[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం గారి కలం నుంచి జాలువారిన నవల ‘రెండు ఆకాశాల మధ్య’. తొలుత ‘సంచిక’ వెబ్ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన ఈ నవల పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఒక యుద్ధానంతరం రాత్రికి రాత్రికి రెండు ఊర్ల మధ్య సరిహద్దు రేఖ మొలచి ఓ ఊరు భారత్ లోనూ, మరో ఊరు పాకిస్తాన్ లోనూ మిగిలిపోతే ఆ రెండు ఊర్లలోని వ్యక్తులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటారో, అయిన వారికి దూరమైన వారి జీవితాలు ఎలా మారిపోయాయో అత్యంత హృద్యంగా ఆవిష్కరించారు రచయిత ఈ నవలలో.
సరిహద్దుని ఆనుకుని ఉన్న గ్రామాలలోని ప్రజల దీనస్థితిని పాఠకుల కళ్ళకు కడతారు రచయిత. కథాక్రమంలో భాగంగా 1947లో దేశ విభజన సమయంలో జరిగిన ఘాతుకాలని, కలిగిన గాయాలని ఈనాటి పాఠకులకు తెలియజేస్తారు. దేశ విభజన అంశంగా తెలుగులో వచ్చిన అతి కొద్ది రచనలలో ఈ నవలని ఒకటిగా చెప్పుకోవచ్చు.
నవల 1965 ఏప్రిల్ నెలలో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖకి కేవలం నాలుగువందల మీటర్ల దూరంలో ఉన్న జోరాఫాం అనే గ్రామంలో ప్రారంభవుతుంది.
ఆ గ్రామంలోని ఫక్రుద్దీన్ కుటుంబ పరిస్థితిని వివరిస్తూ మొదలవుతుంది. తన చిన్న కూతురు ఫర్హానా పెళ్ళి చేయాలన్న ఆలోచనలో ఉంటాడు ఫక్రుద్దీన్. అయితే తన కూతుర్ని బార్డర్‍కు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇవ్వడం ఫక్రుద్దీన్‌కి సుతరామూ ఇష్టం లేదు. ఎటునుంచి ఏ సమయంలో బాంబులు కురుస్తాయో తెలీని దుస్థితి.. ఏ క్షణంలో ఏ మోర్టారు వచ్చి యింటి మీద పడుందోనన్న భయం.. నిద్ర లేని రాత్రులు.. రాత్రి పడుకుంటే ఉదయానికి బతికుంటామో లేమో తెలీని అనిశ్చితత్వం.. తన కుటుంబం అనుభవిస్తున్న నరకం ఫర్హానా అనుభవించకూడదని భావిస్తాడు. అదే సమయంలో చిన్న కొడుకు రషీద్ భవిష్యత్తు పట్ల కాస్త దిగులుగా ఉంటాడు. తండ్రిలా వ్యవసాయం చేయడం ఇష్టం లేదు రషీద్‍కి. అన్న ఉండే ఊర్లో ఏదో వ్యాపారం చేయాలనుకుంటాడు. అన్న వాళ్ళ ఊరు బయల్దేరిన రషీద్‌కి కాల్పుల శబ్దం వినబడి వెనక్కి తిరుగుతాడు. త్వరగా పరిగెడుతుంటే పాకిస్తాన్ సైనికులు పేలుస్తున్న ఫిరంగి గుండ్లు పడడం కనిపిస్తుంది. ఒక చొట దాక్కుంటాడు. కాల్పులు ఆగాకా మళ్ళీ బయల్దేరుతాడు. ఇంతలో అతనికి అతి సమీపంలో ఒక ఫిరంగి గుండు పడి పేలడంతో రషీద్ చనిపోతాడు.
తనకెంతో ఇష్టమైన మున్నా అనే మేకకి ఆకులు తినిపించడానికి బయటకు తీసుకువెళ్తుంది రషీద్ తల్లి పౌజియా. కానీ రెండు దేశాల మధ్య కాల్పులు జరగడం మొదలయ్యేసరికి ఫక్రుద్దీన్ ఆమెను వెతుకుతూ వెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. సైనికుల గుళ్ళ వర్షానికి ఊరు సగం పాడవుతుంది. కాసేపయ్యాకా కొందరు సైనికులు వచ్చి గ్రామస్థులందరినీ ఒక శిబిరానికి తరలిస్తారు. ఆర్.ఎస్.పురాకి వెళ్ళే దారిలో ఒక యువకుడి శవం ఉందని కబురు అంది సైనికులు వెళ్ళి రషీద్ శవాన్ని గుడ్డల్లో కప్పి తెస్తారు. శవాన్ని గుర్తుపట్టిన గ్రామస్థులు కొందరు ఫక్రూద్దీన్‍కి తెలియజేస్తారు. ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరీ వల్లా కాదు.
