Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-12

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap]గస్ట్ పధ్నాలుగు అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు ప్రకటించాడు నెహ్రూ. దేశం రెండు ముక్కలుగా విడిపోయింది. పంజాబ్ రెండుగా చీల్చబడింది. బెంగాల్ కూడా.. ముస్లింలు ఎక్కువగా ఉన్న పశ్చిమ పంజాబ్ నుంచి లక్షల మంది సిక్కులు, హిందువులు తూర్పు పంజాబ్‌కు పారిపోతున్నారు. సిక్కులు ఎక్కువగా ఉండే తూర్పు పంజాబ్ నుండి ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకుని పాకిస్తాన్‌కు వలస పోతున్నారు. ఈ లోపలే ముస్లింలు హిందువుల్ని, హిందువులు ముస్లింలని వూచకోత కోస్తున్నారు. రైళ్ళు శవాల్ని, క్షతగాత్రుల్ని మోసుకుని బార్డర్ దాటుతున్నాయి.

దాదాపు డెబ్బయ్ వేల మంది ఆడవాళ్ళనీ, బాలికల్నీ మానభంగం చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఒక మతం వాళ్ళు నివసిస్తున్న గ్రామాల్ని వేరే మతం వాళ్ళు చుట్టుముట్టి అగ్నికి ఆహుతి చేస్తున్నారు. కడుపుతో ఉన్న ఆడవాళ్ళ గర్భాల్ని చీల్చి పిండాల్ని నిప్పుల్లో వేస్తున్నారు.

చాలా చోట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు కూడా అత్యాచారాలు చేస్తున్నట్టు పేపర్లలో వార్తలొస్తున్నాయి.

ఆగస్ట్ నెలలోనే చరిత్రలో కనీవిని ఎరుగనంత దారుణమైన మారణకాండ ఇండియా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో చోటు చేసుకుంది. దాదాపు ఇరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోటీ యాభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు మనుషులు పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి పాకిస్తాన్‌కి వలస పోయారు. వాళ్ళలో ఎక్కువ మంది మూటాముల్లె సర్దుకుని కాలి నడకన ప్రయాణించిన వాళ్ళే. అలా తమ ఆస్తుల్ని, ఆశల్ని, జ్ఞాపకాల్ని వదిలేసి ప్రాణాల్ని కాపాడుకోడానికి పారిపోతున్న వొక శరణార్థుల బారు యాభై మైళ్ళ పొడవున ఉన్నట్టు పత్రికల్లో రాశారు. అలా వెళ్తున్న అసహాయుల, అభాగ్యుల మీద దారి కిరువైపులా ఉన్న పొలాల్లో దాక్కుని ఉన్న ముష్కరమూకలు విచ్చుకత్తుల్తో ఎన్నిసార్లు దాడులు చేశాయో.. ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో..

శంకర్‍కి భారతదేశం రెండుగా విడిపోవడం మీద ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అవి మత ప్రాతిపదికన విడిపోవడం గురించే అభ్యంతరమంతా. అతనికి మరో విషయం అర్థం కాలేదు. హిందూ ముస్లింల కోసం రెండు దేశాలు విడివిడిగా ఏర్పడినపుడు ఎవరిష్టమైన ప్రాంతానికి వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళి ఉండొచ్చుగా. ముస్లింలందరూ పాకిస్తాన్‌కి వెళ్ళిపోవాలనీ, హిందువన్నవాడు ఒక్కడు కూడా పాకిస్తాన్లో ఉండకూడదని నిర్బంధమేమీ లేదుగా. మహమ్మదాలీ జిన్నా కూడా పాకిస్తాన్‌కు ప్రధానమంత్రి హోదాలో అసెంబ్లీని ఉద్దేశించి చేసిన మొట్టమొదటి ప్రసంగంలో ‘మీరు ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వాళ్ళయినా పాకిస్తాన్లో పౌరులుగా ఉండొచ్చు’ అనికదా అన్నాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ రెండు మతాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైషమ్యం ప్రబలిపోయింది. మారణకాండ అవిచ్ఛిన్నంగా కొనసాగింది.

