రీల్స్

0
2

[డా. మానస్ కృష్ణకాంత్ రచించిన ‘రీల్స్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“అ[/dropcap]క్కా” అని పిలుపు వినిపించింది పెరట్లోంచి. పక్కింటి అమ్మాయిది ఆ పిలుపు. నాకంటే చాలా చిన్నది. మొన్ననే టెన్త్ పాసయ్యి ఇంటర్‍లో జాయినయ్యింది బై.పి.సి.లో. ఈ మధ్య క్లాసులు చెప్పించుకోడానికి సాయంత్రం కాలేజీ అయ్యాక వస్తుంది. బయాలజీలో నాకు కొంచం ప్రవేశం ఉండడం వలన నేను కూడా చెప్పడానికి ఉత్సాహం చూపించాను.

తలుపు తీసి బయటకు వెళ్లాను, ఈ రోజు ఆమె చేతిలో పుస్తకాలు లేవు. ఏడుపు ముఖం పెట్టుకుని ఉంది. “ఏమైంది?” అని అడగకుండానే, తను చెప్పడం మొదలెట్టింది.

“అమ్మ నా మొబైల్ తీసేసుకుంది. ఇమ్మంటే ‘ఇంటర్‍లో చేరి ఇంకా నెలైనా కాలేదు, ఇంతసేపు సెల్‌ఫోన్‌లో మాటలూ, ఛాటింగులూ ఏంటే?’ అని గట్టిగా అరిచింది నా మీద. నువ్వంటే అమ్మకి కొంచెం గౌరవం కదా. నువ్వు చెప్తే ఫోన్ ఇచ్చేస్తుంది. ఒకసారి వచ్చి అమ్మని అడుగక్కా నాకు ఫోన్ ఇమ్మని” అని అడిగంది.

చాలా చిన్న విషయం కదా అని అనుకుని తనతోపాటూ వెళ్లా వాళ్ళళ్లింటికి, వాళ్ళమ్మతో మాట్లాడానికి. వాళ్ళ తమ్ముడు అక్కడే సైకిల్ తొక్కుకుంటూ నన్ను చూసి నవ్వాడు. వాడికి నేనంటే అభిమానం. చిన్న చిన్న విషయాల్లో నాకు చాలా సహాయం చేస్తాడు. మొత్తానికి కరోనా నాకు వీళ్ళిద్దరినీ పరిచయం చేసింది ఈ మహా నగరంలో.

నేను వెళ్ళేసరికి వాళ్ళింట్లో పెద్ద గొడవ. అప్పుడే వచ్చిన వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మీద అరుస్తున్నాడు. ఇంట్లో కూర్చొని బియ్యంలో రాళ్ళేరుతున్న వాళ్ళ నాన్నమ్మ – వాళ్ళ నాన్నకే వంత పాడుతూ వాళ్ళమ్మ మీద తన వంతు ప్రయత్నంగా అరుస్తున్నది. నేను వెళ్లాక కూడా ఆపలేదు, ఆపాలని అనుకోవడం కూడా లేదు. వాళ్ళమ్మ కూడా తనేమీ తక్కువ తినలేదన్నట్టు ఘాటుగానే జవాబిస్తోంది ప్రతీదానికీ. ఇంతకీ గొడవ ఈ అమ్మాయి ఫోన్ గురించే. నా దగ్గరకి వస్తూ వస్తూ అప్పుడే ఆఫీసు నుంచి ఇంట్లోకి వచ్చిన వాళ్ళ నాన్నకి – ఫోన్ తీసుకున్న అమ్మ మీద – కంప్లెయింట్ చేసినట్టుంది ఈ అమ్మాయి. మామూలు గానే అంతగా పొసగని వాళ్ళమ్మా నాన్నలకి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ఈ కంప్లెయింట్. దానికి తోడు నాన్నమ్మ సపోర్టు. ఇంక అక్కడ ఉండడం మంచిది కాదని తోచి ఇంటికి వచ్చేసి ఆలోచించడం మొదలు పెట్టా.

అసలు మొబైల్ లేకపోవడం, వాడకపోవడం వలన ఏమైనా అనర్థాలున్నాయా? వాడితేనే ఎక్కువ అనర్థాలా అని. మొన్న మొన్నటి వరకూ అమాయకంగా ఉండే ఆ అమ్మాయి, రాజకీయాలు నేర్చిన ఆరిందాలా మారిపోయిదిగా అని. ఫోన్ కోసం, రాజకీయ లబ్ధి లాగా వాళ్ళమ్మ, నాన్నమ్మ మధ్య వున్న వైరాన్ని ఆసరాగా తీసుకుంది, వాళ్ళ నాన్న వాళ్ళమ్మ మధ్య అసఖ్యతను తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంది అని.

