప్పి అతని కళ్ళను చూసాడు. రహీం కళ్ళలో దురాశ కనపడగానే

 ‘నా సగం పని అయ్యింది’ అనుకున్నాడు మహి.

ఆ విషయం వినగానే షాక్ తిన్నాడు రహీం ఖాన్. వెంటనే తేరుకుని అడిగాడు “అదెలా. మేడం సంగతి మీకు తెలీదు. ఆమె ఏమీ ఇవ్వదు. నేను మొండివాన్ని కాబట్టి తట్టుకున్నాను” అని అదోరకంగా నవ్వాడు..

“అదంతా నా బాధ్యత, వివరాలు వారం తర్వాత చెప్తాను” అని లేచాడు మహి.

రహీం ఖాన్ లేచి నిలబడి “బహుత్ షుక్రియ, మీ సహాయానికి నేను కూడా మీకు తగిన విధంగా సహాయం చేస్తాను” అని గబగబా వెళ్లి కేబిన్ డోర్ తానే తీసి బయటకు దారి చూపాడు.

కాంప్లెక్స్ నుండీ బయటకొచ్చి కార్ ఎక్క బోయే ముందు పైకి మరొక్క సారి సీరియస్‌గా చూసాడు. అక్కడున్న ‘మేఘన హైట్స్’ బోర్డు చూసి తృప్తిగా నవ్వుకున్నాడు.

***

మొబైల్ తీసుకుని నెంబర్ కలిపి అటువేపునుండీ “హలో” అన్న మేఘన గొంతు విని “గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఒక సారి కలవాలి మేడం” అన్నాడు మహి.

“సరే, రండి” అని ఫోన్ పెట్టేసింది మేఘన. కారెక్కి మేఘన ఇంటి వేపు వేగంగా దూసుకెళ్లాడు మహి.

అరగంట తర్వాత ఆమె ఆఫీసులో మేఘన టేబుల్ ముందు కూర్చున్నాడు మహి. అతనొచ్చి పది నిమిషాలు దాటింది. కేబిన్‌లో కూర్చోపెట్టిన మేనేజర్ కాసేపటిలో కాఫీ పంపాడు. కాఫీ తాగుతూ ఖరీదైన మేఘన ఆఫీసును పరికించాడు మహి. కేబిన్ వెనక వేపున్న తలుపు తీసుకుని లోపలికొచ్చి ‘హలో’ అంటూ తన స్వింగ్ చైర్‌లో కూర్చుంది మేఘన.

“చెప్పండి” అంది మేఘన.

కాఫీ కప్ పక్కన పెట్టి కాంప్లెక్స్‌లో వస్తున్న అద్దెలు, ఈ రోజుల్లో ఆ ప్రదేశంలో వేరే అద్దెలు ఎలా వున్నాయి, ఆవిడకు ఎంత బాకీ రావాల్సి వుంది వగైరాలన్నీ టూకీగా చెప్పాడు మహి.

“అవన్నీ నాకు తెలుసు. రహీం ఖాన్ చేతుల్లో వున్నాయవన్నీ. ఇప్పుడేం చేస్తారో చెప్పండి ముందు” అంది. ఆవిడ గొంతులో చిరాకును గమనించాడు మహి.

“మీరు నాకు స్వేచ్ఛనివ్వాలి. నేను చేసి చూపిస్తాను. వచ్చే నెలలో మీకు అద్దెలు పెరుగుతాయి. తరవాతి నెలలో పాత బాకీలు వస్తాయి. ఎలా చేయాలన్నది నేను చూసుకుంటాను. ప్రాపర్టీ రహీం ఖాన్ చేతుల్లో ఉన్నాయన్నది నిజమే. అతనితో తగాదా పెట్టుకుంటే మీకు తలనొప్పులు తప్పవు. ముందుగా రహీం ఖాన్‌ను మన వేపు తిప్పుకోవాలి.” అని చెప్పటం ఆపి మేఘన రెస్పాన్స్ కొరకు ఆమెను చూసాడు.

ఆమె మొహం చందనపు చెక్క బొమ్మలా కనిపించింది. మొహంలో ఏ భావాలు లేవు.

ఒకసారి చిన్నగా ఊపిరి పీల్చి అన్నాడు “నాకీ విషయంలో పూర్తి నమ్మకం వుంది. నేను చేస్తాను. మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను.”

అది విని మేఘనలో కాస్త కదలిక కనిపించింది. రెప్ప వాల్చకుండా నిశితంగా చూసిందతడిని.

“ఏం కావాలి చెప్పండి” అంది స్థిరమైన స్వరంతో.