అక్టోబర్ ఇరవై ఆరున కాశ్మీర్ భారత దేశంలో విలీనమైందన్న వార్త కూడా అతన్లో ఆసక్తినో అనాసక్తినో కలిగించలేకపోయింది. తను పుట్టి పెరిగిన వూరు.. పంట పొలాలు.. కాలువలు, చెరువులు.. ఇరుగూ పొరుగు, బంధుమిత్రులు.. ఇవేవీ మారలేదుగా. తమ వూరు హరిసింగ్ పరిపాలనలో ఉందా లేక భారతదేశ అధికారం కిందికి వచ్చిందా లేక పాకిస్తాన్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిందా అనే దాన్నిబట్టి తమకు ఒనగూడే ప్రయోజనమో, లేకపోతే రాబోయే ప్రమాదమో ఏదో ఉందని ఆ వూరివాళ్ళెవరూ అనుకోలేదు.

అక్టోబర్ ఇరవై ఆరున కొంతమంది యువకులు త్రివర్ణపతాకాల్ని పట్టుకుని ‘ఇండియా జిందాబాద్’ అనుకుంటూ నినాదాలు చేస్తూ వూరేగింపుగా వెళ్ళారు. అంతే. మరే రకమైన మార్పూలేదు. బజారుకెళ్ళినపుడు నలుగురూ మాట్లాడుకునేదాన్ని బట్టి అతనికి తమ రాజు హరిసింగ్ జమ్మూ కాశ్మీర్‌ని భారతదేశంలో విలీనం చేయడం వెనుక ఏం మతలబు జరిగిందో అర్థమైంది.

రాజా హరిసింగ్ స్వతంత్ర ప్రతిపత్తిని ఆశించి ఇండియాలో జమ్మూ కాశ్మీర్‌ని విలీనం చేసే విషయంలో తాత్సారం చేశాడు. నలభై లక్షల జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో ముప్పావు వంతు ముస్లింలే. జమ్మూ లోనే హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. పంజాబ్‌లో జరుగుతున్న మారణకాండ జమ్మూకి కూడా పాకింది. అక్కడి మెజారిటీ హిందువులు ముస్లింలని వూచకోత కోయడం మొదలైంది.

పూంఛ్ జిల్లాలో రాజు గారి ముస్లిం సైనికులు, మరికొంత మంది గ్రామస్థులతో కలిసి తిరుగుబాటు చేశారు. దానికి పాకిస్తాన్ వెన్నుదన్నుగా నిల్చింది. ‘ఆజాద్ కాశ్మీర్’ అనే విముక్తి ఉద్యమం మొదలైంది అక్కడే. ముస్లింల హత్యాకాండ నిరాటంకంగా జరిగింది. హరిసింగ్ ప్రభుత్వం దీన్ని కట్టడి చేయడంలో విఫలమైంది. అక్టోబర్ ఇరవై రెండున పఠాన్ సైనికులు పూంఛ్‌ని ముట్టడించారు. హిందువుల గృహదహనాలు, ఆస్తుల లూటీలు జరిగాయి. స్త్రీలను చెరబట్టారు. మగవాళ్ళను ముసలివాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. రక్తం ఏరులై పారింది. శ్రీనగర్ పైన దాడి జరుగుతుందన్న భయంతో హరిసింగ్ జమ్మూకి పారిపోతూ ఇండియా ప్రభుత్వ సహాయాన్ని కోరాడు. ఇండియాలో జమ్మూ కాశ్మీర్‌ని విలీనం చేయడానికి ఒప్పుకుంటే సైనికసాయం అందిస్తామని గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కబురుపంపాడు. అక్టోబర్ ఇరవై ఆరున హరిసింగ్ తన అంగీకారాన్ని రాతపూర్వకంగా తెల్పడంతో ఇరవై ఏడున భారత సైన్యం శ్రీనగర్ చేరుకుని పఠాన్లను తరిమికొట్టింది.