అరిస్టాటిల్ చెప్పినట్టు మనిషి పొలిటికల్ ఏనిమల్ అన్నది కరక్టే అనను, డిజిటల్ విద్యా విధానం వలన విద్యార్థుల భవిత బాగు పడుతుందా? మారుతున్న మానవావసరాలకు తోడ్పాటు నందిస్తుందా? లేక ఒక డిజిటల్ డిస్ట్రాక్షన్‌గా మారుతుందా? డిస్ట్రాక్షన్ కాస్తా ఎడిక్షన్‌గా మారుతుందా? ఎడిక్షన్ వలన కలిగే రియాక్షన్స్ ఏంటి? ఇలా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.

వాటితో పాటూ రోజూ న్యూస్‌లో వస్తున్న అనేక సైబర్ నేరాలూ, మోసాలూ, హనీట్రాపింగ్‌లూ, అత్మహత్యలూ, పరువు హత్యలూ, నేరాలూ ఘోరాలూ మూకుమ్మడిగా నా మనస్సుపై దాడిచేశాయి. నానాటికీ పెచ్చుమీరుతున్న అకృత్యాలూ, అరాచకాలలూ, అత్యాచారాలూ కళ్ళ ముందే కదలాడేసరికి మనస్సు అస్తవ్యస్తం అయ్యింది. చిన్న విషయాన్ని నేను ఇంతగా ఆలోచిస్తూ మనస్సు పాడు చేసుకుంటున్నానేమో అనిపించింది.

ఇంట్లోకి వెళ్లి యథాలాపంగా బెడ్ పైన కూర్చొని హెడ్ స్టాండ్‌కి చేరగిలబడి నైట్ స్టాండ్ మీద పెట్టి ఉన్న పుస్తకాన్ని తీసుకుని చేతిలో పట్టుకుని చదవడంలో మునిగిపోయా.

ఆ రోజు రాత్రి భోజనం అయిన తర్వాత పెరట్లో నడుస్తూ వాళ్ళింటి వైపు వెళ్లినప్పుడు బయట నిలుచున్న వాళ్ళమ్మగారితో మాట్లాడుదామనీ అడుగులు అటు వైపు వేసా. సాయంత్రం అయిన గొడవ గుర్తులు అమె ముఖంపై ఏ మాత్రం లేవు. అదేదో ఒక రోజు అయితే దాని ప్రభావం ముఖంలో కన్పిస్తుందమో. అదో నిత్యకృత్యం అయితే ఏమీ జరగనట్టే ఉంటుందేమో అనుకున్నా. సుత్తి కొట్టకుండా, సూటిగా మొబైల్ విషయంతోనే మొదలు పెట్టా. మొబైల్ ఇప్పుడు అత్యవసరం అని చెబుతూనే దాని ఉపయోగం మీద ఒక కన్నేసి ఉంచాలని చూచాయగా చెప్పాను.

ఆమె చెప్పడం ప్రారంభించింది. కరోనాకి ముందు ఇంతలా ఉండేది కాదనీ, అలా అని కరోనా కాలంలో కూడా కేవలం ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమైన ఈ స్క్రీన్ చూడడం మొన్న పదో తరగతి వేసవి సెలవుల నుంచి చాలా ఎక్కువైందనీ, ఫ్రెండ్స్ అనీ, కాల్స్ అనీ, ఛాటింగ్‌లూ అవీ ఎక్కువయ్యావయని చెప్పింది. కానీ అమ్మాయికి సొంత మొబైల్ కొనలేదనీ, తన మొబైల్‌నే వాడుకోవడానికి ఇస్తున్నానని చెప్పింది. కానీ ఆమె అంత తెలివైనది కాదని, నాకు ఎప్పటి నుంచో తెలుసు. చాలా అమాయకురాలు, బయటి ప్రపంచం ఏమైపోతుందో, ఎటు వైపు వెళుతోందో అసలు తెలీదు, ఒక ఇరవై ముప్పై సంవత్సరాలకు పూర్వమే ఉండిపోయాయి ఆమె ఆలోచనలూ, అలవాట్లున్నూ.