ఫక్రుద్దీన్ మిత్రుడు శంకర్‍లాల్ స్నేహితుడిని పలకరించడానికి వస్తాడు. స్నేహితుడిని ఓదారుస్తూ “అనుభవాలతో పండిపోయిన నువ్వూ నేనూ మాట్లాడాల్సిన మాటలా ఇవి? మన జీవితంలో మనం ఎన్ని ఆటుపోట్లని తట్టుకోలేదూ.. ఎన్ని చావుల్ని చూడలేదూ.. ఆత్మీయుల్ని ఎంతమందిని పోగొట్టుకోలేదూ.. భాభీకి, నీ కూతురికి ధైర్యం చెప్పాల్సిందిపోయి ఇలా బేలగా మారిపోతే ఎలా చెప్పు?” అతని భుజం మీద చేయివేసి అనునయిస్తున్నట్లు అంటాడు. బదులుగా దేశవిభజన నాటి గాయాలని ఇంకా మరిచిపోలేదనీ, కానీ ఈ వయసులో బిడ్డని పోగొట్టుకోడం చాలా కష్టంగా ఉందని చెప్తాడు ఫక్రుద్దీన్.
శంకర్‍లాల్‍కి గతం గుర్తు వస్తుంది. పందొమ్మిదేళ్ళ క్రితం లాహోర్ పట్టణంలో అతనికెదురైన అనుభవాలు తిరిగి కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. తన తండ్రిని, పిల్లలని తీసుకుని పెదనాన్నని చూడడానికి లాహోర్ వెళ్తాడు శంకర్‌లాల్. ఆ సమయంలో దేశ విభజన జరిగి మత ఘర్షణలు చెలరేగుతాయి. లాహోర్‍లోని హిందువులపై దాడులు జరుగుతాయి. ఆ దాడిలో శంకర్‍లాల్ పెద నాన్న కుటుంబ సభ్యులంతా మరణిస్తారు. శంకర్‍లాల్ తన కూతురు షామ్లీని, కొడుకు దర్శనలాల్‌ని తీసుకుని పారిపోతాడు. రైల్వే స్టేషన్ వైపు పరిగెడుతున్న క్రమంలో షామ్లీ వెనుకబడిపోతుంది. ఒక పఠాన్ ఆమెని భుజానికెత్తుకోవడం గమనిస్తాడు శంకర్‍లాల్. షామ్లీ వాళ్ళకు దొరికిపోయింది కాబట్టి దర్శన్‌లాల్‌నైనా బతికించుకోవాలనుకుని ఆపకుండా పరిగెత్తి రైల్వే స్టేషన్ చేరుకుంటాడు. చివరికి ఒక రైల్లో ఎక్కుతారు. కాసేపటికి రైలుని ఆపి అల్లరి మూకలు అందిన వారిని అందినట్టు చంపుతాయి. ఎట్టకేలకు కొడుకుతో కలిసి ఇంటికి చేరుతాడు శంకర్‌లాల్. అయితే దర్శన్‍లాల్ మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. కూతురుని అక్కడ కోల్పోవడం, కొడుకు ఇలా కావడం వాళ్ళని క్రుంగదీస్తుంది. స్వాతంత్ర్యం వచ్చాకా, రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగి అహరించబడిన స్త్రీలను సొంత కుటుంబాల అప్పగించాలని నిర్ణయిస్తారు. అప్పటి నుండి వరసగా నాలుగు సంవత్సరాలు షామ్లీ కోసం బోర్డర్ దగ్గరికి వెళ్తూనే ఉంటాడు శంకర్‍లాల్. కానీ షామ్లీ ఆచూకీ మాత్రం తెలియదు. ఆ తర్వాత ఆశ వదులుకుంటాడు.
భార్య పిలవడంతో గతంలోంచి బయటకు వస్తాడు శంకర్‍లాల్.
వారం తర్వాత కాల్పులు ఆగిపోతాయి. శిబిరం నుంచి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్తారు. ఫక్రుద్దీన్ ఇల్లు శిధిలమై కనబడుతుంది. కూతురు పెళ్ళికి దాచిన డబ్బంతా కాలిపోతుంది. వారి మేక మున్నా చనిపోయి కనబడుతుంది. ఈ సందర్భంగా రచయిత ఈ సన్నివేశాలలో అద్భుతమైన సంభాషణలు రాశారు.