శంకర్‌లో ఆసక్తితోపాటు ఆశలు రేకెత్తించే విషయం డిసెంబర్ ఆరో తేదీన జరిగింది. ఆ రోజు ఇండియా ప్రధానమంత్రి నెహ్రూకి, పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాకత్ అలీఖాన్‌కి మధ్య ఇంటర్ డొమినియన్ అగ్రిమెంట్ జరిగింది. దాని ఉద్దేశం ఇరుదేశాల్లో మగ్గుతున్న, బలవంతంగా ఎత్తుకెళ్ళబడిన స్త్రీలనీ, ఆడపిల్లల్ని గుర్తించి, వాళ్ళని వాళ్ళవాళ్ళ కుటుంబాలకు అప్పగించడం.. ఆ పని స్థానీయ పోలీస్ అధికార్లకు అప్పగించబడింది. నష్టపోయిన కుటుంబాల నుంచి తప్పిపోయిన లేదా బలవంతంగా ఎత్తుకెళ్ళబడిన ఆడవాళ్ళ వివరాలు సేకరించి దినపత్రికల్లో వాళ్ళ గురించి ప్రకటనలు వెలువడేలా చేసే బాధ్యత వాళ్ళది. వాళ్ళతో పాటు ఇరువైపులా సోషల్ వర్కర్లను రంగంలోకి దింపారు. వూరూరు తిరిగి అన్య మతానికి చెందిన ఆడవాళ్ళు ఏ యిళ్ళలో బందీలుగా ఉన్నారో కనుక్కుని పోలీసులకు తెలియచేయాల్సిన బాధ్యత వాళ్ళకు అప్పగించబడింది. జిల్లాల వారిగా లయజాన్ అధికార్లు ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళని పర్యవేక్షించడానికి చీప్ లయజాన్ ఆఫీసర్ కూడా నియమింపబడ్డాడు.

శంకర్ వెంటనే పోలీస్ అధికార్లని కల్సుకుని తన కూతురు షామ్లీకి సంబంధించిన సమాచారాన్ని అందచేశాడు. అప్పటినుండి ఎదురుచూపు.. తన కూతురు దొరుకుతుందా? అసలు తన కూతురు ఏ ముసల్మాన్ ఆధీనంలో ఉందో? అతను షామ్లీని అప్పగించడానికి ఒప్పుకుంటాడా? వాళ్ళు షామ్లీని ఎవ్వరికీ కన్పించకుండా దాచేస్తే ఎలా కనుక్కుంటారు? అసలు షామ్లీ బతికే  ఉందా? లాంటి ఎన్నెన్నో అనుమానాలు..

దర్శన్‌లాల్ ఆరోగ్యం కొద్దికొద్దిగా బాగుపడసాగింది. “మన షామ్లీ తప్పకుండా దొరుకుతుందిరా దర్శన్. మనిద్దరం వెళ్ళి షామ్లీని పిల్చుకొచ్చేద్దాం. మీ అక్క యింటికొచ్చాక ఎంచక్కా మీరిద్దరూ ఆడుకోవచ్చు” అనడం ఆలస్యం వాడి కళ్ళు వింత కాంతితో మెరవడం గమనించాడు.

తన కూతురు తిరిగిరావాలని షామ్లీ వాళ్ళమ్మ ఎన్ని వ్రతాలు పూజలు చేస్తుందో.. ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుంటుందో..

రోజూ ఉదయం లేవగానే ఈ రోజైనా పోలీసుల నుంచి తన కూతురు దొరికినట్టు కబురందుతుందన్న ఆశతో లేస్తాడు శంకర్. నిద్రపోయే ముందు వరకు ఏ కబురూ రాకపోతే నిరాశలో కుంగిపోతాడు. అలా ఎన్ని రోజులు జరిగాయో.. దాదాపు ఏడాది తర్వాత ఓ రోజు పోలీసుల నుంచి కబురందింది. లాహోర్‌కి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్డర్ వద్ద సైనికుల, పోలీసుల పర్యవేక్షణలో హిందూ ముస్లిం స్త్రీల మార్పిడి జరుగుతుందట.. పాకిస్తాన్ పౌరుల చేత అపహరణకు గురైన హిందూ స్త్రీలు, సిక్కుల చేత అపహరణకు గురైన ముస్లిం స్త్రీలు అక్కడికి చేర్చబడ్డారట. వాళ్ళని గుర్తించిన కుటుంబ సభ్యలకు వాళ్ళను అప్పగించడం జరుగుతుందట.

శంకర్ తన కొడుకు దర్శన్‌లాల్‌ని పిల్చుకుని పోలీసులు చెప్పిన సమయం కంటే గంట ముందే అక్కడికి చేరుకున్నాడు. చాలా కోలాహలంగా ఉంది. బార్డర్‌కి అటువైపు ముస్లింలు. ఇటువైపు హిందువులు, సిక్కులు గుంపులుగా నిలబడి ఉన్నారు. కొందరి చేతుల్లో తప్పిపోయిన అమ్మాయిల, ఆడవాళ్ళ పోటోలున్నాయి.. తమ పిల్లలు తప్పిపోతారని వూహించనందువల్లేమో చాలామంది దగ్గర వాళ్ళ ఫోటోలు లేవు.. ముఖ్యంగా బీదాబిక్కీ దగ్గర.. కానీ అందరి కళ్ళల్లో నీళ్ళున్నాయి.. అందరి గుండెల్లో తప్పిపోయిన లేదా అపహరించబడిన తమ ఆత్మీయులు దొరుకుతారన్న ఆశ ఉంది..