నేను ఇప్పుడు జరుగుతున్న సైబర్ మోసాల గురించి చెప్పాను. నోరెళ్ళబెట్టింది, అది అర్థమైనందుకో, అర్థంకాకో నాకు అర్థం కాలేదు. రకరకాల ‘యాప్స్’ గురించి, ప్రైవసీ గురించీ, డేటా లీకేజీల గురించీ చెప్పా. పక్కనే ఒక కుర్చీలో కూర్చున్న వాళ్ళాయన వింటున్నాడో యూట్యూబులో వీడియో చూస్తున్నాడో నాకు అర్థం కాలేదు. తన మొబైల్ అడిగి తీసుకుని చూసా, స్నాప్ చాట్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ ఇంకా చాలా ‘ఇంటర్మీడియట్’ పిల్లలకు అవసరం లేని యాప్స్ ఉన్నాయి. వాటన్నిటిలోనూ మెసేజ్‍లు డిలీట్ కూడా చేసి ఉన్నాయి. ఈ విషయం ఆమెకు తెలీదు. శుక్రవారం నోములు చేయడం, సోమవారం ఉపవాసాలు చేయడం మాత్రం తెలుసామెకు. కానీ నేను ఆమెకు తెలియజేయాలని నిర్ణయించుకున్నా.

స్నేహితులుండడం తప్పుకాదు, కానీ ఎటువంటి వారు ఉండాలి, ఎందుకుండాలి, ఎంతవరకు ఉండాలి అనే విషయాలు వాళ్ళమ్మాయికి వివరించి చెప్పాలనీ, కోప్పడడం, కసరడం, విసుక్కోవడం చేయకూడదని చెప్పా. ‘యాప్స్’ ని ఎలా వాడాలో వివరంగా ఆవిడకి చెప్పాను. మా ఈ సంభాషణ రెండు గంటలకు పైగా సాగింది. నాకెందుకులే అని నేను విడిచిపెట్టేయచ్చు కానీ ఎందుకో ఒక ఆడపిల్లగా నేను అలా వివరించడం నా బాధ్యతగా అనిపించి చెప్పా. వయస్సులో వచ్చే మార్పులూ, భావోద్వేగాలు, వాటిని పిల్లలకు ఏ విధంగా వివరించాలి, సహజంగానే స్వాతంత్ర్యాన్ని కోరుకునే వయసులో, బాధ్యతలను ఎలా వారికి నేర్పించాలి అనేవి కూడా చెప్పా. ఆమెకు కొంచెం అర్థమైనట్టుంది.

ఆ రోజు రాత్రి నాకు మంచి నిద్ర పట్టింది. ఒక బాధ్యతను నెరవేరిస్తే వచ్చే సంతృప్తి వలన కలిగిన ప్రశాంతత వల్ల వచ్చిన నిద్ర అది.

ఆ తర్వాతి రోజు సాయంత్రం మళ్లీ వాళ్ళింట్లో పెద్ద గొడవ. వాళ్ళమ్మ మీద ఆ అమ్మాయి పెద్దగా అరుస్తూంది. వాళ్ళమ్మ ముఖంలో ఎప్పుడూ చూడని కోపం ఆ రోజు కనిపించింది. ‘నా ప్రయివేట్ విషయాల్లో ఎందుకు తల దూరుస్తున్నావ’ని ఆ అమ్మాయి అడుగుతోంది పెద్ద గొంతుకతో. “మెసేజ్‌లు ఎందుకు చూసావు నువ్వు?” అని రెండో ప్రశ్న బాణంలాగా వాళ్ళమ్మ పైకి. వాళ్ళమ్మ అప్పుడే అక్కడకి వచ్చిన నా వైపు చూసింది. నన్ను ఆమెకి సపోర్ట్ చేయమన్నట్టుంది ఆ చూపు.

నేను ఆ అమ్మాయి వైపు తిరిగి అడిగాను “ఏమైంది?” అని.