~
సరిహద్దుకి దగ్గరగా ఉన్న హుందర్మో అనే గ్రామంలో ఫక్రుద్దీన్ చెల్లి హసీనా తన కుటుంబంతో ఉంటుంది. ఆమె ఆ రోజు చేపల కూర చేస్తూ – ఆ కూర అన్నకి ఇష్టమని తలచుకుంటుంది. జోరాఫాం గ్రామంలో తన బాల్యం, అన్న, అమ్మానాన్నలు, ఆటపాటలు అన్నీ గుర్తొస్తాయామెకి. 1947 జూలైలో దేశ విభజన గురించి చర్చ మొదలవుతుంది. జోరాఫాం, హుందర్మోల మధ్య సరిహద్దు రేఖ వచ్చే అవకాశం ఉండవచ్చని ఆమె భర్త షరీఫ్ అంటాడు. ఆయన అన్నట్టే జరుగుతుంది. జోరాఫాం భారత్‍కి, హుందర్మో పాకిస్తాన్‌కి పంచబడతాయి. ఇక ఫక్రుద్దీన్ చెల్లెల్ని తరచూ కలుసుకోలేక ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. పొలం నుంచి భర్త షరీప్ రావడంతో వర్తమానంలోకి వస్తుంది హసీనా. మాటల సందర్భంలో అన్న నుంచి ఈ మధ్య ఉత్తరాలు రావడం లేదని, మేనకోడలు పెళ్ళి సంబంధాలు ఏమయ్యాయో అంటుంది. మీ అన్న ఏవో పనుల్లో ఉండి ఉంటాడు, త్వరలోనే కబురు వస్తుందని చెప్పి – ఆ ఊర్లో మసీదు లేనందున నమాజ్ చేసుకోవడానికి దగ్గరిలోని ‘బ్రోల్మో’ అనే ఊరికి వెడతాడు షరీఫ్. షరీఫ్ పెద్దక్క జైనాబీని ఆ వూళ్లోని తమీజుద్దీన్‌కిచ్చి నిఖా చేశారు.
~
షరీఫ్ బ్రోల్మో వెడుతూండగా అతనికి తన బాల్యం, అమ్మా, నాన్న తమ్ముడు గుర్తొస్తారు. నమాజు పూర్తయ్యాకా మిత్రుడు లతీఫ్ కలుస్తాడు. మాటల సందర్భంలో షరీఫ్ కూతురు ఆస్‌మా ప్రస్తావన వస్తుంది. ఆస్‌మాని తన రెండో కొడుకు హనీఫ్‌కిచ్చి పెళ్ళి చేసి కోడలిగా చేసుకుంటానని అంటాడు లతీఫ్. సంతోషంగా లతీఫ్ ఇంటికి వెళ్ళి, అక్కడ్నించి అక్క ఇంటికి వెడతాడు. అక్కా, మేనకోడలు అనీస్ ఆప్యాయంగా పలకరిస్తారు. కూతుర్ల పెళ్ళి ప్రసక్తి తీసుకొస్తుంది జైనాబీ. అనీస్ కోసం హుందర్మోలోనే మంచి కుర్రాడిని చూసి నిఖా చేయడం మంచిదనుకుంటాడు షరీఫ్. నమాజ్ కొచ్చినపుడల్లా తన కూతురు ఆస్‌మాని చూసుకోవచ్చు. వూళ్లో ఉన్నప్పుడు అనీస్ బాగోగులు చూసుకోవచ్చని భావిస్తాడు.
భారత్ పాకిస్తాన్‍ల మధ్య మరో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో భారతదేశం పద్దెనిమిది వందల చ.కి.మీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటే, పాకిస్తాన్ 550 చ.కి.మీటర్ల భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో హుందర్మో గ్రామం భారత్ వశమవుతుంది.
మరోసారి కాల్పులు మొదలవడంతో షరీఫ్ కుటుంబం గ్రామస్థులతో సహా, ఒక గుహలో తలదాచుకుంటుంది. ఆ శిబిరంలో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ కాల్పులు ఆగడానికి ఎదురుచూస్తుంటారు. బాంబులు పడడంతో ఊర్లోని కొన్ని నాశనం అవుతాయి. షరీఫ్ తమ్ముడు చనిపోతాడు. కొన్ని రోజులకి ప్రభుత్వాల మధ్య శాంతి ఒప్పందం జరిగి ఎవరి భూభాగాలని వాళ్లకి ఇచ్చేస్తారు. హుందర్మో పాకిస్తాన్‍కి దక్కుతుంది.