“మీకు మొదటగా సంవత్సరానికి దాదాపుగా ఒక కోటి యాభై లక్షల ఆదాయం పెరుగుతుంది. అదీ వచ్చే నెల నుండే. డెబ్భై లక్షలు దానికయ్యే ఖర్చు.. అదివ్వండి.. పూర్తిగా క్యాష్ రూపంలో.” అని చెప్పి కుర్చీలో ముందుకు జరిగాడు మహి.

“కుదరదు” అంది సూటిగా అతని కళ్ళ లోకి చూసి.

ఆమెను పరిశీలనగా చూసి “ఇక మీ ఇష్టం” అని నిట్టూర్చాడు.

ఆమెలో కదలిక లేదు. అది గమనించి, ఒక్క క్షణం ఆలోచించి లేచి నిలబడి “సరే మరి ఆలోచించి చెప్పండి. మళ్ళీ కలుస్తాను” అని చెప్పి బయటకు నడిచాడు.

అలా వెళ్ళిపోతున్న మహిని చూసి ఆలోచనల్లో పడింది మేఘన. పక్కనున్న మొబైల్ తీసి

“హలో అడ్వకేట్ గారు, ఒక సారి కలవండి” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

బయట కారెక్కి ఆలోచించాడు మహి. తన ప్లాన్‌కి ఒప్పుకుంటే పెద్ద ఎత్తున తనకు లాభం జరిగేది. కష్టపడి చేసిన మొత్తం కథ అడ్డం తిరిగింది అనుకున్నాడు.

మరుసటి రోజు ఆఫీసులో పని చేసుకుంటుండగా ఫోన్ మోగితే లేపి “హలో” పరాకుగా అన్నాడు మహి.

“సరే. ఒక సారి ఆఫీసుకి రండి” అన్న మేఘన గొంతు విని ఉలిక్కి పడి “హలో హలో మేడం.. ఓకే ఓకే వస్తాను” అన్నాడు. ఇంకా ఏదో చెప్పబోయేలోగా ఫోన్ కట్ చేసింది మేఘన.

ఒక సారి ఫోన్‌ను చూసి కళ్ళెగరేసి ‘ఉఫ్’ అని గాలి ఊదాడు మహి.

వెంటనే వెళదామని లేచి మళ్ళీ కూర్చుని దేనికి పిలిచినట్లు, ఎలా హేండిల్ చేయాలి? అనుకున్నాడు. ఈ పనిలో విజయం సాధిస్తే తనకు మంచి పేరు రావడం ఖాయం అనుకున్నాడు మహి.

కాసేపటికి మేఘన ఆఫీసులో వెయిటింగ్ హాల్‌లో కూర్చొని అక్కడ గోడ మీదున్న మేఘన తలిదండ్రుల ఫోటోను చూసాడు. ఇద్దరూ చూడటానికి అందంగా వున్నారు మరి.. కూతురెందుకిలా పుట్టింది అని ఆలోచించాడు.

ఇంతలో, మేడం పిలుస్తున్నారని చెప్పగానే లేచి కేబిన్ వేపు నడిచాడు మహి.

“మనం ఇస్తున్న డెబ్బయి అయిదు లక్షలతో పని పూర్తి అవుతుందని గ్యారంటీనా?” అంది మేఘన.

మళ్ళీ ఆమె మొహం ఎలాంటి భావం లేకుండా రాయి లాగా మారిపోవటం చూసాడు మహి.

“వచ్చే నెల నుండీ అద్దెలు పెరుగుతాయి” అన్నాడు.

అప్పుడే వచ్చి పక్కన నుంచున్న యువతికి సంజ్ఞ చేసింది మేఘన. టేబుల్ కిందున్న బ్యాగ్ తీసి పైన పెట్టింది ఆ యువతి. “లిజీ, ఎంత?” అడిగింది మేఘన. పొడవైన మెడను వంచి చిన్నగా చెప్పింది లిజీ.

“ఇదుగో యాభై లక్షలు. ఇక మిగిలినవి పని అయిన తర్వాత” అంది మేఘన బ్యాగ్ అతని ముందుకి తోసి.

అది తీసుకుని కేబిన్ బయటికి అడుగులు వేసాడు మహి. అలా నడుస్తూ వెళ్తున్న అతడినే చూస్తూ ఆలోచనలో పడింది లిజీ.

బ్యాగ్ పట్టుకుని నడుస్తున్నాడన్నమాటే కానీ గాలిలో తేలుతున్నట్లుగా వుందతడికి. అక్కడ నుండీ మేఘన హైట్స్‌కి ఆఘమేఘాల మీద చేరుకున్నాడు. నిటారుగా తలెత్తుకుని రహీం ఖాన్ గదిలోకి వెళ్తుంటే అతన్ని గుర్తుపట్టి ఎవరూ ఆపలేదు.