తన ఇన్‌స్టా మెసేజులు వాళ్ళమ్మ చదివి, అంత రాత్రి వేళ ఛాటింగ్స్ ఎందుకని అడిగిందని, తన ప్రైవసీకి అది భంగం అనీ చెప్పింది. అప్పుడు ఇద్దరి వైపూ మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉందనిపించి, మొదట వాళ్ళమ్మ గారిని లోపలికి వెళ్ళమని సైగ చేసి నేను ఆ అమ్మయితో చెప్పడం ప్రారంభించాను – ఈ తెలిసీ తెలియని వయసులో చేసిన పొరపాట్లు జీవితాంతం ఎలా వేధిస్తాయో, డిజిటల్ యుగంలో చిన్న పొరపాటు జరిగినా క్షణాల్లో అది ఏ స్థాయికి వెళ్తుంందో అన్ని వివరంగా చెప్పా. ఫ్రెండ్స్ అంటే మేలు జరిగేలా కోరుకునేవారు, ఆ మేలు జరగడానికి తమ వంతు సహాయం చేసే వారే తప్ప, ఇన్‌స్టాలో లైక్‍లూ, స్నాప్ చాట్‌లో స్ట్రీక్‌ల కోసం మాత్రమే మనతో ఉండేవారు కాదని చెప్పా. ఈ ఫాస్ట్ యుగంలో స్నేహానికి అర్థం, దాన్ని చూపించే మార్గాలు కూడా మారిపోయాయనీ, మీ తల్లిదండ్రులు మీరు బాగుపడి ప్రయోజకులయ్యి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరుకుంటారు తప్ప వారి కోసం ఏమీ కాదనీ చెప్పా. అంతే కాకుండా ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లను, పేపర్ క్లిప్పింగ్ లనూ పోలీసు కేసులనూ చూపించా నా మొబైల్‌లో. ఇంటర్నెట్ ఒక సముద్రం లాంటిది, అందులో షార్కులూ, తిమింగలాలూ ఇంకా ఇతర క్రూర జీవులు ఉంటాయి, అవి అదను కోసం చూస్తూ, ఎరలు వేస్తూ, ప్లాన్‌లు గీస్తూ పకడ్బందీగా నీలాంటి చిన్నపిల్లల్నీ, అమాయకుల్నీ బలి తీసుకుంటాయి. అది నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఇప్పుడు. కానీ ఒక్కసారి ఆ గాలానికి చిక్కుకుంటే ఇక బయటపడడం దాదాపు అసాధ్యం. ఇదంతా నీ మంచి కోసమే, నువ్వ నాకొక చెల్లెలు లాంటి దానివే కాదు, నా ఫ్రెండ్ కూడా. అందుకే నీ మంచి కోసమే ఇంత చెబుతున్నా అని ఆమె ముఖం వైపు చూసా రియాక్షన్ ఏంటో చూద్దామని.

కొంచం భయపడినట్లుంది, నా మాటలు నమ్మినట్లుంది. మౌనంగానే ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ బయటకి వచ్చింది, మిగతాది ఆమెకు చెప్పా. ఇంట్లో గొడవలు, రాజకీయాలూ పిల్లలను మానసికంగా క్రుంగదీస్తాయి అని, ప్రశాంతమైన, ప్రేమమయమయిన వాతావరణం పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకూ, సమాజంలో వారి ఆత్మగౌరవానికీ ఎంతో ముఖ్యం అనీ, ప్రేమ ఎప్పుడైతే ఇంట్లో కరువైపోతుందో అప్పుడే కృత్రిమమైన, కృతకమైన బజార్లో దొరికే ప్రేమలకు ఆకర్షితమౌతారనీను. మనం ఎలా ఉంటే పిల్లలు అలా తయారవుతారనీ గట్టిగానే చెప్పా, పక్కనే కూర్చుని యూట్యూబ్‌లో జబర్దస్త్ కామెడీకి నవ్వుకుంటున్న వాళ్ళయనకి కూడా వినబడేటట్టు.

రెండు రోజులు గడిచాయి, వాళ్ళింట్లోంచి సాధారణంగా సాయంత్రం వినిపించే గగ్గోలు వినిపించడం లేదు. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి, వాళ్ళింట్లో చేసిన బొబ్బట్లు తీసుకొని వచ్చింది. మొహంలో ఏదో ప్రశాంతత, ఇంతకు ముందున్న అలజడి లేదు ఆమె ముఖంలో. ఏదో సమస్య నుంచి శాశ్వతంగా బయటపడినట్టనిపించింది. ఆ సమస్యేమిటో నాకు తెలుసన్న విషయం, దాన్ని పరిష్కరించింది కూడా నేనేనన్న విషయం మాత్రం ఆమెకు తెలియదు.

ఆ తర్వాత రోజు సిటీ ఎడిషన్స్‌లో ‘సైబర్ మోసాలకు పాల్పడుతున్న మాఫియా అంతం’;  నకిలీ ఐడిలతో అమ్మాయిలను మోసం చేస్తూ, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న నేరగాళ్ళకు పోక్సో చట్టం కింద శిక్ష విధించిన కోర్టు; ఈ మిషన్ సక్సెస్ అయినందుకు డి.సి.పి.కీ, షి టీమ్స్‌కు డి.జి.పి. సత్కారం – ఇవీ హెడ్ లైన్స్. హెడ్ లైన్స్ చదువుకుని తృప్తిగా నవ్వాను, ఎంతో మంది ఆడపిల్లలను ఊబి నుంచి బయటకు తెచ్చినందుకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here