~
రషీద్ చనిపోయాడన్న వార్త విన్న ఫక్రుద్దీన్ కాబోయే వియ్యంకుడు వచ్చి వాళ్ళని ఓదారుస్తాడు. అవసరమైతే ఫర్హానా పెళ్ళి కొన్ని రోజులు వాయిదా వేద్దాం అంటాడు. అనవసరమైన ఖర్చులు చేయకుండా అతి నిరాడంబరంగా పెళ్ళి చేద్దాం అని అంటాడు. ఈలోగా రషీద్ మరణానికి పరిహారంగా కాస్త డబ్బు అందుతుంది. కూలిన ఇంటిని మళ్ళీ కట్టుకుని, పెళ్ళి చేసి కూతురిని అత్తవారింటికి పంపుతాడు ఫక్రుద్దీన్. అన్న ఫక్రుద్దీన్ నుంచి ఉత్తరాలు రావడం లేదని బాధపడుతుంది హసీనా. ఆమెని ఓదారుస్తాడు షరీప్. అయితే రెండు దేశాల మధ్య ఉత్తరాలు చేరాలంటే ఎంత ఆలస్యమవుతుందో వాళ్ళకి తెలియదు. ఒకరోజు ఉత్తరం అందుతుంది. కానీ అప్పటికే ఫర్హానా పెళ్ళి జరిగిపోయి ఉంటుంది. హసీనా బాధపడుతుంది.
~
అయిదేళ్ళు గడిచిపోతాయి. తనని నాన్న స్నేహితుడి కొడుకుతో పెళ్ళి నిశ్చయించారని విని ఆస్‌మా అలుగుతుంది. ఉన్న ఊర్లోనే సంబధం చేస్తే, రోజూ తండ్రిని చూసుకోవచ్చని అంటుంది. బ్రోల్మో దగ్గరే కదా, రెండు రోజులకొకసారి నేనే వచ్చి చూస్తానని తండ్రి చెప్పాకా, ఆస్‌మా ఒప్పుకుంటుంది. అనీస్‍కి కూడా తన ఊర్లోని సంబంధమే నిశ్చయిస్తాడు షరీఫ్. అనీస్, జమీల్ నిఖా బ్రోల్మోలో సజావుగా జరిగిపోతుంది. ఆమె తన మేనమామకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
~
తూర్పు పాకిస్తాన్‍లో నిరసనలు పెరిగి, రాజకీయంగా మార్పులు జరిగి పశ్చిమ పాకిస్తాన్‍తో విభేదాలు తలెత్తుతాయి. రక్తపాతం జరుగుతుంది. 1971 వచ్చేసరికి యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలోకి భారత్ లాగబడుతుంది. యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోతుంది. తూర్పు పాకిస్తాన్ – బంగ్లాదేశ్ పేరుతో స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తుంది.
~
పెళ్ళి పిలుపులకి బ్రోల్మో గ్రామానికి వెళ్తాడు షరీఫ్. అక్కతో కలిసి పెళ్ళి బట్టలు స్కర్దూలో కొనాలని అనుకుంటాడు. హసీనా తన కోసం నెమలికంఠం రంగు షల్వార్ కమీజ్‌తో పాటు లాల్ దుపట్టా కొని తెమ్మంటుంది.
~
1971 డిసెంబర్ 16 మధ్యాహ్నం. కొద్ది రోజుల క్రితం జరిగిన యుద్ధంలో హుందర్మో గ్రామాన్ని భారత్ చేజిక్కించుకుందని చెప్పడానికి మేజర్ మాన్‍సింగ్ కొంతమంది సైనికులతో ఆ గ్రామానికి వస్తాడు. అక్కడ ఎవరూ కనిపించకపోతే, అంతటా వెతకమంటాడు. ఒక గుహలో దాగి ఉన్న గ్రామస్థులు కనబడతారు. వారికి జరిగినది చెప్పి గ్రామంలోకి వచ్చేయమంటాడు. ఇప్పుడు బ్రోల్మో, స్కర్దూ పాకిస్తాన్‍లో ఉన్నాయనీ, హుందర్మో భారత్‍లో భాగమని, రెండు ఊర్ల మధ్య సరిహద్దు రేఖ వచ్చిందని చెప్తాడు. పొద్దున్న స్కర్దూ వెళ్ళిన తన కొడుకు హుందర్మో రావడానికి వీల్లేదన్న వార్త జావేద్‍కి ఆశనిపాతం అవుతుంది. ఒక్క పూటలోనే తనూ తన భర్త వేర్వేరు దేశస్థులైపోయిన విషయం అనీస్‌కి మింగుడు పడదు. షరీఫ్‌ని తలచుకుని హసీనా బాధపడుతుంది. ఇప్పటివరకూ పాకిస్తానీయులుగా ఉన్న ఈ గ్రామస్థులందరూ కనురెప్పపాటు కాలంలో భారతీయులెలా అయిపోయారు? ఇదంతా నిర్ణయించేదెవరు? తమ జీవితాలతో ఇంత భయంకరమైన ఆట ఆడుతున్నదెవరు? ఎవరిచ్చారు వాళ్ళకా అధికారం? అనుకుంటుంది. మాన్‌సింగ్‌కి వాళ్ళ బాధ అర్థమవుతుంది, కానీ తాను అశక్తుడనని వాళ్లకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. హసీనా వాదిస్తుంది. ఆమె ఎంత రెచ్చిపోయి మాట్లాడినా, ప్రశాంత వదనంతో మాట్లాడిన మేజర్ మీద గ్రామస్థులందరికీ గౌరవభావం ఏర్పడుతుంది.