“సార్ రండి, కూర్చోండి” అని నవ్వుతూ లేచి స్నేహంగా కుర్చీ చూపించాడు రహీం.

కుర్చీలో కూర్చొని బ్యాగ్ టేబుల్ మీద పెట్టి “ఇదుగో యాబై లక్షలు. అద్దెలు పెరిగాక మిగిలిన డబ్బులు ఇస్తాను” అన్నాడు మహి.

అతనిలో కనపడుతున్న ధైర్యం చూసి ఒకింత ఆశ్చర్య పోయాడు రహీం.

“ఇవి తీసుకుని నేను మీ పని చేయకపోతే?’’ అన్నాడు మహి మొహంలో కలిగే మార్పులను గమనిస్తూ.

“మిస్టర్ రహీం.. చిన్నప్పుడు బంగారు బాతు కథ చదివి ఉంటావనుకుంటాను’’ అన్నాడు సీరియస్‌గా.

 వెంటనే నవ్వి “వచ్చే నెల నుండీ మీకు పెరిగిన అద్దెలు వస్తాయి. ఏం తీసుకుంటారు, విస్కీ?” అన్నాడు రహీం.

“నో.. నేను తీసుకోను.. వచ్చే నెల నేనింకో పని ఇస్తాను. అది పూర్తి చేస్తే ఫైనల్‌గా నీకు నే చెప్పినట్లుగా కొన్ని షాప్స్ నీ స్వంత మౌతాయి. ఇక ఈ పనికి రాని పోట్లాటలు మానేసి గౌరవంగా జీవితం గడపటం మంచిది. వయసు మీద పడుతోంది రహీం, ఎన్నాళ్లీ రౌడీషీటర్ బ్రతుకు?.. నీకూ భార్యా పిల్లలతో సంతోషంగా, రిస్క్ లేకుండా బ్రతకాలని లేదా?” అని చెప్పి రహీంని జాలిగా చూసాడు.

గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలాడు రహీం ఖాన్. “ఏం చేయను భాయ్.. ఇలా ఇరుక్కు పోయాను. నా బీదరికమే నన్ను అలా చేసింది. నాక్కూడా అందరిలా బ్రతకాలని వుంది.” అని నిస్సహాయంగా మొహం పెట్టాడు.

బాణం గురి తప్ప లేదు అనుకుని, తృప్తిగా లేచి బయటకు అడుగులు వేసాడు మహి.

నెల రోజుల పాటు, ప్రతీ రోజూ మేఘన ఫోన్‌కై ఎదురు చూసాడు. కానీ మేఘన ఒక్క మారు కూడా ఫోన్ చేయలేదు. రహీం పని చేసి పెడితే తనకది పెద్ద విజయం. ఒక వేళ రహీం చేయక పోతే ఎలా? వాడికిచ్చిన యాభై లక్షలు తిరిగి వెనక్కి రావడం అంత సులభం కాదు. పైగా అవి లెక్కల్లో లేని డబ్బులు. మేఘన ఊరుకుంటుందా? ఇలాంటి సందేహాలు తల నిండా ముసురుకుని, దేవుడి మీద భారం వేసి పని చేసుకుంటూ కూర్చున్నాడు.

‘ఈ రోజు రెండవ తారీకు. రహీం సంగతి ఈ రెండు రోజుల్లో తేలిపోతుంది’ అనుకుని కంప్యూటర్‌లో మేఘన బ్యాంకు ఖాతా చూడసాగాడు. అందులో ఆ రోజు మేఘన హైట్స్ నుండీ ఇరవై నాలుగు లక్షల అద్దె మేఘన ఖాతాలో జమ అయ్యినట్లుగా చూపిస్తోంది;

అది చూసి ఆనందం పట్టలేక “సక్సెస్.. గ్రాండ్ సక్సెస్” అని పెద్దగా అరిచాడు.

అప్పుడే ఫోన్ మ్రోగింది. ఫోన్ తీసి “చెప్పండి మేఘన గారు” అన్నాడు. అతనిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంది.

“ఒకసారి వస్తారా?” అంది.

“మధ్యాహ్నం వస్తానండీ..” అని చెప్పి అద్దెల విషయం చెప్పబోతుండగా ఫోన్ కట్ అయిపోయింది. ఫోన్ పెట్టేసి ‘హు.. డబ్బు పొగరు’ అనుకుని డైరెక్టర్‌ను కలవటానికి లేచాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here