మరో అరగంటలో మార్పిడి మొదలవుతుందని ప్రకటించారు. శంకర్‌కి చాలా అసహనంగా ఉంది. సమయం చాలా నెమ్మదిగా కదుల్తున్నట్టు.. అటువైపు ముస్లిం సైనికుల పహారాలో వందమందికి పైగా అమ్మాయిలు, స్త్రీలు నిలబడి ఉన్నారు. అందులో తన కూతురు షామ్లీ ఉంటుందా? కళ్ళను విప్పార్చి చూశాడు. గుంపుకి ముందున్న ఆడవాళ్ళు కన్పిస్తున్నారు తప్ప వెనక ఎవరున్నారో తెలియడం లేదు. ఎందుకనో తప్పకుండా తన కూతురు షామ్లీ వాళ్ళలో ఉండి ఉంటుందనిపిస్తోంది.

ముస్లింల ఇళ్ళల్లో నరకాన్ని అనుభవించిన ఈ స్త్రీలని, అమ్మాయిల్ని ఎలా వెతికి పట్టుకుని ఉంటారో.. కుతూహలాన్ని ఆపుకోలేక దగ్గరగా నిలబడి ఉన్న ఓ పోలీస్‌ని అడిగాడు. అతను ఓ స్త్రీ వైపు చూపించి ‘ఆమెనడుగు. ఈ పనికోసం నడుం బిగించిన సోషల్ వర్కర్లందరూ ఆమె అజమాయిషీలోనే పని చేశారు’ అన్నాడు.

శంకర్ ఆమెను సమీపించి నమస్కారం పెట్టి తన కూతుర్ని ముస్లింలు ఎత్తుకెళ్ళిన విషయం చెప్పాడు. “పదమూడేళ్ళ అమ్మాయి అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు పదిహేనేళ్ళు వచ్చి ఉండాలి. పఠాన్ల యిళ్ళ నుంచి రక్షించి తెచ్చిన అమ్మాయిల్లో పదిహేనూ పదహారేళ్ళ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అందులో మీ కూతురు ఉండాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను” అంది.

“మీరు వాళ్ళని ఎలా వెతికి పట్టుకున్నారు?” అని అడిగాడు.

“మొదట పేపర్లలో ప్రకటనలిచ్చి స్వచ్ఛందంగానే తమ యిళ్ళలో బందీగా ఉన్న వేరే మతానికి చెందిన అమ్మాయిల్ని, ఆడవాళ్ళని అప్పగించమని అభ్యర్థించాం. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏ యింట్లో అలాంటివాళ్ళు ఉన్నారో కనుక్కోడానికి మా సోషల్ వర్కర్లు కొంతమంది గాజులమ్మే వాళ్ళుగా, కూరగాయ లమ్మేవాళ్ళుగా మారువేషాలు వేసుకుని యింటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఫలానా యింట్లో పరాయిమతానికి చెందిన అమ్మాయి ఉందని పక్కాగా తెల్సుకున్నాక పోలీసుల సాయంతో వాళ్ళని చెర విడిపించాం” అంది.

అతని మనసులో నలుగుతున్న అనుమానాన్ని ఎలా బైట పెట్టాలో తెలియక వెనకాముందూ అవుతుంటే ఆమె గమనించి “అక్కడున్న ఆడపిల్లలు, స్త్రీలు అందరూ రేప్‌కి గురైన వాళ్ళే. ఈ ఏడాదీ రెండేళ్ళ కాలంలో వాళ్ళతో సంసారం చేసినవాళ్ళు, పెళ్ళి చేసుకున్నవాళ్ళు, శారీరకంగా దోపిడీకి గురయినవాళ్ళు కూడా ఉన్నారు. మీ కూతురు ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఉన్నా ఆమెని పవిత్రంగా భావించి యింటికి పిల్చుకెళ్ళండి. మన ప్రధాని నెహ్రూ గారి ఆదేశం అదే” అంది.

(ఇంకా ఉంది)

Exit mobile version