~
స్కర్దూలో బట్టలు కొని అక్కతో సహా బ్రోల్మోకి చేరుతాడు షరీఫ్. ఊరంతా నిశ్శబ్దంగా ఉండడంతో అనుమానం వచ్చి లతీఫ్ ఇంటి తలుపుతాడు. వారిని లోపలికి పిలిచి జరిగినదంతా చెప్తాడు లతీఫ్. తమ వూరు హిందూస్తాన్ సైనికుల హస్తగతమైందాని నమ్మలేని నిజమేదో విన్నట్టు అడుగుగాడు షరీఫ్. లతీఫ్ అవునని చెప్పి, ఇప్పుడు హుందర్మో పాకిస్తాన్ గ్రామం కాదు. హిందూస్తాన్‍లో గ్రామం అని చెప్తాడు. మర్నాడు లతీఫ్‍తో కలిసి షరీఫ్ సరిహద్దు వద్దకి వెళ్ళి హుందర్మో వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. భారత సైనికులు వాళ్ళని హెచ్చరించి వెనక్కి పంపేస్తారు.
ఇక్కడ్ని నుంచి కథ ఊపందుకుంటుంది. ఎలాగైనా భారత్ చేరుకోవాలని డబ్బు కూడబెట్టడాని షరీఫ్ రకరకాల ప్రయత్నాలు, ఉద్యోగాలు చేస్తాడు.
ఉప కథగా – అప్పట్లో పఠాన్ చేతికి చిక్కిన షామ్లీ జీవితం గురించి చెప్తారు రచయిత. వీరి జీవితాలలో ఎదురైన ఘటనలు చదువరుల హృదయాలను బరువెక్కిస్తాయి.
మనసులను కలచివేసే సంఘటనల మధ్య చందనపు లేపనంలా మంచివాళ్ళ సాయం, మానవత్వం ఇంకా సజీవంగా ఉన్నదన్న ఆశని నిలుపుతుంది. ఎట్టకేలకు షరీఫ్ తన గ్రామాన్ని చేరుకుంటాడు, అప్పటిదాకా భర్త కోసం ఎదురుచూసిన హసీనా నిద్రలోనే కన్నుమూస్తుంది. భార్యాపిల్లలని చూసుకోవాలని ఎంతో ఆతృతతో వచ్చిన షరీఫ్‌ని భార్య మరణం క్రుంగదీస్తుంది. హసీనా కోసం కొన్న నెమలికంఠం రంగు షల్వార్ కమీజ్‌ని ఆమె శవంపై కప్పి, మెడ మీద లాల్ దుపట్టా ఉంచుతాడు షరీఫ్.
మనుషుల మధ్య వేదన, అభిమానాలు, ప్రేమలు, బంధుత్వాలు, స్నేహాలు, మోసాలు, కుట్రలు – మానవుల లక్షణాలని అత్యంత సహజంగా ప్రదర్శిస్తుందీ నవల.
రాజకీయపుటెత్తులకు సామాన్య ప్రజలు బలైపోయిన వైనం పాఠకులని కదిలిస్తుంది.
సరిహద్దులు నేలని విడగొడతాయేమో కాని హృదయాలని కాదనే సందేశం అందిస్తుందీ నవల.
ఒకసారి చదవడం మొదలుపెట్టాకా, ఆపకుండా, పుస్తకం పక్కకి పెట్టనీయకుండా చదివిస్తుంది. కళ్లని చెమరింపజేస్తుంది.
***
రెండు ఆకాశాల మధ్య (నవల)
రచన: సలీం
ప్రచురణ: అనుపమ ప్రచురణలు
పేజీలు: 251
వెల: ₹ 200
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా హైదరాబాద్. 90004 13413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు